top of page
Writer's pictureNallabati Raghavendra Rao

మనసు పరిమళించిన మధురమైన రోజు

#NallabatiRaghavendraRao, #నల్లబాటిరాఘవేంద్రరావు, #ManasuParimalinchinaMadhuramaina Roju, #మనసుపరిమళించినమధురమైనరోజు, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Manasu Parimalinchina Madhuramaina Roju - New Telugu Story Written By - Nallabati Raghavendra Rao 

Published In manatelugukathalu.com On 16/12/2024 

మనసు పరిమళించిన మధురమైన రోజుతెలుగు కథ

రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: పద్మావతి కొమరగిరి



ఆరోజు దుష్యంత్ పుట్టినరోజు. అతడు.. కోటీశ్వరుడు ధనంజయరావు ఒక్కగానొక్క కొడుకు. ఆ తండ్రి, కొడుకులు సరదాలు సంతోషాలతో ప్రతిరోజు స్నేహితుల వలె గడుపుతుంటారు. కొడుకు ఎదురుగా ఉన్నాడని తండ్రి ఏమాత్రం తన సరదాలు తగ్గించు కోడు. అలాగే తండ్రి తన ముందు ఉన్నాడని కొడుకు కూడా ఏమాత్రం తన సరదా తగ్గించుకోడు. అయితే ఆ విధానం ధనుంజయరావు భార్య దమయంతికి అసలు నచ్చుబాటు కాదు. ఎందుకంటే వాళ్లు చేసేవి అల్లరి చిల్లర పనులు కనుక. కానీ ఏమీ చేయలేక చూసి చూడనట్టుగా ఉంటుంది. 


''మై డియర్ దుష్యంత్.. నీ పుట్టినరోజు ఏర్పాట్లు బాగున్నాయా. మన ఇంట్లో బర్త్ డే డెకరేషన్ చేయించడానికి లక్ష రూపాయలు అయింది. సరిగ్గా 100 కేజీల డెకరేషన్ కేక్ తయారు చేయించడానికి కూడా లక్ష రూపాయలు అయింది. మరి నీ ఫ్రెండ్స్ చాలా మంది ఇప్పుడు వస్తున్నారు కదా.. దుష్యంత్ అంటే ఆర్డినరీ దుష్యంతు కాదు.


 ఈ ధనంజయరావు కొడుకుగా ఒక ఉన్నత జీవితం సాగించాలి. అప్పుడే నా హోదాకు సరైన విలువ. ఓకే మైడియర్ సన్.. ఒక గంటలో గ్రాండ్ గా జరిగే నీ బర్త్ డే ఫంక్షన్ మరింత గ్రాండ్గా ముగుస్తుంది దానికేం లోటు లేదు. 


నెక్స్ట్ సాయంత్రం హోటల్ సవేరా లో ఇంతకన్నా గ్రాండ్ పార్టీ. నీ ఫ్రెండ్స్ తో పాటు నా ఫ్రెండ్స్ కూడా 500 మంది వస్తున్నారు. అందరూ కోటీశ్వరులే.. కొంతమంది బడా వ్యాపారవేత్తలు, కొంతమంది రాజకీయ నాయకులు, కొంతమంది సినీ స్టార్స్ కూడా వస్తున్నారు. వాళ్లంతా నీకు తెలిసిన వాళ్లే.. ఇప్పుడు జరగబోయే కేక్ ఫంక్షన్ నీ గురించి అయితే సాయంత్రం జరగబోయే హోటల్ ఫంక్షన్ నా గురించి అనుకో. 


నాన్ వెజ్ వెరైటీస్, మందు అన్ని మామూలే.. మన కుటుంబ డిగ్నిటీ తగ్గకుండా పది లక్షల ఖర్చు పెడుతున్నాను. మీ డాడ్ ఉన్నాడని నువ్వేమీ ఫీల్ అవ్వాల్సిన పనిలేదు. మనిద్దరికీ సరదాలు.. సిగరెట్లు మామూలే కదా.. ఎంజాయ్ మైడియర్ సన్ ఎంజాయ్. మనం సంపాదించింది ఖర్చు పెట్టుకోవడానికి కాకపోతే ఎందుకురా. ఒకే.. ఇట్స్ ఆల్ రైట్. ఎంజాయ్ ఎంజాయ్. '''


అలా కొడుకును ఉత్సాహపరిచి ఆనందంగా మేడ మీదకు వెళుతున్న తండ్రిని చూసి తండ్రి మాటలు విన్న దుష్యంత్ తనలో నవ్వుకున్నాడు. 


**


కాసేపటికి దుష్యంత్ ఫ్రెండ్స్ అందరూ రావడం, కేక్ పార్టీ గ్రాండ్ గా మొదలవడం జరిగిపోయాయి. 


ఘనంగా కేక్ కట్ జరిగిన తర్వాత.. వాళ్ళందరూ దుష్యంత్ నోట్లో కేక్ పెట్టడం.. దుష్యంత్ అందరికీ కేక్ పెట్టడం ఆ కార్యక్రమం కూడా జరిగి పోయాక అందరూ దుష్యంత్ ని గట్టిగా కౌగిలించుకున్నారు. కొందరు షేక్ హ్యాండ్ ఇచ్చారు. మొత్తానికి అందరూ హ్యాపీ బర్త్ డే విషెస్ చెప్పడం పూర్తయింది. 


ఇవన్నీ జరిగిపోయాక దుష్యంత్ మాట్లాడడానికి మైక్ పట్టుకొని ముందుకు వచ్చాడు.. తరలివచ్చిన అతని ఫ్రెండ్స్, వాళ్ళ అందరితోపాటు ధనంజయరావు కూడా మాటలు వినడానికి ఆత్రుతగా సైలెంట్ అయిపోయారు. దుష్యంత్ తల్లి దమయంతి, మిగిలిన దగ్గర బంధువర్గం కూడా కొంచెం దూరంగా నిలబడి ఆనందంగా వింటున్నారు. 


''మమ్మీ డాడీ కి నమస్కారం.. నా ఫ్రెండ్స్ అందరికీ అభినందనలు.. నేను ఎక్కువగా స్పీచ్ ఇచ్చి మిమ్మల్ని బోర్ కొట్టించ దలచుకోలేదు. అయితే మీకు ఒక సెన్సేషన్ న్యూస్ నేను ఈ బర్త్ డే నాడు చెప్పాలనుకుంటున్నాను. 

వినండి. ఈరోజు నుండి నేను మాంసాహారం.. మద్యం.. సిగరెట్స్ కూడా పూర్తిగా మానేయాలని ఈ ఉదయమే నిర్ణయం చేసుకున్నాను. ఎందుకంటే ఇప్పుడిప్పుడే నా కెరియర్ మొదలవుతుంది. ఇ్పటికి వరకు ఉన్న దుష్యంతులా కాకుండా తండ్రికి పనికి వచ్చే తనయుడిగా ఎదగాలని అనుకుంటున్నాను. అందుకని అందరూ క్షమించండి. సాయంత్రం పార్టీకి నేను రావడం లేదు. అది క్యాన్సిల్ చేయండి. '' అన్నాడు. 


అందరూ ఆశ్చర్యపోయారు. తండ్రి మరింత ఆశ్చర్యంగా కొడుకు దగ్గరకు వచ్చాడు. ఏదో చెప్పబోయాడు. తనది ఖచ్చిత నిర్ణయం అని ఖచ్చితంగా మరొకసారి చెప్పి తన గదిలోకి వెళ్లిపోయాడు దుష్యంత్. 


''వాడు అలాగే అంటాడు. మీరందరూ యధావిధిగా హోటల్ సవేరాకు సాయంత్రం 6 గంటలకు వచ్చేయండి. మా అబ్బాయి నిజంగా నిర్ణయం తీసుకోదలిస్తే రేపటి నుంచి తీసుకోమని చెప్తా'. 10 లక్షల ఖర్చు పెట్టి హోటల్ సవేరా లో గ్రాండ్గా చేస్తున్న పార్టీ తప్పకుండా జరుగుతుంది. నేను ఎలాగైనా వాడిని తీసుకొస్తా.. మీరందరూ వచ్చేయండి” అంటూ చెప్పి తను కూడా లోపలికి వెళ్ళిపోయాడు ధనుంజయరావు.


*


సాయంత్రం అయింది. టిప్ టాప్ గా తయారయ్యాడు ధనుంజయరావు. బయట ఐదు కోట్ల విలువైన కారు రెడీగా ఉంది. తన కొడుకు గదిలోకి వెళ్లి చూశాడు. భగవద్గీత చదువుతున్నాడు. 


''మై డియర్ సన్.. నీ నిర్ణయం అమోఘం, అద్భుతం. ఇదే నిర్ణయం ఈరోజు కాకుండా రేపటి నుండి తీసుకో. ఎందుకంటే 10 లక్షల ఖర్చుపెట్టి గ్రాండ్గా చేస్తున్న పార్టీకి వస్తున్న నీ ఫ్రెండ్స్ అందరూ.. అలాగే నా ఫ్రెండ్స్ అంద రూ నీ మూలంగా అప్సెట్ అవ్వకూడదు కదా.. ఒక్క పూట నీ ఆలోచన పోస్ట్ పోన్ చేసుకోమని మాత్రమే నీ తండ్రి అడుగుతున్నాడు. 


తండ్రి మీద గౌరవం ఉంచి 30 నిమిషాల్లో నీ కారు మీద తొందరగా వచ్చేయ్ నేను ముందుగా వెళ్లి అక్కడ ఏర్పాట్లు చూసుకుంటాను..'' సమాధానం కోసం ఎదురు చూడకుండా ఖచ్చితంగా చెప్పి తను హోటల్ దగ్గరికి వెళ్ళిపోయాడు.. ధనుంజయరావు. 


*


హోటల్ సవేరా గ్రాండ్ ఏర్పాట్లు.. 300 కార్లు మీద ధనుంజయరావు దుష్యంత్ ఫ్రెండ్స్ అందరూ హడా విడిగా వచ్చారు ఫ్యామిలీలతో సహా. 


ధనుంజయరావు, అతని అనుచరులు గ్రాండ్గా ఏర్పాటు చేస్తున్నారు. ఒక పక్క ఫుడ్ సర్వ్ చేసే అసిస్టెంట్లు.. మరోపక్క లోపలికి వస్తున్న ఆహ్వానితులకు గంధం చిలకరించడానికి కొందరు అమ్మా యిలు నిలబడి ఉన్నారు. హాట్ ఫుడ్ బాక్సులు సిద్ధంగా పెట్టుకుని మరి కొందరు దూరంగా నిలబడి ఉన్నారు.. ఇంకొంచెం దూరంలో రకరకాల బ్రాండ్స్ విస్కీ, బీరు కలర్ఫుల్ బాటిల్స్. 


వచ్చే అతిధులకు గ్రాండ్ వెల్కమ్ చెబుతున్నారు కొంతమంది ముఖ్యులు.. 


ఆ సిటీ లోనే బర్త్ డే ఫంక్షన్ నభూతో న భవిష్యతి అన్నట్టు జరుగుతుంది. అందమైన రంగు రంగుల కంప్యూటర్ బల్బుల మధ్య ధగధగా మెరిసిపోతుంది అక్కడి వాతావరణం. 


సమయం రాత్రి 7 గంటలయింది దుష్యంత్ వస్తున్న జాడలేదు. తండ్రి ఫోన్ చేశాడు. ఫోన్ రింగ్ అవ్వటం లేదు. 


“మై డియర్ ఫ్రెండ్స్! మా అబ్బాయి టిప్ టాప్ గా తయారై వచ్చేస్తాడు. కంగారు పడకండి” అంటూ సముదాయించాడు తండ్రి. 


సమయం 8:00 అయింది. దుష్యంత రాలేదు. 


''సరే టైం అయింది కదా.. ఏర్పాట్లు అన్ని గ్రాండ్ గా ఉన్నాయి కనుక వచ్చి మనతో కంటిన్యూ అవుతాడు. మనం స్టార్ట్ చేద్దాం''.. అంటూ పార్టీ ప్రారంభించాడు.. ధనుంజయ రావు. 


కొడుకు ఎప్పటికీ రాకపోవడంతో ఆ రాత్రి 12 గంటలకు తూగుతూ ఊగుతూ తన వాహనం మీద ఇంటికెళ్లి పోయాడు ధనంజయరావు. మత్తుగా పడుకుని మర్నాడు ఉదయం ఏడు గంటలకు లేచాడు. నిద్రమత్తులోనే హాలులోకి నడుచుకుంటూ వచ్చి కొడుకు ఏం చేస్తున్నాడు అని పరికించాడు. 

తలారా స్నానం చేసి పట్టు వస్త్రాలతో దేవుని గదిలో పూజ చేసుకుంటున్నాడు దుష్యంత్. 


''ఎప్పుడు లేనిది.. ఈ దేవుడు ఏంటి.. ఈ దండాలు ఏమిటి?? నాన్సెన్స్! నా పరువు తీసే కొడుకువి నువ్వు. '' కొడుకు మీద అరుస్తూ తూలి పడిపోయాడు ధనుంజ యరావు. భార్య వచ్చి పట్టుకొని లెగదీసింది. 


''ఏరా.. తండ్రి మాట లెక్కలేదా. ఒక్క పూటే కదా నీ నిర్ణయం మార్చుకోమన్నాను. '' గట్టిగా అరిచినట్లు అన్నాడు మళ్లీ. 


దుష్యంత్ పూజ పూర్తి చేసుకుని పైకి లేచి కొన్ని అక్షంతలు తండ్రి చేతిలో వేసి తనను దీవించమన్నాడు. 


దుష్యంత్ తల్లి దూరం నుండి చూస్తూ నిలబడి ఉంది. 


''నాన్నగారు.. పుట్టినరోజు భగవంతుడు మనుషులకు ఇచ్చిన గొప్ప వరం. మీరు నాన్న అయినప్పటికీ ఇప్పటికీ మీతో నేను, నాతో మీరు చంటి పిల్లల మాదిరిగానే ఆడుకుంటున్నాం. అంత ఆనందం నాకు ఇస్తూ పెంచిన మీకు ప్రణామములు నాన్నగారు. 


ఎందుకో నాలో సడన్గా ఉన్నట్టుండి ఒక మార్పు మొదలైంది. దాంతో నిన్న పుట్టినరోజు ఉదయమే నాలో నేనే నిర్ణయించుకుని కొన్ని ఖచ్చితమైన ప్రతిజ్ఞలు చేసుకున్నాను. మనసులో కచ్చితంగా అలా తీసుకున్న నిర్ణయం.. దాన్ని మళ్ళీ మార్చుకుంటే నిర్ణయం అనరు కదా. ప్రతిజ్ఞ అనరు కదా. అందుకని నేను మీ కోరిక మన్నించి వచ్చి ఆ మితిమీరిన సరదాలు సంతోషాలు పంచుకోలేక పోయాను'' క్రిందకు వంగి తండ్రి కాళ్లకు నమస్కరించాడు దుష్యంత్. 


ధనుంజయరావు అక్షింతలు వేయకుండా వడివడిగా నడుచుకుంటూ కోపంగా తన గదిలోకి వెళ్ళిపోయాడు. 


''ఏవండీ! మీకు అక్షింతలు అందించాడు కదా. వాడిలో ఏదో మార్పు వచ్చింది. అది మన కుటుంబం అంతటికీ మంచిది కద.. మీరు వాడిని దీవించాలి. ''.. భర్తకు దూరంగా నిలబడే భయంగా అన్నది దమయంతి. 


వెండి తాపడం చేసిన వాలు కుర్చీలో కూర్చునే చాలాసేపు ఆలోచించాడు ధనుంజయ్ రావు. 


''దమయంతీ.. వాడు ఇంకా చిన్న పిల్లవాడు అనుకున్నాను. కాదు.. మానసికంగా నాకన్నా పెద్దవాడు అయ్యాడు. వాడు తనను దీవించమని నా చేతిలో వేసిన అక్షంతలు ఇంకా నా చేతిలోనే ఉన్నాయి. 


ఇవిగో.. కానీ ఈ అక్షింతలు వేసి వాడికి శుభాకాంక్షలు చెప్పి దీవించే అర్హత నాకు ప్రస్తుతం లేదని తెలుసు కున్నాను. 


 ఒక్క నిమిషంలో నా జీవిత గమనంలో మార్పు తీసుకొచ్చిన నా కొడుకుని చూసి గర్వపడుతున్నాను. అందుకనే వచ్చేవారం జరగబోయే నా పుట్టినరోజు నాడు వాడిలాగే నేను కూడా కొన్ని ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటాను. 


డబ్బు సంపాదనతో నాలో పెరిగి ఉన్న అహంకారం మాడి మసైపోయిందని.. నేను మానవత్వం కలిగిన మనిషిలా బ్రతకడానికి నిశ్చయించుకుని అడుగులు వేస్తున్నానని వాడు నన్ను చూసి నమ్మగలిగేలా నా ఖచ్చితమైన నిర్ణయాలు ప్రతిజ్ఞలతో వాడిని ఆనందింప చేస్తాను. 


ఇది నా పుట్టినరోజు అని గర్వంగా పుట్టిన రోజులు జరుపుకునేలా బ్రతకాలి దమయంతి.. అంతేకానీ గొప్ప కోసం ఆనందాల కోసం సరదాలు సంతోషాల కోసం.. జరుపుకునేవి పుట్టినరోజులు కాదని నా కన్న కొడుకే నాకు గుణపాఠం చెప్పాడు. 


దమయంతీ.. నేటి ప్రజా జీవన విధానాన్ని బట్టి జీవితంలో ప్రతి వాళ్ళు తప్పులు చేయకుండా ముందుకు వెళ్ళలేరు. అయితే ఆ తప్పులు గ్రహించి అలాంటి తప్పులు ముందు ముందు చేయకుండా మంచి నడవడికకు శ్రీకారం చుట్టడానికి ప్రతిజ్ఞ చేయడానికి, నిర్ణయం తీసుకోవడానికి.. ప్రతి మనిషికి మంచి అవకాశం అన్నమాట ఈ పుట్టిన రోజులు. ఈ విషయం నాకన్నా చిన్నవాడైన నా కొడుకు చెబితేనే కానీ నాకు అర్థం కాలేదు. 


అలా నాలో కూడా మంచి మార్పు వచ్చినప్పుడే.. వాడికి తండ్రిని అనిపించుకుంటాను. అప్పుడే నేను అక్షంతలు వేసి వాడిని దీవించడానికి అర్హత పొందుతాను. '' 

అలా కనువిప్పు కలిగిన ధనుంజయరావు తన కొడుకు మీద అత్యంత ప్రేమగా మాట్లాడుతూ భార్య వైపు చూశాడు. 


‘ఆ భగవంతుని దయవల్ల ఇప్పటినుండి నిజమైన భర్తతో కాపురం చేయగలుగుతున్నాను’ అన్న మహదానందం పడిపోతూ భర్త పక్కగా కూర్చుంటూ అతని కళ్ళల్లోకి ప్రేమగా చూసింది దమయంతి. 


సమాప్తం


నల్లబాటి రాఘవేంద్ర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.







రచయిత పరిచయం: నల్లబాటి రాఘవేంద్ర రావు


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


ముందుగా  " మన తెలుగు కథలు"  నిర్వాహకులకు నమస్సులు..

"రచయిత పరిచయం"..... ఇది చాలా ముఖ్యం.

రచయిత తన  గొప్పలు చెప్పుకోవడం కాదు గాని తన గతచరిత్ర వివరాలు అందరికీ తెలియ చేయటం అవసరమే. ఈ చర్య ఆ రచయితకు మానసికంగా ఎంతగానో ఉపయోగపడి అతను మరిన్ని మంచి మంచి రచనలు చేసి సమాజానికి అందించే అవకాశం ఉంది.. ఎంతో పెద్ద ఆలోచనతో అలాంటి 'మహా ప్రయత్నం'.. చేస్తున్న 'మన తెలుగు కథలు' కు మరొక్కసారి అభినందనలు.

పునాది....

-----------

ఏడు సంవత్సరాలు వయసు నాది. మా తండ్రి సుబ్బారావు గారు  ప్రోత్సాహంతో శ్రీ కృష్ణార్జున యుద్ధం అనే 10 నిమిషాల నాటకాన్ని నేనే రాసి కృష్ణుడి వేషం  నేనే వేసి దర్శకత్వం నేనే చేసి పెద్ద స్టేజి మీద  దసరా నవరాత్రులకు ప్రదర్శించాము.


ఆ తర్వాత భక్త ప్రహ్లాద లో ప్రహ్లాదుడు గా.. మరో నాటకంలో శ్రీరాముడుగా..   రచన దర్శకత్వం నాదే.. ఏడు సంవత్సరాల వయస్సు.


తర్వాత పదిహేను సంవత్సరాల వయసులో

టెన్త్ క్లాస్ యానివర్సరీ కి  15 మంది నటులతో నా దర్శకత్వం లో పెద్ద స్టేజి మీద నాటకం వేసాము.

అప్పుడే నేను రచయితను కావాలన్న

ఆశయం   మొగ్గ తొడిగింది.

నా గురించి..

---------------

50 సంవత్సరాల సుదీర్ఘ సాహితీ ప్రయాణం.

450  ప్రచురిత కథల రచన అనుభవం.

200 గేయాలు  నా కలం నుండి జాలువారాయి

200 కవితలు నా మేధస్సు నుండి ఉద్భవించాయి

20 రేడియో నాటికలు ప్రసారం.

10 టెలీఫిల్మ్ ల నిర్మాణం.

200 కామెడీ షార్ట్ స్కిట్స్

3  నవలలు దినపత్రికలలో


" దీపావళి జ్యోతి "అవార్డు,

"రైజింగ్స్టార్" అవార్డు

" తిలక్ స్మారక" అవార్డు... మరికొన్ని అవార్డులు.


ప్రస్తుత ట్రెండ్ అయిన  ఫేస్బుక్ లో  ముఖ్యమైన 15 గ్రూపుల్లో... ఇంకా అనేక వెబ్ సైట్లు, బ్లాగులు,ఆన్లైన్ పత్రికలలో యాక్టివ్ గా తరచు  నాకథలు,  కవితలు,గేయాలు, ముఖ్యంగా కామెడీ షార్ట్ స్కిట్స్ ప్రతి రోజూ దర్శనమిస్తూ ఉంటాయి..

రమారమి 75 అవార్డులు, రివార్డులు అందు కున్నాను... అని గర్వంగా చెప్పుకునే అవకాశం  కలగటం... ఆ చదువులతల్లి అనుగ్రహమే!

ఇదంతా ఒక్కసారిగా  మననం చేసుకుంటే...  'పడని సముద్ర కెరటం' లా... నూతనశక్తి మళ్లీ పుంజుకుంది.

ఇక నా విజయ ప్రయాణగాధ....

------+------------------------------

పేపర్లెస్ రచయితగా... ఒక కుగ్రామం లో పేరు ప్రఖ్యాతులు పొందిన  నా తండ్రి సుబ్బారావు గారు నా ఆలోచనలకు, రచనలకు ప్రాణప్రతిష్ట చేసిన ప్రథమగురువు. తల్లి వీరభద్రమ్మ  నాకే కాదు నా కథలకూ ప్రాణదాతే!!


తదుపరి రమారమి 50 సంవత్సరాల క్రితమే.. మా ఊరివాడైన నా జూనియర్ క్లాస్మేట్... నా స్నేహితుడు ఇప్పటి సినీ దర్శకుడు " వంశీ "... కథలు రాస్తూ...   నన్ను కూడా కథలు రాయ మని... చెప్తుండేవాడు. అప్పటి నుండి  ఎక్కువగా రాయడం మొదలు పెట్టాను.ఆ తర్వాత మా ఊరి  వారైన  సినీ గేయరచయిత

" అదృష్టదీపక్".. నా కథలు.. చదివి.. మెచ్చు కునే వారు.. దాంతో ఇంకా విరవిగా కథలు రాయడం మొదలు పెట్టాను.


1. మొదటి రచన 1975 నాటి ప్రఖ్యాత పత్రిక "ఆంధ్రసచిత్రవారపత్రిక" లో బుద్ధిలేనిమనిషి  కథ.


2. రేడియో నాటికలు  గొల్లపూడి మారుతీ రావు    గారి సమకాలంలో విరవిగా వచ్చాయి.


3. సినిమాకథలపోటీ లో అలనాటి "విజయచిత్ర"  ద్వితీయబహుమతి కథ..  "డిసెంబర్ 31 రాత్రి"


4. ఉగాది కథలపోటీ "ఆంధ్రభూమి" బహుమతి కథ


5. ఉగాది కథల పోటీలో "ఆంద్రజ్యోతి" బహు మతి కథ


6.  దీపావళి కథలు పోటీలో  "ఆంధ్రజ్యోతి" బహుమతి కథ.


7. అప్పాజోస్యుల( అమెరికా) నిర్వహించిన కథల పోటీలో "నలుగురితో నారాయణ".. ఆంధ్రప్రభ విశిష్ట కథ ప్రచురణ


8. అల్లూరి స్మారక జయంతి "కళావేదిక " కరప తిలక్ స్మారక అవార్డు కథ " బ్రతుకు జీవుడా"


9. "స్వాతి "   తానా అమెరికా కథల పోటీలో ప్రచురణ కు ఎన్నికైన కథ..." వైష్ణవమాయ."


10. రాష్ట్రస్థాయి కథలపోటీ హైదరాబాద్  "నిమ్స్"ద్వితీయ బహుమతి కథ..న్యాయనిర్ణేత శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి." బంగారు పేకమేడ"


11. "అనిల్ అవార్డ్" స్వాతి కన్సోలేషన్ బహు మతి..." అమృతం  కురిసింది"


12. సస్పెన్స్ కథల పోటీ "స్వాతి" లో ఎన్నికైన కథ


13. "పులికంటి సాహితీ సంస్థ" రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైన కథ..


14. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆరాధన" హైదరా బాద్ ద్వితీయ బహుమతి కథ.." అదిగో స్వర్ణ యుగం"  న్యాయనిర్ణేత   జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.. శ్రీ రావూరి భరద్వాజ గారు.


15. "అభ్యుదయ ఫౌండేషన్" కాకినాడ రాష్ట్ర స్థాయి అత్యుత్తమ కథ.. " ఐదేళ్ల క్రితం " .


16. సి.పి.బ్రౌన్ "సాహితీ స్రవంతి".. ప్రత్యేక కథ

" ఇంద్రలోకం".


17.  కొమ్మూరి సాంబశివరావు స్మారక  సస్పెన్సు కథల పోటీలో  "నవ్య' ప్రచురణకు ఎన్నికైన కథ.


18. "వేలూరు పాణిగ్రహి" విజయవాడ "  గాంధీ తాత"  రాష్ట్రస్థాయి ద్వితీయ బహుమతి కథ.


19. 'కదలిక'... సర్వశిక్షఅభియాన్  రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మింపబడిన అత్యున్నత టెలీ ఫిల్మ్... చిన్న సినిమా.


20. "అల కమ్యూనికేషన్" హైదరాబాద్ కథల పోటీలో ఎంపికైన కథ...." హృదయానికి శిక్ష".


21. రాష్ట్రస్థాయి కథలపోటీ "మైత్రేయ కళాసమితి" మెదక్.. పుస్తక సంకలనానికి ఎన్నికైన కథ. "బిందెడు నీళ్లు".


22. రాష్ట్ర స్థాయి కథల పోటీలు "జాగృతి" కన్సోలేషన్ బహుమతి  కథ "ఆలస్యం అమృతం విషం"


23. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ  "ఆంధ్ర ప్రదేశ్" పత్రిక ప్రత్యేక బహుమతి హాస్య కథ.


24. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్రప్రభ" ప్రచురణకు ఎంపికైన కథ.


25. దీపావళి కథల పోటీ "ఆంధ్రభూమి" ప్రచురణ కు ఎన్నికైన కథ.


26.  రాష్ట్రస్థాయికథల పోటీ "ఆప్కో ఫ్యాబ్రిక్స్" హైదరాబాద్ నిర్వహణ  పోటీ లో ఎన్నికైన కథ.


27. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆంధ్రప్రదేశ్పత్రిక" కు ఎన్నికైన హాస్యకథలు." చంద్రమండలంలో స్థలమును అమ్మబడును".


28.దీపావళి కథల పోటీ "జాగృతి" పత్రిక కు ఎన్నికైన కథ.


29. "హాస్యానందం" విశేష స్కిట్స్ కొరకు.. "రైజింగ్ స్టార్".. అవార్డు.


30 ఆంధ్రజ్యోతి "భావ తరంగం"  వారం వారం 30 కథలు.


31. "కళా దర్బార్"  రాజమండ్రి.. రాష్ట్రస్థాయి  కవితలపోటీలలు... 4 సంవత్సరాలు ఉత్తమ  కవిత్వానికి ప్రథమ బహుమతి...మూడుసార్లు.. ఉత్తమ కవిత్వానికి ద్వితీయ బహుమతి.


32.."హాసం" మాస పత్రిక లో ప్రచురింపబడిన  "చిరాకు దంపతులు చింతకాయ పచ్చడి"    కథ చదివిన చాలా మంది సినీ ప్రముఖులు  ఫోన్ కాల్స్ చేసి అభినందించడం.


33. ప్రఖ్యాత సిరివెన్నెల పత్రికలో  సిరివెన్నెల సీతా రామశాస్త్రి గారి నిర్వహణలో జానపద పాటల పోటీలో  ప్రథమ బహుమతి  పాటకు వారి నుండి  పత్రికాముఖంగా ప్రత్యేక ప్రశం సలు.. తదుపరి ఆ పాట అనేక   రంగస్థల ప్రదర్శనలు పొందడం.


34. విశేష కథలుగా  పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కథలు

  నలుగురితోనారాయణ

  కొరడా దెబ్బలు

  అమృతం  కురిసింది.

  వైష్ణవమాయ

  ఐదేళ్ల క్రితం

  ఇంద్రలోకం

  బిందెడు నీళ్లు

  చంద్రమండలంలో స్థలములు అమ్మబడును

  డిసెంబర్ 31 రాత్రి

  మహాపాపాత్ముడు

 

35. రాజమండ్రి ,కాకినాడ ,విజయవాడ, విశాఖ పట్నం ,రామచంద్రపురంలో.. విశేష సన్మానాలు.


ప్రస్తుతం...


1. ఒక పరిశోధన నవల.. ఒక చారిత్రక నవల రాసే ప్రయత్నం


2. పరిషత్ నాటికలు జడ్జిగా..


3.  కొందరు సినీప్రముఖుల ప్రోత్సాహంతో..

సినిమాలకు కథ మాటలు స్క్రీన్ప్లే అందించే ప్రయత్నం.


4. ..  4 కథల సంపుటిలు... రెండు కవితా సంపుటిలు.. 1గేయ సంపుటి.. 2 కామెడీ షార్ట్ స్కిట్స్.. రెండు నాటికల సంపుటిలు..ఒక నవల ప్రచురణ తీసుకొచ్చే ప్రయత్నం.


5. ఒక ప్రింటెడ్ పత్రిక  ప్రారంభించే ఉద్దేశ్యం.


భార్య.. గోవిందీశ్వరి... హౌస్ వైఫ్.

కుమారుడు... వెంకట రామకృష్ణ .. బి.టెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్... మైక్రోసాఫ్ట్.. హైదరాబాద్.

కోడలు... మాధురీ లత..... ఎం ఫార్మసీ.

కుమార్తె.. సౌభాగ్య.. స్టూడెంట్.

మనుమరాలు.. ఆద్య... యాక్టివ్ బేబీ.

నా కథలను ఆదరించి తమ అమూల్య అభి ప్రాయాలు తెలియజేస్తున్న... రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ... వినమ్ర నమస్సులు.

నల్లబాటి రాఘవేంద్ర రావు 






42 views1 comment

1 commentaire


mk kumar
mk kumar
17 minutes ago

ఈ కథలో వ్యక్తిత్వ వికాసం, పుట్టినరోజుల నిజమైన విలువ, జీవన మార్పులు ఎంత ముఖ్యమో ప్రదర్శించారు.


ధనంజయరావు తండ్రి, దుష్యంత్ కొడుకుల మధ్య ఉన్న భావనాత్మక మార్పులు, పుట్టినరోజును ఒక కొత్త దిశగా చూడాల్సిన ఆవశ్యకతను బలంగా వ్యక్తీకరిస్తాయి. ఈ కథా సారాంశం మన జీవన విధానంలో కూడా స్ఫూర్తి నింపుతుంది.

J'aime
bottom of page