top of page

మమతల మధువు ఎపిసోడ్ 4


'Mamathala Madhuvu Episode 4' New Telugu Web Series


Written By Ch. C. S. Sarma



(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

జరిగిన కథ..

కొడుకు ఆదిత్య రాసిన ఉత్తరం చూసి ఉద్వేగానికి లోనవుతుంది గౌరి.

భర్తతో ఫోన్ లో మాట్లాడుతుంది.

ఆమెను ఊరడించి కొడుకును కలుద్దామని చెబుతాడు ఆమె భర్త గోపాల్.

వైజాగ్లో ఉన్న గోపాల్, ఆపరేషన్ జరిగిన శాంతిని కలుస్తాడు.

గోపాల్ హాస్పటల్ కి వెళ్లి శాంతి పరిస్థితి గురించి వాకబు చేస్తాడు. బావమరిది మురారితో చెప్పి తను గౌరీ దగ్గరకు బయలుదేరుతాడు.

హాస్పిటల్ కి వెళ్లి శాంతిని కలుస్తాడు గోపాల్ తండ్రి భీమారావు.

ఆమెను జాగ్రత్తగా చూసుకోమని మురారితో చెబుతాడు.

ఆమె కొడుకు ఆనంద్ ని తన దగ్గరకు తీసుకొని రమ్మని రామకోటి చెబుతాడు.

ఇక మమతల మధువు నాలుగవ భాగం చదవండి..


ఎదురుగా రామకోటి ఆనంద్ నిలబడి వున్నారు. వారిని చూచి నవ్వుతూ..

“రండి..” అన్నాడు భీమారావు.


ముగ్గురూ లోనికి నడిచారు. సోఫాలను సమీపించారు. ఆనంద్ను పరీక్షగా చూస్తూ..

“కూర్చో బాబు.” ప్రీతిగా పలికాడు భీమారావు.

ఆనంద్ సోఫాలో కూర్చున్నాడు.

ఎదుటి సోఫాలో కూర్చుంటూ భీమారావు.. “రామా!.. కూర్చో.” అన్నాడు.

రామకోటి భీమారావు ప్రక్కన సోఫాలో కూర్చున్నాడు.


“టిఫిన్ చేశారా!..”

చేశామన్నట్లు తల పంకించాడు ఆనంద్.

“అమ్మ బాగుంది కదూ!..”

“బాగుందండి.” ఎంతో వీనయం నిండి వుంది ఆనంద్ ఆ పలుకుల్లో.


“నేనెవరో నీకు తెలుసా!..” భీమారావుగారి గంభీరమైన ప్రశ్న.

“తెలీదండి.”

“నేను మీ శ్రేయోభిలాషిని.”

“యీ ఒక్క మాటే అమ్మ చెప్పింది.” చెప్పి, తలదించుకొన్నాడు ఆనంద్.


భీమారావు రామకోటి ముఖంలోకి, గోపాల్ ముఖంలోకి మార్చిమార్చి చూచాడు. కొద్దిక్షణాలు వారి మధ్యన మౌనంగా గడిచిపోయాయి. సుదీర్ఘమైన నిట్టూర్పును విడచి..

“ఎంతవరకూ చదువుకొన్నావు బాబు?..” అడిగాడు భీమారావు.

"బి.యి. మెకానికల్. నేనేదో గొప్ప తెలివికలవాడినని గోల్డ్ మెడల్ యిచ్చారు.”

విరక్తిగా నవ్వాడు ఆనంద్.


“ఎక్కడయినా పని చేస్తున్నావా?..”

"విజయవాడలో ఓ సి.ఐ. పైపుల కంపెనీ ఫ్యాక్టరీలో ఆరునెలలుగా

పనిచేస్తున్నాను.”


"జీతం ఎంత యిస్తున్నారు?..”

“పదివేలు.”


భీమారావు సెల్ చేతికి తీసికొని ఎదో నెంబర్కి నొక్కాడు.

“గుడ్ యీవినింగ్ సార్!..”

“బాలప్పా!.. ఎలా వున్నావ్?”

“బాగున్నాను సార్.”


“నేను చెప్పేది జాగ్రత్తగా విను.”

“చెప్పండి సార్..”

"నీవు మన ఆఫీసు దగ్గిరలో ఒక మంచిని యింటిని చూడు.”

“ఎంత బాడుగలో సార్!..”


“ఎంతయినా ఫరవాలేదు. కారు పార్కింగ్ వుండాలి.”

“సరే సార్..”


“నాకు యింటిని గురించి ఎప్పుడు చెబుతావు?..”

“ఒక్క వారంలోగా సార్.”

"అలాగే. మంచి యింటిని చూడు.”

“అలాగే సార్!..”


సెల్ కట్ చేసి రామకోటి ముఖంలోకి చూచాడు భీమారావు.

“మామా!.. మీ నిర్ణయం నాకు అర్థం అయింది." సంతోషంతో చెప్పాడు రామకోటి.


"నీతి.. న్యాయం.. ధర్మం.. యీ మూటినీ పాటించే వాడు ఎప్పుడూ ఎవరికీ భయపడ కూడదు. మధ్యలో కష్టాలు రావచ్చు.. చిత్తశుద్ధితో వాటిని నమ్ముకొని ముందుకు నడిస్తే.. ఒకనాటికి విజయం వారిదే..” ఆనంద్ ముఖంలోకి సూటిగా చూస్తూ.. "బాబూ ఆనంద్!.. నీవు ఆ విజయవాడ వుద్యోగానికి రాజీనామా యివ్వు. మనకు బెంగుళూరులో ఒక బ్రాంచి ఆఫీస్ వుంది. నీవు యికపై ఆ బ్రాంచికి మ్యానేజర్వి. రిలీవ్ కాగానే వెళ్ళి అక్కడ చేరు. యీ లోగా మీ అమ్మగారు హాస్పటల్ నుండి డిచ్చార్జి అవుతారు. అమ్మతో కలసి నీవు.. బెంగళూరులో హాయిగా వుండవచ్చు.సరేనా!..

ఆనంద్ నుండి 'సరే' అనే జవాబు వినేటందుగాను అతని వంక చూచాడు భీమారావు.


క్షణంసేపు భీమారావు కళ్ళల్లోకి చూచి.. ఆనంద్ మౌనంగా తల దించుకొన్నాడు.

"ఏమిటి బాబు నీ సందేహం?..” అడిగాడు రామకోటి

"అమ్మతో మాట్లాడాలి సార్.” సాలోచనగా మెల్లగా చెప్పాడు- ఆనంద్.


"ఈ విషయాన్ని గురించి మీ అమ్మతో యీ రామకోటీ మాట్లాడుతాడు. ఆమెను ఒప్పించే బాధ్యత వీడిది.”

"అవును బాబు!.. అది నా బాధ్యత. ”


"అమ్మకు యిష్టం అయితే నాకూ యిష్టమే..”

"చూడు ఆనంద్ బాబూ!.. నేను వయస్సులో నీకంటే ఎంతో పెద్దవాణ్ణి.

ఆరు నెలల క్రిందట మనం పెంచలకోనలో కలిశాము. నీవు మాకు ఎంతో సహాయం చేశావు. నీకు గుర్తుందా!..”


“వుందండి.”

“యికపై నీవు నన్ను అండీ పిలవకు, తాతయ్యా అని పిలు.” నవ్వుతూ చెప్పాడు భీమారావు.


“అమ్మ పిలవమంటే.. అలాగే పిలుస్తాను. యిక నే వెళ్ళి వస్తాను అమ్మ. నాకోసం ఎదురు చూస్తూ వుంటుంది. మీరు మీ అబ్బాయిగారు మాకు ఎంతో సహాయం చేశారు. మా అమ్మను బ్రతికించారు. యీ కారంగా నేను మీకు జీవితాంతం ఋణపడి వుంటాను.” సోఫానుంచి లేచి చేతులు జోడించాడు ఆనంద్.

భీమారావు.. రామకోటి ఒకరి ముఖాలు ఒకరు చూచుకొన్నారు. యిరువురి మనస్సులో ఏదో మూగ బాధ.


"మంచిది బాబు, వెళ్ళిరా!.." ఆనంద్ ముఖంలోకి ఆప్యాయంగా చూస్తూ చెప్పాడు భీమారావు.

ఆనంద్ రామకోటికి నమస్కరించి వెళ్ళిపోయాడు. తెరిచిన తలుపు మూయబడింది.


"శాంతి.. బిడ్డను చాలా పద్ధతిగా పెంచింది రామా!..” కిటీకీగుండా శూన్యంలోకి చూస్తూ చెప్పాడు భీమారావు.

"అవును మామా!..”


"యీ ఆనంద్ నాకేమవుతాడు?”

"మామా!.. ఏమిటీ ప్రశ్న?..”


"జవాబును నీ నోటితో వినాలని వుంది. కారణం ఆ శ్రీరామచంద్ర మూర్తికి ఆంజనేయస్వామికి వున్న బంధమే కదా మన సంబంధం.”

ఎంతో గంభీరంగా భీమారావు పలికిన ఆ మాటలు విని రామకోటి చలించిపోయాడు. తన యజమానికి తన పట్ల వున్న భావనకు ఆయనకు ఎంతో సంతోషం కలిగింది.

కళ్ళలో కన్నీరు. తమాయించుకొని..

"మామా!.. మీ ప్రశ్నకు జవాబు చెప్పనా!..”.


“చెప్పు.”

“ఆనంద్ నీ పెద్ద మనుమడు.”

“ఆనందన్ను చూస్తే నీకేమనిపిస్తూ వుంది?..”

"పుటక గుణాలు అన్నీ మీవే.”


"వాడి విషయంలో నేను తీసుకొన్న నిర్ణయం నీకు సమ్మతమేనా!..”

“మామా!.. మీ నిర్ణయాల్లో.. యీ ముప్ఫయిఐదు సంవత్సరాల్లో నేను ఏనాడు తప్పును చూడలేదు.. ధర్మాన్ని తప్ప.”


"ఆదిత్యలో.. ఆనంద్లో నీకు కనుపించిన తేడా ఏమిటి రామా!..”

"ఆదిత్యలో ఆవేశం అధికం.. ఆనంద్లో శాంతం.. మీలాగే ఎక్కువ."

"ప్రశ్నార్థకంగా భీమారావు రామకోటి ముఖంలోకి చూచాడు.

"నాకు తోచిన భావాన్ని నేను మీతో చెప్పాను మామా!.. తప్పా!.."


"లేదు. నీవు చెప్పింది నిజం.. కానీ యిప్పుడు ఆదిత్య.. పదేళ్ళుగా యింటికి దూరంగా వుంటున్న కారణం ఎంతగానో మారాడు. రామా!.. వాడిలో ఆవేశం.. అధికం అన్నమాట నిజం.. కానీ.. వాడికి వూహ తెలిసిన నాటి నుంచీ చూస్తున్నాను..

వాడిలో వున్న ధర్మాధర్మ విచక్షణ చాలా గొప్పది." అది.. భీమారావుగారి ఖచ్చితాభిప్రాయం.


"ఆది ఎవ్వడు?.. యీ తాతయ్య మనువడే కదా మామా!.." ఆనందంగా నవ్వాడు రామకోటి.

"రామా!.. మన గోపాల్ తప్పు చేశాడు కదూ!..” సాలోచనగా అడిగాడు. భీమారావు.


“ఆసాటి.. పరిస్థితులేమిటో మనకు తెలియదు కదా మామా!..” అనునయంగా

పలికాడు రామకోటి.

"నీవు తెలిసికొని నాకు చెప్పాలి.”


"తప్పకుండా మామా!.. అదీ నా కర్తవ్యం.”

"ఎలా తెలుసుకుంటావ్?.."

"మురారి ద్వారా!..”

"ఆఁ.. శాంతి హాస్పటిల్ నుంచి డిచ్చార్జి కాగానే.. శాంతి ఆనంద్.. బెంగుళూరు చేరాలి."


"తప్పకుండా మామా!.. వారితో అన్ని వివరంగా మాట్లాడి వారిని బెంగుళూరుకు చేర్చే పూచీ నాది.”


“యీ విషయాలేవీ.. నెల్లూరిలోని మనవారికి.. ముఖ్యంగా గౌరికి ఎన్నటికీ తెలియకూడదు. ఆమె చాలా అమాయకురాలు.. ఆవేశం ఎక్కువ. నా బిడ్డ చేసిన పొరపాటును దాచడం.. తండ్రిగా నా ధర్మం కదా రామా!.. ఐనా.. నా బిడ్డ వీరికి అన్యాయం చేయలేదుగా!.. యిరవై నాలుగు సంవత్సరాలుగా వాడు అన్న బాధలను దిగమ్రింగి ఎంత గొప్పగా నటించి.. అందరికీ ఆనందాన్ని పంచాడు కదరా!.. మానసికంగా ఎంత కష్టపడ్డాడో!.. నా వూహకు అందడం లేదు రామా!..”


భీమారావుగారి యీ మాటల్లో తన వారందరి పట్ల వారికి ఎంతటి అభిమానం.. ప్రేమ.. వున్నాయో రామకోటికి అవగతమయింది.

"మామా!.. మీరు ఏ విషయానికీ బాధపడకండి. మీరు నిర్ణయించిన ప్రకారం అన్నీ సవ్యంగా జరిగేలా నేను వర్తిస్తాను.”



“యిది నా కుటుంబ గౌరవానికి సంబంధించిన సమస్య రామా!.. నాకు అందరూ కావాలి. నా జీవితకాలంలో అందరూ ఆనందంగా వుండాలి. కుటుంబంలో ఎలాంటి అపోహలూ తలెత్తకూడదు.” ఏదో ఆలోచిస్తూ కిటికీ వైపు చూస్తూ అన్నాడు భీమారావు.

"మీ సంకల్పం మంచిది మామా!.. అంతా మీరు కోరినట్లుగానే జరుగుతుంది.” కొన్ని క్షణాలు ఆగి.. “మామా!.. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగనా?..”

"అడుగు.”


“యీ విషయాన్ని గురించి మీరు గోపాల్తో మాట్లాడుతారా!..”

భీమారావు ఆశ్చర్యంతో.. రామకోటి ముఖంలోకి చూస్తాడు.

"తప్పుగా అడిగానా మామా!..” భయంతో అడిగాడు రామకోటి.


“లేదు రామా!..”

"మరి మీ జవాబు!..”

“ఎన్నటికీ అడగను. వాడుగా చెబితే.. వింటాను.”

“నా ప్రశ్నకు నా మదిలో వున్న జవాబూ యిదే మామ.”

ఆనందంగా నవ్వాడు రామకోటి.


"పద భోం చేద్దాం.”

యిరువురూ రూమ్ లాక్ చేసి క్రిందికి బయలుదేరారు.


*****

గోపాల్ కారు పన్నిండు గంటలకు వారి భవంతి పోర్చికోలో ఆగింది. కారు సవ్వడిని విని గౌరి వరండాలోకి పరుగున వచ్చింది. వుదయం నుంచి ఆమె తన భర్త రాక కోసం ఎదురు చూస్తూ వుంది.


గోపాల్ కారునుండి దిగాడు. వరండాలో నవ్వుతూ నిలబడి వున్న గౌరీని చూచాడు.

“గంట లేటు.” అంది గౌరి నవ్వుతూ..


"అవును గౌరీ.. ట్రాఫిక్ జామ్ వల్ల ఆలస్యం అయింది. " ఎ.సి. కార్లో వచ్చినా.. గోపాల్ ముఖంలో ఎంతో అలసట గోచరించింది గౌరికి. ఆ సమయంలో మాట్లాడి గోపాల్ ని విసిగించకూడదనుకొంది. యిరువురూ.. హాల్లోకి వచ్చారు. రంగా గోపాల్ సూట్కేసును తీసుకొని వచ్చి హాల్లో వుంచాడు..


“రంగా!.. మూడు గంటలకు రా! ఆఫీస్కు వెళ్ళాలి." గోపాల్ చెప్పాడు.

“అలాగేనయ్యా!..” చెప్పి, రంగా వెళ్ళిపోయాడు.


సెల్ మ్రోగింది. చెవి దగ్గర వుంచుకొన్నాడు గోపాల్ అది తన తండ్రిగారి కాల్ అని గ్రహించి.

“చెప్పండి నాన్నా!..”


“యిక్కడ.. ఎవ్విరీ థింగ్ యిజ్ ఫైన్. నథింగు వర్రీ!.. మై సన్. టేక్ రెస్టు..” కట్ చేశాడు భీమారావు. గోపాల్ సెల్ ని చూస్తూ నిట్టూర్చాడు.

" ఎవరు బావా!.." అడిగింది గౌరీ.


“నాన్నగారు!.. చేరావా అని అడిగారు. ఆఁ.. నీవు భోం చేశావా?..”

ప్రశ్నార్థకంగా గోపాల్ ముఖంలోకి చూచింది గౌరీ.


“ఒకవేళ ఆలస్యం అయినందున.. చేసి వుంటావేమోనని అడిగాను. స్నానం చేసి వస్తాను. భోం చేద్దాం” నవ్వుతూ తన బెడ్రూమ్ వైపుకు నడిచాడు గోపాల్. అతన్ని అనుసరించింది గౌరి. డ్రస్ విప్పి టవల్ చుట్టుకొని గోపాల్ బాత్రూమ్లో ప్రవేశించాడు.


“త్వరగా రండి.”

“అలాగే దేవీ!..”


స్నానం చేస్తుండగా.. నాన్నగారు ఫోన్లో చెప్పిన మాటలు అతని చెవుల్లో మారుమ్రోగాయి. మనస్సున సందేహం!.. అన్ని విషయాలూ నాన్నకి తెలిసాయా!.. ఎంతో కాలంగా.. తనకు మురారికి మాత్రం తెలుసు అనుకొనే.. తన జీవితానికి సంబంధించి.. తను తండ్రికి, ఎవరికీ.. చెప్పకుండా యిరవై నాలుగు సంవత్సరాలుగా తనలోనే దాచుకున్న యధార్థ గాథ.. నాన్నగారికి తెలిసిపోయిందా!.. ఒకవేళ తెలిసుంటే.. తను వారి ముఖాన్ని ఎలా చూడగలడు?.. ఆ విషయం గౌరీకి తెలిస్తే.. భయం.. భయం.. భయం..


ఆలోచించలేకపోయాడు. షవర్ ఆన్చేసి తలను ఆ నీటి క్రింద వుంచాడు. పది నిముషాలకు మస్తిష్కంలోని వేడి తగ్గి తల తనువు.. చల్లబడ్డాయి. స్నానం ముగించి బయటికి వచ్చాడు.


పంచను అందిస్తూ అతని ముఖంలోకి చూచింది గౌరి. కళ్ళు చింతనిప్పుల్లా ఎర్రగా వున్నాయి.

"వేడి విపరీతంగా చేసినట్లుంది. కళ్ళు ఎలా వున్నాయో అద్దంలో చూడండి ఒకసారి. భోంచేసి రెండు గంటలు నిద్రపోండి. ఐదు గంటలకు పైన వెళ్ళవచ్చు ఆఫీసుకు. సరేనా!..”


గౌరీ ముఖంలోకి చూచాడు గోపాల్. ఆమె చూపుల్లో అభ్యర్ధన గోచరించింది గోపాల్ కి.

"అలాగే గౌరీ!..” చిరునగవుతో పలికాడు గోపాల్.


భోజనానంతరం గోపాల్ గౌరీలు వారి పడక గదిలోకి వచ్చారు. దిండ్లను సరిచేసి గౌరి..

"హాయిగా రెండు గంటలసేపు నిద్రపోండి. రంగాను ఐదు గంటలకు రమ్మని ఫోన్ చేసి చెబుతాను.” రంగాకు ఫోన్ చేసి అదే విషయాన్నే చెప్పింది.


మంచంపై వాలి గోపాల్ గౌరి ముఖంలోకి చూచాడు. ఆమె వదనంతో ఎంతో ఆనందంగా గోచరించింది. గోపాల్ కి.

"నీవూ పడుకో గౌరీ!..


“లేదు.. పని వుంది.”

“ఏమిటా పని?..”

"ఒడియాల పిండిని సిద్ధం చేశాను. ఎండ బాగా వుంది. మేడ మీదికెళ్ళి ఒడియాలు పెట్టాలి."

"ఓ గంట తర్వాత పెట్టవచ్చుగా!..”

"ఎండ తగ్గిపోతుంది. ఒడియాలు ఆరవు.”


"సరే.. నేను కాసేపు నిద్రపోతాను.”

"అదే కదా నేను మీకు చెప్పింది. అన్నీ ఆలోచనలనూ పక్కకు నెట్టి హాయిగా నిద్రపోండి.” నవ్వుతూ చెప్పింది గౌరి.


గోపాల్ కళ్ళు మూసుకొన్నాడు. కొన్ని క్షణాలు.. అతని ముఖాన్ని పరీక్షగా చూచి.. నవ్వుకొంటూ గౌరి గది నుండి బయటికి నడిచింది.


కళ్ళు మూసుకొన్నాడే కానీ.. గోపాలకు నిద్రపట్టలేదు. అతని కళ్ళల్లో హాస్పటిల్లో వున్న శాంతి గోచరించింది. ఎలా వుందో, స్పృహ వచ్చిన తర్వాత కలిసి మాట్లాడేదానికి అవకాశం లేకపోయింది. తండ్రిగారి ఆనతి, వూరికి తిరిగి రావలసి వచ్చింది.


తన ప్రవర్తనను గురించి.. విషయాన్ని విన్న.. శాంతి ఎంతగా బాధ పడిందో, మురారి ఆమెతో ఏమి చెప్పాడో ఏమో!.. తను వున్నంతవరకూ ఆనంద్ రాలేదు. వచ్చాడో లేదో!..

తండ్రిగారు ఫోన్లో అన్న.. 'యిక్కడ.. ఎవ్వరీ థింగ్ యీజ్ ఫైన్. నథింగ్ టు వర్రీ మైసన్!.. చెవుల్లో ప్రతిధ్వనించాయి.

===============================================


ఇంకా వుంది



===============================================

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



Twitter Link

Podcast Link

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


రచనా వ్యాసంగం: తొలి రచన ‘లోభికి మూట నష్టి’ విద్యార్థి దశలోనే రాశాను, అప్పట్లో మా పాఠశాల బ్రాడ్కాస్టింగ్ స్టేషన్ నుండి ఈ శ్రవ్య నాటిక అన్ని తరగతులకు ప్రసారం చేశారు.

అందులోని మూడు పాత్రలను నేనే గొంతు మార్చి పోషించాను.

మా నాయనమ్మ చెప్పిన భారత భాగవత రామాయణ కథలు నన్ను రచనలకు పురికొల్పాయి.


27 views0 comments

Comments


bottom of page