'Manasu Manchidaithe' - New Telugu Story Written By Parupalli Ajay Kumar
'మనసు మంచిదైతే' తెలుగు కథ
రచన: పారుపల్లి అజయ్ కుమార్
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
సాగరతీరం.. సంధ్యాసమయం.. ఉవ్వెత్తున ఎగిసిపడే అలలతో సముద్రం ఉరకలు వేస్తున్నది. పరుగులు పెడుతున్నది. ఎంతో వేగంతో దూకుతూ వచ్చిన అలలన్నీ చెలియలికట్టను దాటి ముందుకు రావటంలేదు. సముద్రం వైపు చూపు సారించి వొడ్డున కూర్చున్నది అవంతి. తీరం చేరాలని ఆరాట పడే కెరటాలు విపరీతమైన వేగంతో వచ్చి అవంతి పాదాలను ముద్దాడి నిండారా అభిషేకించి ఎంతవేగంగా వచ్చాయో అంతేవేగంతో వెనక్కి వెళ్లిపోతున్నాయి. బలంగా వీస్తున్న గాలికి ముంగురులు నుదిటి మీదకు వాలి నాట్యంచేస్తున్నాయి.
బీచ్ అంతా కోలాహలం మొదలయింది. అప్పటిదాకా అలల హోరు తప్ప ప్రశాంతంగా వున్న ఆ ప్రదేశం జనం ఒక్కొక్కరుగా చేరటంతో శబ్ద కాలుష్యమై పోయింది. ఆ రణగొణ ధ్వనులకు కొద్దిగా చిరాకు పడుతూ అక్కడినుండి లేచి ముందుకు నడిచింది అవంతి. తడిసిన ఇసుకలో అడుగులు నెమ్మదిగా పడుతున్నాయి. ఎవరూ లేని చోటు కోసం చూస్తూ నడుస్తున్నది. సముద్రం లోని అలల్లా మనసులో ఎడతెగని ఆలోచనలు అల్లకల్లోలంగా ముసురుకుంటున్నాయి.
ఎవరూ లేని ఏకాంతంలో మనసుతీరా ఏడవాలని వుంది. తనకి అందముంది. చదువు వుంది. లెక్కలేనంత డబ్బూ వుంది. అయినా తన మనసు తెలుసుకుని తనను తానుగా ప్రేమించే వారే లేరు. నాన్న పోయాక బంధువులమని ఇంటచేరి, అమ్మను మానసికంగా వేధించి వేధించి అనారోగ్యానికి గురిచేసారు. అందరికీ తమ డబ్బే కావాలి. దానికోసమే లేని ప్రేమలను, ఆప్యాయతలను నటిస్తున్నారు తమ చుట్టూ చేరిన జనం.
నడుస్తున్న ఆమెకు గాలి తరంగాలు మోసుకొస్తున్న ఏదో ఆలాపన లీలగా వినిపించింది. దూరంగా ఒక పెద్ద బండపై కూర్చోని ఎవరో పాట పాడుతున్నారు. అటువైపు అడుగులు వేసింది.
"ఓ ప్రియతమా..
ప్రియతమా..
ప్రియతమా..
నా మది నిన్ను పిలిచింది గానమై
వేణు గానమై నా ప్రాణమై.."
ఆ పాట గాలిలో తేలుతూ వీనులవిందు చేస్తున్నది. అవంతి అతనిని చూస్తూ ఆ పాట వింటూ అలా నిలుచుండి పోయింది. అతను కళ్ళు మూసుకొని కొద్దిగా తలను వెనుకకు వొంచి తన్మయత్వంతో పాడుతున్నాడు.
కమ్మని గొంతుతో శ్రావ్యంగా అచ్చు రఫీ యే వచ్చి పాడుతున్నాడా అన్నంత మధురంగా పాడుతున్నాడు. ఆ పాట అవంతి మనసును అమ్మలా జోకొట్టి ప్రశాంతతను నింపింది.
పాట ఆగిపోయింది. అవంతి అతనివైపు చూసింది. అప్పుడే అతనూ కళ్ళు తెరచి అక్కడ నిలబడిన అవంతిని చూసాడు.
అవంతి నిశ్శబ్ధాన్ని ఛేదిస్తూ "చాలా బాగా పాడారు. నాకిష్టమైన పాట మీ కంఠంలో మధురాతి మధురంగా పలికింది" అంది.
అతను బండ మీద నుండి క్రిందికి దిగాడు.
"మీరు.." అంటూ ప్రశ్నార్థకంగా చూసాడు అతను.
"నా పేరు అవంతి."
"నా పేరు చక్రవర్తి."
"నేనీ బీచ్ కు తరచూ వస్తుంటాను. మిమ్మల్ని ఎప్పుడూ గమనించలేదు. ఎనీ హౌ కంగ్రాట్యులేషన్స్ " అంటూ చేతిని ముందుకి చాచింది షేక్ హాండ్ కోసం.
చక్రవర్తి ఆ చేతిని అందుకోలేదు. తన రెండు చేతులు జోడిస్తూ నమస్కారం పెడుతూ "థాంక్స్ అండి" అన్నాడు.
అవంతి చిత్రంగా అతనివేపుచూసి చాచిన చేతిని వెనుకకు తీసుకుంది. సంధ్య వెలుగులు క్రమక్రమంగా మాయయమవుతూ చిరు చీకట్లు పరుచుకుంటున్నాయి.
"వస్తానండీ" అంటూ చక్రవర్తి అక్కడినుండి బయలుదేరాడు.
"నేను కూడా బయలుదేరుతాను. బీచ్ బయటిదాకా మీతో వస్తాను. పదండి. " అంటూ అవంతికూడా అతని తోపాటు నడించింది.
"మీరు ఏం చేస్తున్నారు?" అడిగింది నడుస్తూ.
"బ్యాంక్ లో జాబ్" ముక్తసరిగా అన్నాడు.
"ఏ బ్యాంక్?"
"SBI "
"మీరుండేది ఎక్కడ ?"
"జగదాంబ సెంటర్ దగ్గర"
"ఎలా వచ్చారు? వెహికిల్ మీదా?"
"లేదు. నడిచి వచ్చాను."
"నా కారు వుంది. డ్రాప్ చేస్తాను రండి." అవంతి చక్రవర్తితో అంది.
"దగ్గరేకదా! నడిచి వెళ్తాను." మొహమాటంగా అన్నాడు.
అవంతి బలవంతం చేయటంతో కారు ఎక్కక తప్పలేదు చక్రవర్తికి.
డ్రైవింగ్ చేస్తున్న అవంతిని చూస్తూ "మీరేం చేస్తుంటారు ? " అడిగాడు చక్రవర్తి.
"నేనా?" చిన్నగా నవ్వుతూ భుజాలు ఎగరేసింది. "ప్రస్తుతానికి ఏమీ చేయటం లేదు. పెద్దలిచ్చిపోయిన ఆస్తులను ఎలా కాపాడుకోవాలో తెలియక క్రిందా మీదా పడుతున్నాను. ఆ విషయాలు ఆలోచించే బుర్ర వేడెక్కి కాస్త చల్లగాలికి రిఫ్రెష్ అవుదామని బీచ్ కు వచ్చా. మీ పాట విని సేదదీరాను. మనసు కాస్త ప్రశాంతతను సంతరించుకొంది."
కొద్దిసేపటి తరువాత "కారు ఇక్కడ ఆపండి. ఇక్కడ మెస్ లో భోజనం చేసి వెళతా. ఇక్కడి కి నా రూం దగ్గరే" అన్నాడు.
కారు రోడ్డు ప్రక్క కు తీసి ఆపుతూ "భోజనం బాగుంటుందా ఇక్కడ?" అడిగింది అవంతి.
"బాగానే వుంటుంది. ఎందుకు అడుగుతున్నారు?" కారు దిగుతూ అడిగాడు.
"నేను కూడా భోజనం చేద్దామని" అంది అవంతి కారు దిగుతూ.
"మీరా! ఇక్కడా?" అంటూ ఆశ్చర్యంగా చూస్తూ "సరే రండి" అని యెదురుగా వున్న మెస్ లోకి దారితీసాడు.
భోజనం చేస్తూ అడిగింది అవంతి "మీది ఈ వూరు కాదా? మీవాళ్ళు ఎక్కడ వుంటారు?"
"ఆ వివరాలు ఇప్పుడు అంత అవసరమా?" అడిగాడు.
"ఊరికే తెలుసుకుందామని అడిగాను. మిమ్ములను చూసిన దగ్గరనుండి ఏదో తెలియని ఆత్మీయత నన్ను చుట్టి వేసింది. కారణం చెప్పలేను. మీరు నాకెంతో దగ్గర అనే భావం నాలో మొలకెత్తింది. ఎందుకు అంటే నాకే సరిగా తెలియటం లేదు. అందుకే మీ గురించి తెలుసుకుందామని.. మీకిష్టం లేకపోతే చెప్పొద్దు లెండి" కొద్దిగా ముఖం చిన్నబుచ్చుకుంటూ అంది.
"నా గురించి పెద్దగా చెప్పుకునేందుకు ఏమీ లేదు. నాకంటూ ఎవరూ లేని అనాథను. ఊహ తెలిసీ తెలియని రోజుల్లోనే నేనొక బిచ్చగాళ్ల ముఠా లో వుండేవాడిని. రోజూ వాళ్ళు వెళ్ళమన్న చోటికి పోయి రోజంతా అడుక్కుని వచ్చిన డబ్బులన్నీ వాళ్ళ చేతుల్లో పోయాలి. నా అదృష్టమల్లా వాళ్ళు నా కన్నో, కాలో తీయలేదు. ఒకరోజు పెద్ద బజార్ లో అడుక్కుతుండగా ఒక కారు కనిపించి అక్కడికి వెళ్ళాను చేతిలో పళ్లెముతో. కారు ఆగిపోయివుంది. కారులో వున్న పెద్దమనిషి తెగ ఆయాసపడుతూ ఊపిరి పీల్చుకోలేక సతమతమైపోతున్నాడు. అది చూసి నేను ట్రాఫిక్ కానిస్టేబులు దగ్గరికి వెళ్ళి చెప్పాను.
ట్రాఫిక్ కానిస్టేబులు నన్ను, నా ఆకారాన్ని చూసి "పోరా పో " అని గద్దించాడు. నేను ట్రాఫిక్ కానిస్టేబులును వదలక పదేపదే విషయం చెప్పాను. అతను వచ్చి చూసి ఆంబులెన్సు కు ఫోన్ చేసాడు. ఆంబులెన్సు వచ్చి కారులో అతన్ని హాస్పిటల్ కు తీసుకెళ్లింది.
మూడు రోజుల తరువాత ఆ సెంటర్ లో అడుక్కుంటుండగా ట్రాఫిక్ కానిస్టేబులు ఒకతన్ని తీసుకుని నా దగ్గిరకు వచ్చి "వీడేనండీ" అన్నాడు.
అతను ఆ రోజు కారులో వున్న పెద్దమనిషి. అతను నా దగ్గరికి వచ్చి నా వివరాలు అడిగి తెలుసుకున్నాడు. నన్ను ఒక హోటల్ కు తీసుకెళ్ళి కడుపునిండా అన్నం తినిపించాడు.
"చదువుకుంటావా ? ఒక మంచి స్కూల్లో చేర్పిస్తాను." అడిగాడు జాలిగా నా వైపు చూస్తూ. నేను తలకాయ ఊపాను చదువుకుంటాను అన్నట్లు.
"వీడిక్కడ వుంటే వీడి గాంగ్ వీడిని వదలదు. మీరు వీడికి ఏమైనా మంచి చేయదల్చుకుంటే దూరంగా వేరే వూరికి తీసుకెళ్ళి అక్కడ వుంచండి." అన్నాడు ట్రాఫిక్ కానిస్టేబులు.
ఆ పెద్దమనిషి ట్రాఫిక్ కానిస్టేబులుకు కొన్ని నోట్ల కట్టలు ఇచ్చాడు.
నన్ను కారులో ఎక్కించుకుని హైదరాబాద్ తీసుకెళ్ళి ఒక అనాధ శరణాలయములో చేర్చాడు.
"నా ప్రాణాలను కాపాడిన బాలుడు. ఇతన్ని మీరు జాగ్రత్తగా చూడాలి." అని వారికి అప్ప చెప్పాడు. శరణాలయం మేనేజర్ కు కొంత డబ్బు ఇచ్చి నా చదువుకోసం ఖర్చు పెట్టమన్నాడు. అప్పుడప్పుడు వచ్చి చూస్తూవుంటానని చెప్పి వెళ్ళాడు.
ఆ అనాధ శరణాలయము లో చేరినప్పటినుండి నా జీవితం మరో మలుపు తిరిగింది. చదువు లేట్ గా మొదలుపెట్టినా ఒక తపస్సులా చదివాను. ఒకొక్క పరీక్ష పాసవుతూ డిగ్రీ చేసాను. బాంక్ టెస్టులు రాసి జాబ్ సంపాదించా. డిగ్రీ తరువాత శరణాలయం నుండి బయటకి వచ్చాను. జాబ్ వచ్చాక జీతం డబ్బులు సగం నేనుంచుకొని మిగతా సగం శరణాలయానికి ఇస్తున్నాను.
ఆ శరణాలయం మిగిలిన శరణాలయాల్లా పాప పంకిలం కాలేదు. ఆ నిర్వాహకులు నేటికీ సేవా దృక్పథం తోనే దాన్ని నడిపిస్తున్నారు. నిజమయిన మానవ సేవకు అర్థం నేనక్కడే తెలుసుకున్నాను.
నా జీవితం కూడా ఆ మార్గంలోనే నడవాలని నా ఆశయం. ప్రజలకు మరింత సేవ చేయాలనే సంకల్పంతోనే సివిల్స్ రాసాను. ప్రిలిమ్స్, ఫైనల్ పరీక్షలు క్వాలిఫై అయ్యాను. వచ్చే నెలలో ఢిల్లీలో ఇంటర్వ్యూ వుంది. నన్ను శరణాలయం లో చేర్చి నాజీవితాన్ని వెలిగించిన మహానుభావుడు రాజా హరిశ్చంద్ర ప్రసాద్ గారు.
నా చిన్నపుడు అప్పుడప్పుడు శరణాలయానికి వచ్చి నన్ను చూసేవారు. వారు వచ్చినప్పుడల్లా శరణాలయం లోని వారికి ఎన్నో మంచి మంచిమాటలు చెప్పేవారు. మానవసేవే మాధవసేవ అని అనేవారు.
'మన మనసు మంచిది అయితే వూరంతా మనవెంటే వుంటుంది. కలిసిపోయే మనసే మనదైతే అందరూ మనవాళ్ళే' అని చెప్పేవారు. వారు చెప్పిన ఒక సంస్కృత శ్లోకం నాకిప్పటికీ గుర్తే.
'అయం నిజః పరోవేతి
గణనా లఘు చేతసాం
ఉదార చరితానాంతు
వసుధైవ కుటుంబకం'
ఈ శ్లోకము నారాయణ పండితుడు రాసాడు అని దాని అర్థం కూడా చెప్పారు.
'ఇతడు నావాడు, అతడు పరాయివాడు అనే భావన అల్ప బుద్ధి కలవారికి మాత్రమే ఉంటుంది. ఉన్నతమైన నడవడి గలవారికి ఉదారమైన బుద్ధిజీవులకు మాత్రం ఈ భూమండలమంతా ఒకే కుటుంబం. భూమి మీద నివసించే ప్రజలంతా ఆ కుటుంబ సభ్యులే.
‘సర్వే జనాస్సుఖినోభవంతు, లోకాస్సమస్తా స్సుఖినో భవంతు’ అనే విశ్వ జనీనమైన భారతీయ భావనతో ప్రజాసేవ చేసిన మహాత్ములు ఎందరో ఉన్నారు. మనం అంత కాకపోయిన మనకున్నది నలుగురికి పంచటంలోనే ఆనందమున్నది అని గ్రహించండి. 'అని ఉద్బోధించేవారు.
పరోపకారార్థం ఇదమ్ శరీరం అన్నట్లుగా మసలేవారు. చిన్నప్పటినుండి నాకు సినిమా పాటలు ఇష్టం. రాజా హరిశ్చంద్ర ప్రసాద్ గారు వచ్చినప్పుడల్లా నా చేత నాలుగయిదు పాటలు పాడించుకొని వినేవారు. ఒక ఏడాడి పాటు సంగీతం కూడా చెప్పించారు వారు.
నేను ఇంటర్ లో వుండగా వారు స్వర్గస్తులైనారని విన్నాను. వారి కుటుంబ వివరాలు, వారు ఎక్కడ వుండేది నాకు తెలియదు. నాకు జాబ్ వచ్చాక వారి కుటుంబాన్ని కలుసుకుని ధన్యవాదాలు తెలుపుకుందామనుకున్నాను. ఈ సివిల్స్ ప్రిపరేషన్ వల్ల వీలుకాలేదు. ఇంటర్వ్యూ అయ్యాక వారి ఆచూకీ తెలుసుకుని కలుసుకోవాలి అని అనుకొన్నాను." సుదీర్ఘంగా చెప్పటం ముగించాడు.
ఆ సరికి వారి భోజనాలు అయిపోయాయి. చేతులు కడుక్కుంటూ "ఈ మధ్య కాలంలో ప్రశాంతంగా కడుపునిండా తిన్నది ఈ రోజే. భోజనం చాలా బాగుంది. థాంక్స్ " అంది అవంతి. ఆమె మాటలు సరిగా అర్థం కాలేదు చక్రవర్తికి.
"మీ మొబైల్ నంబర్ చెప్పండి." అని అడిగి చక్రవర్తి చెప్పిన నంబర్ సేవ్ చేసుకుంది అవంతి.
మెస్ నుండి బయటకు వస్తూ సెల్ లో ఒక ఫొటో చూపిస్తూ "వీరేనా? మీరు చెప్పిన రాజా హరిశ్చంద్ర ప్రసాద్ గారు" అడిగింది.
చక్రవర్తి ఆ ఫొటో చూస్తూనే ఆశ్చర్యంతో " వీరే ! ఈ ఫొటో మీ దగ్గర ఎందుకుంది? మీకు తెలుసా? మీ బంధువులా? మీ నాన్న గారి స్నేహితులా? పరిచయస్తులా?" గబగబా అడిగాడు.
అవంతి చిన్నగా నవ్వుతూ హాండ్ బాగ్ లోనుండి ఓ విజిటింగ్ కార్డ్ తీసి చక్రవర్తికి యిస్తూ "రేపు ఈ అడ్రసు కు రండి. వివరాలు తెలుస్తాయి." అని కారు ఎక్కి వెళ్ళిపోయింది.
వెళ్లిపోతున్న కారువంక చూస్తూ భలే మనిషి అని అనుకున్నాడు మనసులో. నా గురించి అన్ని వివరాలు చెప్పాను. కానీ తన గురించి ఏమీ అడగలేదే అనుకొని రేపు కలిసినపుడు అడగాలని అనుకున్నాడు చక్రవర్తి.
********************************
మరుసటి రోజు చక్రవర్తి బ్యాంక్ వర్కింగ్ అవర్స్ అయిన తరువాత అవంతి ఇచ్చిన అడ్రస్ వెతుక్కుంటూ వెళ్ళాడు. చాలా పెద్ద బంగాళా అది. గేటు దగ్గర గూర్ఖాకు తన పేరుచెప్పి అవంతి ఇచ్చిన విజిటింగ్ కార్డ్ చూపించాడు.
గూర్ఖా లోపలికి ఫోన్ చేసాడు. రెండు నిమిషాలలో అవంతి గేటు దగ్గరికి వచ్చి చక్రవర్తిని చిరునవ్వుతో "రండి "అని లోపలికి తీసుకుపోయింది.
హాలులో అడుగుపెట్టగానే రాజా హరిశ్చంద్ర ప్రసాద్ గారి నిలువెత్తు చిత్రపటం కనపడింది. నిజంగా మనిషే నిలుచుని ఉన్నారా అన్నంతగా జీవకళ ఉట్టిపడుతున్నది ఆ చిత్రపటంలో. చక్రవర్తి చేతులు ముకుళించి ఆ పటానికి నమస్కారం చేసాడు.
"వీరు.." అంటూ అవంతివంక ప్రశ్నార్థకంగా చూసాడు.
"మా నాన్నగారు. లాన్ లో కూర్చొని మాట్లాడుకుందాం రండి" అంటూ గార్డెన్ లోకి దారితీసింది. విస్మయంగా ఆమెను చూస్తూ అనుసరించాడు చక్రవర్తి. ఇద్దరూ వెళ్ళి అక్కడ వున్న కుర్చీలలో కూర్చున్నారు. సర్వెంటు మెయిడ్ జ్యుస్ గ్లాసులు తెచ్చి అక్కడ పెట్టి వెళ్ళింది. అవంతి ఒక గ్లాస్ చక్రవర్తి చేతికి అందించింది. తనూ ఇంకో గ్లాసు తీసుకుని సిప్ చేస్తూ చెప్పసాగింది.
"రాజా హరిశ్చంద్ర ప్రసాద్ మా నాన్నగారు. మాటల్లో చెప్పలేనంత మంచితనం, మానవత్వం మూర్తీభవించిన మనిషి. పెద్దల నుండి సంక్రమించిన ఆస్తిపాస్తులు లెక్కలేనన్ని. బిజినెస్ పరంగా కూడా ఎన్నో కోట్లు సంపాదించారు. ఎన్నో ధార్మిక సంస్థలకు, అనాథ శరణాయాలకు, వృద్ధాశ్రమాలకు గుప్తదానాలు చేసేవారు. ఎంతో మంది అనాథలను చేరదీసి చదువుసంధ్యలు చెప్పించారు. వారు నేడు పెద్ద పెద్ద ఉద్యోగాలలో ఉన్నారు. కానీ నాన్నగారు వారిని చదివించారు అని చెప్పుకోవటం నామోషీ. నిన్న మీ నోటి నుండి నాన్న గారిని పొగడటం నాకు
ఆశ్చర్యమనిపించింది." తాగిన గ్లాసు టీపాయి మీద పెట్టి తిరిగి చెప్పసాగింది.
"నేను పదో తరగతి చదువుతుండగానె నాన్న చనిపోయారు. అమ్మ నాన్న పోయిన దిగులునుండి తేరుకుని వ్యాపారాలను చూడటం మొదలుపెట్టింది. నాన్న ఉన్నప్పుడు రాని బంధువులంతా వచ్చి యింట్లో తిష్టవేశారు. అమ్మ మెతకదనాన్ని ఆసరాగా తీసుకుని మా వెనుకే గోతులు తవ్వటం ప్రారంభించారు. నాన్న చేసే దానధర్మాలన్నీ అమ్మ కూడా కొనసాగించింది. ప్రతీ సంవత్సరం ఆయా సంస్థలకు చెక్కుల రూపంలో పంపటం జరిగేది. యింట్లో చేరిన బంధువులకు అలా దాన ధర్మాలు చేయడం నచ్ఛలేదు.
డబ్బులను విచ్చలివిడిగా ఖర్చు చేయొద్దని అమ్మ మీద ఒత్తిడి తెచ్చేవారు. తమకు ఏదో అవసరాలు వున్నాయని చెప్పి ఆవంకా ఈవంకా అమ్మదగ్గర డబ్బులు తీసుకునేవారు. వ్యాపారాల్ల, అమ్మచేసే ప్రతీ పనిలో జోక్యం చేసుకునేవారు. అయిదారు సంవత్సరాల పాటు అమ్మ వారితో
ఇబ్బందులు పడింది. నేను చదువు ధ్యాసలో ఇవన్నీ గమనించలేదు మొన్నమొన్నటి వరకూ.
నన్ను ఓ వేలు విడిచిన మేనమామ కొడుకు పెళ్లి చేసుకుంటానని వెంటపడేవాడు. వాడు చదువు సంధ్యలు లేని చవట సన్యాసి. తాగడం, క్లబ్బులలో, పబ్బులలో తిరగటమే వాడిపని. నాకు కాలేజీ రోజులలో కూడా పెద్దగా ఫ్రెండ్స్ అంటూ ఎవరూ లేరు. నా డబ్బులు చూసి నావెనుక తిరిగేవారే కానీ నామనసుకు దగ్గరగా వచ్చినవారు లేరు.
బంధువులు రాబందుల్లా వేధించటంతో అమ్మ ఆరోగ్యం దెబ్బతిన్నది. అమ్మను యింట్లో ఉంచటం కన్నా హాస్పిటల్ లో ఉంచటం మంచిదని ఒక కార్పరేట్ హాస్పిటల్ లో అమ్మను అడ్మిట్ చేసాను. మా లాయరు వచ్చి మా బంధువులందరిని బెదిరించి యింటిలో నుండి బయటకు పంపేశాడు. నన్ను మాత్రం కొద్ది రోజులు జాగ్రత్తగా ఉండమన్నాడు. ఇవన్నీ చూస్తూ మనసు లో ప్రశాంతత అన్నది లేకుండా పోయింది.
నిన్న మీపాట విని మిమ్ములను చూసాక మనసు శాంతపడింది. అందుకే ఇంకొద్ది సేపు మీ సమక్షములో గడపాలని అనిపించింది. యింట్లో బంధువులను తరిమివేసాను కానీ మనసులో చెలరేగె ఆలోచనలను, భయాలను అదుపుచేయ లేకపోతున్నాను. యింట్లో సరిగా భోజనం కూడా చేయలేకపోతున్నాను. అమ్మ హాస్పిటల్ లో, నేను ఇక్కడ ఇంత యింటిలో ఒంటరిగా.. బాధగా, భయంగా బతుకీడుస్తున్నాను." నిట్టూర్చింది.
"మీరు రాజా హరిశ్చంద్ర ప్రసాద్ గారి అమ్మాయి అంటే నాకు చాలా సంతోషంగా వుంది. ఈ జీవితం మీ నాన్నగారు ఇచ్చింది. మీకు ఎప్పుడు ఎటువంటి అవసరం వచ్చినా నాకు ఫోన్ చేయండి. నాకు చేతనైన పని ఏదైనా చేస్తాను. మీరు చెప్పిన విషయాలన్నీ విన్నాను. దీనికి రేపు ఆలోచించి ఒక పరిష్కార మార్గం చెపుతాను. మీకిష్టమయితే దాన్ని ఫాలో కావచ్చు. రేపు సాయంత్రం వెళ్ళి మీ అమ్మగారిని చూసి వద్దాం. ప్రస్తుతానికి నేను సెలవు తీసుకుంటాను" అని అవంతికి నమస్కారం పెట్టి బయటకు వచ్చాడు చక్రవర్తి.
****************************
ఆ రాత్రి పదిగంటలప్పుడు చక్రవర్తి సెల్ మోగింది. తీసి చూసాడు. క్రొత్త నెంబర్. అటువైపు కంఠం వింటూనే గుర్తుపట్టాడు. అవంతి.
"మీరు ఒక క్యాబ్ బుక్ చేసుకుని తొందరగా మాఇంటికి రండి. నాకు వాంతులు అవుతున్నాయి. వొళ్ళంతా చెమటలు పడుతున్నాయి. ఫుడ్ పాయిజనింగ్ అని నా కనుమానంగా వుంది. గూర్ఖాకు చెప్పి గేటుతీసి వుంచుతాను. వెంటనే రండి" గాభరాగా చెప్పింది.
"వెంటనే బయలుదేరుతున్నాను. భయపడకుండా జాగ్రత్తగా ఉండండి" అంటూ వెంటనే పాంటు, చొక్కా వేసుకొని టాక్సీ స్తాండ్ కు పరిగెత్తాడు.
గేటు తీసే వుంది. టాక్సీ సరాసరి లోపలికి పోనిచ్చాడు. మెట్ల మీదే కూలబడి వుంది అవంతి. డ్రైవరు సాయంతో ఆమెను టాక్సీలోకి చేర్చాడు. టాక్సీ కదలగానే అవంతి కొద్దిగా కళ్ళు తెరచి తీసుకెళ్ల వలసిన హాస్పిటల్ పేరు చెప్పింది.
********************************
రెండురోజుల్లో తేరుకుంది అవంతి. చక్రవర్తి బ్యాంక్ కు సెలవుపెట్టి రెండురోజులు హాస్పిటల్ లోనే ఉన్నాడు. లాయరు వచ్చాక వంటమనిషిని అరెస్టు చేస్తే నిజాలు బయటకు వచ్చాయి. ముగ్గురు బంధువులు కలసి వంటవాడిని ప్రలోభపెట్టి ఆమె తినే ఆహారంలో పాయిజన్ కలిపించారు. అయితే మనసు సరిగాలేక అవంతి రెండు ముద్దలు మాత్రమే తినిలేచింది. అదే ఆమెను కాపాడింది. పోలీసులు కేసు ఫైల్ చేసి నలుగురినీ అరెస్టు చేసారు.
అవంతి తల్లికి ఈ విషయం తెలిసి తను వున్న హాస్పిటల్ నుండి కూతురు వున్న హాస్పిటల్ కు వచ్చి అవంతి ని చూసి ఏడిచింది. చక్రవర్తి ఆమెకు ధైర్యం చెప్పాడు. అవంతి చక్రవర్తి ని తల్లికి పరిచయం చేసింది.
"ఆ రోజు నాన్నగారి ప్రాణాలు కాపాడారు. ఈ రోజు నన్ను ప్రాణాపాయం నుండి రక్షించారు. మీ ఋణం ఎలా తీర్చుకోవాలో?" అవంతి నీరసంగా పలికింది.
ఆ రాత్రి "నిద్ర రావటం లేదు. భయం భయంగా వుంది" అంటూ చిన్నపిల్లలా తల్లడిల్లిపోతున్నది అవంతి.
"నేను ప్రక్కనే ఉంటాను. భయపడకుండా కళ్ళు మూసుకుని పడుకోండి. " లాలనగా అన్నాడు.
"ఒక పాట పాడరా.. వింటూ నిద్రపోతాను" మారాముగా అడిగింది.
"పాడుతా తీయగా చల్లగా..
పసి పాపలా నిదరపో తల్లిగా..
బంగారు తల్లిగా..
కునుకు పడితె మనసు కాస్త కుదుట పడతదీ
కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటదీ
కలలె మనకు మిగిలిపోవు కలిమి చివరకూ.. "
పాటవింటూనే నిద్రపోయింది అవంతి.
తెల్లవారి అవంతి తో ఒంటరిగా వున్నప్పుడు చక్రవర్తి అన్నాడు "డబ్బులు లేక లోకంలో ఎందరో బాధలు పడుతున్నారు. మితిమీరిన డబ్బులు ఉండటం కూడా ప్రమాదమే అని మిమ్ములను చూస్తుంటే తెలుస్తోంది. మొన్న మీరు చెప్పాక ఆలోచించాను.
మీ ఆస్తిపాస్తులలో మీరు కొంత ఉంచుకుని మిగతా ఆస్తులతో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయండి. మీరు, మీ అమ్మగారు, మీకు నమ్మకమైన వ్యక్తులు, మీ లాయరు వీరందరినీ ట్రస్ట్ సభ్యులుగా చేయండి. మీ లాయరుగారి సహకారంతో, మీ నాన్నగారి ఆశయాలకు, ఆదర్శాలకు అనుగుణంగా ట్రస్టు విధివిధానాలను రూపొందించండి.
మీరు, మీ కుటుంబం మంచి మనసున్న వాళ్ళు. మీరు కలకాలం జీవించితేనే నాలాంటి వాళ్ళకు కొండంత అండగా ఉండగలరు. ఎవరో ఒకరిద్దరు మనను ఇష్టపడటంలేదని, ద్వేషిస్తున్నారని వారి గురించి అదేపనిగా అలోచించి మనసు పాడుచేసుకోవద్దు. మీ అమ్మగారిని చూసుకోవలసిన బాధ్యత కూడా మీమీద వుంది. మీ కుటుంబం యిప్పటికే ఎంతోమంది జీవితాలను వెలిగించింది. ఇంకా ఇంకా అనేక జీవితాలకు వెలుగునివ్వాలి మీరు.
మీకు హాని చేసే ఆస్తులు మీపేరున వుంచుకోకండి. ఇది నా సలహా మాత్రమే. అలోచించి నిర్ణయం తీసుకోవలసినది మీరే. రేపు మిమ్ములను డిశ్చార్జ్ చేస్తామన్నారు డాక్టరు గారు. ఎల్లుండి నేను ఢిల్లీ వెళ్తున్నాను. సివిల్స్ ఇంటర్వ్యూ వుంది. అది చూసుకొని మూడు రోజుల్లో వస్తాను. "
"బెస్ట్ ఆఫ్ లక్.." అంటూ కుడి చేతిని ముందుకు చాచింది.
"థాంక్యూ" అంటూ ఆ చేతిని అందుకొన్నాడు చక్రవర్తి.
*******************************
ఇంటర్వ్యూ కాగానే అవంతి కి ఫోన్ చేసి చెప్పాడు. దాదాపుగా సెలెక్ట్ అయినట్లేనని. అవంతి అభినందనలు తెలియచేసింది.
చక్రవర్తి చెప్పిన విషయాలను తల్లితో చర్చించింది. లాయరుతో మాట్లాడింది. ట్రస్టు ఏర్పాటుకు వారు కూడా ఓకే చెప్పారు. చక్రవర్తి ని రిసీవ్ చేసుకోటానికి ఎయిర్ పోర్టు కు వెళ్ళింది. చక్రవర్తి ని తీసుకుని పదిరోజులక్రితం వెళ్లిన మెస్ కు వచ్చింది.
భోజనం చేస్తూ తన మనసులో మాటను బయట పెట్టింది "మీకు ఆరోజే చెప్పాను. మిమ్ములను మొదటిసారిగా చూడగానే మీ మీద ఏదో తెలియని ఇష్టం కలిగిందని. ఇన్ని రోజులు నేను ఆలోచిస్తే తెలిసింది. ఆ ఇష్టమే ప్రేమని. ప్రేమ అన్నది ఎప్పుడు ఎవరిమీద పుడుతుందో ఎవరూ చెప్పలేరు. నేను ఆ రోజు నాలో కలిగిన భావాలను సరిగా వ్యక్తపరచలేక పోయాను. లవ్ యట్ ఫస్ట్ సైట్. ఎస్.. ఐ యాం ఫాలింగ్ ఇన్ లవ్ విత్ యూ.. నేను నా మనసా వాచా కర్మణా నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు ఇష్టపడితే పెళ్ళి చేసుకోవాలని ఆరాట పడుతున్నాను."
చక్రవర్తి ఆశ్చర్యంతో ఆమెనే చూస్తుండిపోయాడు. భోజనాలు ముగించి ఇద్దరూ వెళ్ళి కారులో కూర్చున్నారు.
రెండు నిమిషాల తరువాత "అవంతీ ఆవేశంలో వున్నట్లున్నావు. నిదానంగా ఆలోచించు. నువ్వెక్కడ? నేనెక్కడ? నాకూ నీకూ నక్కకు నాగలోకానికున్నంత ఎడముంది. తల్లీ తండ్రీ ఎవరో కూడా తెలియని అనాథను. నా ఆశయాలు, ఆదర్శాలు వేరు. నీకూ నాకూ పొసగదు " నెమ్మదిగా నచ్చచెప్పే ధోరణిలో అన్నాడు.
"నేను ప్రస్తుతం ధనవంతురాలిని కాను. మా ఆస్తులన్నీ ట్రస్టు కు అప్పచెప్పాలని అమ్మను కూడా ఒప్పించాను. లాయరు గారు ఆ ఏర్పాటులన్నీ చూస్తున్నారు. ఆ ట్రస్టుకు గౌరవ అధ్యక్షులు మీరే. కమిటీ యేర్పాటు అవుతున్నది. మీ మార్గమే నా మార్గం. ఇంకేం కారణాలు చెప్పొద్దు. నేను నచ్చకపోతే చెప్పండి." కళ్ళలో నీరు తిరుగుతుండగా అంది.
చక్రవర్తి ఆమె చెక్కిలిపై కారుతున్న కన్నీటిని తుడుస్తూ "నిన్ను ఇష్టపడలేదని అబద్దం చెప్పలేను" అన్నాడు.
మరునిమిషంలో చక్రవర్తి కంఠంలోనుండి తేనెలూరుతూ జాలువారిందీ పాట.
"ఎవరికి వారౌ స్వార్ధంలో
హృదయాలరుదౌ లోకంలో
నాకై వచ్చిన నెచ్చెలివి
అమృతం తెచ్చిన జాబిలివి
నాకమృతం తెచ్చిన జాబిలివి
ధనం కోరి మనసిచ్చే ధరణి
మనిషిని కోరి వచ్చావే
నా అనువారే లేరని నేను
కన్నీరొలికే కాలంలో
ఉన్నానని నా కన్నతల్లివలే
ఒడిని చేర్చి నను ఓదార్చావే
నాకై వచ్చిన నెచ్చెలివి
అమృతం తెచ్చిన జాబిలివి.."
"ఇంతకన్నా నా మనసుని నీకెలా తెలుపను? నాకు సంవత్సరంపాటు ట్రయినింగ్ఉంటుంది. మరి.." ఆగిపోయాడు చక్రవర్తి.
"ఆవిషయాలన్నీ వచ్చి అమ్మతో మాట్లాడండి. అమ్మ ఇప్పుడు ఇంటిలోనే వుంది." సిగ్గుగా అంటూ కారు స్టార్ట్ చేసింది అవంతి.
*********************************
పారుపల్లి అజయ్ కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
నా పేరు పారుపల్లి అజయ్ కుమార్ ...
పదవీ విరమణ పొందిన ప్రభుత్వ జూనియర్ అధ్యాపకుడుని ...
ఖమ్మం జిల్లా, ఖమ్మం పట్టణ వాసిని ...
సాహిత్యం అంటే ఇష్టం .... కథలు,
నవలలు చదవటం మరీ ఇష్టం ...
పదవీ విరమణ తరువాత నా సహచరి దుర్గాభవాని సహకారంతో ఖమ్మం లో
"పారుపల్లి సత్యనారాయణ పుస్తక పూదోట - చావా రామారావు మినీ రీడింగ్ హాల్ " పేరిట ఒక చిన్న లైబ్రరీని మా ఇంటి క్రింది భాగం లో నిర్వహిస్తున్నాను ..
షుమారు 5000 పుస్తకాలు ఉన్నాయి .
నిరుద్యోగ మిత్రులు ఎక్కువుగా వస్తుంటారు ..
రోజుకు 60 నుండి 70 మంది దాకా వస్తుంటారు ...
ఉచిత లైబ్రరీ ....
మంచినీరు ,కుర్చీలు ,రైటింగ్ ప్యాడ్స్ ,వైఫై ,కరెంటు అంతా ఉచితమే ...
ఉదయం 6 A M నుండి రాత్రి 10 P M దాకా ఉంటారు ...మనసున్న
మనిషిగా నాకు చేతనైన సాయం నిరుద్యోగ మిత్రులకు చేస్తున్నాను. ఇప్పుడిప్పుడే కొంతమందికి జాబ్స్ వస్తున్నాయి.
@murali7009 • 13 hours ago (edited)
కథ చాలా బాగుంది సర్. మెస్ లో భోజనం చేస్తూ అవంతికి చక్రవర్తి చెప్పిన కథ విన్నప్పడే అవంతి తండ్రి హరిశ్చంద్ర ప్రసాద్ గారేనని ఊహించా. చక్కని సందేశాత్మక కథ. అభినందనలు అజయ్ సర్..