top of page

మా మనసు చెప్పిన తీర్పు - 1

Updated: 5 days ago

#KLakshmiSailaja, #కేలక్ష్మీశైలజ, #MaManasuCheppinaThirpu, #మామనసుచెప్పినతీర్పు, #StoryOnSocialProblems, #సామాజికసమస్యలు

Ma Manasu Cheppina Thirpu 1/3 New Telugu Story Written By K. Lakshmi Sailaja

Published In manatelugukathalu.com On 29/03/2025

మా మనసు చెప్పిన తీర్పు - 1/3 - తెలుగు పెద్ద కథ మొదటి భాగం

రచన: కే. లక్ష్మీ శైలజ


“నాన్నా, గుడ్ మార్నింగ్” అంటూ సుజిత వచ్చి సోఫాలో కూర్చున్న సుధాకర్ పక్కన కూర్చుంది.


“గుడ్ మార్నింగ్ సుజీ” అన్నాడు సుధాకర్ సుజిత తల నిమురుతూ. 


“ఇంక రెండురోజులే ఉంది నాన్నా” అంది గునుస్తూ.


“ఏం ఫరవాలేదు తల్లీ. సంతోషంగా వెళ్ళండి. సుధీర్ లేచాడా?” అంటూ సుధాకర్ చదువుతున్న పేపర్ పక్కన పెట్టాడు. 


“వస్తున్నా నాన్నా” అంటూ సుధీర్ కూడా వచ్చి సుధాకర్ కు ఇంకోపక్కన కూర్చున్నాడు.


ఇద్దరూ కవలపిల్లలు. ఇంటర్ పాసయ్యి, ఇంజనీరింగ్ లో జాయిన్ అవడానికి రెండురోజుల్లో కడప కు బయలు దేరుతున్నారు. ఇంతవరకూ స్వంత ఊరు నంద్యాలలోనే చదవడం వల్ల ఇప్పుడు హాస్టల్ కు వెళ్ళడానికి వాళ్ళూ, పంపడానికి పెద్దలూ ఇబ్బంది పడ్తున్నారు. 


“అమ్మా, నాకు ఆవకాయ పంపిస్తావా?” అంది సుజిత, సూట్కేస్ లో కజ్జికాయలు, కారాలు సర్దుతున్న సుజాతతో.


“కొబ్బెరపొడి, శెనక్కాయపొడి కూడా సర్దాను తల్లీ” అంది వాళ్ళ నాన్నమ్మ సుందరమ్మ.

 “‘థాంక్యూ యు’ నాన్నమ్మా” అంది సుజిత. సుజాత ఇద్దరికీ బెడ్షీట్స్, స్వెట్టర్ సర్దింది.


“అమ్మా, నాకు చట్నీ పొడి ఎక్కువ పెట్టమ్మా. టిఫెన్ కు, అన్నం లో కలుపుకోవడానికి…. అన్నిటిలోకి పనికొస్తుంది” అన్నాడు సుధీర్.


“సుజాతా…ఇంక పిండివంటలు చెయ్యడం చాలు. వచ్చే వారం మనిద్దరం వెళ్ళి చూసి వద్దాము. అప్పుడు కావాలంటే ఇంకా కొన్ని చేసి తీసుకెళ్దాం” అన్నాడు సుధాకర్.


“తినే గోలలో పడి చదువు సంగతి పక్కన పెట్టకండి. కడప లో మీ మామయ్య ఉన్నాడని, మీకు కొంచెం ‘హోంసిక్’ ఉండదని అక్కడ చేర్పిస్తున్నాము. పేమెంట్ సీట్స్ అయినా మీరు కావాలనుకున్న బ్రాంచేస్ కోసం అంత దూరం పంపిస్తున్నాము. నాన్న ఒక్క జీతం తో మన ఇల్లు గడవాలి. గుర్తుంచుకొని బాగా చదువుకోండి” అంది సుజాత.


“లేదులేమ్మా…”అంటూ మళ్ళీ సోఫాలో ముడుచుకొని పడుకుంటూ అంది సుజిత.


“మనలాంటి వారికి ‘క్యాంపస్ సెలక్షన్స్’ లో ఉద్యోగాలు తెచ్చుకోవడం లక్ష్యంగా వుండాలి” అని సుధాకర్ అనగానే

 “అవున్నాన్నా. కాలేజ్ బైటకు వచ్చిన తరువాత తక్కువ మందికే ఉద్యోగాలొస్తున్నాయి” అన్నాడు సుధీర్.


“ఇద్దరమూ తెచ్చుకుంటాములే నాన్నా. నువ్వేం దిగులు పడకు” సోఫాలో పడుకుని నిద్ర కళ్ళతో సుజిత అనగానే వాళ్ళమ్మ “ఇదుగో ఆ నిద్ర తగ్గించుకో ముందు” అంది నవ్వుతూ.


ఆ మాటలకు అందరూ ముసిముసిగా నవ్వారు. 

అలా చల్లగా సాగుతున్న ఆ కుటుంబ నావ ముందు ముందు ఎలా సాగుతుందో చూద్దాం.

…..

ఆ రోజు ఉదయం కడపలో ఉన్న సుజాత అన్నగారి ఇంటికి చేరుకున్నారు సుధాకర్, సుజాతలు. పిల్లలు కాలేజ్ లో చేరి రెండు వారాలు అవుతోంది. ఒకసారి చూసి వద్దామని వచ్చారు. వచ్చేప్పుడు అరిసెలు, శనగపిండితో రిబ్బన్ కారాలు లాంటి వంటలు చేసి తీసుకు వచ్చి వాళ్ళ పిల్లలకే కాకుండా వాళ్ళ నివదిన వసుంధరకు కూడా ఇచ్చింది సుజాత.


“ఎందుకు సుజాతా ఇవన్నీ” అంటూ అవి తీసుకోవడానికి మొహమాట పడింది వసుంధర.


“అదేమిటి వదినా, వివేక్ కూడా ఉన్నాడుగా. ముగ్గురూ తీసుకుంటారులే” అంది సర్ది చెప్తూ.


సుజాత మేనల్లుడు వివేక్ టీ.టీ.డి. వారి వేదపాఠశాలలో వేదం చదువుతున్నాడు. పెద్ద చదువులు చదివించలేక అక్కడ ఉచితం కదా అని చేర్పించారు. అన్న విద్యాధర్ శివాలయం లో అర్చకుడుగా పని చేస్తున్నాడు. స్వంత ఇల్లు తప్ప పెద్ద సంపాదన లేదు. అందుకే పిల్లలిద్దరినీ వాళ్ళింట్లో ఉంచకుండా హాస్టల్ లో ఉంచారు వీళ్ళు.


“అన్నయ్యా, ఒకసారి పుష్పగిరికి వెళ్ళిద్దామా?” అంది సుజాత ఆ రోజు భోజనాలయిన తరువాత.


“అవునే తల్లీ. పుష్పగిరి చూడాలని చాలా రోజులనుంచి అనుకుంటూ ఉన్నాను” అని సుందరమ్మ అనగానే 

“అందుకే అత్తయ్యా. వెళ్ళి వద్దాము” అని సుజాత అంది.


“అలాగే అత్తయ్యా. రేపు ఆదివారం ఉదయం ఇక్కడినుండి జీప్ లో వెళ్దాము. మధ్యాహ్నం ఇంటికి వచ్చేయ్యవచ్చు” అన్నాడు విధ్యాధర్.


“సరే. జీపు నేను మాట్లాడతాను” అన్నాడు సుధాకర్.


సుధీర్, సుజిత పెన్నానది పక్కగా వున్న పుష్పగిరి మీద వున్న దేవాలయ శిల్పకళను ఆశ్చర్యంగా చూశారు. ఐదు నదుల సంగమంలో దక్షిణ కాశీగా పిలువబడే ఆ ప్రదేశంలో ఆదిశంకరాచార్యుల వారిచే పూజించబడిన చంద్రమౌళీశ్వర స్వామి వారిని పూజించి, విష్ణుమూర్తిని కూడా అందరూ భక్తిగా దర్శించుకున్నారు.


వాళ్ళింట్లో ఉన్న రెండురోజులూ పిల్లలు ముగ్గురూ చక్కగా కలిసిపోవడం చూసి సుధాకర్ కూడా సంతోషపడ్డాడు. సుజిత చేదబావిలో నీళ్ళు తోడింది. సుధీర్ వీధిలో పిల్లలతో క్రికెట్ ఆడాడు, వివేక్ తో కలిసి.

అలా మొదటి సంవత్సరం చకచకా గడిచిపోయింది. పిల్లలు బాగానే చదువుతున్నారు. హాస్టల్ కు అలవాటు పడ్డారు. కానీ సుజిత తన పనులు తను చేసుకోవడానికి కూడా బాగా బద్ధకంగా తయారయ్యింది. సంక్రాంతి పండుగకు ఇంటికి వచ్చిన మూడు రోజులూ ఉదయం లేట్ గా లేవడం, తన బట్టలు వాషింగ్ మెషిన్ కు వేసి రెడీ చేసుకోవడానికి కూడా కదలక పోవడం చూసి సుజాత మందలించింది. ఎప్పుడూ టి.వి. చూస్తూ సోఫాలో పడుకుంటోంది. సుధీర్ కూడా అంతే. ఎప్పుడూ మొబైల్ చూసుకుంటూ ఉండటమే.


రెండవ సంవత్సరం లో శివరాత్రి పండుగ టైం లో వీళ్ళ పిల్లలతో పాటు వివేక్ కూడా నంద్యాలకు వచ్చాడు. 


 “అమ్మా, శివరాత్రి రోజు మనం నంద్యాలకు పేరు రావడానికి కారణమైన ‘నవ నందు’లను చూసి వద్దామా? ఒకటి రెండు చూశాము గానీ అన్నీ పండుగ రోజే చూడలేదు” అన్నాడు సుధీర్.


“అలాగే. కొన్ని చోట్లకు బస్ లు ఉండవేమో. కారు మాట్లాడుకొని వెళ్దాము. నంద్యాలలో ఉన్న మహానందీశ్వర స్వామి దేవళం తో మొదలు పెడదాము. అన్నీ చూసుకొని రాత్రికి ఇంటికి చేరవచ్చు” అని సుధాకర్ చెప్పాడు. 


అనుకున్నట్లుగా శివరాత్రి రోజు ఉదయం బయలుదేరి నంద్యాల చుట్టుపక్కల ఉన్న తొమ్మిది నందీశ్వరాలయాలను దర్శించుకొని వచ్చారు. ఇందువల్లనే ఇంగ్లీష్ వారు ‘నంది ఆల్’ ను నంద్యాలగా పిలిచారని గుర్తుచేసుకున్నారు.


సుజిత జుట్టు చూసి సుందరమ్మ ”అయ్యో ఇదేమిటే? జుట్టంతా ఇలా అయిపోయింది. ఎర్రగా, చివరలంతా చిట్లిపోయి ఉంది. ఆ షాంపూలతో తలకు పోసుకుంటే ఉన్న జుట్టు ఇలాగే పాడైపోతుంది” అంటూ సుజితకు నలుగు పెట్టి శనగపిండితో తలకు పోసింది.


సుధీర్ ను చూడగానే “ నా తండ్రే. ఆ హాస్టల్ తిండి తిని ఎంత చిక్కి పోయావురా?” అంటూ సుధీర్ కు స్పెషల్ గా మినప సున్ని ఉండలు చేసి పెట్టింది.


పిల్లలు ఇంట్లో కూడా ఒక సిస్టమ్ కొని పెట్టారు. చెరొక లాప్టాప్ ఉండనే ఉంది. సుధాకర్, సుజాతలు “ఇప్పుడు ఇంకో సిస్టమ్ ఎందుకు? డబ్బులు వేస్ట్ కదా?” అన్నారు.


“టీ.వి. లో కాకుండా ఇందులో సినిమాలు చూసుకోవచ్చు” అని చెప్పారు పిల్లలు. వారం వారం చేసే వీడియో కాల్ సిస్టమ్ లో ఐతే బాగా వుంటుందని కూడా చెప్పారు. 

 వీళ్ళు థర్డ్ ఇయర్ కు వచ్చేటప్పటికి వివేక్ వేద విద్య పూర్తయ్యింది. సుజన వివేక్ పెళ్ళి సుజితతో చేస్తే బాగుంటుందని అనుకుంటోంది. కానీ పౌరోహిత్యం లో నిలకడ లేని ఆదాయం ఉంటుంది అని సుధాకర్ అభిప్రాయపడ్డాడు. వీళ్ళిలా మధన పడ్తున్న సమయంలో పిల్లలిద్దరూ సెలవులకు ఇంటికి వచ్చారు. 

 అప్పుడు పిల్లలతో ఈ విషయం కూడా చర్చించారు. సుజాత మేనరికం చేసుకొంటే కొత్తగా వచ్చే అత్తగారితో ఇబ్బందులేమైనా వచ్చే అవకాశముండకపోవచ్చని అనుకుంది. సుందరమ్మ కూడా కోడలి వైపే మాట్లాడింది. కానీ సుజిత ‘తన క్లాస్మేట్ శామ్యూల్ ను ప్రేమించాననీ, ఇద్దరం పెళ్ళి చేసుకుందామని అనుకున్నామ’ని గట్టిగా చెప్పేసింది.


“హాస్టల్ లో చేర్పించింది మీరు ఇంట్లో డిస్ట్రబెన్స్ లేకుండా చదువుకుంటారని. అంతేగానీ ఇలా ప్రేమ, దోమ అంటారని కాదు” అంటూ సుజాత కోప్పడింది. 


అందులోనూ వర్ణాంతర వివాహానికి సుజాత బాగా కంగారు పడింది. 


“సుజితా, ఎంత సర్డుబాటుచేసుకున్నా ఎన్ని కలహాలు వస్తాయో? అప్పుడు వాళ్ళ తల్లి తండ్రులు మన మాట వినక పోవచ్చు. ఇబ్బంది అవుతుంది” అంటూ సుధాకర్ కూడా నచ్చ చెప్పాలని చూశాడు.


అయినా సుజిత వినలేదు. సరేనని వీళ్ళే వెళ్ళి అబ్బాయి తల్లితండ్రులతో మాట్లాడారు. వాళ్ళు ససేమిరా వప్పుకోలేదు. 

“మా అబ్బాయిని మీ అమ్మాయి వల్లో వేసుకుంది. ఈ పెళ్ళి జరిగితే మేము ఇద్దరినీ ఇంట్లోకి రానివ్వము” అని అబ్బాయి తల్లి కేకలు పెట్టింది.


“పిల్లలిద్దరూ ఇష్టపడ్డారు కదా! పెళ్ళి చేద్దామండీ” అని వీళ్ళెంతో నచ్చచెప్పాలని చూసినా వాళ్ళు వినలేదు.


తొందరపడవద్దనీ, కొద్దిరోజులకు వాళ్ళు వప్పుకోవచ్చనీ ఇద్దరికీ సుధాకర్ నఛ్చచెప్పాడు.


వివేక్ కు కడపలోనే ఇంటర్మీడియెట్ చదివిన అమ్మాయితో పెళ్ళి చేశారు, సుజాత వాళ్ళ అన్నయ్య వాళ్ళు. సుజాత కూతుర్ని చేసుకోవాలనుకున్నా ‘అందని ద్రాక్ష పుల్లన’ సామెత ను రుజువు చేస్తూ ‘అమ్మాయికి వేరే వూర్లో ఉద్యోగం వస్తే వివేక్ కు అక్కడ మళ్ళీ పౌరోహిత్యం వెతుక్కోవాలి కదా?’ అన్నారు, సుజాత కూతురి ప్రేమ విషయం కొంచెం చెప్పగానే. 


సుజాతకు కళ్ళ నీళ్ళు వచ్చేశాయా మాటలకు.

నాలుగో సంవత్సరం లో క్యాంపస్ సెలక్షన్ లో వాళ్ళిద్దరికీ, శామ్యూల్ కు కూడా ఉద్యోగాలోచ్చాయి. పరీక్షలు పూర్తవగానే ఎవరికీ చెప్పకుండా సుజిత ప్రేమించిన వాడిని పెళ్ళి చేసుకుంది. అబ్బాయి తల్లి తండ్రులు వీళ్ళను ఇంట్లోకి రానివ్వలేదు. అబ్బాయి మౌనంగా వుండిపోయాడు.


 “వాళ్ళ తప్పేమీ లేదు. భయం లేకుండా ఇంట్లో చెప్పకుండా పిల్లలు పెళ్ళి చేసుకుంటే ఇలాగే చెయ్యాలి. ఇన్ని సంవత్సరాలు పెంచిన కొడుకు ఇంట్లో చెప్పకుండా పెళ్ళి చేసుకుంటే ఎవరైనా ఇలాగే చేస్తారు” అని సుధాకర్ శామ్యూల్ కు సర్ది చెప్పాడు.

“ఇప్పుడా పిల్లకు అత్తగారింటి అండదండలు దొరకవు. సంసారం ఎలా గడుస్తుందో?” అని సుందరమ్మ కళ్ళ నీళ్ళు పెట్టుకుంది.


“ఇక అన్నింటికీ మనమే ఆదుకోవాలి” నిసృహాగా అంది సుజాత.


“సుధీర్ పెళ్ళి కూడా త్వరగా చేద్దాం. లేదంటే మంచి సంబంధం వాళ్ళు పిల్లను ఇవ్వరు” అన్నాడు ఆలోచనగా సుధాకర్. 


ముగ్గురూ బెంగుళూరు లో ఉద్యోగాలలో చేరారు. ‘శ్రీరామా ఇన్’ లో ఒకే ఫ్లోర్ లో పక్కపక్కనే రెండు అపార్ట్మెంట్స్ తీసుకొన్నారు.


ఇక ఆలస్యం చెయ్యకుండా ముందుగా చూసి పెట్టిన సురేఖ సంబంధాన్ని సుధీర్ కు ఖాయం చేసుకొన్నారు. వాళ్ళు కొంచెం దూరం బంధువులయ్యారు. సుజిత పెళ్ళి గురించి ముందుగా తెలిసినా పట్టించుకోలేదు. ముందుగా అనుకున్న సంబంధమే కదా అని పెళ్ళి చేశారు. సుజిత వర్ణాంతరం వల్ల సుధీర్ పెళ్ళికి అడ్డంకి కాకుండా పెళ్ళి జరిగినందుకు వీళ్ళు సంతోషపడ్డారు. పెళ్ళి లో కూడా సుజిత, శామ్యూల్ వీళ్ళతో కలవకుండా దూరంగానే వున్నారు, తల్లితండ్రులను బంధువులు ఎగతాళి చేస్తారని.


వీళ్లిద్దరి పెళ్ళిళ్ళయిన నెలరోజులకు ఒకరోజు ఉదయం సుందరమ్మ తనువు చాలించింది. ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవు. నిద్రలోనే వెళ్ళిపోయింది. తను ఇబ్బంది పడకుండా, ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా వెళ్ళిపోయిందని ఒక విధంగా బాధను దిగమింగుకున్నాడు సుధాకర్. సుజిత పెళ్ళి సుందరమ్మను ఎక్కువగా బాధించింది. బహుశా ఆ దిగులు వల్ల ఆమె త్వరగా వెళ్ళిపోయిందేమో.


విషయం విని, “నాన్నా, మేము సిమ్లాలో ఉన్నాము. టూర్ ఆపేసి ఇంటికి వస్తే, మళ్ళీ ఇక్కడకి ఎప్పుడు వస్తామో?... డబ్బులు వేస్ట్ అవుతాయి. నేనిప్పుడు రాలేనులే” అంది సుజిత. 


సుధాకర్ ఆ సమాధానం ఊహించలేదు. ‘ఇంత స్వార్ధ పూరితంగా ఎలా మాట్లాడింది? బంధాలకంటే వీళ్ళకు డబ్బులు ఎక్కువయ్యాయి’ అనుకున్నాడు. సుధీర్ కూడా భార్యకు జ్వరంగా వుందనీ ఒక్కడే వచ్చి చూసి ఒక గంట వుండి వెళ్ళాడు. 


‘అమ్మ వీళ్ళిద్దరినీ ఎంతో శ్రద్ధగా పెంచింది. ఆ కృతజ్ఞత వీళ్ళకు ఎందుకు లేకుండాపోయింది? ప్రేమగా చివరి చూపు చూడడానికి కూడా ఇబ్బంది పడ్తున్నారు ‘ అనుకున్నాడతను. 


‘మమతలు, మమకారాలు తగ్గిపోతున్నాయా? హాస్టల్ లో చదవడం వల్ల కూడా పిల్లలు ఎక్కువగా పెద్దవాళ్ళతో గడపలేక పోతున్నారేమో!’ సుధాకర్ నిస్సహాయంగా అనుకున్నాడు.

ఒక ఆరు నెలలు గడిచేటప్పటికి కూతురు గర్భవతి అని తెలిసింది. 


“అమ్మా, నేను చేసుకోలేక పోతున్నాను. నువ్విక్కడకు వస్తావా?” అంది సుజిత. 


సుజాతకు ఏం చెయ్యాలో తోచలేదు. సుధాకర్ ఒక్కడూ ఇక్కడ ఎలా? అనుకొని మధనపడ్తూ ఉంది.


“సరే. అడిగింది కదా. కొద్ది రోజులు వెళ్ళు. మళ్ళీ ఆలోచిద్దాం. నేను వంట చేసుకుంటాలే” అన్నాడు సుధాకర్.


===================================================================

ఇంకా ఉంది...

===================================================================

కే. లక్ష్మీ శైలజ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం :

నా పేరు కె.లక్ష్మీ శైలజ

నేను ఏం. ఏ. ఎం. ఫిల్., చేశాను.

మహిళా అభివృద్ధి శిశుశంక్షేమ శాఖలో గెజిటెడ్ ఆఫీసర్ గా చేసి రిటైర్ అయ్యాను. స్వస్థలం కర్నూలు జిల్లా నంద్యాల దగ్గర A . కోడూరు. ప్రస్తుతం హైదరాబాదు లో నివాసం. నా పందొమ్మిదవ సంవత్సరం లో మా అమ్మ ప్రోత్సాహం తో మొదటి కథ వ్రాశాను. పాతిక కవితలు వ్రాశాను. ఇవి వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. కెనడే వారి (బి.వి.ఆర్.ఫౌండేషన్) బహుమతులను ..అమ్మ, నాన్న, నేను...స్వయంకృతం.. అనే కవితలు గెలుచుకున్నాయి. 10 వ్యాసాలు వ్రాశాను. నేను టెలిఫోన్స్ గురించి వ్రాసిన వ్యాసానికి నంద్యాల కాలేజెస్ లన్నింటిలో ప్రథమ బహుమతి వచ్చింది.

ఇప్పటికి వంద కథలు... తెలుగు వెలుగు, బాల భారతం, ఆంధ్రభూమి, వార్త, సంచిక, ఈనాడు, వార్త, ప్రజాశక్తి, సూర్య, విశాలాంధ్ర, ఉషా, సాహితీ కిరణం, అంతర్జాల పత్రిక మనోహరం లలో , మన తెలుగు కథలు లో ప్రచురితమయ్యాయి. మానతెలుగు కథలు ఐదు కథలు నందు వారం వారం బహుమతులను, సంచిక, సాహితీ కిరణం లందు కథలకు బహుమతులు వచ్చాయి

నా పబ్లిష్ అయిన కథలను ...మనందరి కథలు ...అనే పేరున రెండు

సంకలనాలుగా ప్రింట్ చేయడం జరిగింది.

కొనిరెడ్డి ఫౌండేషన్ ప్రొద్దుటూరు వారు.. మనందరి కథలు... కు మార్చ్ ఎనిమిది 2025 న పురస్కారం ఇవ్వడం జరిగింది.

రచయిత్రుల గ్రూప్ ...లేఖిని...సాహిత్య సాంస్కృతిక సంస్థ... లో 74 మంది రచయిత్రుల తో కూడిన సంకలనం..కథల లోగిలి.. లో నా కథ... పుత్రునికి పునర్జన్మ ...ప్రచురించారు. నారం శెట్టి బాల సాహిత్య పీఠం వారి కథాసంకలనం లో ...జిమ్మీ నా ప్రాణం...అనే కథ ప్రచురించారు.

జిమ్మీ నా ప్రాణం కథ.

వేరే వారి కథలను మన తెలుగు కథలు, మనోహరం లలో చదివి వినిపించాను. సంగీత ప్రవేశం లో జూన్ 2022 న తానా గేయ తరంగాలు జూమ్ మీటింగ్ లో గేయం రచించి పాడటం జరిగింది. నెల్లూరు లో ఘంటసాల పాటల పోటీ లందు ఎస్. పి. వసంత గారు బహుమతిని ఇవ్వడం జరిగింది.

ఇంకా చిత్ర కళలో.. చందమామ.. వారు బహుమతిని ఇవ్వడం జరిగింది.





Comments


bottom of page