'Manasantha Nuvve' written by A. Annapurna
రచన : A. అన్నపూర్ణ
నీవు ఎదుట నిలిచినప్పుడు నాలో కలిగిన సంభ్రమం
నా ఇంటి వాకిట విరబూసిన పారిజాతాలు జలజల రాలినప్పుడు
తెలుసుకున్నాను ఆదికలకాదు నిజమని !
మసక చీకటి వెలుగులో చందమామ కన్నుగీటి నవ్వినప్పుడు
ఈ పరిహాసమెందుకని కోపగించుకున్నాను కారణం తెలియక
కలువ కన్నెలు అందాలు ఆరబోసినపుడు తెలియ వచ్చింది నువ్వు వచ్చేవని!
అలనుకొలనులో అలజడికి అనుకున్నాను తెల్లవారిందా అని
వేగుచుక్క కానరాదు వెలుగురేఖల జాడలేదు
నా చెక్కిలి తాకిన స్పర్శతో తెలిసింది అది నీవే అని!
నడిరాతిరి వేళా కోవెలగంటలు మోగినపుడు అనుకున్నాను
ఇదేమివింత ఈవేళ అని కలవర పాటున కళ్ళు తెరచి చూస్తే
తెలిసింది అవి గుడిగంటలు కావు నా మదిలో మ్రోగిన అనురాగ గీతికలని!
తనివితీరని తలపులతో నీకోసమే ఎదురుచూడగా
ప్రతి క్షణం నీరూపమే అంతటా నిండిపోయె
కాలమే గడవక కలతపడిన వేళా నా మనసంతా నువ్వే!
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.
రచయిత్రి పరిచయం : ఏ. అన్నపూర్ణ.
నాది కాకినాడ. పండితవంశంలో పుట్టుక, సాహిత్యం ఊపిరి- వంశపారంగా అబ్బిన వరం.
నా మొదటికథ చదివి రచనలను ప్రోత్సహించినది ''వసుంధర.R రాజగోపాల్గారు.'' నామొదటి నవల చదివి నా శైలిని మెచ్చుకుని ,చతురలో ప్రచురించడo గొప్ప అర్హతగా అభినందించిన '' శ్రీ యండమూరి.....''ఇంకా ఇప్పుడూ కొనసాగిస్తూ ఉండటానికి కారకులు.
అలాగే నా వ్యాసాలకు సుస్థిర స్థానం కల్పించింది డా. జయప్రకాశ్ నారాయణ్ LOKSATTA ఫౌండర్. నా కవితలకు గుర్తింపు తెచ్చిన ప్రముఖ జర్నలిస్ట్ ఐ.వెంకట్రావ్ గారు, (నా మొదటి కవిత వారి '' పత్రిక ''లో వెలుగు చూసింది.)
విచిత్రం ఏమిటంటే వీరిలో మహిళా రచయిత్రు లెవరూ లేకపోడం.
రచయితలో వుండే ప్రత్యేకతను గుర్తించిన గుణం వీరిది. మరో విషయం ''జనార్ధన మహర్షి'' గారి కవితలు చదివి చిన్న మార్పులు చేస్తే బాగుంటుందేమో అని చెప్పినందుకు కొత్తగా ఏమాత్రమూ కోపం తెచ్చుకోకుండా ఆయన కొత్తగా రాసిన కవితల సంపుటిని నాకుపంపి '' సరిచూసి ఇస్తే నేరుగా ప్రింటికి ఇస్తాను ''అని చెప్పడం వారి విజ్ఞతకు సహస్ర వందనాలు. వీరంతా నేను ఎన్నటికీ మరువలేని మహానుభావులు.
ఇంకా కొందరు వున్నారు. సమయం వచ్చినపుడు వారిని గురించి చెబుతాను.
Comments