'Maa Nayanamma Part - 1
'Uppudu Pindi' written by Lakshmi Madan
రచన : లక్ష్మీ మదన్
బడి నుండి వచ్చి బ్యాగ్ ఇంట్లో పెట్టి స్నేహితులతో ఆటలకి వెళ్ళాను. ఇంటి ముందు పెద్ద అరుగులు. అక్కడే మా ఆట. వాడ లోని పిల్లలు కూడా జత చేరారు. అసలు సమయం కూడా తెలిసేది కాదు. ఆకలి కూడా గుర్తుండేది కాదు. స్వచ్ఛమైన నవ్వులు.. ఆటలో అరటి పండు.. చార్ పట్టర్..తొక్కుడు బిళ్ళ..తాడాట.. దాల్దడి..ఇలా ఎన్నో ఆటలు ఆడుకునే వాళ్ళము.
ఇంతలో పెరటిలో నుండి ఘుమఘుమలు రావడం మొదలయ్యాయి. ఒక్క ఉదుటున అందరం పరిగెత్తాము పెరట్లోకి. అక్కడ తుత్తురు చెట్టు కింద కట్టెల పొయ్యి దగ్గర నాయనమ్మ కూర్చొని ఉంది. పొయ్యి మీద పెద్ద గిన్నె. చేతిలో సరాతం ( అట్ల కాడ) తో గిన్నెలో కలుపుతూ ఉంది. నాయనమ్మ ఏ వంట చేసినా ఆ చెట్టు కిందనే చేసేది. ఎక్కువగా ఉప్పుడు పిండి చేసేది. అంత రుచిగా ఎవ్వరూ చేయరేమో ! ఎక్కువ మొత్తంలో వండేది. పెద్ద చెయ్యి కదా.
నాయనమ్మ వయసు అప్పటికే 90 ఏళ్లు. చక్కగా వినగలదు, చూడ గలదు. ఆమెకు అందరికీ వండి వడ్డించడం అంటే ఎంతో ఇష్టం.
నేను 'ముసలీ' అని పిలిచినా పలికేది. రోజూ గొడవపడే వాళ్ళం. వెంటనే పిలిచేది. కొంచెం నలతగా ఉంటే ఎన్ని దిష్టి మంత్రాలు వేసేది.
నేను వెళ్లి “ముసలీ! ఏం చేస్తున్నావ్” అని అడిగాను. “ఉప్పుడు పిండి చేస్తున్నా!” అని చెప్పి గిన్నెలో పిండి కలియబెట్ట సాగింది. అంతా కలిపాక "అందరూ పొయ్యి సత్యనారాయణ ఆకులు కడిగి తెచ్చుకొండి" అన్నది. అందరం వెళ్ళి ఆకులు కోసి కడిగి తెచ్చుకొని పొయ్యి చుట్టూ కూర్చున్నాం. 15 మంది పిల్లలం మొత్తం.
అందరికీ కొసరి కొసరి పెట్టింది. బాగుంది అంటూ అందరం మళ్లీ మళ్లీ వేయించుకుని తిన్నాము. మమ్మల్ని తృప్తిగా చూసి సంతోషపడ్డది. తనకి మాత్రం గిన్నెలో గుప్పెడు పిండి మాత్రమే మిగిలింది.
అలా తన చేత్తో ఎంతో మందికి భోజనాలు పెట్టింది. తెలియని వారు కూడా మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చేవారు. 98 వ ఏట కూడా వంట చేసి పెట్టింది . ఏ రోజూ అలసటగా ఉన్నట్లు కనిపించేది కాదు .. ఎప్పుడూ ఏదో పని చేయాలనే ధ్యాస ఉండేది.. మాకు ఉన్న ఒకే ఒక్క ఆత్మీయురాలు, మా పెద్ద దిక్కు నాయనమ్మ. మా మంచి నాయనమ్మ.
మరో ముచ్చటతో మళ్లీ వస్తాను.
- లక్ష్మీ మదన్
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.
రచయిత్రి పరిచయం ; పేరు లక్ష్మి
కలం పేరు : లక్ష్మీ మదన్
హైదరాబాద్ లో ఉంటాను.
500 కి పైగా కవితలు, 300 కి పైగా పద్యాలు, పాటలు, కథలు రాసాను.
Comments