top of page
Writer's pictureNeeraja Prabhala

మమతల పొదరిల్లు



'Mamathala Podarillu' - New Telugu Story Written By Neeraja Hari Prabhala

Published In manatelugukathalu.com On 08/05/2024

'మమతల పొదరిల్లు' తెలుగు కథ

రచన: నీరజ హరి ప్రభల 

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్




"ఏమోయ్ ! ఏంటి ఈరోజు స్పెషల్ ? వంటలు ఘుమ ఘుమ లాడుతున్నాయి ?" ఆఫీసు నుంచి అప్పుడే వచ్చిన రవి అడిగాడు భార్య సరోజను. 


" చెప్పుకోండి చూద్దాం" అని కాఫీ తీసుకొచ్చి భర్త చేతికందిస్తూ చిలిపిగా అంది సరోజ. 


 "ఏమై ఉంటుందబ్బా! నీ పుట్టినరోజు కాదు, మన పెళ్లి రోజు కాదు, పోనీ మన శోభనం రోజా? చెప్పు, సెలబ్రేట్ చేసుకుందాం". అని భార్య బుగ్గ మీద చిటికె వేసి కొంటెగా అడిగాడు రవి. 


"ఛీ ! మీ కెప్పుడూ అదే యావ. ముగ్గురు అల్లుళ్ళు వచ్చినా ఇంకా మీరు కొత్త పెళ్లికొడుకుల్లా ఏంటి? ఎవరన్నా వింటే నవ్విపోతారు " అంది సిగ్గుల మొగ్గవుతూ ఎరుపెక్కిన బుగ్గలతో సరోజ. 


కెంపెక్కిన భార్య ముఖారవిందాన్ని తనివితీరా వీక్షిస్తూ దగ్గరకు తీసుకుని "అబ్బ! ఈ సస్పెన్స్ ఏంటోయ్. నేను మళ్ళీ తండ్రిని అవుతున్నానా? ", అన్న రవి కొంటె ప్రశ్నకు " ఆశ, దోశ అప్పడం. ఇంకా ఈ వయసులో కూడా పిల్లలను కందామనే. మీరు తాత కాబోతున్నారు. ఉదయమే రమ్య చెప్పింది" అంది సరోజ. 


"తన పెద్ద కూతురు రమ్య తల్లి కాబోతోంది" అన్న ఆనందంతో మరింతగా భార్యను ప్రేమగా కౌగిలి లోకి తీసుకున్నాడు రవి. గువ్వలా ఒదిగి పోయింది సరోజ. 

 

వాళ్ళ ముగ్గురు అమ్మాయిలైన రమ్య, సౌమ్య, దివ్య 

లను సాఫ్టువేర్ ఇంజనీర్లను చేసి, విదేశాల్లో స్థిరపడిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్లకు ఇచ్చి ఘనంగా పెళ్లి జరిపించాడు బాంక్ మేనేజర్ రవి. "చింతలేని కుటుంబం, ముచ్చటైన జంట" అని తెలిసిన వాళ్ళందరూ వీళ్ళని గురించి అనుకునే నానుడి. 


 ఆ మరుసటి రోజు రవీ వాళ్లు అమెరికా లో ఉన్న రమ్యకు, వాళ్ళాయనకు వీడియో కాల్ చేసి అభినందనలు చెప్పి, తగిన జాగ్రత్తలు చెప్పటం చేశారు. సిటిజన్ షిప్ కోసం అక్కడే డెలివరీ అని, పాస్పోర్ట్, వీసా దాని ఎరేంజ్ మెంట్స్ అన్నీ చకచకా సరోజ కు జరిగిపోయాయి. రవికి ఆఫీసులో అన్ని నెలలు లీవు దొరకక ఇక్కడే ఉందామనుకున్నాడు. కాలం చాలా వేగంగా కదులుతోంది. చూస్తూ ఉండగానే నెలలు నిండి డెలివరీ డేట్ దగ్గర పడుతోంది. 


సరోజ అమెరికా ప్రయాణం ఇంక రెండు రోజులు ఉందనగా రవికి కావలసిన వన్నీ పచ్చడులు, పొడులూ అన్నీ ఏర్పాట్లు చేసి, అక్కడ కూతురికి, అల్లుడికీ కావలసిన వన్నీ చూసి, ఆరునెలల వరకూ భర్త ను వదిలి ఉండాలి అన్న బెంగ మనసులోనే దాచుకుని, పైకి తెచ్చి పెట్టుకున్న గాంభీర్యంతో క్షణం ఊపిరి సలపనంతగా అన్నీ తానే అయి హుందాగా తిరుగుతోంది సరోజ. తను దిగులు పడితే రవి ఇంకా డీలా అయిపోయి తిండి కూడా సరిగ్గా తినక ఆరోగ్యం పాడుచేసుకుంటాడు అని.. ఏమాత్రం దిగులు కనపడక హుషారుగా తిరుగుతున్న భార్యను చూసి ఆశ్చర్య పడుతూ "ఈ ఆడవాళ్ళు ఇంతే. అమ్మమ్మలు అవుతున్నారు అంటే వీళ్ళకు భర్త గురించి ఆలోచన లు ఉండవు. వీళ్ళకు పిల్లలు, వాళ్ళ బాధ్యతలే ఎక్కువ " అని అనుకున్నాడు రవి. 

 

తెల్లవారితే సరోజ అమెరికా ప్రయాణం. ఆ రాత్రి భర్త ఒడిలో తల పెట్టుకొని " మిమ్మల్ని వదిలి నేను మాత్రం ఆరు నెలలు ఉండగలనా ! చెప్పండి. మీ మగవాళ్ళు బయట పడతారు. మా ఆడవాళ్లు పైకి చెప్పలేరండీ. ఈ సమయంలో తల్లిగా బాథ్యతలు గుర్తుచేస్తాయండి. అయినా నేను దిగులు పడితే మీరు మరింత క్రుంగిపోయి మీ ఆరోగ్యం చెడగొట్టుకుంటారు. అందుకే నేను ఇలా ఉన్నాను. " అని కంటతడి పెట్టిన సరోజను దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు రవి. 


సరోజ ను అమెరికా పంపించి ఆఫీసు పనుల ఒత్తిళ్లతో ఏదో వంట చేసుకుంటూ రోజులు భారంగా నెట్టుకొస్తున్నాడు రవి. రమ్య కు డెలివరీ అయి పండంటి కొడుకు పుట్టాడు. వీడియో కాల్ చేసి భార్యను, కూతురిని, మనవడిని చూసి మురిసిపోతున్నాడు రవి. 


ఆరు నెలలకు ఇంకా 4 రోజుల ముందే సరోజ ఇండియాకు వచ్చింది. రవి ఆనందానికి అంతులేదు. ఆ తర్వాత 7 సం. లలో సౌమ్య, దివ్య లకు కూడా ఇలాగే వాళ్ల దేశాలకు వెళ్లి పురిటి కార్యక్రమాలు నిర్వర్తించి తల్లిగా తన బాధ్యతలను నెరవేర్చింది సరోజ. 


 ఈ లోగా కాలంలో మార్పులు లాగానే రవి వాళ్ళ జీవితాలలో కూడా చాలా మార్పులు జరిగాయి. రవి రిటైర్ అయ్యాడు. వయసుతో పాటే అతనికి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చి ఎంత వైద్యం చేసినా ఫలితం లేక ఒకరోజు అతను ఈ లోకం నుండి శెలవు తీసుకున్నాడు. కూతుర్లు, అల్లుళ్ళు వచ్చారు. తండ్రి పోయిన బాథలో వాళ్లు, భర్త పోయిన బాథలో సరోజ ఉన్నారు. జరగాల్సిన కార్యక్రమాలన్నీ సజావుగా జరిగాయి. 


తల్లిని తమతో తీసుకుని వెళతామన్న తమ నిర్ణయాన్ని సరోజకు చెపితే "తన భర్త ప్రేమతో కట్టిన ఈ ఇంటిని వదిలి రాలేను. ఆయన జ్ఞాపకాలతో ఇక్కడే శేషజీవితం గడుపుతాను' అని తన స్థిర నిర్ణయాన్ని చెప్పింది సరోజ. 


ఇంక చేసేది లేక వాళ్లు వాళ్ళ దేశాలకు వెళ్ళిపోయారు. మొదట్లో ప్రతిరోజూ విథిగా ఫోన్లు చేసి గంటల కొద్దీ తల్లితో మాట్లాడే కూతుర్లు క్రమేపీ తగ్గిస్తూ 15 రోజులకు ఒక మారయ్యి, ఇప్పుడు నెలకో సారి మాత్రమే అదీ ఏదో తప్పనిసరి అన్నట్లుగా మాట్లాడుతున్న వాళ్ళ ప్రవర్తనకు మొదట బాధ అనిపించినా "వాళ్ళ ఉద్యోగం, భర్త, పిల్లల బాధ్యతలతో వాళ్ళు సతమతమవుతూ ఉండుంటారు, అయినా వాళ్లు పాపం చిన్న పిల్లలు" అని తన తల్లి మనసుకు సర్ది చెప్పుకుంది సరోజ. 


 కొన్నాళ్లకు సరోజ కు బాగా జబ్బు చేసింది దానికి తోడు భర్త దూరమైన మానసిక బెంగ. పిల్లల నిరాదరణ ఇంకా మనిషిని కుంగదీశాయి. మనోవ్యాధికి మందు లేదు కదా! పిల్లలకు తెలిసి వచ్చి మొక్కుబడిగా పలకరించి ఏదో వైద్యం చేయించి ట్టుగా చేసి ఒక నెల రోజులు ఉన్నారు. 


 ఈ నెల రోజుల్లో ఆ ఇల్లు అమ్మకా నికి పెట్టి తల్లి సంతకం కోసం వత్తిడి తెచ్చి "నీకు ఏ లోటూ రాకుండా మాతో తీసుకెళ్ళి నిన్ను కంటికి రెప్ప లాగా చూసుకుంటాము. మా వద్దకు రావడం నీకు ఇష్టం లేకపోతే నీకు నచ్చిన ఆశ్రమంలో చేర్పిస్తాము. హాయిగా 'క్రృష్ణా! రామా!' అనుకుంటూ నీ శేష జీవితం గడపవచ్చు " అన్న వాళ్ళ నిర్ణయాన్ని విని ఏ మాత్రం ఆశ్చర్యం పోలేదు సరోజ. భర్త తదనంతరం వాళ్ళతో ఎంతో లోతైన జీవితాన్ని, నిరాదరణను చూసిన తన అనుభవం ఆ మాత్రం గ్రహించకలేక పోలేదు. 


 ఆ మరునాడు తనకు తెలిసిన లాయర్ ను పిలిచి కూతుర్లు, అల్లుళ్ళను పిలిచింది. హఠాత్తుగా లాయర్ రాక వాళ్ళకు మింగుడు పడలేదు. "వాళ్ళ వాటాలు వాళ్ళకు పంచుతుందేమో" అని ఎవరి కి వాళ్ళు మనసులో అనుకుని కూర్చున్నారు. 


నిశ్శబ్దంగా ఉన్న హాలులో సరోజ అందరి వేపూ చూస్తూ లాయర్ ను ఉద్దేశించి సంబోధిస్తూ " "చూడండి లాయర్ గారూ! శ్రధ్ధ గా వినండి పిల్లలు, అల్లుళ్ళు. ఇది నా దృష్టిలో ఇటుకలు పేర్చి సిమెంటు తో కట్టిన ఇల్లు కాదు. నా భర్త ప్రేమానురాగాలతో కట్టిన ఒక పవిత్రమైన దేవాలయం. అందమైన తాజ్ మహల్. మమతల పొదరిల్లు. ఆశల హరివిల్లు. దీనిని మంచి ధర పలికే ఆస్తిగా నేను, నా భర్త ఏనాడూ భావించలేదు. నా ముగ్గురు పిల్లలు ఈ ఇంట్లో లక్ష్మీ, పార్వతి, సరస్వతి గా పుట్టి పెరిగి నడిచిన బంగారు కోవెల. నా ప్రాణమైన నా భర్త బాహ్యంగా లేక పోయినా సజీవంగా నా తోనే ఈ గ్రృహ మందిరం లోనే దేవుడిగా కొలువై యున్నారు. అందుకని ఈ మందిరాన్ని నేను అనాధ శరణాలయానికి నా ఇష్టపూర్వకంగా వ్రాసి రిజిష్టర్ చేస్తున్నాను. నాలాంటి ఎందరో నిర్భాగ్యులకు ఇది ఆశ్రయం కావాలి. అమ్మే హక్కు లేకుండా అందుకు తగిన ఏర్పాట్లు చేసి వీలునామా వ్రాయండి లాయర్ గారూ" అన్న సరోజ మాటలకు ముఖాన నెత్తురు చుక్క లేకుండా నల్లగి మాడిపోయినవి వాళ్ళ 

ముఖాలు. 

 

 అంత గంభీరంగా, నిశ్శబ్దంగా ఉన్న ఆ వాతావరణాన్ని భంగ పరుస్తూ " శభాష్ ! సరోజమ్మా! దేవత లాంటి నీ మంచి మనస్సును, నీ మంచి నిర్ణయాన్ని మెచ్చుకోకుండా ఉండలేకున్నానమ్మా! కాసులకు కక్కుర్తి పడి ప్రాణాలు తీసి, శవాల మీద కూడా డబ్బులు ఏరుకునే ఈ కలి కాలంలో నీలాంటి మానవతా మూర్తులుండ బట్టే ఇంకా కాస్త అన్నా ధర్మం నిలబడుతోంది. " అని పెద్దగా చప్పట్లు చరిచి అభినందనలు తెలిపాడు లాయర్. 


"రేపే అన్ని ఏర్పాట్లు చేసి మీ వద్దకు వస్తాను. మరి శెలవు. ఉంటానమ్మా! " అని నమస్కరించి వెళ్ళాడు లాయర్ సుదర్శనం. 


 సరోజ ఒక మంచి పని చేశానన్న తృప్తితో గదిలోకి వెళ్ళి హాయిగా విశ్రాంతి తీసుకుంది. 

   ….సమాప్తం.


నీరజ హరి ప్రభల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ నీరజ హరి ప్రభల గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


 మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

 గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం :

Profile Link:

Youtube Play List Link:


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి  బిరుదు పొందారు



"మన తెలుగు కధలు " వేదిక మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నీరజ ప్రభల. నాది చాలా చిన్న కుగ్రామంలో చాలా సాంప్రదాయ కుటుంబంలో జననం. అగ్రహారం. నాన్న గారు బాలకృష్ణ మూర్తి గారు బ్రాంచి పోస్ట్ మాస్టర్, వ్యవసాయ దారుడు, పంచాయతీ ప్రెసిడెంట్. అమ్మ కమల గృహిణి . మేము ఆరుగురం సంతానం. నాకు ముగ్గురు అక్కయ్యలు, ఇద్దరు అన్నయ్యలు. అందరిలోకీ నేనే ఆఖరిదాన్ని. చిన్న దాన్ని. నాకు చిన్న వయసులోనే వివాహం. మేము విజయవాడలో ఉంటాము. నేను గృహిణిని. మా వారు వాసుదేవశర్మ. రిటైర్డ్ లెక్చరర్. మాకు ముగ్గురు అమ్మాయిలు. మా కూతుళ్ళు, అల్లుళ్ళు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా డెన్మార్క్ , అమెరికాలలో సెటిలయ్యారు. మా ముగ్గురు అమ్మాయిలు చిన్నప్పటి నుంచీ కర్ణాటక సంగీతం నేర్చుకుని అనేక పోటీలలో గెలుపొంది , ప్రతి సం.. త్యాగరాజ ఉత్సవాలలో కచేరీలు చేసి ప్రముఖ విద్వాంసుల ప్రశంసలు పొందటం నా అదృష్టంగా ఎల్లప్పుడూ భావిస్తాను. అంతేకాకుండా పాడుతా తీయగా, పాడాలనుంది, రాగం- సంగీతం మొ.. ప్రోగ్రాములలో పాల్గొని పెళ్ళైనాక కూడా విదేశాల్లో కచేరీలు చేస్తూ అందరిచే ప్రశంసలు పొందుతున్నారు. ప్రస్తుతం మాకు ఇద్దరు మనవరాళ్ళు, ఒక మనవడు. నాకు చదువంటే చాలా చాలా ఇష్టం. పిల్లలు సెటిలయ్యాక B.Com, MA సంస్కృతం, MAఇంగ్లీష్, MA తెలుగు చేశాను. సంగీతం - సాహిత్యం నాకు ప్రాణం. సంగీతం నేర్చుకున్నాను. ఇప్పుడు వీణ కూడా నేర్చుకుంటున్నాను. టైపు, షార్ట్ హాండ్ ప్రధమ శ్రేణి లో ఉత్తీర్ణత. కధలు-కవితలు వ్రాస్తాను. మీ అందరి ప్రోత్సాహంతో కధలు, కవితలు వ్రాస్తున్నాను . నాకధలు లోగడ పత్రికలలో కూడా ప్రచురితమైనవి. గార్డెనింగ్, స్టిచింగ్, అల్లికలు, సాఫ్ట్ టాయ్స్ బొమ్మలు, డ్రాయింగ్ , ఫాబ్రిక్ పెయింటింగ్, రంగవల్లులు, క్రియేటివ్ ఆర్టికిల్స్ తయారీ మొ.. నా హాబీ. అమ్మ , నాన్న గారు స్వర్గస్ధులయ్యి 10 సం.. అయినది. నాకు నా మాతృభాష తెలుగు అంటే చాలా చాలా ఇష్టం, అభిమానం‌, గౌరవం. ఈ వేదిక మీద మిమ్మల్నందరినీ పరిచయం చేసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నా కధలను ఆదరించి ప్రోత్సాహిస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు.🙏🙏




57 views0 comments

Comments


bottom of page