#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #మనమామిడిపండ్లు, #ManaMamidiPandlu, #Orphans, #అనాథపిల్లలు

గాయత్రి గారి కవితలు పార్ట్ 6
Mana Mamidi Pandlu - Gayathri Gari Kavithalu Part 6 - New Telugu Poems Written By - T. V. L. Gayathri Published In manatelugukathalu.com On 21/03/2025
మన మామిడి పండ్లు - గాయత్రి గారి కవితలు పార్ట్ 6 - తెలుగు కవితలు
రచన: T. V. L. గాయత్రి
మన మామిడి పండ్లు
మండు వేసవి కాలంబు మరల వచ్చె
ఫలము లందున మామిడి ఫలము రాజు
తీయ తీయని పండ్లను తృప్తి మీర
తినెడి వారిదే భాగ్యమీ దేశమందు //
ఆవకాయను బెట్టగా నతివ లిపుడు
సంత లందున జేరిరి సంతసముగ
మంచి మామిడి కాయల నెంచి చూచి
బేర మాడిరి వెలదులు విలువ తెలిసి.
ముక్క కొట్టించి నింటికి మోసుకొచ్చి
నావ కాయను బెట్టిరి 'యాహ!'యనుచు
క్రొత్త పచ్చడిన్ బెట్టుచు కొంతతీసి
వేడి యన్నము కలుపుచు వేడ్కతోడ
పిల్లలందరిని బిలిచి పెట్టిరపుడు.
ఆంధ్రజాతికి గర్వమీ యావకాయ.
తెలుగు వారిసత్కీర్తిని దిశల యందు
వ్యాప్తి చేసిన మామిడి పండ్ల రుచికి
వివిధ దేశాల వారును ప్రీతి చెంది
భరత భూమిని పొగడుచు 'భళి!భళి!యని
ధనము నిడుచుండి కొనుచుంద్రు ఘనముగాను.
కలిమి పంటయౌ ఫలములన్ గలుషితముగ
కృత్రిమరసాయనంబుల చిత్రమైన
పధ్ధతుల తోడ మగ్గించి వణిజులిపుడు
సంతలందున నమ్ముచు జనులనెల్ల
మోస పుచ్చుట వలననే ముప్పు వచ్చె!
బలము పెంచెడి మామిడి పండ్లు తినగ
జబ్బులెన్నియో వచ్చుట సత్యమాయె!
మందు జల్లుచు పండ్లను మగ్గబెట్టు
దోషులందరిన్ శిక్షించి దొరలు నేడు
మంచి పండ్లను ప్రజలకు పంచవలయు!//
************************************
అనాథపిల్లలు
(తేటగీతులు )

1.
తల్లిదండ్రులు లేరని తల్లడిల్లి
చిన్నపిల్లలనాథలై చితికిపోయి
మరచిపోయిరి బాల్యంపు మమతలకట!
కరుణ చూపెడి వారిల కరువుగాదె!
2.
గంజి దొరకని దినమున కంటనీరు
కడుపు నింపగా నొడిచేరు కలతనిదుర
రాటు దేలిన పసివారు 'త్రాహి!' యనుచు
కుమిలి పోవుచు నుందురు గూడులేక!
3.
పలుకరించగా రారమ్మ బంధుగణము!
మంచిచెడ్డలు జెప్పెడి మనిషిలేక
చదువు సంధ్యలు నేర్వక జనులమధ్య
బ్రతుకు చుందురు వీరిట్లు భయముతోడ!
4.
హీనగతిలోన పిల్లలు హేయమైన
జీవితంబును గడుపగా చివికిపోయి
భావి భారత పౌరులు బ్రతుకు నీడ్వ
పట్టదేలనో మనదేశ ప్రజలకెపుడు!
5.
మమత పంచి యనాథల మంచికోరి
వసతి చూపించి వారిని బాగుచేసి
చదువు సంధ్యలు చెప్పించి చక్కదిద్ది
బ్రతుకు నిలిపిన వెలుగులు పంచగలరు!//

టి. వి. యెల్. గాయత్రి.
పూణే. మహారాష్ట్ర.
Profile Link:
Comments