top of page
Writer's pictureSeetharam Kumar Mallavarapu

లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 8

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.




Video link


'Love Challenge Episode 8' Telugu Web Series Written By Mallavarapu Seetharam Kumar


రచన: మల్లవరపు సీతారాం కుమార్





గత ఎపిసోడ్ లో…

ఆద్య, రిత్విక్ తో ఫోన్ లో మాట్లాడటం చూసిన జీవన్ ఉడుక్కుంటాడు.


మయసభలో అవమాన పడ్డ దుర్యోధనుడిలా ఫీల్ అవుతాడు.


చందూతో కలిసి విక్కీ వాళ్ళ రెస్టారెంట్ కి వెళ్లి ఏర్పాట్లు పరిశీలిస్తాడు.


విక్కీ చూపించిన వీడియోలో పబ్ నుండి నేరుగా అపార్ట్మెంట్ కి ఎలా వెళ్లాలో చూస్తాడు.


అపార్ట్మెంట్ గదిలో దీప్యతో క్లోజ్ గా ఉన్నట్లు ఫోటోలు దిగమని చందూకి చెబుతాడు.

ఇక చదవండి…



ఆరోజు సాయంత్రం అయిదు గంటల కల్లా రెస్టారెంట్ దగ్గర రెడీగా ఉన్నారు చందూ, మోటూ, శాన్వీ, ఆమె బెస్ట్ ఫ్రెండ్ సాగరిక.


"ఆద్యా వాళ్ళు వస్తారంటావా?" ఆతృత ఆపుకోలేక అడిగాడు చందూ.


"వస్తారనే అనిపిస్తోంది. చూస్తుంటే వాళ్ళ కోసమే బర్త్ డే చేసుకొనేలా ఉన్నావే.." నవ్వింది శాన్వీ.


"అదేం లేదు. జీవన్ అన్న స్వయంగా వాళ్ళను పిలిచాడు కదా. అందుకే ఆతృతగా ఉంది" అన్నాడు చందూ.


"ఇంతకీ నీ వెయిటింగ్ ఆద్య కోసమా దీప్య కోసమా.." అతని చెవి దగ్గర చిన్నగా అంది శాన్వీ.

చందూ ఒకసారి అటూ ఇటూ చూసి, "ఇంకా నయం. ఎవరూ వినలేదు. ఆద్య విషయంలో తొందర పడి కామెంట్స్ చెయ్యొద్దు. నిన్న జరిగింది చాలదా?" అన్నాడు.


శాన్వీ ముఖం మాడి పోయింది.


నిన్న జీవన్ తనని చెంప దెబ్బ కొట్టిన విషయం చందూ గుర్తు చెయ్యడంతో మూడ్ ఆఫ్ అయింది.


అది గమనించిన చందూ "సారీ శాన్వీ! కావాలని అనలేదు" అన్నాడు.


అయినా ఆమె ముభావంగా ఉండటంతో "ఇంకెప్పుడూ ఆ విషయం గుర్తు చెయ్యను. ప్రామిస్. ప్లీజ్..చీర్ అప్" అంటూ మళ్ళీ రిక్వెస్ట్ చేసాడు.


దాంతో శాన్వీ "ఇట్స్ ఓకే" అంటూ నవ్వేసింది.

అంతలో హఠాత్తుగా వాళ్ల ముందు ఆడి కార్ ఆగింది.


ఈ కార్ మన కాలేజ్ ఎండి రాఘవేంద్ర గారిది. అంటే.. ఆద్య వచ్చిందా.." అందరూ ఉత్కంఠతో చూస్తున్నారు.

చందూ అయితే అప్పుడే జీవన్ కి కాల్ చేయడానికి రెడీ అవుతున్నాడు. వాళ్లు ఊహించినట్లే ఆద్య, దీప్య ఆ కారు నుంచి దిగారు.


సహజంగానే అందగత్తె అయిన ఆద్య, ఆరోజు ప్రత్యేకంగా డిజైన్ చేయబడ్డ మ్యాక్సీ డ్రస్సు ధరించి, కర్ల్ చేయబడ్డ హెయిర్ స్టైల్ తో కళ్ళు చెదిరేలా అనిపిస్తోంది. పక్కనే ఉన్న దీప్య కూడా చక్కగా తయారై వచ్చింది.


మొత్తానికి అందరూ ఆ ఇద్దరినే రెప్పలార్పకుండా చూస్తున్నారు.


ముందుగా తేరుకున్న శాన్వీ, ఆద్యను గట్టిగా హగ్ చేసుకొంది. తరువాత దీప్యను కూడా దగ్గరకు తీసుకొంది.


"మీరు వస్తారని అసలు ఎక్స్పెక్ట్ చెయ్యలేదు. ఒకవేళ వచ్చినా దీప్య మాత్రమే వస్తుందనుకున్నాం. ఐ యామ్ మచ్ డిలైటెడ్" అంది ఆనందంతో.


చందూ, తను నలుగురిలో ఉన్న విషయం మరిచి, జరగబోయేది ఊహించుకుంటూ దీప్య శరీరాన్ని పట్టి పట్టి చూస్తున్నాడు.


అది గమనించిన శాన్వీ, మోటూ తో "నువ్వు వీళ్ళిద్దరినీ పైకి తీసుకొని వెళ్ళు. కొందరు లెక్చరర్స్ వస్తామన్నారు. వాళ్ళు వచ్చాక మేము పైకి వస్తాం" అంది.


మోటూతో వాళ్లిద్దరూ పైకి వెళ్ళాక చందూ వంక కోపంగా చూస్తూ "అందరి ముందూ ఆ దీప్యను అలా తినేసేలా చూస్తున్నావు, కొంచెం కూడా మేనర్స్ లేకుండా" అంది.


"నాకు మేనర్స్ ఉందని ఎవరూ అనుకోరులే" అన్నాడు చందూ.


"అది కాదు. అందరిలో ఆలా చూస్తున్నావు. ఒకవేళ దీప్యకేమన్నా అయితే నిన్నే అనుమానిస్తారు" అంది శాన్వీ.


ఉలిక్కి పడ్డాడు చందూ.


"ఏమంటున్నావ్? జీవన్ నీక్కూడా చెప్పాడా?.." టక్కున అనేశాడు చందూ.


"జీవన్ చెప్పడమేమిటి? ఏదైనా ప్లాన్ చేశారా? రోజులు బాగా లేవు కదా! ఆ అమ్మాయి మీద ఏదైనా అఘాయిత్యం జరిగితే అందరూ నీ పేరే చెబుతారని అలా అన్నాను" అంది శాన్వీ అతని ముఖాన్ని పరిశీలనగా చూస్తూ.


"అలాగా..థాంక్ యూ" అనేసి తల తిప్పుకున్నాడు చందూ.


"నేనడిగిందానికి జవాబివ్వలేదు. జీవన్ నాతో దేని గురించి చెప్పాడనుకున్నావ్?" రెట్టించింది శాన్వీ.


"నేను దీప్య వంక ఎక్కువగా చూస్తున్నానట.

ఆ అమ్మాయి రిత్విక్ కి సిస్టర్ లాంటిదనీ, కాబట్టి తనక్కూడా సిస్టర్ అవుతుందనీ, ఒళ్ళు దగ్గర పెట్టుకోమనీ చెప్పాడు.

నీతో కూడా ఆ విషయం చెప్పాడనుకున్నాను"


కవర్ చేశాననుకున్నాడు చందూ.


"అలాగా. సర్లే.." అనేసింది శాన్వీ.


'పరవాలేదు. ఈ మధ్య నా బుర్ర కూడా చురుగ్గా పని చేస్తోంది' తనను తనే అభినందించుకున్నాడు.


ఇంతలో ఒక అన్నోన్ నంబర్ నుండి శాన్వీకి కాల్ వచ్చింది.


లిఫ్ట్ చేసిందామె.

అటువైపు జీవన్.


"ఇప్పుడే ఆ చందూ గాడికి చేశాను. తియ్యలేదు వెధవ. అన్నోన్ నంబర్ అని తీసి ఉండడు. ఈ రోజు బర్త్ డే అని వదిలేసాను" కోపంగా అన్నాడు జీవన్.


"జస్ట్..ఇప్పుడే ఆద్య, దీప్య వచ్చారు. ఆ హడావిడిలో ఫోన్ లిఫ్ట్ చేసి ఉండడు" అంది శాన్వీ.


"వాళ్ళ విషయం కనుక్కుందామనే కాల్ చేసాను. గ్రేట్! ఇద్దరూ వచ్చారన్న మాట. చందూ ని కాస్త పక్కకు వచ్చి కాల్ చెయ్యమను. బిల్ కట్టే విషయం మాట్లాడాలి" అన్నాడు.


సరేనంటూ ఫోన్ పెట్టేసింది శాన్వీ.

"చందూ ఇంకా ట్రాన్స్ లో ఉన్నవాడిలా ఉన్నాడు.


అతన్ని కుదుపుతూ, "నీ చూపుల గురించి జీవన్ కి తెలిసి పోయినట్లుంది. నీకు మిస్డ్ కాల్ పడ్డ నెంబర్ కి కాల్ చెయ్యమన్నాడు" నవ్వుతూ అంది శాన్వీ.


"నా చూపుల గురించి ఏమన్నాడు జీవన్? అతనికెలా తెలిసింది.." ఆందోళనతో అడిగాడతను.


"అందుకో..మరెందుకో.. కాల్ చేస్తే తెలుస్తుందిగా" అంది శాన్వీ.


కాస్త పక్కకు వెళ్లి ఆ నంబర్ కి కాల్ చేసి, "సారీ అన్నా! ఇందాక చూసుకోలేదు" అన్నాడు చందూ.


"ఏమిటి సంగతి? ఆ దీప్యను చూసి ఊహల్లో మునిగిపోయావా?" కాస్త కోపం ధ్వనించింది జీవన్ కంఠంలో.


"అయ్యో.. అదేం లేదన్నా! ఈ శాన్వీ ఒళ్ళు కొవ్వెక్కి నీకలా చెప్పి ఉంటుంది" అన్నాడు చందూ దూరంనుంచే శాన్వీ ని చూసి పళ్ళు కొరుకుతూ.


"షటప్!" అటునుంచి గట్టిగా అరిచాడు జీవన్.

ఆ కంఠంలో ధ్వనించిన కోపానికి వణికిపోయాడు చందూ.


"శాన్వీ నా గర్ల్ ఫ్రెండ్. నిన్న ఏదో విషయంగా కోపం తెచ్చున్నాను. అంత మాత్రాన ప్రతి అడ్డమైన వెధవా తన గురించి కామెంట్ చేస్తే ఒప్పుకోను".


జీవన్ మాటల్లో కోపం తగ్గలేదని అర్థమైంది చందూ కి.


సారీ అన్నా! ఇంకెప్పుడూ అలా మాట్లాడను. బర్త్ డే రోజు.. క్షమించేసెయ్యి గురూజీ " అన్నాడు చందూ.


మందు కొడుతూ ఉన్నప్పుడు చందూ నేలమీద కూర్చొని తన కాళ్ళు ఒత్తుతూ 'గురూజీ' అని సంబోధిస్తూ ఉంటాడు.


అది గుర్తుకు వచ్చి నవ్వేసాడు జీవన్.


"సరేరా బర్త్ డే బాయ్. అయినా ఇంకా ఇక్కడేం చేస్తున్నావ్? పైకి వెళ్లి ప్రోగ్రాం ఆరంభించు” అన్నాడు జీవన్.


"అలాగే అన్నా. ఇద్దరు లెక్చరర్స్ వస్తామన్నారు. వాళ్ళను రిసీవ్ చేసుకొని పైకి వెళ్తాను" అన్నాడు చందూ.


"రెస్టారెంట్ లో కేక్ కటింగ్ అయ్యాక ఆద్య వెళ్లిపోయేలా, దీప్య పబ్ కి వచ్చేలా చెయ్యమని శాన్వీతో చెబుతాను. శాన్వీకి పబ్ లో జరగబోయేవి తెలీదు. అర్థమైందిగా.

అవన్నీ విక్కీ చూసుకుంటాడు. మరీ అవసరమైతే ఈ నెంబర్ కి కాల్ చెయ్యి. వీలుంటే వేరే వాళ్ళ ఫోన్ నుండి చెయ్యి" చెప్పి, ఫోన్ పెట్టేసాడు జీవన్.

"ఏమిటలా వణికి పోయావ్?" ఫోన్ ముగించి తన దగ్గరకు వచ్చిన చందూని అడిగింది శాన్వీ.


"ఏం లేదులే.." అన్నాడు చందూ దాటవేస్తూ..


"చెప్పొద్దులే. కానీ ఒక్కటి గుర్తుంచుకో..

పెద్దవాళ్లకు ఎప్పుడు ఎవరి మీదైనా కోపం రావచ్చు" అంది శాన్వీ.


జవాబు చెప్పలేదు చందూ.


కానీ ఆమె చెప్పింది అక్షరాలా నిజమని మనసులో అనుకున్నాడు.


ఇంతలో వాళ్ళు ఎదురు చూస్తున్న లెక్చరర్స్ ఇద్దరు వచ్చారు.


వాళ్ళను తీసుకొని అందరూ పైకి వెళ్లారు.


పైన ఫంక్షన్ హాల్ లో ఉన్న స్టూడెంట్స్ అందరూ లెక్చరర్స్ రాగానే లేచి నిలబడి విష్ చేశారు.

విక్కీ లెక్చరర్స్ ఇద్దరికీ స్వయంగా వెల్కమ్ డ్రింక్ సర్వ్ చేశాడు.


తర్వాత అతను చందూ దగ్గరకు వెళ్లి చెవిలో చిన్నగా "ఇక ప్రోగ్రాం స్టార్ట్ చేద్దామా? ఇక్కడ ఫంక్షన్ పూర్తయితే కొందరిని పబ్ కి తీసుకుని వెళ్లాలి కదా" అన్నాడు నర్మగర్భంగా.

'అలాగే' అన్నట్లు తల ఊపాడు చందూ.


బర్త్ డే కేక్ ను తీసుకొని రమ్మని తన అసిస్టెంట్ కి చెప్పబోయాడు విక్కీ.


అంతలో అతని ఫోన్ మోగింది. కింద మెయిన్ ఎంట్రెన్స్ దగ్గర ఉన్న సెక్యూరిటీ అతను చేస్తున్నాడు. సాధారణంగా ఎవరైనా వివిఐపి లు వస్తున్నప్పుడో లేక పోలీస్ వాహనం ఏదైనా వచ్చినప్పుడో అతను విక్కీ కి కాల్ చేసి అలర్ట్ చేస్తూ ఉంటాడు.


విక్కీ వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి "ఏమైంది? పోలీస్ జీప్ ఏదైనా వచ్చిందా" అని ఆతృతగా అడిగాడు.


అవతలి నుంచి సెక్యూరిటీ గార్డ్ మాట్లాడుతూ "రోల్స్ రాయిస్ కార్ లోపలికి వస్తోంది. చాలా రోజులకు ముందు, బిజినెస్ మాన్ చక్రధరం గారు ఈ కారులో వచ్చినట్లు గుర్తు" అన్నాడు.


"సరేలే. వచ్చిన వాళ్ళను రిసీవ్ చేసుకో" అని చెప్పి వేగంగా తన గదిలోకి వెళ్ళాడు విక్కీ.


లోపల మానిటర్ లో, ఎంట్రన్స్ దగ్గర ఉండే సీసీ కెమెరాలను పరిశీలించాడు. ఆ మిడ్ నైట్ బ్లూ కలర్ రోల్స్ రాయిస్ కార్ లో నుంచి రిత్విక్ దిగాడు.


అది చూసిన విక్కీ వెంటనే సెక్యూరిటీ కి ఫోన్ చేసి "వచ్చింది చక్రధరం గారి అబ్బాయి. ఆయనను దగ్గరుండి లిఫ్ట్ ఎక్కించి థర్డ్ ఫ్లోర్ కు పంపించు. అక్కడున్న మన వాళ్లందర్నీ కూడా అలర్ట్ చెయ్యి" అని చెప్పాడు.


తర్వాత ఫంక్షన్ హాల్ దగ్గరికి వచ్చి "రిత్విక్ వస్తున్నాడు" అంటూ చందూతో చెప్పాడు. అదిరిపడ్డాడు చందూ.


"రిత్విక్ వస్తున్నాడా.. ఇప్పుడెలా?" అని పెద్దగానే అనేసాడు.


"పద. లిఫ్ట్ దగ్గరకు వెళ్లి రిసీవ్ చేసుకుందాం" చందూ చేయి పట్టుకొని లిఫ్ట్ దగ్గరికి తీసుకొని వెళ్ళాడు విక్కీ.

లిఫ్ట్ నుంచి బయటకు వచ్చిన రిత్విక్ ని చూస్తూ, "వెల్కమ్ సర్! మీరు మా రెస్టారెంట్ కి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. వెల్కమ్ అగైన్" అంటూ రిత్విక్ కి షేక్ హ్యాండ్ ఇచ్చి, చేయి పట్టుకొని ఫంక్షన్ హాల్ కి తీసుకొని వచ్చాడు విక్కీ.


చందూ, రిత్విక్ కి మరో వైపు నడుస్తూ "అన్నా! మీరు నా కోసం రావడంతో చాలా ఖుషీ అవుతున్నాను" అన్నాడు.


"నీ సంతోషం కోసమే నా పనులు మానుకొని వచ్చాను" అన్నాడు రిత్విక్, చందు వంక అదోలా చూస్తూ.


ఆ మాటల్లో ని గూడార్థం ఏమైనా ఉందా అని ఆలోచిస్తూ ఉన్నాడు చందూ.


రిత్విక్ ఫంక్షన్ హాల్ లోకి ఎంటర్ కాగానే అందరు స్టూడెంట్స్ అతన్ని చుట్టుముట్టారు.


"వాట్ ఏ సర్ ప్రైజ్.. నువ్వు రావని చందూ చెప్పాడు" అన్నారు.


అందరినీ విష్ చేసి, కాస్త దూరంగా ఉన్న లెక్చరర్స్ దగ్గరకు వెళ్లి నమస్కారం పెట్టాడు రిత్విక్.


దూరం నుంచి తన వైపు చూస్తున్న ఆద్య, దీప్యలను గమనించాడు. నేరుగా వాళ్ళ వద్దకు వెళ్ళాడు.


బ్లూ కలర్ సూట్ లో హుందాగా తన వైపు నడిచి వస్తున్న రిత్విక్ వంక కొంత సేపు రెప్పలార్పకుండా చూసింది ఆద్య.


బ్లూ కలర్ డిజైనర్ మ్యాక్సీ డ్రెస్ లో ఉన్న ఆద్యను తన రే బాన్ గ్లాసెస్ నుండి పరిశీలనగా చూసాడు రిత్విక్ .


'ఎంత చక్కగా ఉంది ఈ అమ్మాయి..' అనుకోకుండా ఉండలేక పోయాడు.


"ఇదేమిటి? ఇద్దరూ ముందే మాట్లాడుకున్నారా.. మ్యాచింగ్ డ్రెస్ లు వేసుకున్నారు?" అంది దీప్య ఇద్దర్నీ మార్చి మార్చి చూస్తూ.


ఎదురెదురుగా నిల్చున్న వాళ్ళిద్దరినీ పరిశీలనగా చూసింది శాన్వీ.


డ్రెస్ లే కాదు. మనుషులు కూడా ఒకరికోసం ఒకరు పుట్టినట్లున్నారు.


దీప్యను గ్రిప్ లోకి తెచ్చుకొని ఎప్పటికో జీవన్ సాధించబోయేది ఏమిటి?


ఆద్యను చూస్తుంటే ఇప్పుడే రిత్విక్ కి ఐ లవ్ యు చెప్పేలా ఉంది.


ఇక ఛాలెంజ్ కి అవసరమేముంటుంది.


కానీ తనకు తెలిసి జీవన్, ఓటమిని అంగీకరించడు.

గెలుపు కోసం ఏమైనా చేస్తాడు..


ఆలోచిస్తోంది శాన్వీ.


చందూ దగ్గరికి వెళ్లిన విక్కీ, "జీవన్ ది వేరే నంబర్ ఉందా? అర్జెంట్ గా మాట్లాడాలి" అన్నాడు.

ఇంకా ఉంది...


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.



రచయిత పరిచయం:

నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము ( అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).


43 views0 comments

Commentaires


bottom of page