'Maarpu' written by Lakshmi Madan
రచన : లక్ష్మీ మదన్
“అమ్మా! ఓ అమ్మా!” అంటూ పిలిచింది పనిమనిషి రేణుక.
ఆఫీస్ కు వెళ్ళడానికి తయారవుతున్న శ్రావణి బయటకు వచ్చి “ఏంటి రేణుకా?’ అని అడిగింది. ఆమె మొహంలో అసహనం కనిపిస్తోంది. ఆఫీస్ కి లేట్ అవుతుంది అని.
“అమ్మా! నేను మా అత్త గారింటికి బతుకమ్మ పండక్కు పోదామని...మా అత్త రమ్మని చెప్పింది. నాకు అమ్మ లేని లోటు తీర్చింది. ఇప్పుడు సాత కాకుండా ఉన్నది.” అని అడిగింది రేణుక చేతులు నలుపుకుంటూ..
కాసేపు ఆలోచించింది శ్రావణి. ‘పని చేసుకోవడం ఎలా ఇది ఊరికి పోతే?’ అని... ‘ఈ సారి మా అత్త గారింటికి పోయే ప్లాన్ వేసుకుంటా నేను కూడా!’ అని అనుకుని “సరే ! వెళ్ళు. రెండు మూడు రోజుల్లో వచ్చెయ్యి” అన్నది.
రేణుక మొహం సంతోషంతో వెలిగి పోయింది. “సరే అమ్మా!..” అని మళ్లీ నసగసాగింది.
“మళ్లీ ఏమిటే !” అన్నది శ్రావణి.
“అమ్మా! ఒక్క వెయ్యి రూపాయలు ఇవ్వండి. నా నెల జీతంలో పట్టుకోండి” అన్నది.
“ఇస్తాలే వెళ్ళేటప్పుడు!” అని చెప్పి లోపలికి వెళ్ళింది. హ్యాండ్ బ్యాగ్ తెచ్చుకోవడానికి.
బ్యాగ్ లో లంచ్ బాక్స్, నీళ్ళ సీసా పెట్టుకుని " సందీప్ ! రేణుకకు వెయ్యి రూపాయలు ఇచ్చి నువ్వు ఆఫీసుకి వెళ్ళు. నాకు ఈ రోజు మీటింగ్ ఉంది. నేను వెళుతున్నాను " అని చెప్పి వెళ్ళిపోయింది.
కాసేపు అయ్యాక పనంతా చేసుకుని బయటకు వచ్చిన రేణుకకు శ్రావణి భర్త సందీప్ వెయ్యి రూపాయలు ఇచ్చాడు.
సంతోషంగా ఇంటికి వెళ్ళింది రేణుక.
***
భర్తతో సందీప్ తో కలిసి తన అత్తగారి ఇంటికి బయలుదేరింది శ్రావణి. వెళ్లే ముందు “అమ్మకు చీర కొందాం” అని సందీప్ అంటే "అవసరం లేదు” అని తమ వరకు మాత్రమే కొన్నది.
" పోనీ చెల్లెలికి కొందామా? " అంటే వద్దని గొడవ పడి, వట్టి చేతులతోనే ఊరికి వెళ్ళారు.
సాయంత్రం 8 గంటలకు చేరుకున్నారు. కారు దిగి పిల్లలతో లోపలికి వెళ్లారు. అత్త సుమిత్రమ్మ అందరినీ దగ్గరకు తీసుకుని సంతోష పడింది. మరదలు కూడా ఎంతో ప్రేమగా మాట్లాడింది.
“వెళ్లి స్నానాలు చేసి రండి రా! వంట సిద్ధంగా ఉన్నది” అని సుమిత్రమ్మ చెప్పగానే అందరూ ఇంటి వెనకాల ఉన్న బాత్ రూంలో ఒక్కొక్కరు వెళ్లి స్నానాలు చేసి వచ్చారు. పాత కాలం ఇల్లే అయినా సౌకర్యంగా అందంగా ఉన్నది. విశాలమైన హాలు, చక్కని పడక గదులు, వంటిల్లు, పూజ గది అన్నీ శుభ్రంగా ఉన్నాయి.
అందరికీ భోజనాలు వడ్డించింది అత్తగారు. సౌగంధి కూడా సహాయం చేసింది “వదినా! ఈ కూర నేనే చేశాను వేసుకో. అప్పడాలు బాగున్నాయి..ఇదిగో నెయ్యి " అంటూ కొసరి కొసరి వడ్డించింది.
పిల్లలను ఎంతో గారాబం చేస్తూ వాళ్ళతో ఎన్నో ముచ్చట్లు చెప్పి, తాను చిన్న పిల్లలా మారి పోయింది. అందరి భోజనాలూ అయ్యాక పిల్లలతో కలిసి పడుకుంది. పిల్లలు కూడా " అత్తా!" అంటూ చాలా సంతోషంగా ఆడుకున్నారు. ఒక కొత్త ప్రపంచం చూస్తున్నట్లు ఉంది వారికి. విశాలమైన ఇల్లు, మంచి గాలి, వెలుతురు, పెరట్లో రక రకాల పూల చెట్లు, పండ్ల చెట్లు, వేప చెట్టుకు కట్టిన ఊయల అన్నీ చూస్తుంటే ఎప్పుడు తెల్లవారుతుందా..చక్కగా ఆడుకుందామా అనిపిస్తోంది
తెల్లవారే బతుకమ్మ పండుగ. నౌకరు పూలు తెచ్చి అన్నీ వరుసలుగా పెట్టి వెళ్ళాడు. రెండెకరాల పొలం ఉంది. అందులో కావలసిన పంటలు పండిస్తోంది సుమిత్రమ్మ. అందరి భోజనాలు అయ్యాక సుమిత్రమ్మ గదిలోకి వెళ్లి కొన్ని కవర్లు తెచ్చింది. తలా ఒకటి ఇచ్చింది. అందరికీ బట్టలు ఉన్నాయి అందులో. శ్రావణి తన చీరను చూసి నివ్వెరపోయింది. చిలక పచ్చ రంగుకి, ఎరుపు అంచు హంసల డిజైన్ తో ఎంతో బాగుంది. కనీసం పది వేలు ఉంటుంది. ఎప్పుడో ఒకసారి అత్తగారితో అన్నట్లు గుర్తు ఆ రంగు ఇష్టమని ..గుర్తు పెట్టుకొని కొన్నారు. బతుకమ్మ ఆడడానికి వెళ్ళినప్పుడు “మా పిల్లలంతా వచ్చారు” అని అందరికీ పేరు పేరునా పరిచయం చేసింది. తెల్లవారి దసరా కూడా చక్కగా చేసుకున్నారు. జమ్మి చెట్టు పూజ చేసుకుని అందరి ఇళ్లకు వెళ్లి జమ్మి పంచుకుని వచ్చారు. భోజనాలు అయ్యాక పిల్లలు పడుకున్నారు.
సుమిత్రమ్మ కొడుకు కోడలు దగ్గరకు వచ్చి "సందీప్, శ్రావణి! మీతో మాట్లాడాలి. ఇలా వచ్చి కూర్చోండి " అన్నది.
ఇంటి మధ్య వాకిలిలో పెద్ద అరుగు ఉంది. అక్కడ చిన్న ఉయాల, పాత కాలం చెక్క సోఫాలు ఉంటాయి. వాకిలి పందిరి పై పరుచుకున్న రాధామాధవ చెట్టు తీగలు.. మరో వైపు మల్లె తీగలు.. పూలు విచ్చుకున్న పరిమళం వస్తోంది. ఆ గుబాళింపు ఆస్వాదిస్తూ "ఏ విషయం అమ్మా! "అన్నాడు. " చెల్లి పెళ్లి గురించి " అన్నది సుమిత్రమ్మ
వెంటనే శ్రావణి డబ్బు అడుగుతారేమో అని " పొలం అమ్మేయండి అత్తయ్యా!" అన్నది.
సుమిత్రమ్మ నవ్వుతూ " అవసరం లేదమ్మా! మీ మామ గారు సౌగంధి మరియు మనుమల పేరు మీద డబ్బులు జమ చేసి ఖాతాలో ఉంచారు . పెళ్లికి సరి పోతాయి. పిల్లల చదువుల కోసం కూడా ఏర్పాటు చేశారు " అని చెప్పింది.
కాసేపు ముచ్చట్లు చెప్పుకుని వెళ్లి పడుకున్నారు.
వచ్చినప్పటి తన ప్రవర్తన గుర్తుకు వచ్చి సిగ్గు పడింది. శ్రావణికి నిద్ర పట్ట లేదు. ఆలోచిస్తూ కిటికీ నుండి బయటకు చూడ సాగింది. కొంచెం సేపు అయ్యాక ఒక నిర్ణయానికి వచ్చి మెల్లిగా నిద్రలోకి జారుకుంది.
తెల్లవారి ప్రయాణం అయ్యారు. కూరగాయలు, పప్పులు, బియ్యము, నెయ్యి.. అన్నీ తీసుకుని వచ్చారు.
***
"అమ్మా! " అని రేణుక పిలవగానే ఈ లోకం లోకి వచ్చింది శ్రావణి.
"ఆ!" అన్నది.
“ పని అయిపోయింది. నా జీతం ఇస్తారా అమ్మా! మా అత్తకి మందులు పంపాలి” అన్నది.
శ్రావణికి ఒక్క సారి తల భూమిలోకి క్రుంగిపోయినట్లు అనిపించింది. అంతా గుర్తు చేసుకుంది.
“ వెయ్యి రూపాయలు మల్ల నెల పట్కోమ్మా!కర్సులు ఉన్నాయి” అన్నది రేణుక.
" వద్దు లేవే! పండగ ఇనాం ఇచ్చిన నీకు " అన్నది శ్రావణి. రేణుక కళ్ళల్లో సంతోషం చూసి తృప్తి పడింది.
లోపలికి వెళ్ళి " సందీప్ ! సౌగంధి పెళ్లి చీరలు, బంగారు నగలు అన్నీ మనమే తీసుకుందాం. ఘనంగా చేద్దాం పెళ్లి మంచి సంబంధం చూసి " అన్నది.
సందీప్ ‘ఇది కలా ! నిజమా !’ అనుకున్నాడు. భార్యలో మార్పుకు ఆనందపడ్డాడు.
రచయిత్రి పరిచయం ; పేరు లక్ష్మి
కలం పేరు : లక్ష్మీ మదన్
హైదరాబాద్ లో ఉంటాను.
500 కి పైగా కవితలు, 300 కి పైగా పద్యాలు, పాటలు, కథలు రాసాను.
.
Comments