top of page

మా మనసు చెప్పిన తీర్పు - 2

Updated: 4 days ago

#KLakshmiSailaja, #కేలక్ష్మీశైలజ, #MaManasuCheppinaThirpu, #మామనసుచెప్పినతీర్పు, #StoryOnSocialProblems, #సామాజికసమస్యలు

Ma Manasu Cheppina Thirpu 2/3 New Telugu Story Written By K. Lakshmi Sailaja

Published In manatelugukathalu.com On 30/03/2025

మా మనసు చెప్పిన తీర్పు - 2/3 - తెలుగు పెద్ద కథ

రచన: కే. లక్ష్మీ శైలజ


 జరిగిన కథ:

సుధాకర్, సుజాతల పిల్లలు సుజిత, సుధీర్.

సుజిత, క్లాస్ మేట్ సామ్యూల్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. నాన్నమ్మ సుందరమ్మ మరణించినప్పుడు కూడా చూడటానికి రాదు.

ప్రెగ్నెంట్ అయినా సుజిత తల్లిని తన దగ్గరకు రమ్మంటుంది.



ఇక మా మనసు చెప్పిన తీర్పు - 2 చదవండి,,


సుజాత వెళ్ళిన తరువాత ఒక వారం రోజులకు కోడలు కూడా గర్భవతి అని తెలిసింది. ఒక పదిరోజుల తరువాత సుధాకర్ కూడా పిల్లల దగ్గరకు వెళ్ళాడు. అక్కడ సుజాత తలమునకలయ్యే పనులల్లో ఉంది. రెండు ఇళ్ళల్లో ఇద్దరు గర్భవతులను కూర్చోబెట్టి చేసి పెడుతోంది. సంతోషంగా వాళ్ళకు జాగ్రత్తలు చెప్తూ యాభై సంవత్సరాల వయసులో గిరగిరా తిరుగుతోంది.


 ఒక రెండు రోజులకు సుధాకర్ కు అర్థమైంది. సుజాత కూతురినీ, కొడలినీ వదిలి రాలేని పరిస్థితులలో ఉందని. అందుకే అప్పట్నుంచీ సుధాకర్ నంద్యాలకు, బెంగుళూర్ కు వారానికీ, పదిరోజులకూ అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాడు.


 ఈ సారి వచ్చినప్పుడు సుధాకర్ ఒక విషయం గమనించాడు. నెలలు నిండిన గర్భవతులు ఇద్దరూ అపార్ట్మెంట్ బయట నెమ్మదిగా వాకింగ్ చేస్తున్నారు గానీ…ఇంట్లో ఎప్పుడూ సోఫాలోకూర్చోనో, బెడ్ మీద పడుకొనో ఉంటున్నారు, రెస్ట్ పేరుతో. సుజాత రెండు ఇళ్ళల్లోకీ పరుగులు పెట్టీ వారికి సేవలు చేస్తోంది. 


 సుధాకర్ నంద్యాల నుంచి రాగానే సాయంత్రం “నాన్నా, నా బెడ్ కొంచెం విదిలించి బెడ్షీట్, పిల్లో కవర్స్ మారుస్తావా?” అంది కూతురు సుజిత. వింటున్న శామ్యూల్ ఏమీ మాట్లాడలేదు. ఫోన్ చూసుకుంటూ ఉన్నాడు.


 “అలాగే మారుస్తాలే” అన్నాడు సుధాకర్. ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో ఆ పని చేశాడు. 


 “అదేమిటి నాన్నా, మ్యాచింగ్ కవర్స్ వెయ్యాలి కదా?” అంది మొహం విసుగ్గా పెడ్తూ.

 సుధాకర్ ఏమీ మాట్లాడలేక పొయ్యాడు.


 రాత్రి కొడుకింట్లోకి వెళ్ళినప్పుడు సుధీర్ “నాన్నా, ఈ రోజు పని మనిషి రాలేదు. నేను గిన్నెలు కడిగాను. నువ్వు వాటిని సర్దిపెడ్తావా” అన్నాడు. 


 కోడలు సోఫాలో కూర్చొని టి.వి. చూస్తోంది. “పెడతాలే“ అన్నాడు సుధాకర్. అతను ఓపిగ్గా బుట్టెడు గిన్నెలూ రాక్ లలో సర్ది పెట్టాడు. 


 కానీ ఒక పది నిముషాల తరువాత సుధీర్ వచ్చి “ఏంటి నాన్నా ఇది. చిన్న ప్లేట్స్, గ్లాసెస్, స్పూన్సన్నీ రాక్ లో కుప్పలాగా పోసేశావు” అన్నాడు విసుక్కుంటూ.


 సుధాకర్ ఏమీ చెప్పలేకపోయాడు. అలా సుజాతతో పాటు సుధాకర్ కూడా వాళ్ళకు సహాయం చేసేవాడు. అయినా వాళ్ళకు సంతోషం లేదు.


 ఆరోజు ఉదయం సుధాకర్ అపార్ట్మెంట్ బైట వరండాలో పిట్ట గోడను ఆనుకొని నిలబడి రాత్రి జరిగిన విషయం ఆలోచిస్తూ ఉండగా లిఫ్ట్ దిగి వస్తూ సోమశేఖర్ గారు కనపడ్డారు. అతన్ని చూసి చిరునవ్వు నవ్వాడు. పోయిన ఆదివారం రోజు ఇక్కడే కలిశాడతను. తమ కొడుకు, కోడలు థర్డ్ ఫ్లోర్ లో ఉంటారని చెప్పాడు.


 “సుధాకర్ గారూ బాగున్నారా?” అన్నాడు హుషారుగా నవ్వూతూ.


 సుధాకర్ కూడా తన ఆలోచనలను పక్కన పెట్టీ నవ్వు మొహానికి పులుముకొని “బాగున్నామండీ” అన్నాడు.


 “ఏమిటీ దిగులుగా వున్నారు? మీ పిల్లలంతా ఇక్కడే వున్నారని చెప్పారు కదా! అంతా బాగున్నారా? ఏమీ ఇబ్బంది లేదు కదా?” అన్నాడతను పరిశీలనగా సుధాకర్ ను చూస్తూ.


 “ఆ.. ఆ. అంతా బాగున్నారండీ” అన్నాడు సుధాకర్. 


 “మేము ఇప్పుడే వచ్చాము, ఈ ఊర్లోనే ఉన్న ఓల్టేజ్ హోం నుంచి” అని చెప్పాడతను, అక్కడే ఉన్న బెంచ్ మీద కూర్చుంటూ. సుమారు అరవై సంవత్సరాలు ఉంటాయతనికి.


 సుధాకర్ ప్రశ్నార్థకంగా చూశాడతన్ని. పోయిన సారి కలిసినప్పుడు ఆటో లో వచ్చినందుకు వొళ్ళు పట్టేసిందని చెప్తే వేరే ఊరు నుండి రైలు లో వచ్చి స్టేషన్ నుంచి ఆటో లో వచ్చారని అనుకున్నాడు సుధాకర్.


 “మీరు కరెక్ట్ గానే విన్నారు. మేము కొడుకుల ఇంట్లో ఉండము. అప్పుడప్పుడూ వస్తుంటాము. మాకు ఇద్దరు కొడుకులు. ఇంకో కొడుకు, కోడలు, పిల్లలు బాంబేలో ఉంటారు. ఇక్కడి కొడుక్కు ఇద్దరు పిల్లలు” ప్రశాంతమైన మొహం తో చెప్పాడతను. 


 “మేము అందరితో కలసి వుంటే, ఇంటి పనులతో నా కంటే మా ఆవిడ బాగా అలసిపోతుంది. తన పిల్లలకు ఇష్టమైన వంటలే కాదు, వాళ్ళ పిల్లలకు ఇష్టమైన స్నాక్స్ కూడా చేస్తూనే వుంటుంది. అలా చేయకుంటే కోడళ్ళు ఏమనుకుంటారో నని మొహమాట పడ్తూ వుంటుంది. అందుకని కొంచెం దూరంగా వుంటే ఆవిడ సుఖ పడ్తుందని…అక్కడ వుంటాము” అన్నాడాయన గొంతులో ఎలాంటి బాధ కనపడనీయకుండా.


 సుధాకర్ ‘నిజమే ‘ అన్నట్లు మౌనంగా తల ఊపాడు, మనసులో అయోమయాన్ని మొహం లో కనిపించనియ్యకుండా. తరువాత కాసేపు వివిధ విషయాలు మాట్లాడుకొని ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళారు.


 ఆరోజు “సుజాతా, నీకు బాగా పని పెరిగింది కదూ?” అన్నాడు సుధాకర్ జాలిగా.


 “ఆ… ఏముంది లెండి. మన పిల్లలకేగా చేస్తున్నాను” అంది అదేమంత పెద్ద విషయం కాదన్నట్లు. 

 సుధాకర్ ఇంకేమీ చెప్పలేక పొయ్యాడు. కానీ సుజాత కొంచెం సన్నబడినట్లుగా అతనికి అనిపించింది.


 ఒక నెల రోజులకు ఇద్దరూ ప్రసవించారు. కోడలి తల్లితండ్రులు వచ్చి నామకరణం జరిగిన తెల్లవారి వెళ్ళిపోయారు. వియ్యపురాలికి మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా వున్నాయి అని చెప్పారు. దాంతో మొత్తం ఇద్దరూ బాలింతలు, ఇద్దరూ పసిపిల్లల పని సుజాత మీద పడింది.


 ఇక సుజాత అక్కడే ఉండిపోవలసి వచ్చింది. చిన్న పిల్లల పనులతో ఒక్క క్షణం తీరికలేకుండా గడుస్తోందామెకు. ఒక్కోసారి నిద్ర కూడా తగ్గుతోంది. కూతురూ, కోడలూ తమకు కావలసినవి సరిగ్గా ఇవ్వలేదని విసుగును ప్రదర్శించినా పట్టించుకోనట్లు నవ్వు మొహం తోనే తిరుగుతూ ఉండేది. 

 ఇదంతా చూస్తే సుధాకర్ కు కొంచెం ఇబ్బందిగా ఉండేది. సుజాత మొదట్నుంచీ ఎవరైనా ఏమైనా అన్నా తల వంచుకుని పోయే రకం. ఎదిరించి వాదించదు, ఎవరికీ చెప్పదు. అది వీళ్ళు ముగ్గురూ అలుసుగా తీసుకొని సుజాతకు పనిమనిషికి చెప్పినట్లు పనులు చెప్తున్నారు. శామ్యూల్ ఎవరితో పెద్దగా మాట్లాడడు, ఎవరికీ ఏ పనీ చెప్పడు.


 సుజాత ఇబ్బందిని ఎలా తప్పించాలా?.… అని సుధాకర్ బాధపడ్తున్నాడు. పైగా సుధాకర్ నంద్యాల నుండి వచ్చినప్పుడు సుధాకర్ కూడా సుజాత లాగే పని చేస్తున్నాడు.


 ఒకరోజు సాయంత్రం “అమ్మా, ఏంటిది? వీడి బట్టలు అన్నీ కుప్పలాగా ఇలా మడతేశావు? అన్నీ షర్ట్స్, టి.షర్ట్స్, ఒన్ సీ లు, రాంపర్స్, ప్యాంట్స్, నిక్కర్లు, డ్రాయర్ లు, ఇన్నర్స్ అన్నీ విడి విడిగా పెట్టాలి కదా?” అని సుజిత అరుస్తోంది. తన ఎనిమిది నెలల పిల్లవాడి బట్టలు చూస్తూ. 


 సుజాత పరుగు పరుగున వచ్చి, సుజిత దగ్గర నిలబడింది. అన్నీ జానెడు బట్టలు. ఏది ఏమిటో కొంచెం త్వరగా అర్థం కాదు. అన్ని రకాలూ విడివిడిగా గా పెట్టాలంటే స్పేస్ చాలదు. కానీ సుజాత ఇవేవీ కూతురితో చెప్పదు. మౌనంగా వినింది.


 “ఈ సారి సరిగ్గా పెడతాలే సుజీ” అని చెప్తూ పిల్లవాడి బట్టలు మార్చేసి వెళ్ళింది.


 రాత్రి కోడలు “పాపకు పెట్టే అన్నంలో ఒక స్పూన్ క్వినోవా వెయ్యాలి కదండీ” అంది ….’ఎందుకు వెయ్యలేదు ‘ అన్నట్లు. 


 ఎనిమిది నెలల పాప. రెండు రోజులనుంచి అజీర్ణంగా ఉందని కోడలు అనుకుంటూ ఉందని ఈరోజు అన్నం కొద్దిగానే చేసింది. ఆ కొంచెం లో ‘క్వినోవా ఎందుకులే’ అనుకుంది.


 “రేపు వేస్తాలే సురేఖా. ఈ పూటకు ఆ అన్నం లో చారు కలిపి పెడతాను” అంటూ వెండి గిన్నెలో చారన్నం కలిపి అందులో కొంచెం బెల్లం ముక్క, కొంచెం నేతి చుక్క వేసి పాపకు తినిపించింది. 

 ఇదంతా చూస్తున్న సుధాకర్ “మా అమ్మ కూడా సుజాత ను ఇలా మాటలు అనలేదు” అనుకొని దిగులు పడ్డాడు. అపార్ట్మెంట్ బైట వాచ్మెన్ తొట్లల్లో ఉన్న చెట్లకు నీళ్ళు పెడుతుంటే చూస్తూ. కొంతమంది ఆ చెట్ల పూలు కోసుకుంటూ ఉన్నారు.


 అదే సమయంలో సోమశేఖరం గారు ఆ చెట్లకు ఎరువులు తెచ్చి ఇచ్చారు వాచ్మెన్ కు. సుధాకర్ ను చూసి పలకరింపుగా నవ్వాడు. 


 “ఎప్పుడొచ్చారు?” అన్నాడు సుధాకర్.


 “మేమొచ్చి ఇరవై రోజులయ్యింది” అన్నాడతను కుర్చీలో కూర్చుంటూ.


 “అవునా! అన్ని రోజులనుంచీ కొడుకు దగ్గరే ఉన్నారా?” అన్నాడాశ్చర్యంగా సుధాకర్ కూడా కూర్చుంటూ, ఆదివారం మాత్రమే ఉంటామని ఇంతకుముందు చెప్పింది గుర్తొచ్చి.


 “అవును పండక్కు వచ్చాము. ఇంకా వెళ్ళలేదు. ఆరోగ్యం బాగుంటే అప్పుడప్పుడూ ఇలా ఒక నెల వుంటాము. ఏ కొంచెం ఇబ్బంది అనిపించినా వెంటనే వెళ్ళి పోతాము, ఏ మాత్రం మొహమాటపడకుండా. రెస్ట్ గా వుంటాము. మన ఆరోగ్యం, సంతోషం మనమే చూసుకోవాలి. మన గురించి ఆలోచించే టైం మన పిల్లలకు లేదు. అందుకే ఈ నిర్ణయం. అయితే ఇదంతా ఎవరికీ చెప్పం. మీరొక్కరికే చెప్తున్నా. ఎందుకంటే మీరూ నాలాగే ఇబ్బందుల్లో ఉన్నారని అనిపించింది” అన్నాడు సోమశేఖర్.

 ఆ మాటలకు సుధాకర్ మొహం లో మళ్ళీ బాధ కనిపించింది. కానీ నోరు తెరచి ఏమీ చెప్పలేడు.

 “సరే. సరే. మీరేం చెప్పకున్నా నాకర్ధమయ్యింది. జాగ్రత్తపడండి, చాలు” అంటూ అతను వాచ్మెన్ దగ్గరకు లేచి వెళ్ళాడు.


 సుధాకర్ సాలోచనగా అతను వెళ్ళిన వైపే చూస్తుండిపోయాడు. 


 తరువాత ఒక రోజు సుజాతతో “మనం కొద్దిరోజులు నార్త్ ఇండియా టూర్ వెళ్ళి వద్దామా?’ అన్నాడు.


 “అమ్మో. ఇప్పుడు టూరా? చిన్న పిల్లలతో వీళ్ళు చేసుకోలేరు కదా?” అంది ఆశ్చర్యంగా.


 “ఒక పది రోజులు వెళ్ళి వద్దాము. ఫరవాలేదులే” అన్నాడు సుధాకర్.


 పిల్లలకు నాలుగోనెల వున్నప్పుడు వీళ్ళిద్దరూ సినిమాకు వెళ్ళారని కోడలు ఎవరిగురించో మాట్లాడినట్లు ఎగతాళి మాటలు మాట్లాడిన విషయం గుర్తొచ్చింది సుజాతకు.


 కూతురు ‘ఇంట్లో చిన్న పిల్లలతో మేము అవస్థ పడుతుంటే నువ్వు హ్యపీగా సినిమా కు ఎలా వెళ్ళావమ్మా?’ అని అడిగింది.


 ఆ విషయం సుధాకర్ కు కూడా చెప్పలేదామె. కానీ మళ్ళీ ఇంకోసారి సినిమాకు పిలిచినప్పుడు వద్దని చెప్పేసిందామె.


 అది గుర్తొచ్చింది సుజాతకు.

 అందుకే “ వద్దు. వద్దు. పిల్లలు కొంచెం ఎడపిల్లలు కానివ్వండి. కనీసం వాళ్ళకు ఒక సంవత్సరం నిండితే అప్పుడు మనం సినిమాకేకాదు, నంద్యాలకే వెళ్ళవచ్చు” అంది నిక్కచ్చిగా.


 సుధాకర్ ఇంకేమీ మాట్లాడలేకపోయ్యాడు.

 అలా రోజులు గడిచిపోతూ పిల్లలకు ఫస్ట్ బర్త్ డే జరిగేటప్పటకి ఒక వారం తేడాగా వీళ్ళిద్దరూ రెండవసారి గర్భవతులు అయినట్లు డాక్టర్ రిపోర్ట్ వచ్చింది. నిజానికి పిల్లలకు మూడవ సంవత్సరం వచ్చేవరకు ఇప్పుడు అమ్మాయిలు తరువాతి గర్భం గురించి ఆలోచించడం లేదు. కానీ కోడలి అమ్మగారు 11 వ నెలలో పిల్లలకు పుట్టువెంట్రుకలు తీసిన ఫంక్షన్ కు వచ్చినప్పుడు సురేఖకు ఒక ఉపాయం చెప్పింది.


 ఆమె దగ్గరికి మనవడు పాక్కుంటూ వచ్చాడు. వీడు ఇంక నడిచేస్తాడు. వీడికొక తమ్ముడో, చెల్లెలో పుడితే నీ పని పూర్తవుతుంది” అంది.


 “అదేంటీ? వీడికి థర్డ్ ఇయర్ రావాలి కదా!?” అంది సురేఖ ఆశ్చర్యంగా.


 “ఆ మాట నిజమే కానీ…ఒక మూడేళ్ళల్లో ఇద్దరూ స్కూల్ కు వెళ్ళే వాళ్ళవుతారు. నువ్వింక రెస్ట్ గా నీ కెరీర్ పనులు చేసుకోవచ్చు. ఈ ‘పిల్లలు కనడం ‘ అనే పని పూర్తవుతుంది. అందులోనూ మీ అత్తగారు ఉన్నప్పుడే మన పని అవ్వాలి. లేదంటే ఇంత చాకిరీ చెయ్యాలంటే పనిమనుషులు చాలా డబ్బు అడుగుతారు. అందులోనూ ఒకరు చాలరు. ఇద్దరిని ఏర్పాటు చేసుకోవాలి. అందుకని ఆమె తిరుగుతూ ఉన్నప్పుడే నీ పని పూర్తి చేసుకో” అని గీతోపదేశం చేసింది.


 సురేఖ ఆ విషయాన్ని సుజితకు సింపుల్ గా చెప్పింది.

 “సుజీ, మన కెరీర్ కూడా చూసుకోవాలి కదా! మన పిల్లలను మూడు సంవత్సరాల వరకు మనం దగ్గరుండి చూసుకుంటే వాళ్ళు స్కూల్ కు వెళ్ళేటప్పటికి మనం మన కెరీర్ లో బిజీ అవ్వొచ్చు. అందుకే నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి నేను డాక్టర్ సలహా కోసం వెళదాం అనుకున్నాను. నువ్వూ వస్తావా?” అంది సురేఖ. 


 సుజిత కూడా తనతో పాటూ ప్రెగ్నంట్ అవుతే మొదటి సారి లాగే రెండవసారి కూడా అత్తగారు ఇద్దరికీ సహాయంగా వుంటారు. తను ఒకతే ప్రెగ్నెంట్ అయితే తనకు సరిగా చెయ్యదేమో అని సురేఖ ఆ రకంగా చెప్పింది. 


 సునీతకు కూడా ఈ పద్ధతి నచ్చింది. 


 “సరే. నేను కూడా వస్తాలే. నేనూ ఎం.బి. ఏ. చెయ్యాలి. పిల్లలకు ఒక రెండు సంవత్సరాలు వస్తే వాళ్ళు స్కూల్ కు వెళ్తారు. నేను చదువుకోవచ్చు” అంది సుజిత.


 అలా సురేఖ, సుజాత శ్రమను దోచుకోవడానికి సుజితను వెపన్ లాగా ఉపయోగించుకుంది. ఫలితంగా సుజాత నంద్యాల ప్రయాణం మళ్ళీ సుదీర్ఘంగా వాయిదా పడింది.


 ఇంకో సంవత్సరానికి ఇద్దరూ ప్రసవించి నామకరణాలు జరిగాయి. ఇప్పుడు సుధాకర్ కు కూడా ఇంతకు ముందు లాగా ఆరోగ్యం సహకరించక పోవడం తో నంద్యాలకూ, బెంగుళూర్ కు ఎక్కువ తిరగలేక బెంగుళూర్ లోనే వుంటున్నాడు.


 కానీ అది కూడా ఒక సమస్యే అయ్యింది. కోడలు ఇంటి ఖర్చులు లెక్కపెట్టి, గొణగటం మొదలుపెట్టింది.


 “అదేమిటీ? సరుకులు తెచ్చి ఇరవై రోజులేగా అయ్యిందీ. అప్పుడే ఎలా అయిపోతాయి?” అంటూ సుజాతను నిలదీసింది. 


 “అవును సురేఖా. నెలాఖరు లోపల మళ్ళీ కొంచెం సరుకులు తెప్పించాలి. అన్నీ కొంచెం కొంచెమే వున్నాయి” అంది సుజాత.


 “అదే నా ప్రశ్న. పోయిన నెల లాగే ఈ నెల కూడా తెప్పించాను” అంటూ విసుక్కుంది.


 సుజాత బిక్కమొహం వేసుకొని చూస్తూ ఉండిపోయింది.

వింటున్న సుధాకర్ కు ఈ సారి తను ఇక్కడ ఎక్కువ రోజులు ఉండటం వల్ల సరుకులు అయిపోయాయని కోడలు అంటోందని అర్థం అయ్యింది.


 అప్పుడప్పుడూ కూతురి ఇంట్లో కూడా సుధాకర్ భోజనం చేస్తున్నాడు. మరి అక్కడ కూడా వాళ్ళకు కోపంగా వుందేమో అనే ఆలోచన కూడా వచ్చింది.


 ఈ సారి ఆదివారం సోమశేఖర్ గారు వాకింగ్ కు వెళ్ళినప్పుడు సుధాకరే అడిగాడు.

 “మీరు వచ్చి కొడుకు ఇంట్లో వుంటారుకదా? అప్పుడు ఇంటి ఖర్చు పెరిగితే వీళ్ళు ఇబ్బంది పడతారాండీ?” అని.


 ఈ సారి సుధాకర్ మాటలకు అతను పకపకా నవ్వాడు. “పెళ్ళయిన తరువాత మన పిల్లలు కూడా మనకు పరాయి వాళ్ళే. వాళ్ళ ప్రేమను మనం డబ్బుతో కొనుక్కోవాలి” అన్నాడు నవ్వు ఆపి. 

 సుధాకర్ అతని వైపు అర్థం కానట్టు చూశాడు. “వాళ్ళకు కావలసిన వస్తువులు వెండి బంగారాలు, బట్టలు లాంటివి గిఫ్ట్ గా ఇస్తూ వుండాలి అప్పుడప్పుడూ. మన దగ్గర డబ్బుందని వాళ్ళకు తెలుసుగా. ఆ డబ్బు మొత్తం ఇవ్వమని అడగలేరు. మనం వాళ్ళకు భారమని వాళ్ళు బాధ పడకూడదు” అన్నాడు నెమ్మదిగానే ఒకింత బాధగా కూడా.


 సుధాకర్ ‘అవును. నిజంగా ఇది మంచి పనే’ అన్నట్లు తల వూపాడు. 


 ఈ మధ్యనే మహానంది దగ్గర వున్న రెండెకరాల పొలం అమ్మారు. ఆ డబ్బు సుధాకర్ దగ్గరే ఉంది. బహుశా ఆ డబ్బు కొడుక్కు ఇచ్చెయ్యలేదని కోడలికి కోపంగా వుందేమో. ‘అది మనసులో పెట్టుకొని ఇలా సాధిస్తోందా’ అనిపించింది కూడా.


 అందుకే తరువాతి నెలలో వచ్చిన పండుగకు అందరినీ బట్టలు తీసుకొమ్మని చెరి పదివేలు ఇస్తే కోడలు సంతోషించింది. అల్లుడు మొహమాటంగా ‘ఎందుకండీ?’ అన్నాడు.


 అలా పనులు చేస్తూ కూడా పండుగా, పబ్బాలకు ఎదురు డబ్బులు ఇస్తూ రోజులు నెట్టుకొస్తున్నారు. ఈ చిన్న పిల్లలకు కూడా సంవత్సరం నిండబోతోంది. 


 ఒకరోజు ఉదయం సుజాత జ్వరంతో లేవలేక పోయింది. పిల్లల ఏడుపులు, ఆఫీస్ కు వెళ్ళే హడావిడి లతో ఇల్లు కంగాళిగా అయ్యింది. సుధాకర్ సుజాతను హాస్పిటల్ కు తీసుకొని వెళ్ళాడు. “మామూలు జ్వరమేగా. ఈ రోజు ఇంట్లో టాబ్లెట్ వేద్దాం” అంది కోడలు. అయినా సుధాకర్ తీసుకొని వెళ్ళాడు. డాక్టర్ గారు టాబ్లెట్స్ ఇచ్చి, బాగా రెస్ట్ గా కూడా వుండమని చెప్పాడు. ఇక ఇంట్లో తకధిమితక అన్నట్లుగా ఉండింది ఒక వారం రోజులు.


 మళ్ళీ మామూలే. సుజాతకు జ్వరం కొంచెం నెమ్మదించగానే అన్ని పనులూ చేయడం మొదలు పెట్టింది. చెయ్యొద్దని ఎవరూ చెప్పడం లేదు. అలా చెయ్యడం సుజాతకు మామూలయి పోయింది. అందరూ కూడా అలాగే అలవాటై పొయ్యారు.


 ఆ రోజు మళ్ళీ సుజాత ఒళ్ళు బాగా వేడిగా వుండి కళ్ళు మూతలు పడుతున్నట్లుగా ఉంటే, నెమ్మదిగా రాత్రి వంటింటి పనులు ముగించుకొని వచ్చి, దిండుకు జారిగిలబడి మంచం మీద కూర్చుంది.


 సుధాకర్ సాయంత్రమే అనుకున్నాడు, ‘సుజాత రోజు లాగా లేదు’ అని. నుదురు తాకి చూసి ఒక టాబ్లెట్ ఇచ్చి ‘‘జ్వరం వుంటే అమ్మాయితో చెప్పొచ్చుగా’’ అన్నాడు. “వాళ్ళు చాలా బిజీ గా వున్నారు” అంది సుజాత పడుకుంటూ. ‘అమ్మతో రెండు ముక్కలు మాట్లాడలేనంత బిజీ కూతురు’ అనుకుంటూ నిట్టూర్చాడు సుధాకర్.


 రాత్రి సుజాత నిద్రపోయినా సుధాకర్ చాలాసేపు మేలుకొని వున్నాడు. ఇలా ఎన్ని రోజులు జరగాలి? తమకు విశ్రాంతి ఎక్కడా? తమ ఆరోగ్యాలు క్షీణిస్తూన్నాయి. కొడుకు, కూతురు తమ పనులు జరిగితే చాలన్నట్లు ఉన్నారు. తమ ఇంట్లో వుండకుండా వీళ్ళు ఎక్కడికీ పోలేరని వాళ్ళ ధైర్యం. పెద్దవాళ్ళ గురించి ఆలోచించే సమయం వాళ్ళకు లేదు.


 అందుకే తమకు తామే తమ గురించి ఆలోచించాలి. ఇన్ని రోజులు తమ పిల్లలకు సహాయం చెయ్యడం తమ బాధ్యత అనుకున్నారు. అది వాళ్ళకు అలుసుగా అయ్యింది. ఎవరికోసం చేస్తారన్నట్లు అల్లుడు, కోడలు అనుకుంటే…కొడుకు, కూతురు తమ పిల్లలకు చేయడం కోసమే తల్లితండ్రులు ఉన్నారన్నట్లు అనుకుంటూ ఉన్నారు.


 ‘అవసరమైతే సర్వెంట్లను, ఆయాలను డబ్బిచ్చి ఏర్పాటు చేసుకుంటారు. లేకుంటే పిల్లలను క్రెచ్ లలో చేర్చుకుంటారులే’ అని సుధాకర్ మనసు దిటవు చేసుకొన్నాడు. ఇక్కడి నుండి తాము నిష్క్రమించడం ఒక్కటే తమ ఆరోగ్యం బాగుపడటానికి మార్గంగా కనిపిస్తోంది ‘ అని నిర్ణయించుకుని కళ్ళు మూసుకున్నాడు.


 రెండురోజుల తరువాత మార్కెట్ లో కూరలు కొంటున్న సుధాకర్ కు సోమశేఖర్ గారు పళ్ళు కొనుక్కుంటూ కనిపించారు. మొన్నటి నుంచీ సుధాకర్ మనసులో ఉన్న సందేహం తీర్చుకోవాలని అనిపించి అతనితో పాటుగా ఆశ్రమానికి వెళ్ళాడు.


 అక్కడి వాతావరణం ఆశ్రమంలో లాగా అనిపించలేదు. మన ఇంట్లో మనుషులు తిరుగుతున్నట్లుగానే మామూలుగా వుంది.


 అప్పుడు సోమశేఖర్ గారు ఇలా చెప్పారు. 

 “ మా ఆశ్రమంలో మామూలుగా కొడుకులు, కోడళ్ళ దగ్గర ఉంటే ఉండే మానసిక సంఘషణలు, ఉండవు. ఎత్తిపొడుపు మాటలు, విసుక్కోవడాలు లేవు. ఆదరణ పూర్వకమైన చిరునవ్వులు ఉన్నాయి. కాకపోతే మనం డబ్బుతో ఇక్కడి సౌకర్యాలను కొనుక్కోవాలి” అన్నాడు సోమశేఖర్.


 పాలిపోయిన మొహం తో చూశాడు సుధాకర్. “అవును. ప్రతి రోజూ స్వంత పిల్లలే వాళ్ళ పనులు జరగడం కోసం తల్లితండ్రులను, అత్తమామలను ఈసడించుకొని మాట్లాడుతూ ఉంటే గుండెల్లో పొంగే దుఃఖం బైటికి కనిపించకుండా అదిమి పెట్టుకొని పిల్లల దగ్గరే కుంగిపోతూ బ్రతికే కంటే ఇంతమంది ఫ్రెండ్స్ దగ్గర వుండటం చాలా సంతోషంగా వుంటుంది” అన్నాడు మళ్ళీ.


 ‘నిజమే. ప్రతిరోజూ రాత్రి కాగానే ఉదయం నుంచీ వాళ్ళ చేత పడిన మాటలన్నీ కళ్ళనీళ్ళతో గుర్తుచేసుకొని పొగిలి, పొగిలి ఏడ్చేకంటే అదేమేలు కదా. నా కంటే సుజాత ఎక్కువ మాటలు పడ్తోంది’ అనుకుంటూ సుధాకర్ ఓల్డేజ్ హోం లోపలికి సోమశేఖర్ వెంట నడిచాడు, అక్కడ ఎలాంటి సౌకర్యాలున్నాయో చూడటానికి. 


 అంతా చూసిన తరువాత నలుగురితో కలిసిపోతూ అందరూ ఇంట్లో లాగే మసలుతూ ఉండటం గమనించి సంతోషమే వేసింది. కుటీర పరిశ్రమల లాగా కొన్ని పనులు కూడా ఇష్టమైతే చేసుకోవచ్చు. దానివల్ల కొంత సంపాదన కూడా ఎవరికి వారే చేసుకోవచ్చు. సేల్స్ ఆశ్రమం వాళ్ళే చూసుకుంటారు. ఇది కూడా నచ్చింది సుధాకర్ కు. అయినా మనమేం ఎక్కువ రోజులు ఆశ్రమంలో ఎక్కువరోజులు ఉండటం లేదు కదా! అందువల్ల డబ్బు గురించి ఇబ్బంది ఉండదులే అనుకున్నాడు.



===================================================================

ఇంకా ఉంది...

===================================================================

కే. లక్ష్మీ శైలజ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం :

నా పేరు కె.లక్ష్మీ శైలజ

నేను ఏం. ఏ. ఎం. ఫిల్., చేశాను.

మహిళా అభివృద్ధి శిశుశంక్షేమ శాఖలో గెజిటెడ్ ఆఫీసర్ గా చేసి రిటైర్ అయ్యాను. స్వస్థలం కర్నూలు జిల్లా నంద్యాల దగ్గర A . కోడూరు. ప్రస్తుతం హైదరాబాదు లో నివాసం. నా పందొమ్మిదవ సంవత్సరం లో మా అమ్మ ప్రోత్సాహం తో మొదటి కథ వ్రాశాను. పాతిక కవితలు వ్రాశాను. ఇవి వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. కెనడే వారి (బి.వి.ఆర్.ఫౌండేషన్) బహుమతులను ..అమ్మ, నాన్న, నేను...స్వయంకృతం.. అనే కవితలు గెలుచుకున్నాయి. 10 వ్యాసాలు వ్రాశాను. నేను టెలిఫోన్స్ గురించి వ్రాసిన వ్యాసానికి నంద్యాల కాలేజెస్ లన్నింటిలో ప్రథమ బహుమతి వచ్చింది.

ఇప్పటికి వంద కథలు... తెలుగు వెలుగు, బాల భారతం, ఆంధ్రభూమి, వార్త, సంచిక, ఈనాడు, వార్త, ప్రజాశక్తి, సూర్య, విశాలాంధ్ర, ఉషా, సాహితీ కిరణం, అంతర్జాల పత్రిక మనోహరం లలో , మన తెలుగు కథలు లో ప్రచురితమయ్యాయి. మానతెలుగు కథలు ఐదు కథలు నందు వారం వారం బహుమతులను, సంచిక, సాహితీ కిరణం లందు కథలకు బహుమతులు వచ్చాయి

నా పబ్లిష్ అయిన కథలను ...మనందరి కథలు ...అనే పేరున రెండు

సంకలనాలుగా ప్రింట్ చేయడం జరిగింది.

కొనిరెడ్డి ఫౌండేషన్ ప్రొద్దుటూరు వారు.. మనందరి కథలు... కు మార్చ్ ఎనిమిది 2025 న పురస్కారం ఇవ్వడం జరిగింది.

రచయిత్రుల గ్రూప్ ...లేఖిని...సాహిత్య సాంస్కృతిక సంస్థ... లో 74 మంది రచయిత్రుల తో కూడిన సంకలనం..కథల లోగిలి.. లో నా కథ... పుత్రునికి పునర్జన్మ ...ప్రచురించారు. నారం శెట్టి బాల సాహిత్య పీఠం వారి కథాసంకలనం లో ...జిమ్మీ నా ప్రాణం...అనే కథ ప్రచురించారు.

జిమ్మీ నా ప్రాణం కథ.

వేరే వారి కథలను మన తెలుగు కథలు, మనోహరం లలో చదివి వినిపించాను. సంగీత ప్రవేశం లో జూన్ 2022 న తానా గేయ తరంగాలు జూమ్ మీటింగ్ లో గేయం రచించి పాడటం జరిగింది. నెల్లూరు లో ఘంటసాల పాటల పోటీ లందు ఎస్. పి. వసంత గారు బహుమతిని ఇవ్వడం జరిగింది.

ఇంకా చిత్ర కళలో.. చందమామ.. వారు బహుమతిని ఇవ్వడం జరిగింది.





Comments


bottom of page