'Lust And Love' New Telugu Story Written By Vasundhara
Published In manatelugukathalu.com On 22/08/2024
'లస్టూ లవ్వూ' తెలుగు కథ
రచన: వసుంధర
(ప్రముఖ రచయిత్రి బిరుదు గ్రహీత)
కథా పఠనం: పద్మావతి కొమరగిరి
మనిషికి జన్మ దుఃఖం అంటారు కానీ అది వరం.
వయోభారం అంటారు కానీ వయసెప్పుడూ భారం కాదు. అదో అంకె!
జరాదుఃఖం అంటారు కానీ, వృద్ధాప్యం జబ్బు కాదు. జీవనప్రయాణంలో అంతిమఘట్టం.
సంసారం సాగరం దుఃఖం అంటారు కానీ- ఏ దుఃఖమైనా మనం తెచ్చిపెట్టుకున్నదే!
ఉదాహరణకి త్యాగరాజు కథ!
- - - - -
కొంగుముడి వేసుకున్న కొత్త దంపతుల్ని ఏకాంతానికొదిలి- బంధుమిత్రులు వెళ్లారు. ఐతే ఆ జంటకిది మొదటి పెళ్లి కాదు. మళ్లీపెళ్లి.
గదిలో కింగ్ సైజు మంచంమీద మల్లెపువ్వులు పరిచినట్లున్న తెల్లని దుప్పటి.
రాగిణి మంచంమీద ఓపక్కగా పడుకుని ఆలోచిస్తోంది.
మొదటి పెళ్లిలో మొదటి రాత్రి, “మనది సహజీవనమే కానీ దాంపత్యం కాదు. నేనెప్పుడు నీకు నచ్చకపోతే అప్పుడు విడాకులిస్తాను. నన్ను విడిచి ఉండలేనని నీకనిపించిన రోజున మనం మళ్లీపెళ్లి చేసుకుని, కొత్త దంపతుల మౌదాం” అన్నాడు త్యాగరాజు.
విచిత్రంగా అనిపించినా అప్పటికి, “ఊఁ” అని ఊరుకుందామె. ఐతే- అతడు లేకుండా తనుండలేనని మర్నాడే భర్తకి చెబ్దామనుకుంది. కానీ ఏదో సంకోచం ఆమెను ఆపింది.
అలా రోజులు, వారాలు, నెలలు, ఏళ్లు గడిచాయి. అతడితో ఆ మాటనడానికి సంకోచిస్తూనే ఉందామె.
లోకానికి దంపతులుగా, తమకితాము సహజీవనపు జంటగా కొనసాగుతున్నారు వాళ్లు.
మళ్లీపెళ్లికోసం త్యాగరాజు ఆత్రుతగా ఎదురుచూస్తున్నాడని ఆమెకు తెలుసు. కానీ మనసు చంపుకుని దాచిన ఆ రహస్యం- మొదటి పెళ్లిని ఇన్నేళ్లు కాపాడింది.
అది తెలిస్తే రెండో పెళ్లి ఒక్కరోజైనా నిలబడదని ఆమె భయం.
సహనం నశించిందేమో, ఒకరోజు త్యాగరాజు ఆమెతో, “నేను లేందే ఉండలేనని అనొద్దులే! మనం మళ్లీపెళ్లి చేసుకుందాం” అన్నాడు.
ఆమె వెంటనే, “మీరు లేకుండా నేనుండలేను. మీరొద్దన్నా ఆ నిజమెలా దాచేది?” అని పరోక్షంగా అంగీకారం చెప్పింది.
నెల తర్వాత మళ్లీపెళ్లి జరిగేదాకా అతడామెతో ముభావంగా ఉంటున్నాడు. మంచంమీద ఆమెకు దూరంగా పడుకుంటున్నాడు.
రాగిణిలో ఎన్నో సందేహాలు.
తన రహస్యం తెలిసిపోయిందా? తెలిస్తే ఎలా తెలిసింది?
ఆ ఉత్తరాలు చదివాడా? చదివితే కాలరుద్రుడవాలి కానీ, ఇలా ప్రశాంతంగా మాట్లాడగలడా….
కాసేపటికి త్యాగరాజు రావడంతో ఆమె ఆలోచనలకు బ్రేక్ పడింది.
వచ్చినవాడు మంచంమీద ఆమెకు విముఖంగా పడుకున్నాడు.
ఇటు తిరుగుతాడని కాసేపు ఎదురుచూసి తనే అతడికి దగ్గరగా జరిగి నడుంమీద చెయ్యి వేసింది రాగిణి.
అతడిలో చలనం లేదు.
“మెలకువగానే ఉన్నారని తెలుసు. బెట్టు చేస్తున్నారా?” అందామె.
అతడు చటుక్కున లేచి కూర్చుని, “బెట్టెందుకు చేస్తాను? దేవతలు వరాలిచ్చినా కాదనొచ్చు. కానీ ఆడది వరమిస్తే కాదనరాదని పురుష సూక్తం” అని నవ్వాడు త్యాగరాజు.
ఉలిక్కిపడిందామె.
ఈ పురుష సూక్తం అతడికెప్పుడు, ఎలా తెలిసింది?
తను అనుమానిస్తున్నట్లు- తను దాచుకున్న లేఖలు చదివేడా?
“మరి అలా దూరంగా వెళ్లి పడుకున్నారు?” అందామె.
“కొంత వయసు. కొంత మనసు” అనాసక్తంగా బదులిచ్చాడతడు.
“ఏమో, నాకైతే అంతా మీ మనసుదే అనిపిస్తోంది”
“నా మనసుని పక్కనెట్టు. ముందు నీ మనసు నడుగు, ‘భార్య తల్చుకుంటేనే కదా, భర్తకి మూడొచ్చేది’ అనకపోతే నన్నడుగు”
‘అనుమానం లేదు. ఈయన ఆ ఉత్తరాలు చదివారు. చదివానని హింటివ్వడానికే వాటిలోంచి కోట్ చేస్తున్నారు’ అనుకుంది రాగిణి.
ఆ హింటులోనే అభయం కూడా ధ్వనిస్తోంది. కానీ అది తనచేత నిజం చెప్పించే చిట్కా ఏమో!
సంకోచిస్తూనే, “ఏమైతే అయింది. మొత్తం చెప్పేస్తాను” అనుకుంది రాగిణి.
‘రాగిణి నిజం చెబుతుంది. నేనూ దాచకుండా ఆమెకి నా గురించిన నిజం చెప్పెయ్యాలి’ అనుకున్నాడు త్యాగరాజు.
- - - - -
ప్రేమ- అంటే గడ్డకట్టే మంచుపర్వతం. మోహం అంటే బద్దలయ్యే అగ్నిపర్వతం. వీటి సమన్వయమే మనిషి జీవితం.
ఆ జీవితంలో ఫైనల్ పంచ్ ప్రేమదైతే ఆ కిక్కే వేరు.
అందుకు త్యాగరాజు జీవితమొక మచ్చుతునక.
ఎంబియ్యే చదివే రోజుల్లో, కాలేజిలో అతడికి జూనియర్ నిర్మల.
చదువైన వెంటనే వ్యాపారంలో దిగేడతడు. అప్పుడు నిర్మల ఎంబియ్యే కోర్సులో భాగంగా అతడి ఆఫీసులో అప్రెంటీసుగా చేరింది.
అప్పుడు అనూహ్యంగా అతణ్ణి ప్రేమ కుట్టింది. వెంటనే ఐ లవ్యూ చెప్పాడు.
అంత వెంటనే “మీ టూ” అంది నిర్మల కూడా. ఆ వెంటనే, ‘పిబరే ప్రేమ రసం’ అని పాడింది.
అంతే, ప్రేమ మోహమైంది. అతడి ‘న భయం’ని, ఆమె ‘న లజ్జ’తో ప్రోత్సహించింది.
ఇద్దరూ అతడి గెస్టుహౌసులో ఒక్కటయ్యారు.
తర్వాత త్యాగరాజు నొచ్చుకుని సారీ చెప్పాడు.
బదులుగా, “సారీ చెప్పి నా ఇష్టాన్ని శంకించావు. నేను హర్టయ్యాను” అందామె.
ఆమె ఇష్టపూర్వకంగానే తనకు దగ్గరయిందని అర్థమై త్యాగరాజు మురిసిపోయి, సారీ చెప్పినందుకు సారీ చెప్పాడు.
“ఇప్పుడు కాదు. మనం మళ్లీ కలుద్దాం. అప్పుడు సారీ చెప్పకపోతేనే, నువ్వు నా ఇష్టాన్ని గౌరవించినట్లు” అందామె.
అదతడి ‘న భయం’కి’ అభయం. ఆమె ‘న లజ్జ’కి పూల సజ్జ.
ఇద్దరూ అదే గెస్టుహౌసులో మళ్లీ ఒకటయ్యారు.
ఈసారీ సారీ చెప్పాలనిపించినా- ఎలాగో తమాయించుకున్నాడతడు.
ఐతే ఈసారి అతడు సారీ చెప్పలేదని హర్టయ్యానందామె. “మొదటిసారే హింటిచ్చాను. నువ్వు సారీ చెబితే, మనం మళ్లీ దగ్గరవాలని! సారీ చెప్పలేదనుకో- ఇంకోసారి దగ్గరవడం నీకిష్టం లేదనేగా! అంటే నేను నీకు నచ్చలేదు. అందుకే హర్టయ్యాను” అదీ ఆమె వివరణ.
అప్పుడామె గొంతులో ‘ఊఁ అంటావా, ఉఊఁ అంటావా’ అన్న ఇంద్రావతి చౌహాన్. కదలికల్లో సమంత.
అతడామెను చటుక్కున దగ్గరగా తీసుకుని, ‘సారీ’ అన్నాడు.
నెల్లాళ్లలో వాళ్లు ‘సారీ’ లతో నిమిత్తం లేని ఏకాంతాలు ఎన్ని అనుభవించారో!
ఒకరోజు అతడామెతో, “నువ్వు లేకుండా బ్రతకలేను. మనం పెళ్లి చేసుకుందాం” అన్నాడు.
“నేనుంటాను కాబట్టి, నువ్వు బ్రతకడానికే ఇబ్బందీ లేదు. ఇక పెళ్లంటావా- మనకది అవసరమా?” అందామె.
“అవసరమే! నాకు భార్య కావాలి. మా ఇంటికి కోడలు కావాలి. మా వంశానికి వారసులు కావాలి….” ఇంకా చెబుతుండగా, అతణ్ణి మధ్యలో ఆపి, “వారం రోజులు టైమివ్వు. ఆలోచించి చెబుతాను” అంది నిర్మల.
వారం రోజులూ ఇద్దరూ మరిన్ని ఏకాంతసేవల్లో గడిపారు.
తర్వాత ఆమె అతడికి కనబడ్డం మానేసింది.
ఫోన్ చేస్తే తియ్యడంలేదు. వాకబు చెయ్యగా తను అమెరికా వెళ్లిపోయినట్లు తెలిసింది.
మరికాస్త వాకబు చేస్తే-
అమెరికా వెళ్లడం ఆమె కల.
ఓ బ్రోకరు ద్వారా అక్కడి యూనివర్సిటీలో సీటు సంపాదించింది. బ్రోకరు కమిషనూ, టికెట్ డబ్బులూ, అమెరికాలో ఆర్నెల్లుండడానికి సరిపడ డాలర్లూ- అన్నీ కలిపి ఖర్చు లక్షల్లో ఉంది. ఆ డబ్బుని ఆమె త్యాగరాజునుంచి సంపాదించింది.
“తెలియకుండా, ఆమెపై ఇంత ఖర్చు పెట్టానా?” అనుకున్నాడు త్యాగరాజు.
ఐతే ఆ డబ్బతడికి లెక్కలోది కాదు. పోయిందన్న చింతా లేదు. వళ్లూ పై తెలీకుండా అంత డబ్బు ఆమెపై ఖర్చు చేశాడంటే- తనది ప్రేమా, మోహమా అన్నది తేల్చుకోలేక మధనపడుతున్నాడు.
ఇంకో అనుమానమూ వేధిస్తోందతణ్ణి.
నిర్మలని తనిష్టపడ్డమాట నిజం. ఐతే పెళ్ళయ్యాకే తప్ప, పెళ్లికిముందే పొందాలనుకోలేదు.
కావాలని రెచ్చగొట్టి తనని వశపర్చుకుందని అర్థమైనా, అతడికామెపై చులకన భావం కలుగలేదు. ఆమె శాశ్వతంగా తన సొంతం కాలేదని బాధ పడ్డాడు.
నిర్మల కూడా డబ్బుకోసమే అలా చేసిందనిపించదు. తన వాంఛకి అతణ్ణి సాధనంగా చేసుకుంది.
నిర్మల చెలరేగిపోతుంటే, ఆనందించడమే తప్ప- ఆమె విషయంలో తను చెలరేగిపోవడం అతడికి గుర్తులేదు.
“యు ఆర్ వెరీ అన్‌రొమాంటిక్” అని ఒకటి రెండుసార్లు ఆమె అనడం మాత్రం గుర్తుంది.
“నిర్మల నా విషయంలో డిజప్పాయింటైందా? అందుకే అమెరికా వెళ్లిపోయిందా?” అన్న అనుమానం అతడిలో కలిగింది.
ఏదేమైనా నిర్మల ఎపిసోడ్ జీవితంలో పెద్ద షాక్ అతడికి. నెలలు గడుస్తున్నా అదింకా అడపా తడపా చురుక్కుమంటూనే ఉంది.
ఈలోగా పెద్దలు అతడికోసం రాగిణిని చూశారు.
రాగిణి అతడికంటే ఎనిమిదేళ్లు చిన్నది. చూడగానే నచ్చింది.
అతడామెతో ఏకాంతంగా మాట్లాడుతూ, “చూడగానే నచ్చావు. నీకూ నేను నచ్చితే పెళ్లికి ఓకే చెబుదాం. ఎటొచ్చీ నాదో షరతు. నీ గతం గురించి నేనడగను. నా గతం నువ్వడక్కూడదు. ఇక నీ షరతులేమైనా ఉంటే చెప్పు” అన్నాడు.
ఆమె అతడి షరతుకి ఒప్పుకుంది. తనకి షరతులేం లేవంది. వాళ్ల పెళ్లి జరిగింది.
మధ్యతరగతి అమ్మాయి. సంప్రదాయపు కట్టుబాట్లలో పెరిగింది. రాగిణి శీలంపై త్యాగరాజుకు నమ్మకమే! అందుకని ముందరి కాళ్లకు బంధమేశా ననుకుని పప్పులో కాలేశాడు.
ఎందుకంటే రాగిణికి గతముంది. అందులోనూ ప్రేమ, మోహం- రెండూ ఉన్నాయి….
రాగిణి రూపసి. పక్కవాటాలోని ఇంజనీరింగ్ స్టూడెంటు సాత్విక్‌ని ఆకర్షించినప్పుడు ఆమె వయసు పద్నాలుగు.
అతడామెకంటే నాలుగేళ్లు పెద్ద. కొన్ని సబ్జక్ట్సులో డౌట్సు క్లియర్ చేసుకుందు కతణ్ణి సాయమడగమని కన్నవారే ప్రోత్సహించారామెని.
రాగిణి అందం సాత్విక్ మాటల్లో చిత్రకారుడి ఊహల్ని పలికించింది. ఆమె సాన్నిహిత్యం అతడిలోని భావుకతకు మెరుగులు దిద్దింది.
రాగిణిది మొగ్గ వయసు. అతడి సమక్షం ఆమెను పరవశింపజేసేది. అతడి మాటలు ఆమెని ప్రభావితం చేసేవి.
కళ్లు, ముక్కు, పెదవులు, నడకలతోమొదలైన వర్ణనల్లో- క్రమంగా అంగాల అసెంబ్లీకి విస్తరించేటంతగా చిలిపితనం చోటు చేసుకుంది. భాష పురాణాలనుంచి ప్రబంధాలకు మారి, అప్పుడప్పుడు అసెంబ్లీలో నేతల స్థాయికి చేరుతోంది. చేతలు- చేతులు తగలడంతో మొదలై పెదవుల కలయిక వరకూ వచ్చాయి.
ఆ ఆకర్షణ ప్రేమో, కాదో- వయసు దాన్ని మోహంగా మలుస్తోంది. దగ్గరవడానికి వీలైనంత ప్రైవసీ లేకపోవడంవల్ల వారి మోహం ఇంకా- ‘న భయం’ స్థాయికి చేరుకోలేదు. కానీ మనసుంటే కనీసం ‘న లజ్జ’ మార్గముండదా?
తన అందాన్ని అతడిముందు ఆవిష్కరించడానికి ఆమె సంకోచించేది కాదు.
పక్కపక్క వాటాలు. పెద్దల నమ్మకం. ట్యూషన్ సాకు. ఇద్దరి సరససల్లాపాలకూ వీలు కల్పించాయి. మొహమాటం తగ్గింది. చిలిపిచేష్టలు పెరిగాయి. స్నానాల గదుల్లోకి తొంగి చూడడమూ రెండుమూడు సార్లు జరిగింది.
మానసికంగా సంకోచాలు తొలగిపోగా, భౌతికంగా దగ్గరవాలన్న ఆత్రం మొదలైంది.
అప్పుడే వారికో అవకాశమొచ్చింది.
ఆ సాయంత్రం రాగిణి ఇంట్లో రాగిణి ఒక్కతే ఉంది. సాత్విక్ ఇంట్లో అతడొక్కడే ఉన్నాడు.
వాళ్ల రెండు వాటాలకూ లోపల ఓ గదికి తలుపు కామన్.
ఆ రోజు రాగిణి గడియ తీసి తలుపు తెరిచింది. సాత్విక్ గదిలోకొచ్చాడు.
అప్పుడు ఇద్దరికీ మనసు తలుపులు కూడా తెరచుకున్నాయి.
అతడిది వయసు. ఆమె ముగ్ధ. ఆపైన ఇద్దరి మధ్యా ఏడాదిగా ఏర్పడిన మానసిక సాన్నిహిత్యం.
ఇద్దరూ ఒకే మంచంమీద ఒకరికొకరు దగ్గరగా, మరింత దగ్గరగా చేరిపోతున్న సమయంలో కాలింగ్ బెల్ మ్రోగింది.
రసభంగమైంది.
సాత్విక్ పరుగున తనింట్లోకి వెళ్లాడు. ఆమె వెంటనే తీసిన తలుపులు మూసింది.
మళ్లీ ఏకాంతం దొరకలేదో, లేక వివేకం అప్పటికి మేల్కొందో, లేక పెద్దవాళ్లు పసికట్టారో-
ఆ మూసిన తలుపులు తెరుచుకునే అవకాశం మళ్లీ రాలేదు.
చదువయ్యేదాకా సాత్విక్ అప్పుడప్పుడు ఉత్తరాలు వ్రాసేవాడామెకు. వాటిలో ఆమె అందాల్ని ప్రస్తావించి, ఏ అందం తనలో ఎలాంటి స్పందన కలిగిస్తుందో కవిత్వంలా చెప్పేవాడు.
ఓ ఉత్తరంలో- ‘నీ అందం అద్భుతం. ఆ అందంతో దైవత్వాన్ని సంతరించుకున్న నువ్వో అపురూపం. దైవత్వాన్ని సుప్రభాతంతో ఆరాధించడం మన సంప్రదాయం’ అని వ్రాస్తూ ఆమెపై తానల్లిన కవితల్ని పొందుపరిచాడు.
మరో ఉత్తరంలో, ‘నువ్వు నన్ను మరచినా, నేను నిన్ను మరువను. నా జీవితమొక తపస్సు. నువ్వు ప్రత్యక్షమై వరమిచ్చేకనే అది సార్థక మౌతుంది’ అంటూ తనెలా జీవితాన్ని సార్థకం చేసుకుంటాడో రసాత్మకంగా వివరించాడు.
‘నీకందిన దైవత్వం నాకందలేదేమో- నిన్నందుకునే అర్హత నాకు దక్కకుండా పోయింది’ అన్నదతడి చివరి ఉత్తరం.
బాల్య యౌవన చాపల్యాలనుంచి బయటపడి వాస్తవానికొచ్చారేమో- మళ్లీ వాళ్లు కలుసుకోలేదు. ఆమె అతడి ఉత్తరాలు మాత్రం దాచుకుంది. త్యాగరాజుతో పెళ్లయ్యేక- పుట్టింటి సారెతో పాటు- వాటినీ కూడా తీసుకెళ్లింది.
- - - - -
“నన్ను క్షమిస్తారా?” అంది రాగిణి. త్యాగరాజామెను దగ్గరకు తీసుకుని, “క్షమించే అర్హత నాకేది కానీ, ఓ విషయంలో నాకెంతో అసంతృప్తిగా, బాధగా ఉంది. ఇన్నేళ్లుగా నాతో కాపురం చేస్తున్నా, నువ్వు సాత్విక్‌ని మర్చిపోలేదు. నీ మనసులో నా స్థానం అతడి తర్వాతే! అది నిజం కాదని నువ్వన్నా నేన్నమ్మను. రోజూ ఏదో సమయంలో- ముఖ్యంగా నావద్దకొచ్చేటప్పుడు- నువ్వా ఉత్తరాలు చదవడం నేను గమనించాను” అన్నాడు.
రాగిణి నిట్టూర్చి, “ఐతే మీకో విషయం చెప్పాలి. ఇప్పుడు మీరు చెప్పేక కాదు. మన పెళ్లికిముందే నిర్మల విషయం నాకు తెలుసు. మన పెళ్లి గురించి తెలిసి- తనే ఫోన్ చేసి మీ ఇద్దరి అనుబంధం గురించి వివరంగా చెప్పింది” అంది.
తెల్లబోయిన త్యాగరాజు, “అంటే- అంతా తెలిసీ నాతో పెళ్లికి ఒప్పుకున్నావా? ఎందుకు- డబ్బు కోసమా?” అన్నాడు.
రాగిణి నవ్వి, “డబ్బుకి ఆశ పడలేదని అబద్ధం చెప్పను. కానీ మనసులోంచి సాత్విక్‌ని చెరిపెయ్యలేని బలహీనత నన్ను దోషిని చేసింది. మిమ్మల్ని సరైన జోడీగా భావించడం న్యాయమనిపించింది. నిజం చెబుతున్నాను- కాపురానికొచ్చేక, జీవితాంతం మీతోనే గడపాలని అనిపించింది. కారణం భారతనారీ సంప్రదాయం కావచ్చు. మీ వ్యక్తిత్వం కావచ్చు” అంది.
“ఐనా సాత్విక్‌ని మనసులోంచి తీసెయ్యలేకపోయావు!” నిలదీశాడు త్యాగరాజు.
“అందుకు నిర్మలే కారణం” అంది రాగిణి.
అప్పుడామె చెప్పింది విని తెల్లబోయాడు త్యాగరాజు
నిర్మల అభిప్రాయంలో త్యాగరాజు వ్యక్తిగా మంచివాడే! కానీ ఆడదాని విషయానికొస్తే-
అతడికి ప్రేమంటే తెలియదు. ఆత్రమే తప్ప ఆర్ద్రత ఎరుగడు.
మానసికంగా అలరించే సరసం లోపిస్తే, అనుభవం విరసమై వికటిస్తుందని గ్రహించడు. ఆ విషయం చెబితే జీర్ణించుకోలేడు.
డబ్బుతో అన్నీ సద్దుకుంటాయని అతడి నమ్మకం.
“కంపాటిబిలిటీ సాధ్యం కాదని నమ్మకం కుదిరేక, నేనతడి డబ్బుని ఆసరా చేసుకుని అమెరికా వెళ్లిపోయాను. ముందు జాగ్రత్తగా నీకీ విషయం చెప్పి హెచ్చరించాలనిపించింది. ఆపైన నిర్ణయం నీది” అంది నిర్మల రాగిణితో.
త్యాగరాజు ముఖం మాడిపోయింది.
నిర్మల తనని కాదనడానికి ఇలాంటి కారణమొకటి ఉండొచ్చని అనుమానమొచ్చినా- ఆమె తనని మరీ ఇంత దారుణంగా విశ్లేషిస్తుందని అతడూహించలేదు.
ఆపైన అదే వ్యాఖ్య మరో ఆడదాని నోట వినడం మరింత బాధాకరమైంది.
ఆ ఆడది తనతో ఎన్నో ఏళ్లుగా కాపురం చేస్తున్న భార్య.
చెప్పిన పద్ధతిని బట్టి రాగిణి నిర్మల అభిప్రాయంతో ఏకీభవించినట్లే ఉంది.
“అందుకేనా- ఇప్పటికీ సాత్విక్ వ్రాసిన ప్రేమ లేఖ చదువుకుని తృప్తి చెందుతున్నావు?” అడిగాడతడు దీనంగా.
“మీరు ప్రేమలేఖ అంటున్నది నాకు ప్రేమగీత. సహోదరులతో పోరాటానికి విముఖుడైన విజయుణ్ణి యుద్ధానికి సుముఖుణ్ణి చేసిన భగవద్గీతలా- అది మన సహజీవన సౌభాగ్యానికి గొప్ప ప్రోత్సాహకం” అంది రాగిణి.
“అర్థం కాలేదు” అన్నాడు త్యాగరాజు.
“ఆ లేఖల్లో నాకు మహాకవి కాళిదాసు, అల్లసాని పెద్దనామాత్యుడు, శ్రీనాధ కవిసార్వభౌముడు సాక్షాత్కరిస్తారు. సాత్విక్ స్ఫురించడు” అని ఓ క్షణమాగి, “నిర్మల మీ గురించి చెప్పిందాంట్లో నిజమెంత- అన్నది పక్కన పెడితే- మన పెళ్లయిన మర్నాటినుంచే భార్యగా నేను మిమ్మల్ని ఇష్టపడ్డానన్నది పూర్తి నిజం. ఆ ఇష్టం ప్రేమగా మారడమూ నిజం. ఆ ప్రేమ నిలబెట్టుకుందుకు సాత్విక్ లేఖల్ని ఆసరా చేసుకున్నాను. వాటిలో మధురమైన ప్రేమ ఉంది. కరిగించే ఆర్ద్రత ఉంది. అలరించే సరసముంది. అవి చదివితే కలిగే ప్రేమానుభూతి- మీ ఆత్రానికి నన్ను మానసికంగా సన్నద్ధం చేస్తుంది” అంది రాగిణి.
ఆ లేఖల ప్రయోజనం అవగాహన కావడానికి త్యాగరాజుకి కాసేపు పట్టింది.
అతడామెను చటుక్కున కౌగలించుకుని, “అర్థమైంది ప్రియా! ఇష్టమంటే ఆహ్లాదాన్నిచ్చే ప్రేమాలింగనం. ప్రేమని అనుసరించని మోహం నరకాన్ని చూపే అత్యాచారం. ప్రేమ, మోహం- పాలూ నీళ్లలా కలిసిపోతేనే దాంపత్య జీవితం సమ్మోహనం. నేనిది చాలా ఏళ్లకు ముందే గ్రహించి ఉంటే ఎంత బాగుండేది?” అన్నాడు.
“ప్రేమ ఎప్పుడైనా ఆహ్లాదకరమే! మీరు నన్ను ప్రియా అని మొదటిసారి పిలిచారు. ఆ పిలుపు ఈ వయసులోనూ ఎంత బాగుందో” అంది రాగిణి.
ఆమె ఇంకా ఏదో అనబోయేదే-
మంచంమీదనే ఉన్న ఐప్యాడ్ నుంచి విడియో కాల్‌ని సూచిస్తూ గంట మోగింది.
ఓపెన్ చేస్తే-
“షష్టిపూర్తి దంపతులకు మరోసారి శుభాకాంక్షలు” అని పెద్దగా కోరస్.
వేర్వేరు ప్రాంతాల్నించి విడియో కాన్ఫరెన్సులో చేతులూపుతున్న రెండు యువజంటలు, ఆ జంటల సంతానంగా టీనేజిలోపులో ఓ అబ్బాయి, అమ్మాయి.
రాగిణి తనకి ప్రేమకానుకగా ఇచ్చిన కొడుకునీ, కూతుర్నీ అబ్బురంగా చూశాడు త్యాగరాజు.
ఇద్దరివీ అచ్చుగుద్దినట్లు తండ్రి పోలికలు.
ఆప్యాయంగా భార్యవైపు చూస్తే- ఆమె తమ బిడ్డల్ని మాత్రమే కాదు- కోడల్నీ, అల్లుణ్ణీ, మనుమణ్ణీ, మనుమరాల్నీ కూడా మురిపెంగా చూస్తోంది.
అప్పుడా దంపతులు తమ పరివారానికి చేతులూపుతున్నారు.
మోహానికి అతీతమైన ఆ ప్రేమను ఆస్వాదిస్తూ- ‘జీవితంలో ఫైనల్ పంచ్ ప్రేమదైతే, ఏ వయసులోనైనా ఆ కిక్కే వేరు’ అనుకున్నాడు త్యాగరాజు.
---0---
వసుంధర గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
వసుంధర పరిచయం:మేము- డాక్టర్ జొన్నలగడ్డ రాజగోపాలరావు (సైంటిస్టు), రామలక్ష్మి గృహిణి. రచనావ్యాసంగంలో సంయుక్తంగా ‘వసుంధర’ కలంపేరుతో తెలుగునాట సుపరిచితులం. వివిధ సాంఘిక పత్రికల్లో, చందమామ వంటి పిల్లల పత్రికల్లో, ‘అపరాధ పరిశోధన’ వంటి కైమ్ పత్రికల్లో, ఆకాశవాణి, టివి, సావనీర్లు వగైరాలలో - వేలాది కథలు, వందలాది నవలికలూ, నవలలు, అనేక వ్యాసాలు, కవితలు, నాటికలు, వినూత్నశీర్షికలు మావి వచ్చాయి. అన్ని ప్రక్రియల్లోనూ ప్రతిష్ఠాత్మకమైన బహుమతులు మాకు అదనపు ప్రోత్సాహాన్నిచ్చాయి. కొత్త రచయితలకు ఊపిరిపోస్తూ, సాహిత్యాభిమానులకు ప్రయోజనకరంగా ఉండేలా సాహితీవైద్యం అనే కొత్త తరహా శీర్షికను రచన మాసపత్రికలో నిర్వహించాం. ఆ శీర్షికకు అనుబంధంగా –వందలాది రచయితల కథలు, కథాసంపుటాల్ని పరిచయం చేశాం. మా రచనలు కొన్ని సినిమాలుగా రాణించాయి. తెలుగు కథకులందర్నీ అభిమానించే మా రచనని ఆదరించి, మమ్మల్ని పాఠకులకు పరిచయం చేసి ప్రోత్సహిస్తున్న మనతెలుగుకథలు.కామ్ కి ధన్యవాదాలు. పాఠకులకు మా శుభాకాంక్షలు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత్రి బిరుదు పొందారు.
Comentarios