వారం వారం బహుమతులలో ఎంపికైన కథ (Weekly prize winning story)
'Manasu Thelisindi' - New Telugu Story Written By C. S. G. Krishnamacharyulu
Published in manatelugukathalu.com on 28/04/2024
'మనసు తెలిసింది' తెలుగు కథ
రచన: C..S.G . కృష్ణమాచార్యులు
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
రఘు లెక్చరరుగా పనిచేస్తున్న కళాశాలలోని సంగీత శాఖ ఆధ్వర్యంలో ఒకనాడు వర్ధమాన సంగీత కళాకారిణి హిమజ కచ్చేరి జరిగింది. రఘు సంగీత ప్రియుడు. చిన్నతనంలో సంగీత సాధన చేసాడు కానీ, చదువు వొత్తిళ్ళ వల్ల అదెంతో కాలం సాగలేదు. పాటలు వింటూ చదువు కోవడం, నిద్ర కుపక్రమించడం అతని కలవాటు. ప్రసిద్ధ సంగీత విద్వాంసుల కచేరీలకు హాజరవడం కూడా అతనికి యిష్టమే. మధురమైన హిమజ గాత్రంలో త్యాగయ్య, అన్నమయ్య, పురందర దాసు కీర్తనలు ప్రాణంపోసుకుని శ్రోతలనలరించాయి. వయసులో చిన్నదైనా, మంచి ప్రతిభ చూపించిందని పెద్దలు ఆశీర్వదించారు, రఘు ఆమె అందానికి, రాగాలాపనకి ముగ్ధుడయ్యాడు. ఆమె ఆకర్షణలో పడిన అతనిలో వింత ఆలోచనలు చెలరేగాయి.
‘ఇటువంటి అమ్మాయిని పెళ్ళి చేసుకుంటే జీవితం ధన్యమైపోతుంది, కానీ ఆమెను భార్యగా పొందే అర్హత.. నాకెక్కడి ది? ఆమెకు నా వల్ల కలిగే లాభం గాని, పెరిగే అంతస్థు కానీ యేముంటుంది? అలా అనుకొని ప్రయత్నించకుండానే ఓటమిని అంగీకరించాలా? ఎలాగైనా ఆమె దృష్టిలో పడి, ఆమెకు నా పట్ల ఆసక్తి కలిగేలా చేసుకోవాలి? ఆమెది యీవూరే అన్నారు.. డేవుడు కరుణిస్తే, ఆమె నన్ను గుర్తించి, ప్రేమించి, పెళ్ళి చేసుకోవచ్చు.. కానీ నా మనసు తెలిపేదేలా? " బాగా ఆలోచించిన తర్వాత రఘు ఒక నిర్ణయానికి వచ్చాడు.
@@@
రఘు సంగీతం లెక్చరర్ దగ్గర ఆమె చిరునామా తీసుకున్నాడు. ఒక శుభ సాయంత్ర సమయంలో, ఆమె యింటికి వెళ్ళాడు. ఇంటి ముందు చతురస్రాకారంలో వున్న పూల మొక్కల మధ్య వున్న ఆకు పచ్చని పచ్చిక, సూర్య కాంతికి తళతళా మెరుస్తోంది. ఆ పచ్చికలో ఒక ప్రక్క, టీ త్రాగుతూ హిమజ తల్లిదండ్రులు కనిపించారు. వారి దగ్గరకు వెళ్ళి తనను పరిచయం చేసుకున్నాడు. నిజాయితీపరునిగా కనబడాలని తను వచ్చిన విషయమిలా సూటిగా చెప్పాడు.
"మీ అమ్మాయి హిమజ పాట కచేరి విని ఆమె అభిమానినయ్యాను. కచేరీ విని చప్పట్లు కొట్టడమే కాకుండా, స్నేహితుడిగా మీ కుటుంబానికి తోడుగా వుండాలనిపించింది. ఇది నా విజిటంగ్ కార్డ్. మీకే అవసరమున్నా, నాకు ఫోన్ చేయండి. ”
హిమజ తల్లిదండ్రులు సంతోషించారు.
"అమ్మాయి పాట కఛ్చేరీలని తిరుగుతూ వుంటుంది. మా అబ్బాయి సేల్స్ మేనేజర్. టూర్లు తిరుగుతూంటాడు. ఎప్పుడైనా అవసరముంటే వాడి స్నేహితులు వస్తారు. ఇప్పుడు నీవు వస్తానంటున్నావు. సంతోషం. అమ్మాయిని కలుస్తావా?" అని హిమజ తండ్రి అడిగాడు.
" వద్దులెండి. ఈ నెలాఖరున కళామందిరంలో పాడుతున్నారు కదా. అప్పుడు కలుస్తాను" అన్నాడు రఘు నిర్వికారంగా.
హిమజ తల్లి టీ తీసుకువచ్చి రఘుకిచ్చింది. తన వుద్యోగం, కాలేజీ గురించి వాళ్లడిగిన ప్రశ్నలకు ఆతడు సమాధానమిస్తూనే, సంభాషణని రాజకీయాలు, క్రికెట్, యువతలో పెరుగుతున్న దురలవాట్లు వంటి అంశాలపైకి మళ్ళించాడు. దానితో స్వేచ్చగా ఒక గంటసేపు మాట్లా డుకున్నారు. ఆ తర్వాత రఘు వారి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు.
అతను వెళ్ళిన తర్వాత, హిమజ వచ్చి కూర్చుంది.
"రఘు అని కాలేజ్ లెక్చరర్. నీ అభిమాని అట. ఏదైనా సహాయం కావాలంటే పిలిస్తే వస్తానని కార్డ్ యిచ్చి వెళ్ళాడు. వింతగా వుంది. "
"నాన్నా! అతనికి పెళ్ళయిందా?" కూపీ లాగే డిటెక్టివ్ లా అడిగింది హిమజ.
"ఇంకా కాలేదు. పీ యెచ్ డీ చేస్తున్నాడట. అది త్వరలోఅయిపోతుందట. ఆ తర్వాతే పెళ్ళి అని చెప్పాడు"
"నాన్నా! అతను నేరుగా నన్ను పెళ్ళి చేసుకుంటానని అడగకుండా యిలా చేస్తున్నాడు. తొందరలోనే ముసుగు తీస్తాడు చూడు" అంది హిమజ తండ్రి మెడ చుట్టూ చేతులు వేసి వుయ్యాలలూగుతూ.
"అంతే నంటావా? కానీ నాకలా అనిపించలేదు. ఏదో ఒక సంగీతాభిమాని, మంచి వాడు అని అనిపించింది. చూదాం?" అన్నాడు హిమజ తండ్రి.
"అలా జరిగినా మంచిదే. ఏదో రోజు పెళ్ళి చేయాలిగా! ఇప్పటికే ఆలశ్యమయ్యింది. జీవితాంతం సంగీతం పాడుకుంటూ కూర్చుంటుందా?" అంది హిమజ తల్లి చిరాకుగా.
"అంటే దోవన పోయేవాడొచ్చినా పెళ్ళి చేసేస్తావా?" తల్లి మీద యెగిరి పడింది హిమజ.
"వీడని కాదు. నీకు ఎవరు నచ్చితే వాడే. త్వరగా తేల్చు" అంది హిమజ తల్లి అనునయంగా.
"సరే. సీరియస్ గా ఆలోచిస్తా" అంది హిమజ సాలోచనగా.
@@@@
రఘు ప్రవర్తన వల్ల హిమజకి కాస్త ఆశాభంగమైంది. గడిచిన మూడు వారాలలో రఘు నుంచి ఫోన్ గాని మెసేజ్ గాని లేదు. రెండు రోజుల్లో కచేరి వుందనగా, హిమజకు అందరి అభిమానుల లాగే రఘు, " మీ కచేరీ కోసం ఎదురు చూస్తున్నాం" అన్న మెసేజ్ పంపాడు.
కచేరి రోజు వుదయం హిమజకి ఒక సమస్య వచ్చింది. ఆమె స్నేహితురాలు రాగిణి వస్తున్న బస్, వూరికి ఇరవై కిలోమీటర్ల దూరంలో చెడిపోయింది. సమయం చూస్తే వుదయం మూడు గంటలు. వేరే బస్ రావడానికి ఒక గంట ఆలశ్యమవుతుందని చెప్పారు.
సమయానికి హిమజ అన్నవూరిలోలేడు. ఆమె తండ్రి, రఘుకి ఫోన్ చేసి సహాయమడుగుదామని అన్నాడు. హిమజ గత్యంతరం లేక అతనికి ఫోన్ చేసి చెప్పింది.
రఘు, " ఇప్పుడే బయలుదేరుతున్నా. ఆమె ఫోటో నాకు పంపండి" అని చెప్పాడు.
ఒక అరంగట తర్వాత రాగిణి హిమజకి ఫోన్ చేసింది.
" రఘు వచ్చాడు. నాకు తోడుగా వున్న దంపతులతో అతని కారులో వస్తున్నాను" అని చెప్పింది.
దాదాపు నాలుగున్నర గంటల వేళ, రాగిణి యిల్లు చేరింది. హిమజ స్నేహితురాలిని కౌగలించుకుని, “అయిదింటికి వచ్చే బస్ అన్నావు. అంత తొందరగా యెలా వచ్చావే" అంది.
" ఏమో ఆఘమేఘాల మీద వచ్చి చతికిల పడ్డాడు. రఘు లేకుంటే ఆ చీకట్లో దోమలతో యుద్ధం చేస్తూండే దాన్ని" అంది రాగిణి.
హిమజ తండ్రి వచ్చి, " మాట నిలబెట్టుకున్నావు రఘు. థాంక్స్" అని రఘు చేయి పట్టుకుని చెప్పాడు.
" పరవాలేదండి. ఒకరికొకరం. నేను వస్తాను" అని రఘు అక్కడ నుంచి వచ్చేసాడు.
" ఎవరే అతను? నీ అభిమానినని చెప్పాడు. బాయ్ ఫ్రెండేమోనని అనుకున్నా!" చిలిపిగా అడిగింది రాగిణి.
" ఏమో నాకర్థ కావడంలేదు. నువ్వు కూపీలాగక పోయావా?”.
" ఎక్కడ, నాతో వచ్చిన ఆ దంపతులతోనే కాలక్షేపం చేసాడు"
" సంథింగ్ మిస్టీరియస్" అంది హిమజ సాలోచనగా.
@@@@
కళా మందిర్ లో హిమజ కచ్చేరి జరిగింది. అందరితో పాటు రఘు కూడా అభినందనలు తెలిపాడు. హిమజకు అతడిని చూడగానే తెలియని ఆనందం కలిగింది. అతని ముఖంలోని ప్రసన్నత, ఆకర్షణీయమైన అతని రూపు, ఆమెను ఆకర్షించాయి. అతని కనులలో ప్రతిఫలిస్తున్న అతని గుండెలలోని ప్రేమను ఆమె కనిబెట్టగలిగింది. ఒక చూడ చక్కని, మంచి వ్యక్తి. ముఖ్యంగా సంగీత విద్వాంసుడు కాడు. ఆమెకు సంగీతం ఒక హాబీయే గాని వృత్తి కాదు. అందువల్ల వుద్యోగస్తుడిని చేసుకోవాలని అనుకుంది. కొంత మంది కలెక్టర్ స్థాయి వాడు వస్తాడని చెప్పినా ఆమెకు హోదా, అధికారం కన్న ప్రేమగా చూసుకునే భర్త, ప్రశాంత జీవనం చాలని వారిని వారించేది.
రఘు గురించి ఆమె యిలా ఆలోచించింది. “రఘు ఎలా వ్యూహం పన్నాడొ, అలాగే నేనూ తెలివిగా వ్యవహరించాలి. రఘు గురించి, అతని కుటుంబం గురించి తెలుసుకోవాలి. సమగ్ర జీవితానికి కుటుంబం అవసరం. త్వరపడకూడదు. ప్రేమ మత్తులో జీవితాన్ని నాశనం చేసుకోకూడదు”.
ఆరు నెలలకాలం గడిచి పోయింది. రఘు అనేక సార్లు, హిమజ యింటికి వచ్చి వెళ్లాడు. ఆమె తల్లి దండ్రులకు బాగా దగ్గరయ్యాడు. ఈ మధ్య కొడుక్కి కన్నా, రఘుకే వాళ్ళు తమ అవసరాలను చెప్తున్నారు. హిమజని, ఆమె తల్లిదండ్రులను ఒక పండుగ రోజున, ఇంటికి తీసుకువెళ్ళి తన కుటుంబాన్ని పరిచయం చేసాడు. అతని కుటుంబ సభ్యులు హిమజను ప్రేమగా చూసుకున్నారు. చిన్న వయసులో మంచి ప్రావీణ్యం చూపుతున్నందుకు ప్రశంసించారు.
@@@@
రఘుకి పిహెచ్. డీ డిగ్రీ వచ్చింది. అతను తన సంతోషాన్ని పంచుకోవడానికి స్వీట్స్, పూలు తీసుకుని హిమజ యింటికి వచ్చాడు. హిమజ తల్లిదండ్రులు అతడిని మనస్పూర్తిగా అభినందించి, " శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రస్తు" అని ఆశీర్వదించారు. కొద్ది సేపు తన భవిష్యత్తు గురించి, వారితో ముచ్చటించి బయలుదేరాడు రఘు.
అతను గుమ్మం దాటుతుండగా, హిమజ వచ్చి శుభా కాంక్షలు తెలిపింది.
" ఒక అయిదు నిమిషాలు వుండగలరా!" అని చుట్టూ చూసింది. దగ్గరలో యెవరూ లేరని నిర్ధారణ చేసుకుని, రఘు నడిగింది,
"మీరు నన్ను ప్రేమిస్తున్నారా?"
"నిజం చెప్పాలంటే అవును. కానీ మీరెక్కడ, నేనెక్కడ. అందుకే మీ పాటను మాత్రమే ప్రేమిస్తున్నాను?" అని తెలివిగా జవాబిచ్చాడు రఘు.
"నా వుద్దేశ్యంలో ప్రేమకు కులమతాలు, ఆస్తి అంతస్తులు అడ్డుకావు. కానీ నా విషయంలో, ఒక సమస్యవుంది. లేకుంటే మిమ్మల్ని నిరుత్సాహ పరిచేదాన్ని కాదు" అంది హిమజ.
"పరవాలేదు లెండి. "అని తన నిరుత్సాహాన్ని కనబడనీయకుండా బదులిచ్చాడు రఘు.
"మీకు నా మీద ప్రేమ వుండడం నిజమైతే, నిస్వార్ధంగా నాకో సహాయం చేయగలరా?" ఆశగా అడిగింది హిమజ.
"తప్పకుండా చేస్తాను. మీ పాట విన్న ఋణం తీర్చుకుంటాను" అని తన సంసిద్ధత తెలియ చేసాడు రఘు.
"నేను రాజా అనే వ్యక్తిని ప్రేమించాను. నా తల్లితండ్రులు వొప్పుకున్నారు కానీ నా అన్న కది యిష్టం లేదు. అన్నయ్యే నా పెళ్ళి బాధ్యత తీసుకున్నాడు. ఎంత బతిమిలాడినా ఒప్పుకోవడం లేదు. అందుకే పారిపోవాలని నిశ్చయించుకున్నాను" మెల్లగా చెప్పింది హిమజ.
"నేను మీకెలా సహాయం చేయగలను" నీరసంగా అడిగాడు రఘు. అతని మనసులో చెలరేగిన తుఫాను చిహ్నాలు అతని వదనంలో ద్యోతకమవుతున్నాయి. అవి చూసి హిమజ లోలోన నవ్వుకుంది.
"మీరు కేవలం నాకు తోడుగా వుంటే చాలు. మొత్తం నేనే ప్లాన్ చేసి చెప్తాను. " అంది.
ఇదెంతో సులభమైన పని అన్నభావన అమె మాటల్లోవ్యక్తమైంది.
"అలాగే. నాకు వచ్చే బుధవారం నుంచి వేసవి సెలవలు ప్రారంభమవుతాయి. అప్పుడైతే నాకు వీలుంటుంది" అని తన సంసిద్ధతను తెలియచేసాడు.
@@@@
రెండు వారాల తర్వాత, హిమజ, రఘుతో కలిసి పుదుచెర్రీలో నివాసముంటున్న తన స్నేహితురాలి యింటికి వెళ్ళింది. అమె స్నేహితురాలు తన భర్తతో కలిసి అమెరికాలో వుంటున్న తన అక్క దగ్గరికి వెడుతూ హిమజ కోసం ఇంటి తాళం చెవులు ప్రక్కింట్లో యిచ్చింది. హిమజను చూస్తూనే ప్రక్కింటి రాజ్యలక్ష్మి గారు తాళం చెవులిస్తూ, ఏం కావాలన్నా నిర్మొగమాటంగా అడగమని చెప్పారు.
హిమజ ఆమెకు ధన్యవాదాలు చెప్పి లోనికి వచ్చి, " ఎలా వుంది, మన ప్రయాణం, మన నివాసం?" అని వుత్సాహంగా రఘు నడిగింది.
“ఇంతవరకు ఓకే. ముందుంది మొసళ్ళ పండుగ. రాజా వస్తాడా? మీ అన్నయ్య వస్తాడా? సస్పెన్స్!"
"విలన్లా నీకా ఆశుభం మాటలెందుకు? రాజా రేపు సాయంత్రానికల్లా నా ముందుంటాడు” అంది హిమజ సందేహాలకు ఆస్కారమే లేనట్లు.
ఆ మాటలకు, అప్పటికప్పుడే ఇంటికి తిరిగి వెళ్ళిపోవాలన్నకోరిక కలిగింది రఘుకు. కానీ చేసేది లేక, ఆ కోరికను అణచివేసి స్నానం చేయడానికి వెళ్ళాడు.
అతను వచ్చేటప్పటికి కాఫీ, వుప్మా తయారు చేసి యెదురు చూస్తోన్న హిమజ, " రా రా! ఇవి చల్లారిపోకముందే లాగించేద్దాం. " అంది.
" ఓకే! నాకు కూడా వంట వచ్చు. కోరితే సహాయపడగలను" అన్నాడు రఘు.
"అయితే ఇంకేం? మనిద్దరం ఒక ఆదర్శ ప్రేమ జంటగా, ఆడుతూ పాడుతూ పనిచేసుకుంటూ వుందాం. రాజా మనల్ని చూసి ఆశ్చర్యపోవాలి" అంది సంబరంగా హిమజ.
రాజా ప్రస్తావన రాగానే రఘు ముఖంలొ రంగులు మారాయి.
" భలే వారే! నాతో కలిసి ఆడి పాడడం, రాజా పట్ల అపరాధమవుతుంది. జోక్స్ వేయకు" అని తన అనిష్టత వ్యక్తం చేసాడు రఘు.
రఘు మాటలను ఖండిస్తూ హిమజ " అదెలా? నువ్వు నన్ను ప్రేమించావు. నేను నిన్నుఆత్మీయ స్నేహితుడిగా ప్రేమిస్తున్నాను. మనం ప్రేమికులన్నది నిజం. అది దాచిపెట్టటం అపరాధం కాదా? " అని అడిగింది.
" నీలాంటి సంస్కారవంతులిలా మాట్లాడవచ్చా?" అసహనంగా అడిగాడు రఘు.
" రాజా వచ్చి ప్రేమతో నా బాధ్యత తీసుకునే దాకా నేను స్వతంత్రురాలినే. అతను రాకముందే, “నా జీవితం.. నీకంకితం” అని పాడుతూ తిరగడానికి, నేనేం పాతకాలం సినిమా హీరోయిన్ని కాదు" అంది హిమజ.
" నీతో వాదించడం బుద్ధి తక్కువ పని" అని లెంపలేసుకున్నాడు రఘు.
" నీకు సరదాగా వుండడం రాదు. నేను మాత్రం నిన్ను నా బాయ్ ఫ్రెండుగా భావించి అట పట్టిస్తా" అంది నవ్వుతూ హిమజ.
" దీన్నే పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణ సంకటం అంటారు" అని రఘు టిఫెన్ తినడం ప్రారంభించాడు.
కూర్చునివున్న రఘు నానుకుని నిలబడి, హిమజ అతని జుట్టుని చేత్తో చెరిపేస్తూ, " తెలివైన అమాయకుడు. " అంది. ఆమె స్పర్శతో రఘు మనసొక వింత అనుభూతిని పొందింది.
@@@@
“సాయంత్రం ఒక బైక్ అద్దెకు తీసుకుందాం. పంచవటి లో ఆంజనేయుని దర్శనం చేసుకుని, ఆ తర్వాత తిన్నగా మణకుల వినాయకుని కోవెల చేరి, ఆ స్వామినర్చించి, బీచ్ లో తిరిగి, వద్దాం!" అంది హిమజ. ఇద్దరూ బయలుదేరే సమయానికి ప్రక్కింటి రాజ్యలక్ష్మి యెదురు వచ్చింది.
.
" ఎక్కడకో బయలుదేరారు, వెళ్ళి రండి" అంది ఆవిడ.
" అవునండీ పిన్ని గారు, పంచవటికని బయలుదేరాం, లక్ష్మీదేవిలా యెదురొచ్చారు" అని రఘువైపు చూసి, " ఏమండీ ఇలా రండి. కొత్త దంపతులం. పిన్ని గారి ఆశీర్వాదం తీసుకుందాం " అని పిలిచింది.
తప్పించుకునే వీలులేక రఘు, హిమజతో కలిసి ఆమె పాదాలకు నమస్కరించాడు. వారు తనకిచ్చిన గౌరవానికి పొంగిపోతూ ఆమె" దీర్ఘ సుమంగళీ భవ! కలకాలం హాయిగా జీవించండి" అని ఆశీర్వదించారు.
ఆమె వెళ్ళిన తర్వాత, రఘు, హిమజతో. " నువ్వు సైకోలా తయారవుతున్నావు. ఆవిడకు అబద్ధాన్ని అలవోకగా చెప్పావు. " అన్నాడు.
హిమజ మందహాసం చేస్తూ " రారా! లేటవుతోంది" అంటూ అతని చెయ్యి పట్టుకుని ముందుకు నడిచింది.
దైవ దర్శనాలు పూర్తిచేసుకుని బీచ్ వొడ్డున కూర్చున్నాక, అతనికి దగ్గరగా జరిగి అతని చేతిని తన చేతిలోకి తీసుకుని హిమజ, ". ఏది నా ప్రేమికుడిగా, కవిత్వం చెప్పు" అంది.
ఆమె స్పర్శ వల్ల కలిగే అనుభూతులకి జడిసి రఘు దూరంగా జరిగి " అలా పదే పదే ప్రేమికుడు అనకు. అయినా నేను లెక్కల మాస్టారిని. నేను కవిత్వం చెపితే, ఆల్ జీబ్రాలే”.
“ఏం కాదు. కవి కాని ప్రేమికుడు వుండడు. చెప్పాల్సిందే"
“నీ కంత నమ్మకముంటే.. నీ ఖర్మ, రేపు చెప్తా “ అన్నాడు.
"మదర్ ప్రామిస్”. అంటూ మళ్ళీ అతనికి దగ్గరిగా జరిగి, , అతని భుజం మీద తలవాల్చి, “ కాస్త రొమాంటిక్ గా వుండరాదూ. ఎందుకలా సీరియస్ గా వుంటావు. ” అంది. చేసేదిలేక రఘు అలాగే వుండిపోయాడు.
కొద్ది సేపు సముద్రతీరంలో గడిపిన తర్వాత ఇద్దరూ భోజనం ముగించుకుని యిల్లు చేరారు. దుస్తులు మార్చుకుని రఘు పడుకోబోతుండగా హిమజ పరుగున వచ్చింది, " చూడు. ఈ మెసేజ్" అంది ఫోన్ అతని చేతికిచ్చి.
"వాతావరణం అనుకూలించక అన్ని ఫ్లైట్స్ రద్దయ్యాయి. తిరిగి యెప్పుడు నడుపుతామో తెలియ చేస్తాం"
"అరే! ఇప్పుడెలా? " అనబోయిన రఘు, హిమజ కన్నీరు చూసి, " ఇప్పుడేం కష్టమొచ్చిందని ఈ కన్నీరు? ఇంకో నాలుగు రోజుల్లో వస్తాడు. నిరీక్షిద్దాం" అని సముదాయింపుగా అన్నాడు.
హిమాజ అతని గుండెలమీద తలవాల్చి, "నువ్వు నాకు తోడుంటావు కదూ" అంది.
రఘు ఆమె తల నిమురుతూ " తప్పకుండా. నువ్వు వెళ్ళమని చెప్పేవరకు వుంటాను " అన్నాడు.
"థాంక్స్" అంటూ హిమజ అతని బుగ్గలు పుణికి ముద్దు పెట్టుకుని వెళ్లిపోయింది, ఆమె మాటలు అర్ధం కాలేదు. కానీ ఆమె చేష్టలకు రఘు మనసు లయ తప్పింది. అంతలోనే వివేకం మేలుకుని, " హిమజ నిన్ను ఆట పట్టిస్తోంది. మోసపోయి దేవదాసు గా మారకు" అని హెచ్చరించింది
@@@@
మొదట కాస్త విచారంగా కనిపించిన హిమజ, ఆ తర్వాత అల్లరితో రెచ్చిపోయింది. పుదుచెర్రీ లోని పర్యాటక స్థలాలను రఘుకి చూపించింది. రఘు వద్దని మొత్తుకున్నా వినకుండా, రఘుతో ఫోటోలు తీసుకుంది.
"నువ్వు పూర్వకాలం మనిషివి. ఆడ, మగసన్నిహితంగా వుంటే మొగుడూ పెళ్ళాలేనా?" అని విసుక్కుంది.
ఒకనాటి వుదయం, పలహారం చేసాక, " ఈ రోజు నో ప్రోగ్రాం! నువ్వీ రోజు కవిత్వం చెప్పాల్సిందే, నో వాయిదా" అంది హిమజ రఘుతో.
" సరే సరే" ముందు బుద్ధిగా కూర్చో. నా దగ్గరికి రాకూడదు" అని సోఫాలో హిమజని కూర్చోబెట్టి, కొద్ది దూరంలో నిలబడి, తన కవిత్వం చదివాడు రఘు.
“నా కంటిచూపు రధమెక్కి నీ వరుదెంచు
నా పలుకు ప్రేమామృతమాస్వాదించు
నా బిగి కౌగిట హాయిగా నిదురించు
రా సుందరీ! నా ప్రణయేశ్వరీ!”
హిమజ ఒక్క వుదుటన లేచి, " వాహ్వా!" అంటూ అతన్ని తన బిగి కౌగిలిలో బంధించింది.
"వదులు. ఇలా రాకూడదని చెప్పానా' అంటూ ఆమెను విడిపించుకునే ప్రయత్నం చేసాడు రఘు. హిమజ అతని మాటలు లెక్క చేయకుండా, ఒక చేతితో అతని తలను తన వైపుకు లాగి, ముఖం నిండా ముద్దులు కురిపించింది.
ఒక ప్రక్క అంగాంగ స్పర్శ, ఇంకో ప్రక్క అతని పెదవుల చేరువలో ఆమె పెదవులు. నిగ్రహించుకోవడమింక కష్టసాధ్యమని రఘు గ్రహించాడు. బలంగా ఆమెను తోసి వేసి వడి వడిగా అడుగులు వేసుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు.
అలా వేగంగా వెడుతున్న అతనికి ఒక కోవెల కనిపించి, లోనికి వెళ్ళాడు. అది చిదానంద స్వామి జీవ సమాధి యైన ప్రాంతంలోని శివాలయం. శివుని దర్శించి, యెదుటనున్న కొలనుదగ్గర సిమెంట్ బెంచిపై కూర్చుని, " స్వామీ! నాకేమిటీ పరీక్ష! నువ్వంటే కామ దహనం చేయగల పరమాత్ముడవు. నేనొక అర్భకుడిని. ధర్మబద్ధం కాని వ్యామోహంలో, తేనెలో పడిన ఈగలా, కొట్టుకు పోతున్నా! కాపాడు" అని వేదనతో ప్రార్ధించసాగాడు రఘు.
ఇంతలో ఫోన్ రింగయ్యింది. ఆ శబ్దానికి కనులు తెరిచి, ఎవరిదీ నంబరనుకుంటూ 'హలో' అన్నాడు. అవతలినించి ఒక యువతి గొంతుక.
" రఘూ! నేను రాగిణిని. నీ మనసు మాకు తెలిసింది. హిమజకోసం నువ్వు ఇంటికి వస్తున్నావని మాకు తెలుసు. నిన్నూ, నీ కుటుంబాన్ని యిష్టపడ్డాకే, హిమజ నిన్ను పాండీ తీసుకొచ్చింది. రాజా అన్న వ్యక్తి లేడు. హిమజ నిన్ను మనసారా ప్రేమిస్తోంది. ఇంటికి వెళ్ళి ఆమెకి ప్రపోజ్ చెయ్యి"
రాగిణి మాటలకు రఘు మదిలో కోటి వీణలు మ్రోగాయి. ఒక పూల గుత్తిని తీసుకుని ఇంటికి పరిగెత్తాడు. ఇంటిలో అడుగు పెట్టిన అతనికి అందంగా అలంకరించుకుని వున్న హిమజ యెదురువచ్చింది.
" ఏం ! శ్రీవారూ! పారిపోయారు. అంది వెక్కిరింపుగా.
" ఏం చేయను? నన్ను క్షమించు. నీ చనువుకి చలించి పారిపోయాను" అన్నాడు రఘు ప్రాధేయపూర్వకంగా.
" నిన్ను యిష్టపడ్డాను కాబట్టే, చనువుగా వున్నాను" అంది హిమజ.
రఘు మోకాళ్ళ మీద కూర్చుని, పూలగుత్తిని ఆమె కిస్తూ" నా ప్రేమ దేవతా! నీతో కలిసి జీవించే వరమివ్వు" అన్నాడు.
హిమజ చిరునవ్వుతో ఆ గుచ్చాన్ని అందుకుని, " ఐ లవ్ యూ" అని అతన్ని కౌగలించుకుంది.
@@@@@@
C..S.G . కృష్ణమాచార్యులు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం: C..S.G . కృష్ణమాచార్యులు
శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం, తిరుపతి లో మేనేజ్మెంట్ విభాగంలో ప్రొఫెసరుగా రిటైర్ అయ్యాను. మేనేజ్మెంట్ విద్యకు సంబంధించిన అనేక పాఠ్య గ్రంధాలు ప్రెంటిస్ హాల్, పియర్సన్ ఎడ్యుకేషన్, హిమాలయ వంటి ప్రముఖ సంస్థల ద్వార ప్రచురించాను. చిన్నతనం నుంచి ఆసక్తివున్న తెలుగు రచనా వ్యాసంగం తిరిగి మొదలుపెట్టి కవితలు, కథలు, నవలలు వ్రాస్తున్నాను. ప్రస్తుత నివాసం పుదుచ్చెరీలో.
Коментарі