మద్యపానం ఆరోగ్యానికి హానికరం
#VeereswaraRaoMoola, #వీరేశ్వరరావుమూల, #మద్యమావతి, #Madyamavathi, #తెలుగుహాస్యకథలు, #TeluguComedyStories
'Madyamavathi' - New Telugu Story Written By Veereswara Rao Moola
Published In manatelugukathalu.com On 02/10/2024
'మద్యమావతి' తెలుగు కథ
రచన: వీరేశ్వర రావు మూల
నందన రావు మొదటినుండి అదృష్టవంతుడే. అతనికి ఆర్ధిక పరమైన సమస్యలు లేవు. 90 ల లో అమెరికా వెళ్ళి పోయి బాగా సంపాదించి, ఇండియా కి వచ్చి గోదావరి తీరం లో పెద్ద మేడ కట్టు కుని, నచ్ఛినది తింటూ, నచ్చిన బ్రాండ్ త్రాగుతూ, స్నేహితులకు విందులు ఇస్తూ కాలక్షేపం చేస్తున్నాడు.
నందన రావు కి ఆదివారం వచ్చిందంటే పండగే. ఉదయం నుండి స్నేహితులు వస్తారు. వాళ్లకి కావలిసిన తిండి నాలుగైదు రకాల వంటలు. శాఖాహారం, మాంసాహారం కలిసి ఉంటాయి. ఎంతైనా తినచ్చు. రాత్రి పద్యాలు, మద్యాలు రెండూ ఉంటాయి. ఎవరైనా జోక్స్ చెప్పచ్చు.
జోక్ చెప్పిన వారికి పెగ్ ఎక్స్ట్రా. నందనరావు కి మినీ కవిత్వం అంటే ఇష్టం. పెగ్ తాగుతూ ఇలా చెప్పే వాడు.
"మొదటి వారం విస్కీ తో విసా విసా వెళ్ళి పోయింది
రెండవ వారం రమ్ముతో రంజు గా గడిచింది
మూడో వారం మిత్రుల పుణ్యమా అని గడిచింది
నాలుగో వారం నాటు సారా నాట్యం చేసింది"
స్నేహితులంతా చప్పట్లు కొట్టారు. అప్పుడే మందు తలకెక్కిన మిత్రుడు "అంతము లేని ఈ భువనమంతా
పురాతన పానశాల" తూలుతూ అన్నాడు. అలా నందన రావు గారిల్లు ఆదివారం కలకలాడుతూ ఉండేది.
********
"మీరు మందు మానెయ్యాలి. లివర్ దెబ్బతింటుంది" అన్నాడు డాక్టర్ రఘు, నందన రావు ని పరీక్షీంచి.
"అది తప్ప ఇంకో మాట చెప్పండి. నిన్ననే నా ఫ్రెండ్ ఫ్రెంచి మద్యం పంపాడు. ఓ పెగ్ వేస్తారేమిటి" నవ్వుతూ అడిగాడు డాక్టర్ ని.
"నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి రావు గారు"
" సరే డాక్టర్ గారు ఈ జోక్ వినేసి పొండి"
" మీకు బ్రతుకు జోకయి పోయింది"
" అలా ఐతే బ్రతకగలను"
నందన రావు జోక్ మొదలు పెట్టాడు.
"తాగి ఇంటికెడితే నా భార్య నానా గొడవ చేస్తోంది. అందుకని పూర్తిగా మానేద్దామనుకుంటున్నాను”.
"ఏమిటీ, మందు కొట్టటమా"
"కాదు ఇంటికెళ్ళటం!"
డాక్టర్ నవ్వి వెళ్ళి పోయాడు.
********
పేరడి కాని, జోక్ కాని చెప్పకుండా మందు ముట్ట కూడదని కండిషన్ పెట్టాడు నందన రావు. మందు కోసం చచ్చి నట్టు పత్రికలు వెదికి జోకులు తెచ్చారు.
అలా ఒకడు పేరడి చెప్పాడు.
పేరడీ - ఇక్కడే పుట్టి
(హఠాత్తుగా మద్యనిషేధం వచ్చేస్తే అనే ఊహకి 'ఇక్కడే పుట్టి' అనే పాటను జోడించగా)
మందుబాబులు:
ఓ "మైడియర్"
ఫ్రెండ్స్.. డియర్ బూజర్స్.. డియర్ ఓవర్స్
ముందు మిత్రులారా
ఇక్కడే తాగి ఇక్కడే తూలి ఇక్కడే దొర్లాము
మందులమ్మ కల్లుపాకలో!
వీడలేమంటు వీడుకోలంటూ వీడిపోతున్నాము మద్యనిషేదమ్ము దెబ్బతో
వుయ్ మిస్ ఆల్ ది లక్
వుయ్ మిస్ ఆల్ ది కిక్
వుయ్ మిస్ యూ
కిడ్డీ బాంకులో పిల్లలు దాచిన చిల్లర పైసలు
పోపు డబ్బాలోన పెళ్ళాలు ఉంచిన పొదుపు డబ్బులు
ఫ్యూచర్ కోసం పెద్దలు ఇచ్చిన ఆస్తిపాస్తులు
పెళ్ళి టైములోన అత్తారుపెట్టిన నగలు, పుస్తెలు
బామ్మర్ది పెట్టిన గొడుగు, చెప్పులు
బిందెలు చెంబులు వెండి గ్లాసులు
బంధువులు ఇచ్చిన పెళ్ళి గిఫ్ట్ లు
స్నేహితులిచ్చిన హ్యాండులోనులు
మందుకొరకు అమ్మినట్టు గురుతులండి
ఇంకేమైనా మిగిలుంటే మన్నించండి
కల్లుపాక యజమానులు:
సెంటిమెంటు మాటలింక ఒగ్గేయండి
ఈ సిగ్గు ఎగ్గులన్ని ఒదిలి పెగ్గేయండి
వుయ్ మిస్ ఆల్ ది లక్
వుయ్ మిస్ ఆల్ ది కిక్
వుయ్ మిస్ యూ.
పేరడీ తో అలరించిన ఫ్రెండ్ కి పెగ్ అదనం గా పోసాడు.
"రావు గారూ, అందరూ మందు ఎక్కువై పోతారు కదా మీరేమిటి మందు వల్ల బతికాను అంటారు ఎప్పుడూ" అని ఒకస్నేహితుడు అడిగాడు.
"మందే కాపాడింది నన్ను"
"విచిత్రం గా ఉందే. ఏమిటా కధ చెప్పాల్సిందే" అని పట్టు పట్టారు. నందన రావు చెప్పడం ప్రారంభించాడు.
********
మా నేస్తాల తో కలిసి సంఘమిత్ర రైలు లో జబల్ పూర్ వెళ్ళడానికి ప్లాన్ వేసాను. అందరం విజయవాడ లో రైలు ఎక్కాం. నేను ఒక్కడినే S2 లో ఉండిపోయాను. వాళ్ళందరూ S10 లో ఉన్నారు. రైలు చాలా రష్ గా ఉంది. పదకొండు గంటలకి ఫోన్ చేసారు. మందు కార్యక్రమం మొదలు అని. వెళ్ళాలని ఉంది. రష్ లో ఏలా వెళ్ళడం అని కాస్సేపు తటపటాయించి, ఏలాగైనా తెగించి అందర్నీ దాటుకుంటూ S10 చేరాను.
మా గ్యాంగ్ సంతోషించి పెగ్గులు పంచారు. అలా మత్తు లో తూగుతుండగా, వాళ్ళన్నారు బెర్త్ ని పంచుకుందామని.
సరేనని ఉండిపోయాను. సరిగ్గా ఇటార్సీ దాటాక జరిగిందా ఘటన.
'ఏమయ్యీంది?' అడిగారు మిత్రులు ఆతృత గా.
రైలు పట్టాలు తప్పి, S2 నుండి S7 వరకూ ఉన్న బోగీలు కూలిపోయాయి. చాలామంది చనిపోయారు.
S10 లో ఉన్న నేను సేఫ్ గా బయటపడ్డాను.
ఆరోజు నేను S10 కి రాక పోతే..
"ఈ రోజు మనకీ పెగ్గు దిక్కు లేదు. మద్య మాతా నమోన్నమః" అన్నాడు నందన రావు మిత్రుడు
********
మళ్ళీ ఆదివారం వచ్చింది. నందన రావు ఇంట్లో ఎప్పటి లాగే హడావిడి మొదలైంది. కొత్త కొత్త జోకులతో మిత్రులు తయారయ్యారు. హైదరాబాద్ ధమ్ బిర్యాని వాసన ముక్కుకి ఘాటు గా తగులుతోంది. రాత్రి 7. 30 నిమిషములు. నందన రావు మొదటి పెగ్ వేసాడు.
ఛాతి దగ్గర నొప్పి బయలుదేరింది. బయటపడకుండా
జాగ్రర్త పడుతున్నాడు. నొప్పి ఎక్కువయింది. నందన రావు కి అమెరికాలో ఉన్న కొడుకు, ఎప్పుడో వదిలేసిన భార్య గుర్తుకు వచ్చారు.
"ఈ వాళ జోకులు రాలడం లేదు" అన్నాడు నందన రావు.
"ఏముంది.. మన సత్యానికి విగ్గు మీద ఉన్న శ్రద్ద పెగ్గు మీద లేదు" అన్నాడొకడు/
"విగ్గు లేకుండా నో షాపింగ్. ఈయన ది బట్టతల. ఆవిడది పట్టుదల. ఇద్దరూ యంగ్ గా కనిపించాలని" అన్నాడు నందన రావు, ఛాతి మీద రాసుకుంటూ.
"మీ ఆరోగ్యం బాగు లేదు డాక్టర్ ని పిలుస్తా" అన్నారు
మిత్రులు.
"ఆయన కూడా పెగ్ వేస్తాడు పిలవండి"
"జోకులు కాదు సీరియస్"
"ఫ్రీ గా మందు తాగుదామనా? జోకు చెప్పు పెగ్గు పట్టు"
మిత్రులందరికీ విషాద ఛాయలు అలుముకుంటున్నాయి.
నందన రావు వినడు కదా. జోకులని పట్టు పట్టాడు.
ఒక మిత్రుడు చెప్పాడు.
“ఇద్దరు తాగుబోతులు నూతి పక్కన పడుకున్నారు. ఒకడు దొర్లి నూతి లో పడ్డాడు.
‘నూతి లో పడ్డాను’ అని అరిచాడు.
రెండవ వాడు ‘ఎక్కడున్నా సుఖం గా ఉండు’ అన్నాడు.
తరువాత మిత్రుడు ఇంకో జోక్ చెప్పాడు.
కోర్టు లో లాయర్లు ఇద్దరూ గట్టి గా వాదించుకుంటున్నారు.
జడ్జి గారు "ఆర్డర్ ఆర్డర్" అన్నారు.
"ఒక లార్జ్ విస్కీ- సోడాతో" అన్నా డో తాగుబోతు కూర్చున్న గుంపు లో నుండి.
జోకులు పెగ్గులు సాగుతున్నాయి. నందన రావు గట్టిగా నవ్వుతున్నాడు. అతని దృష్టి కాలెండర్ మీద పడింది.
అది ఫిబ్రవరి 29. అతని భార్య వదలేసిన రోజు.
నందన రావు నవ్వు ఆగి పోయింది. అదే అతని ఆఖరి నవ్వు.
"మిత్రుల నవ్వుల మద్య పోవడం కన్నా అదృష్టం ఉందా?" అని డైరీ లో నందన రావు రాసుకున్న వాక్యాలు చూసి అతని స్నేహితుల దుఃఖం ఆగడం లేదు
సమాప్తం
వీరేశ్వర రావు మూల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
కవి, రచయిత. నిర్మాణ రంగంలో ఐటీ విభాగం మేనేజర్ గా పనిచేసి పదవీ విరమణ తీసుకున్నారు. 1985 నుంచి రాస్తున్నారు. వివిధ పత్రికల్లో కథలు, కవితలు, కార్టూన్‌లు, ఇంగ్లిష్‌లో కూడా వందకు పైగా కవితలు వివిధ వెబ్ పత్రికల్లో ప్రచురితమయ్యాయి.నిధి చాల సుఖమా నవల సహరి డిజిటల్ మాసపత్రిక లో ప్రచురణ జరిగింది.
Comments