కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Video link
'Love Challenge Episode 16' Telugu Web Series Written By
Mallavarapu Seetharam Kumar
రచన: మల్లవరపు సీతారాం కుమార్
గత ఎపిసోడ్ లో…
ప్రాక్టీస్ మ్యాచ్ లో అద్భుతంగా రాణిస్తాడు జీవన్.
రాఘవేంద్ర, ఆద్యలు రిత్విక్, జీవన్ లను అభినందిస్తారు.
తన ఆటతీరు లో, ప్రవర్తనలో మార్పుకు కారణం ఆద్య అని గ్రహిస్తాడు జీవన్.
అంతలో అతనికి పూర్ణేష్ నుండి కాల్ వస్తుంది.
ఇక చదవండి…
“పూర్ణేష్! నాకు చాలా అలసటగా ఉంది. నిన్నటి డ్రింక్ తాలూకు హ్యాంగోవర్, రాత్రి సరిగ్గా నిద్ర లేకపోవడం, ఈరోజు క్రికెట్ ప్రాక్టీస్.. వీటన్నిటితో తల దిమ్ముగా ఉంది. అందుకే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పడుకున్నాను. నువ్వు మరోలా అనుకోకపోతే గంటా రెండు గంటలు ఆగి కాల్ చెయ్యి. సరేనా?” అన్నాడు జీవన్.
“జీవన్! నువ్వు చెప్పినట్లే సెమీస్ లో ఆడబోయే టీంలో ముగ్గురు నాకు రెస్పాండ్ అయ్యారు. మనకు సహకరిస్తారట. కానీ నా మాటలు, నేను చెప్పిన ఆఫర్ వాళ్ళు నమ్మడం లేదు. నీతో కాల్ చేయిస్తాం అన్నా ఒప్పుకోలేదు. సో ఒక స్టార్ హోటల్ లో మీట్ ఏర్పాటు చేశాను. నువ్వు ఒకసారి వాళ్లను స్వయంగా కలిసి నేను మీ మనిషినే అని వాళ్లకు ఒక్క సారి చెప్పి వచ్చేస్తే చాలు. తరువాత కథంతా నేను నడిపిస్తాను. రేపు ఉదయం 10 గంటలకు కలుసుకునే ఏర్పాటు చేశాను” అని చెప్పాడు పూర్ణేష్.
"మ్యాచ్ ఫిక్సింగ్ విషయంలో నా ఆలోచన మారింది. ప్రస్తుతానికైతే ఒద్దనుకుంటున్నాను. ఏ విషయమూ, నీకు రేపు రాత్రికి కన్ఫర్మ్ చేస్తాను" అన్నాడు జీవన్.
"అదేమిటి? హఠాత్తుగా మీ ఆలోచన ఎందుకు మారింది?" అర్థం కాక అడిగాడు పూర్ణేష్.
“నిన్న నేను కష్టపడి ఆడిన తీరు, నాకెంతో సంతోషాన్ని కలిగించింది. జీవితంలో అంత ఆనందం నేను ఎప్పుడూ పొందలేదు. కష్టపడి సాధించే విజయం లో ఇంత ఆనందం ఉంటుందని నాకు మొదటిసారిగా తెలిసింది. దీని ముందు వేరే రకంగా పొందే సంతోషాలు, గడ్డిపోచతో సమానమని అనిపిస్తోంది. అయినా నాకు రేపు రాత్రి వరకు టైం ఇవ్వు. ఒకవేళ డీల్ వద్దనుకున్నా వాళ్లకు ఎంతో కొంత ముట్ట చెబుదాం.
అలాగే నీకు కూడా, నువ్వు పడ్డ శ్రమకు తగిన గుర్తింపు ఇస్తాను” చెప్పాడు జీవన్.
“మనం తేనె తుట్టెను కదిలించాం జీవన్. ఇప్పుడు తేనెతో వచ్చినా, ఊరికే తిరిగి వచ్చినా తేనెటీగలు వెంబడించక మానవు” అన్నాడు పూర్ణేష్.
కోపం వచ్చింది జీవన్ కి.
“ఇదేం పెద్ద ఇంటర్నేషనల్ డీల్ అనుకుంటున్నావా? ఒక ప్రయత్నం చెయ్యాలని అనుకున్నాను. కానీ మనసు మార్చుకుని వద్దని చెబుతున్నాను” కాస్త కటువుగానే అన్నాడు జీవన్.
“నేను దొరికిపోయింది కూడా ఇలాంటి విషయం లోనే జీవన్! ఆరోజు నలుగురితో ఒప్పందం మాట్లాడుకున్నాను. కానీ ఒక మనిషి చెప్పిన మొత్తం ఎక్కువ కావడంతో వద్దనుకొని, మిగతా ముగ్గురితో ఫైనలైజ్ చేసుకున్నాను. ఆ నాలుగో వ్యక్తి ఈ మొత్తం వ్యవహారాన్ని లీక్ చేశాడు.
ఇప్పుడు కూడా అదే పరిస్థితి వస్తుంది. వాళ్ళతో డీల్ చేసుకోకపోతే వాళ్లకు మనతో అవసరం ఉండదు కాబట్టి, నేను వాళ్లను అప్రోచ్ అయిన విషయం బయట పెట్టేస్తారు. నేను వాళ్ళను ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించాననీ, వాళ్ళు నిజాయితీ తో అందుకు అంగీకరించలేదనీ మీడియాతో చెప్పుకుంటారు.
అయినా సరే, డీల్ వద్దని ఖచ్చితంగా నువ్వు అనుకుంటే రేపు ఉదయం నువ్వే వాళ్లతో స్వయంగా ఈ విషయం చెప్పి, ఎంతో కొంత అందజెయ్యి. నీతో వ్యవహారం కాబట్టి వాళ్లు జాగ్రత్తగానే ఉంటారు. మారు మాట్లాడకుండా ఇచ్చింది తీసుకొని వెళ్తారు” అన్నాడు పూర్ణేష్.
“కానీ రేపు ఉదయం నాకు ప్రాక్టీస్ మ్యాచ్ ఉంది. మీటింగ్ ఏదో రేపు సాయంత్రానికి ఏర్పాటు చేయి” అన్నాడు జీవన్.
“ వాళ్లకు కుదరదని చెప్పారు జీవన్. ఎందుకంటే రేపు మధ్యాహ్నం వాళ్ళ టీం అందరూ సమావేశమై జరగబోయే మ్యాచ్ విషయమై ప్లాన్ చేసుకోవాలట. ఇక అప్పట్నుంచి వాళ్ళందరూ ఒకే చోట ఉంటారు కాబట్టి రేపు ఉదయం నువ్వు వాళ్ళతో మాట్లాడి, ఆ తర్వాత అలాగే మీ మ్యాచ్ ప్రాక్టీస్ కి వెళ్ళు. కాస్త ఆలస్యంగా వస్తానని మీ వాళ్లకు చెప్పు” అన్నాడు పూర్ణేష్.
“నీతో ఈ డీల్ గురించి చెప్పినప్పుడు నా పేరు ఎక్కడా బయటికి రాదు అని చెప్పావు. ఇప్పుడు నేను వాళ్లని హోటల్లో కలవడం ఏమిటి? నేను త్వరలో పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాను. అందుకోసం పబ్ కి వెళ్లడం కూడా మానుకున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో అనవసరపు వివాదాల్లో ఇరుక్కోవడం నాకు ఇష్టం లేదు. పైగా ఇప్పుడు నీకు సమాధానం చెప్పే పరిస్థితిలో లేను. నన్ను ఊరికే విసిగించ వద్దు. రేపు ఉదయం నీకు కాల్ చేసి ఏ విషయం చెబుతాను. బై పూర్ణేష్” అంటూ ఫోన్ కట్ చేసాడు.
మళ్లీ సెల్ స్విచ్ ఆఫ్ చేసి, మంచం మీద వాలిపోయాడు.
అలా పడుకున్న జీవన్ ఉదయం తొమ్మిది గంటల లేచాడు. లేచిన వెంటనే టైం చూసుకుని తన సెల్ ఆన్ చేశాడు. పూర్ణేష్ నుండి నాలుగు మిస్డ్ కాల్స్, రిత్విక్ నుంచి ఒక మిస్డ్ కాల్ ఉన్నాయి.
వెంటనే రిత్విక్ కి కాల్ చేశాడు జీవన్.
“ఏం లేదు. ఈరోజు తొమ్మిదింటికి ప్రాక్టీస్ స్టార్ట్ చేద్దాం అని చెప్పడానికి కాల్ చేశాను. ఇప్పుడే తొమ్మిది అయింది. మేమందరం గ్రౌండ్ కి చేరుకున్నాము. నువ్వు కూడా వీలైనంత త్వరగా వచ్చెయ్” అన్నాడు.
“రిత్విక్! నాకు అనుకోకుండా ఒక ముఖ్యమైన పని తగిలింది. మా నాన్న ఒకరిని కలవమన్నారు. నేను ఒక గంట ఆలస్యంగా వస్తాను. అంతవరకు నువ్వు ఎలాగూ ఆడుతూ క్రీజ్ లో ఉంటావు కదా!” అన్నాడు జీవన్ నవ్వుతూ.
“లేదు జీవన్! అందరికీ ప్రాక్టీస్ కావాలి కాబట్టి, బ్యాట్స్ మన్ కి యాభై పరుగుల లక్ష్యం పరిమితిగా పెట్టుకున్నాం. అయినా ముఖ్యమైన పని అన్నావు కాబట్టి అది అయ్యాకే వచ్చి, మాతో జాయిన్ అవ్వు” అన్నాడు రిత్విక్.
“థాంక్యూ రిత్విక్! తప్పకుండా పదకొండు గంటల లోగా అక్కడ ఉంటాను” అని చెప్పి ఫోన్ పెట్టేశాడు జీవన్.
వెంటనే పూర్ణేష్ కి కాల్ చేసి, పది గంటలకల్లా నువ్వు చెప్పిన స్టార్ హోటల్ లో ఉంటాను. వాళ్లని అక్కడ రెడీగా ఉండమను. డీల్ చేసుకోవాలా వద్దా అని తేల్చుకోవడానికి రేపు సాయంత్రం వరకు టైం అడుగుతాను. డీల్ కుదరకపోయినా వాళ్ళకి చెప్పిన అమౌంట్ లో కొంత చెల్లిస్తాను. ఫర్దర్ డీలింగ్స్ అన్నీ నీతో చేసుకోమని వాళ్లకు క్లియర్ చేస్తాను” అన్నాడు జీవన్.
“ఆ హోటల్లో ఒక ఆస్ట్రాలజర్ పేరు తో ఒక రూమ్ బుక్ చేశాను. ఆయనతో మాట్లాడటానికి వచ్చినట్లుగా వాళ్ళు అక్కడికి వస్తారు. నువ్వు కూడా రిజిస్టర్ లో అలాగే ఎంటర్ చేసి వచ్చెయ్” అని చెప్పాడు పూర్ణేష్.
అర గంటలో రెడీ అయి కిందికి వచ్చాడు జీవన్.
“టిఫిన్ చేసి వెళ్ళొచ్చుగా! రాత్రి కూడా భోజనం చేసినట్టు లేదు” అంది అతని తల్లి ధనలక్ష్మి.
“నిన్న ఎవరో ప్రముఖులు వస్తారని చెప్పావు కదా! వచ్చారా?” అడిగాడు గురుమూర్తి.
“ఎవరో కాదు నాన్నా! మా కాలేజ్ ఎండి రాఘవేంద్ర గారు, ఆయన భార్య నిత్య మేడం గారితో కలిసి వచ్చారు” చెప్పాడు జీవన్.
“అలాగా! ఆ నిత్య అనే ఆమె రాఘవేంద్ర గారి దగ్గర పీఏ గా పనిచేసేదట. ఆయన, మొదటి భార్యకు విడాకులు ఇచ్చేసి, ఈమెని పెళ్లి చేసుకున్నాడట. ఆద్య మొదటి భార్య కూతురట” అన్నాడు గురుమూర్తి.
“ఏదో పెళ్లి సంబంధం చేసేవారి లాగా ఇన్ని వివరాలు కనుక్కున్నారు.. ఎందుకండీ?” అంది ధనలక్ష్మి.
“అన్నట్టు చెప్పడం మరిచాను. నిత్య అనే ఆమెది మన కులమేనట” అన్నాడు గురుమూర్తి.
“మరి ఇంకేం! ఆమెకు తెలిసిన అమ్మాయిలు ఎవరైనా ఉన్నారేమో కనుక్కోండి. జీవన్ కి ఇచ్చి పెళ్లి చేసేద్దాం” అంది ధనలక్ష్మి.
ఆమెకు రాఘవేంద్ర గారి మొదటి భార్య కూతురు ఆద్య అంటే అసలు పడదట. లేకుంటే మన వాడికి ఆ అమ్మాయిని అడిగి ఉండేవాణ్ణి” అన్నాడు గురుమూర్తి.
“తొందరపడి ఏదో ఒకటి మాట్లాడి విషయం చెడగొట్టకండి. సమయం వచ్చినప్పుడు నేనే చెబుతాను” అన్నాడు జీవన్.
తర్వాత పూర్ణేష్ కి కాల్ చేసి, “నేను మరో పది నిమిషాల్లో ఆ హోటల్ దగ్గర ఉంటాను” అని చెప్పి కార్ స్టార్ట్ చేసుకొని బయలుదేరాడు. దారిలో తండ్రి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. కాస్త వెతికితే నిత్య మేడం గారికి, తమకు కామన్ గా ఉండే రిలేటివ్స్ దొరుకుతారు. వాళ్ల ద్వారా మ్యారేజ్ కోసం అప్రోచ్ కావచ్చు. మొత్తానికి తనకి అందని ద్రాక్ష అనుకున్న ఆద్య దగ్గరవుతోంది.
ఇలా ఆలోచిస్తూ డ్రైవ్ చేస్తూ ఉండగా అతనికి శాన్వీ నుండి కాల్ వచ్చింది.
“హాయ్ శాన్వీ.. నేను ఒక గంట ఆలస్యంగా వస్తాను. ఈ విషయం రిత్విక్ కి చెప్పాను కూడా” అన్నాడు జీవన్.
“తెలుసు జీవన్. నేను ఇప్పుడు కాలేజ్ గ్రౌండ్ లోనే ఉన్నాను. ఈరోజు ఆద్య తో పాటు వాళ్ళ మదర్ నిత్య మేడం వచ్చారు. ఆద్య నీతో ఏదో మాట్లాడాలట. నన్ను నీకు కాల్ చేసి ఆ మాట చెప్పమంది” అంది శాన్వీ.
కారును వెంటనే రోడ్ పక్కన ఆపి “అలాగే. ఫోన్ తనకు ఇవ్వు” అన్నాడు జీవన్ ఎగ్జైట్ అవుతూ.
ఫోన్ తీసుకున్న ఆద్య, “హాయ్ జీవన్ గారూ! ఏమిటి ఇంకా కాలేజ్ కి రాలేదు?” అని అడిగింది.
ఆమె గొంతు వినగానే మైమరిచిపోయాడు జీవన్.
“ఇదిగో.. వచ్చేస్తున్నాను” అన్నాడు.
“ఏం లేదు. మా అమ్మగారు.. అదే.. నిత్యా మేడమ్ గారు నిన్న మీ ప్రాక్టీస్ మ్యాచ్ చూశారు కదా. అయితే నాన్నగారు పక్కన ఉన్నందు వల్లనో లేక మరే కారణం చేతనో మిమ్మల్ని అభినందించ లేదు. ఈరోజు అందుకోసమే వచ్చారు. రిత్విక్ తో ఆల్రెడీ మాట్లాడారు. మీతో కూడా మాట్లాడి, కాసేపు ఉండి వెళ్లి పోతారట. మీరు లేటుగా వస్తారని శాన్వీ చెప్పింది. పరవాలేదు. అంతవరకు వెయిట్ చేయమని చెబుతాను” అంది ఆద్య.
“అయ్యో! అవసరం లేదండీ. అదేమంత ముఖ్యమైన పని కాదు. ఒకవేళ ముఖ్యమైన పని అయినా, దాన్ని పక్కన పెట్టి వచ్చేస్తాను. సరిగ్గా ఐదు నిమిషాల్లో మన గ్రౌండ్ లో ఉంటాను” అని చెప్పి, కార్ ని కాలేజ్ వైపు తిప్పాడు.
దార్లోనే పూర్ణేష్ కి కాల్ చేసి, “సారీ పూర్ణేష్! ప్రాక్టీస్ కి ఖచ్చితంగా రావాలట. అందుకని హోటల్ కి రాలేను. ఇక్కడ ప్రాక్టీస్ త్వరగా పూర్తయితే మధ్యాహ్నం లంచ్ టైం లో కలుస్తాను. లేదా ఈవినింగ్ కలుస్తాను. వాళ్లను ఏమీ అనుకోవద్దు అని చెప్పు” అని చెప్పి, సమాధానం కోసం ఎదురు చూడకుండా ఫోన్ కట్ చేశాడు.
వెంట వెంటనే మరో రెండు మార్లు కాల్ చేశాడు పూర్ణేష్.
జీవన్ లిఫ్ట్ చేయకపోవడంతో ‘ఒక్కసారి కలవండి ప్లీజ్’ అని మెసేజ్ చేశాడు.
‘సారీ’ అని రిప్లై ఇచ్చి ఫోన్ పక్కన పడేసాడు జీవన్.
ఆద్యతో చెప్పినట్లుగానే సరిగ్గా ఐదు నిమిషాల్లో తమ కాలేజ్ క్రికెట్ గ్రౌండ్ కి చేరుకున్నాడు.
ప్రాక్టీస్ ఇంకా స్టార్ట్ కాలేదు. అందరూ దగ్గర దగ్గరగా నిలుచొని మాట్లాడుకుంటూ ఉన్నారు.
జీవన్ వాళ్ళ దగ్గరకు వెళ్ళాడు.
"అదేమిటి? వేరే కార్ లో వచ్చారు?" అడిగింది ఆద్య.
ఉలిక్కి పడ్డాడు జీవన్.
హోటల్ కి ప్లేయర్స్ ని కలవడానికి వెళ్తుండటంతో, రెగ్యులర్ గా వెళ్లే కార్ కాకుండా మరో కారు తీసాడు. ఈ కార్ రిజిస్ట్రేషన్ వేరే వాళ్ళ పేరుతో ఉంది.
ఆద్య తనను గమనిస్తోందన్న ఊహతో ఖుషీగా ఫీల్ అయ్యాడు జీవన్..
"ఆ కారు సర్వీస్ కి ఇచ్చాను" తేరుకున్నాక సమాధానమిచ్చాడు.
తరువాత అందరినీ విష్ చేసి, నిత్య మేడం వద్దకు వెళ్లి నమస్కారం పెట్టాడు.
"హలో అల్లుడుగారూ.. " జీవన్ ని చూడగానే అంది నిత్య మేడం.
ఇంకా ఉంది...
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.
కొత్త బంగారు లోకం ఎక్కడుంది? (కవిత)
రచయిత పరిచయం:
నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము ( అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).
Comments