కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Video link
'Love Challenge Episode 15' Telugu Web Series Written By
Mallavarapu Seetharam Kumar
రచన: మల్లవరపు సీతారాం కుమార్
గత ఎపిసోడ్ లో…
దినకరన్ కి ఫోన్ చేసి కొడుకు చెప్పమన్నట్లు చెబుతాడు గురుమూర్తి.
ఆయన చక్రధరం గారితో మాట్లాడి అంగీకరిస్తాడు.
కాలేజీలో మ్యాచ్ ప్రాక్టీస్ కోసం గ్రౌండ్ కి వెళతారు రిత్విక్, జీవన్, ఇంకా మిగతా టీం. అనూహ్యంగా అక్కడికి ఆద్య తో పాటు రాఘవేంద్ర గారు కూడా వస్తారు.
ఇక చదవండి…
రాఘవేంద్ర గారు కోరడంతో క్రికెట్ టీమ్ మెంబర్స్ అందరూ ఆయన చుట్టూ చేరారు.
ఆయన ఒకసారి చుట్టూ పరిశీలించి చూశాడు.
“మ్యాచ్ ప్రాక్టీస్ చూడడానికి కూడా ఇంతమంది రావడం ఒక ఎత్తయితే, ముందుగానే దీన్ని ఊహించి కుర్చీలు, షామియానాలు, వాటర్ బాటిల్స్ ఏర్పాటు చేసిన రిత్విక్ ముందుచూపు ను మనమంతా అభినందించాలి” అని ఆయన అనగానే అక్కడ ఉన్న వాళ్లంతా చప్పట్లు కొట్టారు.
ఆయన తన మాటలు కొనసాగిస్తూ “ఈ ఇంటర్ కాలేజ్ క్రికెట్ టోర్నమెంట్ గత పది సంవత్సరాల నుండి నేనే స్పాన్సర్ చేస్తున్నాను. మొదటిసారిగా మన కాలేజ్ టీం, రిత్విక్ సారథ్యంలో సెమీ ఫైనల్స్ కి చేరుకోవడం నాకు చాలా ఆనందం గా ఉంది. మనకు వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, మిగిలిన రెండు మ్యాచ్ లలో విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క ప్లేయర్ తన పూర్తి సామర్థ్యం ఉపయోగించి ఆడితే కప్ గెలుచుకోవడం అసాధ్యమేమీ కాదు. ముఖ్యంగా మీలో ఎవ్వరికీ ప్రతిభ తక్కువగా లేదు. మిమ్మల్ని ప్రోత్సహించడం కోసమే నేను స్వయంగా వచ్చాను” అంటూ అందరు ప్లేయర్స్ కీ, షేక్ హ్యాండ్ ఇచ్చాడు.
ప్రాక్టీస్ మ్యాచ్ కి సహకరించడానికి వచ్చిన శోభన్ కాలేజ్ స్టూడెంట్స్ ని కూడా అభినందించారు ఆయన.
రిత్విక్ ఆయనతో “ఈ రోజు సమయం తక్కువ ఉన్నందున కొంతసేపు ప్రాక్టీస్ చేస్తాము. రేపు, ఎల్లుండి మీరు పర్మిషన్ ఇస్తే రోజంతా ప్రాక్టీస్ చేస్తాము. అలాగైతేనే ఆ మర్నాడు జరగబోయే సెమీఫైనల్స్ ని సమర్థవంతంగా ఎదుర్కోగలం” అన్నాడు.
అంగీకారంగా తల ఊపాడు రాఘవేంద్ర. తర్వాత ఆయన తనకు కేటాయించిన సీట్లో కూర్చున్నాడు. ఆద్య మాత్రం స్టూడెంట్స్ ఉండే వైపుకి వచ్చి, శాన్వీ పక్కన కూర్చుంది.
రిత్విక్ ప్లేయర్స్ తో మాట్లాడుతూ "మన టీం లో ఆరుగురు బ్యాట్స్మెన్ ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక ఓవర్ బౌల్ చేస్తారు, శోభన్ టీం బౌలర్స్.
తరువాత మన బౌలర్స్ వాళ్లకు బౌలింగ్ చేస్తారు. ఈరోజు మనం చేసే ప్రాక్టీస్ ను నేను పర్సనల్ గా వీడియో తీస్తాను. దీన్ని నాకు తెలిసిన మాజీ రంజీ ప్లేయర్స్ కి చూపించి, వాళ్ల సలహాలు సూచనలు సేకరిస్తాము.
రేపు పూర్తి సమయం ఉంటుంది కాబట్టి, ఆ సలహాలను పాటిస్తూ, పూర్తిస్థాయి ఆట ఆడుదాం. ఎల్లుండి కూడా అలాగే ప్రాక్టీస్ చేస్తే సెమీస్ లో విజయం మనదే” అన్నాడు.
'ఒక్క ఓవరేనా! ఆలా కాక అవుటయ్యేవరకు ఆడిస్తే బాగుంటుంది కదా" అన్నాడు జీవన్ స్నేహితుడు సందీప్.
"అలా అయితే ఓపెనర్లు ఔట్ కాకపోతే, మిగతా వాళ్లకు ప్రాక్టీస్ ఉండదు. రిత్విక్ లాంటి ఓపెనర్ లు మ్యాచ్ చివరి వరకు ఆడటం చాలా సార్లు చూసావు కదా!" అన్నాడు ప్రీతమ్.
జీవన్ కల్పించుకుంటూ "సందీప్! నీకు, వివేక్ కు ఇదివరకే చెప్పాను. ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో కెప్టెన్ గా రిత్విక్ చూసుకుంటాడని. నువ్వు అనవసరంగా జోక్యం చేసుకోకు. నేను కెప్టెన్ గా ఉన్నప్పుడు ఎవరైనా ఇలా ఎదురు మాట్లాడితే మెడ పట్టి నెట్టేసే వాడిని. రిత్విక్ కాబట్టి నిదానంగా సమాధానం చెబుతున్నాడు" అన్నాడు.
దాంతో సందీప్ వెనక్కి వెళ్ళిపోయాడు.
ముందుగా రిత్విక్ బాటింగ్ కి వచ్చాడు.
అందరూ ఉత్కంఠతో చూస్తూ ఉన్నారు.
వేగంగా వచ్చిన మొదటి బంతిని మిడ్ వికెట్ దిశగా బలంగా కొట్టాడు.
అంతే!
ఆ బంతి సిక్స్ వెళ్ళింది.
తరువాతి బంతిని స్ట్రెయిట్ సిక్స్ కొట్టాడు రిత్విక్.
చూసేవాళ్ళలో సందడి మొదలైంది.
మూడవ బంతిని డీప్ మిడ్ వికెట్ వైపు సిక్స్ కొట్టడంతో చప్పట్లు కొట్టారు ప్రేక్షకులు.
నాలుగు, ఐదవ బంతుల్ని స్ట్రైట్ గా సిక్స్ లు కొట్టాడు.
దాంతో అందరూ పైకి లేచి 'రిత్విక్.. రిత్విక్..' అంటూ అరవడం మొదలు పెట్టారు.
ప్రీతమ్, సందీప్ వంక చూస్తూ 'చూసావా..' అన్నట్లు కళ్ళెగరేసాడు.
మొహం పక్కకు తిప్పుకున్నాడు సందీప్.
అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్న ఆరవ బంతిని లాంగ్ ఆఫ్ వైపు సిక్స్ కొట్టడం తో ఆ గ్రౌండ్ అంతా చప్పట్లతో మారు మ్రోగి పోయింది.
నెక్స్ట్ బ్యాటింగ్ కి జీవన్ ని రమ్మని, రిత్విక్ క్రీజ్ నుండి బయటకి వస్తూ వుంటే, స్టూడెంట్స్ అందరూ “రిత్విక్ ఆడాలి.. రిత్విక్ ఆడాలి.." అంటూ నినాదాలు చేశారు.
అమ్మాయిలతో సహా చాలా మంది అతని దగ్గరకు వచ్చి అభినందించారు.
అందరికీ థాంక్స్ చెప్పి, తిరిగి పంపేశాడు రిత్విక్.
“అందరికీ ప్రాక్టీస్ కావాలి. రేపు మరికొంత ఎక్కువ సేపు ఆడతాను" అంటూ జీవన్ కి బ్యాట్ అందించాడు రిత్విక్.
రిత్విక్ ని దాటే అవకాశం లేదు కాబట్టి తాను కూడా ఆరు సిక్స్ లు కొట్టి అతనితో సమానం కావాలి అనుకున్నాడు జీవన్.
కానీ అది అంత సులభం కాదని అతనికి తెలుసు.
ఆటగాడికి ఎప్పుడో ఒకసారి దొరికే సువర్ణావకాశం.
అది ఈరోజే రిత్విక్ కి దొరకడం తన దురదృష్టం.
అయినా తన శక్తినంతా ధారబోయాలి.
వీలైనంత బాగా ఆడాలి.
తనను తనే హిప్నటైజ్ చేసుకుంటూ మొదటి బాల్ కోసం ఎదురు చూస్తున్నాడు.
వేగంగా వచ్చిన బంతిని పైకి లేపి, స్క్వేర్ లెగ్ వైపు సిక్స్ కొట్టాడు.
రెండవ బంతిని హుక్ చేసి మిడ్ ఆన్ వైపు సిక్స్ బాదాడు.
తరువాత వచ్చిన షార్ట్ లెన్త్ బంతిని కాస్త ముందుకు వెళ్లి సిక్స్ లేపాడు.
కానీ నాలుగో బంతి దూరంగా వెళ్లడంతో అది వైడ్ అయింది.
ఒక్కసారిగా నిరాశ ఆవరించింది జీవన్ ని.
ప్రాక్టీస్ కాబట్టి ఇక రెండు బాల్స్ మాత్రమే వేస్తారు.
అందునా రిత్విక్ కెప్టెన్ కాబట్టి తన పరుగులు దాటనివ్వడు.
ఆ రెండూ సిక్స్ లు కొట్టినా రిత్విక్ స్కోర్ దాటలేడు.
మాములుగా అయితే ఇలాంటి సమయాల్లో బ్యాట్ విసిరి కొట్టి వచ్చేసేవాడు.
కానీ ఆ రోజు ఎందుకో శక్తీ కొద్దీ ఆడాలని ఉందతనికి.
మిగిలిన రెండూ బాల్స్ కూడా సిక్స్ కొట్టాడు.
సంతృప్తితో వచ్చేస్తూ వుంటే 'ఇది బ్యాటింగ్ ప్రాక్టీస్. కాబట్టి మరో బాల్ వెయ్యండి" అని బౌలర్ తో చెప్పాడు రిత్విక్.
ప్రాణం వచ్చినట్లయింది జీవన్ కి.
స్కోర్ సమం చెయ్యడానికి వచ్చిన అవకాశం వదులుకోకూడదని నిర్ణయించుకున్నాడు.
తరువాతి బాల్ కూడా దూరంగా వెడుతోంది.
కానీ జీవన్ పక్కకు వాలి ఒక చేత్తో బ్యాట్ పట్టుకొని, బంతిని పైకి లేపాడు.
ఆ బంతి, బౌండరీ లైన్ దగ్గర క్యాచ్ పట్టడానికి ప్రయత్నించిన ఫీల్డర్ చేతికి అందకుండా, సిక్సర్ అయింది.
ఈ బాల్ కూడా వైడ్ కాబట్టి మరో బాల్ వెయ్యాలా అన్నట్లు రిత్విక్ వైపు చూసాడు బౌలర్, జీవన్ తో పాటు.
రిత్విక్ అవునన్నట్లు తల ఊపడంతో జీవన్ మొహం వెలిగిపోయింది.
చివరి బంతి వెయ్యడానికి సిద్ధమయ్యాడు బౌలర్.
అందరూ నరాలు తెగే కుతూహలంతో ఉన్నారు.
'చూసావా మా వాడి ప్రతిభ' అన్నట్లు చూసాడు సందీప్.
'ఆ ఎక్స్ట్రా బాల్స్ మా వాడు ఇచ్చిన బిక్ష' అన్నట్లు చూసాడు ప్రీతమ్.
ఆఖరి బంతి కాస్త దిగువగా రావడంతో ఒక మోకాలు కింద ఆనించి, ఆ బాల్ ని బలంగా కొట్టాడు జీవన్.
అతను కొట్టిన విసురుకు ఆ బాల్ బౌండరీ లైన్ దాటి దూరంగా కూర్చొని ఉన్న రాఘవేంద్ర గారి చేతిలో పడింది.
అందరూ జీవన్ ని అభినందిస్తూ చప్పట్లు కొట్టారు.
రాఘవేంద్ర గారు గ్రౌండ్ లోకి వచ్చి జీవన్ ను కౌగలించుకున్నాడు.
తరువాత రిత్విక్ ని దగ్గరకు పిలిచి "నేషనల్ టీం కి కెప్టెన్ కావడానికి తగిన లక్షణాలు నీకు ఉన్నాయి. జీవన్ లో ఆత్మ విశ్వాసాన్ని నింపి, అతనిలోని ప్రతిభని నలుగురికీ తెలిసేలా చేసావు" అని అభినందించాడు.
స్టూడెంట్స్ అందరూ రిత్విక్, జీవన్ లను చుట్టుముట్టి, అభినందనలతో ముంచెత్తారు.
దీప్య, శాన్వీలతో అక్కడికి వచ్చిన ఆద్య రిత్విక్ తో, “కొద్దిసేపు చేసిన ఈ ప్రాక్టీస్ లోనే, మీరు మంచి ప్లేయర్ మాత్రమే కాదు.. సరైన కెప్టెన్ అని కూడా రుజువు చేసుకున్నారు" అని అభినందించింది.
థాంక్స్ చెబుతున్నట్లుగా అభివాదం చేసాడు రిత్విక్.
తరువాత ఆద్య జీవన్ తో "మీలో ఇంత టాలెంట్ ఉందని మీక్కూడా తెలీదనుకుంటాను. మీరు ఎవ్వరికీ తీసిపోరు.ఇంకా చెప్పాలంటే మీ టాలెంట్ పూర్తిగా ఉపయోగిస్తే అందరినీ మించిపోతారు" అంది అతన్ని మనస్ఫూర్తిగా ప్రశంసిస్తూ.
ఆనందం తో ఉబ్బి తబ్బిబ్బయి పోయాడు జీవన్.
ఆద్య తనను ప్రశంసించిన ఈ క్షణం జీవితంలో మరచిపోలేని సందర్భంగా అనిపించిందతనికి.
థాంక్స్ చెప్పడం కూడా మరిచి ఆద్య వంకే చూస్తున్నాడు.
రిత్విక్ అతని భుజం మీద సున్నితంగా తట్టడంతో తేరుకున్నాడు జీవన్.
ఆద్యతో "ఇంతమంది ఇలా అభినందిస్తూ వుంటే నాకు నోట మాట రావడం లేదు. ముఖ్యంగా మీరు నన్ను అభినందించడం నాకు చెప్పలేని ఆనందాన్ని కలిగిస్తోంది" అన్నాడు.
రిత్విక్ , తన దగ్గరికి వచ్చిన స్టూడెంట్స్ తో "మిగతా ప్లేయర్స్ కి కూడా మీ ప్రోత్సాహం కావాలి. దయచేసి ఎవ్వరూ అప్పుడే వెళ్ళకండి" అన్నాడు.
తరువాత జీవన్ తో, "నువ్వు చాలా అలసటతో ఉన్నావు. ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకో" అన్నాడు.
అందరి దగ్గరా సెలవు తీసుకొని ఇంటికి బయలుదేరాడు జీవన్.
ఇంటికి వెళ్ళగానే నేరుగా తల్లి వద్దకు వెళ్ళాడు.
"జీవన్! నువ్వు చెప్పినట్లే గుడికి వెళ్లి కొబ్బరికాయ కొట్టాను" అంది అతని తల్లి ధనలక్ష్మి.
ఆమె ఇచ్చిన కొబ్బరి ముక్క తిని, మేడ పైన తన గదికి వెళ్ళాడు.
టేబుల్ మీదే ఉన్న విస్కీ బాటిల్ ఓపెన్ చేయబోయి, బాగా అలసటగా ఉండటంతో వద్దనుకున్నాడు.
తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి, ఏసీ ఆన్ చేసుకొని బెడ్ పైన వాలి పోయాడు.
అతని మనసంతా గాల్లో తేలిపోతోంది.
ఈ రోజు తను కాలేజీలో హీరో అయిపోయినట్లు అనిపిస్తోంది.
ముఖ్యంగా ఆద్య తన దగ్గరకు వచ్చి అభినందించడం ఇంకా అతని కళ్ళ ముందు కదలాడుతోంది.
ఆద్య కోసమే తను అంత బాగా ఆడాడు.
అంతా ఆద్య మహిమే.
ఆద్య ఆలోచనలు తన మనసును ఆనందంతో నింపుతున్నాయి.
ఆమె కోసం తాను ఏమైనా చెయ్యగలడనిపిస్తోంది.
అలాగే ఆమె దూరమైతే తన బ్రతుక్కి అర్థం కూడా లేదనిపిస్తోంది.
కానీ తను నిన్న కూడా ఆమె ఆలోచనలతోనే ఉన్నాడు.
ఎందుకో నిన్నటి మానసిక స్థితి వేరుగా వుంది.
కారణమేమిటో..
నిన్న తన మనసంతా ఆందోళనతో ఉంది.
ముఖ్యంగా పబ్ సంఘటన..
ఒకవేళ చందూ, ఆ అమ్మాయి దీప్యని రూమ్ కి తీసుకొని వెళ్లి ఫోటోలు తీసి వుంటే..
దీప్య బ్లాక్ మెయిలింగ్ కి భయపడకుండా జరిగిన విషయం ఆద్యతో చెప్పి వుంటే..
అప్పుడు ఆద్య తననెలా చూసి ఉండేదో..
ఆమె తన వంక అసహ్యంగా చూసి వుంటే…
ఆ ఊహే భరించ లేనిదిగా అనిపించింది.
ఆద్యకు ఇష్టం లేని పని చేయకూడదు అనుకున్నాడు.
ఇంతలో గది తలుపు ఎవరో తట్టుతుండటంతో, విధిలేక లేచి, విసుగ్గా తలుపు తెరిచాడు.
ఎదురుగా వంట మనిషి సుందరం ఉన్నాడు.
"బాగా అలిసిపోయి ఉన్నాను. కొంపలంటుకు పోయే విషయమైనా సరే.. నేను నిద్ర లేచాకే" అన్నాడు, తిరిగి తలుపు వెయ్యబోతూ.
"అలాగే కానీ ఒక్క మాట వినండయ్యా. తమరు ఫోన్ ఆఫ్ చేసుకొని ఉన్నారట. మొన్న వచ్చిన అయన .. పూర్ణేష్ బాబు నాన్నగారికి ఫోన్ చేసి ముఖ్యమైన విషయం మీతో మాట్లాడాలన్నారు.
చాలా ముఖ్యమట. నాన్నగారు మిమ్మల్ని ఫోన్ ఆన్ చేసి అతనితో మాట్లాడమన్నారు. మీరు ఫోన్ ఆన్ చేశాకే, నన్ను కిందికి రమ్మన్నారు" అన్నాడు సుందరం.
అప్పటివరకు ఉన్న ఆనందమంతా ఆవిరై పోయింది జీవన్ కి.
ఫోన్ తీసి, మ్యాచ్ ఫిక్సింగ్ అవసరం లేదని పూర్ణేష్ కి చెబుదామా అనిపించింది ఓ క్షణం.
సుందరం వెయిట్ చేస్తూ ఉండటంతో ఫోన్ ఆన్ చెయ్యక తప్పలేదు జీవన్ కి.
ఇంకా ఉంది...
లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 16 త్వరలో…
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.
కొత్త బంగారు లోకం ఎక్కడుంది? (కవిత)
రచయిత పరిచయం:
నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము ( అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).
Comments