మహిళా సాధికారం సాధించేదెన్నడు?
- Rayala Sreeramachandrakumar
- 5 hours ago
- 4 min read
#RCKumar, #శ్రీరామచంద్రకుమార్, #MahilaSadhikaramSadinchedennad, #మహిళాసాధికారంసాధించేదెన్నడు, ##TeluguArticleOnWomanEmpowerment

Mahila Sadhikaram Sadinchedennadu - New Telugu Article Written By R C Kumar
Published In manatelugukathalu.com On 26/04/2025
మహిళా సాధికారం సాధించేదెన్నడు - తెలుగు వ్యాసం
రచన: ఆర్ సి కుమార్
ఈ మధ్యకాలంలో మహిళా సాధికారత గురించి గొప్పగా చెప్పుకోవడం, ఉపన్యాసాలు ఇవ్వడం పరిపాటిగా మారింది. నిజానికి ఏనాడో మన ఉపనిషత్తులు, శాస్త్రాలు స్త్రీని సాధికారత కలిగిన స్వరూపంగా పేర్కొన్నాయి. ఋగ్వేదం స్త్రీ ఔన్నత్యాన్ని ఎంతగానో ప్రశంసించింది. అలనాటి సినీ సాహిత్యంలోనూ "ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి" అనే ఆచరణ యోగ్యమైన చక్కటి పదజాలాన్ని వాడడం ముదావహం. మహిళలు జాతి నిర్మాణంలో అర్థవంతమైన పాత్రను పోషించగలగాలి. లింగ వివక్షను పూర్తిగా అరికట్టగలిగితే భారత జిడిపికి 70 వేల కోట్ల డాలర్లు అదనంగా సమకూరుతాయని పరిశోధనలు తెలుపుతున్నాయి. వారు స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటూ విజయవంతంగా ముందుకు సాగడానికి కావలసిన సహృద్భావ వాతావరణాన్ని సృష్టించే దిశగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
బహుళ పాత్రలు:
మహిళలు వంట గదినే ఒక దేవాలయంగా భావిస్తూ పొయ్యి వెలిగించడం అంటే అగ్ని హోత్రం వెలిగించడమే అనుకుంటూ, భక్తితో అనురక్తితో 'నేను వండే పదార్థాలు తినేవారి ఆకలి తీర్చి ఆరోగ్యం చేకూర్చాలి' అని కోరుకుంటూ వండి వారుస్తారు. అదే ప్రతిఫలాపేక్ష లేని కర్మయోగం. శారీరకం, మానసికం, ఆధ్యాత్మికం అనే మూడు శక్తులను సమకూర్చుకొని తానే అన్నీ, అన్నింటతానేగా సంసారాన్ని నెట్టుకొచ్చే మహిళలు దేవతామూర్తులు. ప్రాచీన సంస్కృతిలో ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు నాట్యం చేస్తారు అనే ముచ్చటైన మాటలు మనం వింటునే ఉన్నాం కదా. నేటి భారతంలో మహిళా మణులు అంతటి గౌరవాన్ని పొందుతున్నారా అని ఆత్మ పరిశీలన చేసుకోవలసిన అవసరముంది. నిజ జీవితంలో అనేక పాత్రలు పోషించే స్త్రీ పురుషుల విజయం లోనూ ప్రధాన భాగస్వామ్యం కలిగి ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కుటుంబ యజమానికి వెన్ను దన్నుగా నిలిచే హోమ్ మేకర్ల పాత్ర అద్వితీయం.
గుర్తింపు ఏమాత్రం :
దురదృష్టవశాత్తు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎగతాళిగా, హేళనగా భార్యామణులను, ఇతర మహిళలను తేలిగ్గా తీసిపారేస్తూ, కించపరుస్తూ అసంబద్ధమైన జోకులతో వాట్సప్ చాట్లు, షేర్ చాట్లు, టిక్ టాక్ ల్లో చక్కర్లు కొట్టడం చూస్తున్నాం. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ ప్రతిభను చాటుతునే ఉన్నారు, ఉన్నత స్థానాలకి చేరుకుంటున్నారు కదా. అయినా పురుషులతో సమానంగా ఎందుకు ఎదగలేకపోతున్నారు ? వివక్షలు, అవహేళనలు, వేధింపులు ఇంకా ఎందుకు వెలుగు చూస్తూనే ఉన్నాయి ? స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు అంటూ ప్రవచించే పురుష పుంగవులే సుపుత్ర ప్రాప్తిరస్తు అని దీవిస్తారే గాని, సుపుత్రికా ప్రాప్తిరస్తు అని ఎందుకు దీవించరో అంతర్మధనం చేసుకోవాలి.
స్త్రీత్వం లోని పవిత్రం :
స్త్రీ అన్న పదమే సమస్త సృష్టికి మూలం. అందులోని సకార, రకార, తకారాలు - సత్వ, రజ, తమో గుణాలకు నిలయం. ఇవి సృష్టి, స్థితి, లయలకు ప్రతీకలు. జగన్మాత అంటే జగత్తుకు మాత కాదు జగత్తనే మాత. ఇచ్చాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి. ఈ జగత్తులో మన కళ్ళ ముందు నడయాడే ప్రతి స్త్రీ జగన్మాత అంశే. సనాతన ధర్మంలో మహిళను శక్తి స్వరూపిణిగా, ఆదిపరాశక్తిగా అభివర్ణించడానికి కారణం తెలుసుకోవాలి. త్రిమూర్తులకు మూలమైన ఆదిపరాశక్తి స్త్రీ. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సృష్టి, స్థితి, లయ కారక రూపమే ఆదిపరాశక్తి. లక్ష్మీ, పార్వతీ, సరస్వతులు ఆ రూపాలే. ఏకరూపంలో కనిపించే అర్ధనారీశ్వర స్వరూపం మనకు తెలిసిందే. వాక్కుకు సరస్వతి, సంపదలకు లక్ష్మి, మంగళానికి పార్వతి అధిష్టాన దేవతలు. ఈ ముగ్గురూ ఒకరిలో ఒకరు విడదీయలేని దివ్యశక్తులై ఉంటారు. అందుకే స్త్రీని శక్తి స్వరూపిణిగా భావించి గౌరవిస్తారు.
సహనం సాహసం :
సహనానికి, ఓర్పుకి పెట్టింది పేరు భారత నారి కాబట్టే స్త్రీని భూమాతతో పోల్చడం జరిగింది. కానీ మానవ మాత్రుల సహనానికి, ఓర్పుకి ఒక హద్దు అనేది ఉంటుంది. వాటిని బలహీనతగా భావించి మహిళలను ఆట బొమ్మల్లా ఆడుకోవాలని చూస్తే మాత్రం నిగ్రహించడం తగదు. మనకు విగ్రహాలలో, చిత్రపటాలలో ఆదిపరాశక్తి లక్ష్మిగా, సరస్వతిగా, పార్వతిగా సౌమ్య రూపాలలో కనిపించినా, అవసరమైన వేళల్లో అసురసంహార సమయాల్లో మహాకాళిగా, దుర్గా దేవిగా ఉగ్ర రూపాలను కూడా ప్రదర్శించి వీర విహారం చేసింది. అదే విధంగా కష్ట సమయాల్లో సవాళ్లు ఎదురైతే ఎదిరించి నిలబడే దుర్గమ్మలుగా నేటి మహిళలు సత్తా చాటాలి. దుర్గా దేవి తత్వం ద్వారా నేర్వదగ్గ పాఠం అదే. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసే రోజులు కావివి. ఇంటికి మహాలక్ష్మి, జ్ఞానంలో సరస్వతి, ఓర్పులో భూదేవి లక్షణాలతో మహిళలు ముందుకు సాగితే, కుటుంబాల్లోనే కాదు ఉద్యోగ వ్యాపారాల్లో, రాజకీయాల్లోనూ అద్భుతంగా రాణించగలరు. అలాంటి మహిళా విజేతలను ఎందరినో నిజ జీవితంలో మనం చూస్తూనే ఉన్నాం.
సామాజిక బాధ్యత :
స్త్రీల పట్ల గౌరవభావంతో మెలిగే విధంగా మగవారి మైండ్ సెట్ లో మార్పు రానంత కాలం మహిళలపై వివక్ష కొనసాగుతూనే ఉంటుంది. అన్ని విధాల మహిళలకు రక్షణ కల్పిస్తూ, ప్రధాన నిర్ణయాల్లో వారిని భాగస్వాములుగా చేయాలి. వారి శ్రమను, సేవలను సగౌరవంగా గుర్తించి తద్వారా వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాలి. సాంఘిక అసమానతలు, దురాచారాలను సమూలంగా నిర్మూలించే దిశగా ప్రభుత్వం సభ్య సమాజం చర్యలు చేపట్టాలి. నీతి ఆయోగ్ తాజా నివేదికలో దేశవ్యాప్తంగా ఉన్నత విద్యను అభ్యసిస్తున్న వారిలో అమ్మాయిలు అబ్బాయిలు దాదాపు సరి సమానంగా ఉన్నారని తెలియజేయడం శుభపరిణామం. స్త్రీలు వంటింటికే పరిమితమై గడప దాటకూడదు అనే మూఢమైన కట్టుబాట్లను తెంచుకొని నేటి మహిళ అనేక రంగాలలో విజయవంతంగా దూసుకెళ్ళడం మనం చూస్తున్నాం. తల్లిదండ్రులు ఉపాధ్యాయులు బాల్యదశ నుంచే పిల్లలకు నైతిక విలువలు నేర్పుతూ వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి. ముఖ్యంగా అబ్బాయిలకు మహిళలను ఆదరించి గౌరవించడం అలవాటు చేయాలి. ఇంటా బయట లైంగిక వేధింపులకు ఆస్కారం లేని సురక్షిత వాతావరణంలోనే మహిళా సాధికార సాకారం అవుతుందన్న నగ్న సత్యాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించి పాటిస్తే భారతదేశ ఔన్నత్యానికి అది ఒక కలికితురాయిగా నిలిచిపోతుంది.
ధన్యవాదాలు
ఆర్ సి కుమార్
సామాజిక వేత్త
ఆర్ సి కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నమస్తే
ఆర్.సి. కుమార్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లో వివిధ హోదాల్లో అత్యుత్తమ సేవలు అందించి అనేక అవార్డులు రివార్డులు పొందారు. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా పదవీ విరమణ చేసిన పిదప సంస్థకు చెందిన పూర్వ ఉద్యోగులతో వెటరన్స్ గిల్డ్ అనే సంస్థను స్థాపించి అనేక సామాజిక, సాంస్కృతిక, సంక్షేమ కార్యక్రమాలకు పునాది వేశారు.
పదవి విరమణ తర్వాత గత పది సంవత్సరాలుగా వివిధ హోదాల్లో తన ప్రవృత్తికి ఊతమిచ్చే సామాజిక సేవా కార్యకలాపాలు కొనసాగిస్తూనే ఉన్నారు. అమీర్ పేట, సనత్ నగర్ ప్రాంతాలలో గల కాలనీల సంక్షేమ సంఘాలతో కూడిన సమాఖ్యను 'ఫ్రాబ్స్' (FRABSS, ఫెడరేషన్ అఫ్ రెసిడెంట్స్ అసోసియేషన్స్ ఆఫ్ బల్కంపేట్, సంజీవరెడ్డి నగర్, సనత్ నగర్) అనే పేరుతో ఏర్పాటు చేసి అచిరకాలంలోనే స్థానికంగా దానినొక ప్రఖ్యాత సంస్థగా తీర్చిదిద్దారు. సుమారు ఐదు సంవత్సరాల పాటు ఆ సంస్థ తరఫున అధ్యక్ష హోదాలో అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రముఖ సామాజిక వేత్తగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు.
రాయల సేవా సమితి అనే మరొక స్వచ్ఛంద సంస్థను స్థాపించి పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ రహిత సమాజం పై అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తూ, బీద సాదలకు అన్నదానాలు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, స్కాలర్షిప్ లు అందించడం, మొక్కలు నాటించడం వంటి సేవా కార్యక్రమాలు ప్రతి నెలా చేస్తుంటారు. బస్తీలు, కాలనీల లో సమాజ సేవా కార్యక్రమాలతో పాటు పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ, జల సంరక్షణ వంటి అనేక సామాజిక అంశాలపై ప్రజల్లో అవగాహన తెచ్చే విధంగా పాటుపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వీరి సేవలను కొనియాడుతూ ప్రశంసా పత్రాన్ని సైతం అందజేశారు.
కథలు కవితలు రాయడం వారికి ఇష్టమైన హాబీ. స్వతంత్ర పాత్రికేయుడిగా వీరి రచనలు తరచుగా మాస పత్రికలు, దినసరి వార్తా పత్రికల్లోని ఎడిటోరియల్ పేజీల్లో ప్రచురింపబడుతుంటాయి. వక్తగా, వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ అనేక కార్యక్రమాల నిర్వహణ బాధ్యతను కొనసాగించడమే కాక ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, సత్సంగ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు.
వందనం, ఆర్ సి కుమార్
(కలం పేరు - రాకుమార్, పూర్తి పేరు - ఆర్. శ్రీరామచంద్రకుమార్)
సామాజికవేత్త
コメント