#RathnakarPenumaka, #రత్నాకర్పెనుమాక, #MaaAnnavaram, #మా అన్నవరం, ##TeluguHeartTouchingStories
వారం వారం బహుమతుల పథకంలో ఈ వారం ఉత్తమ కథగా (29/12/2024) ఎంపికైన కథ

Maa Annavaram - New Telugu Story Written By Rathnakar Penumaka
Published In manatelugukathalu.com On 29/12/2024
మా అన్నవరం - తెలుగు కథ
రచన: రత్నాకర్ పెనుమాక
కథా పఠనం: పద్మావతి కొమరగిరి
మాఊరు వెదిరేశ్వరం. నేను ఇరిగేషన్ డిపార్టుమెంటులో సీనియర్ అసిస్టెంట్‌గా చేత్తన్నాను. నాకు రావులపాలింనించి ధవిళేశ్వరం బదిలీ అయింది. రావులపాలిం మా ఊరికి దగ్గిరే కాబట్టి ఇంటినించే ఎళ్ళి వొచ్చీదాన్ని. ఉప్పుడు ధవిళేశ్వరం బదిలీ అయింది. అమ్మ, దగ్గిరిలో ఉండీలాగ ఏమగిరిలోనో, ధవిళేశ్వరంలోనో ఇల్లు అద్దెకు తీసుకోమంది. కానీ నాకు మా అమ్మమ్మగారూరు జేగురుపాడంటే చేలా ఇష్టం. ఇక్కడినించి రోజూ డ్యూటీకెళ్ళిరాటం పెద్ద కష్టమేంకాదు.అమ్మ, నేనే ఉండీది. నాన్న నాకు పదిహేనేళ్ళప్పుడు చనిపోయారు.
జేగురుపాడులో ఐతే అమ్మమ్మ ఆళ్ళది పేద్ద బంగాళా పెంకుటిల్లు. ఇల్లు ఖాళీయే. ఉప్పుడక్కడ ఎవరూ ఉంటం లేదు. మావయ్య ఆళ్ళు యాపారాల పనిమీద ఒకరు దివాన్‌చెరువులోనూ, ఒకరు కొవ్వూరులోనూ స్ధిరపడిపోయారు. ఈ ఇంటికి అద్దె మాటెలా వున్నా దీపం పెట్టడానికైనా ఇద్దామంటే ఎవరూ రాక పాడైపోతందని మావయ్య బాధపడుతుంటాడు. అందుకే మేము ఇక్కడికి మకాం మారాం. పేద్ద ఇల్లు. అందులోనూ మా రజకపేటలో మయ్యానుంటదీ ఇల్లు. బయట వరండాలో కూచ్చుంటే ఎవరోకలచ్చి పలకరించెళ్తారు. అమ్మకి మంచి కాలక్షేపమోతాదని కూడా ఆలోచించాను.
నేను రోజూ పొద్దున్నే ఎనిమిది గంటలకల్లా బయల్దేరి బాక్సట్టుకుని నా మల్లిపూవు మీద ఎళ్తాను. మళ్ళీ సాయంత్రం ఆరు, ఏడు గంటలకి వత్తాను. ఇది నా రోజూవారీ దినచర్య.
ఓ రోజు నేను జేగురుపాడు నించి వత్తన్నపుడు ఈరింకోరి తోటపాలిం సెంటర్ దాటాక కడిపి సావరం సెంటర్ దాటాక ఓ కుర్రోడు చేతికి పూలబుట్ట తగిలించుకుని నడుచుకుంటా వత్తన్నాడు. ఆణ్ణి దాటుకుని ముందుకెళ్ళాక బండాపి అద్దంలోంచి ఆణ్ణిచూత్తే మాసిపోయిన నీలంలాగూ, గళ్ళుచొక్కా ఏసుకుని ఉన్నాడు. ఓ పన్నేండేళ్ళు ఉండొచ్చు. నుదురుమీద ఇభూది అడ్డబట్టెట్టాడు. నల్లగా ఉన్నాడు. మొఖం మీద స్పోటకం మచ్చలున్నాయి. చూడ్డానికి అందవిహీనంగా ఉన్నాడు.
ఆడు కడియం దేవీచౌక్‌దాకా వొచ్చి ఆ బుట్టలో పూలు అమ్ముకుని ఎల్తాడని నాకర్ధమైంది. మరి అంతదూరం నడుచుకుంటా ఎల్లటమెందుకు శ్రీ వెంకటేశ్వరా సిటి బస్సుసర్వసు వోళ్ళ రెండోనంబర్ ఎక్కి ఓ అయిదు రూపాయలిత్తే దించుతాడు కదా! ఎందుకిలా మూడుకిలోమీటర్లు నడటం అనుకున్నాను.
పోనీ ఎవరినైనా బండెక్కించుకోమనొచ్చుకదా, అనుకుని ఆణ్ణి ఎక్కించుకుందామా అని అనుకుని, ఆడు దగ్గరి కొచ్చీసరికి మొఖం చూసి ఎందుకో ఎక్కించుకోబుద్దికాలేదు. అందుకే ఏమీ అడక్కుండానే ఏదో పనిమీద ఆగినట్టు ఆగి మళ్ళీ బండి స్టార్ట్ చేసుకుని వొచ్చీసాను. బహుశా మనుషులందరికీ ఉండీ, తెల్లగా వున్నోళ్ళని ఇష్టపడీ కలర్ మేనియానో, లేపోతే అందంగా ఉన్నోళ్ళనిష్టపడీ బ్యూటీ మేనియానో నన్నా ఇదంగా ఆణ్ణి బండెక్కించుకోకండా చేసుండొచ్చు.
ఇలా ఆలోచించుకుంటా, నన్ను నేను తిట్టుకుంటా కడియం దేవిచౌక్ గవర్న్‌మెంట్ ఆస్పిటల్ దాటేసి, జి.యమ్.ఆర్ దాకా వొచ్చీసాను. మళ్ళీ నేనే, ఆడు చేతిలో బుట్టతో ఉన్నాడు. అలాంటోళ్ళని ఎలా బండెక్కించుకుంటాను? అయినా ఇంత ఆలోచన ఎందుకు? ఆడునన్ను ఎక్కించుకోమని అడిగాడా ఏంటి? ఆడడిగి నేనెక్కించుకోపోతే అప్పుడాలోచించాలి అయ్యిన్నీ, అంటా నాకు నేను సర్దిచెప్పుకున్నాను.
ఆరోజు సాయంత్రం డ్యూటీనించొత్తంటే మళ్ళీ దేవిచౌక్‌సెంటర్ కొచ్చీసరికి ఆగిన బస్సులకాడికి, ఆటోలకాడికి, బళ్లకాడికి ఎల్లి చేతిమీదేసుకున్న కనకాంబరం దండలు చూపిత్తా ‘‘మూరపది, మూరపది’’ అంటా పాసింజర్ల మొఖాల మీదికి చూపెడతంటే ఒక్కరి దగ్గర ఒక్కడే ఉంటే అమ్మీవోడికి, కొనుక్కునీ వోడికి మాటలు కుదురుతాయి. ఆగిన ఒక్కో బండి దగ్గరికి ముగ్గురేసి, ఇద్దరేసి పూలమ్మివోల్లు మీదడిపోతంటే కొనక్కునీవోడికి ఎవరిది కొనాలో తెలీక ఏదోకటి కొనీసి పోతుంటారు.
ఆ మూకుమ్మడి గుంపులోఆ కుర్రోడు కూడా కనిపించాడు నాకు, పాపం అప్పుటికి సమయం రాత్రి ఎనిమిదౌతన్నా ఆడి దగ్గరి పూలు చేలా అమ్ముడవ్వాలనుకుంటా చేతిమీద అందరికంటే ఎక్కువ దండలున్నాయ్ ఆడికి. పాపం ఎప్పుడికి అమ్ముకుని, ఎప్పుడికి ఇంటికెళ్తాడో అనుకుంటా, నేను మాగాపు సర్వేశ్వర్రావు ఫ్రూట్ మర్చంట్ షాపులో బత్తాయిలు, దానిమ్మలు తీసుకుని ఇంటికొచ్చీసాను.
ఇంటికొచ్చీసరికి అమ్మ పుల్లల పొయ్యిమీద నీళ్ళుకాచి సీమండి బకెట్‌లోకి తొరిపితే ఏన్నీళ్ళతో తానం చేసి, పెరట్లో పట్టిమంచమేసుకుని పక్కింటి అన్నపూర్ణత్త ఆళ్ళమ్మాయి నా చిన్నప్పటి జతగత్తి సుజాతొత్తే చేలాసేపు మాటాడుకున్నాం, చిన్నప్పుటి సంగతులు. దానికి పోయినేడే పెళ్ళైంది. ఇయ్యాలే ఆళ్ళాయన కేంపుకెళ్తా దాన్నిక్కడ దించేసి ఎళ్ళాడంట. చిన్నప్పుడినించి అదీ నేను చేలా అంటే చేలా ఒకర్ని ఇడిసి ఒకలు ఉండలేనంత జతగత్తిలం.
‘‘మీరిద్దరూ ఆడ మొగ అయితే బాగుణ్ణే పెళ్లిచేసేద్దుం. ఇంకెప్పుటికీ ఇడిపోకండా’’ అనీది అన్నపూర్ణత్త. ఇద్దరం ఆదమర్చి మాటాడుకుంటంటే టైమ్ ఆదమర్చిపోద్దా ఏంటి? టైమ్ దాటిపోతందని అమ్మ కేకేత్తే ‘‘ఇద్దరం ఇక్కడే తినేత్తం’’ అంటా, నేనెళ్ళి ఇద్దరికీ అన్నాలు, కొరమేనపులుసు ఏసుకుని తెచ్చాను. ఇద్దరం తింటంటే అమ్మని కూడా అక్కడి కొచ్చేమంటే వొచ్చేసింది.
పెరట్లో పట్టి మంచాలమీద కూచ్చుని తినేసి అక్కడే చుక్కలు చూత్తా కబుర్లాడుకుంటా నిద్దరోయాం ముగ్గురుం. మరసటి రోజు నేను కడియం భాస్కర ధియేటర్ సెంటర్‌లో కొచ్చీసరికి కోడిగుడ్డు అట్టలమిల్లు దగ్గిర ఆ కుర్రోణ్ణి చేతికి పూలబుట్టతో ఒళ్ళంతా చెమటతో నడిచొత్తంటే చూసాను. ఈడు బస్సెక్కడు, ఎవరినీ ఎక్కించుకోమని అడగడు. పెద్ద తిక్కలోడులాగున్నాడు. అనుకుంటా ఎళ్ళిపోయాను. సాయంత్రం డ్యూటీ అయ్యాక ధవిళేశ్వరం బేరేజి కాడెట్టే చేపల దుకాణాల్లో నాకు ఈ మజ్జే ఆలవాటైన సంగాడి బయ్యమ్మ దగ్గిర పనసతొన కొన్నాను. ఈ చేపకి పొలుసు చేలా చిన్నగా, ఎర్రగా మెరుత్తా ఉంటది. దాన్ని చేసేసి ఇమ్మంటే బండరాయిమీద తోమేసి, కడిగేసి ముక్కలుకోసి కవర్లో ఏసిచ్చింది. అయ్యన్నీచేయించుకుని ఏమగిరిలో పెట్రోలు కొట్టించుకుని మజ్జలో మండలాఫీసులో పన్చేసీ గీదాలోవరాజుతో మాటాడి ఆఫీస్‌నోట్ ఇచ్చి కడియం దేవీచౌక్ దగ్గిరికొచ్చీసరికి రాత్రి తొమ్మిదయ్యింది.
రోడ్డుమీద బస్సులు, కార్లు, బళ్ళు తగ్గిపోయాయి. దుకాణాలన్నీ మూసేత్తన్నారు. పూలమ్మీవోళ్ళు కూడా పలచబడ్డారు. ఉన్నదల్లా ఓ ఇద్దరు మాత్రమే. ఆళ్ళు నా బండి చూసి పరిగెట్టుకుంటా నా దగ్గిరికొచ్చారు. ఒక కుర్రోడి దగ్గిర పూలు ఇంకా తాజాగా అందంగాఉన్నాయి. సావరం నించొచ్చీ కుర్రొడి దగ్గిర పూలు వాడిపోయున్నాయి. అయ్యి తాజాగా కనిపించటానికి నీళ్ళు చిలకరిత్తన్నాడు. నన్ను చూసి నా దగ్గిరికొచ్చి పూలు కొనమని బతిమాలు తున్నారిద్దరూ.
సావరం కుర్రోడికి చనువెక్కువ. ఆడు ‘‘అక్కా, నా దగ్గిర ఎప్పుడూ కొనలేదు, ఇయ్యేల కొనక్కా. ఈ రెండు దండలే ఉన్నాయి, ఇయ్యమ్మెత్తే ఇంటికెళ్ళిపోతాను. మాఇంటికి చేలాదూరం నడిచెల్లాలక్కా, ప్లీజ్‌కొనక్కా’’ అంటా బతిమాలాడాడు.
ఇంకో కుర్రోడు మాత్రం‘‘ఏమండీ, నా పూలు తాజాగా ఉన్నాయి చూడండి. ఇయ్యి కొనండి’’ అంటా గట్టిగా అడుగుతన్నాడు. ఆడిమాటింటే సరుకు మాటెలావున్నా ఈడి దగ్గిర అసలు కొనకూడదు అన్నట్టుంది. సావరం కుర్రోడి మాట మాత్రం అవసరం లేపోయినా, పూలు తాజాగా లేపోయినా ఆడికోసమైనా కొనాలన్నట్టుంది. అందుకే ‘‘ఎంతరా చిన్నా’’ అనడిగితే ఆడు తెలివిగా ‘‘అక్కా! ఎవరికన్నా అయితే మల్లిపూలు మూర పదిరూపాయలు. నీకు మాత్రం ఐదురూపాయలే. కనకాంబరాలేమో మూర ఇరవై. నీకు పదే: అంటా బేరమాడకుండా బేరం తెగ్గొట్టాడు.
ఆడి మాటకారి తనానికి నేనింకేం మాటాడలేక పోయాను. కనకాంబరాలు, మల్లిపూలు ఆడు చెప్పిన రేటుకే కొనుక్కుని డబ్బులిచ్చాను. ఆడి దగ్గరున్నమొత్తం పూలు అయిపోయాయి. ఈలోగా నేను గబగబా ఎళ్ళి సర్వేశ్వర్రావు కొట్లో పళ్ళు కొనుక్కుని బయల్దేరే సరికి సరిగ్గా నేను పొద్దుట చూసిన సెంటర్‌లోనే ఆ సావరం కుర్రోడు చేతికి పూలబుట్ట తగిలించుకుని కొంచెం కుంటుతున్నట్టున్న కాలితో గబగబా నడుత్తున్నాడు. ఆణ్ణి చూసి బండాపాను. ఆడు దగ్గిరికొచ్చాక ‘‘ఒరేయ్ చిన్నా, బండెక్కు తీసుకెళ్తాను’’ అన్నాను.
ఆడు నన్ను నాబండిని చూసి ‘‘అక్కా, ఈబుట్టతో ఎక్కితే ఎవరైనా చూత్తే నీకు బాగోదక్కా. వొద్దులే. ఎలాగోలా నడుచుకుంటా ఎళ్లిపోతాను’’ అంటా నడుత్తున్నాడు. అప్పుడు గమనించాను ఆడికి కాలు ఒకటి పోలియో లాగుంది. ఎత్తెత్తి నడుత్తున్నాడు. ఆణ్ణి చూసి జాలేసింది.
ఎంటనే ‘‘ఒరేయ్ చిన్నా! ఎవరు చూసినా పర్లేదు. బండెక్కు, నాకేం పర్లేదు’’ అంటా ఆడి దగ్గిరికెల్లి బండాపాను.
ఆడు ‘‘అక్కా! నీ బండి మల్లెపూవు లాగుంది. నన్ను చూసావా.. ఎలాగున్నానో. మాసిపోయిన బట్టలు, చెమట కంపు. నీబండి మాసిపోద్దక్కా. రోజూ నేను ఇలాగే నడిచి ఎల్తాను. నడిచే ఒత్తాను, నాకలవాటే. పర్లేదక్కా, నువ్వెళ్ళు’’ అన్నాడు.
నాకు ఆడిమీద చెప్పలేనంత జాలేసింది. దాంతో గొంతులో లేని ఆధికారాన్ని అరువు తెచ్చుకుని ‘‘ఒరేయ్, ఏం పర్లేదు ఎక్కు. లేపోతే ఇంకెప్పుడూ నీ దగ్గిర పూలు కొనను’’ అన్నాను.
దాంతో ఎక్కాడు కానీ పాపం ఎక్కడం ఆడికంత తేలిగ్గా అవ్వలేదు. ముందు బుట్ట బండిమీదెట్టి ఆ తర్వాత బండి సైడ్ స్టాండెయ్యమని నాభుజం మీద చెయ్యేసి బరువంతా ఆన్చి కష్టంగా ఎక్కాడు. ఆణ్ణి ఎక్కించుకుని ఎళ్తా ‘‘చిన్నా, నీ పేరేంటిరా’’ అనడిగాను.
‘‘సూరినీడి అన్నవరం అక్కా’’ అన్నాడు.
‘‘అదేంట్రా ఇంటిపేరుతో సహా చెప్తున్నావు’’ అంటే
‘‘మా ఊర్లో మా ఇంటి పేరోల్లుకి చేలా పెద్దపేరు’’ అన్నాడు గొప్పగా!
‘‘సరేకానీ నువ్వు రోజూ నడిచే ఎల్తావ్, నడిచే వత్తావ్. సిటి బస్సెక్కవు. ఎవరినీ ఎక్కించుకోమని అడగవు. కాలు అవుకు అయినా నడిచే ఎల్తావ్. నడిచే వత్తావ్.. ఎందుకురా?’’ అనడిగాను.
దానికాడు ‘‘అదా అక్కా, సిటి బస్సెక్కితే ఎళ్లటానికి ఐదు రాటానికి ఐదు రోజుకు పదిరూపాయలు.. అంత డబ్బులు ఖర్చు చేసేత్తే ఎలా అక్కా? మాయమ్మ మందులికి నెలకి రెండేలు అవుతాయి. అందుకే ఒక్క రూపాయి కూడా దుబారా చెయ్యనక్కా. ఇంకెవరినన్నా ఎక్కించు కొమ్మంటే ఇందాక చూసావు కదక్కా.. బండెక్కాలంటే పదినిమిషాలు పడతది. అందులోనూ ఈపూలబుట్టతో ఎవరెక్కించుకుంటారక్కా.. అందుకే నేనే ఎవరినీ అడగను.
అందరికంటే ముందే బయల్దేరతాను. అందరికంటే లేటుగా వత్తాను సెంటర్‌కి. ముందొత్తే ఇంకా ఎక్కువ పూలమ్మొచ్చు. కానీ ఈకాలుతో ఎంతస్పీడుగా నడిచినా అంతకంటే తొరగా రాలేపోతున్నానక్కా’’ అని ఆడు చెబుతుంటే నాగుండెల్లో ఎక్కడో కలుక్కుమంది.
‘‘మరి బడికెళ్ళచ్చు కదరా బాగా చదువుకుంటే చక్కగా ఉజ్జోగం చేసుకోవచ్చు. ఇలా కష్టపడక్కర్లొద్దు’’ అన్నాను.
‘‘అవునక్కా. కానీ నేను పూలమ్మకపోతే ఇల్లు గడవదక్కా. నాన్న నా చిన్నప్పుడెప్పుడో చచ్చిపోయాడు ఏక్సిడెంట్‌లో. అదే ఏక్సిడెంట్‌లో మాఅమ్మకి అదేదో జబ్బచ్చేసింది. దానివల్ల నడుం కిందనించి అమ్మకి స్పర్శ తెలీదు. అన్నీ మంచంమీదే. నేను వొండుకుని అమ్మకి తినమని ప్లేటులో పెట్టి మంచం పక్కనెట్టి కేరేజట్టుకుని వొచ్చెత్తాను. మళ్ళీ రాత్రికే, ఈ లోగా ఏమైనా చూసుకోటానికి మా పిన్ని వొచ్చి చూసి ఎల్తాది. మాచెల్లి అమ్మకూడా ఉంటది. అమ్మనీ, చెల్లినీ నేనే పెంచాలక్కా’’ అంటా ఆడివరాలు చెబుతుంటే ఇంత పసివయసులో ఇన్ని కష్టాలా? ఓరి భగవంతుడా ఈడికష్టాలు ఎప్పుటికి తీరుత్తావు? అనుకున్నాను మనసులో.
ఇంత చిన్న వయసులో ఇంత భారం మోత్తున్న నిజమైన బాల శ్రామికుణ్ణి ఉప్పుటిదాక నేను చూళ్ళేదు. ఇలా ఆలోచిత్తా వుండగా మొన్న రెండుసార్లు ఆణ్ణిచూసి కూడా బండెక్కించు కోలేనందుకు నన్ను నేను చేలా తిట్టుకున్నాను. ఆణ్ణి ఎక్కించుకుంటే నా సోకుకి, నాబండికి వొచ్చిన నష్టమేంటీ? ఛ! నామీద నాకు మొదటిసారి చిరాకొచ్చింది. ఏది ఏమైనా రోజూ ఆణ్ణి ఎక్కించుకుని తీసుకెళ్ళి, తీసుకు రావాలి సిగ్గుపడకండా! ఎవరేమనుకున్నా పర్లేదు అని చేలా గట్టిగా నిర్ణయించుకున్నాను. ఇలా మాటాడుకుంటా వుండగా సావరంలో ఆళ్ళిల్లు వొచ్చీసింది. ‘‘అక్కా ఇదే మా ఇల్లు’’ అంటా బండాపాడు.
బండాపాకా జాగర్తగా దిగి ‘‘అక్కా ఉండు. రెండు నిమిషాలు కూచ్చో. మంచినీళ్ళు తెత్తాను. తాగి ఎల్దువుగాని’’ అన్నాడు.
‘‘సరేరా’’ అన్నాను.
ఆడు కుర్చీ ఏసినా కూచ్చోలేదు కానీ ఆడిచ్చిన మంచినీళ్ళు తాగి ఇంట్లోకి చూత్తే పడకగదిలో ఆళ్ళమ్మ మంచంమీద కూతరితో మాటాడతా కనబడిరది. ఎందుకో మనసు పాడైపోయింది. అక్కడ ఎక్కువసేపు ఉండలేకపోయాను. మంచినీళ్ళు తాగేసి ‘‘ఒరేయ్ తమ్ముడూ. రేపుటినించి నేనే తీసుకెళ్ళి తీసుకొత్తాను. నడిచి ఎళ్ళద్దు. సరేనా?’’ అన్నాను.
ఆడేమీ మాటాడలేదు. అవాక్కయిపోయి చూత్తన్నాడు. ఇది నిజమా అన్నట్టు.
‘‘సరే వత్తాను’’ అంటా ఇంటికి బయల్దేరాను.
ఇంటికొచ్చి చేపల కవర్ ఫ్రిజ్‌లో పెట్టేసి కాళ్ళు, చేతులు కడుక్కుని అమ్మ ఎంత బతిమాలినా అన్నం తినలేదు. తినబుద్దికాలేదు. మనసంతా ఏదో తెలీని బాధ. ఇదీ అని చెప్పలేని ఏదో నిరాసక్తత, నిస్తేజం కమ్మీసాయి. అమ్మతో కానీ, సుజాతతోకాని ఏమీ మటాడకండా అన్నవరం గురించే ఆలోచిత్తా నిద్దరోయాను. కలలోకూడా ఆడే, సముద్రంలో కొట్టుకుపోతన్నట్టు!
తుళ్ళిపడిలేచిమంచినీళ్ళు తాగి, బలవంతంగా నిద్రలోకి జారుకున్నాను.
మరసటిరోజు రోజూలాకాకండా కొంచుం తొరగానే బయల్దేరాను. ఎల్తా ఎల్తా చిన్ని స్టీలుబాక్సులో చేపల కూరతో అన్నం పట్టుకెళ్ళాను. సావరంలో అన్నవరం ఇంటికొచ్చీసరికి తయారైపోయి దేవుడికి దణ్ణవెట్టు కుంటన్నాడు. నన్నుచూసి ఆళ్ళచెల్లి పరుగెట్టు కొచ్చింది.
‘‘అక్కా, అన్నియ్య దణ్ణవెట్టుకుంటన్నాడు. లోపలికిరా కూచ్చుందుగాని’’ అంటా లోపలికెళ్ళి ఆళ్ళు బుధవారం చీటాయన దగ్గర ఆయిదాలమీద తీసుకున్న నీల్‌కమల్ కుర్చీ ఏసింది. ఎళ్లి కూచ్చున్నాను. ఇంతలో అన్నవరం లోపలినుంచి వొచ్చాడు.
‘‘అక్కా, అప్పుడే వొచ్చేసావ, నాకోసమేకదా ఇంత బేగా వొచ్చేసావు! ఉండు చద్దన్నం తినేసి వొత్తాను’’ అంటా ఆళ్ళ చెల్లి మంగని పిలిచి ‘‘అక్కకి టీ పెట్టావా?’’ అంటంటే కప్పులో టీ పోసి సాసరెట్టి తెచ్చిచ్చింది, నేనుచేలా గొప్పదాన్ని అన్నట్టు! ఆ పిల్లేమో స్టీల్‌గళాసులో టీ పోసుకుని తాగింది.
ఇంతలో అన్నారం రేత్రి మిగిలిన అన్నంలో ఉడుగ్గెంజేసుకుని తినేసొచ్చాడు. అది చూసి ఎక్కడో కలుక్కుమంది. ఆడు తాటాకులపూల బుట్టట్టుకుని రడీ అయితే ఆ బుట్ట నా కాళ్ళ దగ్గరెట్టుకుని ఆణ్ణెక్కించుకుని ‘‘ఓరే చిన్నా, ఈ రోజునించి బాక్సు తెచ్చుకోవద్దు. నేను తెత్తాను.’’ అంటా బాక్సుఆడికిచ్చాను.
‘‘నీకెందుకక్కా ఈకష్టం. నాకు చెల్లి మజ్జానం కేరేజంపుతాది. రోజూ అట్టికెళ్ళిపోతాను. ఇయ్యాల బేగా ఎల్తన్నాం కదా.. అందుకే మజ్జానం నాగరాజుగాడికి కేరేజట్టుకొచ్చీ బాబూరావు మాయకిమ్మని చెప్పాను.’’ అన్నాడు.
‘‘రోజూ నీకు నేను తెచ్చేత్తాన్లేరా. నీకు గుప్పుడు మెతుకులెట్టడం నాకేమంత కష్టంకాదు, అమ్మోళ్ళకి ఒండేసి వొచ్చేయ్. నీకు తెచ్చుకోకు! నేను సెలవెట్టుకున్నరోజో, ఆదివారమో తప్పా మిగిలిన రోజుల్లో కేరేజట్టుకు రావొద్దు. సరేనా?’’ అన్నాను.
ఆమాటకి ఆడికి కళ్ళల్లో నీళ్ళు బండి అద్దంలోంచి చూత్తుంటే కళ్ళు తుడుచుకుంటన్నాడు. మాటలు రాట్లేదాడికి ‘‘అక్కా నీ ఆంత మంచోళ్ళని ఉప్పుడిదాకా చూల్లేదు. వొద్దన్నా నువ్వు ఊరుకోవు. అందుకే ఏం మాటాడలేపోతన్నాను.నిన్ను దేవుడే అంపాడక్కా’’ అంటా ద్ణుఖం ఆపుకోలేకపోయాడు.
ఆడు అలా అంటంటే నాకు మనసంతా ఏదోలా అయిపోయింది.ఆడికి ఇంకా ఏదో చేయాలన్నంత ఆత్రుత నా మనసులో! ‘‘ఒరే చిన్నా సాయంత్రం నువ్వు పూలన్నీ అమ్మీసరికి ఎంతటైమోవ్వుద్దీ?’’ అనడిగాను.
‘‘ఒక్కోపాలి సందాల ఏడుగంటలకే అయిపోతాయక్కా. ఒక్కోపాలి రేత్రి తొమ్మిదైనా తోలుం మిగిలిపోతాయ్. అప్పుడిరక ఆకానిపూలు అట్టికెళ్ళి నాగరాజుగాడి ఫ్రిజ్‌లో ఎట్టి మరుసటిరోజు అమ్మెత్తాను.’’ అన్నాడు.
‘‘సరే అయితే. నేను రోజూ పళ్ళు కొనుక్కునీ సర్వేశ్వర్రావుకి చెప్తాను. పూలన్నీ అమ్మీసాక అతను నాకుఫోన్ చేత్తాడు. అప్పుడే వత్తాను నేను’’ అన్నాను.
‘‘మరప్పుడిదాకా ఎక్కడుంటావక్కా? నీ ఆఫీసు5 గంటలకైపోతాది కదా! ఒద్దులే అక్కా. నేను ఎలాగోలాగ రోజూలాగే వొచ్చేత్తాను. నువ్వు నాకోసంఎందుకు అంత టైందాకా ఉండడం వోద్దక్కా’’ అన్నాడు.
‘‘ఒరేయ్, నేనేలాగో పడతాను. నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి. అయినా ఇయ్యాల్టినించి అందరికంటే ముందెళ్తన్నావు కదా, ఇంక లేటవ్వదులే’’ అంటా ఆణ్ణి మాటాడనివ్వలేదు.
ఆణ్ణి దేవీచౌక్ దగ్గిర దింపేసి సర్వేశ్వర్రావుకి నాఫోన్ నంబరిచ్చి “ఆడు పూలన్నీఅమ్మీసాక నాకు ఫోన్ చెయ్యండి. నేనొచ్చి తీసికెళ్తానుఅన్నాను.”
“అమ్మా! ఆడు మీకేమైనాదగ్గిరా” అనడిగాడు.
‘‘కాదు’’ అన్నాను.
‘‘ఆడికోసం ఇంత సోకైన బండిమీద తాటాకు బుట్టెట్టుకుని ఎల్తారా? ఆడి గురించి మీకుతెల్దేమో.. ఆడు మహామాటకారి. ఎవరి దెగ్గిరా ఒక్కరూపాయి కూడా వుదలడు. మా చెడ్డజిడ్డుగాడు’’ అన్నాడు చిరాగ్గా! నేను ఇంటన్నాను.
అతను ‘‘ఓ సారి ఈడి దగ్గిర పూలు కొన్నాను. చిల్లర నాలుగురూపాయలు తక్కవైతే ఇచ్చీదాక రోజూ అడిగీవోడు. ఆడిది ఒక్కరూపాయికూడా వుదలడు. అంతజిడ్డుగాడు’’ అంటా అక్కసు ఎళ్ళగక్కాడు.
దానికి నేను ‘‘పోన్లేండంకుల్. ఆడొక్కడే సంపాయించాలి. అమ్మనీ, చెల్లినీపెంచాలి. పాపం అందుకే అలా ఉంటాడు’’ అంటా సర్ధిచెప్పి ‘‘ఆడి మాటకేంగానీ నాగురించి ఈ చిన్నసాయం చేసి పెట్టండి. ఆడుపూలన్నీ అమ్మీసుకున్నాక మీకు చెప్తాడు, అప్పుడు మీరుఫోన్ చేత్తే నేనొచ్చి తీసుకెళ్తాను’’ అన్నాను.
అతను అయిష్టంగానే సరేనన్నాడు. ఆ రోజు సాయంత్రం సరిగ్గా 6.30 ఫోన్ చేసాడు. వొచ్చీసరికి అన్నారం పూలన్నీ అమ్మీసుకుని ఖాళీ బుట్టతో ఉన్నాడు. ఆణ్ణి తీసుకుని భాస్కర ధియేటర్ సెంటర్లో బాదంఫీుర్ తాగి బయల్దేరాం. అక్కడున్నోళ్ళు నన్ను, బండిని, అన్నారాన్నిఇడ్డూరంగా చూత్తన్నాఅయ్యేమీ పట్టించుకోకండా. రోజూ ఆడు పూలు అమ్ముకోటానికి, బుట్ట ఖాళీ చెయ్యటానికి లేటయ్యీలాగుంటే ఏదోక రేటుకి అమ్మీసి తొరగా అక్కకి ఫోన్ చేయించాలి అనుకుంటన్నాడు. ఎందుకంటే తనవల్ల నేను ఇబ్బంది పడకూడదని.
ఒక్కోరోజు అమ్ముడవ్వపోయినా ‘‘మిగిలినియ్యి రేపు అమ్ముతాన్లే అక్కా’’ అంటా రోజూ 6.30 దాటకండా ఫోన్ చేయించేత్తన్నాడు. ఆదివారం వొచ్చినా సెలవొచ్చినా ఆణ్ణి తీసుకెళ్ళ లేపొతున్నందుకు చేలా బాదేత్తంది. సర్వేశ్వర్రావుకి ఫోన్ చేసి ఆడితో మాటాడించమని అడిగి మాటాడితే కానీ మనసు కుదుటపడదు. ఈ బంధం ఏనాటిదో కానీ ఆడు నాకంత అలవాటైపోయాడు, ఆణ్ణి చూడకండా ఒకరోజు మించి ఉండలేనంత.
ధవిలేశ్వరంలోనే కంప్యూటర్ జాయినయ్యాను. ఆఫీసయ్యాక ఆడి ఫోనొచ్చీ మజ్జలో కాలక్షేపం కోసం నాకిష్టమైన ఫొటోషాప్ పూర్తిగా నేర్చుకుందామని ఆఫీసయ్యాక లూధరన్ హైస్కూల్ దాటి శేఖర్ ధియేటర్ కెళ్ళీ కోదండ రామాలయం ఈదిలో కాటన్ కంప్యూటర్స్‌లో జాయినయ్యాను. అన్నారం ఫోన్ రాగానే ఎళ్ళి పోతన్నాను.
ఆ రోజు ఆఫీసులో ఆడిటింగ్ జరుగుతంది. పొద్దున తీసుకెళ్ళినపుడే అన్నారానికి చెప్పాను. ‘‘తమ్ముడూ ఇయ్యాల రేపులాస్టు బస్సుకెళ్ళిపో. నాకు ఆఫీసులో ఆడిట్ అవుతంది. నువ్వు డబ్బులు గురించి ఆలోచించక ఈరెండ్రోజులు బస్సెక్కేయ్. నువ్వునడిచెళ్ళావని తెలిత్తే నేను చేలా బాదపడతాను. నాకోసమైనా ఈ రెండ్రోజులు బస్సెక్కు’’ అన్నాను బతిమాలుతున్నట్టు.
ఆడు సరేనన్నాడు. ‘‘నీకోసం ఎక్కుతానక్కా. నాకోసం నువ్వు ఇంత ఇదవుతుంటే చేలాబాధగా ఉంది. నీకు నామీద ఇంత జాలేంటి? నీఅంత మంచిమనిషిని నేనింతదాకా చూళ్లేదక్కా’’ అంటా కళ్ళు తుడుచుకున్నాడు.
ఆరోజు నేను ఆడిట్ అయ్యాక బయల్దేరీసరికి రాత్రి 9 అయ్యంది. అప్పుటికే కడియం దేవీచౌక్‌లో కొట్లన్నీ కట్టేత్తన్నారు. సర్వేశ్వర్రావు అంకుల్ దగ్గిరికెళ్ళి అన్నారం గురించి అడిగితే ‘‘ఆడు ఇందాకే ఆఖరి బస్సెక్కాడమ్మా ఏమైందో కానీ’’ అన్నాడు.
‘‘సరే అంకుల్. ఆణ్ణి బస్సు కెళ్ళమని నేనే చెప్పాను. నాకు ఆఫీసులో ఇయ్యాల, రేపు ఆడిట్ ఉందని’’ అన్నాను. తర్వాత రోజు పొద్దున్నే అన్నారానికి ఇష్టమని పప్పు, కొబ్బరిపులుసు, కాల్చిన వంకాయి, రోటిపచ్చడి చేసి బాక్సెట్టి పట్టుకొచ్చి ఆణ్ణి తీసుకుని దేవీచౌక్‌లోదించి బాక్సిచ్చి‘‘ఇయ్యాల నీకిష్టమని పప్పు, కొబ్బరిపులుసు, వంకాయి రోటీపచ్చడి చేసాను. కడుపునిండా తినరా తమ్ముడూ, ఇయ్యాలకూడా నేను సాయంత్రం లేటుగానే వత్తాను. బస్సెక్కేయ్ సరేనా?’’ అన్నాను.
సరేనన్నాడు. ఇయ్యాల ఆడు తలస్నానం చేసి గంధం బట్టెట్టి ఇస్త్రి బట్టలేసాడు. ముద్దుగా ఉన్నాడు. అద్దంలోంచి ఆణ్ణి ఎన్నిసార్లు చూసానో నాకే గుర్తులేదు. అంతబుద్దిగా, ముద్దుగా ఉన్నాడు మరి. ఆణ్ణి దించేసిఎందుకో తలనిమిరాను అప్రయత్నంగానే. ‘‘వత్తాను రా చిన్నా రేపుకలుద్దాం’’ అంటా బయల్దేరాను.
సాయంత్రం ఆడిట్ అయ్యీసరికి రాత్రి తొమ్మిదయ్యింది. అలిసిపోయినట్టుంది ఒళ్ళంతా. బద్దకంగా బయల్దేరాను. తొరగా ఇంటికెళ్ళి స్నానంచేసి తిండిమాటెలా ఉన్నాతొరగా మంచమెక్కేయ్యాలి అనుకుంటా. సరిగ్గా దేవీచౌక్ దగ్గిరి కొచ్చీసరికి ఓ వందమీటర్ల మేర ఆటోలు, బళ్ళు, బస్సులు ఆపీసారు.
ట్రాఫిక్ అంతాఎక్కడికక్కడ నిలబడిపోయింది. ‘‘ఏమైంది’’ అనడిగితే ఒక్కొక్కళ్ళు ఒక్కోలా చెప్తున్నారు. ఎవరో పోలీసులు చెక్‌చేత్తాన్నారని ఇంకొకళ్ళు ఎవరో మినిష్టర్ కార్ ఎల్తాదంట దానికోసం ఆపారని!
వొంతిన కాణ్ణించి వత్తున్న ఓఅంటిపళ్ళ సైకిలతన్ని అడిగాను, ‘‘బాబాయ్ ఏమయ్యింది ట్రాఫిక్‌జామ్’’ అని.
‘‘అదా అమ్మా.. దేవీచౌక్‌కాడ ఎవరో ఒకతన్ని కారు గుద్దేసిందటమ్మా. నేను చూల్లేదు, పక్కనించొచ్చేసాను’’ అన్నాడు. నేను ట్రాఫిక్‌ని దాటుకుంటా పక్క పక్కనించి దేవీచౌక్ కాడికి ఎల్లిపోయాను. అప్పుటికి ఒక కారు ఎదురుగా ఒక బస్సు ఆగుంది, ఒకతన్ని గుద్దేసిన ఆనవాలు, మనిషి పడి రక్తసిక్తమైపోయిన గుర్తులు రోడ్డుమీద! గుండె దడదడ కొట్టుకుంది.
పోలీసులు, రిపోర్టర్లతో సెల్‌ఫోన్లో ఫొటోలు తీసుకునీ వోళ్ళతో రోడ్డంతా గందరగోళంగా ఉంది. సర్వేశ్వర్రావు దగ్గిరకెళ్ళి అడిగాను. అతను నన్ను చూత్తానే ‘‘అమ్మా జరగరాని ఘోరం జరిగిపోయింది. అన్నారాన్ని కారు గుద్దీసింది’’ అని చెప్తుంటే గుండెల్లో ఎవరో పొడిచేసినట్టైంది, భరించలేనంత బాధ కలిగింది.
ఇంక ఇనటానికి చెవులు సిద్దంగా లేవు. చూడ్డానికి కళ్ళు సిద్దంగాలేవు. అది ఇంటానే అక్కడి బల్లమీద కూలబడిపోయాను. నిస్సత్తువ ఆవహించేసింది. సర్వేశ్వర్రావు మంచినీళ్ళ బాటిలట్టుకొచ్చి ‘‘అమ్మానీళ్ళు తాగండి. తమాయించుకోండి. అంత ఇదయిపోతే ఎలాగమ్మా’’ అంటా బాటిలిత్తే నీళ్ళు మొఖంమీద చల్లుకుంటే కానీ మామూలవ్వలేదు, కొంతసేపుటిదాకా!
ఆ తర్వాత తేరుకున్నాక ‘‘రాజమండ్రి టు కోటిపల్లి బస్సాగింది. పూలట్టుకుని పరిగెట్టారందరూ.
ఎవరో దొంగనాకొడుకు ఈడి దగ్గిర అయిదు మూర్లమల్లిపూలు తీసుకుని డబ్బులివ్వలేదు. ఇంతలో బస్సు కదిలిపోయింది ఈడు దానికూడా పరిగెత్తాడు. ఆడు ఇత్తన్నాడనుకుని పరిగెత్తుకుంటా ఎల్తంటే, ఆడు ఈడిరక వొదలడనుకుని, యాభై ఇవ్వాల్సినోడు పదిరూపాయలిసిరాడు బయటికి.
అది తీసుకుంటానికి పరిగెట్టీసరికి ఎదరగా కారోడొచ్చి గుద్దీసాడమ్మా, అక్కడక్కడే పేణాలు పోయాయి బిడ్డకి. పోలీసులు నువ్వొచ్చీ ముందే గవర్నమెంట్ ఆస్పిటల్‌కి తీసుకెళ్ళారు. ఎవడైనా మల్లిపూలు కొనీవోడు ముందు డబ్బులుతీసి పట్టుకుని పూలుకొనాలి. ఆడెవడోకానీ ఈడుకుంటోడు పరుగెట్టలేడు, డబ్బులు వొదిలెత్తాడనుకుని కావాలనే అలాచేసాడు. ఆయాభైరూపాయలు, ఆ అయిదుమూర్ల మల్లిపూలు పిల్లోడి పేణం తీసేసాయమ్మా’’ అంటా చెప్తూ కళ్ళు తుడుచుకున్నాడు. అంతా ఇన్న నాకు జీవితంమీద విరక్తొచ్చింది.
‘‘సరే అంకుల్. నేనెళ్ళి ఆణ్ణి చూత్తాను” అంటా గవర్నమెంట్ ఆస్పటల్ కెళ్ళీసరికి కడిపిసావరం వోళ్ళతో ఆస్పటల్ నిండిపోయింది. ఎళ్ళి అన్నారాన్ని చూసీసరికి అక్కడ గుండెలు బాదుకుంటా ఏడుత్తున్న ఆడిచెల్లి, పిన్ని నన్ను చూసి బోరుమన్నారు. ఆణ్ణి అలా రక్తసిక్తమైన స్థితిలో చూసి పొగిలి పొగిలిఏడ్చాను. ఆడు మాటాడిన మాటలు ఆడి చేష్టలు పదే పదే గుర్తొచ్చి గుండెలుబాదుకుని ఏడ్చాను. నాజీవితంలో ఎవరికోసం ఎప్పుడూఇంతిలా ఏడ్లేదు. ఇంత వేదన భరించలేదు.
చిత్రంగా ఆడి మొఖంమీద మాత్రం చిన్నదెబ్బ కూడా లేదు. పొద్దున్న నేను చూసినపుడు ఎంతముద్దుగా ఉందో అంతే బుద్దిగా ఉంది. మిగిలిన వొళ్ళంతా రక్తసిక్తం. ఆణ్ణి అలా చూడలేక ఎక్కువసేపు అక్కడ ఉండలేక పోయాను. జరగాల్సిన పోస్టుమార్టమ్ అయ్యాక మరసటిరోజు సావరంనించి మాధవరాయుడుపాలిం ఎళ్ళే రూటులో సూరపనేని గోయిందు గారిమకాం దాటాకున్నా రుద్రభూమిలో ఆణ్ణి సమాధి చేసారు.
ఆడికి రావాల్సిన ఇన్సూరెన్సు డబ్బులు వొచ్చీలాగ నా లాయర్ ఫ్రెండ్ విన్నకోట సీతారామ్‌తో మాటాడి ముందుగా డబ్బులిప్పించాను. ఆడు బతికినంతకాలం కష్టపడి తల్లినీ, చెల్లినీ పెంచాడు. ఉప్పుడు చనిపోయినా కూడా పెంచుతన్నాడు. విచిత్రం ఏంటంటే జీవశ్చవంలా బతుకుతన్న ఆళ్ళమ్మ చావుకోసం ఎదురుచూత్తంటే ఆ దిక్కుమాలినచావు ఈడికొచ్చిందని ఆళ్ళమ్మతోపాటు చేలామంది అనుకున్నారు.నేను జి.పి.యఫ్. లోన్‌పెట్టి మూడులక్షలిచ్చాను.
ఉప్పుడు నాకు పొద్దున్నే లెగిసి వంటచేసి సావరం ఎళ్ళి అన్నారాన్ని ఎక్కించుకుని దేవీచౌక్ కెళ్ళాల్సిన అవసరంకానీ, సాయంత్రం ఆడి ఫోన్ కోసం ఎదురుచూసి ఆణ్ణెక్కించుకుని తీసుకెళ్ళాల్సిన అవసరంలేదు.రోజూ డ్యుటీకెళ్తా ఆళ్ళింటికాడ ఆగి పలకరించి ఎల్తన్నాను. కానీ ఆడు గుర్తురాని క్షణంలేదు. ఆడు ఎంతగా నన్ను ప్రభావితం చేసాడంటే ఆణ్ణి మర్చిపోలేక ఆ జ్ఞాపకాల్నించి తప్పించుకోటం కోసం ట్రాన్స్‌ఫర్ అడిగాను. ఈరోజే ఆర్డర్స్ వొచ్చాయి.
ఏజెన్సీప్రాంతం రంపచోడవరం, అయినా పర్లేదు. ఆడులేని ఊరు మాత్రమేకాదు నాకు చేలా ఇష్టమైన మా అమ్మమ్మగారూరు జేగురుపాడు కూడా ఇంకెప్పుడూ రాకూడదని నిర్ణయించు కున్నాను. ఆడు, నేను మొన్న సంక్రాంతికి బాలు స్టూడియోలో తీయించుకున్న ఫొటో మాత్రం పెద్దగా ఫ్రేమ్ కట్టించి పట్టుకెళ్తన్నాను. చివరగా ఆళ్ళింటికెళ్ళి పలకరించి, ఆడు నేను తిరిగిన చోటికెల్లా ఎల్లి వొచ్చాను. అయిదుమూర్ల మల్లిపూలు ఆడి పేణాలే తీసాయి. అందుకే జీవితంలో మల్లిపూలు పెట్టుకోకూడదని నిర్ణయించుకున్నాను.
ఆడితో నేను గడిపినన్ని రోజులు నేను పోయిన జన్మలో చేసుకున్న పుణ్యఫలం. జీవితంలో మర్చిపోలేని వ్యక్తి ఆడు.
ఎన్ని కష్టాలున్నా ఆడికి ఎవరిమీద ఫిర్యాదులు కానీ, అసంతృప్తి కానీ లేవు. పేద్ద కుటుంబమైనా ఎవరూ సాయం చేయట్లేదనికానీ, ఆడికి చిన్నప్పుడు మందులేయించక అద్దాంతరంగా పోలియో వొచ్చినందుకు అమ్మ, నాన్నలమీద కానీ, ఆణ్ణి కుంటోడని ఎటకారం చేసిన జనంమీద కానీ, ఇంత చిన్ని వొయసులో జీవశ్చవంలాంటి తల్లీ, ఏమీతెలీని చెల్లిని పెంచడానికి రోజంతా కష్టపడాల్సినంత కష్టమిచ్చిన దేవుడిమీద కానీ ఆడికి ఏ నిరసనలూ లేవు.
రోజంతా కష్టపడ్డం కష్టానికి తగ్గ ఫలితమిమ్మని దేవుడికి దణ్ణవెట్టుకోటం, సంపాయించిన పతీ రూపాయిని గౌరవించడం. ఇంత చిన్న వొయసులో మౌనంగా ఆడు మనుషులికి ఎన్నో చెప్పాడు. చిన్ని సైజు యోగిలా అన్పిత్తన్నాడు.
ఈ కడియం దేవీచౌక్కాడా ఇలాంటి దుర్ఘటనలు మామూలే ఇది ప్రభుత్వాలుకానీ, వ్యవస్థకానీ నియంత్రించలేని సమస్య. దీనికి మూలం పేదరికం. పిల్లలు బడులుమాని ఇలా పూలమ్మి కుటుంబానికి సాయపడతారు. ఇలాంటి దుర్ఘటనలకు బలౌతారు.
నేను ఊరొదిలి ఎళ్ళిపోతూ దేవీచౌక్ సెంటర్‌లో బండాపి దేవీగుడిలో కెళ్ళి పార్ధించాను. ఇక ఏ ప్రాణమూ ఇలా అన్యాయంగా పోగూడదని. ఆవిడ ఇన్నది, ఆవిడ చెవులు పెద్దయ్యి.
మరి నా కోరిక మన్నించిందో లేదో కాలమే చెబుతాది.
రత్నాకర్ పెనుమాక గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: రత్నాకర్ పెనుమాక
నేను రత్నాకర్ పెనుమాక. యానాంలో ఉంటాను. B.Sc, MBA చదివి వివిధ బహుళ జాతి కంపెనీల్లో HR డిపార్టుమెంటులో ఉన్నతోద్యోగాలు చేసి ఉద్యోగ విరమణ చేసాను. ప్రజా సేవ చేయాలనే బలమైన కాంక్షతో 2005 లో యానం లో ఒక స్వచ్ఛంద సేవాసంస్థ నెలకొల్పి పూర్తికాల సామాజిక సేవ చేస్తున్నాను. ఏవిధమైన ఫండ్స్ వసూలు చేయకుండా నా స్వంత నిధులతో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. వ్యక్తిగతంగా 41 సార్లు రక్తదానం చేసాను. మూడు సంవత్సరాల నుంచి రచనలు చేస్తున్నాను. 2022 లో నా మొదటి కథా సంపుటి "గౌతమీ తీరం" ఆవిష్కరించాను . అది మంచి పాఠకాదరణ పొందింది. ఈ సంవత్సరం నా రెండవ కథా సంపుటి "గౌతమీ ఒడ్డున " ఆవిష్కరించ బోతున్నాను. ఇప్పటి వరకూ 30 కవితలు 50 కథలు 5 నవలలు రాసాను. ఇవన్నీ అముద్రితాలే. 9 నెలల నుంచే పోటీలకు రచనలు పంపుతున్నాను. ఇప్పటికి 9 సాహిత్య పురస్కారాలందుకున్నాను. నన్ను ప్రోత్సహిస్తున్న పాఠకులకు, పోటీ నిర్వాహకులకు, న్యాయనిర్ణేతలకు సదా కృతజ్ఞుడను.
రత్నాకర్ పెనుమాక గారి కథ "మా అన్నవరం" ... గుండెను పిండేసింది. కళ్ళలో నీరు కారటం కాదు ... వాన కురిసింది.
హృదయ మీట ను లాగింది. మానవత్వం ను తట్టి లేపింది.
పేదల కష్టాలు - నిజాల జల్లు లా కురిపించింది
...
అందవిహీన మనుషులకు పేదరికం కూడా తోడవుతే... కష్టాలకు నష్టాలు కూడా తోడైనట్టు ... తోడెళ్లకు - నక్కలు కూడా తోడై ఎదురైనట్టు ... అని చెప్పకనే చెప్పింది.
పి.వి. పద్మావతి మధు నివ్రితి
తూ గో జి యాసలో ఓ చక్కని కథని పాఠకులకు అందించారు.
శుభం భ్హూయాత్