top of page

మా మనసు చెప్పిన తీర్పు - 3

#KLakshmiSailaja, #కేలక్ష్మీశైలజ, #MaManasuCheppinaThirpu, #మామనసుచెప్పినతీర్పు, #StoryOnSocialProblems, #సామాజికసమస్యలు

Ma Manasu Cheppina Thirpu 3/3 New Telugu Story Written By K. Lakshmi Sailaja

Published In manatelugukathalu.com On 31/03/2025

మా మనసు చెప్పిన తీర్పు - 3/3 - తెలుగు పెద్ద కథ

రచన: కే. లక్ష్మీ శైలజ


 జరిగిన కథ:

సుధాకర్, సుజాతల పిల్లలు సుజిత, సుధీర్.

సుజిత, క్లాస్ మేట్ సామ్యూల్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. నాన్నమ్మ సుందరమ్మ మరణించినప్పుడు కూడా చూడటానికి రాదు.

కూతురు, కోడలు ప్రెగ్నెంట్స్ కావడంతో సుధాకర్ దంపతులకు పని భారం పెరిగి, విశ్రాంతి తగ్గుతుంది. ఆశ్రమంలో చేరమని శ్రేయోభిలాషి సోమశేఖరం గారు సలహా ఇస్తారు.


ఇక మా మనసు చెప్పిన తీర్పు - 3 చదవండి,,


ఆ తెల్లవారి ఉదయం పదిగంటల సమయం లో సుజాత టిఫెన్ తిని నెమ్మదిగా వచ్చి సోఫాలో కూర్చుంది. రెండు సంవత్సరాల క్రితం చేసినట్లుగా సుజాత గబ గబా పనులు చెయ్యలేక పోతోంది. చిన్న పాప నిద్ర పోయింది. పెద్దవాడు తన ఎదురుగా బొమ్మలతో ఆడుతున్నాడు. కూతురు, అల్లుడు ఉదయం ఎనిమిదికి ఆఫీస్ కు వెళ్ళి పోయారు. 


 అదే సమయంలో సుధాకర్ సుధీర్ ఇంట్లోనుండి సుజిత ఇంటికి వచ్చి సుజాతను పిలిచాడు. సుజాత తలుపు తీస్తే సుధాకర్తో పాటు వేలు పట్టుకొని పెద్దపాప కూడా వచ్చింది. చిన్నవాడు ఇంట్లో నిద్ర పోతున్నాడు. కొడుకు, కోడలు ఇద్దరూ ఆఫీస్ కు వెళ్ళారు. 


రోజూ లాగే వాకిట్లో నిలబడి మాట్లాడకుండా సుధాకర్ లోపలికి వచ్చాడు. నిన్న రాత్రి పెద్దపాప ఏడుస్తోందనీ పాప దగ్గరే పడుకోమని కూతురు చెప్తే అక్కడే పడుకున్నాడు. వృద్ధాశ్రమం గురించి సుజాతతో చెప్పడం కుదరలేదు. అందుకని కొద్దిసేపు కూర్చొని మాట్లాడాలనుకున్నాడు. 

 అతను లోపలికి రావడం చూసి “చిన్నవాడు ఇంట్లో వొక్కడే అవుతాడేమో” అంది సుజాత. 


“ఒక ఫోన్ విడియో కాల్ చేసి పక్కన దిండు మీద పెట్టి వచ్చాలే. ఒకటి నా చేతిలో వుంది” అన్నాడు ఫోన్ చూపిస్తూ. 


 అది చూసి “సరే” అంటూ లోపలి వచ్చింది. పెద్దవాడితో కలిసి పెద్ద పాప ఆడుకుంటోంది. 


“నిన్న కూరగాయలకు వెళ్ళినప్పుడు సోమశేఖర్ గారితో కలిసి వృద్ధాశ్రమం చూడటానికి వెళ్ళాను” అని సుధాకర్ చెప్పగానే, 

“అవునా!? సావిత్రి గారెలా వున్నారు? చాలా రోజులైంది వాళ్ళు ఇక్కడికి వచ్చి” అంది సుజాత సోమశేఖర్ గారి భార్య గురించి అడుగుతూ. 


“వాళ్ళు మనకంటే చాలా సంతోషంగానే వున్నారు. నేను మనగురించి హోం లో మాట్లాడటానికి వెళ్ళాను” అని సుధాకర్ చెప్తూ వుండగానే 

”వద్దులెండి. నాలుగు రోజులు ఉంటే ఈ జ్వరం తగ్గిపోతుంది” అంటూ సుజాత సోఫాలో పడుకుంది, సుధాకర్ ఇంతకు ముందు సినిమాకో, టూర్ కో వెళ్దామని చెప్పినట్లు చెప్పగానే. 

“ఈ సారి మనం తప్పకుండా వెళ్తున్నాము. జ్వరం ఇప్పుడు తగ్గుతుంది. మళ్ళీ రాదనే నమ్మకం లేదు. నిన్ను నువ్వు చూసుకోవడం లేదు. పిల్లలకు కొంచెం దూరంగా ఉంటేనే నీ ఆరోగ్యం బాగుంటుంది. ఇంక నువ్వు రానని చెప్పకు. నీ పిల్లలను నువ్వు చూశావు గదా? అలాగే వాళ్ళ పిల్లలను వాళ్ళు చూసుకుంటారు. 


ఎక్కడైనా మనం డబ్బు ఇస్తూనే ఉన్నాము, ఏదో ఒక రూపంలో. అదే డబ్బు అక్కడ కడతాము అంతే. నువ్వింక కాదనకు. హోమ్ వాళ్ళతో మాట్లాడాను. పిల్లలందరితో రేపు మాట్లాడి ఎల్లుండి ఆదివారం మనం వెళ్ళే ఏర్పాట్లు చేశాను. మనకు కావలసిన వస్తువులు, బట్టలు రేపు సర్దాలి” అన్నాడు సుధాకర్. 


అంతావిని సుజాత కళ్ళు నీళ్ళతో నిండిపోయాయి, ‘తాము వెళ్ళిపోతే చిన్నపిల్లలతో తమ పిల్లలు ఎంత కష్టపడతారో’ అనుకొని. 


అనుకున్నట్లుగానే సుధాకర్ ఆదివారం రోజు తమ పిల్లలను, కోడలిని, అల్లుడినీ సమావేశపరిచి తాము వృద్ధాశ్రమానికి వెళ్తున్నట్లు చెప్పాడు. 

“ఏం మామయ్యా, ఇక్కడ మీకు ఇబ్బంది గా వుందా? “ శామ్యూల్ అడిగాడు. 

అతనికి ఇంట్లో ఎలా జరుగుతోంది అని పని వివరం తెలియదు. ఆఫీస్ పని మాత్రమే అతని లోకం. 


“అవును శ్యామ్యూల్. మేము మీ పిల్లలను చూసే ధ్యాసలో పడి మా ఆరోగ్యాలను చూసుకోలేక పోతున్నాము. ఇద్దరికీ విశ్రాంతి తక్కువవుతోంది. అందువల్ల ముందు మీ అత్తయ్యగారు చాలా నీరసంగా వుంటున్నారు. డాక్టర్ గారు విశ్రాంతి కావాలంటున్నారు” అన్నాడు సుధాకర్. 


“సరే మామయ్యా. మీకు అక్కడేమైనా ఇబ్బంది అనిపిస్తే వెంటనే ఇక్కడికి వచ్చేయ్యండి” అని చెప్పి రూం లోనికి వెళ్ళిపోయాడు శామ్యూల్. 


అతను వెళ్ళే వైపు సుజాత నిర్లిప్తంగా చూసింది. 


“అత్తయ్యగారికి బాగాలేక పోతే మందులు వాడుకోవాలి గానీ ఇలా ఇల్లొదిలి వెళ్తారా?” అంది కోడలు నిష్టూరంగా. ‘వాళ్ళు వెళ్ళిపోతే రేపట్నుంచి ఇంట్లో ఎంత ఇబ్బందీ’ అని కోడలు కంగారు పడుతోంది. 


“నిజమే. కానీ మందుల దారి మందులదీ. మీ అత్తగారి ఆరోగ్యం దారి ఆరోగ్యందీ అయ్యింది కదా. ‘మందులు వాడటమే కాదు. విశ్రాంతిగా కూడా వుండాలి’ అంటారు డాక్టర్ గారు. ఎదురుగా పిల్లలను చుస్తూ వాళ్ళ అవసరాలను తీర్చకుండా మీ అత్తగారు చూస్తూ కూర్చోలేరు. డాక్టర్ గారు స్థలం మార్పు కావాలన్నారు కూడా” అన్నాడు సుధాకర్. 

“ఏమ్మా! నీకు బాగా లేనప్పుడు మందులు వాడి విశ్రాంతి తీసుకోవచ్చుగా. ఎందుకిలా అందరినీ కంగారు పెడతావు? చెయ్యగలిగిన పనులే చెయ్యొచ్చు కదా? ఇప్పుడు చూడు.. అందరూ అన్నిపనులూ చేసుకోవడానికి ఎంత ఇబ్బంది పడాలో?” అన్నాడు సుధీర్. 


“అదేమిట్రా, అలాగంటావు? మీ పిల్లల పనులు మీరు చేసుకోలేరా!” కొడుకువైపు వింతగా చూస్తూ అన్నాడు సుధాకర్. 


“మేము ఇంట్లో అన్నీ పనులూ చేసి మళ్ళీ ఆఫీస్ కు వెళ్ళాలంటే ఎంత ఇబ్బంది? అమ్మ కూడా వుంటే అందరం తలా ఒక పని చేసుకుంటాము కదా?” విసుక్కుంటూ అన్నాడు సుధీర్. 


“పనులు సరే. కొడుకు, కూతురూ వుండి కూడా వీళ్ళు వృద్ధాశ్రమానికి ఎందుకు వెళ్తున్నారూ?.. అని చుట్టుపక్కల వాళ్ళు మమ్ములను ఎంత చులకనగా చూస్తారు? మేము మీకేదో అన్నం పెట్టకుండా వేధిస్తున్నట్లు మీరు ఇల్లు వదిలి వెళ్ళి పోవడం ఏంటి?” కోడలు కూడా విసుక్కుంది. 


“మీరిద్దరూ అనవసరంగా ఎవరైనా ఏమో అనుకుంటారని ఆవేశపడవద్దు. మా ఇష్ట ప్రకారమే మేము వెళ్తున్నాం. మీకు తెలుసు.. మాకు పిల్లలు ఇష్టమని. మా ఎదురుగా వాళ్ళు ఇబ్బంది పడ్తుంటే చూడలేము. అందుకే కనీసం మేమింకా ఆరోగ్యంగా మిగలాలంటే మాకు ఇపుడు విశ్రాంతి అవసరం” అని నెమ్మదిగానే చెప్పాడు సుధాకర్. 

“అమ్మా, నీకు బాగలేకుంటే మేము పని చెయ్యమని చెప్తామా? రెస్ట్ కావాలని నువ్వు చెప్పొచ్చుగా? మాకేం తెలుస్తుంది? అందరూ వుండి కూడా ఎవరూ లేనట్లు ఇప్పుడిలా మీరు ఆశ్రమానికి వెళ్ళడం ఎందుకు? పోనీ నంద్యాలలో మన ఇంటికే వెళ్ళండి” అంది సుజిత కోపంగా ఏడుస్తూ. 


ఆ మాటలకు నిస్సహాయంగా చూసింది సుజాత. 


“నంద్యాలకు వెళితే తనకు రెస్ట్ ఉండదు కదా? పని వాళ్ళు ఉన్నా మళ్ళీ ఇంట్లో పనులు చేస్తుంది. అందుకే విశ్రాంతిగా వుంటుందనే ప్రస్తుతానికి ఆశ్రమానికి వెళ్తున్నాం. మాకు ఆరోగ్యం కుదుట పడిన తరువాత నంద్యాల లో మనింటికి వెళ్తాము. 


మిమ్ములను పెంచాము. మీ పిల్లలను కూడా పెంచే శక్తి మాకు లేదు. అందరూ ఇలా ఇల్లు వదలి ఆశ్రమానికి వెళ్ళమని నేను చెప్పడం లేదు. మేము విశ్రాంతి కోసం వెళ్తున్నాం. పూర్వం లాగా అక్కాచెల్లెళ్ళు, అన్నదమ్ముల లాంటి బంధువుల ఇళ్ళకు వెళ్ళి నెలలు నెలలు ఉండే పరిస్థితి లేదు కదా! తరువాత నేను ఒకరిద్దరు పనివాళ్ళను ఏర్పాటు చేసుకుని అమ్మకు రెస్ట్ ఇవ్వాలి. మీరు అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్ళండి, చాలు” అని చెప్పాడు సుధాకర్. 


వింటున్న ముగ్గురూ ఇంకేమీ మాట్లాడలేక పొయ్యారు. ఎవరి ఆలోచనలలో వారున్నారు. ‘తాము మరీ ఎక్కువగా వాళ్ళను ఇబ్బంది పెట్టామా?’ అని కూడా వాళ్ళకు అనిపిస్తోంది గానీ వొప్పుకోవడానికి మనసు రావడం లేదు. అహంకారం అడ్డు వస్తోంది. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్నట్లయ్యింది వాళ్ళపని. 


పిల్లల గురించి ఇంక ఆలోచించకుండా రేపు ఉదయం తాము చేరబోయే తీరం తమకు ప్రశాంతతను చేకూర్చాలని భగవంతుని కోరుకుంటూ సోఫాలో వెనక్కు వాలి కళ్ళు మూసుకున్నారా పండుటాకుల లాంటి ఆ దంపతులు. 

===================================================================

సమాప్తం

===================================================================

కే. లక్ష్మీ శైలజ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం :

నా పేరు కె.లక్ష్మీ శైలజ

నేను ఏం. ఏ. ఎం. ఫిల్., చేశాను.

మహిళా అభివృద్ధి శిశుశంక్షేమ శాఖలో గెజిటెడ్ ఆఫీసర్ గా చేసి రిటైర్ అయ్యాను. స్వస్థలం కర్నూలు జిల్లా నంద్యాల దగ్గర A . కోడూరు. ప్రస్తుతం హైదరాబాదు లో నివాసం. నా పందొమ్మిదవ సంవత్సరం లో మా అమ్మ ప్రోత్సాహం తో మొదటి కథ వ్రాశాను. పాతిక కవితలు వ్రాశాను. ఇవి వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. కెనడే వారి (బి.వి.ఆర్.ఫౌండేషన్) బహుమతులను ..అమ్మ, నాన్న, నేను...స్వయంకృతం.. అనే కవితలు గెలుచుకున్నాయి. 10 వ్యాసాలు వ్రాశాను. నేను టెలిఫోన్స్ గురించి వ్రాసిన వ్యాసానికి నంద్యాల కాలేజెస్ లన్నింటిలో ప్రథమ బహుమతి వచ్చింది.

ఇప్పటికి వంద కథలు... తెలుగు వెలుగు, బాల భారతం, ఆంధ్రభూమి, వార్త, సంచిక, ఈనాడు, వార్త, ప్రజాశక్తి, సూర్య, విశాలాంధ్ర, ఉషా, సాహితీ కిరణం, అంతర్జాల పత్రిక మనోహరం లలో , మన తెలుగు కథలు లో ప్రచురితమయ్యాయి. మానతెలుగు కథలు ఐదు కథలు నందు వారం వారం బహుమతులను, సంచిక, సాహితీ కిరణం లందు కథలకు బహుమతులు వచ్చాయి

నా పబ్లిష్ అయిన కథలను ...మనందరి కథలు ...అనే పేరున రెండు

సంకలనాలుగా ప్రింట్ చేయడం జరిగింది.

కొనిరెడ్డి ఫౌండేషన్ ప్రొద్దుటూరు వారు.. మనందరి కథలు... కు మార్చ్ ఎనిమిది 2025 న పురస్కారం ఇవ్వడం జరిగింది.

రచయిత్రుల గ్రూప్ ...లేఖిని...సాహిత్య సాంస్కృతిక సంస్థ... లో 74 మంది రచయిత్రుల తో కూడిన సంకలనం..కథల లోగిలి.. లో నా కథ... పుత్రునికి పునర్జన్మ ...ప్రచురించారు. నారం శెట్టి బాల సాహిత్య పీఠం వారి కథాసంకలనం లో ...జిమ్మీ నా ప్రాణం...అనే కథ ప్రచురించారు.

జిమ్మీ నా ప్రాణం కథ.

వేరే వారి కథలను మన తెలుగు కథలు, మనోహరం లలో చదివి వినిపించాను. సంగీత ప్రవేశం లో జూన్ 2022 న తానా గేయ తరంగాలు జూమ్ మీటింగ్ లో గేయం రచించి పాడటం జరిగింది. నెల్లూరు లో ఘంటసాల పాటల పోటీ లందు ఎస్. పి. వసంత గారు బహుమతిని ఇవ్వడం జరిగింది.

ఇంకా చిత్ర కళలో.. చందమామ.. వారు బహుమతిని ఇవ్వడం జరిగింది.





Comments


bottom of page