'Mamathala Madhuvu Episode 2' New Telugu Web Series
Written By Ch. C. S. Sarma
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
జరిగిన కథ..
కొడుకు ఆదిత్య రాసిన ఉత్తరం చూసి ఉద్వేగానికి లోనవుతుంది గౌరి.
భర్తతో ఫోన్ లో మాట్లాడుతుంది.
ఆమెను ఊరడించి కొడుకును కలుద్దామని చెబుతాడు ఆమె భర్త గోపాల్.
వైజాగ్లో ఉన్న గోపాల్, ఆపరేషన్ జరిగిన శాంతిని కలుస్తాడు.
ఇక మమతల మధువు రెండవ భాగం చదవండి..
ఆదిత్య పంపిన ప్రేమ వుత్తరాలను, ఆది డైరీనీ.. సాంతం చదవటం పూర్తి చేసి.. గౌరీ వాల్ క్లాకు చూచింది. సమయం రాత్రి ఒంటిగంట.
'పది వుత్తరాలను చదవడంలో మునిగిపోయాను. సమయం యింత గడిచిందన్న విషయమే తెలీలేదు. ప్రతి వుత్తరాన్ని ప్రేమ ఎంతో చక్కగా వ్రాసింది. తన బావకు తనమదిలో వున్న అభిప్రాయాన్ని నిగూఢంగా తెలియజేసింది. తను దూరంగా వున్నా.. వాడి వున్నతిని శ్రేయస్సును, యశస్సునూ కోరుతూ వుంది. యిలాంటి పిల్ల నాకు కోడలు కాబోతూ వుందంటే అది నా అదృష్టం..' సంతోషంతో మనస్సున అనుకొంది గౌరి.
పుత్తరాలన్నింటినీ కవర్లో వుంచి టేబుల్ మీద పెట్టి.. లైట్ ఆర్పీ.. బెడ్లైట్ ఆన్ చేసి గౌరి పడుకొంది. మనస్సు నిండా ప్రేమ.. ఆదిత్యల గురించిన తలపులు.. వారి భావిజీవితాన్ని గురించి ఏవేవో మధురమైన వూహలు.. వారికి వివాహం జరిగినట్లు సంవత్సరం లోపల కవలపిల్లలు పుట్టినట్లు.. తన వారంతా ఎంతోఆనందిస్తూ వున్నట్లు.. చక్కటి వూహాజగత్తులో మురిసిపోతూ.. నిద్రమ్మ ఒడిలో ఒరిగిపోయింది గౌరి.
కాలింగ్ బెల్ మ్రోగడంతో.. తొట్రుపాటున మోల్కొంది గౌరి. అప్రయత్నంగా ఆమె చూపులు ఆందోళనతో గోడ గడియారాన్ని చూచాయి. గంట నాలుగు. వేగంగా వెళ్ళి ఆత్రుతతో తలుపు తెరిచింది. ఎదురు గుండా భీమారావుగారు నిలబడివున్నారు.
“అమ్మా.!.. భయపడ్డావా?..” గౌరీ ముఖంలోకి నిశితంగా చూస్తూ అడిగాడు.
“లేదు మామయ్యా!.. వారు వచ్చారనుకొన్నాను.” సిగ్గుతో తలదించుకొంది గౌరి.
“యీ సాయంత్రానికి వాడు వస్తాడమ్మా!.. యిప్పుడు నేను వైజాగ్ బయలుదేరుతున్నాను. నీతో చెప్పి వెళ్ళేదానికి నిన్ను లేపాను.”
"యిప్పుడే బయలుదేరుతున్నారా!..”
“అవునమ్మా!.. వెళ్ళాలి. బయలుదేరుతున్నాను.”
భీమారావుగారి పలుకుల్లో ఎంతో గంభీర్యం నిండి వుంది.
క్షణం సేపు వారి ముఖంలోకి చూచి.. “అలాగే మామయ్యా!.. వెళ్ళిరండి. జాగ్రత్త.” అంది గౌరి.
“మంచిదమ్మా.” వెను దిరిగారు భీమారావు.
వారిని అనుసరించింది గౌరి. యిరువురూ వరండాలోకి వచ్చారు. పోర్టికోలో కారు.. డ్రయివర్ సిద్ధం.
భీమారావుగారు కార్లో కూర్చున్నారు. డ్రయివర్ తన స్థానంలో కూర్చొని కారును స్టార్ట్ చేశాడు.
"అమ్మా!.. నీవు జాగ్రర్త. వెళ్ళి పడుకోపో." వంగి గౌరిని చూస్తూ చెప్పాడు. భీమారావు.
"అలాగే మామయ్యా!..”
కారు కదిలి గృహ ఆవరణందాటి వీధిలో ప్రవేశించింది. గౌరి యింట్లోకి వెళ్ళి పడకపై వాలింది.
“యింత హఠాత్తుగా మామగారు వైజాగ్ వెళ్ళేదానికి కారణం ఏమిటి?.. రాత్రి భోజన సమయంలో యీ ప్రయాణాన్ని గురించి తనకు చెప్పలేదే!.. విషయం ఏమైయ్యింటుంది?.. వారు రెండు రోజులుగా అక్కడే వున్నారు కదా!.. అదే చోటికి వీరు యిప్పుడు వెళ్ళడం ఎందుకో..” ఎంత ఆలోచించినా తన యీ సందేహాలకు జవాబులు తోచక గౌరి సతమతమైయ్యింది. చివరకు.. వుదయాన్నే వారికి ఫోన్ చేస్తే అన్ని వివరాలు తెలుస్తాయి అనే నిర్ణయానికి వచ్చి గౌరి కళ్ళుమూసింది.
***
“అజీజ్!”
"అయ్యా!..” కారు నడుపుతూనే యజమాని భీమారావు ముఖంలోకి చూచాడు.
“కారును ఆ చెట్టు క్రింద ఆపు.”
కొన్ని సెకండ్లలో కారు రోడ్డు ప్రక్కన వున్న వేపచెట్టు ప్రక్కన నిలిపాడు అజీజ్. భీమారావు కారు నుండి దిగారు. ముందుకు కొంత దూరం నడిచాడు. సెల్ తీసి గోపాల్ నిద్రలేచి జాగింగ్కు బయలుదేర బోతూండగా సెల్ మ్రోగింది. చేతికి తీసుకొన్నాడు.
“నాన్నా!..”.
"అవును.”
"ఏమిటి నాన్నా యింత వుదయాన్నే ఫోన్ చేశారు!.." ఆశ్చర్యంతో అడిగాడు గోపాల్.
"నీవు వెంటనే వూరికి బయలుదేరు. నేను వైజాగ్ వస్తున్నాను. బయలుదేరాను.
యింట్లో ఒంటరిగా గౌరి వుంది. త్వరగా నీవు యింటికి చేరాలి." భీమారావుగారి యీ మాటలు ఎంతో సీరియస్ గా వినిపించాయి ఆనందు. ఆశ్చర్యపోయాడు.
"నాన్నా.. మీరు.." గొంతులో తడబాటు,
"చెప్పాను గా నేను వైజాగ్ వస్తున్నానని."
"కాబట్టి నీవు అన్ని పనులూ ఆపి.. వెంటనే బయలుదేరాలి." శాసనంలా వున్నాయి, భీమారావుగారి యీ పలుకులు,
ఏం మాట్లాడాలో తోచక అయోమయస్థితిలో వుండిపోయాడు గోపాల్.
"నాయనా.. గోపాల్.. బాధపడకు. నాకు అంతా తెలుసు. నేను చూచుకొంటాను.”
"నాన్నా!..” గోపాల్ స్వరం బొంగురుపోయింది.
"నాన్నా!.. యీ తండ్రి మీద నీకు విశ్వాసం లేదా!.. నీ ధర్మం నా ధర్మం కాదా!.. నా మాటవిని నీవు వెంటనే వూరికి బయలుదేరు. గౌరి నీ రాక కోసం. ఎదురుచూస్తూ వుంది. ఆమెకు ఎలాంటి కష్టం కలిగించకుండా చూచుకోవడం నీ ధర్మం.” అనునయంగా పలికాడు భీమారావు.
గోపాల్ నయనాల్లో నీళ్ళు నిండాయి. తన కథ అంతా భీమారావుకు తెలిసిపోయిందనే అనుమానం వారి మాటల వలన తనకు అర్థం అయింది. శాంతిని చూచే దానికి హాస్పటల్కు ఆరుగంటలకు వెళ్ళాలి. రాత్రంతా ఆమెను గురించిన తలపులతో తను ఎంతగానో బాధ పడ్డాడు. నిద్రపోలేకపోయాడు.
"ఏమిటి నాన్నా!.. ఆలోచిస్తున్నావు?”
గోపాల్ తొట్రుపాటుతో.. “ఏం లేదు నాన్నా.. మీరు చెప్పినట్లుగానే చేస్తాను.”
"ఆఁ.. నా మాటవిను. నేను ఏది చెప్పినా.. ఏది చేసినా అది నీ మంచికే నాన్న”
టవల్తో కన్నీటిని తుడుచుకొని.. “అలాగే నాన్నా!.. నేను వూరికి బయలుదేరుతున్నాను.”
"ఏ విషయానికీ బాధపడకు. అంతా దైవ నిర్ణయం. జాగ్రత్త." సెల్ కట్ చేసి వెనక్కు తిరిగి చూచాడు భీమారావు. అజీజ్ కారును వారి ప్రక్కన నిలిపాడు. భీమారావు కార్లో కూర్చున్నాడు. కారు కదిలింది.
***
సమయం పుదయం బదున్నర. గోపాల్ కారు హాస్పటల్ ఆవరణంలో ప్రవేశించింది. గోపాల్ కాల్ రిసీవ్ చేసికొన్న మురారి అతనికి ఎదురైనాడు.
"ఎలా వుంది మురారి?” ఆత్రంగా అడిగాడు గోపాల్.
“యింకా స్పృహరాలేదు బావా!.." దీనంగా చెప్పాడు మురారి.
యిరువురూ ఐ.సి.యు ను సమీపించారు. అడ్డంగుండా శాంతిని చూచారు. చేతనారహితంగా బెడ్పై నిద్రలో వుంది శాంతి. బాటిల్ లోని సిలైన్ ఆమె ఒంట్లోకి ప్రవహిస్తూవుంది.
డ్యూటీ డాక్టర్ బయటికి వచ్చాడు. గోపాల్ మురారీలు వారిని సమీపించారు.
"షి యీజ్ ఔ టాఫ్ డేంజర్.” నవ్వుతూ చెప్పాడు డాక్టర్.
"థ్యాంక్యూ డాక్టర్.. థ్యాంక్యూ!.. వుదయాన్నే మంచి వార్తను వినిపించారు.”
ఆనందంగా డాక్టర్ చేతిని తన చేతిలోకి తీసుకొని కరచాలనం చేశాడు గోపాల్.
మురారికి ఎంతో ఆనందం కలిగింది. గోపాల్ ముఖంలోకి.. నవ్వుతూ చూచాడు.
డాక్టర్గారు వెళ్ళిపోయారు. మురారి భుజంపై చేయివేసి గోపాల్.. "మురారీ!.. నాన్నగారు యీ వూరికి వస్తున్నారు. నన్ను వెంటనే వూరికి బయలుదేరమన్నారు.” సాలోచనగా చెప్పాడు గోపాల్.
“అంటే.. మీరు వూరికి వెళుతున్నారా బావా!..”
"అవును మురారి. యిప్పుడే బయలుదేరుతున్నాను. నీవు శాంతిని జాగ్రత్తగా చూచుకోవాలి. యీ మూడు చెక్కులూ నీ దగ్గర వుంచు. సంతకం చేశాను. అవసరాన్ని బట్టి డబ్బుడ్రా చేసికో, శాంతి త్వరలో మామూలు మనిషికావాలి మురారి.” అనునయంగా చెప్పాడు గోపాల్.
"అలాగే బావా!..”
"యికనే బయలుదేరుతాను. జాగ్రత్త.”
యిరువురూ కారును సమీపించారు. గోపాల్ కార్లో కూర్చొని స్టార్ట్ చేశాడు.
“మురారీ!.. అక్కను జాగ్రత్తగా చూచుకో.. వస్తాను.”
"సరే బావా!.."
గోపాల్ కారు ముందుకు వెళ్ళిపోయింది. మురారి హాస్పటల్లో ప్రవేశించాడు. లాడ్జికి వచ్చి ఖాళీ చేసి డ్రయివర్ రంగాను గాజువాకలో కలవమని ఫోన్ చేసి వూరికి బయలుదేరాడు గోపాల్.
అతని మనస్సు నిండా కలవరం. శాంతికి స్పృహరాలేదు. తను మాట్లాడలేదు. తండ్రిగారి ఆదేశానుసారం వూరికి బయలుదేరాడు. కానీ అతని జీవుడు శాంతి బెడ్ చుట్టూనే తిరుగుతున్నాడు. ఆమెకు స్పృహ వస్తే మాట్లాడాలని అతని ఆశ.. ఆరాటం. అది జరగలేదు. విధిగా వూరికి బయలుదేరవలసి వచ్చింది. 'నాకు అంతా తెలుసు. నేను అంతా చూచుకొంటాను.' నాన్నగారి యీ మాటల యొక్క అర్థం ఏమిటి?.. శాంతిని గురించి నాన్నగారికి తెలిసిపోయిందా!.. ఎలా తెలిసింది?.. ఎంత వరకూ తెలిసింది? ఎవరు చెప్పివుంటారు?.. యీ ప్రశ్నలు గోపాల్ను.. వేధిస్తున్నాయి.
ఒకటి మాత్రం యధార్ధం. యీ నాటి వరకూ.. తనను తన తండ్రి ఒక్కనాడు కూడా అసహ్యించుకోలేదు.. తనతో పరుషంగా మాట్లాడలేదు. యీ నాడు వారు చేసిన సంభాషణ అదే స్థాయిలో వుందేకాని.. ఏ మాత్రం మార్పులేదు.
అలాంటి బంగారు తండ్రిని.. తను మోసం చేశాడు. తన జీవిత సత్యాలను వారితో చెప్పలేదు. తనలోనే దాచుకొన్నాడు.
అందుకే.. యీ నాటి వారి మాటల్లో తనకు విపరీతపు అర్థాలు గోచరిస్తున్నాయి. తప్పు తనది. ఒక వేళ వారికి విషయం తెలిసి వుంటే.. వారి ప్రశ్నలలో తనకు అర్థాలు వేరుగాతోస్తే.. అందులో వారి తప్పేముంది. తన విషయంలో తాను వారి బిడ్డనైనందుకు.. తనకు సంబంధించిన విషయాలు.. తను వారికి చెప్పనివి.. తెలిస్తే, నిలదీసి అడిగే అధికారం తన పట్ల వారికి వుంది కదా!.. చరగని ఆలోచనలు.. సమాధానం దొరకని ప్రశ్నలు.. శాంతి భవిష్యత్తు ఎలా వుందో అనే సందేహాలు.. గోపాల్ మస్తిష్కంలో నిండిపోయాయి.
కారు గాజువాక చేరింది. డ్రయివర్ రంగా వచ్చి కలిశాడు. తను దిగి వెనక సీట్లో కూర్చున్నాడు. రంగా డ్రయివర్ సీట్లో కూర్చొని కారు స్టార్ట్ చేశాడు.
కారు స్టీల్ ప్లాన్ టర్నింగును సమీపించింది. డ్రయివర్ను రోడ్ సైడ్ కారును ఆపమన్నాడు. తను కారు దిగి.. కుడి వైపున వున్న షాపుల్లో.. మెగోల్ విస్కీ, సోడా బాటిల్స్ తీసికొని వచ్చి కార్లో కూర్చొని "పోనీ రంగా!.." అన్నాడు గోపాల్, కారు కదిలింది.
ప్లాస్టిక్ బాటిల్లో సోడాను విస్కీని కలిపి గోపాల్ త్రాగడం ప్రారంభించాడు. రంగా అతని వద్ద పది సంవత్సరాలుగా డ్రయివర్గా.. విశ్వాసంతో మంచి పేరుతో పని చేస్తున్నాడు. యజమాని పట్ల ఎంతో అభిమానం కలవాడు. వుదయం ఆరుగంటల ప్రాంతంలో యీ రీతిగా గోపాల్ త్రాగడాన్ని చూచి ఆశ్చర్యపోయాడు. అతని మనస్సుకి బాధ కలిగింది.
"అయ్యా!..”
“ఏం రంగా!..”
“పది సంవత్సరాల కాలంలో తమరు వుదయాన్నే యీ పని చేయడం, నేను మొదటిసారి చూస్తున్నానయ్యా!.. నేను మీకు చెప్పేటంత వాణ్ణికాను. కానీ..”
“రంగా!.. రెండు రోజులుగా నా మనస్సులో ఎంతో బాధ వుందిరా!.. రాత్రి నిద్రలేదు. భయం.. కలవరం.” విచారంగా చెప్పాడు గోపాల్.
రంగా వెనక్కు తిరిగి గోపాల్ ముఖంలోకి చూచాడు. గోపాల్ వదనంలో ఎంతో విచారం అతనికి గోచరించింది. శాంతి విషయం అతనికి తెలుసు. ఆ కారణంగా యజమానికి వూరట కలిగించాలని..
"అయ్యా!.. శాంతమ్మాగారికి ఏమీ కాదయ్యా!.. ఆ తల్లి చాలా మంచిదయ్యా.. దేవుడు ఆమెను తప్పక కాపాడుతాడయ్యా!.. మీరు బాధ పడకండి.” రంగా మాటల్లో ఎంతో వూరట.. ఓదార్పు వినిపించాయి గోపాలు.
"నీ మాట నిజం కావాలి రంగా!.. నాకు కావలసింది అదే..”
"మీ కోర్కె తప్పకుండా నెరవేరుతుందయ్యా!.. నా మాటను నమ్మండి.”
గోపాల్ సెల్ మ్రోగింది.
"హాలో!..” అన్నాడు గోపాల్ మత్తుగా.
“గుడ్ మార్నింగ్ సార్!.. ఎలా వున్నారు?.. బయలుదేరారా!..” గౌరి మృదుమధుర కంఠం.
“బయలుదేరాను.”
"ఏం?.. గొంతు అదోలా వుంది. జలుబు చేసిందా!.." ఆ పలుకుల్లో ఎంతో అభిమానం.
"లేదు గౌరీ!.. అలాంటిదేం లేదు.”
"నిజాన్నే చెబుతున్నారా!.. ”
విరక్తిగా నవ్వుతూ.. “అవును.” అన్నాడు గోపాల్.
"ఎన్ని గంటలకు వస్తారు?”
"మరో నాలుగు గంటల్లో..”
"యిప్పుడు టైము ఏడు. అంటే పదకొండు గంటలకల్లా నా ముందు వుంటారన్నమాట.” నవ్వింది గౌరి.
సాధారణంగా గౌరి ముఖం ఎప్పుడూ ఎంతో ప్రశాంతంగా.. చిరునవ్వుతో నిండి వుంటుంది. గౌరికి దైవమ్మీద అపార నమ్మకం. 'యీ జగమంతా నాటకరంగం.మనం పాత్ర ధారులం. ఆయన ఆడించినట్లు ఆడడమే మన కర్తవ్యం. నేను.. నాది.. అనేదంటూ యిక్కడ మనకు ఏమీ లేదు. అంతా పిచ్చి వ్యామోహం.. ఎక్కడి నుంచి వచ్చామో ఎక్కడికి పోతామో ఎవరికి తెలుసు!.. వున్నంతకాలం మంచిని తలచి.. మంచిని ఆచరించాలి. సాటి మనిషిని మనిషిగా చూడాలి. అడిగిన వారికి వున్నంతలో సాయం చేయాలి. మంచి పేరును సంపాదించుకోవాలి. మనం చేసిన మంచే మన సంతతికి కలసి వస్తుంది. ఏ కారణం చేతనైనా.. తన మనస్సుకు బాధ కలిగితే.. గౌరి యిలా మాట్లాడుతుంది. ఆమె నమ్మిన ఆచరించే ఆ సిద్ధాంతాలు.. గోపాల్ కి గుర్తుకు వచ్చాయి.
“అయ్యగారు దేన్ని గురించో తీవ్రంగా ఆలోచిస్తున్నట్లున్నారు..” గౌరీయ్యే మరలా అడిగింది.
“అవును.”
“దేన్ని గురించి.”
“నీవు అప్పుడప్పుడూ చేసే వేదాంత ప్రసంగం గురించి. ” నవ్వాడు గోపాల్.
“యింటి దారి పడితే నేను గుర్తుకు వస్తాను. బయటికి వెళితే నన్ను మరచిపోతారు. అవును కదూ!..”
“నేను.. నేను ఎప్పుడూ.. నిన్ను మరువలేను గౌరీ!..” గోపాల్ కంఠంలోని ఒణుకు గౌరి చెవులకు సోకింది.
"తమాషా కన్నాను. బాధ పడుతున్నారా. సారీ బావా!.." ప్రాధేయపూర్వకంగా పలికింది గౌరి.
"నో.. నో.. నో సారీ.. నీవు అలా అనకూడదూ గౌరీ!.." నీ ప్రతి మాటా యదార్థం. అందుకే నీవంటే నాకు ప్రాణం.”
తన మాటలు భర్తను కలవర పరిచాయని.. టాపిక్ మార్చి..
“టిఫిన్ తిన్నారా!..”
"లేదు.”
"డ్రయివర్ బండి తోలుతున్నాడా లేక మీరా!..”
“నేను మహారాజులా వెనక సీట్లో కూర్చొని వున్నా. రంగా బండి నడుపుతున్నాడు.”
"ఫోన్ రంగా చేతికి యిస్తారా!..”
“ఓకే..” ఫోన్ గోపాల్ రంగాను పిలిచి.. చేతికి యిచ్చాడు.
“అమ్మా!.. నమస్కారం.”
“రంగా!.. చెప్పేది జాగ్రర్తగా విను.”
“చెప్పండమ్మా!..”
“బండి నీవే డ్రయివ్ చేయాలి. అయ్యగారు కాదు."
"అలాగే అమ్మా!..”
“బండిని ఎక్కడన్నా ఆపి యిద్దరూ టిఫిన్ చేయండి. అయ్యగారితో మాట్లాడకుండా.. ముందు చూచి బండిని జాగ్రత్తగా నడుపు. సరేనా?..”
“సరే అమ్మ!..”
"అయ్యగారు ఏం చేస్తున్నారు?..”
యీ ప్రశ్నకు వెంటనే రంగా జవాబు చెప్పలేకపోయాడు. వెనుతిరిగి చూచాడు.గోపాల్.. మందును సేవిస్తున్నాడు.
"రంగా!.. గౌరి పలకరింపు.
"అమ్మా!.. అయ్యగారు కళ్ళు మూసుకొని వున్నారమ్మా." తొట్రుపాటుతో చెప్పాడు రంగా.
"సరే. వారిని డిస్ట్రబ్ చేయకు. జాగ్రం రండి.” గౌరి కాల్ను కట్ చేసింది.
'హమ్మయ్యా!..' నిట్టూర్చాడు రంగా. గౌరి తానుగా ఫోన్ కట్ చేసినందుకు.
ఆ యింటి నౌకర్ల నందరినీ గౌరి.. ఎంతో ఆదరంగా అభిమానంగా చూచుకొంటుంది. ఆ కారణంగా ఆ యజమాని అమ్మ అంటే అందరికి ఎంతో గౌరవం. ప్రేమ.
గౌరి తలపులు మదిలో నిండిన రంగా.. యజమాని గోపాల్ ఏం చేస్తున్నాడో చూచేదానికి వెనక్కు తిరిగి చూచాడు.
మందు మైకంలో గోపాల్ పరిసరాలను మరచి నిద్రపోతున్నాడు. శాంతమ్మగారి అనారోగ్య కారణంగా.. బాధతో అయ్యగారు తాగి యిలా.. అచేతనంగా యీ సమయంలో నిద్రిస్తున్నాడని అనుకొన్నాడు. శాంతి ఆరోగ్యం చక్కబడాలని దైవాన్ని ప్రార్థిస్తూ బండిని నడపసాగాడు.
===============================================
ఇంకా వుంది
================================================
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
Twitter Link
Podcast Link
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.
రచనా వ్యాసంగం: తొలి రచన ‘లోభికి మూట నష్టి’ విద్యార్థి దశలోనే రాశాను, అప్పట్లో మా పాఠశాల బ్రాడ్కాస్టింగ్ స్టేషన్ నుండి ఈ శ్రవ్య నాటిక అన్ని తరగతులకు ప్రసారం చేశారు.
అందులోని మూడు పాత్రలను నేనే గొంతు మార్చి పోషించాను.
మా నాయనమ్మ చెప్పిన భారత భాగవత రామాయణ కథలు నన్ను రచనలకు పురికొల్పాయి.
Comments