'Mamathala Madhuvu Episode 3' New Telugu Web Series
Written By Ch. C. S. Sarma
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
జరిగిన కథ..
కొడుకు ఆదిత్య రాసిన ఉత్తరం చూసి ఉద్వేగానికి లోనవుతుంది గౌరి.
భర్తతో ఫోన్ లో మాట్లాడుతుంది.
ఆమెను ఊరడించి కొడుకును కలుద్దామని చెబుతాడు ఆమె భర్త గోపాల్.
వైజాగ్లో ఉన్న గోపాల్, ఆపరేషన్ జరిగిన శాంతిని కలుస్తాడు.
గోపాల్ హాస్పటల్ కి వెళ్లి శాంతి పరిస్థితి గురించి వాకబు చేస్తాడు. బావమరిది మురారితో చెప్పి తను గౌరీ దగ్గరకు బయలుదేరుతాడు.
ఇక మమతల మధువు మూడవ భాగం చదవండి..
భీమారావుగారు వైజాగ్ లోని తన బ్రాంచి ఆఫీసు వెళ్ళారు. ఆ బ్రాంచి మ్యానేజర్గా వున్న తన స్నేహితుడు, ఆప్తుడు, బంధువు రామకోటిని భీమారావు కలసికొన్నాడు. యిరువురూ కలసి శాంతి వున్న హాస్పిటల్కు వెళ్ళారు. మురారి.. వారిరువురినీ చూచి ఆశ్చర్యపోయాడు. వారు హాస్పిటల్కు వస్తారని అతను వూహించలేదు. భయంతో.. భీమారావు ఏమి అడుగుతాడోనని తలదించుకొన్నాడు. దృష్టిని ప్రక్కకు మళ్ళించాడు. ఆ యిరువురూ మురారిని సమీపించారు.
"మురారి!.. శాంతికి స్పృహ వచ్చిందా!.. ” అడిగాడు రామకోటి.
“వచ్చింది సార్!.. ” భయంతోనే పలికాడు మురారి.
"మేము శాంతిని చూడవచ్చా!.. " భీమారావుగారి గంభీర వదనం నుండి వెలువడిన ప్రశ్న.
యాంత్రికంగా చూడవచ్చనట్లు తల ఆడించాడు మురారి.
“పద. ” భీమారావుగారి ఆదేశం.
మురారి వార్డు వైపుకు నడిచారు. భీమారావు, రామకోటి మురారిని అనుసరించారు. కొద్దిక్షణాల్లో స్పెషల్రూమ్లో శాంతి బెడ్ను సమీపించారు.
భీమారావు ఆమె ముఖం ప్రక్కకు నడిచాడు. శాంతి కళ్ళు మూసుకొని వుంది. మురారి ఎదురుగా శాంతి తలవైపున నిలచి తలవంచి..
"అక్కా.. " మెల్లగా పిలిచాడు.
శాంతి కళ్ళు తెరచి చూచింది. కళ్ళతో ఆవైపు చూడమని సైగ చేశాడు మురారి. శాంతి చూపును త్రిప్పి భీమారావును.. వారి ప్రక్కన వున్న రామకోటిని.. చూచింది. ఆమె నయనాలు మదిలోని మూగబాధతో.. అశ్రుపూరితాలైనాయి. ఆవేదనతో కళ్లు మూసుకొంది.
"అమ్మా!.. బాధ పడకు, అంతా వీధి నిర్ణయం. యిందులో ఎవరి తప్పూ లేదు. నా మాట ప్రకారం.. నా కొడుకు వూరికి వెళ్ళిపోయాడు. రెండు మూడు నెలల క్రిందట నిన్ను దూరాన్నించి చూచాను. దగ్గరగా చూడటం యిదే తొలిసారి. నిన్ను యీ స్థితిలో యిక్కడ చూడవలసి వస్తుందని నేను ఎన్నడూ వూహించలేదు. యింటికి వచ్చి నిన్ను కలవాలనుకొన్నాను. అమ్మా!.. నీవు ఏ విషయానికి భయపడవద్దు. నేను.. నా బిడ్డ.. నీకు మా జీవితాంతం వరకూ.. ఏ కొరతా రానీయ్యము. నా మాట నమ్ము తల్లీ. ” అనునయం.. ఆప్యాయత.. అభిమానం.. భీమారావుగారి ఆ పలుకుల్లో శాంతికి గోచరించాయి.
కళ్ళు తెరచి చేతులు.. కృతజ్ఞతా భావంతో జోడించింది. అంతవరకూ కళ్ళల్లో వున్న కన్నీరు చెక్కిళ్ళ పైకి దిగజారాయి. నవ్వుతూ ఆశగా భీమారావు ముఖంలోకి చూచింది. భీమారావుగారిని ఆమె దగ్గరగా చూడటం యిదే మొదటిసారి. వారి మాటలకు ఆమె మనస్సు పులకించింది.
ఆనంద్.. బెడ్ను సమీపించాడు. అతన్ని చూచి.. మురారి..
"అక్కా!.. మన ఆనంద్ వచ్చాడు. ”
ఆనంద్ మురారి ప్రక్కన చేరాడు. తల్లి స్థితిని చూచిన ఆనంద్ ఆతృతతో..
“అమ్మా!.. ” తన చేతిని తల్లి చేతిపై వుంచాడు ఆవేదనతో, శాంతి కళ్ళు తెరచి ఆనంద్ ముఖంలోకి చూచింది.
"అమ్మా!.. ఎలా వుందమ్మా!.. " ఆనంద్ కంఠం బొంగురు పోయింది.
“నాకు బాగుంది నాన్నా!.. ” కొడుకు చేతిని తన చేతుతో పట్టుకొని చెప్పింది శాంతి.
భీమారావును అక్కడ చూచి ఆనంద్ ఆశ్చర్యపోయాడు.
“సార్.. మీరు.. ”
"మీకు కావలసిన వాడినే. ” నవ్వుతూ చెప్పాడు భీమారావు, శాంతి ముఖంలోకి చూచి.. "అమ్మా!.. చెప్పేనుగా నీవు దేనికీ భయపడవద్దని.. త్వరలోనే.. నీవు ఆనందంగా యింటికి చేరుతావు. యికనే వెళతాను. సరేనా!.. " ఆ మాటల్లో ఎంతో
అనునయం.. ఆత్మీయతా నిండి వున్నాయి.
శాంతి నవ్వుతూ.. "మంచిది. ” మెల్లగా పలికింది.
"భీమారావు.. రామకోటి గదినుండి బయటికి వచ్చారు. మురారి వారిని అనుసరించాడు.
“రామా!.. ”
“చెప్పండి మామా!.. ”
“సాయంత్రం ఆ బాబును తీసుకొని లాడ్జికి రా!.. ”
“అలాగే మామ. ”
ఆ మాటలను మురారి విన్నాడు. యిరువురూ కార్లో కూర్చున్నారు. అజీజ్ కారును స్టార్ట్ చేశాడు.
"మురారీ!.. అక్కయ్యను జాగ్రర్తగా చూచుకో" భీమారావుగారి ఆదేశం.
“అలాగే సార్!.. ” వినయంగా పలికాడు మురారి.
కారు.. వెళ్ళిపోయింది. మురారి శాంతి వున్న రూమ్ వైపుకు నడిచాడు. ’యింతకాలం గోపాల్కు.. తనకు మధ్యన వున్న విషయం పెద్దాయనకు రామకోటి మూలంగా తెలిసిపోయిందన్నమాట, అంతా మంచికే’ మనస్సులో అనుకొన్నాడు. మురారి.
"అజీజ్.. కారును ఆఫీసుకు పోనీ. ” సాలోచనగా అన్నాడు భీమారావు.
“అలాగే సార్!!.. ” అజీజ్ వినయంతో కూడిన పలుకు.
కొద్దినిముషాల్లో గాజువాకలో వున్న ఆఫీస్ కార్పొర్చిలో కారును ఆపాడు అజీజ్.
భీమారావు.. రామకోటి ఆఫీస్లో ప్రవేశించారు. యిరువురూ రామకోటి రూమ్లో ప్రవేశించారు. కూర్చున్నారు.
"మామా!.. " మెల్లగా పిలచాడు రామకోటి.
'ఏం' అన్నట్లు అతని ముఖంలోని చూచాడు భీమారావు,
క్షణంసేపు భీమారావు ముఖంలోకి చూచి.. తల దించుకొని నిట్టూర్చాడు.
"రామా!.. "
"ఏం మామా!.. "
“యిరవై నాలుగు సంవత్సరాలుగా.. మనవాడు యీ కథను చాలా గోప్యంగా సమర్థవంతంగా నడిపాడు కదూ!.. "
ప్రశ్నార్ధకంగా రామకోటి ముఖంలోకి చూచాడు.. భీమారావు.
“అవును”
"వాడు ప్రశాంతంగా.. ఆనందంగా వున్నాడంటావా?.. ”
"నాకేం తెలుసు మామ. మీ యీ ప్రశ్నకు నేను జవాబు ఎలా చెప్పగలను?.. ” జిజ్ఞాసగా అన్నాడు రామకోటి.
"ఆఫీస్ లో వున్న పనిని ముగించు. మనస్సు చాలా.. చికాకుగా వుంది. వెళ్ళి సింహాచల నరసింహస్వామిని దర్శించి వద్దాం. ” కళ్లు మూసుకొని మెల్లగా పలికాడు భీమారావు.
రామకోటి లేచి వెళ్ళిపోయాడు. తన కుటుంబంలో తల ఎత్తిన క్రొత్త సమస్య డెభైసంవత్సరాల భీమారావును ఎంతగానో కలవర పరుస్తూ వుంది. యింటికి పెద్ద దిక్కు అయిన తను ఎవ్వరికీ ఎలాంటి అన్యాయం చేయకూడదు. నలభై ఆరు సంవత్సరాల తనయుని ఏమని అడగగలడు?.. అలా అడగడం తనకు మర్యాదగా వుంటుందా!.. తన ప్రశ్నలకు గోపాల్ ఏమని జవాబు చెప్పగలడు?..
'డెభై ఏండ్ల జీవితంలో దుఃఖాన్ని సుఖాన్ని కాచి వడబోసినవాణ్ణి. నావల్ల అందరికీ మేలు జరగాలే కానీ.. కీడు జరగరాదు. అలా చేయడంలోనే నా పెద్దరికపు విలువ వుంటుంది. ఒకటన్నర గంటసేపు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు భీమారావు.
ఆఫీస్ సిబ్బందినందరినీ కలసి, యివ్వవలసిన సలహాలు యిచ్చి.. సంతకాలు చేయవలసిన పేపర్ల పై చేసి.. పని అంతా ముగించుకొని రామకోటి భీమారావు వున్న గదిలోనికి వచ్చాడు. వారిని.. సమీపించాడు.
“మామా!.. బయలుదేరుదామా!.. ” మెల్లగా పలికాడు.
తోట్రుపాటుతో భీమారావు కళ్ళు తెరిచాడు.
“నీ పని అంతా అయిందా?.. ”
"అయింది మామ. ”
"పద. బయలుదేరుదాం. ”
ముందు భీమారావు, వెనుక రామకోటి ఆఫీస్ నుండి బయటికి వచ్చారు. కార్లో కూర్చున్నారు.
"అజీజ్!.. సంహాచలం వెళ్ళాలి. ” రామకోటి చెప్పాడు.
"అలాగే సార్. ”
కారు గాజువాక పరిసరాలు దాటి సింహాచలం రోడ్డువ వైపుకు తిరిగింది. అరగంట లోపల సింహాచలం చేరింది.
భీమారావు.. రామకోటి మెట్లు ఎక్కి ఆలయ ప్రాంగణంలో ప్రవేశించారు. భక్తి శ్రద్ధలతో ఆ జగత్పితామాతలను దర్శించారు. భీమారావుగారు తన మనోయీప్సితాన్ని శ్రీనరశింహస్వామి.. శ్రీమహాలక్ష్మీలకు కన్నీటితో విన్నవించుకొన్నాడు. తన యజమాని వరసకు మామ అయిన భీమారావుగారి కుటుంబం.. యావత్తు చల్లగా వుండాలని రామకోటి ఆ జగన్మాతాపితలను
వేడుకొన్నాడు.
యిరువురూ తీర్థప్రసాదాలను స్వీకరించారు. యాచకులకు ధర్మం చేశారు. చెట్టు క్రింద కూర్చొని కొంతసేపు ధ్యాన్నం చేశారు. ఆ యిరువురి మనస్సులకు వూరట కలిగింది. సాష్టాంగ నమస్కారం చేసి మెట్లుదిగి వచ్చి.. కార్లో కూర్చున్నారు. కారు బయలుదేరింది.
“రామా!.. ”
“ఏం మామా!.. ”
“నీవు ఆనందు తీసుకొని లాడ్జికిరా. ”
“అలాగే. ”
“ఎన్ని గంటలకు రాగలవు?”
"ఏడు గంటల కల్లా వస్తాను మామ. ”
"మంచిది. నీవు ఆఫీస్ దగ్గర దిగిపో. నేను లాడ్జికి వెళతాను. ”
“సరేమామ. ”
కారు ఆఫీస్ ముందు ఆగింది. రామకోటి దిగాడు. అజీజ్ కారును సిటీ వైపు మరలించాడు. గంటలో లాడ్జి ముందు ఆగింది. భీమారావు తన గదికి వెళ్ళిపోయాడు. డ్రస్ మార్చుకొని సోఫాలో కూర్చున్నాడు. అతని మనస్సు తన బాల్యం వైపు పరుగుతీసింది.
***
భీమారావు తండ్రి పేరు ముత్యాలరావు. తల్లి అనసూయ. తను పెద్దవాడు. తనకు ఒక చెల్లి సుశీల. పదకొండవ తరగతి వరకూ చదివాడు. ముత్యాలరావుకు ఐదు ఎకరాల భూమి.. సైకిల్ షాప్ వుండేది.
భీమారావు చదువుకుంటూనే షాపు పనుల్లో తండ్రికి సహాయం చేసేవాడు. సహజంగా ఎంతో తెలివి గల భీమారావు ఏదైనా పాఠాన్ని ఒక్కసారి చదివితే చాలు అది స్థిరంగా అతని మస్థిష్కంలో నిలచిపోయేది. అలాగే తండ్రిగారు చేసే మెకానిక్ పనులనన్నింటినీ అతను గ్రహించి.. తనే స్వయంగా చేసేవాడు. ఎంతో తెలివైన భీమారావును బాగా చదివించాలని ఆ తండ్రి ముత్యాలరావు సంకల్పం.
యస్. యస్. ఎల్. సీ పరీక్షలో జిల్లాస్థాయిలో ప్రథమ విద్యార్ధిగా పాసైనాడు భీమారావు. కొడుకును కాలేజీలో చేర్చాలనే నిర్ణయంలో ప్రయత్నిస్తున్న ముత్యాలరావు వారం రోజులు విషజ్వరానికి గురయై తన జీవితయాత్రను ముగించాడు.
తల్లిని.. సోదరిని ఓదార్చటం.. భీమారావు వంతైయింది. అతను కన్న కాలేజీ కలలు కల్లలుగా మారిపోయాయి. కుటుంబ బాధ్యత అతని తలపై పడింది. మేనత్త దుర్గమ్మ ఆమె భర్త ఆనందరావు.. భీమారావుకు అండగా నిలిచారు. ముత్యాలరావు స్నేహితుడు నరసింహం దగ్గర కారు రిపేర్ పనిని నేర్చుకొన్నాడు భీమారావు.
తండ్రిగారు గతించిన మూడు సంవత్సరాలకు తన సొంతంగా ఒక వర్కుషాప్ ప్రారంభించాడు. కాలం కలిసి వచ్చింది. మరో రెండు సంవత్సరాల్లో ఆ ప్రాంతంలో గొప్ప మెకానిక్ అన్న పేరును సంపాదించాడు. నలుగురు తన క్రింద పని చేసేవారు. మాట.. పనితీరు.. భీమారావును కాచి రక్షించాయి.
వున్న ఐదు ఎకరాల భూమిలో రెండు ఎకరాలు అమ్మి చెల్లెలు సుశీల వివాహాన్ని దగ్గర బంధువు కోటేశ్వరరావుతో ఘనంగా చేశాడు. కోటేశ్వరరావు చెల్లెలు పార్వతిని తను వివాహం చేసుకొన్నాడు.
సంవత్సరం రోజుల నాటికి పార్వతి చంద్రుడిలాంటి మొగబిడ్డను.. లక్ష్మీదేవిలాంటి ఆడబిడ్డను కవలలుగా కన్నది.
ఆ బిడ్డలకు గోపాల్ రావు.. భవాని అని నామకరణం చేశారు. భీమారావు పార్వతీ దంపతులు.
ఆ బిడ్డలు పుట్టిన వేళా విశేషం.. భీమారావు పట్టిందల్లా బంగారం అయింది. వ్యాపారం బాగా సాగింది. పది ఎకరాలు మాగాణి భూమిని.. యిరవై ఎకరాల మెట్ట భూమిని కొన్నాడు. పనివారిని ఏర్పాటు చేసి వ్యవసాయాన్ని సాగించాడు. మెట్ట భూముల్లో బోర్లు వేయించి కూరలు.. పూలు.. అరటి, సపోటా, మామిడి పండ్లను పండించి అమ్మేవాడు.
రెండు లారీలను కొని.. తన భూముల్లో పండిన వాటిని జిల్లాకేద్రాని తరలించేవాడు. సొంతపని లేనప్పుడు లారీలను బాడుగకు నడిపించేవాడు. పాత కార్లను కొని రీకండిషన్ చేసి అమ్మేవాడు. తను స్వయంగా లారీలను నడిపేవాడు. తన యిల్లాలు పార్వతి భీమారావుకు అన్ని విషయాల్లో సహకరించేది.
తన తల్లి దండ్రులైన ముత్యాలరావు.. అనసూయమ్మల పేరున హైస్కూలు నిర్మించాడు. కుటుంబ పరిస్థితుల రీత్యా. తను చదువుకొలేక పోయిన విషయాన్ని గుర్తుంచుకొని పేద విద్యార్థులకు తన స్కూల్లో ఫీజులు లేకుండా చదువుకొనే అవకాశాన్ని కల్పించాడు.
గోపాలరా వు.. భవాని అదే స్కూల్లో ప్లస్టు వుత్తమశ్రేణిలో స్టేట్ ఫస్టుగా పాసయ్యారు. గోపాల్ను మెకానికల్ యింజనీరింగ్లో.. భవానిని బి. యస్. సిలో వారి యిష్టానుసారంగా చేర్పించాడు.
మెకానికల్ యింజనీరింగ్ ముగించి గోపాల్ తండ్రికి సాయంగా వ్యాపారంలో ప్రవేశించాడు. భవానీ బి. య్యి. డిలో చేరింది.
రెండు సంవత్సరాల్లో తండ్రి నిర్వహిస్తున్న.. వ్యాపార విషయాలను, వ్యవసాయ విషయాలను.. విశదంగా నేర్చుకొన్నాడు గోపాల్.
బి. య్యి. డి పూర్తి చేసి భవానీ వారి స్కూల్లోనే టీచర్గా చేరింది. తన అక్క సుశీల కొడుకు.. ధనంజయరావుతో భవానీ వివాహాన్ని ఎంతో ఘనంగా చేశాడు. భీమారావు.
కళ్ళు మూసుకొని గత చరిత్రలో సింహావలోకనం చేసికొంట్ను భీమారావు చవులకు కాలింగ్బెల్ ధ్వని సోకడంతో ఆ కల చెదిరిపోయింది. తొట్రుపాటుతో లేచి తలుపు దగ్గరకు వెళ్ళి తెరిచాడు.
=================================================
ఇంకా వుంది
=================================================
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
Twitter Link
Podcast Link
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.
రచనా వ్యాసంగం: తొలి రచన ‘లోభికి మూట నష్టి’ విద్యార్థి దశలోనే రాశాను, అప్పట్లో మా పాఠశాల బ్రాడ్కాస్టింగ్ స్టేషన్ నుండి ఈ శ్రవ్య నాటిక అన్ని తరగతులకు ప్రసారం చేశారు.
అందులోని మూడు పాత్రలను నేనే గొంతు మార్చి పోషించాను.
మా నాయనమ్మ చెప్పిన భారత భాగవత రామాయణ కథలు నన్ను రచనలకు పురికొల్పాయి.
Comments