'Mamathala Madhuvu Episode 7' New Telugu Web Series
Written By Ch. C. S. Sarma
'మమతల మధువు తెలుగు ధారావాహిక' ఎపిసోడ్ 7
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
జరిగిన కథ..
కొడుకు ఆదిత్య రాసిన ఉత్తరం చూసి ఉద్వేగానికి లోనవుతుంది గౌరి.
భర్తతో ఫోన్ లో మాట్లాడుతుంది. ఆమెను ఊరడించి కొడుకును కలుద్దామని చెబుతాడు ఆమె భర్త గోపాల్.
వైజాగ్లో ఉన్న గోపాల్, ఆపరేషన్ జరిగిన శాంతిని కలుస్తాడు. హాస్పటల్ కి వెళ్లి శాంతి పరిస్థితి గురించి వాకబు చేస్తాడు. బావమరిది మురారితో చెప్పి తను గౌరీ దగ్గరకు బయలుదేరుతాడు.
హాస్పిటల్ కి వెళ్లి శాంతిని కలుస్తాడు గోపాల్ తండ్రి భీమారావు. ఆమెను జాగ్రత్తగా చూసుకోమని మురారితో చెబుతాడు. ఆమె కొడుకు ఆనంద్ ని తన దగ్గరకు తీసుకొని రమ్మని రామకోటి చెబుతాడు.
ఆనంద్ చేస్తున్న ఉద్యోగ వివరాలు కనుక్కుంటాడు భీమారావు. అతనికి బెంగళూరులో ఉన్న తన కంపెనీలో ఉద్యోగం ఇస్తానని చెబుతాడు. గోపాల్ ఇంటికి చేరుకుంటాడు.
తండ్రికి శాంతి విషయం తెలిసిపోయిందని మురారి ద్వారా తెలుసుకుంటాడు గోపాల్.
భార్యతో గౌరితో కలిసి మంగళూరు వెళ్లి, కొడుకు ఆదిత్యను కలుస్తాడు.
ఆదిత్య బాల్యం గుర్తు చేసుకుంటాడు
ఆవేశాన్ని తగ్గించుకోమని ఆదిత్యకు చెబుతుంది అతని మరదలు ప్రేమ.
ఇక మమతల మధువు ఎపిసోడ్ 7 చదవండి..
“ఆదీ!.."
తండ్రి పిలుపు విన్న ఆది పరుగున వరండాలోకి వచ్చాడు.
"ఏం నాన్నా!..."
"నీకు మన వీరగోవిందయ్య తెలుసుగా!...”
"పాండూ నాన్నగారు. తెలుసు నాన్నా.”
"ఆ గోవిందు మన దగ్గర ఆరు నెలల క్రిందట యిరవై వేలు అప్పుగా తీసికొన్నాడు. పోయిన వారమే యిస్తానన్నాడు. నేను మద్రాస్ వెళ్ళానుగా!... అందువల్ల మన యింటికి రాలేదేమో. తాతయ్యకూ యివ్వలేదట. నీవు వెళ్ళి... మా నాన్నగారు డబ్బును తీసికొని రమ్మన్నారని చెప్పిరా!... సరేనా!...”
“అలాగే నాన్నా!...” వీధిలోకి పరుగెత్తాడు ఆది.
ఐదు నిముషాల్లో వీరగోవిందయ్య యింటిని సమీపించాడు.
ఆ సమయంలో... యిరువురి వ్యక్తులతో గోవిందయ్య వసారాలో కూర్చొని, ఏదో వ్యాపార విషయం మాట్లాడుతున్నాడు. ఆది వీరగోవిందయ్యకు కనుపించాడు, తన్ను పిలుస్తాడని అనుకొన్నాడు. అతను పిలవలేదు. 'ఏదో ముఖ్యమైన విషయంగా వుంది. అందుకే నన్ను చూచీ చూడనట్లు వాడితో మాట్లాడుతున్నాడు. కాసేపు ఆగుదాం.' అనుకొని పావుగంటసేపు వారికి దూరంగా నిలబడ్డాడు ఆది.
ఆ ముగ్గురి మధ్యనా చర్చ ముగియలేదు. అరగంట అయింది. యిక లాభంలేదని... ఆదిత్య గోవిందును సమీపించాడు.
గోవిందయ్య ప్లాస్టిక్ కుర్చీలో కూర్చొని వున్నాడు. ఆ యిద్దరూ నులక మంచంలో కూర్చొని వున్నారు.
“పన్నిండు వేలకు ఒక్క పైసా తగ్గించను.” ఖచ్చితంగా చెప్పాడు గోవిందయ్య. వారిరువురూ మంచం నుంచి లేచారు. “మేము ఫయనల్గా చెబుతున్నాము. పదివేలకు తీసుకొంటాము.” ఆ యిరువురిలో ఒకతను చెప్పాడు.
“పది వేలకు యివ్వను.” గోవిందయ్య ఖచ్చితంగా చెప్పాడు.
వారు... "మా సొమ్ము మీకు ప్రాప్తం లేదు.” ఏదో గొణుగుతూ ఆ యిద్దరూ వెళ్ళిపోయారు.
గోవిందయ్య ఆదిని చూచాడు. “ఏరా!... ఎందుకు వచ్చావ్?...” కోపంగా అడిగాడు.
"మాకు యివ్వవలసిన యిరవై వేలు తీసుకొని మా యింటికి రండి. మా నాన్నగారు చెప్పమన్నారు.”
"డబ్బు యిప్పుడు నా దగ్గర లేదు. పదిరోజుల తర్వాత యిస్తానని చెప్పు మీ నాన్నకు.”
“వారం రోజుల క్రిందటే... మా నాన్నకు యిస్తానని చెప్పారట కదా!...”
“చెప్పాను.”
“అయితే... యివ్వండి.” నిక్కచ్చిగా అడిగాడు ఆది.
“ఒకసారి చెబితే నీకు అర్థం కాదంట్రా!... పోరాపో నేను యివ్వను. పోయి నీ అబ్బకు చెప్పు.” అవేశంగా అన్నాడు గోవిందయ్య.
‘అబ్బ, అన్న మాటకు ఆదికి కోపం వచ్చింది. కనుబొమ్మలు ముడిపడ్డాయి. “మాట తప్పిన మనిషి... మనిషి కాదు జంతువు.” ఆవేశంతో అన్నాడు ఆది.
"ఏందీ... ఏం కూశావురా!... నేను జంతువునా!...” కోపంతో ఆది చెంపపై కొట్టాడు గోవిందయ్య.
ఆదిత్య కళ్ళలో నీళ్ళు నిండాయి. ఆది ఆగ్రహం హద్దులు దాటింది. చుట్టూ కలయ చూచాడు. ప్రక్కనే రాళ్ళగుట్టు వుంది. వేగంగా నడిచి వంగీ ఒక రాయికి చేతికి తీసుకొన్నాడు. గోవిందయ్య వైపుకు విసిరాడు, తన యింటి వైపుకు పరుగు తీశాడు.
ఆ రాయి గోవిందయ్య తలకు తగిలింది. చర్మం చిట్లింది. రక్తం... తాకి రక్తాన్ని చూచి 'అమ్మా' అంటూ కుర్చీలో కూలపడ్డాడు.
అమ్మా అన్న పిలుపును విన్న తల్లి సూరమ్మ పరుగున వసారాను సమీపించింది.
గోవిందయ్య తలనుంచి కారుతున్న రక్తాన్ని చూచి బిత్తరపోయింది.
"ఏమైంది నాయనా!..." ఆతృతతో అడిగింది.
"ఆ గోపాల్ కొడుకు ఆదిగాడు రాయితో కొట్టాడమ్మా!...” ఆవేశంగా పలికాడు గోవిందయ్య.
"ఎందుకు కొట్టాడురా!...”
"వాళ్ళ నాన్నకు యివ్వవలసిన డబ్బును యివ్వనందుకు.”
"డబ్బు అడిగిన దానికి వాణ్ణి నీవు ఏమీ అనలేదా!..." ప్రశ్నార్ధకంగా కొడుకు ముఖంలోకి చూచింది సూరమ్మ. 'పదమూడేళ్ళ కుంక... వాడు వీడిని కొట్టడమా!... వీడు నోటికొచ్చినట్లు ఏదో వాగి వుంటాడు, అనుకొంది సూరమ్మ.
"నేను కోపంతో వాణ్ణి కొట్టానమ్మా!... నొప్పిగా వుంది హాస్పటిల్కు పోతాను.”
యిప్పుడు సూరమ్మకు విషయం అర్థం అయింది. యింతలో భార్య కావేరి, కొడుకు పాండూ బజారు నుంచి వచ్చారు. సూరమ్మ పాతగుడ్డను గోవిందు తలకు చుట్టింది. భార్యా కొడుకు ఏమయిందని అడిగినా జవాబు చెప్పకుండా వీరగోవిందయ్య
హాస్పటిల్ వైపుకు నడిచాడు. వారికి సూరమ్మ విషయాన్ని చెప్పింది.
***
అమ్మా!... ఆదిత్య పరుగున తల్లిని సమీపించి పిలిచాడు.
“ఏం నాన్నా!...”
“నాన్నగారేరి?...”
"ఆఫీసుకు వెళ్ళారు.”
"నేను ఆ వీరగోవిందయ్యను రాయితో కొట్టానమ్మా!...”
గౌరి ఆశ్చర్యపోయింది. “ఎందుకు కొట్టావురా!...” ఆత్రంగా అడిగింది.
"నాన్నగారు మనకు ఆయన యివ్వవలసిన డబ్బును అడిగిరమ్మన్నారు. వెళ్ళి అడిగాను. నిర్లక్ష్యంగా నేను యివ్వను పో అన్నాడు. నేను మరోసారి అడిగాను. వాడు కోపంతో నా చెంపపై కొట్టాడు. నేను అతన్ని రాయితో కొట్టాను.” రోషంగా చెప్పాడు ఆదిత్య.
"పెద్దా చిన్నా చూడకుండా రాయితో కొట్టవా!...”
"అవును.” బుంగమూతి పెట్టి తలదించుకొన్నాడు ఆది.
"ఓ గౌరమ్మా!... ఓ గౌరమ్మా!..." అరుస్తూ వీరగోవింద తల్లి సూరమ్మ యింట్లో కొచ్చింది.
సూరమ్మను చూచి ఆది పెరటు వైపు పరుగెత్తాడు.
"ఏం అత్తా!..." గౌరవంగా పలకరించింది గౌరి.
"నీ కొడుకు నా కొడుకును కంకర రాయితో కొట్టాడు. వాడి తల పగిలింది.
ఏడీ నీ కొడుకు?...” ఆవేశంగా అడిగింది సూరమ్మ.
"అత్తా!... నీవు ముందు కూర్చో!...” అనునయంగా చెప్పింది గౌరి.
“చాలు చాలమ్మా!... నీ మర్యాద... పిలూ నీ కొడుకును." శాశించినట్లు పలికింది సూరమ్మ.
"అత్తయ్యా!... వాడు చిన్నపిల్లాడు. ఏదో ఆవేశంతో తప్పు చేశాడు. వాడు. తను చేసిన తప్పును నాతో చెప్పాడు. గాయం చిన్నదేగా!... వాడి తరఫున నేను. మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను. మీరు ఆవేశపడకండి.” ప్రాధేయపూర్వకంగా చెప్పింది.
ముసలి సూరమ్మకు ఆవేశం తగ్గలేదు. "ముందు వాడిని యిలా పిలు." హెచ్చుస్థాయిలో ఆదేశించింది.
“వాడు యింట్లో లేడత్తయ్యా!...”
“ఎక్కడ చచ్చాడు. రౌడీ వెధవ?...”
గౌరిలో సహనం నశించింది. "అత్తయ్యా... యీ వయస్సులో మీకు యింత ఆవేశం తగదు. నోటికొచ్చినట్లు మాట్లాడకండి. యిక ఒక్కమాట మాట్లాడితే... మీకు మర్యాద దక్కదు. బయటికి నడవండి.” ఆవేశంగా చెప్పింది గౌరి.
“వాడిని నీవు యిలా వెనకేసుకొస్తే... వాడు దొంగగానో... రౌడీగానో మారతాడు. మా అమ్మ అంటూ వుండేది. నా నోటి మాటలు తప్పవని. జాగ్రర్త నీ కొడుకు భ్రష్టు పట్టకుండా చూచుకో. సాయంకాలం వస్తా!... నీ కొడుకు నిర్వాకం... భీమారావు, గోపాల్రావుతో చెబుతా!... యీ సూరమ్మ సంగతి నీకు తెలీదు. " ” మైక్ సెట్ స్థాయిలో గుక్క త్రిప్పకుండా అరిచి... వీధిలో ప్రవేశించింది.
దార్లో కనపడ్డ వారికందరికీ ఆదిత్యా గౌరీలను గురించి... ఆ రోజు జరిగిన సంఘటనను గురించి... మూతిని ముప్పయ్యారు వంకలు త్రిప్పుతూ... వుపన్యాసం యిస్తూ... శావపనార్థాలు పెడుతూ... అలసిసొలసి కడకు యింటికి చేరింది సూరమ్మ.
సాయంకాలం... తాతయ్య భీమారావు, తండ్రి గోపాల్రావు యింటికి రాగానే.... వారిరువురికీ ఆ రోజు జరిగిన విషయాన్ని యధార్థంగా తెలియజేశాడు ఆదిత్య నిర్భయంగా.
"నన్ను అతను కొట్టడం తప్పా కాదా!..." తాత తండ్రి ముఖాల్లోకి చూస్తూ దీనంగా అడిగాడు ఆదిత్య. తల్లి గౌరి చూస్తూ వుంది. తన కొడుకులోని నిజాయితీకి ఆమెకు గర్వం... ఆవేశానికి ఆవేదన.
“ఆదీ!... యిలారా!...” అది తాతయ్య భీమారావుగారి ప్రియమైన పిలుపు.
ఆది తాతయ్యను సమీపించాడు. భీమారావు అతన్ని తన తొడపై కూర్చోపెట్టుకొని...
“నాన్నా చూడు. వాడు చేసింది తప్పే. నీవు యింటికి వచ్చి ఆ విషయాన్ని నాన్నతోనో... నాతోనో చెప్పి వుండవలసింది. ఆవేశంతో రాయి తీసుకొని కొట్టి... నీవూ తప్పు చేసిన వాడివి అయ్యావుకదా!.. ఆలోచించు.” అనునయంగా చెప్పాడు భీమారావు.
“ఐదు కుట్లు వాడి తలకు పడ్డాయట నాన్నా!...” కోపంగా ఆదిని చూస్తూ గోపాల్ చెప్పాడు.
“నా బిడ్డ చెంపకూడా కంది పోయింది. అంత వయస్సు వున్న వాడికే జ్ఞానం లేకపోతే... నిండా పదమూడేళ్ళు నిండని నా బిడ్డకు...” గౌరి పూర్తి చేయకముందే...
“అమ్మా గౌరీ!... ఆపు.” అన్నాడు భీమారావు.
"బిడ్డల్ని గారాబం చేయాల్సిందే... అతిగారాబం పనికిరాదు.” ఆవేశంగా చెప్పి గోపాల్ లేచి వెళ్ళిపోయాడు.
వెళుతున్న గోపాల్ని గౌరీ, భీమారావులు ఆశ్యర్యంగా చూచారు. గౌరి భర్త వెనకాలే వెళ్ళిపోయింది. భీమారావు సాలోచనగా తన గదికి వెళ్ళిపోయాడు. ఆది తన అత్త భవానీ యింటికి పరుగెత్తాడు.
***
సంవత్సరాంతం పరీక్షలు. ఆఖరి పరీక్ష సైన్సు. ఆదిత్య ఎనిమిదవ తరగతి. ప్రేమ ఆరవ తరగతి.
ఆదిత్య పరీక్ష వ్రాస్తున్నాడు. అతని ప్రక్క వరుసలో ఎదుటి బెంచీలో పాండు వీరగోవిందయ్యగారి కుమారుడు కూడా పరీక్ష వ్రాస్తున్నాడు. ప్యాంట్ జేబూ నుంచి చిట్టాలు తీసి పాండు మహా చాకచక్యంగా కాపీ కొడుతున్నాడు. ఆ దృశ్యాన్ని ఆదిత్య చూచాడు. మాస్టారును సమీపించి విషయం చెప్పాడు. మాస్టారు పాండును సమీపించి తనికీ చేశాడు. పాండూ ప్యాంట్ జేబులో ఐదు చిట్టాలు దొరికాయి. మాస్టారు షాక్ తిన్నాడు. పాండు వ్రాసే పేపర్లును తీసికొని వాణ్ణి బయటికి పంపేశాడు.
గుడ్లు పెద్దవి చేసి... ఆదిత్యను చూస్తూ పాండూ క్లాసు నుండి బయటికి నడిచాడు. అరగంటలో పరీక్ష ముగిసింది. పిల్లలందరూ బయటికి వచ్చారు. ఆదిత్య తన స్నేహితులతో కలసి స్కూలు ఆవరణంలో నడుస్తున్నాడు.
పాండూ తన యిరువురి స్నేహితులతో ఆదిత్యను... వెనకాల ఫాలో చేశాడు. స్నేహితుల మద్దత్తో ఆదికి దగ్గరగా చేరి... కాలితో ఆది నడుము మీద తన్నాడు. ఆది ముందుకు పడిపోయాడు. గడ్డానికి దెబ్బ తగిలింది. రక్తం కారింది.
పాండు ముందుకు పరుగెత్తాడు. ఆదీ ఆవేశంతో వాణ్ణి ఫాలో చేశాడు. కొద్ది శకండ్లలో వాణ్ణి పట్టుకొన్నాడు. పాండూ ఆవేశంతో ఆదిని తిడుతూ... కొట్టాడు. ఎద మీద పాండూ ముష్టిఘాతం తగలగానే ఆది రెచ్చిపోయాడు. సహజంగా బలశాలి అయిన ఆదిత్య పాండూను చితక తన్నాడు. ఎదురుగా వున్న రాళ్ళ గుట్ట మీదకు త్రోశాడు. పాండూ ముఖానికి గాయాలు తగిలాయి.
వెనక వస్తున్న మాస్టారు మాధవయ్య యిరువురినీ వారించాడు. కానీ యిరువురూ ఎంతో ఆవేశంతో వున్న కారణంగా ఆదిత్య తోసిన తోపుకు పాండూ రాళ్ళ గుట్టకు ప్రక్కగా వున్న బురద గుంటలో పడ్డాడు. మాస్టారు ఆదిత్యను గట్టిగా పట్టుకొని వారించాడు. తోటి పిల్లలు పాండూను బురద గుంటలో నుంచి బయటకి లాగారు. వాడు స్పృహ కోల్పోయాడు.
యిరువురినీ మాస్టారు రిక్షాల్లో హాస్పటల్కు చేర్చాడు. మిగతా పిల్లలు ఆది యింటికి, పాండూ యింటికీ వెళ్ళి జరిగిన విషయాన్ని చెప్పారు.
అప్పుడే పొలాల నుంచి తిరిగి వచ్చిన భీమారావు... హాస్పటల్కు వెళ్ళాడు.
తోటి పిల్లలూ... మాస్టారుగారి వల్ల జరిగిన విషయాన్ని తెలుసుకొన్నారు.
అది గడ్డానికి నాలుగు కుట్లు పడ్డాయి. పాండూ... కాలు విరిగింది. యిద్దరికీ చికిత్స చేసి డాక్టర్ వేణుమాధవ్ బయటికి వచ్చారు. భీమారావు మాస్టారు... వారిని కలిశారు.
యిరువురి స్థితిని వివరించాడు వేణుమాధవ్. పాండూ గుండె చాలా వీక్ వుందని వాడికి స్పృహ వచ్చేదానికి నాలుగైదు గంటలు పడుతుందని చెప్పారు.
యింతలో... పాండు తల్లి కావేరీ... తండ్రి వీరగోవిందు... గోపాల్... గౌరీ... భవానీ హాస్పటిలకు వచ్చారు. యిరువురినీ చూచారు.
"తాతయ్యా!... అమ్మా!... నన్ను యింటికి తీసుకొని వెళ్ళండి.” కన్నీళ్ళతో అడిగాడు ఆదిత్య.
“అలాగే నాన్నా!...” భీమారావు వెళ్ళి డాక్టర్ను ఆడిగాడు. డాక్టర్ తీసుకొని వెళ్ళవచ్చని చెప్పాడు. జీప్లో గోపాల్ ఆదిత్యను గౌరిని భవానీని... ఎక్కించుకొని యింటికి బయలుదేరాడు. వారిని యింట్లోదించి భీమారావు హాస్పటిల్ కి వచ్చాడు.
భీమారావు, గోపాల్... మాస్టారు మాధవయ్యగారిని... యితర పిల్లలను అడిగి జరిగిన విషయాన్ని తెలుసుకొన్నాడు. వీరగోవిందయ్య... భార్య కావేరి... సూరమ్మ... భీమారావును మ్రింగేసేలా చూచారు. ఎంతో అనుభవపరుడు... మంచీ చెడ్డా తెలిసినవాడు భీమారావు; వారి చూపులను లెక్కచేయకుండా వారిని సమీపించాడు.
"జాగ్రర్తగా చూడవలసిందిగా డాక్టరుగారికి చెప్పాను. భయపడకండి. త్వరలో స్పృహ వస్తుంది.” ఐదు వేలు గోవిందు చేతిలో వుంచి... “యిది నీ దగ్గర వుంచు అవసరానికి వాడు. ఏదైనా అవసరమైతే వచ్చి నన్ను అడుగు.” చెప్పి మాస్టారు వంక చూచాడు.
"యధార్థం చెప్పాలంటే... తప్పు మీ వాడిదే. మొదటిది కాపీ కొట్టడం... రెండవది ఆదిత్యను వెనక నుండి కాలుతో తన్నడం. పరమ పోకిరి వెధవ. ఎంత మందికి కష్టాన్ని కలిగించాడో చూడండి." గోవిందు ముఖంలోకి చూస్తూ చెప్పాడు
మాధవయ్య మాస్టారు.
ఆ మాటలు విన్న కావేరి... సూరమ్మ... గోవిందులు నోళ్ళు విప్పలేకపోయారు. కానీ, లోన... ఆదిత్యను తిట్టుకొంటూనే వున్నారు.
భీమారావు... మాధవయ్య మాస్టారు మరోసారి... డాక్టర్ను కలసి పాండూను జాగ్రర్తగా చూడమని చెప్పి యిండ్లకు వెళ్ళిపోయారు.
డాక్టర్ వేణుమాధవ్ పాండూను పరీక్షించాడు. పల్సురేట్ పడిపోయింది. పెద్ద హాస్పటలకు పంపిచడం మంచిదని నిర్ణయించి... ఆ విషయాన్ని పాండూ తండ్రికి తెలియజేసి... పాండూను స్ట్రచ్చర్లో అంబులెన్స్ లో ఎక్కించారు. పాండూ ప్రక్కన తల్లి తండ్రి కూర్చున్నారు.
మార్గమధ్యంలోనే... పాండూ శాశ్వతంగా కన్ను మూశాడు. అతని గుండె ఆగిపోయింది. ప్రక్కన వున్న మేల్ నర్స్... విషయాన్ని పాండూ తల్లిదండ్రులకు చెప్పాడు. యాంబులెన్స్ వీరగోవిందయ్య యింటికి చేరింది.
పాండూకు ఎలా వుందని ఫోన్ చేసిన భీమారావుకు డాక్టర్ వేణుమాధవ్ విషయాన్ని చెప్పాడు. భీమారావు నిశ్చేష్టుడైనాడు.
==========================================
ఇంకా వుంది
==========================================
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
Podcast Link
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.
రచనా వ్యాసంగం: తొలి రచన ‘లోభికి మూట నష్టి’ విద్యార్థి దశలోనే రాశాను, అప్పట్లో మా పాఠశాల బ్రాడ్కాస్టింగ్ స్టేషన్ నుండి ఈ శ్రవ్య నాటిక అన్ని తరగతులకు ప్రసారం చేశారు.
అందులోని మూడు పాత్రలను నేనే గొంతు మార్చి పోషించాను.
మా నాయనమ్మ చెప్పిన భారత భాగవత రామాయణ కథలు నన్ను రచనలకు పురికొల్పాయి.
Yorumlar