top of page
Writer's pictureAshok Anand

మానస సరోవరం


'Manasa Sarovaram' - New Telugu Story Written By Ashok Anand

'మానస సరోవరం' తెలుగు కథ

రచన: అశోక్ ఆనంద్


"వట్టి పిడికిలి బిగిస్తే ఉద్యమం, అదే ఒక పిడికిలి మధ్యలో ఇలా మరో ఐదు వ్రేళ్ళు చొరబడితే ప్రేమ" తన అరచేతిలో ఇమిడిపోయిన ఆరాధన చేతివ్రేళ్ళను చూస్తూ అన్నాడు అనిత్.

"ప్రేమ కంటే బలమైన ఉద్యమం ఉంటుందా?" సున్నితంగా అడిగింది ఆరాధన.

నవ్వులు. సూర్యోదయం. ఎదురుగా 'మానస సరోవరం.'

'తన కళ్ళను కౌగిలించుకునే ఉద్దేశ్యమే లేకపోతే, ఈ భూమిని వదిలి ఎన్నడో అనంతంలో కలిసిపోయేవాడిని' అన్నట్లుగా సూర్యుని వెచ్చని కిరణాలన్నీ ఆరాధన కనురెప్పలలో మమేకమైపోయాయి. కంటిలోని తెలుపు భాగమంతా సింధూరం అద్దుకున్న సూర్యోదయాల్లా మెరుస్తున్నాయి. కానీ ఆ విప్లవాన్ని మండించిన కారకుడు మాత్రం సూర్యుడు కాదు. తన కన్నీరు.

"ఇదే మనిద్దరం కలిసి చూస్తున్న చివరి సూర్యోదయం కదా! రేపు ఈ టైమ్ కి నేను ఆంధ్రా, నువ్వు చెన్నై" అంది ఆరాధన. తన కంటిని, పెదవిని జత చేసింది ఓ కన్నీటి బొట్టు.

ఆ బొట్టును మృదువుగా స్పృశిస్తూ, "కలవని దూరాలను కలిపేది ఈ కన్నీరే. కలవని దూరాలకు సంకేతం ఈ కన్నీరే." అన్నాడు అనిత్, తన వేదనకు చిహ్నంగా వేదాంతాన్ని వెతుక్కుంటూ. టిఫిన్ చేసి, వాళ్ళ హోటల్ రూంలోకి వెళ్ళిపోయారు ఇద్దరూ. వాళ్ళ మనసుల్ని ఆవరించిందో లేక ఆ గదిని ఆవరించిందో అర్థం కాని మౌనం, నిశ్శబ్దాన్ని శబ్దం చేస్తూ మరీ దండెత్తుతోంది. అప్పటికే వాళ్ళిద్దరూ ఆ దేశానికి వెళ్ళి పది రోజులౌతోంది. అనిత్ ఎక్కడున్నాడో వాళ్ళ ఇంట్లో తెలీదు. ఆరాధన మాత్రం జాబ్ సెర్చింగ్ పనిలో హైదరాబాద్లో ఉందని అనుకుంటున్నాడు సాగర్. ఆరాధన, సాగర్.. గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నారు. ఆరాధన కూడా ప్రేమలో ఉన్నాననే అనుకుంటుంది(?).

అనిత్ చిన్నప్పట్నుంచీ 'ప్రేమ' అనే పదానికి దూరపు బంధువే. తల్లిదండ్రుల దగ్గర గానీ, స్నేహితుల దగ్గర గానీ ఏ కేరింగ్ నూ చూడలేదు. అదే సమయంలో పరిచయమైంది ఆరాధన. అతని ముప్ఫై యేళ్ళ జీవితం వెనక్కి వెళ్ళిపోయి ముందే తను పరిచయం అయ్యుంటే బావున్నని అనిత్ భావించని క్షణం లేదు. ప్రేమంటే ఇలానే అనిపించే ఓ ఫీలింగ్. సినిమాల్లో చూపించినట్లు ఒకరికొకరు ఎదురవగానే గంటలు మ్రోగవు, ఆకాశంలో అద్భుతాలు జరగవు.

అసలు మొదటిచూపులో పుట్టేది ప్రేమ కానే కాదు. అది ఆకర్షణ మాత్రమే. మొదటిసారి చూసేయగానే నచ్చింది అంటే, ఏం నచ్చింది అని ఆలోచించేవాళ్ళు ఎంతమంది ఉంటారు? ఆలోచిస్తే అలా వాళ్ళకి నచ్చేది, ఆ అమ్మాయి మొహమో, అతను పూసుకున్న పెర్ఫ్యూమో, లేక.. వద్దులే చాలా వస్తాయి! నేను తనను మొహం (అందం) చూసి ప్రేమించలేదు అంటాడు ఓ అమర ప్రేమికుడు.

తొలిసారి ఓ మనిషిని చూసేటప్పుడు కనిపించేది మొహం కాదా? లేక మొహానికి మనసు అని మరో పేరు ఏదన్నా ఉందా? ఏమో.

రోజూ మాట్లాడే మనిషే అయినా ప్రేమ అనే భావన కలిగిన తర్వాత మాట్లాడుతున్నప్పుడు సముద్రపు అలల్లో శబ్దం సంగీతంలా వినిపిస్తుంది. రోజూ కలిసే మనిషే అయినా ప్రేమ అనే భావన కలిగిన తర్వాత ఎదురుగా నిల్చున్నప్పుడు కాంతి వేగంతో గుండె చప్పుడు పోటీ పడుతుంది. అర్థం కావడానికి సమయం పట్టేదే ప్రేమంటే. ఒకవేళ 'love at first sight' అనే మాట నిజమైతే, ఎందుకు నలుపుగా ఉన్న అమ్మాయిల్ని 'కొందరు' అబ్బాయిలు తొలిచూపులోనే ప్రేమించడం లేదు? ఎందుకు డబ్బుల్లేని అబ్బాయిల్ని 'కొందరు' అమ్మాయిలు ప్రేమించడం లేదు?

అంటే నలుపుగా ఉంటేనో, డబ్బు లేకపోతేనో, ఏ క్షయ లాంటి వ్యాధి ఉంటేనో, ఎత్తు పళ్ళు ఉంటేనో, పొట్టిగా ఉంటేనో.. ప్రేమించబడడానికి పనికిరారా? వాళ్ళ హృదయస్థానంలో రక్త మాంసాలు కాకుండా ఇనుప కవచాలు ఏమన్నా ఉంటాయా? అందం, ఆరోగ్యం, అంతస్థు ఇవన్నీ ఉన్నవాళ్ళే ప్రేమించబడడానికి అర్హులా? వింత మనుషుల వింత మాటల వింత మనస్తత్వాలు.

ఆరాధన నుంచి తాను అనుభవిస్తున్న ఆ ఆప్యాయతలో పరవశాన్ని పొందుతూ బ్రతుకుతున్నాడు అనిత్. అతనిపై ఆ కేర్ చూపించడంలో ఎంతో ఆనందాన్ని పోగుచేసుకుంటుంది ఆరాధన. ఆ బంధానికి వాళ్ళు ఏ పేర్లూ పెట్టుకోలేకపోతున్నారు. కారణం సాగర్. చైనా (మానస సరోవరం) నుంచి వాళ్ళ ఫ్లైట్ ఢిల్లీ చేరుకుంది. ఆ మౌనం ఇంకా దండయాత్రను ముగించలేదు. ఆ గడిచిన పది రోజుల్లో వాళ్ళ గత కాలపు జ్ఞాపకాలన్నీ ఊసులయ్యాయి. ఇప్పుడు, ఈ ఒక్కరోజులో ఆ ఊసులన్నీ జ్ఞాపకాలవ్వడం వాళ్ళిద్దరికీ ఇష్టం లేదనుకుంటా. ఢిల్లీ నుంచి హైద్రాబాద్ ఫ్లైట్ ఎక్కారు.

ఈ ఇద్దరూ కలిసి బ్రతకడంలో 'బ్రతకడాన్ని' వెతుక్కుంటున్నారు. కానీ కలిసి బ్రతకడం జరగదని కూడా తెలుసు. ఈ విశ్వంలో 'స్పందన' (act) అనేది ఉండదు, ప్రతిస్పందన (react) మాత్రమే ఉంటుంది. సృష్టి ఆదిలో జరిగిన ఓ మాయా స్పందనకి ఇప్పటికీ ప్రతిస్పందిస్తున్న అణువులే ఈ జీవులు.

జీవితమనే డైరీలో కొన్ని పేజీలైనా మనకి నచ్చినట్లు రాసుకునే స్వేచ్ఛ ఉండాలి. ఓ రోజు ఆ స్వతంత్రతకు తెర తీస్తూ ఇద్దరూ బయలుదేరారు. ఎక్కడికో తెలీదు. ఎందుకో తెలీదు. 'బ్రతకడానికి' అని మాత్రం తెల్సు. అంతే తెల్సు. నిజానికి అది తెలిస్తే చాలు. ఎగిరిపోయారు. స్వేచ్ఛా విహంగాల మల్లె. ఎదురొస్తున్న ప్రతీ సుడిగాలినీ చేధిస్తూ!

ఆ రాత్రి ఇద్దరూ కలిసి మొదటిసారి ఒకే గదిలో గడపబోతున్నారు. ఎక్కడ్నుంచి వస్తుందో కనపడని వెలుగుకు భయపడి చీకటి జడుసుకుంది. గది నిండా అలుముకున్న 'పవిత్రత'ను భంగం చేయడానికేమో ఆకాశం ఉరిమింది. అయినా ఓడిపోయింది. వాళ్ళిద్దరూ కామించుకుంటే ఇంత దూరమే రానక్కర్లేదు. వాళ్ళు కోరుకుంటుంది 'ఏకాంతం'లోని పవిత్రమైన సాహచర్యం, చూసేందుకు కొన్ని సూర్యోదయాలు, తడిచేందుకు వెన్నెల, ఎప్పుడూ గడిపే దిక్కుల నుంచి కొంత విశ్రాంతి. చెరిపేయలేని కొన్ని జ్ఞాపకాలు. అవి చాలవా? చాలామందికి సరిపోవు. వీళ్ళ కథ వేరు.

ఆ తర్వాత రోజెప్పుడో 'ప్రేమ జంట ఆత్మహత్య' అంటూ యూట్యూబ్లో ఏదో వార్త వింటున్నాడు అనిత్.

"ప్రేమ కోసం ఎందుకు చనిపోవాలి" అని ఊరికే అడిగాడు.

సమాధానం చెప్పలేదు ఆరాధన. "అబ్బా పొద్దున్నే అలాంటి న్యూసెన్స్ న్యూస్ ఎందుకు వింటావ్" తియ్యగా కసురుకుంది.

"సరే వద్దు. నువ్ పాడు వింటా" అని అందంగా బ్రతిమాలేసరికీ కాదనలేక గొంతు సవరించుకుంది ఆరాధన.

యుగాల ముందెప్పుడో సృష్టికర్త చేయి తగిలి ఒలికిన అమృతం ఆరాధన గాత్రంగా మారిందేమో అనటంలో అతిశయోక్తి కనపడలేదు. అలా తను పాడిన పాటలను రికార్డర్లో రికార్డ్ చేసి అనిత్ కు ఇచ్చింది.

ఫ్లైట్ హైదరాబాదుకు దగ్గర్లో ఉంది. సాధారణంగా మనకు నచ్చిన వ్యక్తితో సమయం గడుపుతున్నప్పుడు, ఆ క్షణం గడిచిపోకుండా అలా ఆగిపోతే బావున్ను అనుకుంటామ్. కానీ అనిత్ అలా అనుకోవటం లేదు. వీలైనంత త్వరగా ఈ సమయం గడిచిపోవాలని కోరుకుంటున్నాడు. ఎందుకంటే, ప్రేమిస్తున్న వ్యక్తికి దూరంగా ఉండటం కంటే, త్వరలో 'దూరమవ్వబోతున్నాం' అని ముందుగానే తెలియడం '''నరకం.''' ఆ నరకాన్ని మోస్తూ, ఏమీ లేనట్లు నవ్వుతూ పక్కనే ఉండటం త్రిశంఖు నరకం. హైదరాబాద్ వచ్చేసింది.

ఎప్పటికీ కలుసుకోకపోయినా పక్కపక్కనే ఉండటం రైలు పట్టాల అదృష్టం. ఆ అదృష్టం మనుషులకు ఉంటే బావున్ను. కానీ లేదు.

ఆంధ్రా వైపు ఒక రైలు, చెన్నై వైపు ఇంకో రైలు బయలుదేరాయి. ఉన్నపళంగా దిక్కులన్నీ తారుమారై, దక్షిణం ఉత్తరాన్ని చేరుకుంటే ఈ ప్రపంచంలో సాధువుల కంటే తనే అదృష్టవంతుడని అనుకుంటున్నాడు అనిత్. కానీ మారడానికి 'దిక్కులు' అనేవి ఉండాలిగా! దిక్కులు అనేవే ఉంటే భూమి గుండ్రంగా తిరుగుతున్నప్పుడు, తూర్పు ఉత్తరంగానూ, ఉత్తరం పడమరగానూ మారుతున్నట్లేగా? పాపం బేసిక్ సైన్స్ తెలియని వెర్రి జనం వాస్తు లాంటి కల్పిత 'మూఢ' విశ్వాసాలకై పెద్ద పండితుల వలె 'వాగుతుంటారు.' ఈ విషయం అనిత్ కు తెల్సు. కానీ ప్రేమ ఎంతటి మేధావినైనా అయితే కవిని చేస్తుంది, లేదా పిచ్చివాడ్ని చేస్తుంది. కొన్ని సందర్భాల్లో రెండూ కలవచ్చు కూడానూ.

చాలా రోజులు గడిచాయి. ఆ రాత్రి ఆకాశంలో ఉన్నది, నిండు జాబిలే అయినా అమావాస్య చీకటి కంటే గాఢమైన చీకటేదో అనిత్ హృదయాన్ని మంచుతెరలా కప్పేస్తోంది. ప్రేమకు దూరమవ్వడం కంటే ఆప్యాయతకు దూరమవ్వడం 'దౌర్భాగ్యం.' రెండూ ఒకటి కాదా అంటే, ప్రేమించుకుంటున్న చాలామంది ఎందుకు విడిపోతున్నారు? కొందరు లైంగికపరమైన సంబంధం కోసం మాత్రమే కొందరితో కలిసి బ్రతుకుతుంటారు. ఇలాంటోళ్ల మధ్య ఉన్న భావనేంటో ప్రకృతి కూడా పట్టించుకోవడం మానేసింది.

నాలుగు రోజుల ముందెప్పుడో ఆరాధన మెడిటేషన్ చేస్తున్నప్పుడు తన జీవితంలో మొదటిసారి ధ్యాస తప్పుతోంది. ఎంత ప్రయత్నించినా మెదడు నిశ్చల స్థితిని దాటి శూన్య స్థితిలోకి వెళ్ళలేకపోతుంది. సర్వాన్ని అధీనంలో ఉంచుకోవడమే ధ్యానం తాత్పర్యం. మరి ప్రేమే సర్వం అయినప్పుడు? ప్రేమే ఓ ధ్యానం అయినప్పుడు?

ఆ రాత్రి ఆమె మది చేస్తున్న ఆలోచనల యుద్ధానికి పంచభూతాలు భయపడసాగాయి. దూరంగా ఎక్కడో అరవబోతున్న నక్క, ఈ శూన్య వైరాగ్య విలయానికి భయపడి కొండల్లోకి పారిపోయింది.

ఆ ఉదయం సాగర్ తన పక్కనే ఉన్నా, ఆరాధన గుండెల్లో ఏదో 'వెలితి.' ఏంటదీ!!!!!

ఆలోచనలు. ఆలోచనలు. ఆలోచనలు.

ఒకేసారి ఇద్దరు మనుషులతో ప్రేమలో ఉన్నప్పుడు, రెండో వారినే ఎంచుకోవాలి. మొదటి వ్యక్తితో పరిపూర్ణంగా సంతృప్తిగా ఉన్నప్పుడు, ఎవరో వ్యక్తి తాలూకూ ఆలోచనలు ఎందుకు రావాలి? అసంతృప్తి, వెలితి లాంటి పదాలు చోటు చేసుకున్న బంధాల్లో బలవంతం మాత్రమే ఉంటుంది, భావోద్వేగం ఉండదు.

కానీ ఏం చేయగలదు ఇప్పుడు? సాగర్ ని వదిలేయడానికి అతను మాత్రం ఏం నేరం చేసాడు? అతను కూడా గుణవంతుడే. ఆరాధనను దురుద్దేశం లేకుండా ప్రేమిస్తున్నవాడే. సాగర్ ను మోసం చేసి అనిత్ తో బ్రతకాలా? లేక అనిత్ జ్ఞాపకాలను సాగర్ 'పక్క' పైన పరుస్తూ తనని తాను మోసం చేసుకుంటూ గడపాలా?

ఏ ఫీలింగ్ అయితే మానవ జన్మలో కలగకూడదో సరిగ్గా అదే ఫీలింగ్ ఆరాధనలో ఆ రాత్రి కలగడం ప్రారంభించింది. వద్దు వద్దు వద్దు అని తన గుండె అరుస్తూనే ఉంది. మనం చేసే పనిలో 'స్వచ్ఛత' లోపించినప్పుడు కలిగే ఫీలింగ్ అది. బ్రతికే ప్రతీ క్షణం కుళ్ళి కుళ్ళి ఏడ్చేలా చేయగల ఫీలింగ్ అది. నిజాయితీగా ఉన్నా, నువ్ నిజం కాదని అరుస్తూ ఇబ్బంది పెట్టే ఫీలింగ్ అది. అన్నానికి కూర్చున్నా అవిశ్వాసమనే భావనతో ఆకలి కలగని ఫీలింగ్ అది. అదే ఆ రాత్రి ఆరాధనలో కలిగింది.

'REGRET.'

సూర్యోదయమైంది. కానీ ఎందుకో ప్రతిరోజూ 'హోప్'నిచ్చే ఆ సూర్యుడు ఈరోజు వికృతంగా కనిపిస్తున్నాడు అనిత్ కు. 'ఈ కాలంలో మాకు పని చెప్పారు ఎవరో ఈ పిచ్చోళ్లు' విసుక్కుంటూ వచ్చాడు పోస్ట్ మాన్. రాసే వాళ్ళకి, అందుకునే వాళ్ళకి తెలుస్తుంది ఈ 'ఉత్తరం' అనే పదంలో ఉన్న 'ఇంద్రజాలం.'

తెరిచాడు. ఒక్కో అక్షరం ఒక్కో ఉరికంభంలా కనిపిస్తుంది. ఏ దూరాలనూ జత చేయలేని కన్నీరు ఓడిపోయినందుకు చింతిస్తూ, శరీరంలోనే దాక్కుండిపోయింది. చివర్లో ఒక్క మాట రాసింది.

"ప్రేమ కోసం ఎందుకు చనిపోవాలి" అని చైనా (మానస సరోవరం)లో అనిత్ అడిగిన ప్రశ్నకు బదులుగా రాసిన మాట అది. "ప్రేమే లేనప్పుడు ఎందుకు బ్రతకాలి?" అంతే. ఇప్పుడు కదిలిపోయాయి దిక్కులన్నీ. తూర్పున ఉన్న బంగాళాఖాతం, దక్షిణాన ఉన్న హిందూ మహాసముద్రం, పడమరనున్న అరేబియా సముద్రం అన్నీ ఏకమైపోయాయి. అనిత్ హృదయ ద్వారాలను చీల్చుకుంటూ లోపలికి చొరబడిపోయాయి. ఎటు చూసినా శూన్యం. ప్రతీ అడుగు క్రిందా పాతాళం. ఆకాశంలో ఏర్పడ్డ సుడిగుండాలు అతనిని పైకి లాకేసుకుంటున్నాయి. కానీ అడుగులు పాతాళాన్ని విడవకుండా పట్టేసుకున్నాయి. భూమి నిశ్చల దీక్షను పూనింది. కానీ అతను మాత్రం పరుగెడుతున్నాడు. ఎక్కడికి? ఎవ్వరికీ కనిపించని అగాధంలోకి.

ఆరాధనకు తోడుగా రోజులు కూడా శూన్యంలో కలిసిపోయాయి.

రికార్డర్ ఓపెన్ చేసి ఆమె పాడిన పాట పెట్టాడు. 'తీరం తెలిసాకా వేరే దారిని మార్చానా' పాట. ఊహు.. నచ్చలేదు. వేరే పాట మార్చాడు.

'స్వప్నాలైతే క్షణికాలేగా, సత్యాలన్నీ నరకాలేగా. స్వప్నం సత్యమైతే వింత, సత్యం స్వప్నమయ్యేదుందా' మొదటిసారి ఆ అమృత గాత్రం, అనిత్ చెవులకు హలాహలంలా తోచింది.

ధ్యానం చేస్తున్న బ్రహ్మ దేవుని మనసు నుంచి మానస సరోవరం జన్మించగల్గింది. అదే బ్రహ్మ దేవుని సంకల్పం రెండు మనసుల్ని మాత్రం కలపలేకపోయింది. మాయలోంచి పుట్టిన ప్రపంచం, అర్థం కాని ప్రపంచంలోని మాయ. ఒక్క నిట్టూర్పు విడిచాడు అనిత్. దేవలోకం దద్దరిల్లేలా!

***

అశోక్ ఆనంద్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

అశోక్ ఆనంద్.

రచయిత, దర్శకుడు, సాహితీ వేత్త



50 views0 comments

Comentarios


bottom of page