top of page
Writer's pictureMeena Kumari

మా అత్తగారు వచ్చిందోచ్..



'Maa Athhagaru Vachhindoch' - New Telugu Story Written By Meena Kumari

Published In manatelugukathalu.com On 22/08/2024

'మా అత్తగారు వచ్చిందోచ్..' తెలుగు కథ

రచన: మీనా కుమారి

కథా పఠనం: పద్మావతి కొమరగిరి



రిక్షా దిగుతున్న అత్తగారిని చూసి అర్చన.. “ఇంత కష్టపడి మీరు.. ఇలా” అనుకుంటూ, ఎదురు వెళ్ళింది..


“ఏమిటి అర్చన.. రిక్షావాడు.. ఈ కాస్త దూరానికి..డబ్బులు ఇంత పెంచేసాడు....” అని.. జయలక్ష్మి గారు అంటూ ఉంటే..,

“చూడండమ్మా.. మీలా ఉంటే, కొద్దిగా తగ్గిద్దును...మీ అత్తగారిని చూశారు కదా! అలా ఉంటే....” అని నసుగుతూ.. “అసలే కొండ దారిలో..రోడ్డు ఎక్కాలంటే..ఇబ్బందిగా ఉంటది కదా అమ్మ.. అందుకే ఒక ఐదు రూపాయలు.. ఎక్కువే.. అడిగా” అని చెప్తున్న రిక్షావాడి వైపు చూసి.., సరే అంటూ అత్తగారిని లోపలికి పంపించి, రిక్షా వాడికో.. పది రూపాయలు ఎక్కువే ఇచ్చి పంపించింది అర్చన.


“సరిపోయింది! కొడుకు ఇష్టపడిన పెళ్లి చేసిన దానివి.. బొత్తిగా చిక్కిపోయావ్ ఏమిటే...

నేను పిలిస్తేనే, ఇప్పటికీ భయపడుతూ ఉంటావు. ఇక ఈరోజుల్లో... ప్రేమపెళ్లి అంటూ..

వచ్చే కోడలు పిల్ల విషయంలో, నువ్వు భయం ఏం పెడతావే.. దానికి కూడా... నువ్వే భయపడుతున్నావా?” అంటున్న జయలక్ష్మి గారి మాటకు నవ్వి, మూసి ఉన్న గది తలుపుల వైపు చూసింది అర్చన.


“అర్థమైంది లేవే... పిల్లల గురించి అడగను.. మీమావయ్య పోయేముందు ఒక మంచి మాట చెప్పాడుగా. నీ కోడళ్ల వరకు చూసుకో చాలు.. అని. హా… ఆ విషయాలు నాకు వద్దులే..” అని అంటున్న అత్తగారి వైపు మెచ్చుకోలుగా చూసింది అర్చన..


“ఆ రోజుల్లో  నేను ఇబ్బంది పెట్టినట్లు అనిపించినా మీకు.. బారెడు పొద్దెక్కినా నిద్రలేవకపోతే ఈ బద్దకాలు అవి అలవాటు అవుతాయి అనే కదా! 4:30 కి నిద్ర లేపేదాన్ని.. మీ.. పిల్లల్ని లేపే దాన్ని.. వాళ్ళు చక్కగా చదువుకోవడం వల్ల, డొనేషన్లు కట్టకుండా చక్కగా చదువులు ముగించారు.

నా కొడుక్కి ఇబ్బంది లేకుండా పోయింది. ఖర్చులే గాని సంపాదించటం తక్కువ కదా మీ మామగారు పంచిన ఆస్తులు ఏమున్నాయి మనకు? నా కొడుకు ఉద్యోగం సంపాదనే కదు మనకు..” అంటున్న అత్తగారి వైపు “మీరు కూడా అప్పడాలు వడియాలు పచ్చళ్ళు, కూరలు ఇలాంటివన్నీ కూడా చేసి కొడుక్కి పోటీ ఇచ్చేవారు కదా సంపాదనలో” అంటూ నవ్వేసింది అర్చన..


“ఇక్కడ ఇలా ఉంది.. చిన్నోడి పిల్లలే ఎటు కాకుండా తయారయ్యారే బాబు.. సరేలే..

ఆ సంగతులు.” అని తనకు తానే, మళ్లీ తన పెద్ద కొడుకుని మెచ్చుకుంటూ ఉన్నారు.


“మీ మామగారు తీరు కాదు కదా..నా కొడుకు ఉత్త.. అమాయకుడు.. నాలాగా.. కష్టజీవి.. అటు పొలం పని చూసుకుంటూ, ఇటు చదువుకొని ఉద్యోగం సంపాదించిన వాడు..మీ మామకు ఉన్న అలవాట్లు.

నా బిడ్డలకు అబ్బలేదు సంతోషం....” అన్నారు జయలక్ష్మి గారు.


“వేడి,వేడిగా ఫిల్టర్ కాఫీ తీసుకురావే..” అంటూ, తప, తప..లాడుతున్న.. అత్తగారికి..వేగంగా ఫిల్టర్ కాఫీ తెచ్చి ఇచ్చింది అర్చన.


“ఏమిటి ఇది.. ఫిల్టర్ కాఫీ ఇంత వేగంగా తెచ్చావు?” అని అడుగుతూ ఉంటే,


“కోడలు పిల్ల వచ్చింది కదా అత్తమ్మ.. రోజు ఫిల్టర్ కాఫీ..  కాసి ఇంత సమయం వృధా  ఎందుకు అని, ఒకేసారి.. కొన్ని రోజులకు సరిపడా ఫిల్టర్ కాఫీ ని, శుభ్రంగా..కాసి..వడగట్టుకుని.. ఫ్రిజ్లో పెట్టుకుంటే, ఎప్పుడు కావాలంటే,అప్పుడు చక్కగా వేడి, వేడి పాలల్లో.. వేడి పెట్టి కలుపుకోవచ్చు అని చెప్పింది కోడలుఅను..సులభం అయింది” అన్నది అర్చన..


“అయినా అంత రుచి ఉంటుంది అంటావా” అని కాఫీ తాగుతూ,

“పరవాలేదు... బాగానే ఉందిగా రుచి.. పరవాలేదు, మంచి చెడ్డ చూసుకుంటుంది అన్నమాట..

కోడలు పిల్ల” అంటూ నవ్వారు జయలక్ష్మి.


“ఈ రోజుల్లో పర్వాలేదు అని చెప్పాలి అత్తమ్మ” అన్నది అర్చన.


‘అక్కడ వాళ్ళు బాగున్నా’రా అని అడగాలంటే..ఏం అడుగుతుంది?

అందుకే మౌనంగా ఉండిపోయింది.


“సరేగాని, నీకు ఒక మాట చెప్పాలే.. అర్చన...నేను వెళ్లేటప్పుడు.. 

మీ పరుపు కింద ఒకటి పెట్టి మర్చిపోయాను.. అది నీకే ఇవ్వాలని.. అనుకున్నాను..” అంటూ లోపలికి వెళుతున్న అత్తగారిని భయంతో అనుసరించింది అర్చన..


పరుపు ఎత్తడమే సిగరెట్ ప్యాకెట్ కనిపించింది.

ఏమిటి ఇది అంటూ ఉన్న.. అత్తగారికి ఏం సమాధానం చెప్పాలా అనుకుంటూ ఉండగానే..,


ఆ పక్కనే ఒక చిన్న ఆల్బమ్ కనిపించేసరికి “ఎవరి ఫోటోలు.. హా.. నీ కోడల్ని నేను చూడలేదుగా..

నా పెద్ద మనవడి.. పెళ్లి ఫోటోలా” అంటూ ఉంటే,

అర్చన “వద్దు అత్తయ్య గారు” అని చెబుతున్న వినకుండా,

జయలక్ష్మి గారు.. అదే పందిరి మంచం మీద ఎగిరినట్లు కూర్చొని, ఆ ఆల్బమ్ తీసుకొని చూస్తున్నారు.


మొదటి పేజీ తీయగానే,


“నాకు పుట్టిన పెద్దకొడుకు వాడి అందం.. నీ కొడుకులకు రాలేదులేవే....కోపగించుకోకు. పరవాలేదు తాత పోలికలు వచ్చాయిలే నా మనవళ్లకు..” అంటూ నవ్వుకుంటూ రెండో పేజీ తీసింది..


ఒకసారిగా ఆమె ముఖం మాడిపోయింది.

అక్కడ.. తన గారాల పెద్దకొడుకు ఒక చేత్తో మందు గ్లాసు, మరొక చేతిలో సిగరెట్టు.. 


“ఏమిటే.. కొత్త అలవాట్లు.. నేను వెళ్లి ఎన్నాళ్ళు అయిందని? ఇటువంటి మార్పులు వచ్చేసాయి!! ఇంట్లో..” అంటున్న అత్తగారి మాటలకు ‘వాళ్ళ నాన్నగారు పోయిన రోజు ఆయనకు ఇష్టమని, అవన్నీ మామయ్య గారి పటం దగ్గర దండం  పెట్టి, రహస్యంగా..  సిగరెట్ తాగుతూ.. ఆ ఒక్కరోజు మాత్రమే డ్రింక్  చేస్తారు డాబా మీద... అత్తయ్య గారు..నిద్రపోయాక.. ఇప్పుడు ఆవిడ లేరు కదా అని ఇలా చేశారు.. ఈవిడేమో అన్ని చూశారు.. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏమిటో..’

అని అనుకుంటూ ఉండగానే.., రుస,రుసలాడుతూ.. “వాడిపని ఏంటో.. ఆఫీస్ కి వెళ్లి. తేల్చేస్తాను..

అమ్మ.. ఎంత మారిపోయాడు..కొడుకు అయితే మాత్రం, గారాబమయితే మాత్రం,

వదిలిపెడతానా ఏమిటి..”  అంటూ ఉన్న అత్తగారు.. అటుగా వస్తున్న రిక్షా ఎక్కి వెళ్ళిపోయారు.


‘అత్తయ్యా... అత్తయ్యా!’  అంటూ ఉన్నా లెక్క చేయలేదు..

‘అమ్మా,. అమ్మా..’ అంటూ పిలుస్తున్న.. భర్త పిలుపుకి,

భర్త చేతి మీద  తట్టింది..చిన్నగా అర్చన.


“మా అమ్మ వచ్చింది..”  అంటున్న అజయ్ మాటలకు, 

“అవును అత్తయ్య వచ్చింది..” అన్నది అర్చన భయంగా చూస్తూ..


ఒక్కసారి దిగ్గున లేచి కూర్చున్నారు భార్యా,భర్తలు.

ఒకరి చెంప మీద ఒకరు అలా తడుముకున్నారు..  కాస్త గట్టిగానే.. నిజమే అనుకున్నారు.

ఇది "కల" అని ఇద్దరూ కాస్త మంచినీళ్లు తాగాకే నవ్వుకున్నారు.


క్రితం రోజు రాత్రి.. మా నాన్నగారు చనిపోయిన.. "తిధి" అని పూజ చేసి, కాస్త మందు తాగి, సిగరెట్ కూడా తాగి.. భోజనం చేసేటప్పుడు, ‘అదే..అమ్మ ఉంటే నా పని.. అనుకున్నాను కదా! ఆ విషయం కలలోకి వచ్చింది.’ అని భర్త అంటుంటే,


“అదేగా నేను ఆలోచించాను. అందుకే కలలోకి వచ్చింది అత్తమ్మ” అంటూ ఇద్దరు నవ్వుకున్నారు.

అర్చనకు వెంటనే ఒక విషయం గుర్తుకు వచ్చింది.

‘ఒకసారి లేవండి’ అంటూ భర్తను లేపింది.


కలలో..అత్తయ్య.. పరుపు కింద ఏదో వెతికారండి అంటూ,

గుర్తుకు వచ్చిన అర్చన పరుపు కింద వెతుకుతూ ఉంటే అజయ్..

“మా అమ్మ.. మాట అంటే భయమే కాదనను.. అయినా ఇలా..” అని  తల మీద కొట్టుకుని నవ్వుకున్నాడు.


అదేమీ గమనించని అర్చన మొత్తం వెతికింది..

కనిపించింది ఒక పట్టు గుడ్డతో కుట్టిన పర్సు .అందులో... జయలక్ష్మి గారు.. ఎప్పుడో... తన అత్తగారు ఇచ్చిందంటూ, పది తులాల కాసులపేరు.... ఆ పట్టు గుడ్డ పర్సులోనుండి బయటకు తీసి.. 


‘ఇది ఎప్పటికైనా నీదేనే’ అంటూ.. ఒకసారి చూపించినట్లు గుర్తు వచ్చింది అర్చనకు.. అందులో ఉన్న కాసులపేరు చూసి, ఆశ్చర్యంతో అలాగే ఉండిపోయింది.

నిజంగా  కలా నిజమా?


అర్థం చేసుకోవాలంటే, ఎవరికీ సాధ్యం కాని విషయాలుగా ఉంటాయి కొన్ని సంఘటనలు అంతే!

అప్పటినుండి తండ్రి చనిపోయిన తిధిని వంకగా తీసుకొని, సిగరెట్ తాగడం.. మందు తాగడం,

మానేశాడు అజయ్.


" శుభం “

మీనా కుమారి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం:

నా పేరు మీనా కుమారి.నేను ఒక అంతర్జాల యాప్ లో చాలా ధారావాహికలు,కథలు వ్రాస్తువున్నాను గత నాలుగు సంవత్సరముల నుండి.


నా రచనలు సుమారు మూడు కోట్లకు పైగా చదివి వున్నారు.నాకు అనేక ప్రశంసా పత్రాలు మరియు సూపర్ రైటర్స్ కథల విభాగంలో గెలుపొందిన అవార్డులు అనేకం వచ్చి ఉన్నాయి.


ఇప్పుడు మన తెలుగు కథలు వారు కూడా సాహిత్య పరంగా రచయితలను బాగా ప్రోత్సహిస్తున్నారని తెలుసుకుని ఈ కథను విజయ దశమి పోటీలకు పంపుతున్నాను.

134 views0 comments

Comments


bottom of page