top of page

మగ్గం బతుకు

Updated: Jan 17

#KasivarapuVenkatasubbaiah, #కాశీవరపు వెంకటసుబ్బయ్య, #మగ్గంబతుకు, #MaggamBathuku, #చేనేతకార్మికులు #పల్లెకథలు


Maggam Bathuku- New Telugu Story Written By - Kasivarapu Venkatasubbaiah

Published In manatelugukathalu.com On 16/01/2025

మగ్గం బతుకు - తెలుగు కథ

రచన : కాశీవరపు వెంకటసుబ్బయ్య

కథా పఠనం: పద్మావతి కొమరగిరి



నరసయ్య దిగువ మధ్య తరగతి చెందిన చేనేత కుటుంబీకుడు. జీవితంలో ఒడిదుడుకుల వల్ల హైస్కూల్ ఫైనల్ వరకు కూడ చదవలేనివాడు. అతని బాల్యమంతా ఖాళీ కడుపుల్తో మంచినీళ్ళు తాగి బతికిన రోజుల్లో నిండిపోయింది. తెల్లని అన్నం మెతుకుల్ని ఎరుగని జీవితం అతనిది. అరికెలు కొర్రలు జొన్నలు రాగులే అతని ఆహారం. అవి కూడా అరకొరగానే ఆకలి తీర్చేవి. దుమ్ము ధూళికి పెరిగి గాలికి ఎదిగి యవ్వనంలోకి అడుగు పెట్టినవాడు నరసయ్య.


అతని బతుకుతెరువుకు మగ్గమే అదరువు అయింది. గంతకు దగ్గ బొంత లాగా అతని జీవితంలోకి నారమ్మ ప్రవేశించింది. ఆశలు కోరికలు అంటే ఏమిటో తెలియని పేదా మనస్తత్వం ఆమెది.


సావకార్లు ఇచ్చిన నూలు తెచ్చుకొని, భర్త  మగ్గం నేస్తుంటే తాను రాట్నం వడికి బోట్లు చుట్టి  భర్తకు ఇచ్చేది.


కష్టాలోచ్చినా, బాధలోచ్చినా తట్టుకొని తనతో కలిసిపోయి, ప్రేమానురాగాలు పంచే భార్య తన జీవితంలోకి వచ్చినందుకు నరసయ్య పరమానంద పడుతుంటాడు.


ఆలుమగలు 24 గంటలు పనిచేసినా కూటికి గుడ్డకు ఇతరత్రా ఇంటి అవసరాలకు తప్ప భవిష్యత్తు అవసరాలకు ఏమి మిగల్చలేకపోయారు. కాలక్రమంలో ఒక కూతురు ఒక కొడుకు పుట్టుకొచ్చి వారికి ఆర్థిక అవసరాలు పెంచారు.

                      .        .      *

నరసయ్య తన తల్లిదండ్రులకు తానొక్కడే సంతానం. ప్రేమానురాగాలకేమి కొదువ లేదు గానీ తిండి సంపాదించుకోవడమే గగనమైపోయిన కాలమది. ఒక్కగానొక్క కొడుకును చక్కగా చదివించి సుఖంగా పెంచుకోవాలని ఉన్నా సాధ్యం కాలేకపోయింది తన తల్లిదండ్రులకు, చేనేత వస్త్రాలకు కాలం చెల్లిపోతున్న సమయం అది గనుక.


నరసయ్య తండ్రి సుబ్బరంగయ్య, తల్లి చౌడమ్మ కష్టం చేయడానికే పుట్టినట్లు ఓర్పుగా నేర్పుగా తమ కులవృత్తైన చేనేత పని చేసుకుంటూ బతుకీర్చుకుంటూ వస్తున్నారు.


లేక లేక కలిగిన కొడుకును అల్లారు ముద్దుగా పెంచడం కోసం భార్యాభర్తలిద్దరూ పని రాక్షసులుగా మారిపోయారు. ఎంత చేసినా 'గొర్రె తోక బెత్తెడే' అన్నట్లు ఉండేది వారి రాబడి. తినీ తినక అతి కష్టమ్మీద ఓ వేయ్యి రూపాయలు ప్రోగుచేసుకో గలిగారు. ఆ సొమ్ముతోే సొంత ఇల్లును సొంత స్థలంలో నిర్మించుకోవాలని అనుకున్నారు. అద్దె కొంపలో అద్దె కడుతూ ఎంత కాలం ఉంటామని. అదే సొంత ఇల్లు ఉంటే భవిష్యత్తులో  కొడుక్కు అదరువుగా ఉంటుందని తలచారు. ఊరికి చివరగా చేనేత కుటుంబాలు ఓ వంద దాకా ఉన్న చోట సెంటు స్థలం వంద రూపాయల వంతున ఓ ఐదు సెంట్లు స్థలం కొన్నారు. అందులో ఒక వైపు రెండు సెంట్లల్లో  సీమెంటు రేకులు ఇల్లు కట్టుకొని మిగతా మూడు సెంట్లను పడుగు చేసుకోవడానికి ఖాళీగా ఉంచుకున్నారు. ఇంటితో పాటు ఖాళీగా ఉన్న స్థలానికి కలిపి కాంపౌండుగా ఆరు అడుగుల ఎత్తు ఉన్న నాపరాళ్ళ బండలను చుట్టుతా పాతుకొని కొత్త ఇంట్లో చేరేసరికి ఏనుగును ఎక్కినంత సంబరపడిపోయారు ఆ దంపతులు.


సుబ్బరంగయ్య తన కొడుకును ఆర్థిక స్థోమత లేక చిందించలేకపోయినా, చేనేత పనిలో దిట్టను చేశాడు. 'చేతిలో పని ఉంటే అన్నం ఉన్నట్లే' అన్నది సుబ్బరంగయ్య విశ్వాసం.

ఆ తరువాత ఏదోలా నిమ్మళంగా సాగిపోతుంది కాలం, కాలంతోపాటు జీవితం.

అదో ఇదో అనేసరికి నరసయ్య ఇరవై ఏండ్ల వయసుకొచ్చాడు.


ఒద్దిక , ఓర్పు ఉన్న అమ్మాయిని చూసి జత చేస్తే చివరగా తాను తన కొడుకు విషయంలో నెరవేర్చాల్సిన పని పూర్తి అవుతుందని ఆలోచించాడు సుబ్బరంగయ్య.


అదే విషయాన్ని భార్య చౌడమ్మతో అంటే ఆమె "కానీవయ్యా! ఆ బాధ్యతా అయిపోతే మనం ఏమైనా పర్వాలేదు. వాడికి ఒక తోడు కలిపించి ఒంటరితనం పోగొట్టినవాళ్ళమైతాం." అంది చౌడమ్మ.

తన సమీప బంధువుల ఇంట్లోనే నరసయ్యకు సరిగ్గా సరిపోయే అణుకువ అందం ఉన్న నారమ్మతో మూడు ముళ్లు వేయించాడు సుబ్బరంగయ్య. కాణీ కట్నం ఇచ్చుకోలేని, తమ కన్నా కనా కష్టంగా సాగిపోయే కుటుంబం ఆమెది.


నరసయ్య తండ్రి సుబ్బరంగయ్య, కొడుకు సంసారం గాడిలో పడక ముందే, పెళ్లైన ఏడాది లోపే అకస్మాత్తుగా గుండె పోటు వచ్చి చనిపోయాడు.


కష్టాల్లో సుఖాల్లో బాధల్లో బాధ్యతల్లో కలిసి పంచుకొని బతికిన భర్త తన కండ్లు ఎదుటే మరణించడంతో చౌడమ్మ ఎడబాటును భరించలేక భర్త పోయిన నెలకే ఆమె కూడా జీవితాన్ని ముగించింది.


చూస్తూ చూస్తూ వుండగానే తల్లిదండ్రులు ఇద్దరూ దూరం కావడంతో నరసయ్య తన జీవితం శూన్యమైనట్లు అంధాకారమైనట్లు తాను భావించాడు. చిన్న పిల్లోడిలా బోరున ఏర్చాడు నరసయ్య.

అంత పేదరికంలోనూ తన తల్లిదండ్రులు తాము పస్తులుండి తనకు పెట్టి పెంచారు. కింద పెడితే మన్ను అవుతుందని, అమ్మ ఒడిలోను, నాన్న భుజాల పైనే మోశారు. అంత ప్రేమను పంచిన తన తల్లిదండ్రులకు తాను ఏమి చేయలేకపోయానని గుండెలవిసేలా విలపించాడు. ఇక తాను ఒంటరినై పోయినట్లు అలవికాని ఆవేదనకు గురైనాడు.


భర్త బాధను చూసి భరించలేక పోయింది భార్య నారమ్మ. భర్తను తన గుండెలకు హత్తుకుని ఓదార్చింది.


"నువ్వు ఒంటరివి ఎప్పటికీ కావు. నేను నీకు కడదాకా తోడునీడగా ఉంటాను. నీ కష్టసుఖాలను పెంచుకొని నీకు అండగా నిల్చుతాను. అధైర్యపడవద్దు" అంటూ దైర్యం చెప్పి మళ్లీ భర్తను మనిషిగా మార్చుకుంది.


ఆ షాక్ నుంచి బయట పడడానికి నరసయ్యకు చాల కాలమే పట్టింది.

భార్య సహనానికి సమయస్ఫూర్తికి నరసయ్య మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకున్నారు.

ఆ తరువాత మూడేండ్లకు ఒక పాప మరో మూడేండ్లకు ఒక బాబు పుట్టారు. జీవితంలో ఎదుగుబొదుగు లేకున్నా పిల్లల ఆలనా పాలనాలో గతం గాయాలు మరుగున పడ్డాయి.

పిల్లలిద్దరూ ఎదుగు తున్నారు.


"కులవృత్తులకు కాలం చెల్లుతున్న సమయం. చేనేత దుస్తులు మిల్లు దుస్తుల పోటికి నిలువలేక పోతున్నాయి. రాబోయే కాలంలో జీవితం గుడ్డు పరిస్థితిని ఎదుర్కోవాల్సి రావచ్చు. కాబట్టి మనం పిల్లల్ని చదివిద్దామయ్యా." అంది భర్తతో నారమ్మ ముందు చూపుతో.


నరసయ్యకు కూడా భార్య చెప్పింది నిజమే అనిపించింది. పిల్లలిద్దరిని బడిలో చేరిపించి భార్యాభర్తలు బండ కష్టం మొదలు పెట్టారు.


ఆస్తి పెరుగకున్న  వయసు పెరుగుతుంది. నరసయ్యకు నలబైయేండ్లు పైబడినాయి. పాప శాంతి డిగ్రీ, బాబు మధు ఇంటర్ ఫైనల్కు వచ్చారు.


పిల్లలు ఇద్దరూ కుటుంబ పరిస్థితులకు అనుగుణంగా మసులుకుంటూ  ఏమి పడితే అది తిని, ఏ గుడ్డలిస్తే అవి కట్ఢుకొని క్రమశిక్షణతో చదువుకుంటున్నారు. తమ తల్లిదండ్రులు తమ కోసం నిద్రాహారాలు మాని కష్టపడడం చూసి కావచ్చు.


పిల్లలు పెరిగి పెద్దయ్యే కొద్ది నరసయ్యలో ఆలోచనలు కారుమేఘాల్లా ముసురుకున్నాయి.

"తాను పిల్లలను చదివించడం తప్ప ఏమీ మిగలబెట్టలేకపోయాడు. తండ్రి సంపాదించిన ఐదు సెంట్లు స్థలం, అందులో రెండు సెంట్ల ఇల్లు మాత్రమే ఉన్నాయి. అమ్మాయికి ఈ ఏడాదితో డిగ్రీ పూర్తై ఇరవై ఒక్క ఏండ్లు నిండుతాయి. మంచి సంబంధం చూసి పెండ్లి చేయాలి. అబ్బాయికి ఇంటర్ పూర్తవుతుంది. పై చదువులకు పంపాలి. పంపించక పోతే వాని బతుకు  'ఉట్టికి స్వర్గానికి కాకుండా పోతుంది'. చేజేతులారా తామే చెడగొట్టిన వాళ్ళమైపోతాం. అయితే ఏమి చేయాలి." ఈ ఆలోచనల తీవ్రతను భార్యకు కూడా అంటించాడు నరసయ్య. 


ఆమె మనసు కూడా ఆలోచనలతో బరువెక్కింది.


ఓ రోజు గాంధీ రోడ్డులో గంగాధరంతో మాట్లాడింది మొదలు నరసయ్య ఆలోచనల్లో వేగం పెరిగింది. నరసయ్య తండ్రి సుబ్బరంగయ్య స్థలం కొన్న నాటికి ప్రొద్దుటూరు పదిహేను ఇరవై వీధులకు మించి లేదు. అయినప్పటికీ ప్రొద్దుటూరు బ్రిటిష్ కాలం నాటికే మునిసిపాలిటీ. అతికొద్ది కాలంలోనే ప్రొద్దుటూరు విశృంఖలంగా పెరిగి రాయలసీమలోనే అతిముఖ్యమైన పట్టణంగా రూపుదిద్దుకుంది.

కడప జిల్లాలో ప్రొద్దుటూరు జనాభా రీత్యా కడప కన్నా పెద్దది. కడప అధికార కేంద్రమైతే ప్రొద్దుటూరు వ్యాపార  పారిశ్రామిక కేంద్రం. ఆయిల్ మిల్లులు, రైస్ మిల్లులు, కాటన్ మిల్లులుతో విపరీతంగా విస్తరించింది. చుట్టుపక్కల ఉన్న గ్రామాల్ని తనలో విలీనం చేసుకుంటూ , నాలుగు వైపులా ఉన్న నాలుగు పంచాయితీలను కలుపుకొని నగర స్థాయికి చేరుకుంది.


ప్రొద్దుటూరు బంగారు, బట్టల వ్యాపారంలో సెకండ్ బాంబేగాను, సాంస్కృతికంగా రెండవ మైసూర్ గాను పేరుగాంచింది. ఒకవైపు ఫ్యాక్షన్ గొడవలతో రక్తం పారుతుంటే మరోవైపు సాహిత్య సభలు, సమావేశాలు జరుగుతుండడం కూడా మరో ఆశ్చర్యకరమైన విశేషమే.


ప్రొద్దుటూరు చుట్టూ పక్కల భారీ సిమెంట్ ఫ్యాక్టరీలు వెలవడం వలన వాటి ప్రభావం ప్రొద్దుటూరు పైబడి శరవేగంగా వ్యాపించడం వలన , ఒకప్పుడు ఊరు చివర ఉన్న నరసయ్య ఇల్లు ప్రస్తుతం ఊరి మధ్య భాగమైంది.


వివిధ పనుల మీద రోజు ప్రొద్దుటూరుకు వచ్చి పోయే జనం దాదాపు లక్ష ఉంటుందని ఒక అంచనా. ఈ క్రమంలో అన్ని వ్యాపారాలు తోపాటు రియల్ ఎస్టేట్ వ్యాపార రంగం కూడా అనూహ్యంగా పెరిగి పోయాయి. ఇరవై వేలు సెంట్ ధర ఉన్న స్థలం అనతికాలంలోనే ఇరవై లక్షలుకు చేరుకుంది.

నరసయ్యను గాంధీ రోడ్డులో కలిసిన గంగాధరం మరోసారి సరాసరి ఇంటికే వచ్చి కలిశాడు.

ప్రొద్దుటూరులో గాంధీరోడ్డు నందుండే సాగర్ హోటల్ స్థలాల బ్రోకర్లు కలిసే ప్రధాన కేంద్రం. ఉదయం నుండి సాయంత్రం వరకు బ్రోకర్లంతా అక్కడే గుమిగూడి ఉంటారు. దీనితో సాగర్ హోటల్ కూడా లాభాలే బాట పట్టింది.


"ఏమి నరసయ్యా! నేను చెప్పిన విషయం ఏమాలోచించావ్!" గంగాధరం పలకరింపుగా ప్రస్తావించాడు.


"రా..రా.. గంగాధరం! కూర్చో! ఆ విషయం ఇంకా ఏమాలోచించలేదు" అన్నాడు నరసయ్య మామూలుగానే, ఏ ఆతృత కనబడనీయకుండా.


"చూడు నరసయ్య! ఈ అతుకుల గతుకుల బతుకులు ఎంత కాలం అనుభవిస్తావ్ చెప్పు! మీరంటే మీ బతుకులు ఎలాగోలా వెళ్ళదీసుకున్నారు. పిల్లల భవిష్యత్తన్నా బాగుజేయండి.

ముసుగులో గుద్దులాట ఎందుకుగాని, నీ ఐదు సెంట్లు స్థలానికి సెంటుకు ఇరవై లక్షల వంతున ఐదు సెంట్లకు కోటి రూపాయలు ఇప్పిస్తాను. పార్టీ రెడీగా ఉంది. నాకు లక్షకు వెయ్యి రూపాయలు కమీషన్ ఇయ్యాలి. ముందే చెప్పాలి కదాా! బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి రా!" అంటూ విషయం కుండా బద్దలు కొట్టినట్లు చెప్పాడు గంగాధరం.


మళ్లీ తనే "కూతురికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయవచ్చు. కొడుకును పై చదువులకు పంపవచ్చు. ఊరి వెలుపల కొత్తగా ఏర్పాటు అవుతున్న కాలనీలలో ఇంతే స్థలాన్ని కొని అందమైన ఇల్లు కట్టుకోవచ్చు. ఆ స్థలం కూడా నేనే కొనిస్తాను. నువ్వు కూడా ఈ మగ్గం బతుకు వదిలేసి మంచి సెంటరులో గుడ్డలు షాప్ పెట్టుకుని దర్జాగా బతుకు వచ్చు. చాలీ చాలని బతుకుల నుండి బయటపడి నాణ్యమైన గౌరవప్రదమైన జీవితాన్ని గడపవచ్చు. నువ్వు సరే అంటే ఇప్పుడే టోకెన్ అడ్వాన్స్ తెచ్చి ఇస్తాను. ఏమంటావో చెప్పు" అంటూ ఊరించి చెప్పాడు గంగాధరం.


"నేను నా భార్యాబిడ్డలతో ఆలోచించి ఏ మాటా రేపు సాగర్ హోటల్ దగ్గర కలిసినప్పుడు చెపుతా గాని, ఇప్పటికీ పోయి రా గంగాధరం! " అని పంపించాడు నరసయ్య.


గంగాధరం వెళ్లిపోతూ "బాగా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకో! అది నీ జీవితానికి శుభోదయం కావాలి." అని నరసయ్యలో ఆశలు పుట్టను రేపుతూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు గంగాధరం.

గంగాధరం వెళ్లిపోగానే నరసయ్య గతంలోకి జారుకున్నాడు.


"నాన్న నేను పుట్టినప్పుడు కొన్నాడు ఈ స్థలాన్ని. ఇంటి కాంపౌండుకు పడమర వైపు నాన్న నా చిన్నప్పుడే జామ చెట్టు, మామిడి చెట్టు కరివేపాకు చెట్టు నాటాడు. అవి పెరిగి నాతో పాటే పెద్దవి అయ్యాయి. అమ్మ ఈచెట్లకే ఉయ్యాల వేసి లాలిపాట పాడి నన్ను నిద్రపుచ్చేది.

ఇంటి కాంపౌండులో తూర్పు వైపున బండల వారగా పూలమొక్కలు, కూరగాయలు, ఆకుకూరలు వేస్తుంది నారమ్మ. పనిచేసి కలిసినప్పుడల్లా ఆ చెట్ల కిందనే మంచం వేసుకుని విశ్రాంతి తీసుకుంటాం భార్యాభర్తలం.


నా అనుభూతిలు, నా అనుభవాలు అన్నీ ఈఇంటితోనే పెనవేసుకుని ఉన్నాయి. ఈ ఇల్లు అమ్మానాన్నల తీపి గుర్తు. ఇంత అనుబంధం ఉన్న ఇంటిని ఎలా అమ్మడం " నరసయ్య బాధగా నిట్టూర్చాడు.


భార్యను పిలిచి గంగాధరం చెప్పిన విషయం చెప్పి ఈఇంటిపై తనకు గల మమకారాన్ని వివరించి చెప్పాడు.


"నాకు కూడా ఈఇంటితో అనుబంధం ఇరవై ఐదేండ్లు. తక్కువేమీ కాదు. తిన్నా తినకపోయినా ఈ ఇల్లు తన కడుపులో దాచుకుంది. ఇల్లు అమ్మడం నాకు బాధనే. కానీ ధనం, భూమీ శాశ్వతంగా ఎవరి సొంతం కాదు. మనిషే అశాశ్వితమైనవాడు. అతనికి వాటితో ఎంతవరకు రుణానుబంధం ఉంటుందో అంతవరకే అతని దగ్గర ఉంటాయి. ఆతరువాత అవి మరోకరి సొంతమవుతాయి. కాబట్టి మనం నిమిత్తమాత్రులు. ఆర్థిక అవసరాలే అన్ని మార్పులను నిర్ణయించేది." అని నారమ్మ వేదాంత ధోరణిలో ఉన్న వాస్తవాన్ని భర్తకు వివరించి చెప్పింది.


నారమ్మ అమాకురాలే గాని అనుభవమనేది అన్ని జీవిత పాఠాలు నేర్పుతుంది.

ఆరాత్రి నరసయ్య ఇంటికి ఎదురింటి విషయం భార్యాభర్తల మధ్య చర్చకు వచ్చింది.


"ఎదురింటి వెంకట్రామయ్య తన కులం వాడే. వరుసకు బావ అవుతాడు. నెమ్మదస్తుడు, మితభాషి, మంచివాడిగా పేరుంది. అతని కొడుకు అనిల్ ఎం.టెక్ చేసి హైదరాబాదులో నెలకు లక్ష రూపాయలు జీతంతో ఉద్యోగంలో ఉన్నాడు. ఆ అబ్బాయి అయితే మన అమ్మాయికి ఈడుజోడు సరీగ్గా సరిపోతుంది. పైగా అబ్బాయి వాళ్ళ నాన్నలాగే మంచివాడు. ముక్కు ముఖం, ఒడ్డూ ఒడుపు చక్కగా ఉన్నాడు. మన అమ్మాయి కన్నా ఐదేండ్లు పెద్దవాడు కూడా" అని ఇద్దరూ ముచ్చటించుకున్నారు.


"అలాగే తమ కొడుకు మధు ఇంటరు అయి పోయాక ఎంసెట్ కోచింగ్ తీసుకొనే తాహత్తు లేక వార్తా పత్రికలో వచ్చిన మెటీరియల్ ఆధారంగా పరీక్ష రాస్తే రాంక్ రాలేదు. మేనేజ్మెంట్ కోటా కిందైనా సీటు తీసుకుని వాని జీవితం బాగు చేయాలి" ఆలోచనల్లో పడ్డారు.


"అరకడుపులతో , ముతక బట్టలతో ఎంతకాలం సాగతీయాలి జీవితాన్ని. నారమ్మ ఓపికతో ఎన్ని కష్టాలు అనుభవించింది. కనీసం ఈ వయసులోనైనా ఆమెను సుఖపెట్టాలి. ఇవన్నీ జరగాలంటే ఇల్లు అమ్మక తప్పదు" అన్న దృడ నిశ్చయానికి వచ్చాడు నరసయ్య. వచ్చిందే తడవుగా గంగాధరం కోసం సాగర్ హోటల్ దగ్గరకు పోయాడు నరసయ్య.

                                      * 

ప్రొద్దుటూరుకు తూర్పు భాగంలో, కొత్తగా అందంగా రూపుదిద్దుకున్న యన్టిఆర్ కాలనీలో, ఐదు సెంట్ల స్థలంలో , ఆధునిక హంగులతో ఉన్న భవనంలో, అలంకరించిన పూజా గదిలో, ఖరీదైన దుస్తుల్లో నరసయ్య తల్లిదండ్రులైన సుబ్బరంగయ్య చౌడమ్మల చిత్రం పటానికి పూలమాలలు వేసి నమస్కరిస్తున్నారు నరసయ్య నారమ్మలు.


"అమ్మా! కాలేజీకి టైం అయిపోతాంది క్యారియర్ ఇయమ్మా!" అంటూ కొత్తగా కొన్న బైక్ దగ్గర నిలబడి వెయిట్ చేస్తూ కేక వేశాడు కొడుకు మధు. తాను చదువుతున్న వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజీ వారు ఐదు నిమిషాలు లేటైనా గేటుకు తాళం వేస్తారని వాడి భయం.


కూతురు అత్తగారి ఇంటికి పోవడానికి అన్ని సర్దుకొని అమ్మానాన్నలకు చెప్పడానికి ఎదురు చూస్తూవుంది.


అల్లుడు అనిల్ మామగారు తీయించిన కొత్త మోటార్ బైక్ దగ్గర నిలబడి భార్యను ఎక్కించుకొని తన ఇంటికి పోవడానికి సిద్ధంగా ఉన్నాడు.


నరసయ్య నిన్ననే కొన్న స్కూటీ దగ్గరకు క్యారియరుతో వచ్చాడు. ప్రొద్దుటూరు శివాలయం సెంటరులో ఏర్పాటు చేసుకొన్న సొంత గుడ్డలు షాపుకు పోవడానికి. నారమ్మ అల్లుడిని కూతురిని కొడుకును భర్తను పంపించి తాను టీవీలో కొత్త సీరియల్ చూడడానికి ఇంట్లోకి నడిచింది.

జీవితం రాట్నం లాంటిది.


కాల ప్రభావంతో కిందవున్నవాడు పైకి, పైనవున్నవాడు కిందికి మారుతున్న విషయం తెలిసిందే కదా!

***


కాశీవరపు వెంకటసుబ్బయ్య గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ కాశీవరపు వెంకటసుబ్బయ్య  గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

Profile Link:

Youtube Play List Link:

పేరు: కాశీవరపు వెంకటసుబ్బయ్య

చదువు: B.com

పుట్టిన తేది: 1960

తల్లిదండ్రులు: వెంకటసుబ్బయ్య

రచనలు: ఎద మీటిన రాగాలు కవితా సంపుటి.

అముద్రితాలు: తుమ్మెద పదాలు మని కవితలు సంపుటి, పినాకిని కథలు కథల సంపుటి.

సాహిత్య సేవ: చైతన్య సాహిత్య కళా వేదిక సంస్థను స్థాపించి అనేక సాహిత్య కార్యక్రమాలు నిర్వహించడం.

సన్మానాలు సత్కారాలు: అనేక సాహితీ సంస్థల నుంచి సన్మానాలు సత్కారాలు పొందడం.

---------

2 commentaires


mk kumar
mk kumar
17 janv.

.నరసయ్య, తన కుటుంబంతో కలిసి కొత్త జీవితానికి అడుగుపెట్టాడు. నరసయ్య తన గుండెల మీద భారంగా ఉన్న అనుబంధాలను తలచుకుంటూ ఈ నిర్ణయం తీసుకున్నా, అది తన కుటుంబ భవిష్యత్తు కోసం సరికొత్త ఆరంభం అని భావించాడు.


నారమ్మ తల్లి హృదయంతో తన కడుపు గారాలపిల్లల కోసం అన్ని అనుభూతులను పక్కనపెట్టింది. పిల్లలు ఉన్నత విద్యను పూర్తిచేసి వారి జీవితాలను సర్ధుబాటు చేసుకున్నారు.


నరసయ్య తన పాత ఇంటి జ్ఞాపకాలను మదిలో దాచుకున్నప్పటికీ, కొత్త ఇంటి ఆనందాలు ఆ గాయాల్ని నెమ్మదిగా నయం చేశాయి.


మగ్గం బతుకు ఒక సాధారణ కుటుంబం అనుభవించిన కష్టసుఖాల కథ. ఈ కథ, కాలం మారితే జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా, మమకారం, బాధ్యత, ఆశయాలతో బతికిన జీవితం ఎలా విజయవంతం అవుతుందో చెప్పిన హృద్యమైన గాథ.


J'aime

మగ్గం బతుకులు: కె. వెంకట సుబ్బయ్య ... మంచి నిర్మాణాత్మక కథ ... మగ్గం నేసే వారికి ప్రభుత్వం వేరే బ్రతుకులు చూపించాలి ... వారికి తగ్గట్టు ... వారి ఇష్టానుసారం (బట్టల కొట్టు, బట్టల ఫ్యాక్టరీ ఇతరత్రా ) ... ఎందుకంటే ఫ్యాక్టరీ బట్ట ధర చాలా తక్కువ... మగ్గం బట్ట దాని ముందు నిలబడ లేదు. పి. వి. పద్మావతి మధు నివ్రితి

J'aime
bottom of page