top of page
Writer's pictureSeetharam Kumar Mallavarapu

లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 19

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.






Video link

'Love Challenge Episode 19' Telugu Web Series


Written By Mallavarapu Seetharam Kumar


రచన: మల్లవరపు సీతారాం కుమార్




గత ఎపిసోడ్ లో…

ఇద్దరిలో ఒకరిని ఎంచుకోమని ఆద్యను నిర్బంధించడం సరి కాదని చెబుతాడు రిత్విక్.

ఆద్య నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెబుతాడు జీవన్.

లవ్ ఛాలెంజ్ కోసం ఆద్య ఇంట్లో సమావేశమవుతారు రిత్విక్, జీవన్ లు.

ఇక చదవండి…

గురుమూర్తి నిత్యా మేడమ్ తో మాట్లాడుతూ "చెల్లెమ్మా! ఎలాగైనా రిత్విక్, జీవన్ లు ఛాలెంజ్ చేసుకునేలా చూడు. ఈ ఛాలెంజ్ సిటీ అంతా పాపులర్ అయ్యేలా నేను చూస్తాను. ఇక ఈ పోటీలో మా జీవన్ గెలవడానికి మీ సహకారం ఎలాగూ ఉంటుంది" అన్నాడు.

నిత్యా మేడమ్ మాట్లాడుతూ "తప్పకుండా అన్నయ్య గారూ!" అంది.

"మరొక విషయం చెల్లెమ్మా! జీవన్ లో ఈ మధ్య కాస్త మార్పు వస్తోంది. అది నాకు సంతోషమే. కానీ ఈ చాలెంజ్ లో గెలవాలంటే మనం కొన్ని తెర వెనుక ప్రయత్నాలు చెయ్యాలి. జీవన్ అలాంటివి ఒప్పుకోడేమో..

కాబట్టి మనం మాట్లాడుకున్న విషయం అతనికి తెలియనివ్వకండి" అన్నాడు.

కొంత సేపు ఆలోచించింది నిత్యా మేడమ్.

'జీవన్ ను పెళ్లి చేసుకొని ఆద్య కష్టాలు పడాలని తను కోరుకుంటోంది. కానీ అతను మారి మంచివాడైతే తనకు ఏమిటి లాభం?' అని మనసులో అనుకుంది.

పైకి మాత్రం "అలాగే అన్నయ్య గారూ!" అంది.

బయట హాల్లో ఆమె కోసం ఎదురు చూస్తున్న వాళ్లు ఎవరి ఆలోచనల్లో వాళ్లు ఉన్నారు.

తండ్రి నుంచి వచ్చిన మెసేజ్ ని మరోసారి చూసుకున్నాడు రిత్విక్.

'ప్రొసీడ్ ఫర్ ఛాలెంజ్. విష్ యు ఆల్ సక్సెస్' అని ఆ మెసేజ్ లో ఉంది. కాలేజీ లో జరిగిన విషయాలు తండ్రికి తెలియజేశాడు రిత్విక్. తండ్రి ఆశీర్వచనం తీసుకున్న ఏ విషయంలోనూ తనకు ఓటమి కలగలేదు. తండ్రి కొద్దిరోజులు ఆగమని కానీ, తరువాత మాట్లాడుకుందాం అని కానీ అనివుంటే ఏం చేయాలో.. అనే డైలమాలో పడేవాడు రిత్విక్. కానీ తండ్రి ప్రోత్సాహం లభించడంతో ఎప్పుడెప్పుడు ఈ చాలెంజ్ ప్రక్రియ ప్రారంభం అవుతుందా అని ఎదురు చూస్తున్నాడు.

జీవన్ ఇందాక ఇంటికి వెళ్ళినప్పుడు తండ్రి తో స్వయంగా మాట్లాడాడు.

"నాన్నా! ఈ రోజు కాలేజీ లో నిత్యా మేడమ్ నన్ను 'అల్లుడుగారూ' అని పిలిచింది. దాంతో ఆద్య బాధపడింది. నాకు అప్పుడు కలిగిన ఆవేశంలో ‘ఆద్య బాధపడితే నేను చూడలేను. ఎందుకంటే నేను ఆమెను ప్రేమిస్తున్నానని నలుగురిలో చెప్పేశాను. ఆమె ప్రేమ కోసం రిత్విక్ తో చాలెంజ్ చేశాను.


దాని గురించి మాట్లాడుకోవడానికి ఇప్పుడు వెళ్తున్నాను. నేను ఈ పోటీని న్యాయంగా ఆడి గెలవాలి అనుకుంటున్నాను. నిత్యా మేడమ్ బంధువు అని మీకు తెలిసింది కాబట్టి ఆమె సహాయంతో ఈ పోటీలో నన్ను గెలిపించే ప్రయత్నం చెయ్యవద్దు. నిన్ను తప్పుపడుతున్నానని అనుకోవద్దు. కానీ ఇన్నాళ్లు ప్రతి విషయాన్ని నేను చూసే కోణం, నీకు తగ్గట్టుగా ఉంది. కానీ ఆద్య పరిచయం అయ్యాక నా ఆలోచనా ధోరణి మారింది.


కొత్త దారిలోకి ఇప్పుడే ఎంటర్ అయినట్టు అనిపిస్తోంది. ఆ దారిలో ప్రయాణించడమే కరెక్టని నేను అనుకోవడమే, ఆద్య విషయంగా రిత్విక్ తో లవ్ ఛాలెంజ్ చేయడానికి కారణమైంది. ఈ చాలెంజ్ గెలవడానికి నేను చేసే ప్రయత్నంలో ఆద్య గురించి ఎక్కువ గా ఆలోచించడం, ఆమెతో కలిసి తిరగడం.. ఇలాంటివి జరుగుతాయి. చాలెంజ్ లో ఓడినా గెలిచినా ఈ ప్రయాణం నన్ను బాగు చేస్తుంది' అని చెప్పాడు.

తండ్రి తనతో మాట్లాడుతూ 'అలాగే! నీకోసం నేను ఎలాంటి కుట్రలు చెయ్యను’ అన్నాడు.


కానీ తనకు మాత్రం తండ్రి మాటల మీద నమ్మకం లేదు. ఎందుకంటే రాజకీయాల్లో వున్న తన తండ్రికి బంధుత్వాలను, కులాన్ని తన అవసరాల కోసం వాడుకోవడం తప్పుగా అనిపించదు. కాబట్టి తను ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పోటీలో ఏ విధమైన పొరపాటు తనవల్ల జరగకుండా చూసుకోవాలి..


ఇలా ఆలోచిస్తున్నాడు జీవన్.

తండ్రి పంపిన మెసేజ్ చూసుకుంది ఆద్య.

గంట క్రితమే ఢిల్లీ చేరాను. నన్ను కూడా పాలిటిక్స్ లోకి రమ్మంటున్నారు. తప్పదేమో..

సామ్రాజ్యం మేడం ఫోన్ చేసి విషయాలు చెప్పారు.

లవ్ ఛాలెంజ్ విషయంలో పూర్తి నిర్ణయం నీదే.


ఒక వేళ ఒప్పుకుంటే మాత్రం మన కాలేజ్ పరువు ప్రతిష్టలు, నీ ఆత్మ గౌరవం.. దెబ్బ తినని విధంగా షరతులు పెట్టు.

చిన్న వయసులోనే పెద్ద పరీక్ష వచ్చింది.

నువ్వు ఫేస్ చెయ్యగలవని నాకు తెలుసు.


మీ పిన్నికి ఆ గురుమూర్తితో దూరపు బంధుత్వం ఉన్న విషయం తెలిసింది.

ఛాలెంజ్ విషయంలో ఆమె పక్షపాతం చూపిస్తుందేమో.. కాస్త గమనించు.

ఆల్ ది బెస్ట్'

ఇదీ ఆ మెసేజ్ సారాంశం.

వివాదం మొదలవడానికి అసలు కారణం తన పిన్ని నిత్యా మేడం.

ఆటగాళ్లను అభినందించాలనుకుంటే, నిన్న తండ్రితో పాటే అభినందించి ఉండొచ్చు కదా.

ఈ రోజు రావడానికి కారణం ఏమిటి?

తనకు తెలిసి ఆమె ఎవరితోనూ తొందరగా వరసలు కలపదు.

అలాంటిది ఆమె జీవన్ ను తొలి పరిచయం లోనే 'అల్లుడు గారూ' అనడం, ఆద్యను ఆమె ఏదో మందలించిందని జీవన్ ఆమెతో గొడవ పడటం, రిత్విక్ ను ఛాలెంజ్ లోకి లాగడం.. వీటన్నిటి వెనుకా ఏదైనా ప్లాన్ ఉందా?

కానీ జీవన్ మాటల్లో నిజాయితీ కనిపిస్తోంది.

ఒక వేళ అతనికి తెలియకుండా ఏదైనా ప్లాన్ చేస్తున్నారా..

ఏమైనా తాను ఆచితూచి అడుగులు వెయ్యాలి.

ఇంట్లో ఎవరైనా గెస్ట్ లు ఉన్నప్పుడు, ఎవరు కాల్ చేసినా కట్ చేస్తుంది తన పిన్ని నిత్యా మేడం. అలాంటిది ఈ రోజు ఇందరిని వెయిట్ చేయిస్తూ లోపలికి వెళ్లి మాట్లాడ్డం ఏమిటి?

‘ఆమెను నమ్మకూడదు’ అని అనుకుంది ఆద్య.

ఫోన్ మాట్లాడడం ముగించి హాల్ లోకి వచ్చింది నిత్యా మేడమ్.

రాగానే "ఎవరో బంధువులకు హార్ట్ ప్రాబ్లం వచ్చింది. ఏ హాస్పిటల్లో చేర్చాలనే విషయం గా మాట్లాడి వస్తున్నాను. సారీ" అంది తన ఆలస్యానికి కారణం వివరిస్తూ.

"ఎవరు పిన్నీ వాళ్ళు?" అని అడిగింది ఆద్య.

"నీకు తెలీదులే! నా పుట్టింటి తరపు బంధువులు. ఇక మనం మాటలు ప్రారంభిద్దాం. అలాగే అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. రాత్రికి అందరూ ఇక్కడే డిన్నర్ చేసుకొని వెళ్ళాలి. అందుకు ఒప్పుకుంటేనే చర్చలు ప్రారంభిద్దాం" అంది నవ్వుతూ.

అందరూ అంగీకారంగా తలలూపారు.

వెంటనే తమ చెఫ్ ని పిలిచిందామె. అందరికీ చక్కగా వంట రెడీ చెయ్యి" అంది.

అలాగేనంటూ లోపలి వెళ్ళాడు వంట మనిషి సుందరం.

తరువాత నిత్యా మేడమ్ మాట్లాడుతూ "ఈ ఛాలెంజ్ వల్ల మొదటి లాభం- కాలేజీలో ఏ అబ్బాయి ఇక ఆద్య జోలికి రాడు. పోటీకి ఆద్య ఒప్పుకోకపోతే ప్రస్తుతానికి వీళ్ళిద్దరూ సైలెంట్ అయిపోయినా కొన్ని రోజుల తర్వాత తమ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ఆ ప్రయత్నాల్లో ఒకరి మీద ఒకరికి ద్వేషం పెరగవచ్చు. మొత్తం కాలేజ్ స్టూడెంట్స్ రెండుగా చీలి పోవచ్చు. ఈ ఛాలెంజ్ వల్ల ఆ బాధ తప్పింది.


ఇక రెండవ లాభం- ఈ రోజు కాక పోయినా ఎప్పటికైనా ఆద్యకు మంచి సంబంధం కోసం వెదకాలి. చూసిన సంబంధంలో ఏ చిన్న లోపం ఉన్నా, సవతి తల్లి సరిగ్గా శ్రద్ధ పెట్టలేదని నలుగురూ అంటారు. ఆ శ్రమ ఇప్పుడు మాకు తప్పి పోతుంది.


ఇద్దరిలో ఎవరైనా నాకు గానీ, ఆయనకు గానీ సమ్మతమే. కాబట్టి నేను అందరి ముందు ఆద్యను ఈ లవ్ ఛాలెంజ్ కి ఒప్పుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాను" అంది.

రిత్విక్, జీవన్ లు ఇద్దరూ వెంటనే ఏదో చెప్పబోతుండగా ఆద్య కల్పించుకొని "నేను ఒక నిర్ణయానికి వచ్చేశాను. ఈ లవ్ ఛాలెంజ్ కి నేను అంగీకరిస్తున్నాను. ఇక ఛాలెంజ్ కి సంబంధించిన అగ్రిమెంట్ ఎలా చేసుకోవాలో ప్లాన్ చేద్దాం" అంది.

చందు మాట్లాడుతూ “ఫ్రెండ్స్ అందరం కూర్చుని చాలెంజ్ ఎలా ఉండాలో ఒక మోడల్ రూపొందించాము. ఈ చాలెంజ్ ప్రకారం రేపటి నుండి ఒక నెలలోగా ఇద్దరిలో ఎవరు ఆద్య చేత ‘ఐ లవ్ యు’ అని చెప్పించుకుంటారో వాళ్ళు గెలిచినట్లు ప్రకటించడమే కాకుండా లవర్ బాయ్ ఆఫ్ ది సిటీ అనే బిరుదు కూడా ఇద్దాం. ఓడిపోయిన వాళ్లు అర గుండు తో మన కాలేజ్ క్యాంపస్ చుట్టూ మూడు రౌండ్లు వేయాలి. చాలామంది స్టూడెంట్స్ ఈ ప్రపోజల్ బాగుందని మాకు చెప్పారు. మీ ముగ్గురి అభిప్రాయం ఏమిటో చెప్పండి" అన్నాడు.

రిత్విక్ మాట్లాడుతూ "నేను గెలిచినా జీవన్ ని అలా అవమానించాలని కోరుకోవడం లేదు. కాబట్టి అరగుండు కాన్సెప్ట్ తీసేస్తే బాగుంటుంది" అన్నాడు.

జీవన్ మాట్లాడుతూ "నా అభిప్రాయం కూడా అదే! రిత్విక్ ని అలాంటి అవమానకర పరిస్థితుల్లోకి నెట్టడం నాకు ఇష్టం లేదు" అన్నాడు, గెలుపు తనదేనని సూచిస్తూ.

శాన్వీ కల్పించుకుంటూ "ఈ చాలెంజ్ ని ఇలాగే ఉంచుదాం. కాకపోతే అరగుండు కాన్సెప్ట్ ని రద్దు చేసే అధికారం ఆద్యకు ఇద్దాం. ఎందుకంటే చాలెంజ్ లో ఓడిపోయిన వ్యక్తి హుందాగా ప్రవర్తిస్తాడని, ప్రవర్తించాలని మనం అనుకుంటున్నాం. ఒకవేళ ఓడిన వాళ్ళ ప్రవర్తన భిన్నంగా ఉంటే ఆద్య ఈ అర గుండు నిబంధన గుర్తు చేసి, వాళ్ల ను కంట్రోల్ చేయవచ్చు" అంది.


ఈ సూచన అందరికీ నచ్చింది.


నిత్యా మేడమ్ మాట్లాడుతూ "ఇది నిజమే అనిపిస్తోంది. ఒకవేళ ఓడిన వాళ్ళు రోషంతో గొడవకు దిగితే గుండు విషయం గుర్తు చేసి వాళ్లను కంట్రోల్ చేయవచ్చు. కానీ రిత్విక్, జీవన్ లలో ఎవరూ అలా తప్పుగా బిహేవ్ చేయరు" అంది.

ఆద్య మాట్లాడుతూ "సరే! ప్రస్తుతానికి ఆ నిబంధన అలాగే ఉండనివ్వండి. ఇక నేను స్పష్టం చేయాలనుకుంటున్న విషయాలు వినండి. నేను అందరిలాంటి సాధారణమైన అమ్మాయిని. ‘నేనొక గొప్ప వ్యక్తిని, వీళ్ళిద్దరూ నా వెంట పడుతున్నారు..’ అని నేను అనుకోవడం లేదు. ఇష్టపడ్డ అమ్మాయి తో ఎలా ప్రవర్తించాలో వీళ్ళిద్దరికీ తెలుసు అనే నేను అనుకుంటున్నాను. కాబట్టి ఆ విషయంలో నేను ఎలాంటి రూల్స్ పెట్టడం లేదు.


ఈ ఛాలెంజ్ కి నేను ఒప్పుకోవడానికి కారణం నా కారణంగా కాలేజ్ లో స్టూడెంట్స్ గ్రూపులుగా విడిపోకూడదని. కానీ ఛాలెంజ్ లో ఎవరైనా శృతి మించి ప్రవర్తించినా, తగాదాలకు దిగినా అంతటితో ఈ ఛాలెంజ్ ముగిసినట్లే. అప్పుడు నేను మామూలు అమ్మాయిని కాదు. నన్ను వేధిస్తున్న వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలో తెలిసిన డైనమిక్ అమ్మాయిని" అంది.

రిత్విక్ మాట్లాడుతూ "గొడవలు మా ఇద్దరూ ఎవరికి వాళ్ళం మా సన్నిహితులతో గ్రూప్ కట్టి ప్లాన్ వేయడం వల్ల జరగవచ్చు. అలా కాక మనం ముగ్గురమే ఒక గ్రూప్ గా ఉందాం. కలిసి ట్రావెల్ చేద్దాం. అప్పుడే నీకు మా గురించి క్లారిటీ వస్తుంది. మాక్కూడా ఒకరితో ఒకరికి సాన్నిహిత్యం ఏర్పడుతుంది" అన్నాడు.


జీవన్ మాట్లాడుతూ "మేము నిన్ను ఇంప్రెస్ చేయాలంటే నువ్వు మాకు అందుబాటులో ఉండాలి. ఉన్న సమయం నెల రోజులే కాబట్టి నువ్వు ప్రతిరోజు మా కోసం కొంత సమయం కేటాయించాలి" అన్నాడు.


ఆద్య మాట్లాడుతూ "తప్పకుండా అలాగే చేద్దాము. మన ముగ్గురం ఒక బ్యాచ్ గా ఉందాం. ఒకరి అభిప్రాయాలు మరొకరితో షేర్ చేసుకుందాం. ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి. ఈనెల ముగిశాక నేను ఇద్దరిలో ఒకరికి ఖచ్చితంగా ఐ లవ్ యు చెప్పాలనే నిబంధన నాకు లేదు. నేను ఎవరి పట్లా ఆకర్షితురాలిని కాకపోవచ్చు. ఈ విషయం గుర్తుంచుకోండి" అంది.

ఒప్పుకున్నారు రిత్విక్ జీవన్ లు. క్షణాల్లో అగ్రిమెంట్ పేపర్లు రెడీ అయ్యాయి. ముగ్గురూ అందులో సైన్ చేశారు. నిత్యా మేడం తో సహా మిగిలిన వాళ్ళందరూ సాక్షులుగా సంతకాలు పెట్టారు. ఒరిజినల్ కాపీని ఆద్య దగ్గర ఉంచి, మిగిలిన వాళ్లు అందరూ తలా ఒక కాపీ పెట్టుకున్నారు.

ఆద్య అందరినీ ఉద్దేశించి మాట్లాడుతూ "ఈ అగ్రిమెంట్ చట్టప్రకారం చెల్లదు. కానీ ఇది మన మధ్య మనం చేసుకున్న అగ్రిమెంట్. దీన్ని అతిక్రమించిన వాళ్లు మిగతా అందరి దృష్టిలో తమ విలువను కోల్పోతారు" అంది.

అగ్రిమెంట్ తాలూకు పనులు ముగిశాక అందరూ ఆద్య వాళ్ళ ఇంట్లో డిన్నర్ కి కూర్చున్నారు. ఆ సమయంలో జీవన్ ఫోన్ రెండు సార్లు మోగింది. అతను లిఫ్ట్ చేయలేదు. మరికొంతసేపటికి భోజనం చేస్తూ ఉన్న చందూ, తన కుర్చీ లోంచి లేచి జీవన్ దగ్గరకు వచ్చి చెవిలో ఏదో చిన్నగా చెప్పి ఫోన్ అతనికి అందించాడు. ఫోన్ మాట్లాడుతున్న జీవన్ మొహంలో రంగులు మారాయి.

"వాళ్లకు ఇష్టం వచ్చింది చేసుకోమను" అని చెప్పి ఫోన్ పెట్టేసాడు.

రిత్విక్ జీవన్ తో "తొందర పడొద్దు జీవన్" అన్నాడు.

ఇంకా ఉంది...

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.



రచయిత పరిచయం:

నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము ( అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).



51 views0 comments

Comments


bottom of page