'Mamathala Pandiri' - New Telugu Story Written By M R V Sathyanarayana Murthy
Published In manatelugukathalu.com on 16/07/2024
'మమతల పందిరి' తెలుగు కథ
రచన: M R V సత్యనారాయణ మూర్తి
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
కథా పఠనం: పద్మావతి కొమరగిరి
“నువ్వు నా కళ్ళముందు కనిపించకు. నేటితో నీకూ, ఈ కుటుంబానికి ఋణం తీరిపోయింది. వెళ్ళిపో” అన్నాడు నాగభూషణం.
అతని కళ్ళు ఎరుపెక్కాయి. ఆవేశంతో మనిషి ఊగిపోతున్నాడు. భర్తని ఏనాడూ అలా చూడని నిర్మల నిర్ఘాంతపోయింది. అతని ముందుకు వెళ్ళడానికి కొంచెం భయం కలిగింది. కానీ తను ఇప్పుడు కలగచేసుకుని మాట్లాడకపోతే, రెండు కుటుంబాలు దూరమైపోతాయి. ధైర్యం చేసి భర్త దగ్గరగా వెళ్ళింది.
“చూడండి. తను ఇష్టపడిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. మీరు ఆమెకి ఒక్కగానొక్క అన్నయ్య. తల్లీ తండ్రీ లేరు. మీరే పెద్ద మనసు చేసుకుని మీ చెల్లెల్ని, ఆమె భర్తని ఆశీర్వదించండి. మీరు కాకపోతే మీ చెల్లాయికి, ఇంక ఎవరున్నారు? నా మాట వినండి” అంది నిర్మల.
“నువ్వేం రాయబారాలు నడపక్కర లేదు. అన్నయ్య ఒకడు ఉన్నాడు, ఆయన్ని సంప్రదించాలని అది ఆలోచించిందా? లేదు. తన నిర్ణయం తను తీసుకుంది. నా నిర్ణయం నేను చెప్పాను. నాకు ఎంత తలవంపుల పని చేసింది. మన మిల్లులో పనిచేసే గుమాస్తాని పెళ్లి చేసుకుంది. రేపు నేను సమాజంలో ఎలా తల ఎత్తుకుని తిరగగలను. వాళ్ళిద్దరినీ నా కళ్ళముందు చూస్తూ నేను తట్టుకోలేను. వెంటనే ఇద్దర్నీ వెళ్ళిపొమ్మని చెప్పు” అని విస విసా నడుచుకుంటూ గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు నాగభూషణం.
అన్నగారు అలా వెళ్లిపోవడంతో ఘోల్లుమంది నీలవేణి. ‘ఊరుకో’ అని ఆమెని సముదాయిస్తున్నాడు సుధాకర్. పెళ్లి దండలతో వచ్చిన వాళ్ళు అలా బాధపడడం చూసి దిగులుపడింది నిర్మల.
“బాధపడకు నీలవేణి. మీ అన్నయ్యకి కోపం తగ్గాక నేను మాట్లాడతాను. మళ్ళీ మనందరం కలిసి ఉందాం” అంది నిర్మల. ఆమె కేసి ఓ క్షణం చూసాడు సుధాకర్. భర్త మాటకు ఆమె ఎదురు చెప్పలేదని అతనికి బాగా తెలుసు. ప్రస్తుతం తాము అక్కడినుంచి వెళ్ళిపోవడం మంచిది, అని నిర్ణయించుకుని, భార్య కన్నీళ్లు తుడిచి ‘వెళ్దాం పద’ అన్నట్టు సైగ చేసి, ఆమె చేయి పట్టుకుని బయటకు వచ్చాడు సుధాకర్.
బయట ఆగి ఉన్న ఆటోలో ఎక్కి తమ ఊరు మార్టేరు వెళ్ళాడు, భార్యతో కలిసి. పావుగంటలో ఆటో మార్టేరు పెద్దవీధిలోని పెంకుటిల్లు ముందు ఆగింది. సుధాకర్ తల్లి వర్ధనమ్మ ఎదురొచ్చి, హారతి ఇచ్చి కొత్త దంపతుల్ని లోపలకు తీసుకువెళ్ళింది. నీలవేణి మొహం చూసి ఆమె అన్నయ్య బాగా కోపపడ్డాడని గ్రహించింది వర్దనమ్మ.
నాలుగు రోజులు గడిచాయి. కొత్త దంపతులు ద్వారకా తిరుమల వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని వచ్చారు. నీలవేణి మనసు కొద్ది కొద్దిగా కుదుటపడుతోంది. కానీ సుధాకర్ ఉద్యోగ ప్రయత్నాలు సఫలం కావటంలేదు. ఎక్కడకు వెళ్లి ఉద్యోగం కోసం అడిగినా “అమ్మో నువ్వా? అన్నం పెట్టిన యజమాని చెల్లెల్ని వలలో వేసుకున్నవాడివి. నీకు ఉద్యోగం ఇస్తే కొరివితో తల గోక్కున్నట్టే” అని వ్యంగ్యంగా అంటున్నారు. నెలరోజులు తిరగగా పాలకొల్లు లోని ఒక రైస్ మిల్లు లో గుమస్తాగా ఉద్యోగం దొరికింది.
నీలవేణి కూడా చాలా సంతోషించింది.
రోజూ ఉదయమే సుధాకర్ కి, కేరీజీ సద్ది ఇచ్చేది. సైకిల్ మీద మార్టేరు నుండి పాలకొల్లు వెళ్లి వచ్చేవాడు. నాలుగు నెలలు గడిచాయి. నీలవేణి నెల తప్పింది. ఆ చిన్న ఇంటిలో ఆనందం వెల్లి విరిసింది.
సుధాకర్ తండ్రి, వెంకట్రావు అతని చిన్ననాడే చనిపోయాడు. వర్ధనమ్మ చాలా కష్టపడి సుధాకర్ ని పెంచి పెద్దచేసింది.
శివపురం కాలేజీ లో డిగ్రీ పాస్ అయ్యాక నాగభూషణం రైస్ మిల్లు లో గుమాస్తాగా చేరాడు. తరుచూ యజమాని ఇంటికి రావడం, వెళ్ళడంలో నీలవేణితో పరిచయం ఏర్పడింది. రెండేళ్ళు గడిచేసరికి అది ప్రేమగా మారింది. అంతస్తులు, డబ్బు గురించి ఆలోచించే అన్నగారు, తమ పెళ్ళికి ఒప్పుకోడని గ్రహించిన నీలవేణి,
అన్నవరం గుడిలో సుదాకర్ ని పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చింది. తన పరువు మంట కలిపిందని, నాగభూషణం చెల్లెల్ని ఇంటిలోకి అడుగు పెట్టనివ్వలేదు.
నీలవేణి గర్భవతి అయ్యిందని నిర్మల కి తెలిసింది. శివపురం కి మార్టేరు నాలుగు కిలోమీటర్ల దూరమే. ఆ ఊరి విషయాలు, ఆడపడుచు ఇంటి విషయాలు తరచూ తెలుసుకుంటూ ఉంటుంది నిర్మల.
తను వెళ్లి నీలవేణిని చూసి రావాలని ఉన్నా, ఈ విషయం భర్తకి తెలిసిపోతుందని భయపడింది నిర్మల.
పనిమనిషి రంగమ్మ ద్వారా పళ్ళు, స్వీట్లు పంపింది. అవి తీసుకుని చాలా సంతోషపడింది నీలవేణి.
నెలలు నిండాక నీలవేణికి పండంటి అబ్బాయి పుట్ట్టాడు. మేనల్లుడు పుట్టాకా అయినా భర్త మనసు మారుతుందేమోనని “ఏవండీ, నీలవేణికి అబ్బాయి పుట్టాడుట. ఒకసారి చూసి వద్దామండి” అంది నాగభూషణంతో.
“దానికీ, నాకు ఏనాడో ‘బంధం’ తెగిపోయింది. జీవితంలో దాని మొహం చూడను. నాకు తెలియకుండా నీలవేణి దగ్గరకు వెళ్ళావో, నీకూ నాకూ కూడా ‘బంధం’ ఉండదు. జాగ్రత్త” అని హెచ్చరించాడు నాగభూషణం.
అతని మాటలకి ఖిన్నురాలైపోయింది నిర్మల.
సుధాకర్ తన కొడుకుకి, తన తండ్రి పేరు కల్సి వచ్చేటట్టు ‘వెంకటేష్’ అని పెట్టాడు. బాబుకి మూడేళ్ళు వచ్చాయి. సుధాకర్ దుబాయ్ వెళ్ళాడు ఎక్కువ డబ్బు సంపాదించాలని.
నాగభూషణం, నిర్మల దంపతులకు చాలా కాలానికి అమ్మాయి పుట్టింది. కూతురికి కీర్తన అని పేరు పెట్టాడు నాగభూషణం.
*****
కాలచక్రంలో పదేళ్ళు గిర్రున తిరిగాయి. సుధాకర్ దుబాయ్ నుండి తిరిగి వచ్చాడు. నీలవేణి అతను పంపిన డబ్బుతో గేదెల్ని కొని పాల వ్యాపారం చేసి లక్షలు గడించింది ఈ పదేళ్ళలో. ప్రైవేట్ గా ఎం. ఏ. చదివింది నీలవేణి. ‘నీ భర్త కన్నా, ఎక్కువే చదివావు ‘ అని చమత్కరించాడు సుధాకర్.
“నీలూ, బాబు పెద్దవాడు అవుతున్నాడు. వాడిని బాగా చదివిద్దాము. ఇంకో విషయం. మన దగ్గర ఇప్పుడు చాలా డబ్బు ఉంది. సిటీకి వెళ్లి ఏదైనా వ్యాపారం చేసి బాగా సంపాదించాలని ఉంది. నా దగ్గర డబ్బు లేదనేగా, అప్పుడు మీ అన్నయ్య నన్ను చిన్న చూపు చూసారు. సిటీలో మంచి స్కూళ్ళు ఉంటాయి, కాలేజీలు ఉంటాయి. హాస్టల్ లో కాకుండా అబ్బాయిని మన దగ్గరే ఉంచుకుని చదివించుకుందాం” అన్నాడు సుధాకర్. డబ్బు సంపాదన కన్నా, కొడుకు చదువు కోసం సిటీకి వెళ్ళడానికి నీలవేణి అంగీకరించింది.
నెల రోజులలో సుధాకర్, తల్లిని, భార్యని, కొడుకుని తీసుకుని విజయవాడ వెళ్ళిపోయాడు.
వెంకటేష్ ని మంచి స్కూల్ లో జాయిన్ చేసాడు. దుబాయ్ లో పరిచయమైన నారాయణతో కలిసి రియల్ ఎస్టేట్ బిజినెస్స్ చేయడం మొదలుపెట్టాడు. ఒక ఏడాది గడిచాకా నీలవేణి పక్క వీధిలోనే ఉన్న జూనియర్ కాలేజీ లో లెక్చరర్ గా జాయిన్ అయ్యింది.
శివపురంలో నాగభూషణం రైస్ మిల్ బాగా నడుస్తోంది. కూతురు కీర్తన కాన్వెంట్లో చదువుతోంది.
నీలవేణి వాళ్ళు ఊరు విడిచి వెళ్లి పోయారని తెలిసి చాలా బాధపడింది నిర్మల. కానీ సుధాకర్ బాగా డబ్బు సంపాదించి వచ్చాడని తెలుసుకుని, ఆడపడుచు కూడా ఆర్ధికంగా ఎదిగిందని ఆనందపడింది.
***
ఒక ఆదివారం ఉదయం నీలవేణి హాలులో కూర్చుని పేపర్ చదువుతోంది. సుధాకర్ ఫోను చూసుకుంటున్నాడు. వెంకటేష్ తన గదిలోంచి ‘అమ్మా.. అమ్మా’ అంటూ హడావిడిగా హాలులోకి వచ్చాడు.
భార్యా భర్తలు ఇద్దరూ ఏమిటన్నట్టు? అతనికేసి చూసారు. తల్లి పక్కనే కూర్చుని “నాకు చెన్నై లోనే ఉద్యోగం వచ్చింది అమ్మా. ఇప్పుడే మెస్సేజ్ వచ్చింది”ఆనందంగా అన్నాడు వెంకటేష్.
నీలవేణి ‘కంగ్రాట్స్’ అంది. సుధాకర్ కూడా ‘కంగ్రాట్స్’ అన్నాడు. వెంకటేష్ కి తల్లి దగ్గరే చనువు ఎక్కువ.
నీలవేణి లోపలకు వెళ్లి ప్లేటులో స్వీట్స్ తెచ్చి, కొడుక్కి, భర్తకి ఇచ్చింది. ప్లేటులోని ఇంకో స్వీట్ తీసి తల్లికి ఇచ్చాడు వెంకటేష్. “పేకేజీ ఎంత?” అడిగాడు సుధాకర్ కొడుకుని.
“ఏడాదికి అరవై లక్షలు డాడీ” అన్నాడు నవ్వుతూ వెంకటేష్.
కొడుకు చెంపలు నిమురుతూ “నువ్వు బి. టెక్. చదవడం, అప్పుడే ఉద్యోగస్తుడివి అవ్వడం, అంతా చిత్రంగా ఉంది. కాలం చాలా స్పీడ్ గా పరుగెడుతోంది” అంది నీలవేణి కళ్ళ నిండా సంతోషం నింపుకుని. సాయంత్రం కనకదుర్గ అమ్మవారి గుడికి వెళ్లి, తర్వాత సినిమాకి వెళ్లి వచ్చారు ముగ్గురూ.
మర్నాడు కాలేజీకి వెళ్ళగానే స్టాఫ్ అందరికీ స్వీట్స్ ఇచ్చి”మా అబ్బాయి కి చెన్నైలో ఉద్యోగం వచ్చిందని”చెప్పింది నీలవేణి. ప్రిన్సిపాల్ శారద “మేడం ఈరోజు లెక్చరర్ పోస్టులు ఇంటర్వ్యూ లు ఉన్నాయి. మీ క్లాసులు మిగతా వారికి అడ్జస్ట్ చేసాను. మీరు కూడా మాతో బోర్డు లో ఉండాలి” అంది.
“అలాగే” అంది నీలవేణి. నిన్నటి నుండీ ఆమె చాలా సంతోషంగా ఉంది. వెంకటేష్ చెన్నై ఐ. ఐ. టి. లో బిటెక్. చదివాడు. ఇప్పుడు ఒక మల్టీ నేషనల్ కంపనీలో ఉద్యోగస్తుడయ్యాడు. భర్త వ్యాపారం బాగుంది. తను ఇక్కడ మంచి పోజిషన్ లో ఉంది. ఒక గృహిణికి ఇంత కంటే ఆనందం ఏముంటుంది? అని ఆనందపడింది.
పదకొండు గంటలకు ప్రిన్సిపాల్ రూమ్ లో ఇంటర్వ్యూ లు ప్రారంభం అయ్యాయి. నలుగురు అభ్యర్ధులు వచ్చి వెళ్ళారు. అయిదవ అభ్యర్ధిని వచ్చి కుర్చీలో కూర్చోగానే, ఆమెని చూసి నీలవేణి ఒకసారి ఆశ్చర్యపోయింది. రెప్ప వేయకుండా ఆమెనే చూసింది. ఆమెలో కనిపించిన పోలికలు చూసి ఆమె గుండె వేగంగా కొట్టుకోసాగింది. ప్రిన్సిపాల్ కొన్ని ప్రశ్నలు వేసి, ఆమె సమాధానాలు ఇచ్చాకా నీలవేణికేసి తిరిగింది. ‘ఇంక మీరు అడగండి’ అన్నట్టు.
“ఎక్కడ చదువు కున్నావు?” అడిగింది నీలవేణి.
“డిగ్రీ శివపురంలో. పి. జి. రాజమండ్రి లో చదివాను మేడం. పి. జి. లో గోల్డ్ మెడల్ వచ్చింది మేడం” చాలా నెమ్మదిగా చెప్పింది.
“గుడ్. కంగ్రాట్స్” అంది నీలవేణి. తర్వాత మరో రెండు ప్రశ్నలు వేసి, ఆమె సమాధానాలకి సంతృప్తిగా నవ్వింది నీలవేణి. ఇంటర్వ్యూ బోర్డు మెంబర్లు అందరూ, గోల్డ్ మెడలిస్ట్ కీర్తనకే జాబు ఇవ్వాలని తీర్మానించారు. కీర్తనని పిలిచి “నువ్వు సెలెక్ట్ అయ్యావు” అని చెప్పారు ప్రిన్సిపాల్.
“థాంక్స్ మేడం “ అంది కీర్తన ప్రిన్సిపాల్ కి నమస్కరించి.
“కంగ్రాట్స్” అని నీలవేణి, కీర్తనకి షేక్ హ్యాండ్ ఇచ్చింది.
“థాంక్స్ మేడం” అంది చిన్నగా నవ్వుతూ కీర్తన.
మర్నాడే వచ్చి కాలేజీ లో డ్యూటీలో చేరింది కీర్తన. స్టాఫ్ రూమ్ లో నీలవేణి పక్క సీటే కీర్తనది. క్లాసులు లేనప్పుడు నీలవేణి, కీర్తన కబుర్లు చెప్పుకునేవారు. నెల గడిచింది. ఇద్దరి మధ్యా చనువు ఏర్పడింది.
ఒకరోజు లంచ్ టైం లో స్టాఫ్ బయటకు వెళ్ళారు. నీలవేణి, కీర్తన ఇద్దరే ఉన్నారు రూములో.
“మీది అసలు ఏ ఊరు? ఇక్కడకు ఎప్పుడు వచ్చారు? మీ తల్లి తండ్రులు ఎవరు?” ఆసక్తిగా అడిగింది నీలవేణి.
“మాది శివపురం మేడం. మా నాన్నకి రైస్ మిల్ ఉండేది. నేను డిగ్రీ చదువుతుండగా మా మిల్ మేనేజర్, భాగస్తులు కలిసి మోసం చేసి మా మిల్లుని స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకులో తెచ్చిన అప్పుకి మా నాన్న హామీగా ఉన్నారు. చివరికి ఇల్లు అమ్మి బ్యాంకు అప్పు తీర్చారు. ఎంతో గొప్పగా బతికిన మా నాన్న అక్కడ ఉండలేక రాజమండ్రి వచ్చి ఒక బట్టలకొట్టులో గుమాస్తాగా చేరారు. అక్కడ నేను పి. జి. చేసాను. స్నేహితులు నమ్మించి మోసం చేసినందుకు నాన్న చాలా బెంగపెట్టుకుని, ఆరోగ్యం పాడుచేసుకున్నారు. ఆరు నెలల క్రితం నాన్న ట్రీట్మెంట్ కోసం విజయవాడ వచ్చాము. కొన్నాళ్ళు ఒక కాన్వెంట్ లో పనిచేసాను. మీ కాలేజీ ప్రకటన చూసి అప్లై చేసాను. భగవంతుడి దయ వలన ఈ జాబు వచ్చింది” అంది కీర్తన.
“మీ నాన్నగారి పేరు.. ?” అడిగింది నీలవేణి.
“నాగ భూషణ రావు” అంది నెమ్మదిగా కీర్తన.
తన ఊహ నిజం అయ్యినందుకు సంతోషించింది నీలవేణి. ఇంటర్వ్యూ రోజునే కీర్తనలో తన అన్నగారి పోలికలు చూసి ఆశ్చర్యపోయింది. వెంటనే అడిగితె బాగుండదని ఇన్ని రోజులూ ఆగింది. అన్నగారి ఆర్ధిక పరిస్థితులు బాగో లేనందుకు దిగులు పడింది నీలవేణి.
సాయంత్రం భర్తతో “ఏమండీ కీర్తన మా అన్నయ్య గారి అమ్మాయే. ఈరోజు నిర్ధారించుకున్నాను. అన్నయ్య పరిస్తితి ఏం బాగాలేదు” అని కీర్తన చెప్పిన విషయాలు అన్నీ చెప్పింది. సుధాకర్ కూడా బాధ పడ్డాడు. ఆ రాత్రి వెంకటేష్ తో మాట్లాడింది నీలవేణి. ఆమె చెప్పిన దానికి ‘అలాగే’ అన్నాడు వెంకటేష్.
ఒక ఆదివారం ఉదయం కారులో భర్తతో కలిసి, కీర్తన చెప్పిన అడ్రస్ కి వెళ్ళింది నీలవేణి. కీర్తన సాదరంగా ఆహ్వానించి “నాన్నా ఈవిడ, వేణి గారని మా కాలేజీ లో సీనియర్ లెక్చరర్. చాలా మంచి ఆవిడ” అని తండ్రికి పరిచయం చేసింది.
చిక్కిపోయి కుర్చీలో ఉన్న అన్నగారిని చూసి ఒక్కసారిగా ఘోల్లుమని అతని కాళ్ళమీద పడింది నీలవేణి. సుధాకర్ ఆమెని అనునయిస్తున్నాడు. నాగ భూషణం కళ్ళనుండి రెండు కన్నీటి బొట్లు రాలాయి. చెల్లెలు భుజం పట్టుకుని “లే తల్లీ” అన్నాడు నాగ భూషణం. వంటింట్లో నుండి మధ్య గదిలోకి వచ్చిన నిర్మల, ఆడపడుచుని, సుధాకర్ ని చూసి ఆనందపడింది.
గబ గబా వచ్చి “బాగున్నావా నీలవేణి?” అని తన చీర చెంగుతో ఆమె కళ్ళు తుడిచింది. వదిన గారిని కౌగలించుకుని మరోసారి దుఃఖపడింది నీలవేణి. సుధాకర్, నాగభూషణం పక్కన ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. కీర్తనకి ఇదంతా ఏమీ అర్ధం కాక అయోమయంగా చూస్తోంది.
నిర్మల కూతుర్ని దగ్గరకు పిలిచి “మీ మేడం ఎవరో కాదు. నీ మేనత్త. మీ నాన్న చెల్లెలు” అంది మురిపెంగా. నీలవేణి, కీర్తనని దగ్గరకు తీసుకుని నుదిటి మీద ముద్దు పెట్టుకుంది. కొద్దిసేపటికి అందరూ స్తిమితపడ్డారు. కీర్తన కాఫీలు తీసుకు వచ్చి నీలవేణికి సుధాకర్ కి ఇచ్చింది.
“నీకు పిల్లలు ఎంతమంది?” అడిగింది నిర్మల.
“ఒక్కడే అబ్బాయి. పేరు వెంకటేష్. చెన్నై లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. సంవత్సరానికి అరవై లక్షల జీతం” అంది నవ్వుతూ నీలవేణి.
కాసేపు కబుర్లు అయ్యాక “అన్నయ్యా నిన్ను ఒక వరం అడగాలని వచ్చాను” అంది నీలవేణి.
“నేను నీకు వరాలు ఇచ్చే స్థితిలో ఉన్నానా అమ్మా?” అన్నాడు బాధగా నాగభూషణం.
“నానమ్మ ఒక మాట అంటూ ఉండేది. బంధాలు ఎప్పుడూ ఒక తరంతో ఆగిపోకూడదు అని. అందుకే కీర్తనని నా ఇంటి కోడలుగా ఇమ్మని నిన్ను అడుగుతున్నాను“ అంది నీలవేణి అన్న గారి రెండు చేతులూ పట్టుకుని.
ఆమె మాటలకి నాగభూషణం మనసు బాధగా మూలిగింది. తను ‘ఛీ’ కొట్టినా, అవన్నీ మర్చిపోయి పెద్దమనసుతో చెల్లెలు తనతో సంబంధం కలుపుకోవడానికి వచ్చింది. ఎంత మంచి మనసు ఆమెది. తను ఆరోజు ఆవేశంలో తొందరపడ్డాడు. మమతలు, రక్త సంబంధం అన్నీ మరిచిపోయి దురుసుగా ప్రవర్తించాడు.
కళ్ళు మూసుకుని మనసులోనే పశ్చాత్తాపం చెందాడు.
“అలాగే నీ ఇష్టం తల్లీ. నేను మమతలు తెంచుకోవాలనుకున్నాను. నువ్వు మమతల పందిరి అల్లాలని కంకణం కట్టుకున్నావు. నానమ్మ లాగే నీది ‘మంచి మనసు’ తల్లీ” అన్నాడు నాగభూషణం ఆనందంగా.
‘రావే కోడలు పిల్లా’ అంటూ కీర్తనని పిలిచేసరికి, సిగ్గుల మొగ్గ అయ్యింది కీర్తన.
*****
M R V సత్యనారాయణ మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం : సత్యనారాయణ మూర్తి M R V
ఎమ్. ఆర్. వి. సత్యనారాయణ మూర్తి. పెనుగొండ. పశ్చిమ గోదావరి జిల్లా. కవి, రచయిత, వ్యాఖ్యాత, రేడియో ఆర్టిస్టు. కొన్ని కథల పుస్తకాలు, కవితల పుస్తకాలు ప్రచురితం అయ్యాయి. కొన్ని కథలకు బహుమతులు కూడా వచ్చాయి. రేడియోలో 25 కథలు ప్రసారమయ్యాయి. 20 రేడియో నాటికలకు గాత్ర ధారణ చేసారు. కవితలు, కథలు కన్నడ భాషలోకి అనువాదం అయ్యాయి.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
@mrvsmurthy311
• 1 hour ago
చాలా బాగా చదివారు.. రచయిత భావాలను మీ గొంతులో చక్కగా పలికించారు.. ధన్యవాదాలు మేడం