top of page
Writer's pictureA . Annapurna

మజిలీ!



'Majili' - New Telugu Story Written By A. Annapurna

Published in manatelugukathalu.com on 27/06/2024 

'మజిలీ!' తెలుగు కథ

రచన: ఏ. అన్నపూర్ణ

(ఉత్తమ అభ్యుదయ రచయిత్రి)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



విక్రమ్ తో మధురిమకు చాలాకాలంగా పరిచయం. 

అతను ఒక గొప్ప రచయిత. అతడు నవలలు రాయడం మొదలుపెట్టిన వేళా విశేషం ఏమిటోగాని వయసుతో సంబంధం లేనివాళ్లు కూడా ఇష్టంగా చదివేవారు. 

 ఇక అభిమానులకు అంతేలేదు. ఫోనులు, ఈ మెయిల్స్, ఫోనుమెస్సేజిలు.. ఓపికగా సమాధానాలు ఇచ్చేవాడు.

 

 ఆతర్వాత ఆ ఫ్లో భరించలేక లిమిట్ చేసేసాడు. 

పాఠకులకు, అభిమానులకు ఏ అంశంలో ఇష్టమో యిట్టె తెలుసుకుని రచనలు చేసేవాడు. 


ఇరవై ఏళ్లపాటు అతడు రచయితల్లో చక్రవర్తిగా వెలిగాడు. 

 కాలం మారుతుంది. అభిరుచులు మారుతాయి. సమస్యలు కొత్తగా పుట్టుకు వస్తాయి. అందులో నాగరికత పెంచుకునే యువత ఎన్నో తప్పులు చేస్తుంది. 


 వారి సమస్య తీర్చేవారు లేనప్పుడు విక్రమ్ వారికి కౌన్సిలింగ్ క్లాసులు తీసుకుని దగ్గిర అయ్యాడు. వారికి ఆప్తుడు స్నేహితుడు అయ్యాడు. ఇప్పుడు అతడికి యువత అభిమానులు అయ్యారు. 


ఇది గొప్ప సహాయం, సందేహంలేదు. ఒక రచయితగా రచనలు ఆనందం ఇస్తే, జీవిత విశ్లేషణతో కూడిన సలహాలు ఎందరికో మార్గ సూచికాలు అయ్యాయి. 

 మధురిమా విదేశాల్లో ఉంటుంది. అప్పుడప్పుడు అతడి గురించి తెలుసుకుని మెయిల్స్ పెట్టేది. అతడు చాలామందికి అభిమాని. ఆతడి పరిచయస్తుల్లో ఒక ముఖ్య మైన మనిషి మధురిమ !


అది స్నేహమా.. అభిమానమా.. జస్ట్ పరిచయమా.. ఏమో. ! కొన్ని భావాలకు పేరు ఉండదు. 


అదిగౌరవ ప్రదం. ఆత్మీయం. ఆనందంగా చెప్పుకునే ఒక మరువలేని జ్ఞాపకం!


 చాలా కాలానికి అంటే సుమారు పదిహేనుఏళ్లకు విక్రంని కలుసుకోవాలని అనిపించింది ఇండియా వచ్చిన

మధురిమకు.

 

 ఫోను చేసింది. వెంటనే అటునుంచి బదులు పలికాడు విక్రమ్. 

''హలొ మధూ నువ్వా ? ఇన్నేళ్లకి! ఏమిటి సంగతి చెప్పు.. '' అన్నాడు. 


''గుర్తుపట్టేవా? నాకు చాలా సంతోషంగా వుంది విక్కీ. నన్ను గుర్తు పెట్టుకున్నావు. ఇండియాకి వచ్చి వారం ఐనది. ''


''ఎందుకు గుర్తులేదు? నువ్వు మెయిల్స్ పంపుతున్నావుగా!''


''అవుననుకో. నువ్వేమో 'సకల కళా కోవిదు’డివి. అపార్ధం చేసుకోవద్దు. నీకు చాలా విషయాల్లో ప్రవేశం వుంది. 

చాలా ఇష్టాలు వ్యాపకాలు ఉంటాయి. ఈ సమయంలో నేను పలకరిస్తే నువ్వు ఫోను లిఫ్ట్ చేయడం అంటే.. చాలా ఆనందంగా అనిపించింది. ''


''ఓకే. సంగతేమిటో చెప్పు. ''


''నాకు నీ అప్పోయింట్మెంట్ కావాలి. నిన్ను కలవాలి అనుకుంటున్నా!''


''ఓ అలాగే ! నెక్స్ట్ వీక్ కలుద్దాం. ఏరోజు ఎన్ని గంటలకి మెస్సేజ్ పెడతా సరేనా?''


''షూర్.. థాంక్స్. బై '' 


అతను ఎక్కువగా మాటాడడు. ఎంతవరకూ అంటే అవసరం ఉన్నంతవరకే !


 మధురిమ మళ్ళీ వారంకోసం ఎంతగానో ఎదురు చూసింది. వేరే పనిలేకుండా ఖాళీగా ఉంచుకుంది. 


 వేరే బంధువులు ఫ్రెండ్స్ రాకుండా జాగ్రత్తపడింది. 

 ఫ్రైడే విక్కీ మెస్సేజ్ పెడతాడని చాలా సార్లు ఫోను చెక్ చేసింది. 

కానీ విక్కీ నుంచి ఎలాంటి మెస్సేజ్ లేదు. 


 మధు చాలా నిరాశపడింది. ఎందుకిలా చేసాడు? వీలు లేదు వేరే పని ఉందనో మరొకటో చెప్పాలికదా.. 

లేదా మరోరోజు కలుద్దాం అని ప్లాను చేయాలి. 

చేసేదిలేక ఊరుకుంది. చివరికి శనివారం రాత్రి బాగా ఆలస్యంగా మెస్సేజ్ పెట్టేడు. 


''సారీ మధు.. ఈ వారం అనుకోని పని పడింది. మరోసారి కలుద్దాం!''


కాస్తంత కోపం వచ్చినా సర్దుకుని ''పోనీలే ఇంకోరోజు కలుస్తాను. ఇంకా మూడునెలలు వుంటానుగా !''

 అనుకుంది. 


 ఆతర్వాత మధుకి వీలుకాలేదు. మధు అడిగినపుడు విక్కీ కి కుదరలేదు. 


చివరికి ఇక రెండు వారాల్లో అమెరికా వెళ్ళిపోతుంది అనగానే ఒకరోజు కలుసుకుని తీరాలని నిశ్చయించుకున్నారు ఇద్దరూ. 


 ముందురోజు కాస్తంత మేకప్ చేసుకోడానికి అద్దం ముందు కూర్చుంది. 


అంతే! అదిరిపడి మళ్ళీ మళ్ళీ మొహం చూసుకుంది. ఆమె మొహం మీద చర్మం ఎండిపోయి బిగుసుకు పోయినట్టుగా వుంది. 


 వెంటనే ఖరీదైన ఫెసియల్ క్రీం రాసుకుంది. చాలాసేపు మసాజ్ చేసుకుంది. రకరకాల ఆయిల్స్ రాసింది. చివరికి అందంగా తయారు ఐనది.. రెండు గంటలు కష్టపడి. 


 అంతలో చెల్లి నుంచి ఫోను.. ''అక్కా నీ మరిదికి కారు యాక్సిడెంట్ ఐనది వెంటనే రా..” అంటూ హాస్పిటల్ పేరు చెప్పింది. 


వీలు చేసుకుని విక్రంకి మెస్సేజ్ పెట్టింది.. విక్కీ, ''చెల్లి హస్బెండ్ చనిపోయాడు. నేను చెల్లిని మా ఇంటికి

తీసుకురావాలి. తర్వాత మాటాడుతా ''అని. 


 చెల్లిని చూడటానికి స్నేహితులు బంధువులు రావడం వలన మరో నెల గడిచిపోయింది. 


అనుకున్నవి జరగవు కొన్నిసార్లు. అనుకోనివి జరుగుతాయి. విచిత్రం. 


 విక్కీ ఇల్లు దూరంగా ఏమీ లేదు. కానీ మధు వెళ్ళలేదు.. అతన్ని ఇంటికి పిలువలేదు. 


అలాంటి పరిస్థితి. 


 చెల్లిని కొడుకు లండన్ తీసికెల్లేక అప్పుడు వీలు కుదిరింది మధుకు. 


ఈ సారి ఇండియా ట్రిప్ ఇలా జరిగింది ఏమిటో.. అని బాధగా అనిపించింది. 

విక్కీ.. నన్ను కలుసుకోవాలని అనుకున్నాడో లేదో. నేనే ఆత్రపడుతున్నానా.. చూద్దాం. 


తనంత తానూ రమ్మని ఫోను చేస్తే వెడతాను అని తటస్తంగా ఉండి పోయిన్ది. 


 అలా మల్లి ఎదురుచూపుతో మరికొన్ని రోజులు గడిచాయి. విక్కీ నుంచి కబురు లేనేలేదు. 


అమెరికా నుంచి పిల్లలు 'ఇన్నాళ్లు ఉండిపోయావు. ఇక వచ్చే’యమని ఒకటే ఫోను చేస్తున్నారు. 


'నా మజిలీకి చేరుకోవాలి ఇక.. !’ అని టిక్కెట్టు కన్ఫర్మ్ చేసింది. 


అప్పుడు వచ్చింది విక్కీ మెస్సేజ్ ''నేనే వస్తాను.. ఈ వీకెండ్. ఓకేనా” అని!


మళ్ళీ మేకప్, చర్మం నిగారిమ్పు కోసం క్రీములు, ఆయిల్ మసాజ్లు.. అందంగా కనబడాలని పాట్లు. 


అమెరికా వెళ్లి నప్పటినుంచి అలవాటయిన చర్య ఇది. 

వున్నా పళంగా ఎక్కడికి వెళ్ళ లేదు.. ఎవరైనా వస్తే ముందుగా చెప్పి రావాలనేది ఇందుకోసమే !

మొఖానికి మెరుగు దిద్దుకుంది. అతడికోసం స్నాక్స్ రెడీ చేసింది. ఇల్లు నీట్గా సర్దింది. 


 అతడికోసం తెచ్చిన స్పెషల్ గిఫ్ట్ రాప్ చేసి పెట్టింది. ఫ్రీగా వుండే డ్రెస్ వేసుకుంది. 


విక్రమ్ కూడా తగినట్టు తయారు అయ్యాడు. అసలే అమెరికాలో ఉంటుంది. అన్ని పద్ధతిగా వుండాలని

కోరుకుంటారు అక్కడివాళ్లు. ఈ మధ్య ఇక్కడకూడా ఆడ మగా ఇంటిమీద వొంటిమీదా శ్రద్ధ పెడుతున్నారు. 

అందంగా కనిపించే బ్యూటీ టిప్స్ ఫాలో అవుతున్నారు. 


మరికొద్ది నిముషాలకు బయలు దేరాలనీ అనుకుంటూ ఉండగా.. విక్రంకి గుండెలో ఏదో తెలియని బాధ

నొప్పి మొదలైంది. బాగా చెమటలు పట్టాయి. 

 ఇంట్లోవున్న టాబ్లెట్స్ ఏవో వేసుకున్నాడు. కానీ అవేమి పనిచేయలేదు. పనివాడిని ఫోను చేసి పిలిచాడు. 

కారు డ్రైవర్ని పిలవమని చెప్పి అక్కడే సృహ తప్పి పడిపోయాడు. 


 విక్రంకోసం ఎదురుచూస్తూ వున్నా మధుకి అతడు ఎందుకు రాలేదు అర్ధంకాలేదు. ఎన్నిసార్లు ఫోను చేసినా ఎవరూ లిఫ్ట్ చేయడంలేదు. మళ్ళీ నిరాశ!


ఎందుకు ఇలా జరుగుతోంది? టైము ఎందుకు సహకరించడంలేదు?

విక్రమ్ ఫోన్ కాకుండా పనివాడి ఫోను నెంబర్ కూడా తీసుకోవలసింది. 

ఇప్పుడు ఏమనుకొని ఏమిలాభం? సరే నేనే అతనియింటికి వెళ్లి చూస్తాను. తెలుస్తుంది.. అనుకుని మధు, ఇంటికి తాళంవేసి బయలుదేరింది. 


 విక్రమ్ ఇంట్లో పనివాడు అసలు విషయం చెప్పేడు. 

మధు వెంటనే హాస్పిటల్కి వెళ్ళింది. కానీ చూడటానికి కుదరలేదు. 


అతడికి వెంటనే బైపాస్ చేయాలని ఐ సి సి యూ లోవుంచారు. రెండురోజుల్లో రూముకి మార్చేక వచ్చి చూడవచ్చు అని డాక్టర్ చెప్పేరు. 


 ఊహించని సంఘటనకు మధు కలవరపడింది. 

‘అయ్యో! చాలాకాలానికి విక్రంని చూడాలని ఆశ పడ్డాను. కానీ పేషేంటుగా చూస్తాను అనుకోలేదు. ఇంకా నయమే! అతడు బాగానే వున్నాడు. రూములోకి మారేక మళ్ళీ వెళ్ళింది.


అప్పుడు ఇద్దరూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. 


''మధూ! నిన్ను చూడగలను అనుకోలేదు.. ఎలా ఐతేనేం కలిసాం'' అన్నాడు. 


''అవును విక్కీ, రేపే నేను వెళ్ళిపోవాలి.. ఇద్దరమూ రూపు రేఖలు పూర్తిగా మారిపోయాము కదూ, !'' అంటూ అతడి చేతిని తన చేతిలోకి తీసుకుంది మధుర !


''ఇది సహజం. నన్ను చూసి ఏమనుకుంటావో అని వాయిదాలు వేస్తూ వచ్చాను. నిన్ను తప్పించుకోడానికి చూసాను. కానీ మాటాడాలని అనిపించేది. ఏమి అనుకోవుగా ''


''నేనుకూడా నీ లాగే అనుకున్నాను విక్కీ. అందులో ఆడవాళ్ళం మరీ త్వరగా మారిపోతాం. ‘ఇప్పుడు విక్కీ నన్ను ఇలా గుర్తు పెట్టుకోకూడదు..’ అనుకున్నాను. కష్టపడి అందంగా మేకప్ అయ్యేదాన్ని. ఇప్పుడు తలచుకుంటే నవ్వు వస్తుంది. ''


 ''మనం మొదటిసారి కలుసుకున్న నాటి రూపం మనసులో ఉండిపోతుంది. అదే గుర్తుకి వస్తుంది. ఇప్పుడు ఎలా వున్నామనికాదు” అన్నాడు విక్రమ్. 


 అలా ఇద్దరూ చాలా సేపు మాటాడుకుంటూ ఉంటే నర్సు వచ్చి ''ఆయనకు ఇక రెస్ట్ ఇవ్వాలి మేడం ప్లీజ్!” అంది. 


తప్పనిసరిగా లేచి విక్రంకి నుదిటిమీద ముద్దుపెట్టి, ''ఇక్కడ నా మజిలీ ముగిసింది. మళ్ళీ కలుస్తామో లేదో తెలియదు. కలవాలని ఆశ పడుతున్నా'' అంటూ బై చెప్పి చెమర్చిన కళ్ళు తుడుచుకుంటూ బయటకు నడిచింది మధుర!


********

ఏ. అన్నపూర్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం : ఏ. అన్నపూర్ణ


నాపేరు అన్నపూర్ణ. నేను ఇరవై సంవత్సరాలు ఏక ధాటిగా కథలు నవలలు వ్యాసాలు కవితలు కాకుండా జనరల్ నాలెడ్జ్ బుక్స్ చదివిన తర్వాత కథలు రాయడం మొదలు పెట్టాను. అమెరికాలో స్థిరపడ్డాక వచ్చిన అవకాశాలు నా రచనకు మరింత పదును పెట్టాయి. నా రచనలు చాలా వరకు నేను చూసిన ఎదురుకున్న సంఘటనల ఆధారంగా రాసినవే. ''మంచి సందేశాత్మక రచన చేయాలనే '' తపన.... తప్పితే ఏదో ఆశించి రాయడంలేదు. ఆ దాహం తీరనిది. దీని నుంచే మంచి రచన వస్తుందని అనుకుంటాను. ఎందరో గొప్పవారు చెప్పినట్టు నేర్చుకోడానికి ఫుల్స్టాప్ వుండకూడదు. ఆలా తెలుసుకుంటూ ఉండటమే కర్తవ్యమ్. నాకు ప్రోత్సహం ఇస్తున్న పత్రికల వారికీ ధన్య వాదాలు. నాది కాకినాడ. పండితవంశంలో పుట్టుక, సాహిత్యం ఊపిరి- వంశపారంగా అబ్బిన వరం.

నా మొదటికథ చదివి రచనలను ప్రోత్సహించినది ''వసుంధర.R రాజగోపాల్గారు.'' నామొదటి నవల చదివి నా శైలిని మెచ్చుకుని , చతురలో ప్రచురించడo గొప్ప అర్హతగా అభినందించిన '' శ్రీ యండమూరి.....'' ఇంకా ఇప్పుడూ కొనసాగిస్తూ ఉండటానికి కారకులు.

అలాగే నా వ్యాసాలకు సుస్థిర స్థానం కల్పించింది డా. జయప్రకాశ్ నారాయణ్ LOKSATTA ఫౌండర్. నా కవితలకు గుర్తింపు తెచ్చిన ప్రముఖ జర్నలిస్ట్ ఐ.వెంకట్రావ్ గారు, (నా మొదటి కవిత వారి '' పత్రిక ''లో వెలుగు చూసింది.)

విచిత్రం ఏమిటంటే వీరిలో మహిళా రచయిత్రు లెవరూ లేకపోడం.

రచయితలో వుండే ప్రత్యేకతను గుర్తించిన గుణం వీరిది. మరో విషయం ''జనార్ధన మహర్షి'' గారి కవితలు చదివి చిన్న మార్పులు చేస్తే బాగుంటుందేమో అని చెప్పినందుకు కొత్తగా ఏమాత్రమూ కోపం తెచ్చుకోకుండా ఆయన కొత్తగా రాసిన కవితల సంపుటిని నాకుపంపి '' సరిచూసి ఇస్తే నేరుగా ప్రింటికి ఇస్తాను ''అని చెప్పడం వారి విజ్ఞతకు సహస్ర వందనాలు. వీరంతా నేను ఎన్నటికీ మరువలేని మహానుభావులు.

ఇంకా కొందరు వున్నారు. సమయం వచ్చినపుడు వారిని గురించి చెబుతాను.

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి,

ఉత్తమ అభ్యుదయ రచయిత్రి బిరుదు పొందారు.

(writing for development, progress, uplift)





 


55 views0 comments

Comments


bottom of page