'Madhavi - Part 1/3' - New Telugu Story Written By Neeraja Hari Prabhala
Published In manatelugukathalu.com On 24/07/2024
'మాధవి - పార్ట్ 1/3' పెద్ద కథ ప్రారంభం
రచన: నీరజ హరి ప్రభల
(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
“మాధవీ! రేపు నీకు పెళ్లి చూపులు. ఊరిలోని చిన్న పిల్లలను వెంటేసుకుని చెట్టు, పుట్టలు, పొలాల గట్ల వెంట తిరగక రేపన్నా ఇంటిపట్టునే ఉండు” అన్నారు రాఘవయ్య గారు కూతురితో.
కొన్ని రోజులక్రితమే ఇంటరు పరీక్షలను పూర్తిచేసుకుని శెలవులకు ఇంటికి వచ్చింది మాధవి. చిన్నప్పటి నుండి చదువంటే ఎంతో ఇష్టమున్న మాధవి మంచిమార్కులను తెచ్చుకుంటూ స్కాలర్షిప్ ను పొందుతోంది. ‘ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగంలో స్ధిరపడి తన తల్లి తండ్రులను కంటికి రెప్పలా చూసుకోవాలి’ అనేది ఆమె కోరిక.
పెళ్లి చూపులని తండ్రి చెప్పిన మాటలు గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయి వెంటనే తల్లితండ్రుల వద్దకు వెళ్లి తన కోరికను తెలిపి, తనకిప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచన లేదని తన నిర్ణయాన్ని చెప్పింది మాధవి. కూతురి నిర్ణయానికి రాఘవయ్య ససేమిరా ఒప్పుకోలేదు. తాముండే ఊరు అగ్రహారం, ఇప్పటికే కూతురి పెళ్లి చేయలేదని నలుగురూ నాలుగు మాటలనుకోకుండా, కుటుంబ పరిస్ధితిని దృష్టిలో పెట్టుకొని పెళ్లి చూపులకు ఒప్పుకోమన్నారు. తల్లి కమలమ్మ కూడా అదే అభిప్రాయం చెప్పడంతో ఇంక వాళ్లను నొప్పించలేక మిన్నకుండిపోయింది మాధవి.
మధ్యతరగతి కుటుంబలో పుట్టిన మాధవికి ముగ్గురు అక్కలు, ఇద్దరు అన్నలు. తన ఊహ తెలిసే సమయానికే పై అక్కలందరి పెళ్లిళ్లయి వాళ్లు పిల్లల తల్లులుకూడా అయ్యారు. వాళ్ల పిల్లలు, తను ఒక వయసువారు. తండ్రి పోస్ట్ మాస్టర్ గా ఉద్యోగం చేస్తూ, పెద్దలిచ్చిన ఐదు ఎకరాల పొలంలో ఒక్కో కూతురి పెళ్లికీ పొలాన్ని అమ్ముకుంటూ ముగ్గురి ఆడపిల్లల పెళ్లిళ్లను చేసి వాళ్లనత్తారింటికి పంపారు. కొడుకులిద్దరిని డిగ్రీలు చదివించారు. మంచి ఉద్యోగాలు రాగానే వాళ్లకి వివాహాలు చేశారు. వాళ్లు పట్నంలో తమ భార్యాబిడ్డలతో సంతోషంగా ఉంటున్నారు.
ఇంక మిగిలిన ఒకటిన్నర ఎకరం పొలాన్ని సాగుచేసుకుంటూ ఉన్నంతలో కుటుంబానికేలోటూ రాకుండా చూసుకుంటూ పరువూ-ప్రతిష్టలే ప్రాణంగా భావిస్తూ బ్రతుకుతున్నారు రాఘవయ్య దంపతులు.
మాధవి మౌనంగా తన గదిలోకి వెళ్లింది. ఆ మరురోజు పెళ్లివారు ఇరవై మంది వచ్చారు. వాళ్లింట్లో పెళ్లికొడుకు వచ్చే ఆనవాయితీ లేదుట. అందరూ ఆమెని వివిధరకాలుగా శల్య పరీక్షలు, యక్షప్రశ్నలు వేసి ఇంటికి వెళ్లి కబురుచేస్తామని వెళ్లారు.
మాధవికి వరుడు ఎలా ఉంటాడో? అతని పేరేమిటో? ఏం చేస్తాడో? అతని విద్యార్హతలు, వాళ్ల కుటుంబ స్ధితిగతులను తెలుసుకోవాలని ఉండి తల్లిని అడిగింది. అతని పేరు ‘శరత్” అని, అతనికి తల్లి, నలుగురు అన్నదమ్ములు ఉన్నారని, నాలుగు సం.. క్రితం తండ్రి గతించారని, వాళ్లది 30మంది కుటుంబ సభ్యులు ఉన్న ఉమ్మడి కుటుంబం, ఉమ్మడి వ్యాపారం, బాగా స్ధితిగలవాళ్లు, మాధవికీ అతనికీ మధ్య పదేళ్ల వయసు తేడా అని చెప్పింది తల్లి.
ఇప్పుడు తను ఏది చెప్పినా ఆ ఇంట్లో తండ్రి మాటకు తిరుగులేదు. వయసు తేడా వలన తన అక్కలతో, అన్నలతో తన మనసులోని మాట చెప్పే చనువు లేదు. చిన్నప్పటి నుండి వాళ్లు తన గురించి అంత ప్రేమగా పట్టించుకునే వాళ్లు కారని తెలిసిన మాధవి మౌనంగా ఊరుకుంది.
ఆతర్వాత వారం రోజులకు పెళ్లి వారినుంచి మరలా కబురు. ఈసారి పెళ్లి కొడుకు కజిన్సు, వాళ్ల భార్యలు వచ్చి మాధవిని చూస్తారుట. వాళ్లకు కూడా నచ్చాలి అని. “సరే! రమ్మన్నారు” రాఘవయ్య దంపతులు.
ఒక రోజున మాధవికి మరలా పెళ్లి చూపులు. ఈసారి పదిహేను మంది వచ్చి ఆమెని చూసి మరలా వాళ్ల ఇంటర్వ్యూలు. సంతలో బలిపశువు లాగా ఇన్నిమార్లు ఇంతమంది అదీ పెళ్లి కొడుకు లేకుండా ఈ పెళ్లి చూపులు మాధవికి సుతరామూ ఇష్టం లేకపోయినా తల్లి తండ్రులను చూసి తన మనసుకు సర్ది చెప్పుకుంది. వాళ్లు వెళ్లాక పెళ్లి వారినుండి ‘పిల్ల తమకు నచ్చింది’ అని, మీరు వచ్చి మిగిలిన విషయాలను మాట్లాడుకోమని కబురు విన్నాక రాఘవయ్య దంపతులు సంతోషంగా ఊపిరి పీల్చుకున్నారు.
రాఘవయ్య గారు ఊర్లోని నలుగురు పెద్దమనుషులను వెంటనిడుకొని శరత్ వాళ్లింటికి వెళ్లి కట్నం, లాంఛనాలు, పెట్టుపోతలు వగైరా విషయాలను మాట్లాడుకుని తాంబూలాలకు ముహూర్తం నిర్ణయించుకుని వచ్చి ఆ విషయాన్ని భార్యకు, కూతురికీ చెప్పారు.
మాధవికి తన చదువు, భవిష్యత్తు మీద ఎన్నో కోరికలు, ఆశయాలు ఉన్నా, తల్లితండ్రుల కోసం, తమ ఇంటి పరిస్థితులను అర్థం చేసుకుని వాటినన్నింటినీ మనసులోనే అణచుకుంది.
మరో పదిహేను రోజులకు పెళ్లివారు రావడం, తాంబూలాలు పుచ్చుకోవడం జరిగింది. ఈసారి కూడా శరత్ రాలేదు. పెళ్లిలో తెరసెల్లా పెట్టి అది తీసే సమయం దాకా వధూవరులు ఒకళ్లనొకళ్లు చూసుకోరుట ఆ కుటుంబంలో. శరత్ తల్లి ఆ మాట అందరికీ గొప్పగా చెప్పింది. పెళ్లికూతురుకి ‘సిగ్గు’ అనేది సహజలక్షణమని మాధవిని కూడా ఒక గదిలో వాళ్లందరూ వెళ్లేదాకా ఉంచారు కమలమ్మ వాళ్లు.
వాళ్లకు భోజనాలు వగైరా అతిధి మర్యాదలతో తలమునకలై వాళ్లని సంతృప్తిగా పంపించాక తల్లి తండ్రులు మాధవితో “ నీవు చాలా అదృష్టవంతురాలివి. నీకు చూసిందే ఈ సంబంధం. వెంటనే అది కుదరడం జరిగింది. వచ్చే నెల ఇరవయ్యోతేదీన తెనాలిలో నీకు పెళ్లి. ” అని ఆరోజున తిధి, వారం, సమయం చెప్పారు.
కట్నకానుకలు, పెళ్లి ఖర్చుల కోసం ఎకరం పొలాన్ని అమ్మి పెళ్లి వారికివ్వవలసిన కట్నాన్ని ఇచ్చి వాళ్లడిగిన కల్యాణమండపంని చూసి కూతురి వివాహ ఏర్పాట్లలో మునిగిపోయారు రాఘవయ్య. అనుకున్న సమయానికి మాధవీ, శరత్ ల వివాహం ఎటువంటి లోపాలు జరుగకుండా చాలా ఘనంగా జరిపించి మాధవిని అత్తవారింటికి పంపించారు రాఘవయ్య దంపతులు.
ఎన్నోకలలు, కోటి ఆశలతో బెరుకు బెరుకుగా, సిగ్గుతో అత్తవారింట్లో అడుగుపెట్టిన పదిహేడేళ్ల మాధవికి ఆఇంట్లో చాలామంది అంతా పెద్ద వయసులలో ఉన్న వారిని చూసి మాధవికి కొంచెం భయము, బెంగ వేసింది. తన కూడా తల్లి, తండ్రి రాలేదు. బావగారే వచ్చి తీసుకురావడం ఆచారంట. లోపలికి అడుగిడిన మాధవి తన అత్తగారి పాదాలకు నమస్కరించింది. ఇంక వరుసగా పెద్దత్థగార్లకు, పిన్నత్తగార్లకు, పినమామగార్లకు, బావగార్లకు, తోడికోడళ్లకు అందరికీ నమస్కారం చేసింది మాధవి.
ఆ తర్వాత కాసేపటికి అందరూ ఏవో కబుర్లు, ముచ్చట్లు. బావగారికూతురు ఆ ఇంటినంతా చూపించింది మాధవికి. పెద్ద బంంగళా వంటి ఇల్లు, ఆ ఇంట్లో విశాలమైన హాలులు 5, అటు ప్రక్క, ఇరుప్రక్కల గదులు వెరసి మొత్తం పది గదులు. చుట్టుపక్కల పెద్ద ఆవరణలో చిన్న చిన్న ఇళ్లు, అవి అద్దెకిచ్చారుట. ఎతైన ఆ కాంపౌండ్ లోకి అడుగు పెడితే ఇంక బయటిప్రపంచం ఏమీ తెలియనంత విశాలమైన ఇల్లు.
ఇంటిని, ఇంట్లో అందరినీ చూసిన మాధవికి ఇంత పెద్ద కుటుంబం తనకు ఉందన్న సంతోషం కలిగింది. పెద్ద తోటికోడలు పూర్ణ తమ గదిని మాధవికి చూపించింది. కాస్త విశ్రాంత తీసుకున్నాక అత్తగారు క్రొత్త కోడలు వంట చేయాలని తొలిరోజునే మాధవిచేత కాసామడి కట్టించి గాడిపొయ్యిల మీద ఇత్తడి గుండిగలతో వంట, క్రిందకు వంగి అందరికీ వడ్డనలను చేయించారు. కోడలు పనిమంతురాలవునో, కాదో అని పరీక్షట. ఆ విషయం తర్వాత తెలిసింది మాధవికి. అందరికీ, ఎంతో ఓర్పుతో వండి వడ్డించిన మాధవిని అందరూ చాలా మెచ్చుకున్నారు.
ఇంట్లో తనతో భర్త చాలా ముభావంగా ఉండడం చూసి క్రొత్త కదా అనుకుంది. ఆ రాత్రికి పాలగ్లాసుతో అడుగుపెట్టిన మాధవికి భర్త చెప్పిన మాటలకు మనసులో చాలా బాధ కలిగింది. తనకీపెళ్లి ఇష్టంలేదని, తను వేరే అమ్మాయిని ప్రేమిస్తే ఇంట్లో ఎవరూ ఒప్పుకోలేదని, తల్లి కోరికమీదట నిన్ను పెళ్లి చేసుకోవలసి వచ్చిందని చెప్పి వేరే గదిలోకి వెళ్లి పడుకున్నాడు. భర్త చెప్పింది విన్న మాధవికి తన కాళ్లక్రింద భూమి కదులుతున్నట్లయింది. ఆ రాత్రి మాధవి కార్చిన కన్నీటితో తలగడ తడిసింది. మాధవికి తన భవిష్యత్తు అంతా అంధకారమైనట్లయింది.
“ఇప్పుడేంచేయాలి? భర్తకిష్టంలేని పెళ్లి అని అమ్మానాన్నలతో చెబితే వాళ్లు తనని అర్ధంచేసుకోకపోగా పెళ్ళైన పిల్ల, భర్తనొదిలి పుట్టింటికి రాగూడదు, పరువుప్రతిష్టలు అంటూ పాకులాడే మనస్తత్వం కలవారు. ఇంక వాళ్లతో ఏం చెప్పినా ఉపయోగం ఉండదనుకుని వాళ్లను బాధపెట్టగూడదనుకుంది మాధవి.
“తనిప్పుడు అతని భార్య. తనే సర్దుకుపోవాలి. ఓర్పుతో, ప్రేమతో నెమ్మదిగా అతని మనసుని మార్చుకుని సంసారం చేసుకోవాలి. కాపురానికి పంపించేటప్పుడు “మీది ఉమ్మడి కుటుంబం, భర్తకు, అత్తగారికి, మిగిలిన పెద్దవాళ్లకు మర్యాదలు, సేవలు చేస్తూ, వాళ్లు చెప్పినది వింటూ మంచికోడలు, మంచి భార్య అనిపించుకోవాలి” అని అమ్మానాన్నలు చెప్పిన మాటలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను గుర్తుకుతెచ్చుకుంది మాధవి.
========================================================================
ఇంకా వుంది..
========================================================================
నీరజ హరి ప్రభల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ నీరజ హరి ప్రభల గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం :
Profile Link:
Youtube Play List Link:
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు
నా గురించి పరిచయం.....
నా పేరు నీరజ హరి ప్రభల. మాది విజయవాడ. మావారు రిటైర్డ్ లెక్చరర్. మాకు ముగ్గురు అమ్మాయిలు. మాలతి, మాధురి, మానస. వాళ్లు ముగ్గురూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ భర్త, పిల్లలతో సంతోషంగా ఉంటున్నారు.
నాకు చిన్నతనం నుంచి కవితలు, కధలు వ్రాయడం చాలా ఇష్టం. ఆరోజుల్లో వాటిని ఎక్కడికి, ఎలా పంపాలో తెలీక చాలా ఉండిపోయి తర్వాత అవి కనుమరుగైనాయి. ఈ సామాజిక మాధ్యమాలు వచ్చాక నా రచనలను అన్ని వెబ్సైట్ లలో వ్రాసి వాటిని పంపే సౌలభ్యం కలిగింది. నా కధలను, కవితలను చదివి చాలా మంది పాఠకులు అభినందించడం చాలా సంతోషదాయకం.
నా కధలకు వివిధ పోటీలలో బహుమతులు లభించడం, పలువురి ప్రశంసలనందుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను.
మన సమాజంలో అనేక కుటుంబాలలో నిత్యం జరిగే సన్నివేశాలు, పరిస్థితులు, వాళ్లు పడే బాధలు కష్టాలు, ధైర్యంగా వాటిని ఎదుర్కొనే తీరు నేను కధలు వ్రాయడానికి ప్రేరణ, స్ఫూర్తి. నా కధలన్నీ మన నేటివిటీకి, వాస్తవానికి దగ్గరగా ఉండి అందరి మనస్సులను ఆకర్షించడం నాకు సంతోషదాయకం. నిత్యం జరుగుతున్న దారుణాలకు, పరిస్ధితులకు నా మనసు చలించి వాటిని కధల రూపంలోకి తెచ్చి నాకు తోచిన పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తాను.
నా మనసులో ఎప్పటికప్పుడు కలిగిన భావనలు, అనుభూతులు, మదిలో కలిగే సంఘర్షణలను నా కవితలలో పొందుపరుస్తాను. నాకు అందమైన ప్రకృతి, పరిసరాలు, ఆ సుందర నైసర్గిక స్వరూపాలను దర్శించడం, వాటిని ఆస్వాదించడం, వాటితో మమేకమై మనసారా అనుభూతి చెందడం నాకు చాలా ఇష్టం. వాటిని నా హృదయకమలంలో అందంగా నిక్షిప్తం చేసుకుని కవితల రూపంలో మాలలుగా అల్లి ఆ అక్షర మాలలను సరస్వతీ దేవి పాదములవద్ద భక్తితో సమర్పిస్తాను. అలా నేను చాలా దేశాల్లలో తిరిగి ఆ అనుభూతులను, అనుభవాలను నా కవితలలో, కధలలో పొందుపరిచాను. ఇదంతా ఆ వాగ్దేవి చల్లని అనుగ్రహము. 🙏
నేను గత 5సం… నుంచి కధలు, కవితలు వ్రాస్తున్నాను. అవి పలు పత్రికలలో ప్రచురణలు అయ్యాయి. పుస్తకాలుగా ప్రచురించబడినవి.
“మన తెలుగు కధలు.కామ్. వెబ్సైట్” లో నేను కధలు, కవితలు వ్రాస్తూ ఉంటాను. ఆ వెబ్సైట్ లో నాకధలకి చాలా సార్లు నగదు బహుమతులు వచ్చాయి. వస్తున్నాయి. అనేక ప్రశంసలు లభించాయి. వాళ్ల ప్రోత్సాహం జీవితాంతం మరువలేను. వాళ్లకు నా ధన్యవాదాలు. ఆ వెబ్సైట్ వాళ్లు రవీంద్రభారతిలో నాకు “ఉత్తమ రచయిత్రి” అవార్డునిచ్చి ఘనంగా సన్మానించడం నా జీవితాంతం మర్చిపోలేను. ఆజన్మాంతం వాళ్లకు ఋణపడిఉంటాను.🙏
భావుక వెబ్సైట్ లో కధల పోటీలలో నేను వ్రాసిన “బంగారు గొలుసు” కధ పోటీలలో ఉత్తమ కధగా చాలా ఆదరణ, ప్రశంసలను పొంది బహుమతి గెల్చుకుంది. ఆ తర్వాత వివిధ పోటీలలో నా కధలు సెలక్ట్ అయి అనేక నగదు బహుమతులు వచ్చాయి. ‘మన కధలు-మన భావాలు’ వెబ్సైట్ లో వారం వారం వాళ్లు పెట్టే శీర్షిక, వాక్యానికి కధ, ఫొటోకి కధ, సందర్భానికి కధ మొ… ఛాలెంజ్ లలో నేను కధలు వ్రాసి అనేకమంది పాఠకుల ప్రశంశలను పొందాను. ‘మన తెలుగుకధలు. కామ్ వెబ్సైట్ లో “పశ్చాత్తాపం” అనే నా కధకు విశేష స్పందన లభించి ఉత్తమ కధగా సెలక్ట్ అయి నగదు బహుమతి వచ్చింది. ఇలా ఆ వెబ్సైట్ లో నెలనెలా నాకధలు ఉత్తమ కధగా సెలెక్ట్ అయి పలుసార్లు నగదు బహుమతులు వచ్చాయి. వస్తున్నాయి.
గత 5సం.. నుంచి “మన తెలుగు కధలు.కామ్. వెబ్సైట్“ లో నేను కధలు వ్రాస్తూ ఉంటున్నాను. ఆ వెబ్సైట్ లో నాకధలకి చాలా సార్లు నగదు బహుమతులు వచ్చాయి. వస్తున్నాయి. అనేక ప్రశంసలు లభించాయి. వాళ్ల ప్రోత్సాహం జీవితాంతం మరువలేను. వాళ్లకు నా ధన్యవాదాలు🙏.
ఇటీవల నేను వ్రాసిన “నీరజ కథాకదంబం” 175 కధలతో పుస్తకం, “ఊహల అల్లికలు” 75 కవితలతో కూడిన పుస్తకాలు వంశీఇంటర్నేషనల్ సంస్థ వారిచే ప్రచురింపబడి మా గురుదంపతులు ప్రముఖ వీణావిద్వాంసులు, రాష్రపతి అవార్డీ శ్రీ అయ్యగారి శ్యామసుందరంగారి దంపతులచే కథలపుస్తకం, జాతీయకవి శ్రీ సుద్దాల అశోక్ తేజ గారిచే కవితలపుస్తకం రవీంద్ర భారతిలో ఘనంగా ఆవిష్కరించబడటం, వాళ్లచేత ఘనసన్మానం పొందడం, బహు ప్రశంసలు, అభినందనలు పొందడం నాఅదృష్టం.🙏
ఇటీవల మన మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడి గారిచే ఘనసన్మానం పాందడం, వారి అభినందనలు, ప్రశంసలు అందుకోవడం నిజంగా నా అదృష్టం. పూర్వజన్మ సుకృతం.🙏
చాలా మంది పాఠకులు సీరియల్ వ్రాయమని కోరితే భావుకలో “సుధ” సీరియల్ వ్రాశాను. అది అందరి ఆదరాభిమానాలను పొందటమే కాక అందులో సుధ పాత్రని తమ ఇంట్లో పిల్లగా భావించి తమ అభిప్రాయాలను చెప్పి సంతోషించారు. ఆవిధంగా నా తొలి సీరియల్ “సుధ” విజయవంతం అయినందుకు చాలా సంతోషంగా ఉన్నది.
నేను వ్రాసిన “మమతల పొదరిల్లు” కధ భావుకధలు పుస్తకంలో, కధాకేళిలో “మంచితనం-మానవత్వం” కధ, కొత్తకధలు-5 పుస్తకం లో “ప్రశాంతినిలయం” కధ, క్షీరసాగరంలో కొత్తకెరటం పుస్తకంలో “ఆత్మీయతానుబంధం”, “గుర్తుకొస్తున్నాయి” పుస్తకంలో ‘అత్తింటి అవమానాలు’ అమ్మకు వ్రాసిన లేఖ, మొ…కధలు పుస్తకాలుగా వెలువడి బహు ప్రశంసలు లభించాయి.
రచనలు నా ఊపిరి. ఇలా పాఠకుల ఆదరాభిమానాలు, ఆప్యాయతలే నాకు మరింత రచనలు చేయాలనే ఉత్సహాన్ని, సంతోషాన్నిస్తోంది. నా తుది శ్వాస వరకు మంచి రచనలు చేయాలని, మీ అందరి ఆదరాభిమానాలను పొందాలని నా ప్రగాఢవాంఛ.
ఇలాగే నా రచనలను, కవితలను చదివి నన్ను ఎల్లప్పుడూ ఆశ్వీరదిస్తారని ఆశిస్తూ
మీ అభిమాన రచయిత్రి
నీరజ హరి ప్రభల.
విజయవాడ.
Photo Gallery
Comentarios