కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Video link
'Love Challenge Episode 9' Telugu Web Series Written By
Mallavarapu Seetharam Kumar
రచన: మల్లవరపు సీతారాం కుమార్
గత ఎపిసోడ్ లో…
రెస్టారెంట్ దగ్గర వెయిట్ చేస్తున్న చందూ, అతని ఫ్రెండ్స్ - ఆద్య, దీప్యలు రావడంతో ఆశ్చర్య పోతారు.
కేక్ కటింగ్ చేయాలనుకునే సమయానికి రిత్విక్ కూడా అక్కడికి వస్తాడు.
జీవన్ కి కాల్ చేసి, విషయాలు చెప్పాలనుకుంటాడు విక్కీ.
ఇక చదవండి…
జీవన్ రెగ్యులర్ నెంబర్ కాకుండా మరో నెంబర్ ఉంటే ఇవ్వమని చందూ ని అడుగుతాడు విక్కీ.
నంబర్ కోసం తన ఫోన్ చూసిన చందూ అది స్విచ్ ఆఫ్ అయి ఉండటం గమనిస్తాడు.
"షిట్.. పొద్దుటి నుండి ఒకటే ఫోన్ లు. చార్జింగ్ అయిపోయింది" అంటూ శాన్వీని దగ్గరకు రమ్మని పిలిచాడు.
"విక్కీకి జీవన్ నెంబర్ ఇవ్వు" అని ఆమెతో చెప్పాడు.
"అదేమిటి? విక్కీ దగ్గర జీవన్ నెంబర్ లేదా" అడిగింది శాన్వీ ఆశ్చర్యంగా.
"మామూలు నెంబర్ కాదులే. ఇందాక మనకు కాల్ చేసాడు కదా.. ఆ నెంబర్ కావాలట. నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపొయింది. ఒకసారి నీ మొబైల్ లో చెక్ చేసి ఆ నెంబర్ ఇవ్వు ప్లీజ్" అన్నాడు చందూ.
ఆ నెంబర్ విక్కీకి చెప్పింది శాన్వీ. అతను అక్కడ కాల్ చేయకుండా బయటకు వెళ్లడంతో ఆమెకు అనుమానం కలిగింది. మరో ఐదు నిమిషాల తర్వాత అతను తిరిగి ఆ ఫంక్షన్ హాల్ లోకి వచ్చాడు.
చందూ దగ్గరకు వెళ్లి "ఇప్పటికే ఆలస్యమైంది. కేక్ కటింగ్ మొదలు పెడదాం" అన్నాడు విక్కీ.
అక్కడి సిబ్బంది పెద్ద కేక్ ను తీసుకువచ్చి స్టేజ్ పైన పెట్టారు. అందరూ విష్ చేస్తూ ఉండగా చందూ ఆ కేక్ ని కట్ చేశాడు. అంతా చప్పట్లు కొట్టారు. హ్యాపీ బర్త్డే పాట పాడారు. తరువాత అక్కడే రకరకాల నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, చైనీస్ వంటకాలతో బఫె అరేంజ్ చేసారు.
ఫంక్షన్ ముగిసాక చందూ ఎంట్రన్స్ దగ్గర నిల్చొని, వెళ్లే వాళ్ళందరికీ బై చెబుతున్నాడు.
రిత్విక్, ఆద్య, దీప్యలు కూడా ఎంట్రన్స్ దగ్గరకు వస్తూ ఉండటంతో నిరాశ పడ్డాడు చందూ.
రిత్విక్, ఆద్యలు ఫంక్షన్ బాగా అరేంజ్ చేసినందుకు చందూని అభినందించారు.
తరువాత అతనికి బై చెప్పి అక్కడి నుంచి బయలుదేరారు.
దీప్య కూడా వారి వెంట మౌనంగా నడిచింది. ఆమె ఏమీ మాట్లాడకుండా వెళ్లడం చందూని మరింత బాధించింది. అంతలో శాన్వీ అతని దగ్గరకు వచ్చి 'దీప్య పబ్ కి వస్తుందట' అని అతని చెవిలో చిన్నగా చెప్పింది.
ఆశ్చర్యంగా చూశాడు చందూ.
"నిజమే చెబుతున్నావా.. జోక్ చేస్తున్నావా?" అని అడిగాడు.
చిన్నగా నవ్వింది శాన్వీ.
"మొదట రాననే అనింది. కానీ నేను కన్విన్స్ చేయడంతో ఒప్పుకుంది" అని చెప్పింది.
"మరి కిందకి వెళ్తోందేమిటి?" ఇంకా అనుమానం తీరక అడిగాడు చందూ.
"వాళ్ళిద్దరూ కలిసి వచ్చారు కదా! ఆద్య డ్రైవర్ ని తీసుకొని వచ్చింది. అందుకని తన కారు దీప్య కోసం ఇక్కడే ఉంచుతుందట. రిత్విక్, ఆద్యను ఇంటిదగ్గర డ్రాప్ చేస్తాడట. వాళ్లకు బై చెప్పి దీప్య తిరిగి వస్తుంది" చెప్పింది శాన్వీ .
"అదేమిటి? ఆద్య రిత్విక్ కార్ లో ఇంటికి వెళుతుందా! వెంటనే ఈ విషయం జీవన్ అన్నకు చెప్పాలి" అంటూ తన ఫోన్ తీయబోయాడు. కానీ అంతలోనే తన ఫోన్ స్విచాఫ్ ఐన సంగతి గుర్తుకు వచ్చి "శాన్వీ! నీ ఫోన్ ఒకసారి ఇవ్వు. అన్నకు అర్జెంటుగా కాల్ చేయాలి" అన్నాడు.
"నా ఫోన్ నుండి కాల్ చేస్తావా? జీవన్ నిన్ను ఖచ్చితంగా కోప్పడతాడు" అంది శాన్వీ.
"అదేం లేదులే. వేరే వాళ్ల ఫోన్ నుంచి చెయ్యమని అన్న ఎప్పుడో చెప్పాడు. నువ్వు మాట్లాడకుండా ఫోన్ ఇలా ఇవ్వు" అన్నాడు చందూ.
అతను జీవన్ దగ్గర తినబోయే చీవాట్లను ఊహించుకొని మనసులోనే నవ్వుకుంటూ ఫోన్ అతనికి ఇచ్చింది శాన్వీ. ఆ ఫోన్ తీసుకొని వాష్ రూమ్ కి వెళ్లి జీవన్ కు కాల్ చేశాడు చందూ.
ఫోన్ లిఫ్ట్ చేసిన జీవన్ "చెప్పు శాన్వీ” అన్నాడు.
చందూ మాట్లాడుతూ "అన్నా! నేను చందూ ని. నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. అందుకని శాన్వీ ఫోన్ నుండి కాల్ చేస్తున్నాను" అంటూ ఏదో చెప్పబోతూ ఉండగా జీవన్ కోపంతో "రాస్కెల్! మరీ అవసరమైతే గాని కాల్ చెయ్యొద్దు అన్నాను. అయినా కాల్ చేశావు. అది కూడా ఆ శాన్వీ ఫోన్ నుండి. సరే చెప్పు. విషయం ఏమిటి" అని అడిగాడు.
"అన్నా! ఆద్యను ఆ రిత్విక్ తన కారులో ఇంటిదగ్గర డ్రాప్ చేస్తాడట" చెప్పాడు చందూ.
అటువైపు నుండి చందూ మాటలు విన్న జీవన్ రక్తం మరిగి పోయింది.
'ఇంకెన్నాళ్లు లే.. ఈరోజుతో దీప్య తమ చేతుల్లో ఉంటుంది. ఆమెను వాడుకొని ఆద్యను తన వైపు తిప్పుకోవాలి' అని మనసులో అనుకున్నాడు.
పైకి మాత్రం చందూతో "అలాగా! మంచిదే లే. మన కోసం వచ్చిన ఆద్యను ఎవరో ఒకరు క్షేమంగా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తున్నారు. చాలా సంతోషం. ఇక ఫోన్ పెట్టెయ్. నాకు చాలా పనులు ఉన్నాయి. డోంట్ డిస్టర్బ్ మీ" అంటూ కాల్ కట్ చేశాడు.
'జీవన్ కి ఎప్పుడు ఎందుకు కోపం వస్తుందో చెప్పలేం. శాన్వీ అతని సైకాలజీ బాగా పట్టేసింది' అనుకుంటూ వాష్ రూమ్ నుండి బయటకు వచ్చి, ఫోన్ శాన్వీ కి అందించాడు. మాడిన అట్టు లాగా ఉన్న చందూ ముఖం చూసి ‘మంచి డోస్ పడి ఉంటుంది లే’ అనుకుంది శాన్వీ.
కిందికి వెళ్లి రిత్విక్, ఆద్య లకు సెండ్ ఆఫ్ ఇచ్చి తిరిగి ఫంక్షన్ హాల్ కి వచ్చింది దీప్య.
వెళ్లాల్సిన వాళ్ళందరూ వెళ్లగా పబ్ కి వెళ్లడానికి 20 మంది మిగిలారు.
పైకి వచ్చిన దీప్యను శాన్వీ, సాగరిక పలకరించి పక్కకు తీసుకొని వెళ్లారు. ముగ్గురూ ఒక మూలగా కుర్చీలు లాక్కొని కూర్చున్నారు.
సాగరిక, దీప్య తో మాట్లాడుతూ "నువ్వు గానీ, ఆద్య గానీ వస్తారని అస్సలు ఊహించలేదు. మీ రాకతోనే సర్ప్రైజ్ అయిన మాకు, రిత్విక్ రావడం మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది" అంది.
దీప్య మాట్లాడుతూ "నేను, ఆద్య, రిత్విక్ కూడా మీలాంటి స్టూడెంట్స్ మే కదా. మేమైతే కొత్తగా చేరాం గానీ, రిత్విక్ గురించి మీకు బాగా తెలుసు.
అతను ఇలాంటి కార్యక్రమాల్లో ఎప్పుడూ పార్టిసిపేట్ చేస్తూ ఉంటాడు కదా!
లాస్ట్ ఇయర్ కూడా చందూ బర్త్ డే ఫంక్షన్ కి వచ్చాడట కదా" అంది.
"అది నిజమే అనుకో. అయినా ఆద్య రావడం, నువ్వు పబ్ కి రావడానికి ఒప్పుకోవడం నిజంగా మాకు సర్ప్రైజ్" అంది శాన్వీ.
మరో పావు గంట గడిచాక చందూ వాళ్ల దగ్గరకు వచ్చి, "అందరూ పబ్ కి బయలుదేరుతున్నారు. మీరు వెనక గేటు నుండి వచ్చేయండి" అన్నాడు.
"ఎందుకలా..?" అడిగింది దీప్య.
విక్కీ కల్పించుకుంటూ "అనవసరంగా నలుగురి కళ్ళల్లో పడటం ఎందుకని మీలాంటి డిగ్నిఫైడ్ లేడీస్ ని వేరే దారిలో పంపిస్తాం. అంతే.. మరేం లేదు" అన్నాడు.
"అవును. అలాగే వస్తాం లే" చెప్పింది శాన్వీ.
విక్కీ తన అసిస్టెంట్ ను పిలిచి "వీళ్లను జాగ్రత్తగా వెనక వైపు నుంచి పబ్ లోకి పంపించు" అని చెప్పాడు.
తరువాత చందూ, విక్కీ మిగిలిన స్నేహితులతో కలిసి పక్కనే ఉన్న పబ్ లోకి లోకి ఎంటర్ అయ్యారు.
విక్కీ గేట్ దగ్గర ఉన్న సెక్యూరిటీని పిలిచి, "బయటి వాళ్ళని అలో చేయొద్దని ఇందాకే చెప్పాను. గుర్తుంది కదా? ఎవ్వరినీ పంపలేదు కదా" అన్నాడు.
"అవును సార్. గుర్తుంది. ఎవ్వరినీ పంపలేదు. ఈరోజుకు ఖాళీ లేదని చెప్పి, తిప్పి పంపేశాను. ఒక నలుగురు కుర్రాళ్లు మాత్రం ఎస్పీ గారి బంధువులమని, తమను లోపలికి పంపించమని అడిగారు. వాళ్లకు కూడా ఖాళీ లేదని చెప్పాను. మీకు ఎస్పీ గారి చేత ఫోన్ చేయిస్తామని చెప్పి వెళ్లిపోయారు" అన్నాడు అతను.
"పోలీస్ వాళ్ళ బంధువులు పబ్ లో ఉంటే మనకే మంచిది. ఎటువంటి పరిస్థితుల్లో రైడింగ్ జరగదు. సరేలే.. కాల్ వస్తే చూసుకుందాం" అంటూ లోపలికి నడిచాడు విక్కీ.
వీళ్లు లోపలికి ఎంటర్ అయిన పది నిమిషాలకు శాన్వీ, సాగరిక, దీప్య లు మరో దారి గుండా ఆ పబ్ లోకి ఎంటరయ్యారు.
విక్కీ అందర్నీ కాస్త దగ్గరకు రమ్మని, "ఫ్రెండ్స్! ఈరోజు మీకందరికీ అన్లిమిటెడ్ పార్టీ అని జీవన్ చెప్పాడు. మొత్తం బిల్లు ఆయనదే.
మీరందరూ కౌంటర్ దగ్గరకు వచ్చి మీకు కావలసింది ఎంచుకోండి. లేదా మీరు కూర్చున్న చోటికి సర్వ్ చేయమన్నా చేస్తాము.
వెజ్.. నాన్వెజ్.. అన్ని రకాల ఫుడ్స్ ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే గ్లాసుల్లో కాక కూల్ డ్రింక్ బాటిల్ లో వాళ్లు కోరింది మిక్స్ చేసి అందిస్తాము.
అలా కాక నిజంగా కూల్ డ్రింక్ మాత్రమే కావాలనుకున్నా ఇస్తాము.
వెంటనే ఇంటికి వెళ్లలేని వాళ్లకు కొంతసేపు రెస్ట్ తీసుకోవడానికి ఏర్పాటు చేస్తాము. కాసేపు బయటి ప్రపంచాన్ని మర్చిపోయి ఎంజాయ్ చేయండి. మీకు ఇక్కడ హద్దులు లేవు" అన్నాడు.
అందరూ ఆనందంతో 'హుర్రే' అని అరిచారు.
"లాంగ్ లివ్ చందూ.. లాంగ్ లివ్ జీవన్.." అంటూ కొందరు మందు కొట్టక ముందే భజన ప్రారంభించారు.
శాన్వీ, సాగరిక, దీప్య ఒక కార్నర్ సీట్ లో కూర్చున్నారు.
చందూ రెండు కప్పుల్లో డ్రింక్ తీసుకొని వచ్చి శాన్వీ, సాగరిక లకు అందించాడు.
తరువాత దీప్యతో మాట్లాడుతూ “వీళ్ళకు కావలసింది కాస్మోపాలిటన్ అని నాకు తెలుసు కాబట్టి వాళ్ళు అడక్కుండానే తెచ్చాను. మీ గురించి నాకు తెలియదు. మీకు అలవాటు లేదని నాకు తెలుసు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరూ తాగుబోతులు కాదు. అందరూ మీలాంటి వాళ్లే. జస్ట్ ఒక అకేషన్ ఎంజాయ్ చేయడం కోసం కాస్త తీసుకుంటారు. మిమ్మల్ని బలవంత పెట్ట దలుచుకోలేదు. కానీ మీరు కూడా మాతో కలిస్తే అందరూ కలిసి ఎంజాయ్ చేయవచ్చు. మీరు ఇంకా నాలుగేళ్లు ఈ కాలేజీలో చదవాలి. ఈ రోజు కాకపోయినా మరో రోజైనా మా బ్యాచ్ లో చేరుతారు. అదేదో ఈ రోజే జరిగితే నాకంటే సంతోషించేవాడు ఉండడు. ఏమైనా ఫైనల్ డిసిషన్ మీదే" అన్నాడు.
దీప్య తల అడ్డంగా ఊపుతూ "నాకు ఇష్టం లేదు. కంపెనీ కోసం కూల్ డ్రింక్ తీసుకుంటాను" అంది.
"పోనీ.. కూల్ డ్రింక్ లో టేస్ట్ కోసం కాస్త ఇలాంటివి కలపనా.. అఫ్ కోర్సు.. మీకు అభ్యంతరం లేకపోతేనే" అన్నాడు చందూ.
తరువాత శాన్వీ, సాగరికల వంక చూస్తూ "మీరేమిటి.. మౌనంగా ఉన్నారు? తనని మీతో కలుపుకోవాలని లేదా" అన్నాడు.
శాన్వీ మాట్లాడుతూ "ఏదైనా వాళ్ళు ఇష్టపడితే తప్పుగా అనిపించదు. మరొకరు చెబితే బలవంతం చేసినట్లు, తమకు చెడు అలవాట్లు నేర్పుతున్నట్లు అనుకుంటారు. కాబట్టి తనంతట తను మాతో కలిసే వరకు ఓపిగ్గా వెయిట్ చేస్తాము" అంది శాన్వీ.
"అలా అయితే తనకిష్టమైన ఫ్రూట్ జ్యూస్ ఏదో కనుక్కోండి. ఇస్తాను" అన్నాడు చందూ.
"గ్రేప్ జ్యూస్ ఇవ్వండి" అంది దీప్య.
చందూ, విక్కీ ని పిలిచి షి ఈజ్ మై ఫ్రెండ్ దీప్య. ఈమెకు ఫ్రెష్ గా చేసిన గ్రేప్ జ్యూస్ తీసుకొని రండి" అని చెప్పాడు.
సరేనని విక్కీ వెళ్లబోతుండగా అతని ఫోన్ మోగింది.
లోకల్ ఎస్సై నుండి కాల్ వస్తోంది. ఆ నెంబర్ అతని కాంటాక్ట్స్ లో ఉండడం వల్ల వెంటనే లిఫ్ట్ చేసి "నమస్తే సార్. చెప్పండి. ఏం కావాలి?" అని అడిగాడు.
అటువైపునుంచి ఎస్ఐ మాట్లాడుతూ "ఎస్పీ గారి బంధువులు వస్తారంటే ఖాళీ లేదంటూ ఏదో అన్నారట.." అని అడిగాడు.
"అదేం లేదు సార్. గురు మూర్తి గారి అబ్బాయి జీవన్ గారి ఫ్రెండ్స్ ఏదో పార్టీ చేసుకోవాలని వచ్చారు. ఓ గంటలో వెళ్ళిపోతారు. ఈలోగా ఎవరినీ రానివ్వ వద్దని చెప్పారు" అన్నాడు విక్కీ.
"అందుకని మా వాళ్లనే రావద్దంటావా?" కాస్త కోపంగా అన్నాడు ఎస్ ఐ.
"అదేం లేదు సార్.. రమ్మనండి. పరవాలేదు, నేను చూసుకుంటాను" అన్నాడు విక్కీ.
"వాళ్లు గేట్ దగ్గరే ఉన్నారు. మీ సెక్యూరిటీ కి ఫోన్ చెయ్" అని చెప్పి ఫోన్ పెట్టేశాడు ఎస్ఐ.
సెక్యూరిటీ కి ఫోన్ చేసి "ఎంతమంది వచ్చారు?" అని అడిగాడు విక్కీ.
"ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు సార్! ఆల్రెడీ తూలుతున్నారు" అని చెప్పాడు సెక్యూరిటీ.
" సరే! వాళ్ళని పంపించు" అన్నాడు విక్కీ..
ఇద్దరు పాతికేళ్ల కుర్రాళ్ళు, వాళ్లతో పాటు ఇద్దరు అమ్మాయిలు లోపలికి వచ్చారు.
అమ్మాయిలు ఇద్దరూ జీన్స్ ప్యాంటు, పైన స్లీవ్లెస్ టీ షర్ట్ వేసుకొని ఉన్నారు. పక్కనున్న అబ్బాయిల మీద దాదాపుగా వాలి పోయి నడుస్తున్నారు.
'వీళ్ళు పార్టీ కోసమే వచ్చారు. నిఘా కోసం కాదు' అని నిశ్చయించుకొని, వాళ్లకు సీట్ చూపించి కూర్చోమన్నాడు విక్కీ.
వాళ్ల దగ్గర ఆర్డర్ తీసుకుని, అవి తెమ్మని బేరర్ ని పురమాయించాడు.
తరువాత చందూ వాళ్ళ టేబుల్ దగ్గరకు వచ్చి, "సారీ! ఇప్పుడే దీప్తి గారు అడిగింది తీసుకొని వస్తాను" అని లోపలికి వెళ్ళాడు.
ఓ రెండు నిముషాల్లో ఒక గ్లాస్ లో గ్రేప్ జ్యూస్ తీసుకోని వచ్చి, దీప్య ముందు పెట్టాడు.
అంతలో మళ్లీ అతని ఫోన్ మోగింది. ఈసారి కూడా సెక్యూరిటీ గార్డు నుండి ఫోన్ వచ్చింది.
"మళ్లీ ఏమిటి? ఇంక ఎవరు వచ్చినా అలో చేయవద్దు" కాస్త విసుగ్గా అన్నాడు విక్కీ.
"సార్ వచ్చింది రిత్విక్ అట. తన పేరు మీకు చెప్పమన్నాడు" అన్నాడు సెక్యూరిటీ గార్డ్.
"వాట్..? రిత్విక్ వచ్చాడా. వెంటనే లోపలికి పంపు." అదిరి పడి, వెంటనే అన్నాడు విక్కీ.
రిత్విక్ పేరు వినగానే చందూ కూడా వణికాడు.
క్షణంలో లోపలికి ఎంటర్ అయ్యాడు రిత్విక్.
ఎస్పీ బంధువులమంటూ లోపలికి వచ్చిన నలుగురూ చందూ కూర్చొని ఉన్న టేబుల్ వద్దకు వచ్చారు.
దీప్య ముందున్న గ్లాస్ ను చూపుతూ “ఇందులో ఏముంది?" అని విక్కీని అడిగాడు వారిలో ఒక యువకుడు.
ఇంకా ఉంది...
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.
కొత్త బంగారు లోకం ఎక్కడుంది? (కవిత)
రచయిత పరిచయం:
నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము ( అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).
댓글