top of page
Writer's pictureYasoda Pulugurtha

మా బామ్మ మాట బంగారు బాట


'Maa Bamma Mata Bangaru Bata' written by Yasoda Pulugurtha

రచన : యశోద పులుగుర్త

అమూల్య మాటి మాటికీ గోడగడియారం వైపు చూస్తూ పని చేసుకుంటోంది ! దసరా శరన్నవరాత్రులు తొమ్మిది రోజులూ అమూల్య చాలా శ్రధ్దగా అమ్మవారిని పూజిస్తుంది.

సరిగ్గా ఉదయం ఎనిమిది కల్లా అమూల్య కంపెనీ బస్ ని అందుకోవాలి. అందుకే హడావుడి ! ఆ లోపులే ప్రసాదం చేయడం , వంట, టిఫిన్, తన పూజ, లలితా పారాయణం

అన్నీ అయిపోవాలని ఆత్రుత పడుతోంది ! రాత్రే వంటగది, గట్టు కడిగేసి ముగ్గు వేసేస్తుంది. పూజకు కావలసినవన్నీ అందుబాటులో పెట్టేసుకుంటుంది ! పిల్లలకు స్నానాలు చేయించడం , తయారుచేయడం వగైరా మాత్రం అమూల్య భర్త చరణ్ చూసుకుంటాడు !

ఆరోజు కూడా తెల్లవారు ఝామునే నాలుగుగంటలకల్లా నిద్రలేచిపోయింది అమూల్య !

ఆ రోజు శరన్నవరాత్రి మూడవరోజు. అమ్మవారు అన్నపూర్ణాదేవి అవతారం ఎత్తిన రోజు ! అన్నపూర్ణాదేవిని అష్టోత్తర నామాలతో కుంకుమార్చన చేసి లలితా సహస్రనామం చదవడం మొదలుపెట్టింది అమూల్య !

అమూల్య గొంతువిప్పి శ్రావ్యంగా ఆ తొలిఝాము వేళ “ శ్రీమాతా శ్రీ మహారాజ్నీ శ్రీమత్సింహాసనేశ్వరీ “ అని తన్మయత్వం తో గొంతెత్తి పారాయణం చేస్తుంటే ఒక అద్భుతమైన దివ్య సుగంధ పరిమళం ఆ పరిసరాలు అంతా వ్యాపించి ఒక పవిత్రమైన అనుభూతిని కలిగిస్తోంది !

‘అబ్బ ఎలా చేస్తావే బాబూ ఈపూజలు అవీనూ’ అంటూ అమూల్య కొలీగ్స్ అందరూ ఆశ్చర్యపోతారు ! ఆశ్చర్యమే మరి !

ఒక పెద్ద సాఫ్ట్ వేర్ సంస్థలో ప్రాజక్ట్స్, షెడ్యూల్స్ తో సతమతమౌతూ కూడా ఈ పూజలూ, పారాయణాలూ చేయడం అసంభవమని వారి ఉద్దేశ్యం !

ఈ తొమ్మిది రోజులూ తలంటు పోసుకుని , పొడవైన తన జుట్టుని వదులుగా జడ అల్లుకుని, నుదుటన చిన్న కుంకుమబొట్టు పెట్టుకుని చక్కని ప్యూర్ సిల్క్ చీరలు కట్టుకుని ఆఫీస్ కు వచ్చే అమూల్యను చూస్తూ ...... ఆమె కొలీగ్స్ అందరూ సరదాగా బామ్మగారు వచ్చేరండోయ్, ఏమి ప్రసాదం తెచ్చారోనంటూ ఆమె బేగ్ తెరిచి చనువుగా టిఫిన్ బాక్స్ తెరిచేస్తారు !

రోజుకొక రకం అమ్మవారికి ఇష్టం అయిన ప్రసాదాన్ని అమూల్య బాక్స్ లో పెట్టి తెస్తే అందరూ ఎంతో ఇష్టంగా నిమషంలో ఆరగించేస్తారు !

అమూల్య చూడడానికి బాపూ బొమ్మలా ఉంటుంది ! మామూలురోజుల్లో రక రకాల చుడీదార్లు ధరించి వచ్చినా, ఇదిగో.. ఇలాంటి పర్వదినాల్లో మటుకు అమూల్య చక్కని చీరల్లో వస్తుంది ! అసలే అందమైన అమూల్య ఆ చీరల్లో ముగ్ధమనోహరంగా ఉంటుంది !

అమూల్యకి ఎప్పుడూ తన బామ్మ స్మరణే ! తన కొలీగ్స్ తో ఏది మాటలాడినా ఎక్కడో ఒకచోట తన బామ్మ ప్రసక్తి వచ్చి తీరుతుంది ! తనకు తన బామ్మ ఆదర్శం అంటుంది !

‘అదేమిటే బాబూ...... అందరూ ఎంతో పేరు తెచ్చుకున్న గొప్ప గొప్ప మహిళలను ఆదర్శంగా తీసుకుంటే నీవేమిటీ ఎప్పుడూ మీ బామ్మనే ఆదర్శం అంటావూ’ అని తెల్లబోతారు అమూల్య కొలీగ్స్ !

‘మీరు ఎంతైనై చెప్పండి, నాకు మా బామ్మే గొప్ప’ అంటుంది

అమూల్య. తన పెళ్లి అయిన మొదటి రాత్రి తన భర్త చరణ్ తో ఏవో సరదాగా కబుర్లు చెపుతూ ...... ఉన్నట్టుండి బామ్మ గురించి ఏవేవో చెప్పడం మొదలు పెట్టింది..

కళ్లు పెద్దవి చేసుకుని బామ్మ గురించి చెపుతుంటుంటే చరణ్ కి అమూల్య కళ్లల్లో కదలాడుతున్న మెరుపులను చూస్తూ...... అల్లరిగా అమూల్యను

ఆటలు పట్టించాడు.. “ఏయ్, అమ్మూ! నీతోబాటు మీ బామ్మను కూడా తీసుకుని వచ్చేయి మనింటికి” అనగానే " నిజంగానా చరణ్!” అంటూ ...... “ఉండు. బామ్మకు

ఈమాట చెప్పొస్తాను, పాపం నేను అత్తవారింటికి వెళ్లిపోతానని నిన్నటినుండి కంట తడిపెడ్తూనే ఉందం”టూ లేవబోతుంటే చరణ్ అమూల్య చేయిపట్టుకుని ఆపేసాడు,

“రేపు పొద్దునే చెబుదువుగానిలే” అంటూ !

నిజానికి అమూల్య బామ్మగారు జానకమ్మగారు ఒక విశిష్టమైన వ్యక్తి.. జీవితంలో ఎంతో కష్టపడ్డారావిడ ! అమూల్యని చిన్నతనంనుండి ఆవిడే పెంచింది.. ఒక్క అమూల్య ఏమిటీ.... ఆవిడకు చాలామంది మనవలు, మనవరాళ్లు .. అందరూ ఆ బామ్మ గారి చేతిలోనే పెరిగి పెద్దవారైనారు !

అందరిలోకి ఈ మనవరాలు అమూల్య అంటే ప్రాణం !

అమూల్య బామ్మ గారికి నేటి కాలపు లోకంపోకడ బాగా తెలుసు.. ఆవిడ స్వాతంత్రం రాకమునుపే పుట్టినా ఆవిడవన్నీ ఆధునిక భావాలే ! అంటే ఆవిడ తన

అభిరుచులను, అభిప్రాయాలను కాలానుకనుగుణంగా మార్చుకుంటుంది ! అందుకే ఆవిడతో ఇంట్లో ఎవరికీ సమస్యలు లేవు ! ఆవిడ తన జీవితంలో ఎదుర్కొన్న

ఆటుపోటులు, ఆత్మ విశ్వాసంతో ప్రతీ సమస్యను ఎదుర్కొనిన విధానం ఎంతో ఆదర్శంగా ఉంటాయి ! ఆవిడ జీవిత అనుభవాలు నిజానికి వెలకట్టలేనివి !

రాత్రిళ్లు ఆవిడ తన మనవలు, మనవరాళ్లతో కూర్చుని, వాళ్లు చదువుకునేదాక అలాగే వాళ్లతోబాటూ ఉండిపోయేవారు ! అమూల్య చిన్నతనంలో కావాలని బామ్మ పక్కలో దూరి, తన ఒక కాలుని బామ్మ పొట్టమీద వేసేస్తూ ‘నీ చిన్నప్పటి కధ చెప్ప’మంటూ వేధించేది ! ఇంక ఆవిడ మొదలుపెట్టేది.. మన దేశానికి స్వాతంత్రం రాకమునుపు సంగతులన్నీ అనర్గళంగా చెపుతూ, తను, తాతగారు కలసి అనేక స్వాతంత్ర ఉద్యమాలలో పాల్గొన్నామని, విదేశీ వస్తు బహిష్కరణ, ఉప్పుసత్యాగ్రహం లాంటి అనేక ఉద్యమాల గురించి చెప్పడం, అమూల్య ఎంతో కుతుహూలంగా ఊకొట్టడం జరిగేది.

ఆ రోజుల్లో బ్రిటీష్ వాళ్లు ఎవరు ఖద్దరు బట్టలు ధరించినా, వందేమాతరం అంటూ నినాదాలు సాగించినా లాఠీదెబ్బలు కొట్టి అరెస్ట్ చేసి జైలులో పెట్టేవారని చెప్పేసరికి అమూల్య ఎంతో ఉద్వేగాన్ని పొందేది ! అటువంటి సంధర్భంలోనే వందేమాతరం ఉద్యమంలో మీ తాతగారిని బ్రిటీష్ వాళ్లు అరెస్ట్ చేసి తీసుకు వెళ్లేరని, అప్పటకి ఆరునెలలు మాత్రమే గడిచింది తమ వివాహమై అని చెపుతూ, తాతగారు అరెస్ట్ అయ్యారని తెలిసి నేను తాతగారిని విడిచి ఉండలేక, అదీకాక, అప్పుడు ప్రతీవారిలో దేశభక్తి ప్రబలిపోయి, బ్రిటీష్ వాళ్ల కబంధ హస్తాలనుండి మన భారత దేశాన్ని కాపాడుకుని స్వతంత్రం తెచ్చుకోవాలన్న పట్టుదల ఆవేశం ఉండేదని, అందుకే నేను కూడా మిగతా కొద్దిమంది స్త్రీలతో కలసి వందేమాతరం అంటూ నినాదాలు చేస్తూ ధైర్యంగా బ్రిటీష్ వాళ్లముందే నినాదాలు చేసేసరికి మమ్మలని కూడా అరెస్ట్ చేసి జైల్ లో పెట్టారని చెప్పేది బామ్మ!

బామ్మ చెపుతుంటుంటే ఎంతో శ్రధ్దగా వింటూ ఎప్పుడో నిద్రలో జారుకునేది అమూల్య! ఇంక మరుసటి రోజు, దాని కొనసాగింపు చెప్పమని వేధించేది..

‘జైల్లో మిమ్మలని కష్ట కష్టపెట్టేవారా బామ్మా, మిమ్మలని కొట్టేవారా, మీకు అన్నం పెట్టేవారు కాదు కదూ’ అని బిక్కముఖం చేసుకుని అడగడం, బామ్మ ‘కాదు, వాళ్లు స్త్రీలను చాలా మర్యాదగా చూసేవార’ని, ‘ఎందరో ప్రముఖ మహిళలు దుర్గాబాయ్ దేశ్ ముఖ్ , మాగంటి అన్నపూర్ణాదేవి వంటివారు తమ తో ఉన్నారని అందరు కలసి మెలిసి అక్కడ ఉన్న మిగతా మహిళలలకు చదువు చెప్పడం, కుట్లు, అల్లికలు అల్లడం, రాట్నం వడకడం వగైరా లాంటి ఎన్నో విద్యలు నేర్పి అందరినీ విజ్నానవంతులను చేసామ’ని చెప్పేది బామ్మ !

ఇలా ఒకటా, రెండా........

అనేక సంఘటనలను పూసగుచ్చినట్లుగా చెబుతూ ఉండేది బామ్మ ! అలాంటి బామ్మ ఒక పదినెలల కాలం రాయవెల్లూరు జైల్లో శిక్ష అనుభవించడం, వాస్తవానికి మా బామ్మ ధైర్యాన్నీ దేశభక్తిని మెచ్చుకోవచ్చు !

నిజానికి బామ్మ ఎంత ధైర్యవంతురాలు అని అమూల్య పదే పదే అనుకుంటూ ఉండేది !

పాపం తాతగారు హఠాత్తుగా చనిపోతే, బామ్మ ఆవిడ ఏడుగురి సంతానాన్ని ఎలా పోషించిందో చెపుతుంటుంటే తను ఎంతో ఏడ్చేసింది ! వెనుక ఏ ఆస్తిపాస్తులూ ,

ఆధారం, బంధువుల సహకారం లేని బామ్మ అప్పటికే హిందీలో భాషాప్రవీణ పాస్ అవడం తో ఒక స్కూల్ లో హిందీ టీచర్ గా ఉద్యోగం చేయడం తనకు ఆ రోజుల్లో కేవలం ఇరవై అయిదు రూపాయల జీతం మాత్రమే వచ్చేదని, ఆర్ధికంగా ఎన్నో ఇబ్బందులు పడ్డానని చెపుతూంటే ఎందుకో బామ్మ కంట్లోకి నీళ్లు వచ్చేసాయి ! ‘ఓన్లీ ..... ఇరవై అయిదు రూపాయలా బామ్మా, ఏడుగురు పిల్లలు, మరి సరిపోవుగా’ అని అంటే...... బామ్మ, ‘అవునే తల్లీ ! పిల్లలకు సరియైన తిండి పెట్చలేకపోతున్నానని బాధపడేదాన్ని.. సాయంత్రం స్కూల్ అయిపోయాక అదనంగా హిందీ ట్యూషన్లు చెప్పుకునేదాన్ని !

ఒక రోజు ఏమి జరిగిందో తెలుసా అమ్మూ! మీ బాబాయ్ కు తీవ్ర జ్వరం వచ్చింది. చేతిలో డబ్బులు లేవు.. ఒకవైపు ఇంట్లో బియ్యం నిండుకున్నాయి.. ఏమి చేయాలో పాలు పోలేదు.. బాబాయి ని హాస్పటల్ కు తీసుకుని వెళ్లాలి, ఇంట్లో మిగతా పిల్లలకు తిండి ఎలాగ అని ఆలో చిస్తుంటే...... భగవంతుడే పంపినట్లుగా ఒకాయన తన కూతురిని, కొడుకుని తీసుకుని వచ్చి హిందీ పాఠాలు చెప్పమని ఇద్గరికీ తలో అయిదు రూపాయలూ ట్యూషన్ ఫీజ్ అడ్వాన్స్ గా ఇచ్చారు ! ఆ పదిరూపాయలతో ఆరోజుల్లో తమ అవసరాలు ఎన్నో తీరాయ’ని చెపుతుంటుంటే, తను బామ్మను పట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చేసింది !"

ఒక్కొక్కసారి, నేను భోజనం చేస్తే నా పిల్లలకు సరిపోదేమో అనుకుంటూ అన్నం తినకుండా మజ్జిగ త్రాగి పడుకున్న రోజులున్నాయి అంటూ బామ్మ చెప్పినపుడు అమూల్య కళ్లల్లో నీరు ... బామ్మ ఒళ్లో కి దూరి బామ్మ చేతులు నిమురుతూ ఏడ్చేది !

ఇలా బామ్మ తన జీవితంలో ఎన్నో ఒడుదుడుకులను అధిగమంచి తన పిల్లలందరికీ ఎంతో కష్టపడి చదువులు చెప్పించింది..

ఆడపిల్లలు చదువుకోవాలి, ఆర్ధికంగా వాళ్ల కాళ్లమీద నిలబడాలనే కదూ...... తనని ముందునుండీ ఎంతో ప్రోత్సహిస్తూ, తనతోబాటు రాత్రుళ్లు తనకు తోడుగా కూర్చుని తనకి ఇంజనీరింగ్ లో సీట్ వచ్చిందని చెపితో ఎంతో పొంగిపోయింది !

తనకి ఇంజనీరింగ్ అయిపోగానే నాన్న పెళ్లి ప్రయత్నాలు చేస్తానంటే, ముందు ఉద్యోగం వచ్చి అమూల్య నిలదొక్కుకోనీ, అప్పుడు మంచి సంబంధాలు వస్తాయి చేద్దువుగానంటూ నాన్నతో గట్టిగా చెప్పి ఆపించేసింది !

బామ్మ అందరిలా కాదు.. నలభైసంవత్సరాలు హిందీ టీచర్గా పనిచేసి రిటైర్ అయింది.. తన కూతుళ్లకూ, కొడుకులకూ చక్కని చదువులేకాదు, చక్కని ఉద్యోగాలలో

నిలదొక్కుకున్నాకనే మంచి సంబంధాలను తెచ్చి పెళ్లి చేసింది ! బామ్మ రిటైర్ అయినా ఖాళీగా కూర్చోవడం అమూల్య ఎప్పుడూ చూడలేదు.. ఎప్పుడో ఏదో ఒక పనిచేస్తూ, అందరూ ఉద్యోగాలకు వెళ్లిపోతుంటే ఇంట్లో మనవలను, మనవరాళ్లనూ చూసుకుంటూ, వారి ఆలనాపాలనా చూస్తూ, అందరు ఆఫీస్ నుండి వచ్చేసరికి కమ్మగా వండి పెట్టేది.. ఏ పనీ లేకపోతే మంచి సాహిత్యం చదువుకునేది.. భగవన్నామస్మరణ చేసుకుంటూ ఉండేది ! ఎంతో హుందాగా ఉండేది..

ఇంట్లోతనకు అనవసరమైన విషయాలలో జోక్యం చేసుకునేది కాదు !

అమూల్య ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నప్పుడు, బామ్మ అమూల్య చేత లలితా సహస్రనామ పారాయణం, అలాగే విష్ణు సహస్ర నామ పారాయణాలు

మరెన్నో తనే దగ్గరుండి చగివించేది !

' అమ్మూ ' ...... ఒక నలభైరోజులు లలితా పారాయణం చేయి, నీకు ఉద్యోగం ఎందుకురాదో చూస్తానంటే తను ఎంతో శ్రధ్దగా పారాయణం మొదలు పెట్టిన కొన్నిరోజులలో

తనకు ఒక మంచి ఉద్యోగం రావడం జరిగింది ! తను ఎదుర్కొన్న ఎన్నో సమస్యలను, వాటిని బామ్మ ఏవిధంగా

పరిష్కరించుకుందో అనేక ఉదాహరణలు చెపుతూంటే...... బామ్మలో ఎన్ని శక్తులు దాగి ఉన్నాయోనని అబ్బురపడేది అమూల్య !

నన్ను అత్తవారింటికి పంపేటప్పుడు బామ్మ నన్ను పక్కకు పిలిచి చెప్పిన మాటలు నా హృదయంలో ఎప్పటికీ పదిలంగా అలాగే ఉండిపోతాయి ! ' అమ్మూ, లలితాదేవి నామావళిలో చెప్పబడిన ఈ శ్లోకం " నిజభర్తృ ముఖాంభోజ చింతనాయై నమో నమః”.... ఎంత విశిష్టమైనదో తెలుసా !

సదా భర్త ముఖారవింద ధ్యానముచేత, తన పాతివ్రత్యముచే భర్తను స్వాధీనము గావించుకొని, ‘శివా స్వాధీన వల్లభా’ అని కీర్తింపబడుతోంది, జగన్మాత! నీ భర్తను ప్రేమించు, గౌరవించు, అలాగే నీ అత్తగారింట వినయ విధేయతలతో మృదుభాషిణివై ప్రవర్తించి నీభర్తను మనసావాచా గెలుచుకో !

అమూల్యకు పుట్టిన పిల్లలను బామ్మ చేతిలో పెట్టినపుడు బామ్మ కళ్లల్లో ఎంతో ఆనందం ! ' అమ్మూ' ...... నీ పిల్లలను నేను ముద్దాడాలి, అంతవరకూ ఉంటానో లేదో

అంటూ పెళ్లి అయి తను అత్తవారింటి వచ్చేస్తుంటే అంత ధైర్యంగా ఉండే బామ్మ కూడా ఎంతో బేలగా అయిపోయింది.. అందుకే తను మరి ఎక్కువ ఆలస్యం చేయకుండా

టకా టకా పిల్లలని కనేసి బామ్మ చేతిలో పెట్టేసి హమ్మయ్య అనుకుంటూ తేలికగా ఊపిరి పీల్చుకుంది . బామ్మ ఆశీస్సులు నా పిల్లలకు కావాలని ఆశపడ్డాను ,

అది నెరవేరిందనుకుంటూ సంతోషపడింది అమూల్య !

బామ్మ చనిపోయిందని నాన్న ఫోన్ చేసి చెప్పినపుడు అమూల్య దుఖానికి అంతేలేదు ! బామ్మ లేదన్న బెంగతో ఏడుస్తూ జ్వరం తెచ్చుకుని పదిరోజులు మంచానపడింది.. ఇంట్లో అందరూ చాలా కంగారు పడ్డారు !

అమ్మవారిని భక్తితో కొలిచే బామ్మలో ఎంత దివ్యశక్తి దాగి ఉంది ! అమ్మవారు ఆదిపరాశక్తి, ఈ విశ్వాన్ని అంతటినీ నడిపించే ఒక దివ్యశక్తి అయితే ....

మరి మా బామ్మ ?

తన కుటుంబాన్ని అంతటినీ తన స్వశక్తితో నడిపించిన ఒక ధీరశాలి ! తాతగారు బామ్మ చిన్నతనంలోనే చనిపోయినా,

రెక్కలు రాని ఏడుగురు పసికందులను సంతానలక్ష్మి లా తన గుండెలకు అదుముకుని , ఒక పురుషునిలాగ మేరుపర్వతంలా నిలబడి, తన సొంతరెక్కలతో, తనకు సరస్వతీ దేవి ప్రసాదించిన చదువుతో ధైర్యలక్ష్మిలా ముందుకు అడుగువేస్తూ........ జీవితంలో తను సాధించాలనుకున్న విజయాలన్నింటినీ అధిరోహించి విజయలక్ష్మి అయింది ! తన పిల్లలూ ఏడుగురూ ఇళ్లుకట్టుకుని, కార్లలో తిరుగుతుంటుంటే ... అందరికంటే ధనలక్ష్మి అనుగ్రహాన్ని పొందినది నేనేనంటూ మురిసిపోయేది !

ఎవరైనా బామ్మముందు ఆడపిల్లకు అంత చదువు ఎందుకు, వయస్సురాగానే పెళ్లిచేసేసి బాధ్యత వదిలించుకోవడం మంచిదని మాట్లాడితేచాలు, బామ్మ ఊరుకునేది కాదు, వాళ్లకు విడమర్చి చెప్పేది " ఒక ఆడపిల్ల చదువుకుంటే ఆ చదువు తన కుటుంబానికే పరిమితం కాకుండా సమాజానికి కూడా ఎంతో ఉపయోగపడుతుందని "!

అబ్బ...... మా బామ్మ మాటలు నిజంగా బంగారం లాంటి మాటలే ! అందుకే నాకు మా బామ్మ ఆదర్శం !

మా బామ్మ నా హీరో !

అమూల్య పూజాగదిలో అమ్మవారి పటం పక్కనే తన బామ్మ ఫొటో పెట్టుకుని, పూజ చేస్తున్నపుడు బామ్మ తననే చూస్తుందని ఊహించుకుంటూ, మధ్య మధ్యలో బామ్మ వైపే చూసుకుంటూ లలితాసహస్ర నామాలను చాలా స్పష్టంగా బామ్మ మరీ మరీ వినాలని కోరుకుంటూ చదువుకుంటుంది !

బామ్మ చల్లని ఆశీస్సులు తనకి తన కుటుంబానికి శ్రీరామరక్షగా భావిస్తుంది !

***శుభం***


మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనల కొరకు క్లిక్ చేయండి.


రచయిత్రి పరిచయం :

నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub. Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాక పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ, మా శ్రీవారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం.


93 views0 comments

コメント


bottom of page