#AchantaGopalaKrishna, #ఆచంటగోపాలకృష్ణ, #ManasuluKalisinaSubhavela, #ManasuluKalisinaSubhavela, #TeluguLoveStories, #తెలుగుప్రేమకథలు
'Manasulu Kalisina Subhavela' - New Telugu Story Written By Achanta Gopala Krishna
Published In manatelugukathalu.com On 23/10/2024
'మనసులు కలిసిన శుభవేళ' తెలుగు కథ
రచన: ఆచంట గోపాలకృష్ణ
కథా పఠనం: పద్మావతి కొమరగిరి
సమయం 9. 30 అవుతోంది. విజయ్ తన ఛాంబర్ లోకి వచ్చేసాడు..
"గుడ్ మార్నింగ్ విజయ్ " అంటూ విష్ చేసాడు వినోద్.
"గుడ్ మార్నింగ్ వినోద్, అన్నట్లు ఇవాళ మన ప్రోగ్రామ్స్ ఏమిటి " అంటూ అడిగాడు విజయ్.
వినోద్ ఎంబీఏ చేసాడు. విజయ్ దగ్గర పర్సనల్ అసిస్టెంట్ గా చేరాడు. చేరిన కొంత కాలానికే తన ప్రతిభ తో విజయ్ కి బాగా దగ్గర అయ్యాడు. ఒకే వయసు వాళ్ళు అవడంతో,
ఆఫీస్ వరకె బాస్.. బైట ఫ్రెండ్స్ లాగా ఉంటారు.
"ఇవాళ కొన్ని ఇంటర్వ్యూ లు ఉన్నాయి. మీరు ఒకసారి చూసి ఒకే చేసేస్తే, ట్రైనింగ్ కి పంపేస్తాను " అన్నాడు వినోద్.
"సరే ఆ ఫైల్ ఇదేనా " అంటూ టేబుల్ మీద ఉన్న దానిని తీసుకుని అప్లికేషన్స్ స్టడీ చేయడం మొదలు పెట్టాడు విజయ్.
"మీరు కాఫి తాగండి, ఈ లోగా అభ్యర్థులు వస్తే ఒక్కొకరిని పంపిస్తా.. " అంటూ బైటకి వెళ్ళాడు వినోద్.
వరుస గా చూస్తూ ఉంటే ప్రణవి అనే అప్లికేషన్ దగ్గర ఆగాడు విజయ్. ఆ పేరు చదవగానే చిన్నపుడు.. మాస్టారు గారి అమ్మాయి గుర్తుకు వచ్చింది.. ఇప్పుడు ఎక్కడ ఉందో..
మాస్టారు ఎక్కడ ఉన్నారో ఎంక్వయిరీ చేయించాలి..
చదువు కోవడానికి అమెరికా వెళ్లి పోవడం తో తనకి కుదరలేదు.
ఇక్కడికి రావడం.. ఇండస్ట్రీ ప్రారంభించడము.. ఆ పనులలో బిజీ గా అయిపోయాడు.
అలా ఆలోచనలతో ఉండగా వినోద్ లోపలికి వచ్చి
"వాళ్ళందరూ వచ్చేసారు. మీరు సరే అంటే ఒక్కొక్కళ్ళ నీ పంపిస్తా" అన్నాడు.
"సరే పంపించు.. నువ్వు కూడా వచ్చి చెయ్. నేను ఒకే చేస్తాను.. " అన్నాడు విజయ్.
వరుసగా అవుతున్నాయి..
ప్రణవి వంతు వచ్చింది..
లోపలికి రాగానే "కూర్చోండి " అన్నాడు వినోద్.
"థాంక్స్" అంది.
కొంచెం కంగారు గా ఉంది..
ఎలాగైనా ఈ జాబ్ తనకి రావాలని..
వేయి దేవుళ్ళకి మొక్కుకుంది.
ఈ ఉద్యోగం వస్తే ఆర్ధిక ఇబ్బందులు నుంచి కొంత వరకు బైట పడవచ్చు. తల్లికి వైద్యము కూడా చేయించవచ్చు..
అని మనసులో నే భగవంతుడు ని ప్రార్ధించి.. కాన్ఫిడెంట్ గా విజయ్ వైపు చూసింది..
విజయ్ పరిశీలన గా చూసాడు..
మధ్య తరగతి సంప్రదాయ కుటుంబం నించి వచ్చి నట్లు ఉంది.. ముఖం లో వర్ఛస్సు..
‘చాలా బాగుంది ఈ అమ్మాయి’ అనుకున్నాడు..
కానీ ఎక్కడో చూసినట్టు.. ఏదో భావన.. మనసులో, తనకి పరిచయం ఉన్నట్లు హృదయం చెపుతోంది.
ఆమె కళ్ళలో కంగారు, తనకి ఈ ఉద్యోగం అవసరం అనే భావన.. కనిపిస్తోంది.
"సర్ మొదలు పెట్టండి " అనగానే, తన ఆలోచనలకి తనకే నవ్వు వచ్చింది..
ప్రశ్నలు అడగడం మొదలు పెట్టాడు విజయ్.
మధ్య లో వినోద్ ప్రశ్నలు అడుగుతున్నాడు.. ఆమె చక చకా సమాధానాలు చెపుతోంది.. విజయ్ కి ఆమె మాట్లాడే విధానం అన్ని నచ్చాయి..
అప్పుడు చూసాడు అప్లికేషన్ లో తండ్రి పేరు రఘురామ్..
రిటైర్డ్ మాస్టారు అని.
ఒక్క సారి ఆశ్చర్యం కి లోనయ్యాడు.
తాను ఎవరి కోసం వెదుకుదామని అనుకుంటున్నాడో ఆయనే..
రఘురామ్ మాస్టారు.
చిన్నప్పుడు తనను చదివించి డబ్బు లేకపోతే ఆయనే చాలాసార్లు ఫీజులు కూడా కట్టేవారు.. ఒక్కో సారి తనకి భోజనం కూడా పెట్టేవారు..
నేనంటే ఎంత ప్రేమ గా చూసుకునే వారో..
ఒక్కసారి జ్ఞాపకాల లోకి వెళ్ళాడు.. విజయ్.
అవును నిజం గా తనే..
"మీ నాన్నగారు రఘురామ్ రిటైర్డ్ మాస్టర్ అని ఉంది.. ఎక్కడ పని చేశారు" అని అడిగాడు ఉత్సాహంగా.
చెప్పింది..
అవును ఆయనే ఇన్నాళ్లు తాను వెదుకుతున్నది..
ఆయన గురించే.
" మీ నాన్న గారు నాకు బాగా తెలుసు. నేను ఆయన దగ్గర చదువుకున్నాను.. ఆయన చెప్పిన మాటలు నన్ను ఈ రోజు ఈ స్థాయిలో నిలబెట్టాయి.. ఇంతకీ ఆయన ఎలా ఉన్నారు.. "
అని అడిగాడు విజయ్..
"బాగానే ఉన్నారు అండి.. వయసు తో వచ్చే ప్రోబ్లెంస్ అంతే"
"సరే రేవు మీ ఇంటికి నేను వస్తా.. నాన్నగారికి కలవడానికి..
చూసి చాలా కాలం అయింది.. " అన్నాడు.
"సర్ ఈ జాబ్ నాకు చాలా అవసరం.. నాన్న గారు తెలుసు అంటున్నారు.. నా క్వాలిఫికేషన్ నచ్చితే.. సహాయం చేయండి" అని రిక్వెస్ట్ చేసింది.. ప్రణవి.
"మీరు అర్హత ఉన్నది అని మేము భావిస్తే తప్పకుండా ఈ పోస్ట్ మీకే వస్తుంది.. ఒకవేళ ఇది కాకపోతే వేరే పోస్ట్ అయితే ఇవ్వగలను.. చేస్తారా మరి " అని నవ్వుతూ అడిగాడు విజయ్..
"తప్పకుండా అండీ.. ప్రస్తుతం నాకు ఉద్యోగం చాలా అవసరం.. మీరు ఏ పొస్ట్ ఇచ్చినా చేస్తాను.. థాంక్స్ అండీ "
అంది.. ప్రణవి.
"ఇంతకీ ఏమి పోస్ట్ అండీ?” అని అడిగింది.
"ఎందుకు కంగారు.. మీకు ఉద్యోగం గ్యారంటీ.. కానీ అది ఏమిటో ఇప్పుడు చెప్పలేను.. రేపు మీ నాన్నగారిని కలిసిన తరువాత, ఆయనతో మాట్లాడినతరువాత తెలుస్తుంది..
అంతవరకు ఎదురు చూడ వలసిందే.. " అన్నాడు నవ్వుతూ.
"ఇది కేవలం మీ నాన్నగారి గొప్పతనం, మంచితనం వలన ఆయనని దృష్టి లో పెట్టుకుని ఈ సహాయం చేస్తున్నాను "
అన్నాడు విజయ్..
" ధన్యవాదాలు అండీ” అంది ప్రణవి.
“మీ సహాయాన్ని నేను ఎప్పటికీ మరిచి పోను" అన్నది..
"భలే వారండి మీరు.. ఎప్పటికీ మరిచి పోలేని సహాయాలు మీ నాన్నగారు మాకు ఎప్పుడో చేసేసారు.. ఇప్పుడు మా వంతు వచ్చింది అంతే.. సరే ఆ విషయాలు తరువాత,
ఇప్పుడు.. మీరు ఇంటికి ఎలా వెళతారు" అని అడిగాడు.
"బస్ లొనే.. "అంది..
"వినోద్! ఇంటర్వ్యూ కి వచ్చిన వారందరికీ ఇక్కడే లంచ్ ఏర్పాటు చెయ్యండి.. లంచ్ తరువాత, ప్రణవి గారిని, వాళ్ల ఇంటి దగ్గర దిగబెట్టేసి రమ్మని డ్రైవర్ కి చెప్పు. వాళ్ల అడ్రస్ తెలిసినట్లు ఉంటుంది" అన్నాడు విజయ్.
"నేను ఈ ఫైల్స్ అన్ని చూసి సంతకాలు పెట్టేసి వస్తా.. నువ్వు నాతో లంచ్ జాయిన్ అవ్వు.. " అన్నాడు విజయ్..
"ఇంకో ఇద్దరు ఉన్నారుగా సర్ అన్నాడు" వినోద్..
"ఏమి పరవాలేదు. వీళ్లు అందరూ ఫైనలిస్ట్ లే కదా..
చూడక్కర లేదు, నువ్వు ప్రో సీడ్ అవ్వు" అన్నాడు.
" సరే సర్” అంటూ అమ్మాయిని, అందరి ని తీసుకుని వెళ్లి ఏర్పాట్లు చేసి.. “ప్రణవి గారు.. మిమ్మలిని డ్రైవర్ డ్రాప్ చేస్తాడు.. " అని చెప్పి..
“మిగతా వాళ్ళు నలుగురూ రిసెప్షన్ లో ఎదురు చూడండి రిజల్ట్స్ కోసం” అని చెప్పి.. విజయ్ దగ్గరకి వెళ్ళాడు..
" వచ్చింది ఐదు మంది.. కావలసింది నలుగురు..
వాళ్ళందరిని ఉండమని చెప్పి నన్ను వెళ్లిపో మన్నారు.
ఇంక ఆశలు పెట్టుకోవడం దండగే.. మళ్ళీ ఇంకో టి ప్రయత్నించాలి..” అనుకుంది.. నిరాశగా..
"అయినా వేరే ఎదైనా ఇస్తామన్నారు కదా, ఎదురు చూస్తే సరి.. రేపు ఇంటికి వస్తానన్నారు కదా, నాన్న గారిచేత ఒకసారి ఆడిగిస్తే.. తప్పక సహాయం చేస్తారు " అనుకుంది.
"రా వినోద్.. వాళ్ళు వెళ్లిపోయారా.. " అని అడిగాడు విజయ్.
"ఏమిటి బాస్ మీరు చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు.. " అని అడిగాడు వినోద్.
"చెబుతా.. ముందు భోజనం చెయ్.. అందరికి కి అపోయింట్ మెంట్ ఆర్డర్ రెడీ చెయ్.. " అన్నాడు విజయ్.
"ఉన్నది 4.. పోస్ట్ లు.. పైగా ప్రణవి గారు మీ మాస్టారు గారి అమ్మాయి.. అన్నారు.. ఆవిడని సెలెక్ట్ చేసేస్తే,
ఇంకా మూడే ఉంటాయి కదా మరి.. " అని అడిగాడు..
"అది రేపు చెపుతా.. అందరికీ ఆర్డర్స్ రెడీ చేయించు.. "
అని ఆర్డర్ వేసాడు విజయ్..
"అలాగే సర్.. " అంటూ లంచ్ ముగించి.. అందరి ఆర్డర్ పేపర్స్ టేబుల్ మీద పెట్టాడు..
విజయ్ సంతకాలు చేసి..
"ఆ నలుగురిని ట్రైనింగ్ కి పంపేయ్.. " అని చెప్పాడు..
లంచ్ అయ్యాక అందరూ ఉత్కంఠ తో ఎదురు చూస్తున్నారు. తలుపు తీసుకుని కవర్ తో వచ్చాడు..
ఇదిగో అంటూ ఇద్దరి పేర్లు చదివి వాళ్ళకి
కవర్ లు ఇచ్చేసాడు..
"మిగతా రెండు ఇంటర్వ్యూ లు క్యాన్సిల్ అయ్యాయి.. "
అన్నాడు.. మిగతా ఇద్దరూ డీలా పడిపోయారు..
ఇందాక వచ్చిన అమ్మాయి వెళ్లి పోయింది కాబట్టి ఖచ్చితంగా తమ నలుగురికి ఉద్యోగాలు వస్తాయని భావిస్తున్నారు..
కానీ ఇప్పుడు ఇలా అయింది..
మిగతా ఇద్దరికి కంగ్రాట్స్ చెప్పి.. బయలుదేరబోయారు..
"ఆగండి.. ఇంకా.. నేను చెప్పడం పూర్తి అవలేదు, మీరే ఒక నిర్ణయానికి వచ్చేస్తే ఎలా.. ఇంటర్వ్యూ లు మాత్రమే క్యాన్సిల్ అయ్యాయి అన్నాను, మీరు అందరూ సెలెక్ట్ అయ్యారు. ఇదిగో మీ అపోయింట్ మెంట్ లెటర్ "
అంటూ మిగతా ఇద్దరి చేతులలో పెట్టాడు..
ఒక్కసారి ఎగిరి గంతు వేశారు.. ఆనందం లో షేక్ హ్యాండు ఇచ్చి “థాంక్స్ అండీ.. చాలా చాలా థాంక్స్” అన్నారు..
"మీ అందరికి అభినందనలు.. ట్రైనింగు ఎప్పటి నుంచో మీకు ఫోన్ చేసి చెపుతాము.. ప్రస్తుతానికి మీరు వెళ్లొచ్చు"
అంటూ తిరిగి విజయ్ దగ్గరకు వెళ్ళాడు వినోద్.
మరునాడు మాష్టారింటికి వెళ్లారు..
"నమస్తే సర్ ఎలా ఉన్నారు.." అని అంటూ కాళ్ళకి నమస్కారం చేస్తూ అడిగాడు విజయ్.
"ఎవరు.. గుర్తు పట్టలేక పోతున్నా.. కొంచెం చెప్పు బాబు.. "
అన్నారు మాస్టారు.
"నేను అండీ చిన్నప్పుడు మీదగ్గ ర చదువు కున్న విజయ్ ని.
అనాధ ఆశ్రమం లో పెరిగినా మీరు ఫ్రీ గా ట్యూషన్ చెప్పేవారు. పుస్తకాల కి, ఫీజులకి సహాయం చేసే వారు..
ఎప్పుడూ బాగా చదువుతానని నన్ను మీ ప్రియ శిష్యుడు అని పిలిచే వారు గుర్తు పట్టారా అండీ " అని అడిగాడు..
" ఆ ఇప్పుడు గుర్తుకు వచ్చింది.. ఎలా ఉన్నావ్, ఏం చేస్తున్నావ్” అని అడిగారు..
"మీ దయ వలన ఇంటర్ లో మంచి మార్కులు, తరువాత ఇంజినీరింగ్ లో ఫ్రీ సీట్ వచ్చింది.. ఒక మహాను భావుడి దయ వలన అమెరికా లో చదివే అవకాశం దొరికింది..
ఈ మధ్యే, మన దేశానికి వచ్చాను. ఇక్కడ సొంతం గా ఇండస్ట్రీ రన్ చేస్తున్నా.. నా దేశానికి నా చదువు ఉపయోగ పడాలని వచ్చేసా..”
"అక్కడ ఆదాయం బాగా ఉంటుంది కదా బాబు మరి ఎందుకు వచ్చేసావ్ " అని అడిగారు మాస్టారు.
"ఆదాయం బాగానే ఉంది.. కానీ నా ఒక్కడి దగ్గరే అవసరానికి మించి డబ్బు ఉంటుంది. అదే.. ఇక్కడికి వచ్చి ఇండీస్ట్రీ పెడితే చాలా మంది కి ఉద్యోగాలు ఇవ్వొచ్చు.. కదా.. ఇలా అయితే నాకు డబ్బూ వస్తుంది.. పది మందికి జీవనోపాధి కల్పించి నట్లు ఉంటుంది.. కదండీ మరి..
ఆ పది మంది.. కుటుంబాల ఆశీర్వాదమే మనకి బలం..
అనాధ గా పెరగడం నా తప్పు కాదు.. ఇప్పుడు చాలా కుటుంబాలు నాకు ఆత్మ బంధువులు గా ఉన్నారు.. వాళ్ల కళ్లలో వెలుగు చూస్తూ ఉంటే సంతృప్తి గా ఉంటుంది..
ఎంత సంపాదించాను అన్నది కాదు.
ఎంత మంది అభిమానాన్ని సంపాదించాను, ఈ సమాజానికి ఎంతవరకూ ఉపయోగ పడ్డాను అన్నదే నాకు నచ్చిన అంశం అండీ. అందుకే ఇక్కడికి వచ్చేసా.. ఇండస్ట్రీ ప్రారంభించాం. భగవంతుడి దయ వల్ల బాగానే నడుస్తోంది.. లాభాలతో..
ఇక్కడికి రాగానే మీ గురించి వాకబు చేసా.. మీరు రిటైర్ అయ్యారు.. తరువాత ఆ ఊరు నుంచి వెళ్లిపోయారు అని తెలిసింది.. దరిమిలా ఇండస్ట్రీ హడావిడి లో ఈమధ్య కొంచెం బిజీ.. అయ్యాను.. ఖాళీ చేసుకుని మీ అడ్రస్ పట్టుకోవాలి అని మా వినోద్ కి కూడా చెప్పాను.. అన్నట్టు ఇతను వినోద్ నా పర్సనల్ సెక్రటరీ మరియు మంచి స్నేహితుడు.." అంటూ పరిచయం చేశాడు.
"నమస్కారం అండీ " అన్నాడు వినోద్.. రెండు చేతులు జోడించి.
"చల్లగా ఉండు నాయనా.. " అంటూ ఆశీర్వదించారు.
" నిన్న ఇంటర్వ్యూ లో మీ అమ్మాయి ని చూసా.. మీ అడ్రెస్ పట్టుకుని ఇదిగో ఇలా వచ్చేసా.. " నవ్వుతూ అన్నాడు విజయ్..
"అన్నట్టు మీకు కొడుకు ఉండాలి కదా ఎక్కడ ఉన్నాడు"
అని అడిగాడు విజయ్.
"అమెరికా లోనే, ఇల్లు తాకట్టు పెట్టి చదివించా..అక్కడకి వెళ్లి పోయాడు. పెళ్లి కూడా చేసుకున్నాడుట. ఫొటోస్ పంపించాడు.. నేనా రిటైర్ అయ్యాను”.
"అదేమిటి అండీ మరి అలా వదిలేస్తే ఎలా అడగలేదా మరి "
అన్నాడు.
“ఏమని అడగాలి.. ఏవో సాకులు చెపుతాడు.. వాడి చదువుకు చేసిన అప్పులు తీర్చడానికి కూడా డబ్బు పంపలేదు.. ఇల్లు అమ్మేసి తీర్చేసాను.. ఇది అద్దెకి తీసుకుని ఉంటున్నాం.
వాడి మీద బెంగ తో ఆవిడ మంచం పట్టింది.. ఇప్పుడు ఇప్పుడే అలవాటు చేసుకుంటోంది.
పాపం ఆడపిల్ల ఇంటి భారం దీని మీద పడింది. పెళ్లి చేసుకుని హాయి గా అత్తారింట్లో గడపాల్సిన పిల్ల.. ఇప్పుడు ఇదిగో దీని రెక్కల కష్టం మీద ఇల్లు నడుస్తోంది.. ఏమి చేయాలో అర్థం కావట్లేదు" అన్నారు.
"మిమ్మలిని అలా మాట్లాడవద్దని ఎన్ని సార్లు చెప్పాను "
అని సున్నితంగా మందలించింది.. ప్రణవి..
"నీ దగ్గర ఉద్యోగం.. వీలుంటే, మాకు సహాయం చెయ్ బాబు
కొంచెము ఆసరాగా ఉంటుంది" అని అడిగారు..
"అయ్యో ఎంత మాట అన్నారు మాస్టారు.. ఈ జీవితం మీరు పెట్టిన భిక్ష.. మీరు ఆర్డర్ వేయాలి కానీ ప్రాధేయపడవలసిన అవసరం లేదు. మీరు అలా మాట్లాడ కూడదు. మీరు నాకు చేసిన సహాయం ఎలా మరిచిపోతాను. నిజానికి నేనె మీ గురించి వెతుకు తున్నాను. ఇంతలో మీ అమ్మాయి వచ్చింది ఇంటర్వ్యూ కి.
మీ అమ్మాయి అని తెలియ గానే నేనొక నిర్ణయం తీసుకున్నాను. వచ్చిన వాళ్లందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చేసాను, ఒక్క మీ అమ్మాయికి తప్ప.. ఎందుకంటే మీతో మాట్లాడిన తరువాత ఒకనిర్ణయనికి వద్దామని.. " అన్నాడు విజయ్.
"ఏమిటి బాబు అది.. " అని అడిగారు..
"నిజానికి నాకు మీ అమ్మాయి ని చూడగానే నచ్చేసింది.. ఆ తరువాత మీ అమ్మాయి అని తెలియగానే ఇంకా గౌరవం పెరిగింది.. నేను పెళ్లంటూ చేసుకుంటే తననే చేసు కుందామని అనుకుంటున్నా.. అదీ మీకు, మీ అమ్మాయి కి అభ్యంతరం లేక పోతేనే..
ఇది కృతజ్ఞతతో కాదు.. తన పద్దతి అది బాగా నచ్చి..
మీరు సరే నంటే నా అంత అదృష్టవంతుడు ఎవరూ ఉండరు.. ఒకవేళ తనకి ఇష్టం లేదు అంటే.. ఇదిగో నండి తన అపాయింట్ మెంట్ లెటర్. వెంటనే జాబ్ లో జాయిన్ కావచ్చు.. , వేరే ఊరిలో ఉన్న మా బ్రాంచ్ కి, మేనేజర్ గా పంపిస్తాను.. మీకు ఏ సమస్య లేకుండా చూసుకుంటా..
ఇదిగో నండి ఈ టేబులు మీద పెడుతున్నాను.
ప్రణవి గారు.. మీకు ఇష్టమైతేనే సుమండీ..
ఈ లెటర్ చింపేసి.. నా లైఫ్ మేనేజర్ గా వచ్చేయండి..
ఉంటాను మరి.. పదరా వినోద్ ఇంక బయలుదేరదాం”
అంటూ లేచాడు విజయ్.
“వెళ్ళొస్తామండి మాస్టారు మరి” అంటూ కాళ్ళకి నమస్కారం
పెట్టాడు..
"ఒక్క నిమిషం బాబు, ఇలా కూర్చో.. అమ్మాయితో ఒకసారి మాట్లాడతాను " అంటూ..
"అమ్మా బాగా ఆలోచించుకుని ఒక నిర్ణయం తీసుకో..
మాగురించి ఆలోచించకు.. ఎలాగో సర్దుకు పోవాలి మరి.
మాగురించి నీ జీవితం ఆగి పోకూడదు.. ముందుకు సాగాల్సిందే..
విజయ్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. చాలా మంచి కుర్రాడు.. అతని మాటలలో చూస్తున్నావుగా.. మంచి ఆదర్శ భావాలు ఉన్నాయి. ఇంతకన్నా మంచి అవకాశం దొరకదు..
ఆ అబ్బాయి నిన్ను బాగా ఇష్ట పడుతున్నాడు.. నా ప్రియ శిష్యుడు. నేను కాదనలేను కానీ, నీకు ఇష్టం లేకుండా నేను ఏమి నిర్ణయం తీసుకో లేను " అన్నారు మాస్టారు..
"నేను పెళ్లి చేసుకు వెళ్ళి పోతే మరి, మీరో.. మిమ్మలిని ఎలా వదిలేస్తాను.. అనుకున్నారు.. పెళ్ళి వొద్దు ఏమి వద్దు..
నేను జాబ్ కే వెళతాను నాన్నగారు.. ఇంక ఏమి మాట్లాడ వద్దు.. " అంటూ ఆ లెటర్ చేతిలోకి తీసుకుంది..
"భలే వారండి మీరు.. మా మాష్టారిని అలాగే వదిలేస్తానా.. ఏమిటి.. ఆయన మీకు ఎంతో నాకు అంతకన్నా ఎక్కువ..
మీ అమ్మగారు, నాన్నగారు కూడా మనతో నే ఉంటారు.. నాకు మాత్రం ఎవరు ఉన్నారు.. ఒకవేళ మీరు ఉద్యోగానికి వెళ్లినా, వాళ్ళు నాతోనే ఉంటారు.. మీ పెళ్లి బాధ్యత కూడా నాదే.. ఎందుకంటే మీ నాన్నగారు నాపై చూపించిన ప్రేమకి ఈ విధం గా కృతజ్ఞత తెలుపుకునే అవకాశం గా భావిస్తా, .. " అన్నాడు నవ్వుతూ..
"ఇంకా అలోచిస్తా వెందుకు ఒప్పుకో తల్లి.. నీ లాంటి మంచి దానికి అంతా మంచే జరుగుతుంది " అన్నారు మాస్టారు.
"లోపల మంచం మీద ఉన్న అమ్మ వైపు కి చూసింది.
కళ్ళతోనే అడిగింది, ఏమి చెయ్యమంటావు అని..
ఆవిడ కళ్ళ నిండా సంతోషం తో చేసుకో మని తల ఆడించారు.
"మీ ఇష్టం నాన్నా "అంటూ తన చేతిలో ఉన్న అపోయింట్ మెంట్ లెటర్ చింపేసింది.
సిగ్గుతో బుగ్గలు ఎరుపెక్కగా తల వంచుకుని చిరు నవ్వుతో,
నిలబడింది.
లోపల మంచం మీద వాళ్ళమ్మ గారు ఇది అంతా వింటూ,
మనసులోనే భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు.
కళ్ళు లో వెలుగులు నిండగా..
విజయ్ వైపు కి ఓరగా చూసి తన అంగీకారాన్ని తెలుపుతూ తల ఆడించింది.
ఇద్దరూ ఆయన కాళ్ళకి నమస్కరించారు, ఇద్దరిని తన రెండు చేతులతో లేపి,
"శుభం" అంటూ వాళ్ళిద్దరి చేతులు కలిపి, ఆశీర్వదించారు మాస్టారు.. కంటి నిండా ఆనంద బాష్పాలతో..
మనసులో సంతోషం నిండగా..
శుభం..
ఆచంట గోపాలకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
నా పేరు ఆచంట గోపాలకృష్ణ
రచనలు..కథలు ,సిరీస్ ,కవితలు సమీక్షలు రాయడం ఇష్టం..
15 సంవత్సరాలు గా రచనలు చేస్తున్నా..
నాకు flyincoloursachantagopalakrishna.blogspot.com అనే బ్లాగ్ ఉంది..
ఇంకా pratilipi ane magazine lo సిరీస్ రాస్తున్నా..
Comments