top of page

మగ రాయుడు

Updated: Dec 27, 2023


'Maga Rayudu' - New Telugu Story Written By Kamala Parijatha

Published In manatelugukathalu.com On 19/12/2020

'మగ రాయుడు' తెలుగు కథ

రచన: కమల పారిజాత 

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)


"చూడమ్మా హిమజ, అబ్బాయిల్లాగా ప్యాంట్ షర్ట్ వేసుకో...!వాళ్లలా జుట్టు కత్తిరించుకో...!అబ్బాయిలు ఆడే ఆటలు ఆడు, అబ్బాయిల్లాగా నడువు తప్పు లేదు, అబ్బాయిలు చేసే ఎంత కష్టమైన పనైనా చెయ్ కానీ అబ్బాయిని అనుకోకు, ఎన్ని చేసినా నువ్ అమ్మాయివన్న సంగతి మరువకు. మిగతా అమ్మాయిలను చూసి నేర్చుకో....కాదు నేను అబ్బాయిల్లా అర్థరాత్రి రోడ్డు మీద తిరుగుతాను అంటే కుదరదు. " ఆడది అర్ధరాత్రి ఒంటరిగా తిరిగినప్పుడే మనకు నిజమైన స్వాతంత్ర్యం అని చెప్పిన గాంధే, స్త్రీ ఏ పని చేసినా.....అది స్వాతంత్ర్య సమరమైనా సరే పురుషుడిని అనుసరించాలి" అన్నాడు.

పట్టపగలే ఒంటరిగా తిరగలేని పరిస్థితి, పసి పిల్లల నుండి పండు ముసలి వరకు ఎవరినీ వదలని సమాజంలో ఉన్నాము. అలాంటిది నువ్ ఎలా చేసావ్? అందరూ మగరాయుడు అనే సరికి, నేనేదైనా చేయగలననే అతి ధీమా నీకు వచ్చుంటుంది. మగవాడు పూర్తిగా విప్పుకోనైనా తిరగగలడు కానీ ఆడది పూర్తిగా కప్పుకున్నా రక్షణ లేదు. మనం అజాగ్రత్తగా ఉండి, మగవాళ్లు ఇలా చేస్తారు అలా చేస్తారు అని మొత్తుకుంటే లాభం లేదు. కౄర మృగాల లక్షణం సాధు జంతువులను వేటాడటం, మగాళ్ల లక్షణం ఆడవారిని వెంటాడటం. మగాళ్లు అంతే, వాళ్లు అలాగే ఉంటారు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. బహుశా నీకు చెప్పేవారు లేకపోవడం వల్ల ఇలా తయారయ్యావేమో అన్నది సోషల్ టీచర్ సరళ.


"చక్కగా చెప్పారు మేడమ్, మగ దిక్కు లేని సంసారం ఎలా ఉంటుందో మనకు తెలుసు. ముఖ్యంగా ఆడపిల్లలకు తండ్రి సంరక్షణ చాలా అవసరం. 'బాల్యంలో తండ్రి, యవ్వనంలో భర్త, వృద్దాప్యంలో కొడుకు సంరక్షణ లో ఉండాలి స్త్రీ'. ఇక స్త్రీ మనసు తోడేలు వంటిదని, అది మగవారిని మోహంలో ముంచేస్తుందని చాలా పురాణాలు ఘోషిస్తున్నాయి. అందుకే గీతలో అర్జునుడు మగ దిక్కు లేని సంసారాల గురించి ఇలా అన్నాడు.

'అధర్మాభి భవాత్కృష్ణ ప్రదుష్యన్తి కుల స్త్రీయః స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణ సంకరః' పురుషుడు లేకుంటే అధర్మం పెరిగి, కుల స్త్రీ లు చెడిపోయి, వర్ణ సంకరం ఏర్పడి కులం, వంశం నాశనం అవుతాయని భావం" అన్నది తెలుగు టీచర్ నిర్మల.


తెలుగు టీచర్ మాట్లాడేది కొంచెం అర్థమయ్యి, కొంచెం అర్థం కాకుండా ఉంది హిమజకు. "మేడమ్ నాకొక డౌట్, నాకు ఈ పురాణాలు సరిగ్గా తెలియవు. ఎక్కడో ఒకటి..... అరా...! వినటం తప్ప...అసలు అర్జునుడి తండ్రి పాండురాజు కాదని, పాండురాజు పుట్టిన విధానం కూడా వేరని అనగా విన్నాను. అది వివరంగా చెప్పండి" అన్నది సైన్స్ టీచర్ ఈశ్వరి.


నిర్మల టీచర్ ఎంతో ఉత్సాహంగా చెప్పటం ప్రారంభించింది. "పాండు రాజు కు శాపం ఉండటం వల్ల తన వంశాన్ని వృద్ధి చేసుకోలేడు, కుంతీ ఇంద్రుని వరంతో అర్జునుడిని కంటుంది. ఇక పాండురాజు , అంబాలిక వ్యాసుల సంతానం. వ్యాసుడు, సత్యవతి పరాశరుల పుత్రుడు. సత్యవతి, అమోఘ వీర్యునిగా పేరుగాంచిన ఉపరిచర వసువుకు, అద్రిక అనే చేపకు పుడుతుంది" అని ఆశ్చర్యంగా చూస్తున్న సైన్స్ టీచర్ వైపు చూసి, "మేడమ్..! మహాత్ముల జననాలను ప్రశ్నించకూడదు అంటుంది.


"చేపకు పుట్టడం ఏంటి" అని ప్రశ్నిస్తే, హేతుబద్ధమైన సమాధానం రాదని తెలిసి నేనెందుకు ప్రశ్నిస్తాను మేడమ్? కానీ ఒక అనుమానం....ఇలా వేర్వేరు కులాల తల్లిదండ్రులకు పుట్టినపుడు వర్ణ సంకరం అవ్వలేదా? కులం నాశనం కాలేదా" అన్నది సైన్స్ టీచర్. "అవునవును. ఈ విషయాన్ని 'దానవీరశూరకర్ణ' సినిమా లో బాగా అడిగారు. 'ఏమంటివి ఏమంటివి' అనే డైలాగ్ లో. 'ఒకసారి క్షేత్ర ప్రాధాన్యతతో, మరొకసారి బీజ ప్రాధాన్యత తో మా వంశం ఎప్పుడో సంకరం అయింది' అంటారు"అంది సోషల్ టీచర్.


సోషల్ టీచర్ సినిమా డైలాగులు చెప్పటం చూసి లోలోపల నవ్వుకుంది హిమజ. "ఈ క్షేత్ర, బీజ ప్రాధాన్యాలేంటి మేడమ్" అని ఆశ్చర్యంగా అడిగింది సైన్స్ టీచర్.


"ఇందులో తెలుసుకునేదేముంది మేడమ్, అందరికీ తెలిసిందే.... స్త్రీ క్షేత్రం, పురుషుడు బీజం. పిల్లలంటే తండ్రి ప్రతిరూపాలు... కానీ అవసరానికి తగ్గట్టు తల్లి కులానికి, తండ్రి కులానికి ప్రాధాన్యత ఇవ్వడం" అన్నది సోషల్ టీచర్.


"స్త్రీ క్షేత్రం అని, పిల్లలు తండ్రి ప్రతిరూపాలని నాకు తెలియదు. తల్లి నుండి ఇరవై మూడు క్రోమోజోమ్స్ ఉన్న కణం, తండ్రి నుండి ఇరవై మూడు క్రోమోజోమ్స్ ఉన్న కణం కలిసి జైగోట్ ఏర్పడటంతో మన ఉనికి ప్రారంభమవుతుందని తెలుసు. ఇరవై మూడు క్రోమోజోమ్స్ ని కాంట్రిబ్యూట్ చేయటంతో పాటు, పిండాన్ని నవమాసాలు మోసి, కని పాలిచ్చి పెంచే అదనపు బాధ్యత కూడా ప్రకృతి, తల్లి కి ఇచ్చిందని తెలుసు. తండ్రి ప్రతిరూపాలేంటి? తల్లిదండ్రుల ప్రతిరూపాలు అన్నది సైన్స్ టీచర్.


వంశానికి విత్తనం పుట్టలేదని తన తండ్రి తమను వదిలేసాడాని చుట్టాల వల్ల విని ఉండటంతో హిమజకు ఈ విషయం కొంచెం అర్థం అయింది.


"సైన్స్ కనుగొన్నది ఈ మధ్య, కానీ మన పుట్టుక ఎప్పటినుండో ఉంది కదా" అన్నది సోషల్ టీచర్.

"ఏంటీ జోక్ చేస్తున్నారా...? సైన్స్ కనుగొననప్పుడు స్త్రీ కి అండాశయం, బీజ కణాలు లేవా...!? కేవలం గర్భాశయమే ఉందా..! అయ్యో....! ఎక్కడికో వెళ్లిపోతున్నారు మేడమ్ మీరిద్దరూ... ముందు ఈ పిల్ల సంగతి చూడండి....ఏమ్మా ఆ హాస్టల్లో నువ్వేనా హీరో, ఇంకెవ్వరు లేరా" అని తెలుగు టీచర్ అంటుండగానే ప్రిన్సిపాల్ సుభాషిణి వచ్చింది.


అందరూ... ప్రిన్సిపాల్ ని విష్ చేసాక, మేడమ్..! ఈ అమ్మాయి 'గొప్ప సాహసం చేస్తున్నా' అనుకొని ఏం చేసిందో అడగండి అన్నారు మూకుమ్మడిగా.


"ఏం చేసింది?" అని అందరిని ఒకసారి చూసి, "చెప్పమ్మా...! హిమజ.... ఏం చేసావ్?" అని సున్నితంగా అడిగింది ప్రిన్సిపాల్.


"మేడమ్, అది....నేనుంటున్న హాస్టల్ కి రాత్రి దొంగ వచ్చాడు".


" ఏంటి...దొంగనా!" అని ఆశ్చర్యపోయింది ప్రిన్సిపాల్.


"అవును మేడమ్, ఈ మధ్య ఎన్ని వార్తలు వినలేదు‌.! మొన్ననే ఏదో ఆశ్రమం లో ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ అయ్యిందని న్యూస్ కూడా వచ్చింది. ఒక్కోసారి నిర్వాహకులే ఎక్స్ప్లాయిట్" చేస్తున్నారు...అన్నది సోషల్ టీచర్.


"విన్నాను కానీ, మీ హాస్టల్ కి వాచ్ మెన్ లేడా" అన్నది ప్రిన్సిపాల్.


"ఉన్నాడు మేడమ్....కానీ ముసలివాడు, అతనికి ఎక్కువ బలం లేదు. తొందరగా పరిగెత్తలేడు. దొంగ వచ్చాడని కొందరు అమ్మాయిలు అరవగానే, వాచ్ మెన్ తో సహా అందరం లేచాం. దొంగ భయంతో, పారిపోవడానికి గోడ ఎక్కుతుండగా.... పొయ్యిలో కి వాడే కర్రను తీసుకుని అతని మీదకి విసిరాను. అది కాలుకు తాకి కిందపడ్డాడు. అసలే తాగి ఉన్న వాడిని అందరు తలా ఒక కర్ర తీసుకుని చావబాదారు. నేను ఇంకో అమ్మాయి కలిసి పక్కనే ఉన్న పోలిస్ స్టేషన్ కి వెళ్లి చెప్పాం. వాళ్లు వచ్చి అతన్ని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. మా సంతకాలు కూడా తీసుకున్నారు. ఆరు నెలల తర్వాత వదిలేస్తారట" అని చెప్పింది హిమజ.


'ఈ అమ్మాయి కి ఎంత ధైర్యం అన్నట్టు చూసింది మిగతా టీచర్ల వైపు ప్రిన్సిపాల్. అవును మేడమ్, మాకు కూడా ఆశ్చర్యం కలుగుతుంది. అందుకే ఇలా ఎలా చేసావని అడుగుతున్నాం" అన్నారు ముగ్గురూ ఒకేసారి.


"సృష్టి లో ప్రతి జీవికి ఒక లక్షణం ఉంది. ఎంత బలహీన జంతువైనా సరే తనను కబళించాలని చూసే బలమైన జంతువుతో పోరాడుతుంది . ఒక్కోసారి ఆ పోరాటంలో ఓడిపోవచ్చు, గెలవొచ్చు కానీ పోరాటం మాత్రం ఆపదు. ఎందుకంటే...అంత పెద్ద జంతువు తో పోరాడి గెలవలేవు అని ఎవరూ దానికి నేర్పలేదు కాబట్టి సహజంగానే పోరాడుతుంది. కానీ మనుషులకు అలా కాదు, ముఖ్యంగా ఆడపిల్లలకు. చిన్నప్పటి నుండే ఆడపిల్లల మనసులో సమాజం ఇటువంటిది, అటువంటిది అని చెప్పి, 'నీవు అబలవు, నిన్ను నీవు రక్షించుకోలేవు. ఎవరో ఒకరు నీకు తోడుగా ఉండాలి' అని పిరికితనం, బలహీనత నూరిపోస్తారు. అందుకే కొందరు అమ్మాయిలు చిన్న విషయానికే బెంబేలు పడి ఏడుస్తూ ఉంటారు.అమ్మాయిలను అలా తయారు చేసిన సమాజం.. ఎవరైనా అబ్బాయిలు భయపడినా, ఏడ్చినా ఆడంగి వెధవ అని హేళన చేస్తారు.


'చేతులు ముడుచుకొని కూర్చోడానికి నేనేమైనా గాజులు తొడుక్కున్నానా' అని పౌరుషాలకు పోతారు. ఒక అమ్మాయి ధైర్యంగా ఉండి, తన పనులు తాను చేసుకుంటూ...ఎవరి పైనా ఆధారపడకుంటే 'మగ రాయుడు' అంటారు. అవేవో మగవారికే చేతనైన పనులు అన్నట్టు. ఈ అమ్మాయికి ఎవరూ కట్టుబాట్లు నేర్పనట్టున్నారు. అందుకే తన రక్షణ తానే తీసుకోవాలనే మైండ్ సెట్ తో ఉంది. అది సహజ ప్రవర్తన" అని టీచర్స్ తో చెప్పి హిమజ వైపు తిరిగి.. "మగవాడి చేతిలోనే స్త్రీ కి రక్షణ" అని ఎవరైనా చెబితే వినకు.'ఒక స్త్రీ ని రక్షించే మగవాడే మరో స్త్రీ ని భక్షిస్తాడు'. స్త్రీ ని వంచించే స్త్రీలు ఉన్నట్టే, స్త్రీని రక్షించాలనుకునే పురుషులు కూడా ఉంటారు‌. కానీ మన రక్షణ బాధ్యత మనమే తీసుకోవాలి. 'యధ్భావం తద్భవతి' అని మన పెద్దలు ఏనాడో చెప్పారు. నీవు బలహీనురాలివనుకుంటే బలహీనురాలివే అవుతావు. నీవేదనుకుంటే అదే అని స్వామి వివేకానంద చెప్పాడు. తాము ఏదైనా సాధించగలం అనుకున్నారు కాబట్టే రుద్రమదేవి, ఝాన్సీ రాణి ఎంతోమంది రాజులతో పోరాడి తమని తామే కాకుండా తమ రాజ్యాలను కూడా కాపాడుకున్నారు.అక్బర్ తెలుసు కదా!?"


" తెలుసు మేడమ్. మొఘల్ చక్రవర్తులలో ముఖ్యమైనవాడు" అన్నది హిమజ.


" అటువంటి వాడిని ఎదిరించిన మహిళ 'చాంద్ బీబీ'. ఇంకా చరిత్ర చదువు. ఎంతోమంది మహిళలు అత్యంత ధైర్యసాహసాలతో ఎలా ముందుకు వెళ్లారో తెలుస్తుంది. వారెవ్వరికీ తాము బలహీనులమన్న స్పృహ లేదు. 'హనుమంతునికి తన బలం తనకు తెలియనట్టు, ఆడపిల్లలకు తమ స్వశక్తి ఏమిటో తెలియటం లేదు. కాదు... తెలియకుండా రక్షణ పేరుతో మభ్యపెడుతున్నారు.".


ప్రిన్సిపాల్ చెప్పే విషయాలను హిమజతో పాటు టీచర్లు కూడా శ్రద్ధగా వింటున్నారు.

"అర్జునుడి నెపంతో లోకానికి గీతోపదేశం చేసిన కృష్ణ పరమాత్మ ఏమన్నాడో తెలుసా!? "క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరన్తప" అంటే..నీచమైన మానసిక దుర్బలత్వాన్ని విడిచిపెట్టు... "నిమిత్త మాత్రన్ భవ సవ్యసాచిన్".....నీ పనులు నువ్ చెయ్ అది ధర్మమైనదైతే ఎల్లప్పుడు నేను తోడుంటాను, అని... కాబట్టి నీవు సరైన దారిలోనే ఉన్నావు. ఇంకొంచెం శారీరక, మానసిక బలాలను సాధించాలి. రేపటి నుండి ఉదయాన్నే జే బి ఎస్ స్కూల్లో కరాటే క్లాస్ కి వెళ్లు, ఆ ఏర్పాట్లన్ని నేను చూస్తాను. నీలాంటి అమ్మాయి నా స్టూడెంట్ అయినందుకు చాలా గర్వంగా ఉంది... మోర్ పవర్ టూ యు డియర్‌‌‌.." అన్నది ప్రిన్సిపాల్ ఆనందంతో.


మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి


రచయిత్రి పరిచయం

నా పేరు కమల పారిజాత. నాకు కథలు చదవటం ఆసక్తి. సమాజాన్ని చదవటం మరింత ఆసక్తి. ఆ ఆసక్తే కథలు రాయటానికి ప్రేరణ కలిగించింది. సమాజ ప్రగతికి రచయిత/రచయిత్రి పాత్ర చాలా ముఖ్యం. అందుకే నేను రచనలు చేయాలని నిర్ణయించుకున్నాను. శాస్త్రీయత, సమానత్వం, ప్రగతిని పెంపొందించడం నా రచనల ఉద్దేశం.

10 comentários


Kamalakar Bolly
Kamalakar Bolly
10 de jan. de 2021

తరతరాలుగా అణిచి వేయబడుతున్న స్త్రీల కు ప్రేరణ కలిగించే రచన మీది...కథ చాలా సూటిగా సుత్తి లేకుండా రాశారు...చిన్న కథలోనే పెద్ద సందేశాన్ని ఇచ్చిన మీ రచనా శైలి అద్భుతం‌...కథ నడిపించడానికి మీరు ఎంచుకున్న పాత్రలు చాలా సహజంగా ఉన్నాయి...సైన్స్ టీచర్ తో క్రోమోజోమ్స్ గురించి చెప్పిస్తూ పుక్కిటి పురాణాల్లో ఉన్న డొల్ల తనాన్ని ప్రశ్నించడం చాలా బాగుంది...ఉద్యోగం పురష లక్షణం ఇప్పటికీ ఇది వింటూనే ఉన్నాం... ఏదైనా ప్రాపర్టీ కొన్నపుడు కూతురు పెళ్లికి పనికొస్తది..అబ్బాయి విదేశి చదువుకు పనికొస్తది అనే భావన మెజారిటీ జనాల్లో ఉంది..దీన్ని కూడా మీరు ఆవిష్కరించారు ఇక చివరగా టైటిల్ విషయానికొస్తే 'మగ రాయడు' అనేది వ్యంగ్యంగా పెట్టారు...చాలా బాగుంది... సొసైటీలో ఎవరైనా స్త్రీ స్ట్రాంగ్ గా ఉంటే మగరాయుడు అంటారు.... అంటే సహజంగానే స్త్రీ వీక్ మగవాడు స్ట్రాంగ్ అన్నట్టు... కట్టుబాట్లు,ఆచార సాంప్రదాయాల్లో తేలకుండా ముంచేసి స్త్రీ వీక్ అన్నట్లు కహానీలు చెప్తారు....ఒక్క కథలో చాలా ప్రశ్నలు సందించారు...ఇలాంటి రచనలు మీ నుండి సదా ఆశిస్తూ మీకు అభినందనలు తెలుపుతున్నాను...

Curtir

Dara Anji
Dara Anji
03 de jan. de 2021

ప్రపంచంలో ఆడ మగ diference ఉండకూడదు అనే మీ ప్రయత్నం గొప్పగా ఉంది

Curtir

raja957r
raja957r
22 de dez. de 2020

ANNI TELISINA EMI TELINATLU DOUBTLATO PURANA BAGOTALA PURI VIPPINA SCIENCE TEACHER PATRA ALOCHINCHA DAGGADE ARDARATRI ADADI SWECHAGA TIRIGINAPPUDE NIJAMINA SWATANTRYAM ANNA M.K. GANDHINE SWATANTRA PORATAMLO OKA

MAHILA VENUKA PURUSUDUNNADANI M.K.GANDHI ANADAM SOCHANEEYAM MAGARAYUDULA TIRIGINA OK BUT OKA MAHILAVANNA SANGATI MARUVADDANNA TOTI MAHILA LEDA ERUGU PORUGU VARINA DHIRYANNIVVAKA POGA PIRIKI MANDU NURADAM BADHAKARAM MANCHI

KATHANANDINCHINA RACHAYITRIKI ABHINANDANALU⚘🤝

Curtir

Bhaskara Rao Chimakurthy
Bhaskara Rao Chimakurthy
21 de dez. de 2020

అవును. ప్రకృతిలో బలహీనమైన జంతువు కూడా, బలమైన జంతువుతో పోరాడుతుంది. స్త్రీ సబలైనా తనకు నూరిపోసిన సిద్ధాంతాల ప్రభావంతో, తనకు హాని తలపెట్టేవాడిని సరైన రీతిలో ఎదుర్కోలేకపోతుంది. స్త్రీలు సబలులు అని చెప్పటం మనం కొత్తగా నేర్చుకోవాలి. ప్రయోజనకరమైన కథ వ్రాసిన రచయిత్రికి అభినందనలు.

Curtir

Narahari Javaji
Narahari Javaji
20 de dez. de 2020

బాగా రాశారు 👍👍

Curtir
bottom of page