top of page
Writer's pictureYasoda Pulugurtha

మానస వీణ

Maanasa Veena Written By Yasoda Pulugurtha

రచన : యశోద పులుగుర్త

"వదినా!" అంటూ వంటింట్లో వంట చేసుకుంటున్న కౌసల్యను, సుడిగాలిలా వచ్చి చుట్టేసుకుంటూ భోరున ఏడుస్తున్న మానసవైపు ఆందోళనతో చూస్తూ........

"ఏమైంది మనూ, ఏమిటీ ఆకస్మిక ఆగమనం ?

నవీన్ కూడా వచ్చాడా నీతో, ఏడీ? హాల్లో కూర్చున్నాడా ?"

"లేదు ఒదినా, నేనే వచ్చేసాను. అతను ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసరికి నేను ఉండకూడదని" .

"ఏమైంది మనూ ? వచ్చేయడమేమిటీ, ఏమి జరిగిందసలు ?"

"వదినా!" అంటూ ఒక్కసారిగా బావురుమంటూ ఏడ్వసాగింది మానస .

"వదినా, నవీన్ తో కలసి కాపురం చేయడం నా వల్లకావడం లేదు .. ఎంత మరచిపోదామన్నా నాకు నా గౌతమ్ గుర్తొస్తున్నాడు వదినా" అంటూ బేలగా నిస్సహాయంగా కన్నీళ్లు పెడ్తున్న ఆడబడుచువైపు జాలిగా చూడసాగింది కౌసల్య .

"అసలేమైంది మనూ ?"

"ఏం చెప్పను వదినా .పెళ్లై మూడు నెలలైనా నేను అతనితో భార్యగా సంసారం చేయలేక పోతున్నాను .'నాకు కొంచెం సమయం కావాలి నవీన్' అంటే సరే అన్నాడు .ఇద్దరం ఎవరి బెడ్ రూమ్లలో వాళ్లం పడుకుంటున్నాం అప్పటి నుండీ .నిన్న రాత్రి నవీన్ తలనొప్పిగా ఉందని నుదుటికి కాస్త అమృతాంజనం రాయమని రిక్వెస్ట్ చేసాడు.. రాద్దామని దగ్గరకు వెళ్లగానే నన్ను బలవంతంగా తన కౌగిలోకి తీసుకున్నాడు .బలవంతంగా ప్రతిఘటించాను.. 'తప్పేమిటి మానసా, ఇద్దరం భార్యా భర్తలం కదా, ఎన్నాళ్లు నాకు దూరంగా ఉంటావ'ని సీరియస్ గా మాట్లాడాడు .

"అసలు పెళ్లే చేసుకోని గౌతమ్ గురించి అంతగా బాధపడిపోతున్నావే, నిన్ను పెళ్లిచేసుకుని కూడా నీనుండి ఏ ఆనందాన్ని ఇంతవరకు పొందని నేను ఎంతగా బాధపడాలి మానసా ? నా గురించి, నీ గౌతమ్ గురించి ఆలోచించిన దానిలో పదిశాతం ఆలోచించినా నా బాధ ఏమిటో నీకు అర్ధమౌతుంది . అయినా ఎప్పుడో చనిపోయి తిరిగిరాని లోకానికి వెళ్లిపోయిన గౌతమ్ మీద ఇంకా అంత ప్రేమేమిట'ని ప్రశ్నించాడు వదినా .

అతనన్న మాటలు వేరే ఎవరైనా అని ఉంటే వాళ్ల మొహం జన్మలో చూసేదాన్నికాదు.. మీ అందరి కోరికతో అతన్ని పెళ్లిచేసుకున్నాను.. నా విషయం అంతా నవీన్ కు మా పెళ్లిముందు చెప్పావు కదా ఒదినా . అన్నీ తెలిసీ కూడా నవీన్ నన్ను అలా అనేసరికి తట్టుకోలేకపోతున్నాను వదినా . నవీన్ అన్న మాటలకు దుఖం వచ్చేసి నా బెడ్ రూమ్ లోకి వెళ్లిపోయి తలుపేసుకుని రాత్రి అంతా ఏడుస్తూ కూర్చున్నాను . ఆఫీస్ కు కూడా వెళ్లలేకపోయాను .

చచ్చిపోయిన గౌతమ్ మీద ఇంకా ప్రేమేమిటంటాడా ?

గౌతమ్ మీద ప్రేమ నేను చచ్చేవరకూ నాతో అలానే ఉంటుందని, గౌతమే నా ఊపిరని అతనికి ఎలా అర్ధం అవుతుంది ?"

మానస అలా ఏడుస్తూ మాట్లాడుతుంటే కౌసల్య అచేతనురాలైపోయింది . మానస మనస్సుని మార్చేదెలా ?

మానస కౌసల్యకు ఆడబడుచైనా మానసికంగా అంతకంటే ఎక్కువే .

కౌసల్య శ్రీరామ్ తో పెళ్లి అయి అత్తవారింటికి వచ్చిన రెండు సంవత్సరాలకు అత్తగారు గుండెపోటుతో చనిపోయారు .

అప్పటికి మానస ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం చదువుతోంది .

భార్య ఆకస్మిక మరణానికి మామగారు బెంగతో కృంగిపోతే, అల్లారుముద్దుగా పెరుగుతున్న మానస, తల్లి మరణానికి బెంగపెట్టేసుకుని జ్వరంతో మంచానికి అంటుకుపోయింది .

అప్పుడు కౌసల్య మానసను దగ్గరుండి చాలా జాగ్రత్తగా చూసుకుంది .

తల్లిలా దగ్గరకు తీసుకుని ఓదార్చింది .

కౌసల్య అణుకువ, మంచితనంతో ఆ ఇంటికి తిరిగి జీవకళ వచ్చేలా చేసింది .

మానస ఇంజనీరింగ్ పూర్తి చేయడం, ఒక మల్టీ నేషనల్ కంపెనీలో కేంపస్ రిక్రూట్ లో ఇంజనీర్ గా ఉద్యోగం వచ్చింది . మానస కు ఉద్యోగం వచ్చినప్పటినుండి మామగారు కౌసల్యతో, "చూడు కౌసల్య తల్లీ, మానస ఉద్యోగంలో స్థిరపడిందిగా, ఇంక పెళ్లి సంబంధాలు చూసి మంచి అబ్బాయితో అమ్మాయికి మూడు ముళ్లూ వేయిద్దాం .

నేను కూడా సంబంధాలు వెతుకుతాన"ని మామగారు అనగానే, "అలాగే మామయ్యగారూ, మన మానసకు కూడా ఒకసారి ఈ విషయం చెపుదాం . బాగా చదువుకుంది, మంచి ఉద్యోగంలో ఉంది.. తనకు కూడా స్వతంత్ర అభిప్రాయాలు ఉంటాయి కదా .

నేను మానసతో మాట్టాడాకా తన అభీష్టం తెలుసుకున్నాకా సంబంధాలు చూద్దాం మామయ్యగారూ" అనగానే కోడలి మంచితనానికి ఆయన హృదయం ఉప్పొంగిపోయింది .

ఇంటికి మంచికోడలు రావడం పూర్వజన్మ సుకృతమే .

అత్తగారు పోయినా బాధ్యతగా ఇంటి విషయాలను పట్టించుకుంటూ అందరినీ ఆప్యాయంగా అభిమానంగా చూసే కౌసల్య అంటే ఆ ఇంట్లో అందరికీ ఇష్టమే కాకుండా ఎంతో గౌరవం కూడా .

మానసకైతే ఎప్పుడూ వదిన నామస్మరణే . ఏ విషయాన్నైనా గానీ వదినతో పంచుకోకుండా ఉండలేదు .

'వదినా నీ అర్ధమొగుడిని నేనే, నా తరువాత అన్నయ్య నీకు' అని ఆటలు పట్టించే మానస అంటే కౌసల్యకు మహాముద్దు .

అన్న, తమ్ముళ్లేగానీ, చెల్లెళ్లు లేని కౌసల్యకు మానస ఒక చిన్నారి చెల్లి .

మామగారితో చెప్పినట్లుగా, ఒకరోజు ఆదివారం సాయంకాలం డాబామీద నీరెండలో చాపమీద కూర్చుని కౌసల్య సన్నజాజుల మాల కడుతోంది.. కౌసల్య ఒడిలో పడుకుని మానస వదినతో ఏవో కబుర్లు చెపుతోంది..

ఉన్నట్టుండి కౌసల్య మానసతో " మనూ, ఇంకెన్నాళ్లు ఈ వదినతో ఇలా ఒళ్లో పడుకుని కబుర్లు చెపుతావులేకానీ" , మామయ్యగారు నీకు మంచి సంబంధం చూసి త్వరలో పెళ్లిచేసేద్దామన్నారు.

మీ అన్నయ్య కూడా దానికి ఓకే చెప్పారు.. మాట్రిమొనీ లో చెల్లాయి వివరాలు రిజిస్టర్ చేస్తానన్నారు .మరి నీ రిక్వైర్ మెంట్స్ ఏమిటి మనూ ?

నీకు ఎటువంటి వ్యక్తి కావాలి, నీ ఇష్టాలు, అభిరుచులు లాంటివి ఉంటే చెపితే బాగుంటుంది కదా" .

వదిన ఒళ్లో పడుకుని వదిన మాటలు వింటున్న మానస చటుక్కున లేచి సరిగా కూర్చుంది .

"వదినా, ఈ అవకాశం కోసమే చూస్తున్నాను . నాకు నేనుగా పెళ్లి చేసుకుంటానని చెప్పలేనుగా .

నీతో ఒక విషయం ఈరోజే చెప్పేయాలనుకోవడం, అనుకోకుండా నీవే నా పెళ్లి టాపిక్ తేవడం భలే కో ఇన్సిడెన్స్ వదినా . మా కొలీగ్, నా సీనియర్ అయిన గౌతమ్ నన్ను ప్రపోజ్ చేసాడు .

నో అనడానికి కారణాలు కన్పించలేదు . అతని చదువు, ఉద్యోగం, కులం, ఫేమిలీ బేక్ గ్రౌండ్ అన్నీ బాగున్నాయి వదినా . నాకూ అతనంటే ఇష్టం ఏర్పడింది . అతని వ్యక్తిత్వం, అభిప్రాయాలూ నన్ను ఇంప్రెస్ చేసాయి . నీకూ, అన్నయ్యకూ, నాన్నగారికీ నచ్చితే అతన్ని వివాహం చేసుకోవాలని అనుకుంటున్నాన"ని మానస చెప్పగానే కౌసల్య ఈ విషయం ఇంట్లోని వారికి చెప్పింది. అంతా వెళ్లి గౌతమ్ తల్లితండ్రులను కలసి పరస్పర అంగీకారానికి వచ్చారు.. ఎంగేజ్ మెంట్ కు ముహూర్తం చూస్తున్నారు .

ఈలోగా అనుకోకుండా గౌతమ్ ని కంపెనీ ఒక వారంరోజులుపాటు ఆఫీస్ పనిమీద సింగపూర్ పంపించింది .

గౌతమ్ ని క్షణంకూడా చూడకుండా ఉండలేని మానస దిగులు ముఖం పెట్టేసింది.. మానస ముఖాన్నే తదేకంగా చూస్తూ...... " ఏయ్ మనూ, వారం రోజులు ఎంత సేపు, గిర్రుమని తిరిగిపోతాయి " నేను వచ్చేసాకా ఈ అల్లరిపిల్లతో నాకు ఎంగేజ్ మెంట్ అంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. నవ్వుతూ బోన్ వొయేజ్ చెప్పమ్మాయ్.

ఆ అన్నట్లు సింగపూర్ నుండి నీకు ఏమి కావాలి ?

ఆ.... గుడ్ ఐడియా, మన ఎంగేజ్ మెంట్ కు డైమండ్ రింగ్స్ తెస్తానం"టూ సైజ్ కోసం మానస రింగ్ తీసుకున్నాడు .

ఇంక రేపే గౌతమ్ సింగపూర్ నుండి వచ్చేస్తాడని మానస హడావుడి పడుతోంది.. గౌతం తిరిగి వచ్చిన సరిగ్గా ఒకవారానికి ఇరువురి ఎంగేజ్ మెంట్ కూ సన్నహాలు చేస్తున్నారు .

హఠాత్తుగా దారుణమైన వార్త విన్నారు.. సింగపూర్ ఆఫీస్ నుండి హోటల్ కు కారులో వస్తూండగా స్పీడ్ బ్రేకర్ దగ్గర కారు బ్రేక్ సరిగా పడకపోవడంతో కారు పల్టీ తిరిగిపోయి పేవ్ మెంట్ ను గుద్దేయడంతో గౌతమ్ అక్కడకక్కడే తలకు పెద్ద దెబ్బతగిలి ప్రాణాన్ని కోల్పోయాడు .

దారుణమైన విస్ఫోటకం . వార్తవిన్న ప్రతీ ఒక్కరూ కంటతడిపెట్టడమే . ఆఫీస్ యాజమాన్యం స్వయంగా వచ్చి గౌతమ్ తల్లితండ్రులకు తమ సంతాపాన్ని తెలిపాయి .

ఇక్కడ మానస పరిస్తితి దారుణం.. స్పృహ తప్పిపోయింది . ఒక రాయిలాగ స్పందన లేనిదానిలా శూన్యంలోకి చూస్తూ .

మానస కదిలి ఏడిస్తే బాగుండునని ఆమె హృదయం ద్రవించాలని అందరూ కోరుకున్నారు . కాసేపటికి వాస్తవానికి వచ్చిన మానస వదిన ను కౌగలించేసుకుని దుఖంతో అల్లల్లాడిపోయింది..

తల్లిపోయినప్పుడు కూడా అంత దుఖపడలేదు .

ఏడ్చి ఏడ్చి వదిన ఒళ్లో సొమ్మసిల్లిపోయింది .

మానస తిరిగి వాస్తవ ప్రపంచంలోనికి రావడానికి మూడు నెలలు పైనే పట్టింది.. కౌసల్య మానసని పొదవి పట్టుకుని తినిపించడం, అవీ చేసేది . రాత్రీ పగలూ కంటికి రెప్పలా చూసుకుంది .

మామగారు మానస పరిస్తితికి విచలితుడౌతూ........ "అమ్మా కౌసల్యా, ఏ జన్మలోనో మానస నీ కడుపున పుట్టిన కూతురయి ఉండవచ్చు . కన్నతల్లికంటే చాలా జాగ్రత్తగా కాపాడావమ్మా నా కూతురిని" అంటూ ఆయన కళ్లనీళ్లు పెట్టుకునేవాడు.

ఎలాగైతేనే మానస మామూలు మనిషి అయి తిరిగి ఉద్యోగానికి వెళ్లడం ప్రారంభించింది . అంతా కౌసల్య తీసుకున్న శ్రధ్ద .

మానస మనుషుల్లో పడడంతో ఇంట్లో అందరూ కాస్త ఊపిరి తీసుకున్నారు .

కౌసల్య చిన్న తమ్ముడి వివాహం కుదిరిందని పెళ్లికి ఒక పదిరోజుల ముందరే రావాలంటూ కౌసల్య తల్లీ తండ్రీనుండీ ఆహ్వానం వచ్చింది .

మానసకి కాస్తంత మార్పు కూడా ఉంటుందని మానసను కూడా పెళ్లికి తీసుకుని వెళ్లింది కౌసల్య. .అంతమంది మనుషులూ, హడావుడిని చూడగానే మానసలో నిజంగానే చైతన్యం వచ్చింది .

అందరిలాగే తనుకూడా చక్కగా తయారై, పెళ్లిలో అటూ ఇటూ తిరగడం ఆరంభించింది..

అసలే అందంగా ఆకర్షణీయంగా చూడగానే మళ్లీ చూడాలనే రూపంతో ఉండే మానస, కౌసల్య పిన్ని కొడుకైన నవీన్ ను ఆకర్షించింది.. నవీన్ తనకు తాను మానసకు పరిచయం చేసుకుని తను హైద్రాబాద్ లో ఫలానా కంపెనీకి బెంగుళూర్ నుండి రీసెంట్ గా మారానని చెప్పాడు.. కౌసల్యతో అతనికి బాగా చనువు కూడా. " కౌసల్యక్కా" అంటూ అభిమానంగా ఉంటాడు .

నవీన్ మానసపట్ల ఇంట్రస్ట్ చూపిస్తున్నట్లుగా కౌసల్య గ్రహించేసింది .

మనస్సులో చటుక్కున ఒక అందమైన ఆలోచన చోటు చేసుకుంది .

మానసను ఎలాగైనా ఒప్పించి నవీన్ తో పెళ్లి జరిపించాలని.. మనస్సులో ఇది జరిగే పని అన్నట్లుగా పాజిటివ్ వైబ్రేషన్స్ వ్యాప్తిచెందడం ప్రారంభించాయి.. నవీన్ అమ్మా నాన్నకు మానస గురించి చెప్పింది.. మానస దగ్గరగా లేకుండా చూసి మానస గురించి నవీన్ కు అంతా చెప్పింది.. మానస పెళ్లి చేసుకుందామనుకున్న గౌతం ఆకస్మిక మరణం గురించి కూడా చెప్పింది .

"అరే, పాపం, అయినా జీవితంలో ఎన్నో అనుకుంటాం కౌసల్యక్కా, కానీ అన్నీ నెరవేరాలని లేదుగా .విధిలిఖితం అంటే ఇదే .

అయినా మానస ఎప్పుడూ ఆ గతం గురించే ఆలోచించడం ఫూలిష్ నెస్ . తిరిగి తన జీవితాన్ని తను నిర్మించుకోవాలి.. నేను మానసను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను కౌసల్యక్కా. తను నాకు చాలా నచ్చింది.. మా ఇద్దరి పెళ్లి జరిపించే పూచీ నీదేనంటూ, ఎలాగూ నేను హైద్రాబాద్ వస్తానుగా, మీ ఇంటికి వస్తానక్కా . ఈలోపల మానసను పెళ్లికి ఒప్పించం"టూ పదే పదే చెప్పి వెళ్లాడు .

కౌసల్యకు పట్టరాని ఆనందంగా ఉంది . మానసను నవీన్ కు ఇచ్చి వివాహం చేసేయాలని .

పెళ్లి నుండి తిరిగివచ్చాక మానసకు అనేక రకాలుగా చెప్పి చూసింది .. మానస తను ప్రేమించిన గౌతమ్ ను మరచిపోలేనంది .

ఇలాగే వ్యర్ధంగా ఆలోచించడం సబబు కాదని, ప్రాప్తం లేని వాటి గురించి ఎన్నాళ్లు ఆలోచిస్తూ జీవితాన్ని పాడుచేసుకుంటావని, వచ్చిన అదృష్టాన్ని కాదనకూడదని నచ్చ చెప్పింది.. నవీన్ చాలా మంచివాడని, నిన్ను అర్ధం చేసుకుంటాడని చెప్పింది..

పాపం మామయ్యగారు ఎలా అయిపోయారో నీమీద బెంగతో అని సెంటిమెంట్ తో కొట్టింది.. నీవు ఇలా విరాగిణిలా అయిపోవడం మా మనస్ససులకు ఆనందంగా లేదు మనూ అని బ్రతిమాలగా, బ్రతిమాలగా వివాహానికి సమ్మతించింది .

చక్కగా నవీన్ తో పెళ్లి చేసేసారు.. మానస ఉద్యోగం కొనసాగిస్తోంది.. నవీన్ మానస కొత్తకాపురం పెట్టేరు .

ఇద్దరూ ఆనందంగా కలసి కాపురం చేసుకుంటున్నారనుకుంటుంటే ఆశనిపాతంలా ఇలా జరుగుతోందేమిటీ ?

అంతా మానసదే తప్పని కౌసల్య భావించింది .

మానసకి స్ట్రాంగ్ గా కౌన్సిలింగ్ చేసి నవీన్ దగ్గరకు పంపాలని నిర్ణయించుకుంది .

మానస కాస్త రిలాక్స్ అయ్యాకా మాట్లాడడం కొనసాగించింది .

చూడు మనూ, గాఢంగా ప్రేమించుకుని ఒకరుకొకరు ఇష్టపడి పెళ్లిచేసుకుని కొద్దికాలం కాపురం చేసి కూడా ఏదో చిన్న చిన్న విషయాలలో మనస్పర్ధలు వచ్చి విడిపోతున్నారు చాలామంది .

అంత ప్రేమించుకున్నవారు, ప్రేమే లోకం అంటూ తిరిగిన వారు ........మరి వారి మధ్య ఉన్న అంత ప్రేమా ఏమైనట్లు ?

మరో వివాహం చేసుకుని మరొకరితో ఎలా కొత్తజీవితాన్ని సాగిస్తున్నారు ?

భర్తతో ఎన్నో ఏళ్లు కాపురం చేసి, మనసావాచా భర్తే లోకంగా బ్రతికిన స్త్రీ , భర్త చనిపోగానే ఎందుకీ జీవితం అనుకుంటూ విరక్తి చెందిపోతూ ప్రాణ త్యాగం చేస్తోందా, లేదే .

బాధ పడుతుంది భర్త దూరం అయినందుకు, కొన్ని నెలలు, సంవత్సరాలు.. ఆ తరువాత రొటీన్ లో పడక తప్పదు.. తనకంటూ పిల్లలు, వారి భవిష్యత్ కోసం తనమీద ఆధారపడి ఉన్నవారికోసం బ్రతుకుతుంది, బ్రతికి తీరాలి కూడా .

ఇది లోక సహజం .

కొంతమంది భర్త చనిపోయిన స్త్రీలెందరో పునర్వివాహం చేసుకుంటున్నారు కూడా.. పోయిన భర్తమీద ప్రేమ లేకకాదు .

తనకంటూ జీవితంలో ఒక తోడు ఆలంబన కోసం .

అలాంటిది, నీవు గౌతమ్ ను గాఢంగా ప్రేమించి ఉండొచ్చు.. అతను నీకు దూరం అయినంతమాత్రాన నీవు జీవితమే లేదనుకుంటే ఎలా మనూ ?

ఒకవేళ నీ స్తానంలో గౌతమ్ ఉండి ఉంటే నీలా ఏడుస్తూ కూర్చోడు.. హాయిగా పెళ్లి చేసుకుని భార్యాపిల్లలతో జీవిస్తాడు .

భార్యపోయి సంవత్సరం కాకుండానే తిరిగి పెళ్లి పీటలెక్కేస్తున్న మగ మహారాజులెందరో .

అటువంటిది, కొన్ని నెలల ప్రేమ మాత్రమే మీది. మీదేమీ షాజహాన్ ముంతాజ్, లైలా మజ్నూ, దేవదాస్ పార్వతి లాంటి ప్రేమకాదే .

ఏదో గొప్పగా ఆలోచిస్తున్నాననుకుంటూ చక్కని నీ జీవితాన్ని పాడుచేసుకోకు మనూ........ ఇంతకంటే నేనేమీ చెప్పలేనమ్మా . నవీన్ తో హాయిగా సంసారం చేయి, అతన్ని బాధపెట్టడం సమంజసం కాదంటూ అక్కడనుండి మెల్లిగా వంటగదిలోకి వెళ్లి పోయింది .

మానసను అలాగే ఆమె ఆలోచనలకు వదిలేసింది ఒక అరగంటసేపు.. కాసేపు తరువాత కాఫీ ఇద్దామని మానస ఉన్న చోటుకి వస్తే మానస లేదు అక్కడ.. ఒక పేపర్ గాలికి ఎగురుతూ కనిపించింది.. కౌసల్య ఆ కాగితంలోని అక్షరాలవైపు చూసింది . మానస చేతివ్రాతతో " వదినా తప్పునాదే, నవీన్ దగ్గరకు వెళ్లిపోతున్నాను, క్షమించమని అడగడానికి " .. నీకు నా కృతజ్నతలు వదినా, కళ్లు తెరిపించావ్, ....బై...... మనూ ..

-----

మరో పది నెలల తరువాత .

కౌసల్యా శ్రీరామ్ ల ఇల్లు మామిడాకు తోరణాలతో, పచ్చని గడపలకు కట్టిన బంతిపూల హారాలతో మెరిసిపోతోంది.. పట్టుచీరల రెప రెపలు, గాజుల గల గల శబ్దాలు, వంట సావిట్లో వంటవాళ్లు వండే పిండి వంటల ఘుమాయింపుల తో ఆ ప్రదేశం అంతా సువాసనలు వెదజల్లుతున్నాయి.. కౌసల్య మామగారు విశ్వనాధంగారు పట్టు దుస్తులు ఉత్తరీయం ధరించి హడావుడిగా అందరినీ పలుకరిస్తున్నారు.. శ్రీరామ్ అప్పుడే లారీనుండి దిగిన అరటిపళ్ల గెలలను దగ్గరుండి దింపిస్తున్నాడు.. కౌసల్య చిలకాకు పచ్చని పెద్ద కంచి పట్టుచీరలో , నడుముకి పెట్టుకున్న బంగారపు ఒడ్డాణంతో మెరిసిపోతోంది .

వారింటి ముద్దుల ఆడపడుచు మానస శ్రీమంతం వేడుక అట్టహాసంగా జరుగుతోంది అక్కడ .


రచయిత్రి ఇతర రచనలు :



268 views0 comments

Comments


bottom of page