top of page

మేకప్ మహిమ

#PadmavathiDivakarla, #పద్మావతిదివాకర్ల, #MakeupMahima, #మేకప్, #మహిమ, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు


Makeup Mahima - New Telugu Story Written By Padmavathi Divakarla

Published In manatelugukathalu.com On 08/04/2025

మేకప్ మహిమ - తెలుగు కథ

రచన: పద్మావతి దివాకర్ల

కథా పఠనం: పద్మావతి కొమరగిరి



గంటసేపట్నుంచి డ్రెస్సింగ్ టేబుల్కే అతుక్కుపోయి ఉంది ప్రముఖ నటి సురశ్రీ. చాలా సినిమాల్లో హీరోయిన్గా నటించడమే కాక, కొన్ని ఐటం సాంగ్స్ కూడా చేసి ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. సినీప్రపంచంలో నటిగా మంచి పేరు తెచ్చుకోవడమేకాక, చాలా మంది అభిమానులను సంపాదించుకుంది. ఆమె కాల్షీట్స్ కోసం నిర్మాతలు క్యూ కడుతున్నారు. ఈరోజు కొద్దిగా తీరిక చిక్కడంతో ఇంట్లోనే ఉండి మేకప్ చేసుకుంటోంది. అద్దంలో తన అందాన్ని చూసి మురిసిపోతూ మేకప్ తుది మెరుగులు దిద్దుకుంటున్న సురశ్రీ ఫోన్ రింగయ్యేసరికి ఎత్తింది. 


“ప్రేమపుష్పం సినిమాలో ఐటం సాంగ్ చేసావు కదా సూరమ్మా! అద్భుతంగా వచ్చిందని, బాగా ఇరగదీసావని అందరూ నిన్ను పైకెత్తేసారు కదా! సినిమా విడుదలైన మొదటి రోజు మొదటిషో నీతో కలిసి చూడాలని ఉందే! తీసుకెళ్ళవూ! వీలైతే ప్రీమియర్ షో కి తీసుకెళ్ళినా పర్వాలేదు." అంది ఆమె స్నేహితురాలు ఆదిలక్ష్మి.


తనను 'సూరమ్మా!' అని పిలిచినందుకు వెర్రి కోపం వచ్చింది సురశ్రీకి. "నీకెన్ని సార్లు చెప్పాను అలా పిలవద్దనీ! ఇప్పుడు నా పేరు సురశ్రీ, ఆ పేరుతోనే పిలువు నన్ను! అంతేగానీ సూరమ్మ ఏంటీ ఛండాలంగా? నిన్ను నేనెప్పుడైనా ఆదెమ్మా అని పిలిచానా? నాలాగే నువ్వూ పేరు మార్చుకోలేదూ?" అంది ఉక్రోషంగా.

తన మాటలకి స్నేహితురాలి మనోభావాలు బాగా దెబ్బతిన్నాయని గ్రహించి నొచ్చుకొని, "సారీ సూరమ్మా!" అని నాలిక్కరుచుకుని, "అహ...కాదు...సారీ సురశ్రీ! చాలా బాగా డ్యాన్స్ చేసావని మంచి టాక్ వచ్చింది. నీతో కలసి సినిమా చూడాలనుందే! మరి నీతో సినిమాకి తీసుకెళ్తావు కదా?” అని అడిగింది ఆదిలక్ష్మిగా పేరు మార్చుకున్న ఆదెమ్మ.


"అలా రా దారికి! నేనూ హాల్లో సినిమా చూసి చాలా రోజులైంది. నాకూ చూడాలని ఉంది, కానీ ఎలా? నటిగా పేరు తెచ్చుకున్నాక బయటకెక్కడికీ వెళ్ళలేకపోతున్నాను. నేను కనపడితేనే చాలు, ఎగబడిపోతారు అభిమానులు. ఆటోగ్రాఫులంటూ వెంటపడతారు. వాళ్ళ నుండి తప్పించుకోలేను కదా! 


పైగా సినిమా హాలుకి వెళ్తే నన్ను చూడటానికి అభిమానులు ఎగబడి, తొక్కిసలాట జరగదూ! ఆనక ఏ ప్రమాదమైనా జరిగితే, నా పీకకి చుట్టుకుంటుంది. ఆనక పోలీసు స్టేషన్లు, కోర్టు చుట్టూ తిరగాలి. వద్దుబాబూ, ఎందుకొచ్చిన బెడద చెప్దూ, ఇంట్లోనే హాయిగా హోం థియేటర్లో చూద్దాంలే!" అంది సురశ్రీ.


"ఈ పాటి దానికి నిన్ను అడగనేల? నా బాయ్ ఫ్రెండ్ బాబూరావుకి చెప్తే సినిమా చూడటానికి క్షణాలమీద ఏర్పాటు చేస్తాడు. కానీ, నీతో చూడాలన్న నా కోరిక ఎలా తీరుతుంది చెప్పు? నా స్నేహితురాలువైన నువ్వు అంత పెద్ద నటి అయినందుకు నాకెంత గర్వకారణంగా ఉందో తెలుసా? కాలేజీలో ఉన్నప్పుడు క్లాసులెగ్గొట్టి మనమెన్నిసార్లు కలిసి సినిమాలు చూడలేదు! ఇప్పుడు మళ్ళీ నీపక్కనే కూర్చొని నువ్వు చేసిన డ్యాన్స్ చూడాలనుందే!" అంది ఆదిలక్ష్మి సురశ్రీని ఉబ్బేస్తూ.


స్నేహితురాలి మాటలకి సురశ్రీ పొంగిపోయింది. ఆమె తపన అర్ధమైంది. 


"నన్ను అర్ధం చేసుకోవే! నీకు తెలుసుకదా, ఈమధ్యే ఓ సినిమాహాల్లో తొక్కిసలాట జరిగి దేశమంతా గగ్గోలయింది కదా!" అంది.


"నిజమేనే!" అని ఆలోచనలో పడింది ఆదిలక్ష్మి.


రెండు నిమిషాలు ఆలోచించగా ఆదిలక్ష్మికి ఓ మంచి ఉపాయం తట్టింది. స్నేహితురాలి చెవిలో ఆ ఉపాయం ఊదింది. ముందు ఆదిలక్ష్మి మీద కోపం వచ్చినా, తనకూ సినిమా హాల్లో తన సినిమా చూడాలన్న కోరిక బలంగా ఉండటంతో మారుమాట్లాడకుండా ఆమె ప్రతిపాదనకి ఒప్పుకుంది.


శ్రీరంభ థియేటర్ ముందు ఇసుక వేస్తే రాలనంత జనం ఉన్నారు. అభిమానులతో కిక్కిరిసి ఉంది. పూరీ రథయత్ర కాదుకదా, కుంభమేళాకి మించిన జనం వచ్చారేమో అనిపించింది. సినిమా హాలుకు అరకిలో మీటరు దూరం వరకూ ట్రాఫిక్ పూర్తిగా జాం అయిపోయింది. దూరంగా కారాపి, కాలినడకన వెళ్ళింది సురశ్రీ తన స్నేహితురాలు ఆదిలక్ష్మితో. 


ఆన్లైన్లో రెండు టిక్కెట్లు సంపాదించింది. చాలా ఏళ్ళు తర్వాత హాల్లో సినిమా చూడబోతున్నందుకు ఆమె మనసు ఉప్పొంగిపోతోంది. హాలు ముందు హీరో నిలువెత్తు కటౌట్తో పాటు తన కటౌట్ కూడా ఉండటంతో ఆమె ఆనందానికి అంతే లేదు. కొద్దిగా గర్వం కూడా కలిగింది.


తనను చూసి అభిమానులు చుట్టుముడితే పరిస్థితేమిటని ఓవంక భయపడుతూనే అక్కడికి చేరుకుంది. కానీ, అశ్చర్యం! అమెనెవరూ పోల్చలేదు. పైగా తనను నెట్టుకుంటూ, తోసుకుంటూ జనం వెళ్ళిపోతుంటే ఆశ్చర్యపడటం ఆమె వంతైంది. కనీసం ఒక్కరైనా తనను గుర్తుపట్టరా అని ఎంతో ఆశతో ఎదురు చూసిన సురశ్రీకి నిరాశే ఎదురైంది. చివరికి టిక్కెట్ చించిన గేట్ కీపర్ కూడా ఆమెను గుర్తుపట్టలేదు. ఓవంక అసహనం కలిగినా, ఆదిలక్ష్మితో కలిసి సినిమా చూసింది.


చిత్రంలో తన ఐటం సాంగ్ వచ్చేసరికి ప్రేక్షకుల కేరింతలతో, ఈలలతో హాలు దద్దరిల్లిపోయింది. తను అనుకున్నదానికన్నా బాగా వచ్చినందుకు సురశ్రీ మొహం వెలిగిపోయింది.


"చాలా బాగా చేసావే!" స్నేహితురాల్ని మనసారా అభినందిస్తూ చెప్పింది ఆదిలక్ష్మి. 


సినిమా అయిపోయిన తర్వాత, ఆదిలక్ష్మితో కార్లో వెళ్తూ, "నన్నెవరూ గుర్తించనందుకు మనసులో బాధగా ఉన్నా, నీ సలహా మూలంగా చాలా సంవత్సరాల తర్వాత, థియేటర్లో నా సినిమా చూడగలిగాను. అసలు నన్నెందుకెవరూ గుర్తుపట్టలేదంటావు?" అంది సురశ్రీ.


"ప్రేక్షకులు, అభిమానుల మాట దేవుడెరుగు, నేనే ముందు నిన్ను గుర్తు పట్టలేకపోయానంటే నమ్ము! మేకప్ లేకుండా వచ్చావు కదా మరి! అభిమానులు కాదు కదా ఆదిమానవుడు కూడా నిన్ను గుర్తుపట్టలేడు మేకప్ లేకుండా చూస్తే! అంతా నీ మేకప్ మహిమ మరి! ఏది ఏమైనా హాల్లో సినిమా చూడాలన్న మనిద్దరి కోరిక తీరింది కదా!" అంది ఆదిలక్ష్మి నవ్వుతూ. 


"పోవే ఆదెమ్మా..." చిరుకోపంతో ఆమె నెత్తిమీద మొట్టింది సురశ్రీ ఊరఫ్...సూరమ్మ.


ఆదిలక్ష్మి కిలకిలా నవ్వడంతో బుంగమూతిపెట్టింది నటి సురశ్రీ.


సమాప్తం


పద్మావతి దివాకర్ల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం:


పేరు పద్మావతి దివాకర్ల. నివాసం బరంపురం, ఒడిషా. ఇప్పటి వరకు వంద కథల వరకూ వివిధ పత్రికలలో ప్రచురించబడ్డాయి. ఆంధ్రభూమి, సహరి, హాస్యానందం, కౌముది, గోతెలుగు అంతర్జాల పత్రికలలో కథలు ప్రచురించబడ్డాయి. బాల సాహిత్యం, హాస్య కథలు రాయటం చాలా ఇష్టం.


Comments


bottom of page