కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Video link
'Love Challenge Episode 20' Telugu Web Series
Written By Mallavarapu Seetharam Kumar
రచన: మల్లవరపు సీతారాం కుమార్
గత ఎపిసోడ్ లో…
గురుమూర్తితో ఫోన్ లో మాట్లాడుతుంది నిత్యా మేడం.
ఆద్య ఇంట్లో లవ్ ఛాలెంజ్ కి సంబంధించిన అగ్రిమెంట్ చేసుకుంటారు రిత్విక్, జీవన్, ఆద్యలు.
క్రికెట్ ప్లేయర్స్ మ్యాచ్ ఫిక్సింగ్ విషయమై ఒత్తిడి తెస్తున్నారని చెబుతాడు పూర్నేష్.
ఇక చదవండి…
జీవన్ ఇబ్బందిగా ముఖం పెట్టి "నీకు తెలీదు రిత్విక్. వాడు నాకు చాలా చికాకు తెపిస్తున్నాడు" అన్నాడు.
రిత్విక్ మాట్లాడుతూ "నాకు తెలుసు జీవన్! పూర్నేష్ క్రికెట్ ప్లేయర్స్ ని కలుసుకున్న ఆ హోటల్, మా నాన్నగారికి బాగా తెలిసిన వాళ్ళది. ఆ హోటల్ మేనేజర్ పూర్నేష్ ని గమనిస్తూ ఉన్నాడు. వాళ్లు అక్కడ చాలా సేపు ఎవరి కోసమో ఎదురు చూడ్డం నాకు తెలిపాడు. నువ్వు రాకపోవడంతో మన కాలేజీ లో తనకు తెలిసిన వాళ్ళను పూర్నేష్ ఎంక్వయిరీ చేసాడు. ‘జీవన్ ఎందుకు మారిపోయాడు?’ అని అడిగాడట.
దాన్ని బట్టి మ్యాచ్ ఫిక్సింగ్ కి నువ్వు ఒప్పుకోలేదని నాకు అర్థం అయింది. వాళ్లు ఇప్పుడు నీ గురించి మీడియాతో చెబుతామని బెదిరిస్తూ ఉండవచ్చు. ఒకవేళ టీవీలో నిజంగా అలాంటి వార్తలే వస్తే, తర్వాత మనం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈ టోర్నమెంట్ లో గెలిచినా మనం అనుకున్నంత మంచి పేరు మన కాలేజీకి రాదు” అన్నాడు.
క్షణాల్లో విషయం అర్థం చేసుకున్న ఆద్య, "ఈ విషయంలోనే జీవన్ లో మార్పు వచ్చిన విషయం మనకు అర్థం అవుతోంది. అందుకు అతన్ని అభినందిద్దాం. ఇక జీవన్ మ్యాచ్ ఫిక్సింగ్ కోసం ప్రయత్నించినప్పుడు చెప్పకుండా, వద్దని చెప్పాకే ఈ విషయాన్ని రిత్విక్ బయట పెట్టాడు. థాంక్ యూ రిత్విక్! మనం ముగ్గురం ఒక టీం గా ఇప్పుడే ఏర్పడ్డాం. మన మొదటి టాస్క్ ఇదే. టివికి ఎక్కకుండా వాళ్ళని ఆపాలి" అంది.
రిత్విక్ తో కాస్సేపు ఈ విషయం మాట్లాడిన జీవన్, పూర్నేష్ కి కాల్ చేశాడు.
"రేపు ఉదయం పది గంటలకు మీట్ ఏర్పాటు చెయ్యి. అదే హోటల్ లో.." అన్నాడు.
పూర్నేష్ సంతోషపడిపోయి, "నాకు తెలుసు జీవన్. నువ్వెప్పుడూ మారవని. ఆ ప్లేయర్స్ అనవసరంగా తొందర పడ్డారు.
మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.
విషయం బయట పడ్డా రుజువులు దొరక కూడదు.
ఆ ఆస్ట్రాలజర్ మరో రెండు రోజులు ఆ హోటల్ లో ఉంటాడు. ఆయన దగ్గర రేపటికి అపాయింట్ మెంట్ తీసుకో.
ఆ మెసేజ్ భద్రపరుచుకో.
ఆ ప్లేయర్స్ కూడా అలాగే చేస్తారు" అన్నాడు.
"థాంక్ యూ పూర్నేష్. రేపు ఉదయం పది గంటలకు కలుద్దాం" అని చెప్పి ఫోన్ పెట్టేసాడు జీవన్.
"రిత్విక్ అండ్ జీవన్! మన కాలేజ్ ఇమేజ్, ఈ వ్యవహారం మీద ఆధార పడి ఉంది. ఇద్దరూ కలిసి ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చెయ్యండి. అవసరమైతే నేను కూడా హోటల్ కి వస్తాను" అంది ఆద్య.
"వద్దు ఆద్యా! నువ్వు గానీ ,రిత్విక్ గానీ వస్తే వాళ్ళు అలర్ట్ అవుతారు.
నేను ఒక్కడినే వెడతాను. రిత్విక్ ఆల్రెడీ ప్లాన్ ఇచ్చాడు" అన్నాడు జీవన్.
ఆద్యకి , నిత్యా మేడం కి సెలవు చెప్పి అందరూ వాళ్ళ వాళ్ళ ఇళ్లకు బయలుదేరారు.
***
పక్కరోజు తొమ్మిది గంటలకే ఇంటినుండి బయలుదేరాడు జీవన్.
ముందు రోజు లాగే వేరే పేరుతో ఉన్న కార్ తీసాడు.
రిత్విక్ చెప్పిన చోట కార్ ఆపి కాసేపు వెయిట్ చేసాడు.
కొంత సేపటికి రిత్విక్ అక్కడికి వచ్చాడు.
ఒక చిన్న డాలర్ లా ఉన్న సిసి కెమెరాను జీవన్ మెడలో ఉన్న చైన్ కి తగిలించాడు.
"ఎసిపి ప్రతాప్ గారిని అడిగి తెచ్చాను. డైమండ్ పొదిగిన డాలర్ లా ఉంటుంది. ఎవరికీ అనుమానం రాదు. రెండు గంటలు ఆగకుండా పని చేస్తుంది. వాయిస్ కూడా రికార్డ్ చేస్తుంది. వాళ్ళు చెయ్యబోయేదేమిటో వాళ్ళ తోనే చెప్పించు.
తరువాత వాళ్ళకా రికార్డింగ్ చూపించి దారిలో పెట్టు. నేను ప్రాక్టీస్ కి వెడుతున్నాను.
సెమీస్ రేపే కదా! నువ్వు మధ్యాహ్నం పైన అయినా వీలు చూసుకొని రా" అన్నాడు రిత్విక్.
రిత్విక్ కి బై చెప్పి సరిగ్గా పది గంటలకు హోటల్ కి చేరుకున్నాడు జీవన్. రిసెప్షన్ దగ్గరకు వెళ్లి ఆస్ట్రాలజర్ ఉండే గది నెంబర్ కనుక్కున్నాడు.
అతను ఆ గదిలోకి వెళ్ళేటప్పటికి పూర్నేష్, ముగ్గురు ప్లేయర్స్ అక్కడ సిద్ధంగా ఉన్నారు. ఆస్ట్రాలజర్ ఎవరూ అక్కడ లేరు. వాళ్లు ముగ్గురూ లేచి జీవన్ కి విష్ చేశారు.
లీగ్ మ్యాచ్లో వాళ్లతో ఆడి ఉండటంవల్ల జీవన్ వాళ్ళను గుర్తుపట్టాడు.
వాళ్లకు ఎదురుగా సోఫాలో కూర్చున్నాడు. పూర్నేష్ వాళ్ళ ముగ్గురినీ జీవన్ కి పరిచయం చేశాడు.
"అందరం ఒక్కసారి బయటకు వెడితే బాగుండదు కాబట్టి నేను బయలుదేరుతాను. మీరు మాట్లాడుకుంటూ ఉండండి" అని జీవన్ తో చెప్పాడు పూర్నేష్.
అక్కడ ఏదైనా గొడవ జరిగినా జీవన్ వాళ్లను అటాక్ చేసినా తను సాక్ష్యంగా ఉండకూడదన్నది అతని అభిప్రాయం.
అది గ్రహించిన జీవన్ అతన్ని వెళ్ళవచ్చన్నట్లుగా సైగ చేశాడు.
తరువాత ఆ ముగ్గురు ప్లేయర్స్ వంక చూస్తూ "ముందుగా మీలో ఒక్కొక్కరూ ఏ రకంగా మీ టీం నీ మోసం చేయగలరో చెప్పండి" అన్నాడు.
మొదటి ప్లేయర్ మాట్లాడుతూ "నేను బౌలర్ ని. లీగ్ మ్యాచ్లో మిమ్మల్ని అవుట్ చేశాను. మా కెప్టెన్ కి ఆ విషయం గుర్తు చేసి మీకు బౌలింగ్ చేసే అవకాశం ఇమ్మంటాను. మీరు బౌండరీలు, సిక్సర్లు కొట్టడానికి వీలుగా బౌల్ చేస్తాను. మా టీం లో సీనియర్ ప్లేయర్ని కాబట్టి ఒక ఓవర్లో ఎక్కువ పరుగులు ఇచ్చినంత మాత్రాన వేరే వాళ్లకు బౌలింగ్ ఇవ్వరు. కాబట్టి నేను మీకు మరో ఓవర్ కూడా వేయగలను. నేను వేసే రెండు ఓవర్లలో మీరు వీలైనన్ని ఎక్కువ పరుగులు కొట్టవచ్చు" అన్నాడు.
"దీని కోసం ఎంత డిమాండ్ చేస్తున్నావు?" అని అడిగాడు జీవన్.
చెప్పాడతను.
తర్వాత నా రెండో ప్లేయర్ వంక చూస్తూ "నువ్వు ఏం చేయగలవు చెప్పు?" అన్నాడు.
అతను "నేను వికెట్-కీపర్ ని. మీరు స్టంప్ అవుట్ కాకుండా చూసుకుంటాను. నా చేతికి క్యాచ్ వస్తే మిస్ చేస్తాను" అని చెప్పాడు.
తనకు కావలసిన మొత్తాన్ని కూడా చెప్పాడు.
తర్వాత జీవన్ మూడవ ప్లేయర్ వంక చూస్తూ "మీరు ఆ టీం వైస్ కెప్టెన్ కదా?" అని ఆశ్చర్యంగా అడిగాడు.
అతను "అవును. మొత్తం మ్యాచ్ మీకు అనుకూలంగా ఉండేలా చూస్తాను" అన్నాడు. తనకు మిగతా వాళ్ళ కంటే కాస్త ఎక్కువ మొత్తం కావాలని చెప్పాడతను.
"మీ టీం కి కూడా ఈరోజు ప్రాక్టీస్ మ్యాచ్ ఉందట కదా" అన్నాడు జీవన్.
"అవును. మేము ముగ్గురం ఫిజియోథెరఫీ చేయించుకొని వస్తామని మిగతా వాళ్లకు చెప్పాము" అన్నాడు వాళ్ళ జట్టు వైస్ కెప్టెన్.
తన మెడలో ఉన్న స్పై కెమెరా స్విచ్ ఆఫ్ చేశాడు జీవన్.
తరువాత వాళ్లతో "మిమ్మల్ని బురదలోకి లాగాలని చూశాను. కానీ మనసు మార్చుకుని వదిలేశాను. అందుకు మీరు సంతోషపడాలి కానీ నన్నిలా బెదిరించాలని అనుకోవడం ఏమిటి? ఇప్పుడు మీరు చెప్పినదంతా వీడియో గా రికార్డ్ చేశాను. కాబట్టి ఇప్పుడు నేనే దీన్ని మీడియాకు ఇవ్వబోతున్నాను. న్యూస్ ఛానల్స్ వాళ్లకు ఇప్పుడే ఫోన్ చేస్తున్నాను" అంటూ తన ఫోన్ తీశాడు జీవన్.
వాళ్ళు ముగ్గురూ భయపడి పోయారు.
వాళ్లలో బౌలర్ గొంతు పెగల్చుకుని "ఇలాంటి పనులు చేయడం మాక్కూడా ఇష్టం లేదు. ఇదివరకు ఎప్పుడూ మేము ఇలా చేయలేదు. కానీ ఆ పూర్నేష్ మాకు చాలా ఆశ చూపించాడు. మీరు అభిప్రాయం మార్చుకున్నారని పూర్నేష్ చెప్పాక మేం రిలీఫ్ గా ఫీలయ్యాము. కానీ అతనే మమ్మల్ని రెచ్చగొట్టాడు. మేం బెదిరిస్తున్నట్లు గా మీతో చెబుతానని, వీలైనంత డబ్బు రాబట్టు కొందామని చెప్పాడు" అని చెప్పాడు.
ఆ టీం వైస్ కెప్టెన్ మాట్లాడుతూ "ప్లీజ్.. జీవన్ గారూ! మీరు కంప్లైంట్ చేస్తే మా లైఫ్ పాడైపోతుంది. దయచేసి వదిలేయండి" అన్నాడు.
జీవన్ మాట్లాడుతూ "మీరు కూడా నాలాగే స్టూడెంట్స్. మీ లైఫ్ స్పాయిల్ చేయడం నాకు ఇష్టం లేదు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి. పూర్నేష్ అడ్డదారుల్లో ఎంతో సంపాదించాడు. ఆ సంపాదించిందంతా ఖర్చు పెట్టినా ఇప్పుడు కేసు నుండి బయట పడే పరిస్థితిలో లేడు. తప్పుదారి ఎప్పటికీ మంచిది కాదు.
అది తెలుసుకునే నేను నా అభిప్రాయం మార్చుకున్నాను. మీరు కూడా మారినట్లు కనిపిస్తున్నారు కాబట్టి నేను మీ మీద కంప్లైంట్ చెయ్యను. వేరే విధంగా కూడా కోపం పెట్టుకోను. ఇక నేను మా టీం ప్రాక్టీస్ మ్యాచ్ కి వెళ్తున్నాను. పూర్నేష్ విషయం సరైన సమయంలో తేలుస్తాను" అన్నాడు.
వాళ్ళు ముగ్గురూ జీవన్ కు కృతజ్ఞతలు చెప్పారు. బయటకు వెళ్లబోతున్న జీవన్ తిరిగి వెనక్కు వచ్చాడు.
"ఇప్పుడు నేను రికార్డ్ చేసిన వీడియో నా దగ్గర ఉంటే రేపు మీరు భయం భయం గానే ఆడుతారు. ముఖ్యంగా నా విషయంలో చూసీచూడనట్లు ఉంటారు. అది నాకు ఇష్టం లేదు" అంటూ తను రికార్డ్ చేసిన వీడియో వాళ్ళ ముందే డిలీట్ చేశాడు.
“ఏదేమైనా పూర్నేష్ మీకు ఆశ చూపించాడు కాబట్టి రేపటి మ్యాచ్ ముగిశాక మీ టీమ్ అందరికీ మంచి ట్రీట్ ఏర్పాటు చేస్తాను. మీ ముగ్గురికీ మంచి గిఫ్ట్ కూడా ఇస్తాను. అయితే రేపు మీరు, మీ టీం కోసం కష్టపడి ఆడితేనే ఇస్తాను" అని చెప్పి అక్కడి నుండి వచ్చేసాడు జీవన్.
బయటకు రాగానే రిత్విక్ కి కాల్ చేశాడు జీవన్.
"పని సక్సెస్ ఫుల్ గా ముగిసింది. నేను గ్రౌండ్ కి వచ్చేస్తున్నాను" అని చెప్పాడు.
"నా బ్యాటింగ్ కోటా యాభై పరుగులు పూర్తి చేశాను. ఆద్య ఇక్కడే ఉంది. నీ బ్యాటింగ్ కూడా చూసి ఇంటికి వెళుతుందట" అని చెప్పాడు.
హుషారుగా కార్ డ్రైవ్ చేసుకుంటూ గ్రౌండ్ కి చేరుకున్నాడు జీవన్.
అతన్ని రిసీవ్ చేసుకున్నారు రిత్విక్, ఆద్యలు.
"వాళ్ళు రేపటి మ్యాచ్ కి వస్తారంటావా?" అని జీవన్ ని అడిగాడు రిత్విక్.
"మరీ భయపెట్ట లేదులే. పైగా రేపు వచ్చి బాగా ఆడితే మంచి గిఫ్ట్ ఇస్తానని చెప్పాను" అన్నాడు జీవన్ నవ్వుతూ.
"మొత్తానికి సక్సెస్ ఫుల్ గా పని పూర్తి చేశారు" అంటూ అతన్ని అభినందించింది.
"నాదేమీ లేదు. రిత్విక్ అందించిన హిడెన్ కెమెరా మెడకు తగిలించుకుని ఉన్నాను. అది తన పని తను చేసుకు పోయింది" అన్నాడు జీవన్.
వెంటనే అతని మెడ వంక చూసింది ఆద్య.
"దాన్ని ఎప్పుడో తీసేశాను. మీ అనుమతి లేకుండా మొబైల్ నుండి కూడా మీ ఫోటో తీయను. భయపడకండి" అన్నాడు జీవన్.
'జీవన్ లో ఎంత మార్పు వచ్చింది.. రెండు రోజుల క్రితం దీప్యకు మత్తు మందు ఇచ్చిన ఈ వ్యక్తి ఇప్పుడెంతగా మారిపోయాడు..' అనుకున్నాడు రిత్విక్.
ఇంతలో ప్రాక్టీస్ ఆడుతున్న బ్యాట్స్మెన్ అవుట్ కావడంతో ఆ స్థానం లోకి వెళ్ళాడు జీవన్.
రెండు ఓవర్లలోనే తన కోటా యాభై పరుగులు పూర్తి చేసి బయటకు వచ్చేశాడు.
ఆద్య మాట్లాడుతూ "మా నాన్నగారు ఢిల్లీ నుంచి వచ్చారు. నేను ఆయనతో మాట్లాడాలి. కాబట్టి నేను ఇంటికి వెళుతున్నాను. నెక్స్ట్ వీక్ ఒక టూర్ ప్లాన్ చేశాను. రేపు సెమీస్ మ్యాచ్ ముగిశాక ఎక్కడ అన్నది చెబుతాను" అంది.
"మాతో టైం స్పెండ్ చేయాలన్న కోరికను తీరుస్తున్నారా! థాంక్ యూ. కానీ నెక్స్ట్ వీక్ ఫైనల్స్ మ్యాచ్ కి ప్రాక్టీస్ చేయాలి కదా" ఆనాడు రిత్విక్.
"అన్నీ కలిసి వచ్చేలా ప్లాన్ చేశాను. రేపు గెలిస్తేనే ఈ ప్రోగ్రాం ఉంటుంది" అంది ఆద్య.
"మ్యాచ్ ఫిక్సింగ్ కి నేను ఆఫర్ చేసిన ఐదు కోట్లు, ఇప్పుడు నువ్వు చేసిన ఆఫర్ ముందు చాలా చిన్నదే. నీతో కలిసి టూర్ అన్నాక ఖచ్చితంగా రేపటి మ్యాచ్ గెలిచి తీరుతాం" అన్నాడు జీవన్.
వాళ్ళిద్దరికీ, మిగతా ఫ్రెండ్స్ కి వీడ్కోలు చెప్పి ఇంటికి వెళ్ళింది ఆద్య.
ఇంకా ఉంది...
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.
కొత్త బంగారు లోకం ఎక్కడుంది? (కవిత)
రచయిత పరిచయం:
నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము ( అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).
Comments