'Mamjee Nakoddu Pelli' - New Telugu Story Written By Ch. C. S. Sarma
Published In manatelugukathalu.com On 27/08/2024
'మాంజీ!... నాకొద్దు పెళ్ళి!!' తెలుగు కథ
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
"శీనూ!.... ఇదేరా నా యిల్లు!" వాకిట ముందు నిలబడి చెప్పాడు ఆంజనేయులు.
"ఆహో!.... అంజి! బయట నుంచి చూచేదానికి చాలా బాగుందిరా!" చిరునవ్వుతో చెప్పాడు శ్రీనివాసమూర్తి.
"ఆ.....ఆ.... బయటికి చూచేదానికే కాదు లోపల కూడా బాగానే వుంటుంది" అన్నాడు ఆంజనేయులు.
"అద్దె ఎంత?"
"ఆరువేలు. పద లోనికి వెళదాము!"
శీనూ, అంజి ఒకే వూరివారు. బంధువులు. అంజికి వివాహం ఆరునెలల క్రిందట జరిగింది. వారి అర్థాంగి పేరు ప్రశాంతి. బి.ఎ వరకు చదివింది.
మిత్రులు ఇరువురూ ఇంట్లోకి ప్రవేశించారు.
హాల్లో....
ప్రశాంతి, ఆమె ముగ్గురు స్నేహితురాండ్రు సోఫాలో కూర్చొని వున్నారు. ఏదో జోక్‍ను పేల్చింది ప్రశాంతి. నలుగురూ గలగల నవ్వుతున్నారు.
ఆ స్నేహితురాండ్ర పేర్లు.... సంపంగి, మల్లి, మనోరమ...
వారి నవ్వును విని మిత్రులు ఇరువురూ ఆశ్చర్యంగా వారినే చూస్తూ వుండిపోయారు.
"ఆయన ఎవరు అంజి!" అడిగింది ప్రశాంతి.
"నా బంధువు... మిత్రుడు. మొన్ననే నా ఆఫీసుకు ట్రాన్స్ ఫర్‍లో వచ్చాడు."
"పెళ్ళి అయ్యిందా!"
"కాలేదు!"
"పేరేమిటి?"
"శ్రీనివాసమూర్తి. నేను శీను అని పిలుస్తాను"
"నాకు ఆ వివరాలు అనవసరం. వెళ్ళి టీపెట్టి తీసుకురా!.... త్వరగా!" అంది ప్రశాంతి.
బిక్కముఖంతో తలాడించాడు అంజి.
ఆశ్చర్యంతో అంజి ముఖంలోకి చూచాడు శ్రీనివాసమూర్తి.
"ఏం ఇంకా నిలబడే వున్నావు. త్వరగా వెళ్ళు వంటగదికి" ఆదేశించింది ప్రశాంతి.
ఆంజనేయులు ఉలిక్కిపడ్డాడు. శీను ముఖంలోకి చూచి....
"రారా!....." అన్నాడు.
ఇరువురూ వంటగదిలో ప్రవేశించారు.
శీనూ మస్తిష్కంలో అంజి వివాహ జీవితాన్ని గురించి కొన్ని ప్రశ్నలు.
"ఒరేయ్! అంజీ!..."
"ఏమిట్రా!...."
"మీ ఆవిడ తన స్నేహితురాండ్రతో చాలా బిజీగా ఉంది కదూ!"
"అవునురా!"
"నేనో ప్రశ్న అడుగుతాను తప్పుగా అనుకోవుగా!"
"నీవు నా ప్రాణమిత్రుడివి. నిన్ను నేను తప్పుగా ఎందుకు అనుకొంటానురా! అడుగు."
"ఒరే! ఆఫీస్ నుంచి వచ్చిన నీకు తాను టీ, కాఫీ ఇవ్వాలి గాని.... నిన్ను టీ పెట్టి తీసుకురా అని ఎందుకన్నట్లు?" తన మొదట సందేహాన్ని బయటపెట్టాడు శీను.
అంజి స్టవ్ వెలిగించాడు. గిన్నెలో నీళ్ళు పోసి దానిపైన వుంచాడు. మిత్రుని వైపుకు తిరిగాడు.
"శీనూ!..."
"ఆ... చెప్పు"
"మా అబ్బకు కట్నం ఆశ. మూడు లక్షలు మా ఆవిడ నాన్న గారి దగ్గర నుంచి తీసుకున్నాడు. అంటే నన్ను మూడు లక్షలకు అమ్మేశాడురా!"
"ఏమన్నావ్!" ఆశ్చర్యపోయాడు శ్రీనివాసమూర్తి.
"నన్ను నా భార్యకు అమ్మేశాడు మా నాయనగాడు. దాని ఫలితమే ఇది. టీ పెట్టడమే కాదు వంటా వార్పూ, ఇల్లు చిమ్మడం (తలుపు బిగించి) బట్టలు ఉతకడం అంతా నా పనే. నా యీ బాధలను నేను ఎవరికీ చెప్పుకోలేను. చెప్పుకొంటే పరువు పోతుందిగా! ఆడవారి మూలంగా డబ్బును ఆశించిన వారి జీవితం ఇలాగే వుంటుందేమో! ముఖ్యంగా మరో విషయం. మా అత్తగారు దుర్గాదేవి ప్రతిరోజు నా భార్యకు ఫోన్ చేసి ఇంజకేషన్ అంటే నన్ను ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలో చెబుతూ వుంటుంది. ఇంతెందుకు రాత్రిపూట పడకపై పడుకోవడం కూడా తన ఇష్ట ప్రకారమే జరగాలిరా. నా బ్రతుకును మా నాయన నాశనం చేశాడురా!..." ఎంతో విచారంగా చెప్పాడు ఆంజనేయులు.
"అంజీ!.... టీ ఇంకా రెడీ కాలేదా!" ప్రశాంతి నోటినుంచి ఒక గావుకేక.
"ఆ....ఆ.... అయ్యింది తెస్తున్నా!" అదే స్థాయిలో ఆంజనేయులు జవాబు.
శ్రీనివాసమూర్తికి చెమటలు పెట్టాయి.
"ఒరే అంజీ! ఇక నే వెళతాను. నీవు పుట్టెడు బురదలో వున్నావు. నావలన నీవు మాట పడకూడదు" వేగంగా అంజి పిలుస్తున్నా ఆగకుండా శీను వారి ఇంటి నుంచి బయటపడ్డాడు.
*
ఆరునెలల తర్వాత....
మేనమామ సి.పి. (చింతాకుపొడి) సుబ్బరామయ్య గారి ఆధ్వర్యంలో శ్రీనివాసమూర్తికి పెండ్లి చూపులు.... శ్రీనివాసమూర్తి గారి వూరు విజయవాడ.
అమ్మాయి ప్రశాంతి చెల్లెలు. పేరు బంతి.
ఆ పెండ్లి చూపుల సందర్భంలో శ్రీనివాసమూర్తి పెండ్లి కూతురు ప్రక్కన ప్రశాంతి చూచాడు. శీను కడుపు నిండిపోయింది.
"ఇంటికి వెళ్ళి ఫోన్ చేస్తాము"
అమ్మాయి తల్లిదండ్రులకు చెప్పాడు చింతాకుపొడి సుబ్బరామయ్య.
శ్రీనివాసమూర్తి, సి.పి సుబ్బరామయ్య, మూర్తి తల్లిదండ్రులు బస్టాండు చేరారు.
ప్రశాంతిని చూడగానే శ్రీనివాసమూర్తికి తాను ఆంజనేయులు ఇంటికి వెళ్ళడం, అతను తనకు చెప్పిన మాటలు, ప్రశాంతి భర్తను గౌరవించే విధానం కళ్ళకు ద్యోతకమైంది.
"ఏరా శీనూ! పిల్ల చాలా బాగుంది కదూ! నీకు నచ్చిందా!" చిరునవ్వుతో అడిగాడు సి.పి సుబ్బరామయ్య.
"మామో...! నాకొద్దు ఈ పెళ్ళి.... నీకు నీవు చూపించిన పెళ్ళి కూతురికి శతకోటి వందనాలు. నేను వెళుతున్నా" ఉద్యోగం చేసే నెల్లూరు బస్సు వైపుకు పరుగుతీశాడు శ్రీనివాసమూర్తి.
సి.పి సుబ్బరామయ్య,శీనూ తల్లిదండ్రులు గుంటూరు బస్టాండులో శీనూ మాటలకు ఆశ్చర్యంతో నిలబడిపోయారు.
*
సమాప్తి
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.
Comments