'Mamathala Madhuvu Episode 6' New Telugu Web Series
Written By Ch. C. S. Sarma
'మమతల మధువు తెలుగు ధారావాహిక' ఎపిసోడ్ 6
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
జరిగిన కథ..
కొడుకు ఆదిత్య రాసిన ఉత్తరం చూసి ఉద్వేగానికి లోనవుతుంది గౌరి.
భర్తతో ఫోన్ లో మాట్లాడుతుంది. ఆమెను ఊరడించి కొడుకును కలుద్దామని చెబుతాడు ఆమె భర్త గోపాల్.
వైజాగ్లో ఉన్న గోపాల్, ఆపరేషన్ జరిగిన శాంతిని కలుస్తాడు. హాస్పటల్ కి వెళ్లి శాంతి పరిస్థితి గురించి వాకబు చేస్తాడు. బావమరిది మురారితో చెప్పి తను గౌరీ దగ్గరకు బయలుదేరుతాడు.
హాస్పిటల్ కి వెళ్లి శాంతిని కలుస్తాడు గోపాల్ తండ్రి భీమారావు. ఆమెను జాగ్రత్తగా చూసుకోమని మురారితో చెబుతాడు. ఆమె కొడుకు ఆనంద్ ని తన దగ్గరకు తీసుకొని రమ్మని రామకోటి చెబుతాడు.
ఆనంద్ చేస్తున్న ఉద్యోగ వివరాలు కనుక్కుంటాడు భీమారావు. అతనికి బెంగళూరులో ఉన్న తన కంపెనీలో ఉద్యోగం ఇస్తానని చెబుతాడు. గోపాల్ ఇంటికి చేరుకుంటాడు.
తండ్రికి శాంతి విషయం తెలిసిపోయిందని మురారి ద్వారా తెలుసుకుంటాడు గోపాల్.
భార్యతో గౌరితో కలిసి మంగళూరు వెళ్లి, కొడుకు ఆదిత్యను కలుస్తాడు.
ఆదిత్య బాల్యం గుర్తు చేసుకుంటాడు
ఇక మమతల మధువు ఎపిసోడ్ 6 చదవండి..
ప్రేమ.. ఆదిత్య మేనత్త కూతురు, అత్త భవానీ.. మామ ధనుంజయరావు, భీమారావుగారి చెల్లి సుశీల కుమారుడు.
వయస్సులో ఆదిత్యకు ప్రేమకు తేడా మూడు సంవత్సరములు. యిరువురి యిళ్ళు వీధికి ఎదురెదురుగా వున్నందున ప్రేమ ఆదిత్యా కలిసి ఆడుకొనే వారు. యిరువురూ కలిసి స్కూలుకు వెళ్ళేవారు. ఆదిత్యకు చిన్నతనం నుంచీ ప్రేమ అంటే ప్రాణం. తోటి పిల్లలు ప్రేమను ఎగతాళి చేసిన.. ఎక్కిరించినా వారిని బెదిరించేవాడు. చొక్కా పట్టుకొని కొట్టబోయేవాడు.
ఆదిత్య తల్లి.. గౌరి అతనికి చిన్నతనం నుంచీ ఎప్పుడూ.. సత్యం చెప్పాలని అధర్మాన్ని నిర్భయంగా ఎదిరించాలని.. వున్నంతలో ఎదుటి వారికి సహాయం చేయాలని.. దొంగ తనం.. మోసం చేయకూడదని.. నీతి వాక్యాలను చెబుతూవుండేది. కారణం ఆ తల్లికి తన బిడ్డ గొప్పవాడు కావాలని.. తన వారికందరికీ మంచి పేరు తేవాలనే కోరిక. ఆ కారణంగా గౌరి ఆదిత్యను మంచి క్రమశిక్షణతో పెంచింది.
గోపాల్ చెల్లి.. ప్రేమ తల్లి భవానీకి ఆదిత్య అంటే ఎంతో అభిమానం. తన కూతురు ప్రేమకన్నా.. ఎక్కువగా అభిమానించేది. తనకు కాబోయే అల్లుడని మురిసిపోయేది.
ఆదిత్య ఐదవ తరగతి చదివేటప్పుడు ప్రేమ రెండవ తరగతి. తల్లి శిక్షణలో ఆదిత్య తరగతిలో మొదటివాడు. వుపాధ్యాయులకు ఆదిత్య అంటే ఎంతో అభిమానం. ఆ రోజు మాస్టారుగారు చరిత్రను గురించి చెబుతున్నాడు. ఆదిత్య శ్రద్ధగా వింటున్నాడు. ప్రక్కన కూర్చొని వున్న కాంతారావు ఆదిత్యకు చక్కలిగిలి పెట్టి మాస్టారుగారిని గురించి కామెంట్ చేశాడు. 'తప్పు.. చేయకు' అని కాంతారావును వారించాడు ఆదిత్య.. కొద్దిసేపటి తర్వాత.. కాంతారావు మరలా అదేపని చేశాడు. ఆదిత్యకు కోపం వచ్చింది. తన సంచిలో వున్న యినప స్కేల్ను బయటికి తీసి కాంతారావు తలపై కొట్టాడు.
తల్లో గాయం అయింది. రక్తం వచ్చింది. కాంతారావు బోరున ఏడుస్తూ మాస్టారుగారీతో ఆదిత్య తన్ను స్కేలుతో కొట్టాడని రిపోర్టు చేశాడు. మాస్టారుగారు కాంతారావు తలకు తగిలిన గాయాన్ని చూచాడు. చాక్ పీస్ పొడి చేసి ఆ గాయంపై అదీ కాంతారావును ఓదార్చాడు.
“వాణ్ణి ఎందుకు కొట్టావ్?..” కోపంతో ఆదిత్యను అడిగాడు మాస్టారు.
“వాడు నన్ను.. మీరు చెప్పే పాఠాన్ని విననీకుండా నాకు చక్కలిగింతలు పెట్టాడు. మిమ్మల్ని రమణారెడ్డి అని ఎక్కిరించాడు. తప్పు అని చెప్పాను. వినలేదు. మళ్ళా అదేపనీ చేశాడు. స్కేలుతో కొట్టాను.” నిలబడి నిర్భయంగా జరిగిన యధార్థాన్ని చేతులు కట్టుకొని ఆదిత్య చెప్పాడు.
అతనీలోని నిజాయితీకి.. ధైర్యానికి మాష్టారు ఆశ్చర్యపోయాడు. కొద్దిక్షణాల తర్వాత మాష్టారు..
“ఆదిత్యా!.. వాడు తప్పు చేస్తే.. నాతో కదా నీవు చెప్పాలి. నీవు వాణ్ణి ఎలా కొడతావు?.. చూడు.. వాడి తలకు గాయం అయింది. వాళ్ళ అమ్మా నాన్నలు మీ యింటికి వచ్చి.. మీ అమ్మా నాన్నలతో.. గొడవపడితే.. వారికి నీవేం సమాధానం చెబుతావు." ఆవేశంగా అడిగాడు మాస్టారు.
"యింతకు ముందు మీతో చెప్పిన నిజాన్నే వారికి చెబుతాను.” నిర్భయంగా ఆదిత్య యిచ్చిన జవాబు యిది.
ఆదిత్య ధైర్యానికి.. బదులు పలకలేకపోయాడు.. మాస్టారు. ఆ యిద్దరినీ తన కుర్చీ వద్దకు పిలుచుకొని వచ్చాడు.
"చూడండి.. ఆదిత్యా.. కాంతారావు.. మీరు యిలా గొడవలు పెట్టుకోకూడదు. కొట్టుకోకూడదు. అది తప్పు, అందరూ కలసి మెలసి అన్నదమ్ముల్లా వుండాలి. నేను చెప్పేది బాగా వినాలి. యిక మీదట యిలాంటి తప్పును ఎప్పుడూ
చేయకూడదు. సరేనా!..” అనునయంగా ఆ యిరువురికి చెప్పాడు మాస్టారు.
'సరే, అన్నట్లు యిరువురూ తలలు ఆడించారు. ప్రక్క గది కిటికీ గుండా జరిగిన సన్నివేశాన్ని చూచింది ప్రేమ. కాంతారావును కొట్టి.. బావ తప్పు చేశాడు అనుకొంది ఆ చిన్నారి.
స్కూలు గంట కొట్టారు. అందరు పిల్లలు బయటికి వచ్చారు. ఆదిత్య వెళ్ళి ప్రేమ చేతిని పట్టుకొన్నాడు. ప్రేమ చేతిని విదిలించి దూరంగా పోతూ..
"నీవు నాతో మాట్లాడకు. నీకు కోపం ఎక్కువ. యీ రోజు నీవు కాంతారావును స్కేలుతో కొట్టి తప్పు చేశావు. నేను అమ్మ నాన్న.. అత్తయ్య మామయ్యలతో చెబుతాను.” బుంగ మూతితో కోపంగా చెప్పింది ప్రేమ.
ఆదిత్య ఆమెకు ఎదురుగా ముందుకు నడవనియ్యకుండా నిలబెట్టాడు.
“నీకు నేను చేసింది తప్పుగా తోచిందా ప్రేమా..”
“అవును.”
"వాడు ఏం చేశాడో నీకు తెలుసా!..”.
“తెలీదు.”
“అయితే.. నాదే తప్పని నీవు ఎలా అంటావ్?..”
“కాంతారావు తలపై నీవు కొట్టి రక్తం వచ్చింది.. కాబట్టి.. కళ్ళను పెద్దవిగా చేసి ఆదిత్య ముఖంలోకి చూస్తూ అంది ప్రేమ.
“వాడు చేసిన తప్పు నీకు..”
"ఏం చేశాడు?..”
"నేను మాస్టారు చెప్పే పాఠం వింటుంటే.. నాకు చక్కలిగింత పెట్టాడు. మాస్టారుగారిని ఎక్కిరించాడు. తప్పు అని చెప్పాను. నా మాట వినలేదు. తిరిగి అదే తప్పు చేశాడు. అందుకే.. నాకు కోపం వచ్చింది.”
"నీకు కోపం వస్తే.. నీవు కొడతావా!.. అది తప్పు కాదా!.." ఆవేశంతోఅడిగింది ప్రేమ.
ఆదిత్య.. ఆలోచనలో పడ్డాడు. తను చేసింది తప్పా.. రైటా?.. కొద్దిక్షణాల తర్వాత.. 'మాస్టారుగారికి చెప్పాల్సింది. కాంతారావును కొట్టి నేను తప్పు చేశాను.” మనస్సున అనుకొని..
"ప్రేమా!.. నేను చేసింది తప్పే. యిక మీదట అలా చేయను. సారీ.. రా, నా చేయి పట్టుకో, మనం యింటికి పోదాం.” అనునయంగా పలికి అమాయకంగా నవ్వాడు ఆదిత్య.
ప్రేమ తన బావ తప్పును ఒప్పుకొన్నందుకు సంతోషించింది. తన పుస్తకాల సంచీని అతనికి యిచ్చింది. అతని చేతిని పట్టుకొంది. యిరువురూ ఆనందంగా యిండ్ల వైపుకు నడిచారు. వర్షం ప్రారంభమయింది. ఆది తన చొక్కాను విప్పి ప్రేమ తలపై కప్పాడు. ఆమె చేతిని పట్టుకొని జాగ్రర్తగా నడిపించి, ఆమెను వారి యింట్లో వదలి, చొక్కా తీసికొని తన యింటి వైపుకు పరుగెత్తాడు. 'బావకు నేనంటే చాలా యిష్టం,’ నవ్వుతూ అనుకొంది ప్రేమ.
***
అప్పటికి.. ఆదిత్య వయస్సు పదమూడు, ప్రేమ వయస్సు పది సంవత్సరాలు. ఆదిత్య సెవన్త్ క్లాస్.. ప్రేమ ఫిప్త్ క్లాస్ చదువుతున్నారు.
స్కూలు నుంచి వచ్చి స్నానం చేసి తల్లి గౌరి పెట్టిన టిఫిన్ తిని ఆదిత్య ప్రేమ యింటికి వచ్చాడు.
ఆదిత్యను చూచి..
“అమ్మా!.. బావ వచ్చాడు.” బిగ్గరగా అరిచింది.
భవానీ హాల్లోకి వచ్చింది.. “ఆదీ రా!.. హోమ్వర్కు చేశావా?”
“చేసేశాను అత్తయ్యా!..”
"అమ్మ ఏం చేస్తూ వుంది.”
"సన్నజాజి పూలు కోసి యిచ్చాను. కూర్చొని దండ కడుతూ వుంది.”
"నాన్నా వూర్లో లేరుకదూ!”
మూడు కొత్తలారీలు కొంటున్నారుగా.. వాటి కోసం మద్రాస్ వెళ్ళాడు."
"తాతయ్య..”
"పొలానికి వెళ్ళారట.”
" ఆదీ!.. నేనొక మాట అడుగుతాను. నిజం చెబుతావా!..”
"అత్తయ్యా!.. నాకు అబద్దం చెప్పడం అంటే అసహ్యం, నీకు తెలుసుగా!.”
"అవును. నీకు అమ్మ.. నాన్న.. తాతయ్యల్లో ఎవరంటే ఎక్కువ యిష్టం నానా!..”
ఆదిత్య నవ్వాడు.
“ఎందుకు నవ్వుతున్నావ్?..”
"మీ ప్రశ్న కారణంగా!.. అత్తయ్యా!.. నాకు అమ్మ, నాన్న, తాతయ్య.. నీవు.. మావయ్య.. ప్రేమ.. అందరూ కావాలి. మీరంతా నన్ను ఎంతగా అభిమానిస్తున్నారో.. నేను అంతకన్నా ఎక్కువగా మిమ్మల్ని అందరినీ.. ప్రేమిస్తున్నాను. నాకు ఎప్పుడూ మీరంతా కావాలత్తయ్యా!..”
ఎంతో అనునయంగా ఆది చెప్పిన మాటలకు భవానీ కళ్ళు చెమ్మగిల్లాయి. ఆదిత్యను దగ్గరికి లాక్కొని తన హృదయానికి హత్తుకొంది.
“నీది బంగారు మనస్సు నాన్నా.” అంది భవానీ పారవశ్యంతో.
"అమ్మా!.. నీకు నాకంటే బావ యిష్టమా!..” చురచురా చూస్తూ కోపంగా అడిగింది ప్రేమ.
“వీడి పోలిక.. మనస్సు.. మా అమ్మవే! అందుకే వీడంటే నాకు ఎంతో ఇష్టం.” నవ్వుతూ చెప్పింది భవానీ.
"ఏ పిల్లా.. ఏం చేస్తున్నావ్ హోమ్వర్కా..” కొంటెగా ప్రేమ ముఖంలోకి చూచాడు ఆది.
"కళ్ళకు కనబడ్డం లేదా!..” మూతి తిప్పుతు చెప్పింది ప్రేమ.
"అమ్మా నైన్ శవన్ జార్ ఎంతమ్మా!..”
"మొద్దు.. అది తెలీదా!.." ఆది నవ్వుతూ అన్నాడు.
"అమ్మా చూడు.. బావ నన్నే మన్నాడో!.." బుంగ మూతి పెట్టి లేచి తల్లి దగ్గరకు వెళ్ళింది ప్రేమ.
"యిది.. ఎక్కాలు బాగా నేర్చుకోవాలత్తయ్యా!.. లేకపోతే లెక్కలు సరిగా చేయలేదు.".
"అవును. బావ చెప్పిన మాట నిజం.. ఆదీ దానికి కొంత సాయం చేయమ్మా. నాకు వంటిల్లో పనివుంది.” భవానీ వేగంగా వంట గది వైపుకు వెళ్ళింది.
ఆదిత్య కూర్చొనీ.. "ప్రేమా!.. రా కూర్చో." అన్నాడు. రుసరుసలాడుతూ ప్రేమ వచ్చి ఆదిత్య ముందు పుస్తకంతో కూర్చుంది.
"యిలా యివ్వు.. నీవు వేసిన వాటిని చూస్తాను.” లెక్కల నోట్బుక్ను అందించింది ప్రేమ.
"పెన్సిల్ యివ్వు!..”
ఆదిత్యను చురచురా చూస్తూ పెన్సిల్ అందించింది ప్రేమ. క్షణంసేపు ప్రేమ ముఖంలోకి చూచాడు ఆది. నవ్వుతూ.. “ప్రేమా!..”
"ఆ"
“నా మీద నీకు కోపమా!..”
“లేదే”
నోట్ బుక్ లో ప్రేమ వేసిన లెక్కలను చెక్ చేశాడు.
“మూడు కరక్టు, ఒకటి తప్పు. నే చెబుతా విను.”
“60.9 కదా ప్రశ్న!..”
“అవును.”
“సిక్స్ నైన్ జార్ ఎంత?”
"సిక్ ఫోర్..”
తప్పు ప్రేమా!.. సిక్స్ నైన్ జార్ ఫిఫ్టీ ఫోర్.. అందుకే నేను ఎక్కాలు బాగా నేర్చుకోవాలని నీకు చెప్పింది. కొట్టేసి ఫిఫ్టీ ఫోర్ వ్రాయి.”
ఆదిత్య చెప్పినట్లు బుద్ధిగా చేసింది ప్రేమ.
"యిప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఆరు ప్రక్కన సున్నా వుందిగా, దాన్ని యాభై నాలుగు కుడి ప్రక్కన పెట్టాలి. లెక్కలో ఒక వేళ రెండు సున్నాలుంటే, ఆ రెండు సున్నాలను.. యాభై నాలుగు ప్రక్కన పెట్టాలి. యిక్కడ లెక్కలో ఒక సున్నాయే వుంది. కనుక యాభై నాలుగు ప్రక్కన.. ఒక సున్నానే పెట్టాలి. పెట్టు" ప్రేమ యాభై నాలుగు ప్రక్కన సున్నా పెట్టింది.
"బావా!.."
"ఏమిటి?..”
"ఒకవేళ ఆరు ప్రక్కన మూడు సున్నాలుంటే!..”
"ఆ మూడు సున్నాలను యాభై నాలుగు ప్రక్కన పెట్టాలి. సరేనా.. అర్థం అయిందా!..”
"అయింది.”
“యిప్పుడు ఆన్సర్ ఎంతో చెప్పు.”
"ఫైవ్ హండ్రడన్ ఫాటీ..” నవ్వుతూ చెప్పింది ప్రేమ. మిగతా లెక్కలను యిదే రీతిగా.. విపులంగా ప్రేమకు చెప్పాడు ఆదిత్య. ప్రేమ ఏకాగ్రతతో ఆది చెప్పింది అర్థం చేసికొని.. వేగంగా అన్నింటినీ వేసి ముగించింది.
“బావా!.. అయిపోయింది.” క్షణం ఆగి ఆదిత్య ముఖంలోకి ప్రీతిగా చూస్తూ.. "థ్యాంక్యూ బావా!..” నవ్వుతూ చెప్పింది ప్రేమ.
ఆదిత్య తృప్తిగా నవ్వాడు.
వాకిట్లో కారు ఆపిన శబ్ధం. ప్రేమ నాన్న ధనుంజయరావు క్యాంపు నుండి తిరిగి వచ్చారు. ఆయన ఆజ్ బెస్టాజ్ ఎవరెస్టు కంపెనీ రీజనల్ మార్కెటింగ్ మ్యానేజర్. నెలకు యిరవై రోజులు క్యాంప్కు.. వెళుతూ వుంటారు.
ప్రేమా ఆదిత్యలు వాకిట్లోకి పరుగెత్తారు. ధనుంజయరావు ఆ యిరువురినీ.. చేరోచేత్తో చుట్టుకొని ఆప్యాయంగా దగ్గరికి తీసుకొన్నాడు.
“అమ్మా!.. ఆదీ.. అంతా బాగున్నారా!..”
"ఆల్ ఆర్ ఫైన్ మామయ్యా!..” నవ్వుతూ చెప్పాడు ఆది.
"నాన్నా!.. యీసారి నాలుగు రోజులు ఆలస్యంగా వచ్చావు..”
"అవునురా!.. పనివుణ్ణింది. అమ్మకు ఫోన్ చేసి చెప్పాను.” నవ్వుతూ చెప్పాడు. ధనుంజయరావు.
ముగ్గురూ యింట్లోకి ప్రవేశించారు. డ్రయివర్ పెద్ద పనశ పండును తీసుకొని వచ్చి టేబుల్ మీద వుంచాడు. సూట్కేస్ ని సోఫా ప్రక్కన వుంచాడు.
"ఖాజా!.. యింక రెండు న్నాయిగా.. ఒకటి మామయ్యగారి యింట్లో యివ్వు. ఒకదాన్ని నీవు యింటికి తీసుకొని వెళ్ళు." చెప్పాడు ధనుంజయ.
“అలాగే సార్!” ఖాజా డ్రయివర్ వెళ్ళిపోయాడు.
భవాని హాల్లోకి వచ్చింది. భర్తకు చిరునవ్వుతో స్వాగతం పలికింది.
"ఎలా వున్నావ్ భవానీ!..” అతని చూపుల్లో.. ఆ పలుకుల్లో.. తన పట్ల ఎంతటి అభిమానం భర్తకు వుందో భవానీకి అర్థం అయింది.
"మీ ఆరోగ్యం బాగుందిగా!..”
“ఆ.. ఫస్ట్ క్లాస్..”
"అమ్మ ఎక్కడ?”
“గౌరీ దగ్గరకు వెళ్ళింది. రెండు రోజులుగా ఆమో అక్కడే వుంది. ”
“అమ్మా.. పనసకాయ కోసి యివ్వవా!..”
"యిప్పుడు కాదు రేపు కోస్తాను. నాన్న స్నానం చేసి వస్తారు. అందరం కలసి భోంచేద్దాం.”
"ఆదీ!.. యిక్కడే వుండు. స్నానం చేసి వస్తాను. భోంచేద్దాం." ముందు ధనుంజయరావు, వెనక భవానీ.. వారి బెడ్ రూమ్ వైపుకు వెళ్ళారు.
అలాగే మామయ్యా!.." అన్నాడు ఆది.
ధనుంజయ స్నానానంతరం అందరూ కబుర్లు చెప్పుకొంటూ భోంచేశారు.
***
పిల్లలు కబాడీ ఆడుతున్నారు. తన బావ ఆడుతున్నందున ప్రేమ అక్కడ వుంది. చూస్తున్న పిల్లల్లో పాండు అనేవాడు 'జరుగూ!..' అంటూ ప్రేమను నెట్టాడు. కాలు తడబడి ప్రేమ క్రింద పడింది. మో చేతికి దెబ్బ తగిలింది. దోక్కొని రక్తం వచ్చింది. “అమ్మా!..” అరిచింది ప్రేమ.
ఆదిత్య పరుగున వచ్చాడు.
"వీడు నన్ను తోశాడు బావా!..” పాండూను చూపించింది ప్రేమ ఏడుస్తూ. ఆదికి ఆవేశం వచ్చింది. పాండూ చెంపలు వాయించాడు. వాడి చెంపలు కందిపోయాయి. పాండూ.. ఏడుస్తూ యింటికి పోయాడు.
కర్చీఫ్ ని తడిపి ప్రేమ చేతికి చుట్టి ప్రేమను ఎత్తుకొని.. తన యింటికి వచ్చాడు. వాళ్ళను చూచి.. “ఏమైంది నాన్నా!..” అడిగింది గౌరి ఆందోళనతో. జరిగిన విషయాన్ని.. తల్లికి వివరించాడు ఆది.
యింతలో.. పాండూ తల్లి కావేరి పాండూను తీసికొని గౌరీ యింటికి వచ్చింది.
“గౌరీ!.. చూడు నీ కొడుకు నా కొడుకును ఎలా కొట్టాడో!..” కళ్ళు పెద్దవి చేసి కసిగా అరిచింది.
“కావేరీ!.. ఏం జరిగిందో తెలుసుకోకుండా.. అనవసరంగా.. ఆవేశపడకు. నీ కొడుకు మా ప్రేమను తోశాడు. అది కింద పడింది. దాని చేతికి దెబ్బతగిలింది.” కట్టిన గుడ్డను వూడదీసి గాయాన్ని కావేరికి చూపించింది.
“యిప్పుడు చెప్పు కావేరీ!.. మీ వాడు చేసింది తప్పా కాదా!.. చిన్న పిల్లలు.. తగులాడుకొంటారు.. గిల్లుకుంటారు.. కొంచంసేపట్లో ఒకటైపోతారు. పిల్లల విషయాల్లో మనం జోక్యం కలిగించుకోవటం మంచిది కాదు. మాట్లాడిదిచాలు. యింటికి వెళ్ళు.” అనునయంగా చెప్పింది గౌరి.
ఆది యింట్లోకి వెళ్ళి కాటన్ బోరిక్ పౌడర్ తెచ్చి రక్తాన్ని తుడిచి.. ఆ పౌడర్ చల్లి ప్రేమకు కట్టుకట్టాడు. గౌరి గొంతువిని భవాని.. అక్కడికి వచ్చింది. జరిగిన విషయాన్ని.. ప్రేమకు ఆది చేస్తున్న చికిత్సనూ చూచి..
“చూడు కావేరీ.. నీ కొడుకు పాండూకు నోరు.. చెయ్యి రొండూ దుడుకే. బిడ్డల్ని కనగానే సరిపోదు. పద్ధతిగా పెంచాలి. వాదన ఆపి కొడుకుని తీసుకొని యింటికి వెళ్ళి బుద్ది చెప్పు. పో!.."
"అట్టాగా!.. సమయానికి వీళ్ళ నాన్న యింట్లో లేడు. వుండివుంటే.. యీ పాటికి మీ ఆదిగాడి బుగ్గలు బూరెల్లా తయారైవుండేవి.” తలను రాట్నంలా తిప్పుతూ తన భర్తగారి ప్రతాపాన్ని వినిపించింది కావేరి.
"మీ ఆయన ఎప్పుడొస్తాడూ?.." లాగి మరీ అడిగింది భవాని.
"వదినా!.. నీవు వూరుకో. యిక మాట్లాడకు. అమ్మా!.. కావేరీ.. యిక నీవు వెళ్ళు. యీ విషయం మగవాళ్ళ దాకా పోనీకు. గొడవలౌతాయి." అనునయంగా పలికింది గౌరీ.
"నేనూ మా ఆయనతో చెప్పి తీరుతాను.” కసిగా అంది కావేరి.
“చెప్పు. నేనూ మానాయనతో చెప్పి పంచాయితీ పెట్టిస్తా.”
“పంచాయితీయ్యా!..”
"అవును. భీమారావుగారి పంచాయితీ.”
పంచాయితీ అనే పదం వినగానే.. కావేరికి ఒళ్ళు జల్లుమంది.
"రారా ఎదవా రా!.. యిదంతా నీ మూలన.” కొడుకు పాండూగాడి చెయిపట్టుకుని వేగంగా వెళ్ళిపోయింది కావేరి.
“అత్తయ్యా!.. అదరగొట్టావ్.. నీవు రాకపోతే ఆ రాక్షసి అమ్మతో వాదిస్తూనే వుండేది.” నవ్వుతూ అన్నాడు ఆది.
గౌరీ ఆది చేయి పట్టుకొని తన దగ్గరకు తీసుకొని.. “నీవు చేసిందీ.. తప్పేకదా ఆదీ!.. నీ కోపాన్ని నీవు తగ్గించుకోవాలి నాన్నా.." అనునయంగా చెప్పింది. ఆమె నయనాలు అశ్రుపూరితాలైనాయి.
“అలాగే అమ్మా!..” తల్లి కళ్ళల్లోని కన్నీటిని చూచి ఆది ఏడ్చాడు.
భవానీ ఆదిని దగ్గరకు తీసుకొంది. “ఎందుకు నాన్నా.. నీవు ఏడుస్తావు. ఏడవకు. తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించి తీరాలి. పాండూగాడు తప్పు చేశాడు. వాడిని నీవు సిక్షించావ్. యిందులో నీ తప్పు ఏమీ లేదు. ఏడవకు.” అనునయించింది కన్నీటిని తుడుస్తూ భవాని.
జరుగుతున్న సన్నివేశాన్ని చిత్తరువులా చూస్తూ వుండి పోయింది ప్రేమ.
"అత్తయ్యా!.. యిదంతా నావల్లనే కదా జరిగింది!.." గౌరిని చుట్టుకొని ప్రేమ ఏడ్చింది. భవానీ.. గౌరీలు.. అది ప్రేమలను సముదాయించారు.
=====================================
ఇంకా వుంది
======================================
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం
Podcast Link
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
Yorumlar