top of page

మనసెరిగిన మగడు

#KandarpaMurthy, #కందర్పమూర్తి, #మనసెరిగినమగడు, #ManaseriginaMagadu, #TeluguKathalu, #తెలుగుకథలు


Manaserigina Magadu - New Telugu Story Written By Kandarpa Murthy

Published In manatelugukathalu.com On 02/12/2024

మనసెరిగిన మగడు - తెలుగు కథ

రచన: కందర్ప మూర్తి


"అమ్మా, నాకు ఇంకా చదువుకోవాల నుందే" రేవతి, తల్లి దేవమ్మను వేడుకుంటోంది. 


"మంచి సంబంధం తల్లీ, కట్నం ఏమీ వద్దంట. ఇంటిపనులు వంట పనులు వస్తే చాలట. నువ్వు పెద్ద చదువులు చదవాలంటే బోలెడు డబ్బులు కావాల. మనం అంత స్థితిమంతులం కాము. ఈ చిన్న కిరాణా దుకాణంతో కాలం ఈడుస్తూ నిన్ను స్కూలుకి పంపి చదివిస్తున్నా. మీ నాయనే బతికుంటే నాకు ఇన్ని తిప్పలుండేవి కావు. 


 తాత గారి ఊళ్లో పెద్దిరెడ్డి గారి కొడుకు పెళ్లికి పిల్లని ఎతుకుతున్నారట. చంద్రం మామయ్యకి తెలిసి పెద్దిరెడ్డికి నీ గురించి చెబితే చదువుకున్న పిల్లైతే వద్దన్నాడట. చంద్రం మామ మన ఆర్థిక పరిస్థితులు, నీ గురించి మంచిగా చెబితే ఒకసారి అమ్మాయిని చూడాలన్నాడట. 


“ఎల్లుండి చంద్రం మామయ్య ఇక్కడికి వచ్చి నిన్ను ఊరికి తీసుకుపోతాడు. అక్కడ జానకి అత్త అన్నీ చూసుకుంటాదట. నువ్వు ఈ పెళ్లి సంబంధం కాదనకు తల్లీ! నీ లగ్గం జరిగిపోతే నాకు నిశ్చింతగా ఉంటాది. " దేవమ్మ ఏకరువు పెడుతోంది. 


 ఏకాంతంగా కూర్చున్న రేవతి ఆలోచనలో పడింది. తను ఇంటర్ పూర్తి చేసింది. ఎలాగైనా డిగ్రీ చదివి బి. ఎడ్ పూర్తి చేసి టీచర్ గా ఉధ్యోగం చేసి అమ్మను ఈ కష్టాలనుంచి గట్టెక్కించాలనుకుంది. తనకి జ్ఞానం వచ్చి నప్పటినుంచి అమ్మ తన గురించి ఎంత కష్టపడుతున్నదీ చూస్తోంది. ఇప్పుడు అమ్మ మాట కాదంటే బాధ పడుతుంది. తన మనసులోని కోరికను అణిచి అమ్మ చెప్పిన ప్రకారమే చెయ్యాలనుకుంది. 


అనుకున్న ప్రకారం ఊరి నుంచి చంద్రం మామయ్య వచ్చాడు. పలకరింపులు, భోజనాలయాయి. దేవమ్మ కిరాణాషాపు తెరవడానికి వెళ్లింది. 


ఇంటి దగ్గర చందు మామయ్య, రేవతి ఉన్నారు. మాటల సందర్భంలో రేవతి. తన మనసులోని మాట మామయ్య దగ్గర చెప్పింది. 

 

 "సూడు, తల్లీ! మన ఇళ్లలో ఎవరూ సదువుకో లేదు. ఎలా జరుగుబాటు అయితే అలా జీవితాలు సాగిపోతున్నాయి.  నువ్వు ఇంత పెద్ద సదువు సదినావంటే మాకూ ఆనందమే బంగారం. ఇంకా పెద్ద సదువులు సదివించే స్తోమత నీ అమ్మకు లేదు. ఎప్పటికైనా ఒక అయ్య సేతిలో పెట్టి అత్తోరింటికి పంపాల్సిందే. 


ఇంక మీ అమ్మకి తోడు ఎవరున్నారు, నీ బాద్యత నానే సూడాల కదా, అందుకే ఈ పరుగులాట. మన ఊరిలో పెద్దిరెడ్డి మోతుబరి రైతు. బోలెడంత ఎవసాయం. పేరున్న ఆసామి. భార్య సచ్చిపోతే మారుమనువు సేసుకోలేదు. ఒక్కడే కొడుకు. పేరు కాంతారెడ్డి. 


ఆడు నా కళ్ల ముందే పెరిగినాడు. ఆడి నాయనకు తాగుడు ఎసనం ఉంది కాని ఈ బుడ్డోడు సానా మంచోడు. కష్టపడి ఎవసాయం, కూరగాయలు పండిస్తు బర్రెల్ని సాకుతున్నాడు. 


‘బాబయ్య..’ అంటు నన్ను పేమగా పలకరిస్తాడు. ఆడికి మన స్కూలు మేస్టరు కనకరాజు గారు దోస్తు. ఆయనతో ముచ్చట్లు పెడుతూంటాడు. ఈలున్నప్పుడు నీ మనసులో మాట ఆడి సెవిన ఏస్తాలే. ముందు పెద్దిరెడ్డిని ఒప్పించాల. నువ్వు ఫికర్ కాకు బిడ్డా, నీ సంసారం సక్కగా సాగుతాది"

 చందు మామయ్య దైర్య వచనాలు చెప్పగా సరేనంది రేవతి. 


ఊరికి వచ్చిన రేవతి, తాతయ్య ఊరు ఎంతగా మారి పోయిందోనని ఆశ్చర్యం కనబర్చింది. ఊరి మధ్యలో చెరువు చుట్టూ కొబ్బరి మొక్కలు, చెరువుకి ఒక పక్క పంచాయతీ ఆఫీసు మరో పక్క గట్టు మీద సాయిబాబా గుడి, శివాలయం, ఊరి మొదట్లో నూకాలమ్మ గుడి కొద్ది దూరంలో హైస్కూలు

అందంగా కనబడుతున్నాయి. పంచాయతీ ఆఫీసుకి ఆనుకుని ప్రభుత్వ పాలకేంద్రం ఉన్నాయి. 


 చంద్రం మామయ్య పెద్దిరెడ్డికి కబురు చేసి మేనకోడల్ని తీసుకు వచ్చానని పంతులు గార్ని మంచి రోజు అడిగి  పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తానన్నాడు. 


 అనుకున్న ప్రకారం చంద్రం ఇంటి వద్ద కామందు పెద్దిరెడ్డి, కొడుకు కాంతారెడ్డి రేవతిని చూడటం జరిగింది. 


పెద్దిరెడ్డి కాబోయే కోడల్ని ఏవేవో ప్రశ్నలడిగి అనుమానం తీర్చుకున్నాడు. రేవతి వినయం అణకువ మాటతీరు నచ్చాయి. కాంతారెడ్డి అమాయకంగా రేవతిని చూసాడు కాని ఏమీ మాట్లాడ లేదు. పరవాలేదనుకున్నాడు మనసులో. 


రేవతి కూడా కాబోయే మామ మాటతీరు, కాంతారెడ్డి అందం, మొహంలో మంచితనం నచ్చాయి. 


పెద్దిరెడ్డి కట్నం లేకుండా తన పెళ్లి ఖర్చులతో కొడుకు పెళ్లి రేవతితో చెయ్యడానికి ఒప్పుకున్నాడు. తల్లి దేవమ్మ, మేనమామ చంద్రానికి ఎంతో సంతోషమైంది. 


ఊరి పురోహితుడు మల్లావధాన్లు గారు నిశ్చయించిన శుభ ముహూర్తాన ఘనంగా రేవతి - కాంతారెడ్డి ల పెళ్లి జరిపించాడు పెద్దిరెడ్డి. ఈడూజోడూ బాగుందని పొగిడారు ఊరి జనం. 


కొత్త కోడలిగా అడుగు పెట్టిన రేవతి దివాణం లాంటి ఇంటిని తన చాకచక్యంతో చక్కదిద్దడం మొదలెట్టింది. ఆడదిక్కు లేనందున ఇల్లు బోసిపోయి కనబడుతోంది. పనివాళ్ల చేత ఇంటి బూజులు దులిపించి గుమ్మాలకు, కిటికీలకు రంగులు వేయించి పరదాలు ఏర్పాటు చేసింది. ఇంటి చుట్టు పువ్వుల మొక్కలు ఫలవృక్షాలు నాటించింది. ఆ దారంట వచ్చే పోయే జనం కొత్త కోడలు పెద్దిరెడ్డి ఇంటిని ఎంత అందంగా మార్చిందోనని మెచ్చుకుంటున్నారు. కోడలి పనితనానికి మామ పెద్దిరెడ్డికి ఎంతో ఆనందంగా ఉంది. 


 భర్త కాంతారెడ్డి వేష భాషల్లో మార్పు తెచ్చింది. ఇదివరకు ఏ లుంగీనో పైజామాతో తిరిగే కాంతారెడ్డి ఇప్పుడు మోడరన్ దుస్తుల్లో స్మార్టుగా కనబడుతున్నాడు. కాంతారెడ్డి ఫ్రెండ్ హైస్కూలు మాస్టారు కనకరాజు కూడా రేవతి తెచ్చిన మార్పులకు ఆశ్చర్య పోయారు. 


పెళ్లికి ముందు రేవతి మనసులోని కోరిక చంద్రం బాబయ్య ద్వారా తెలుసుకున్న కాంతారెడ్డి ఆమెని డిగ్రీ పూర్తి చేయించాలని ఆ ప్రయత్నాలు కనకరాజు మాస్టారి ద్వారా ప్రారంభించాడు. రేవతి డిగ్రీ చదువుకు కావల్సిన స్టడీ మెటీరియల్స్ తెప్పించి భార్యకు సర్ప్రైజ్ చేసాడు. 


తన భర్తలో ఇంతటి ఉదారత మానవత్వం చూసి మురిసిపోయింది రేవతి. సాధారణంగా పెళ్లవగానే భార్య మీద పెత్తనం చెలాయించే మొగుళ్లు, వారి కుటుంబాలకు సేవలు చేయించుకునే మగాళ్లు, తమ కోరికలు తీర్చుకునే భర్తలు ఉంటారు కాని భార్య మనస్తత్వాన్నిఅర్థం చేసుకునీ తనకు చదువు లేకపోయినా భార్యను ఉన్నత చదువులు చదివించే పతులు ఈ కాలంలో కూడా ఉంటారంటే నమ్మలేకపోతోంది. 


సంసార భాద్యతలతో డిగ్రీ చెయ్యాలన్న తన కోరికను అణచుకుని వద్దంటున్నా వినకుండా తన చేత డిగ్రీ పూర్తి చేయించాలన్న భర్త ఆలోచనను అభినందించకుండా ఉండలేకపోయింది. 


భర్త ప్రోత్సాహం హైస్కూలు మాస్టారు కనకరాజు గారి పర్యవేక్షణలో రేవతి ప్రైవేటుగా చదివి ఎగ్జామ్స్ రాసి ప్రథమశ్రేణిలో డిగ్రీ పూర్తి చేసి గ్రాడ్యుయేషన్ పొందడం ఎంతో సంతోషకరం. ఇంట్లో చదువుకున్న ఆడవాళ్లు ఉంటే వారి పిల్లలకు చదువులో ఎంతో ప్రోత్సాహం లభిస్తుంది. 


రేవతి డిగ్రీ పూర్తి చేసేసరికి ఒక బాబుకు తల్లైంది. తన ఇంటి వారసుడు వచ్చాడని పెద్దిరెడ్డి సంబర పడిపోయాడు. మనవడు రేవంత్ రెడ్డి పేరున ఊరి హైస్కూలుకి అదనపు తరగతి గదులు కట్టించాడు. 


 సమాప్తం  


కందర్ప మూర్తి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


  పూర్తి పేరు  :  కందర్ప వెంకట సత్యనారాయణ మూర్తి

  కలం పేరు :  కందర్ప మూర్తి

  పుట్టి పెరిగిన ఊరు : 02 జూలై -1946, చోడవరం (అనకాపల్లి జిల్లా)ఆం.ప్ర.

  భార్య పేరు:   శ్రీమతి  రామలక్ష్మి

 కుమార్తెలు:


శ్రీమతి రాధ విఠాల, అల్లుడు  డా. ప్రవీణ్ కుమార్

              

శ్రీమతి ఉషారమ , అల్లుడు వెంకట్

                  

శ్రీమతి  విజయ సుధ, అల్లుడు సతీష్

                   

  విద్యార్థి దశ నుంచి తెలుగు సాహిత్యం మీద అభిలాషతో చిన్న కథలు, జోకులు, కార్టూన్లు వేసి పంపితే  పత్రికలలో  ప్రచురణ జరిగేవి. తర్వాత హైస్కూలు  చదువులు,  విశాఖపట్నంలో  పోలీటెక్నిక్ డిప్లమో  కోర్సు చదివే రోజుల్లో  1965 సం. ఇండియా- పాకిస్థాన్  యుద్ధ  సమయంలో చదువుకు స్వస్తి  పలికి  ఇండియన్  ఆర్మీ  మెడికల్ విభాగంలో చేరి  దేశ సరిహద్దులు,  

వివిధ నగరాల్లో  20 సం. సుదీర్ఘ సేవల  అనంతరం పదవీ విరమణ  పొంది సివిల్  జీవితంలో  ప్రవేసించి 1987 సం.లో  హైదరాబాదు  పంజగుట్టలోని నిజామ్స్  వైద్య  విజ్ఞాన  సంస్థ  (నిమ్స్ సూపర్  స్పెషాలిటీ  హాస్పిటల్) బ్లడ్ బేంక్  విభాగంలో  మెడికల్ లేబోరేటరీ  సూపర్వైజరుగా  18 సం. సర్వీస్  చేసి  పదవీ  విరమణ  అనంతరం  హైదరాబాదులో కుకట్ పల్లి

వివేకానందనగర్లో  స్థిర  నివాసం.


సుదీర్ఘ  ఉద్యోగ  సేవల  పదవీ విరమణ  తర్వాత  మళ్లా  తెలుగు సాహిత్యం మీద  శ్రద్ధ  కలిగి  అనేక  సామాజిక కథలు,  బాల సాహిత్యం, సైనిక జీవిత అనుభవ కథలు, హాస్య కథలు, విశ్లేషణ వ్యాసాలు, కవితలు, గేయాలు రాయగా  బాలమిత్ర, బుజ్జాయి, బాలల చంద్ర ప్రభ, హాయ్ బుజ్జీ, 

బాలభారతం,  బాలబాట, మొలక,  సహరి,  సాక్షి ఫన్ డే, విపుల,చిన్నారి, హాస్యానందం, ప్రజాశక్తి,  గోతెలుగు. కాం, తపస్వి మనోహరం, సాహితీ కిరణం, విశాఖ సంస్కృతి, వార్త  ఇలా  వివిధ  ప్రింటు, ఆన్లైన్  మేగజైన్లలో ప్రచురణ జరిగాయి.


నాబాలల  సాహిత్యం  గజరాజే వనరాజు, విక్రమసేనుడి  విజయం రెండు  సంపుటాలుగాను, సామాజిక  కుటుంబ కథలు  చిగురించిన వసంతం,  జీవనజ్యోతి   రెండు  సంపుటాలుగా  తపస్వి మనోహరం పబ్లికేషన్స్  ద్వారా  పుస్తక రూపంలో  ముద్రణ  జరిగాయి.


 నా సాహిత్య  రచనలు  గ్రామీణ,  మద్య తరగతి,  బడుగు బలహీన   వర్గ ప్రజల, జీవన విధానం, వారి స్థితిగతుల గురించి రాస్తు  సమాజానికి  ఒక సందేశం  ఉండాలని  కోరుకుంటాను.


 


72 views1 comment

1 Comment


mk kumar
mk kumar
Dec 04, 2024

"మనసెరిగిన మగడు" అనేది కందర్ప మూర్తి గారురాసిన ఒక కథ. ఈ కథలో ప్రధాన పాత్ర రేవతి అనే యువతి. ఆమె తల్లి దేవమ్మతో కలిసి జీవిస్తు, కుటుంబంలో తీవ్ర ఆర్థిక పరిస్థితులలో ఉంది. రేవతి చదువు కొనసాగించాలని కోరుకుంటుంది, కానీ ఆమె తల్లి ఆమెను వివాహం చేసుకోవాలని చెపుతుంది.


చందు మామయ్య, రేవతికి మంచి పెళ్లి అవకాశాన్ని చూపించి, ఆమెకు పెళ్లి సంభందాలపై సలహాలు ఇచ్చాడు. పెళ్లి తర్వాత, రేవతి తన భర్త కాంతారెడ్డితో కలిసి అనేక మార్పులు తీసుకువచ్చి, సమాజానికి గొప్ప సందేశాన్ని అందిస్తుంది.


ఈ కథ, సమాజంలో మహిళా విద్య, గృహ బాధ్యతలు, కుటుంబ సంబంధాల నేపథ్యంలో ఉండే ప్రేమ, కష్టాలు,ధైర్యాన్ని వ్యక్తం చేస్తుంది.


Like
bottom of page