'Mamathala Madhuvu Episode 11' New Telugu Web Series
Written By Ch. C. S. Sarma
'మమతల మధువు తెలుగు ధారావాహిక' ఎపిసోడ్ 11
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
జరిగిన కథ..
కొడుకు ఆదిత్య రాసిన ఉత్తరం చూసి ఉద్వేగానికి లోనవుతుంది గౌరి.
భర్తతో ఫోన్ లో మాట్లాడుతుంది. ఆమెను ఊరడించి కొడుకును కలుద్దామని చెబుతాడు ఆమె భర్త గోపాల్.
వైజాగ్లో ఉన్న గోపాల్, ఆపరేషన్ జరిగిన శాంతిని కలుస్తాడు. హాస్పటల్ కి వెళ్లి శాంతి పరిస్థితి గురించి వాకబు చేస్తాడు. బావమరిది మురారితో చెప్పి తను గౌరీ దగ్గరకు బయలుదేరుతాడు.
హాస్పిటల్ కి వెళ్లి శాంతిని కలుస్తాడు గోపాల్ తండ్రి భీమారావు. ఆమెను జాగ్రత్తగా చూసుకోమని మురారితో చెబుతాడు. ఆమె కొడుకు ఆనంద్ ని తన దగ్గరకు తీసుకొని రమ్మని రామకోటికి చెబుతాడు.
ఆనంద్ చేస్తున్న ఉద్యోగ వివరాలు కనుక్కుంటాడు భీమారావు. అతనికి బెంగళూరులో ఉన్న తన కంపెనీలో ఉద్యోగం ఇస్తానని చెబుతాడు. గోపాల్ ఇంటికి చేరుకుంటాడు.
తండ్రికి శాంతి విషయం తెలిసిపోయిందని మురారి ద్వారా తెలుసుకుంటాడు గోపాల్.
భార్య గౌరితో కలిసి మంగళూరు వెళ్లి, కొడుకు ఆదిత్యను కలుస్తాడు.
ఆదిత్య బాల్యం గుర్తు చేసుకుంటాడు
ఆవేశాన్ని తగ్గించుకోమని ఆదిత్యకు చెబుతుంది అతని మరదలు ప్రేమ.
తనమీద దాడి చేసిన పాండూని ఎదిరిస్తాడు ఆది.
ఆ ఘర్షణలో తలకు బలంగా దెబ్బ తగలడంతో పాండూ మరణిస్తాడు.
ఆది తాత భీమారావు, మధ్యస్థం చేసి, గొడవలు జరక్కుండా చూస్తాడు. ఆదిని బోర్డింగ్ స్కూల్ లో చేరుస్తాడు.
గతకాలపు ఆలోచనలు పూర్తయి, వర్తమానంలోకి వస్తాడు ఆది.
హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన శాంతి, కొడుకు ఆనంద్ తో బెంగళూరు వెళ్ళడానికి ఒప్పుకుంటుంది.
ప్రేమకు తనమీద మునుపటి అభిమానం లేదని గ్రహిస్తాడు ఆది.
ఆది అంటే తనకిష్టం లేదని, ఆనంద్ తన స్నేహితుడని తల్లి భవానీతో చెబుతుంది ప్రేమ.
ఇక మమతల మధువు ఎపిసోడ్ 11 చదవండి..
కొద్ది రోజులుగా ఎంతో ప్రశాంతంగా వున్న గోపాల్ మనస్సులో... బెంగుళూరు రెస్టారెంట్లో ఆనంద్ ప్రేమలను చూచినప్పటి నుంచీ కలవరం మొదలయింది. వారిరువురికీ పరిచయం ఎలా కలిగింది?... వారిది కేవలం స్నేహమేనా!... లేక ప్రేమనా?... ఒకవేళ వారిరువురూ ప్రేమించుకొంటే... తన పరిస్థితి ఏమిటి?... ప్రేమ అతన్ని ప్రేమించిన విషయాన్ని భవానీ... ధనుంజయరావులు అంగీకరించి.... శాంతిని కలసి... మీ వారు ఎవరు, ఎక్కడున్నారని అడిగితే శాంతి ఏం చెప్పగలదు?... విషయం ఆ స్టేజికి వస్తే గౌరికి... తెలియకుండా వుండదు కదా!... తనూ భవానీ... ఆమె భర్తతో కలసి బెంగుళూరుకు వెళ్ళి శాంతిని చూస్తే... యింకేమైనా వుందా!... సునామీ వచ్చేసినట్లే. గౌరీకి... ఎవరు ఏ రీతిగా నచ్చ చెప్పగలరు?...
యీ పరిస్థితి ఏర్పడకుండా వుండాలంటే... ఆనందే... ప్రేమను కలవకూడదు. ప్రేమించకూడదు.
వెంటనే మురారికి ఫోన్ చేసి విషయాన్ని వివరించి బెంగుళూరుకు వచ్చి ఆనందన్ను కలసి... వాడు యిక ముందు ప్రేమను కలవకుండా చేయవలసినదిగా చెప్పాడు. మురారి... గోపాల్ చెప్పిన విషయాన్ని విని... ప్రేమా ఆనందలు కలవకుండా వుండేలా తన ప్రయత్నాన్ని చేస్తానని గోపాల్ కి చెప్పాడు.
తర్వాత... శాంతికి ఫోన్ చేసి... తను చెప్పి వచ్చిన విషయాన్నే మరోసారి చెప్పి... ఆనంద్, ప్రేమను కలవకుండా చేయమని చెప్పాడు. ఎవరికి ఏం చెప్పినా, వారు గోపాల్కు హామీ యిచ్చినా... ఆనంద్కు తనపై వున్న కోపం కారణంగా వాడు ప్రేమకు మరీ చేరువ అవుతాడనే అనుమానం అతని మదిలో నిలచిపోయింది.
***
భవానీ... పిలవగా భీమారావు కూతురు యింటికి వచ్చాడు. అల్లుడు, చెల్లెలు, కూతురు హాల్లో కూర్చొని వున్నారు. వారి వదనాల్లో ఎంతో విచారం.
భవానీ... ప్రేమను గురించి తన భర్త చెప్పిన విషయాన్ని... తను రాత్రి ఫోన్లో మాట్లాడినప్పుడు ప్రేమ చెప్పిన సమాధానాన్ని... తండ్రికి వివరించింది.
అక్క సుశీల... “ఒరే... భీమా!... నీవు వెళ్ళి దాన్ని యింటికి తీసుకొచ్చేయరా!” అంది.
“చదువును మధ్యలో ఆపి తీసుకొస్తే... పది మందీ పది రకాలుగా అనుకొంటారక్కా, వాళ్ల నోళ్ళను మనం మూయించలేము. లోకులు కాకులు కదా!... మనం ఏం చేసినా మన ప్రేమ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చేయాలి. నీవు చెప్పినట్లుగానే నేను వెళ్ళి ఆ పిల్లవాడు ఎవరో... వాడి విషయంలో ప్రేమ అభిప్రాయం ఎమిటో తెలిసికొంటాను. మనం ఆవేశపడకూడదు. సమస్యను శాంతంగా పరిష్కరించుకోవాలి.” సాలోచనగా తన అభిప్రాయాన్ని తెలియజేసాడు భీమారావు.
ఆయన మాటను వారెవరూ కాదనలేరు... కారణం... ఆవేశంతో ఎప్పుడూ ఏ మాటా ఎవరి విషయంలోనూ... భీమారావు మాట్లాడడు. యిది తన మనమరాలి విషయం. ఆమె భవిష్యత్తుకు సంబంధించినది. తన కుటుంబ గౌరవ మర్యాదలకు... సంబంధించినది. పదిమంది విమర్శలకు ప్రేమ... గురికావడం అతనికి నచ్చని విషయం.
భీమారావు నిర్ణయానికి వారందరూ సంతోషించారు. ప్రేమ మనస్సును భీమారావు మార్చగలరని వారి నమ్మకం.
భీమారావు బెంగుళూరికి వెళ్ళాడు. ప్రేమను కలిశాడు. యదార్థంగా తాతయ్య భీమారావంటే ప్రేమకు ఎంతో ప్రేమ... అభిమానం... గౌరవం... ఎన్నడూ తను చూడని విచారాన్ని ప్రేమ భీమారావు వదనంలో చూచింది. ఆమె మనస్సులో కూడా కొంత సంచలనం కలిగింది.
“తాతయ్యా!... మీరంటే నాకు ఎంతో యిష్టం. నేను నా మనస్సులోని మాటను మీకు చెబుతున్నాను. నాకు ఆది బావను పెండ్లి చేసుకోవాలనిలేదు. చేసుకోను. యిక ఆనంద్కు నాకు వున్న సంబంధం కేవలం స్నేహం... అతనిలోని శాంతం... సహనం... మృదుభాషణ... నాకు బాగా నచ్చాయి. అతనికి వున్న జనరల్నాలడ్జి చాలా గొప్పది. ఐ.ఎ.యస్కు ప్రిపేవరువుతున్నాడు. ఆ కారణం అతన్ని నేను అప్పుడప్పుడు కలుస్తాను. యీ నాటికి మా యిరువురి మధ్యన మంచి స్నేహం తప్ప... మరేమీలేదు. మీరు అతన్ని కలవవద్దంటే... నేనుగా కలవను. నా మాట నమ్మండి... నా వారైన మీ కందరికీ తలవంపులు కలిగే పనిని నేను ఎప్పుడూ చేయను.” సౌమ్యంగా... నిర్భయంగా ప్రేమ చెప్పిన మాటల్లో నిజాయితీ గోచరించింది భీమారావుకు.
“అమ్మా !... బాగా చదివి వుత్తమశ్రేణిలో పాస్ కావాలి. మా అందరికీ ఆనందాన్ని కలిగించాలి.” నవ్వుతూ చెప్పాడు భీమారావు.
“తప్పకుండా తాతయ్యా!..." భీమారావు పాదాలు తాకింది ప్రేమ.
భుజాలు పట్టుకొని ఆమెను పైకి లేపి... తన కుడి చేతిని ఆమె తలపే వుంచి ఆశీర్వదించి ఆనందంగా భీమారావు ఆఫీసుకు బయలుదేరారు. ప్రేమ హాస్టల్ కి వెళ్ళిపోయింది.
భీమారావు ఆనంద్కు... “యికపై నీకు ప్రేమను కలవద్దు. ఆమె మీద ఎలాంటి ఆశలను పెంచుకోవద్దు. నీకు వివాహం చేసి కోవాలనుంటే... నాతో చెబితే... వరుసగా ఆడపిల్లలను నీ ముందు నిలబెడతాను. నీకు ఎవరు నచ్చితే వారితో నీ... వివాహాన్ని జరిపిస్తాను. నేను నీ తాతయ్యను. మన కుటుంబ శ్రేయోభిలాషిని. నా మాట విను. నమ్ము." అనునయంగా చెప్పాడు.
ఆనంద్ మౌనంగా భీమారావు చెప్పింది విన్నాడు. "సరే!... వివాహం రెండేళ్ళ తర్వాతనే. యిప్పుడు కాదు.” మెల్లగా తన నిర్ణయాన్ని తెలియజేశాడు.
సరే. అన్న ఆనంద్ మాట... భీమారావుకు... ఆనందం కలిగించింది.
తర్వాత... ఆఫీస్ వ్యవహారాలను గురించి చర్చించి.. ప్రశాంత చిత్తంతో వూరికి బయలుదేరాడు భీమారావు.
భవానీకి... ధనంజయరావుకు... తన అక్క సుశీలకు తనకు ప్రేమకు జరిగిన సంభాషణ వివరించాడు. దేనికీ... భయపడనవసరం లేదన్నాడు. అంతవరకూ అయోమయ స్థితిలో వున్న వారికి... భీమారావుగారి మాటలు శాంతిని కలిగించాయి.
****
కాలచక్రం... వేగంగా తిరిగి రెండు వసంతాలను వీరందరికీ చూపించింది.
ఆదిత్యా జి.యస్.యస్. ఆ జిల్లా ఏ కాక పొరుగు జిల్లాలకు వ్యాపించింది. శ్రేయోభిలాషులు... మిత్రులు ఆదిత్యను రానున్న ఎన్నికల్లో యం.ఎల్.ఎ నిలబడవలసిందిగా కోరారు. తాత తండ్రి కూడా సమ్మతించారు. యం.ఎల్.ఎగా పోటీ చేయ ఆది నిర్ణయించుకొన్నాడు.
పాత పగతో వీరగోవిందయ్య... అతని బావమరిది పుల్లారావు ఎలక్షన్ ప్రచారాన్ని ముగించుకొని రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో అడవి మార్గంగా వస్తున్న సమయంలో దారి కాచి... రౌడీలతో ఆది జీప్ పై దాడి చేశారు.
కటిక చీకటి... యినప రాడ్లతో ఆదిని అతని స్నేహితులు ఐదుగురునీ కసి తీరా కొట్టి పారిపోయారు.
కాంట్రాక్టు పని జరిగే చోటినుంచి తిరిగి వస్తున్న గోపాల్... ప్రేమలు వారిని చూచి... భయాందోళనలతో... అందరినీ... హాస్పటిల్ కి చేర్చారు.
డాక్టర్ వేణుమాధవ్ ఆరుగురికి చికిత్స చేశాడు. దుండగులు యినపరాడ్లతో కొట్టినందుకు చర్మం చిట్లి అందరికీ గాయాలు బలంగా తగిలాయి. రాడ్లు ఆపుతూ చేతులను అడ్డుపెట్టిన కారణంగా... అరిచేతులకు గాయాలు ఏర్పడ్డాయి. ఆది తలకు రెండు చోట్ల చర్మం చిట్లి పదిహేను కుట్లు వేయవలసి వచ్చింది.
అందరి తల్లిదండ్రులు... గోపాల్, గౌరి, భీమారావు, భవానీ, భీమారావు చెల్లి సుశీలా... వారి నందరినీ చూచి ఎంతగానో భాధపడ్డారు.
'యీ పని ఎవరు చేసి వుంటారు?' భీమారావు గోపాల్రావు చర్చించుకొని.... పుల్లారావు మీద పోలీస్ స్టేషన్లో కంప్లయింట్ చేశారు.
నాలుగు గంటల తర్వాత ఆదికి స్పృహ వచ్చింది. ప్రొఫెసర్ రామాచారి కూతురు ప్రేమ... ఆదికి సహాయకారిగా హాస్పటల్లో వుంది.
యీ వార్త విన్న ప్రొఫెసర్ రామాచారి, వారి అర్థాంగి భారతి వచ్చారు. ఆదిని చూచి వారూ బాధపడ్డారు.
డాక్టర్ వేణుమాధవ్ ఎక్సరేలను చూపించి ఎలాంటి భయం అనవసరమని పదిరోజుల్లో ఆది మామూలు మనిషిగా తయారౌతాడని... అందరికీ చెప్పాడు.
ప్రేమతో... ఆమె తల్లిదండ్రులు గౌరికి సాయంగా వుండి, ఆదిని జాగ్రత్తగా చూచుకోవలసిందిగా చెప్పారు. అప్పటికి ప్రేమ ఆదీ వారియింటికి వచ్చి రెండు సంవత్సరాలు, యీ రెండు సంవత్సరాల్లో తల్లిదండ్రుల వద్దకు మూడుసార్లు వెళ్లింది. గౌరీ... గోపాల్రావు... భీమారావు వ్యక్తిత్వాన్ని గురించి ఎంతో గొప్పగా చెప్పింది.
యీనాడు ఆదంపతులు ప్రత్యక్షంగా వారి గొప్పతనాన్ని వీక్షించారు. ముఖ్యంగా ప్రేమ ఆ యింట్లో... ఆ యింటి బిడ్డగా మారిపోయి... వారందరి ఆదరాభిమానాలను చూరగొనినందుకు ఎంతగానో సంతోషించారు.
గౌరి వారితో... 'ప్రేమ మీ బిడ్డ కాదు నా బిడ్డ. నాకు ఆడపిల్లలు లేని కొరతను యీ రెండు సంవత్సరాలుగా తీర్చింది.” అన్న మాటలు వారికి చాలా ఆనందాన్ని కలిగించాయి.
రెండు రోజులు వుండి వారు వూరికి వెళ్ళిపోయారు. ప్రయాణంలో భారతీ ప్రేమకు... అదికి వివాహం జరిగితే... బాగుంటుంది కదూ!...' తన అభిప్రాయాన్ని భర్తకు తెలియజేసింది. రామాచారిగారు... 'పై వాడి నిర్ణయం ఎలా వుందో భారతీ!... అలా జరిగితే మనం ఎంతో అదృష్టవంతులం అనుకోవాలి.. నవ్వుతూ... తన వుద్దేశాన్ని భారతికి తెలియజేశాడు.
పోలీసులు వారం రోజుల్లో పుల్లారావును పట్టుకొన్నారు. కటకటాల వెనక త్రోసి... బాదేటప్పటికి వాడు... యిదంతా చేయించింది తనేనని ఒప్పుకొన్నాడు. వీర గోవిందునూ పట్టి లోన తోసారు పోలీసులు.
హితులు... ఆప్తులు ఎందరో వచ్చి ఆదిని... హాస్పటిల్లో చూచారు. యీ సంఘటన పేపర్లకు ఎక్కింది. ఎందరో యితర ప్రాంతపు అది అభిమానులు వచ్చి ఆదిని పరామర్శించారు. కానీ... తన అత్త భవానీ కూతురు... తన మరదలు ప్రేమ.... వచ్చి ఆదిని చూడలేదు. తల్లీ ఫోన్ చేసి చెప్పినప్పుడు 'అలాగా' అన్నమాట తప్ప మరేమీ ఆదిని గురించి అడుగలేదు. తల్లి భవానీ... కూతురు మనస్తత్వంలో కలిగిన మార్పుకు ఎంతగానో విచారపడింది.
భీమారావుగారు చెప్పగా విషయాన్ని విన్న ఆనంద్... తాతగారీ పరిమిషన్తో నెల్లూరుకు వచ్చి ఆదిత్యను చూచాడు. 'ఆదిత్యా!... మీరు త్వరలో కోలుకోవాలని నేను నమ్మిన దైవం... ఆ షిర్డీసాయి సర్వేశ్వరుణ్ణి వేడుకొంటున్నాను. ఎంతో సౌమ్యంగా ఆనంద్ పలికిన యీ పలుకులను విన్న భీమారావు... గోపాల్రావ్... గౌరీ... ప్రేమలకు ఎంతో ఆనందాన్ని కలిగించాయి. బెంగుళూరు బ్రాంచి మ్యానేజర్గా భీమారావు ఆనందుని గౌరికి... ప్రేమకు... ఆదికి పరిచయం చేశాడు.
తన మామగారి పోలికలతో వున్న ఆనంద్ను చూచి... గౌరి ఆశ్చర్యపోయింది. మనిషిని పోలిన మనిషి వుంటారనే దానికి వీరిరువురే సాక్ష్యం అనుకొంది గౌరి.
ఆదిత్య... 'ఓరేయ్ అన్నయ్యా!... నేను వచ్చి నిన్ను చూడాలనుకొన్నాను. యీ కారణంగా నీవే వచ్చి... నన్ను చూచావంటే... నీకు తాతయ్య పోలికలే కాదు. ఆయన గుణాలన్నీ నీకు సంక్రమించాయి. నిన్ను కన్న తల్లీ... నా తల్లిలాగే ఎంతో పుత్తమురాలై వుంటుంది. నీవు మా పెద్దమ్మా ఎప్పుడూ ఆనందంగా వుండాలి. నీలాంటి వాడు నాకు అన్నయ్య అయినందుకు నాకు చాలా ఆనందంగా వుంది. మన మధ్యన వున్న మబ్బుతెరలు తొలిగి పోయి మనం అంతా ఏకంకావాలి.
నిన్ను చూచిన తర్వాత... యిప్పుడు... జీవితంలో తొలిసారిగా ఆ దేవుణ్ణి నేను కోరే కోర్కెయిదే.' మనస్సున అనుకొని నవ్వుతూ ఆనంద్ తో కరచాలనం చేసి "థ్యాంక్యూ సార్!...” సగౌరవంగా చెప్పాడు అది.
ఆనంద్ అందరికీ నమస్కరించి వెళ్ళిపోయాడు. వెళుతున్న... ఆనంద్ ని చూస్తూ... మౌనంగా వుండిపోయారు భీమారావు... గోపాల్రావులు.
ప్రేమ సపర్యలతో ఆది బాగా కోలుకొన్నాడు. హాస్పటల్ నుంచి డిశ్చార్జి అయ్యాడు. ఎలక్షన్ జరిగింది. ముఫై ఎనిమిది వేల ఓట్లు మెజారిటీతో యం. ఎల్.ఎ గా ఆది గెలిచాడు. జి.యస్.యస్. సభ్యులు... పార్టీ సభ్యులు గుంపులు గుంపులుగా వచ్చి ఆదిని అభినందించారు. ఆది విజయం... భీమారావుకు... గోపాలు... గౌరికి భవానీకి... ధనంజయరావుకు... సుశీలకు... ప్రేమకు ఎంతో ఆనందాన్ని కలిగించింది.
జైలు పాలయిన వీరగోవిందును... పుల్లారావును, కేసును విత్ డ్రా చేసికొని జైలు నుంచి విడిపించారు భీమారావు. వారిరువురూ వచ్చి... భీమారావు... గోపాల్రావు కాళ్ళ మీద పడి క్షమాపణ కోరారు.
***
ఆది మరదలు ప్రేమ పరీక్షలు ముగిశాయి. తండ్రి ధనుంజయరావు బెంగుళూరికి బయలుదేరాడు.
ఆ రోజు ప్రేమ ఆనంద్ యింటికి వెళ్ళింది. అంతకు ముందు నాలుగుమార్లు ఆనంద్... వారి యింటికి వెళ్ళివుంది. శాంతిని కలిసింది.
“అంటీ!... నేను మీ అబ్బాయిని ప్రేమిస్తున్నాను. నా పరీక్షలు ముగిశాయి. మా వూరికి నన్ను తీసికొని... వెళ్ళేదానికి మా నాన్నగారు వస్తున్నారు. మీ అబ్బాయి నాతో తిరిగారు. ఎన్నో మాట్లాడారు. మ్యారేజ్ ప్రస్తావన వస్తే... మౌనంగా వుండిపోతున్నారు. మీ అబ్బాయి నన్ను పెండ్లి చేసికోనంటే... నేను చచ్చిపోతాను. వేరొకరిని పెండ్లి చేసికోను. నన్ను బ్రతికిస్తారో చంపుతారో... మీ నిర్ణయం మీద ఆధారపడివుంది.” తన నిర్ణయాన్నీ... ఎలాంటి సంకోశం... లేకుండా తెలియజేసింది ప్రేమ.
ప్రేమ మాటలకు శాంతి ఆశ్చర్యపోయింది. ప్రేమ ఎవరో తనకు తెలుసు. కానీ తను ఎవరో ప్రేమకు తెలియదు. ఆమెకు ఎలా నచ్చ చెప్పాలో తెలియక అయోమయ స్థితికి లోనైయింది శాంతి.
ఆనంద్ వచ్చాడు. తన నిర్ణయాన్ని అతనికి మరోమారు చెప్పి... అతను జవాబు చెప్పని కారణంగా ఏడుస్తూ వెళ్ళిపోయింది ప్రేమ.
శాంతి... ప్రేమ తనతో చెప్పిన ఆమె నిర్ణయాన్నిఆనంద్ కి తెలియజేసింది. 'నీ నిర్ణయం ఏమిటి నాన్నా!...' అడిగింది శాంతి.
ఆనంద్... కొన్ని క్షణాలు తల్లి ముఖంలోకి చూచాడు. అతని నయనాల్లో కన్నీరు.
“నాన్నా!... ఎందుకయ్యా!... ఆ కన్నీరు?...” విచారవదనంతో అడిగింది.
“అమ్మా... పోయిన నెలలో నెల్లూరి వెళ్ళినప్పుడు... ఆదిత్య తల్లి చూచానమ్మా!... ఆమె కూడా నీలాగే ఎంతో మంచిదమ్మా!... నేను అక్కడ వున్న కొద్దిసేపు నాతో ఎంతో ప్రియంగా మాట్లాడింది. మీ అమ్మా... నాన్న... మీవారంతా బాగున్నారా అని అడిగింది. భోం చేసి వెళ్ళమని బ్రతిమాలింది. యీ ప్రేమ తల్లిదండ్రులు... మీ నాన్న గారెవరు... ఎక్కడ వున్నారని అడిగితే... నేను... నీవు... వారి ఆ ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలమమ్మా!...” దీనంగా తల్లిముఖంలోకి చూచాడు ఆనంద్.
శాంతికి... ఆనంద్ ఆంతర్యం అర్థం అయింది. ఆమె నయనాలూ చెమ్మగిల్లాయి. మనస్సు నిండా ఎంతో ఆవేదన.
"మీ వారు... మనలను గురించి వాళ్ళ వారికి చెప్పలేదనుకొంటానమ్మా.... ఒక్క తాతగారికి తప్ప.” చెప్పి మౌనంగా తన గదిలోనికి వెళ్ళిపోయాడు. శాంతి... కన్నీటితో... దీనంగా దిగాలుపడి మౌనంగా వెళుతున్న ఆనంద్ను చూస్తూ వుండిపోయింది. మనస్సున ఎంతో వేదన... కలత... యీ సమస్య పరిష్కారానికి తనేం చేయగలదు?... ఏం చేయాలి?... యీ ప్రశ్నలు శాంతిని వేదించాయి.
కొంతసేపు ఆలోచించి.. ఒక నిర్ణయానికి... వచ్చింది. గోపాల్కు ఫోన్ చేసింది. ప్రేమ తన యింటికి వచ్చి చెప్పిన మాటలు, ఆమె నిర్ణయం... తన కుమారుడి ఆవేదన... అతని సందేహం... తన మనస్సులో చెలరేగిన అశాంతి... ఆవేదనల గురించి గోపాల్తో వివరంగా చెప్పింది.
"అంతా విన్నారుగా!... యిప్పుడు నేను... నా బిడ్డ... ఏం చేయాలో మీరే చెప్పాలి.” దీనంగా ఏడుస్తూ... అడిగింది శాంతి.
"నేను ఆలోచించి... నా నిర్ణయాన్ని తెలియజేస్తాను శాంతి. నీవు భయపడకు... బాధపడకు. నేనున్నానుగా!...” ఎంతో అనునయంగా చెప్పాడు గోపాల్.
గోపాల్ మాటలు శాంతికి కొంత వూరట కలిగించాయి. లేచి... ఆనంద్ గదివైపుకు సాలోచనగా... నడిచింది.
***
=====================================
ఇంకా వుంది
మమతల మధువు ఎపిసోడ్ 12 త్వరలో
======================================
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
Podcast Link
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.
రచనా వ్యాసంగం: తొలి రచన ‘లోభికి మూట నష్టి’ విద్యార్థి దశలోనే రాశాను, అప్పట్లో మా పాఠశాల బ్రాడ్కాస్టింగ్ స్టేషన్ నుండి ఈ శ్రవ్య నాటిక అన్ని తరగతులకు ప్రసారం చేశారు.
అందులోని మూడు పాత్రలను నేనే గొంతు మార్చి పోషించాను.
మా నాయనమ్మ చెప్పిన భారత భాగవత రామాయణ కథలు నన్ను రచనలకు పురికొల్పాయి.
Comments