top of page
Writer's picturePandranki Subramani

మనసులు కలవడానికొక శుభతరుణం



'Manasulu Kalavadanikoka Subhatharunam' - New Telugu Story Written By Pandranki Subramani

Published In manatelugukathalu.com On 24/02/2024

'మనసులు కలవడానికొక శుభతరుణం' తెలుగు కథ

రచన: పాండ్రంకి సుబ్రమణి

(ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



కృష్ణమూర్తి కేంద్ర ప్రభుత్వ ఉపాధి శాఖ నుండి ఉన్నత పదవిలో ఉద్యోగం చేసి పోయినేడాది అరవై యేళ్ల ప్రాయం వచ్చే టప్పటికి అధికారపూర్వక అనివార్య అంశంగా ఉద్యోగ విరమణ చేసాడు. సముచితమైన జీవన విధానం గల వాడవటం వల్ల మనిషి శరీర పటుత్వం సడలకుండా నిలకడగా నిటారుగానే ఉంటాడు; ఆత్మనిశ్చలతతో మనసు నిలకడగా నిబ్బరంగా ఉంటే శరీరమూ కుదురుగానే ఉంటుందంటారే— ఆ రీతినన్నమాట. 


ఐతే- విదురుడైన(భార్యను కోల్పోయిన) కృష్ణమూర్తికి క్రమక్రమంగా ఒంటరితనం ఘాటుగా కౌగలించుకుంది; వంద్దంటే కూడా డబ్బు పదే పదే ప్రోగయినట్టు. అప్పటికీ అతను నిబ్బరాన్ని కోల్పోకుండా కాలాన్ని వృధాగా దొర్లి పోనివ్వకుండా గ్రంథ పఠనం తో బాటు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే పడి ఉన్నట్టు కాక, భారత పర్యటన వెళ్ళివచ్చాడు. 


మాటకు మాటగా చెప్పుకుంటే— కోడళ్ళిద్దరూ తనను పిల్వని పేరంటానికి వచ్చిన వాడిలా కాకుండా బాగానే చూసుకున్నారు. ఇకపైన ఒంటరిగా ఉండకుండా తమతోనే ఉండి పొమ్మన్నారు. మరి ఎటువంటి గ్రహపోటో గాని, అతడి మనసు మాత్రం ఎవరో మాంత్రిక శక్తితో లాగుతున్నట్టు పుట్టి పెరిగిన ప్రాంతం వేపే ఆలోచించేది. పుట్టినూరు గురించే తపించేది. కార్యాలయంతో ముఖ్యంగా సహోద్యోగులతో ముప్పై ఏండ్ల అనుబంధం ఆషామాషీ వ్యవహారం కాదు కదా! వాళ్ళను ఓమారు చూడాలని, చూసి మనసార పలకరించాలన్న తహతహ ఎలా ఉండకుండా ఉంటుంది? 


మర్రి చెట్టుని ఉన్నపాటున పెకలించి మరొక చోట ట్రాన్స్ ప్లాంట్ చేయడం అంటే మాటలా! అంతేనా— తనతో ఏడడుగులు నడచి తన వారినందర్నీ విడిచి ముప్పై ఐదేండ్లపాటు తనతో కాపురం చేసిన శారద జ్ఞాపకాలను ఎలా చెరిపేసుకోగలడు- ఒకటి మాత్రం ఖాయం- బ్యాంకు బ్యాలెన్సు ఎంత బరువుగా ఉన్నా- ధన్వంతరి దీవెన వల్ల ఆరోగ్యం ఎంత ముమ్మరంగా శోభిల్లుతున్నా- శారద లేని జీవితం అలల చప్పుడే వినిపించని రష్యన్ తీరపు డెడ్ సీ వంటిదే! 

మనిషన్నవాడు అవసరం ఉన్నా లేకపోయినా చాలా మందితో మాట్లాడుతూ ఉంటాడు. కాని,ఎదురొచ్చిన వారందరితోనూ హృదయాంతరపు లోతుల్లో నుండి ఆత్యీయపు పన్నీటి జల్లుని కురిపిస్తూ మాట్లాడ లేడుగా! వివాహ బంధంతో ముడిపడి ఉన్న మహత్యం అదేగా! - ‘మాంగల్యం తంతునానేన మమజీవన హేతునా!’అనే కళ్యాణ మంత్రంలో శోభిల్లే సహజీవన సౌరభాలకున్న విశిష్టత అదేగా! కృష్ణమూర్తి ఆలోచనల ముమ్మరం వలన కలిగిన అలస టతో రెండు చేతులూ కళ్లపైన ఉంచుకుని సోఫాలో కూర్చుండిపోయాడు. 


కాసేపు తరవాత తనను తను కుదుట పర్చుకుని లేచాడు. మనిషిన్నవాడికి జీవితంలో దు:ఖాన్ని మించిన బధ్ధశత్రువు మరొకటి లేదు- సాధ్యమైనంత మేర దానిని దగ్గరకు చేరని వ్వ కూడదు. ఎట్టకేలకు గుండెబరువుని మోస్తూ- తనను మోసుకుంటూ లేచాడతను. సంచీ తీసుకుని, జుబ్బా జేబులో డబ్బులు న్నాయో లేదో ఓసారి చూసుకుని అపార్టుమంటుకి తాళం వేస్తూ అసంకల్పితంగా తిరిగి చూసాడు. ఎదుటి అపార్టుమెంటు ముందు తెల్లని చుక్కల ముగ్గులు! అపార్టుమెంటు వాళ్ళకు కూడా రంగవళ్ళికలు వేసేంత తీరికా ఒడుపూ ఉంటాయేమిటి?


అతడికి ఆశ్చర్యంతో బాటు ఆనందం కూడా కలిగింది. షాపునుండి పాలసంచీలు తీసుకుని లిఫ్టు ద్వారా తన బ్లాక్ చేరి తన అపార్టుమెంటు వేపు వస్తూన్నప్పుడు ఎవరో మధ్య వయస్సులో ఉన్నఓ స్త్రీమూర్తి ఆదరాబాదరాగా తాళం వేసి చకచకe నడిచి వెళ్లిపోతూంది. ఆమెవరో గాని— పిలిచి పలకరిస్తే బాగున్ననిపించింది కృష్ణమూర్తికి- ముఖ్యంగా చాలా రోజుల తరవాత ఆ బ్లాక్ లో మొదటిసారి కనిపించిన ముగ్గుల అంకరణ గురించి తలపోస్తూ. 


కాని అలా చకచకా వెళ్తూన్న ఆవిడ ఆ వంపుల సొంపుల ముగ్గుల్ని తనే వేసిందా- లేక పనిగత్తెవరితోనో వేయించి వెళ్లిందా-- ఎవరైతేనేమి- మెచ్చుకోవడం తన కనీస కర్తవ్యం మనిష న్నవాడికి కళా పోషణన్నది కూసింత ఉండవద్దూ! ఏది ఏమైతేనేమి- ఆమెతో మాట్లాడే అవకాశం అదే రోజు సాయంత్రం కృష్ణమూర్తికి లభించింది,తలవని తలంపుగా-- నిజానికి కృష్ణమూర్తికి ఆమెవరో తెలియదు. తెలుసుకోవలసిన అవసరమూ కలగలేదు. ఒకటి మాత్రం అతడి ఊహకు అందీ అందనట్లు అందింది. తనింట్లోలాగే ఆమెగారింట్లోనూ అలికిడి లేనట్లుంది. 


అంటే, తనలాగే పరిస్థితుల దృష్ట్యా ఒంటరిగా కాలం గడుపుతుందేమో! అంచేత మధ్యాహ్నం కోరియర్ బాయ్ తెచ్చిచ్చిన పార్సల్ని అందుకున్నాడు ఆమె తరపున సంతకం పెట్టి తీసుకుంటూ-- తోచుడుకి ఇది కూడా ఓ విధమైన నిర్మాణాత్మకమైన మార్గమేనే మో! ఎదురింటి బ్లాక్ అపార్టుమెంట్ మేడమ్ పేరు సూర్యప్రభ. ఇక రెండవ అంశంగా చేయవలసింది; మంచికో చెడుకో- రేపు దేనికైనా పనికొస్తుందేనే తలంపుతో ఆమెతో పరిచయం పెంచుకోవడం. అదే విధంగా ఆమె సాయంత్రం వచ్చి తలుపు తీస్తూన్న గరగర చపుడు వినిపించి కృష్ణమూర్తి బైటకు వచ్చి పార్సిల్ అందించాడు. వాటిని తీసుకుని అతణ్ణి ఎగాదిగా చూసి లోపలకు రివ్వున వెళ్ళిపోయింది గాని, సభ్యత కోసం చిన్నపాటి ధన్యవాదాలు చెప్పలేదు. కనీసం తిరిగి కూడా చూడలేదు నవ్వు ముఖం తో-- 


బహుశ: మిక్కిలి ఆస్తిపరురాలో లేక ఉన్నత ఉద్యోగంలో ఉన్న విద్యాధికురాలో అయుంటుంది. సూర్య ప్రభ ప్రవర్తనకు అతడి ముఖం మారింది. ఆమెకు ఆమెగా ఏదో ఊహించేసుకుంటూ గొప్పగా ఫీలవుతుండవచ్చు. కాని తను మాత్రం తక్కువ స్థాయిలోనా కొలువు చేసి గృహాభిముఖుడయాడూ! తను మాత్రం సీనియర్ క్యాడర్ ఆఫీసర్ పొజిషన్ లో కదూ రిటైర్ అయాడు- అప్పటికప్పుడు అతడు గట్టి తీర్మానానికి వచ్చేసాడు; ఇకపైన ఆమె వేపు తలెత్తి కూడా చూడకూడదని- ఆమె వేసే ముగ్గుల వేపు కూడా తలతిప్పి చూడకూడదని-- ఇంతకూ ఆవిడేమిటి— చిన్న వయసులో ఉన్న చిన్నదా-  ఏబైకి పైమాటేగా! 


కాని— ఆశ్చర్యం-  మహదాశ్చర్యం-- వారం రోజుల తరవాత ఆ మహాతల్లిని మరొక మారు ముఖా ముఖిన చూడవలసి వచ్చిందతనికి. దీనిని కాక మరి దేనిని గ్రహపాటంటారు? ఎలాజరిగిందంటే— తనతో బాటు అదే సంవత్సరంలో ఉద్యోగ విరమణ చేసిన తన సహోద్యోగి సచ్చిదానందం అకస్మాత్తుగా మంచాన పడ్డాడు. అదీను ఎలాగని- తీవ్రమైన గుండె నొప్పితో-- అప్పుడు పెన్షనర్ల్ సంక్షేమ సమితి కార్యదర్శిగారు మెయిల్ పంపించారు ఆ విషయమై. అది చూసిన మరుక్షణం కృష్ణమూర్తి ఒక్క ఉదుటున కోకిలా క్లీనిక్కు చేరుకున్నాడు. అప్పుడన్నమాట అతడికి ఎదురైంది-- చూసీ చూడటంతో అతడి నోట అసంకల్పితంగా వచ్చేసింది- “మీరా! ఇక్కడేం చేస్తున్నారు? “అని. తన ప్రశ్న ఆమెకే మాత్రమూ రుచించనట్లుంది. 


రెండు కళ్లూ ఆమాంబాపతు చేసుకుని చూసింది- “డాక్టరుగా నేనెక్కడుండాలో అక్కడే ఉన్నాను. ఇప్పుడు మీగురించి చెప్పం డి. ఇక్కడ మీరేం చేస్తున్నారు? ” 


అతడు క్షణంపా టు మిటకరిస్తూ చూసాడు. తనకు బాగా గుర్తు- ఆంటన్ చెకోవ్ ఒక చిరు కథ వ్రాసాడు- దాని పేరు- ‘ఎ లేడీ విత్ ది డాగ్‘. ఇటు వంటి స్త్రీని గాని చెకోవ్ చూసుంటే- మరొక విధంగా పేరు పెట్టి ఉండేవాడు- ‘ఎ లేడీ విత్ ది షార్ప్ టంగ్‘ అని. 


కాసేపటికి నిబ్బరం తెచ్చుకుని వచ్చిన విషయం చెప్పి- యథాలాపంగా అడిగాడు- “మీరు డాక్టరుగా ఇక్కడ ఉద్యోగం చేస్తున్నారన్నమాట! ” 


సూర్యప్రభ అప్పుడు కూడా నిదానంగా బదులివ్వడానికి ప్రయత్నించలేదు. అసలు నిదానంతో మాట్లాడ టమే ఆమెకు చేతకాదేమో-- అత్తపైన కోపం దుత్తపైన చూపించినట్లు మరొక షార్ప్ రిప్లయ్- “కాదు ముమ్మాటికీ కాదు. ఈ క్లీనిక్ నాది. అన్నిటికీ నేనే ఇన్చార్జీని. ఇంకేమైనా అడగాలా?“


ఈసారి కృష్ణమూర్తికి రియాక్ట్ కావాలని మనసు బుసలు కొట్టింది. టిట్ ఫర్ టేట్ లా-- “ఐసీ! ” అంటూ గిరుక్కున వెనక్కి తిరిగాడు. 


“ఆగండి! ” 


ఆగకూడదనుకుంటూనే ఆగాడతడు. అది అభ్యర్థన కాదు- ఆదేశం. తనకేమాత్రం నచ్చని అంశం- 

”ఇంత దూరం వచ్చారు. నాతో కలసి ఒక కప్పు కాఫీ తీసుకుని వెళ్ళండి” 


ఇదే తగిన తరుణం రియాక్ట్ కావడానికి. చప్పున బదులిచ్చాడు- “నాకిప్పుడు వీలుపడదు. కాని మీరు నాకొక సహాయం చేయగలరు” 


ఏమిటన్నట్టు కళ్ళెత్తి చూసింది సూర్యప్రభ-


 “రూమ్ నెంబర్ త్రీలో నాతో బాటు రిటైర్ ఐన నా కోలీగ్ అడ్మిట్ అయాడు. పేరు సచ్చిదానందం. మీకు వీలు చిక్కినప్పుడల్లా చూసొస్తే నాకు సంతోషంగా ఉంటుంది” 

మాటల మధ్య సారీలు థేంక్సులూ రాకుండా జాగ్రత్త పడుతూ అన్నాడతడు. ఆమె తలూపింది. కాని ఏ కళన ఉందో మరి- అతడితో బాటు హాలు గడప వరకూ వచ్చి సాగనంపింది. ఆ ఒక్క స్నేహ పూర్వక చర్యతో అతడిలో అంతవరకూ బుసలు కొట్టిన ఆవేశం చప్పున చల్లబడిపోయింది. మళ్లీ అటివంటిదే జరిగింది. మరునాడు కూడా అదే ప్రసన్నమైన కళనుందేమో మరి— ఉదయం తను పాల సంచీలకోసం బయల్దేరుతున్నప్పుడు పలకరించిందామె- 


“ గుడ్ మోర్నింగ్ మిస్టర్ మూర్తీ! ”అని. 


అతడికి తెలియకుండానే మనసుని చల్లటి ఉదయకాలపు సమీరంలా సోకింది. తను నిజంగానే అల్పసంతోషే! ఇందులో సందేహం లేదు. అతడు కూడా మన:పూర్వకంగా శుభోదయం చెప్పి ముందుకు కదలబోయాడు. 


ఆమె మళ్లీ ఆపింది. ”మీరు కాఫి చేసుకోవడానికేగా పాల సంచీల కోసం వెళ్తు న్నారు! రండి! ఈ పూట నాతో తీసుకుందురు గాని— తరవాత తీరిగ్గా తాగడానికి మీకు కొంచెం ఫ్లాస్కులో కూడా పోసిస్తాను” 


అతడికేమనాలో తోచలేదు. స్త్రీల చిత్తములు చిత్రాతి చిత్రంగానే ఉంటాయి మరి— సర్దుకు పోవాలి మరి. ఎంతైనా ఎదురింటి నైబరేగా— అతడు లోపలకు వెళ్లి కూర్చోగానే చేతికి కాఫీ కప్పు అందించింది. అందిస్తూ అడిగింది- “ఈరోజు మా ఇంటి ముంగిట ముగ్గు చూసారా? ”


అతడు యేమాత్రమూ ఎదురు చూడని క్వరీ— లోలోన దగ్గరితనానికి దారితీసే ప్రశ్న. జవాబివ్వక తప్పు తుందా! ”ఇంత బిజీ షెడ్యూలో రద్దీగా ఉంటూ ముగ్గులు వేయడమంటే మాటలు కాదు. మీరు మా శారదలా ముగ్గులు బాగా వేస్తారు“


ఆమెవరు అన్న ట్టు చూసిందామె. 


“పైలోకాలు చేరుకున్న మా ఆవిడ. కుదురుగా వేసిన ముగ్గులు చూస్తుంటే నాకనిపిస్తుంటుంది- వాళ్ళ మనసులు అందరిలా కాకుండా చాలా కుదురుగా ఉంటాయని. “


ఆమె తలను సన్నగా విదిలించి అంది- “మీకు గాని పగలు తోచకుండా ఉంటే మీకోక పని చెప్పాలనుకుంటున్నాను”


అదీ సంగతి! కోడి పుంజు జుత్తు ఊరకే ఆడుతుందా! ”చెప్పండి డాక్టర్“ అని అడిగాడతను. 

ఆమె విషయాని కి వచ్చింది- ”మా క్లీనిక్కులో హెల్ప్ లైను ఉంది. అందులో మీరు చేరితే బాగుంటుంది. ఏమంటారు? ”


అతడు కొన్ని క్షణాలు ఊరకుండిపోయాడు. వ్యక్తిగతంగా తనకు నచ్చే అంశమే యిది. మరి హెల్ఫ్ లైనులో తనేమి చేయాలో! “వారానికి రెండు రోజులు మీ క్లీనిక్ హెల్ప్ లైనుకి హాజరు కాగలను. అదీను మధ్యాహ్నం వరకు— ఎందుకంటే నాకు బైట తినే అలవాటు లేదు. నేనే వంట చేసుకోవాలి. అంతేకాదు. నేను మాజీ ప్రభుత్యోద్యోగిని- నాకు ఇవన్నీ కొంచెం కొత్త- ప్రాథమిక ట్రైనింగు కావాలి"


దానికామె నవ్వుతూ తలూపి లేచింది. అన్న మాట ప్రకారం ఫ్లాస్కులో టీ పోసి అందిచ్చింది. థేంక్స్- అంటూ బైటకి కదిలాడు. మండు వేసవి మధ్యలో వాన జల్లు కురిసినంత హాయిగా తేటగా ఉందతనకి. 


 ఒక రోజు అనుకోకుండా ఒకటి జరిగిపోయింది. సనత్ నగరులో బస్సు దిగుతున్నప్పుడు భోరున కురిసిన అకాల వర్షంలో తడిసి ముద్టయాడు కృష్ణమూర్తి. దానితో జలుపు పట్టి టెంపరేచర్ కూడా పెరిగింది. జలుబంటే ఏడు రోజుల ఇబ్బందుల పండగేగా! క్రోసిన్ మాత్రలు మింగుతున్నా మెరుగు కనిపించక పోవడంతో అతడు పూర్తిగా బెడ్ రేస్ట్ తీసుకోవడానికి తీర్మానించాడు. సరిగ్గా అదే సమయాన డోర్ బెల్ రింగవడం వినిపించింది. తలుపు తీస్తే ఎదురుగా డాక్టర్ సూర్యప్రభ! 

గడ్డం కూడా గీచుకోకుండా ఉండటాన ఆమె కళ్ళకు తను మరీ నీరసంగా కనిపించాడు.


వైద్యురాలు కదూ-- అంతా తనే అయి గోడనున్న తాళం చెవి అందుకుని తలుపుకి తాళం వేసి అతణ్ణి తన ఇంటికి తీసుకువెళ్లింది. ఇరుగు పొరుగున ఎవరో ఒక డాక్టరమ్మ ఉండటం దేనికైనా మంచిదే—‘అప్పిచ్చువాడు,వైద్యుడు,ఎప్పుడు నెడతెగక పారు నేరును,ద్విజుడున్ చొప్పడిన యూరు‘- కష్టకాలంలో ఉన్న తెలుగోడన్నవాడు సుమతీ శతక కారుడ్ని మరచి పోగలడా-- 

ఎటువంటి ఇగో లేకుండా సూర్యప్రభ వేడనీళ్లలో తడిపిన గుడ్డతో అతడి ముఖమండలం తుడిచి పీవర్ రేంజిని థర్మోమీ టర్ తో చూసి,బ్రెడ్ రోస్టు చేసిచ్చింది. ఆ తరవాత ఏవో రెండు మాత్రలు కూడా తినిపించి సోఫాలో హాయిగా కాలు చాపుకుని పడుకోమంది. 


అతడలా కాళ్ళ చాపుకుని కళ్ళు మూసుకున్నాడో లేదో- “ఇదిగో! కాఫీ తాగండి. రిలేక్సుగా ఉంటుంది“ అంటూ కాఫీ కప్పు అందించి ఎదురుగా కూర్చుంది. 


ఆతడు లేచి కాఫీ రుచిని అనుభవిస్తూ తాగుతున్నప్పుడు ఆమె సంభాషణ ఉపక్రమిం చింది- “నేను చెప్తుంటాను. మీరు శ్రమ పడకుండా అలవోకగా వింటూ సేదతీర్చుకోండి. సరేనా? ”


ఆ మాటతో కృష్ణమూర్త చప్పున సర్దుకున్నాడు; తను మరీ లిబర్టీ తీసుకోవడం బాగుండదేమోనని మనసున అనుకుంటూ—


“నాకు మాధవ పురం శివారున బంగ్లాటైపు ఇల్లుంది. ముగ్గరు సేవకులు ఉన్నారు. మరి నేనెందుకు ఇక్కడకి వచ్చి ఉంటున్నానంటే- ఎదుటి వారికిది పిచ్చి పిచ్చిగా కనిపించే అవకాశం ఉంది. నాకు నేను కావాలనే ఒంటరితనమూ నిశ్శబ్దమూ- అనే నేస్తాలను వెతుక్కుంటూ వచ్చాను. ఏదో ఒక రోజు ఒంటరితనం నన్ను వెతుక్కుంటూ వచ్చి నా రెక్కలు విరిచేయకముందే నేనుగా దానిని ఆశ్రయించడం మేలుకదా! ” 


ఆ మాటకతడు కనురెప్పలల్లార్చాడు. తలూపాలో లేదో తెలియక తేరిచూడసాగాడు. 

“నాకు పెళ్ళయి శోభనం అక్కడే జరిగింది. నాకొక కూతురు కూడా అక్క డే పుట్టింది”


ఈసారతడు పెదవి విప్పకుండా ఉండలేకపోయాడు- “మరి మీ అమ్మాయి కనిపించదేం? పెళ్ళయి మెట్టింటికి వెళ్లి పోయిందా!”


ఈసారి పెను కెరటం వంటి మౌనం పరచుకుంది. కళ్ల కొనల్లో తడి పేర్కుంది. “లేదు. పెళ్ళి కాకముందే బ్రెయిన్ క్యాన్సర్ వచ్చి చనిపోయింది. క్లీనిక్ పేరు కోకిల- ఆ పిల్లదే—“ 


కృష్ణమూర్తి మనసు అనంత వేగంతో బరువెక్కింది. ఎవరో వచ్చి గుండెను పిండినట్లనిపించింది. బిడ్డను కోల్పోవడమనే తీవ్ర మనోభావ స్రవంతిని బిడ్డను కన్నవాళ్ళకే తెలుస్తుంది ఆ కడుపు కోత! చిరు ప్రాయంలో కొడుకులకు చిన్నపాటి పడిసెం పట్తే చాలు శారద ఎంతలా అల్లల్లాడిపోయేది! తల్లీ బిడ్డల మధ్యన విలసిల్లే బంధాన్ని మాటలతో చెప్పతరమా! ”సారీ! మరి కోకిల తండ్రి కనిపించడేం? బిజినెస్ టూరులో ఉన్నాడా! ” 


`ఆమె ఈసారి గట్టిగా తలవిదిలించింది. అలా ఆమె తల విదిలిస్తున్నప్పుడు కళ్ళనుండి కన్నీటి చుక్కలు రాలి పడ్డాయి. 


“లేడు. మా నాన్న వత్తాసుతో కెనడా వెళ్లి అక్కడే స్థిరపడిపోయాడు; ప్రసిధ్ధ వైద్యుడిగా పేరు సంపాదించుకుని” 


 “నువ్వు కూడా అక్కడకి వెళ్ళి పోవచ్చుకదా! కూతురు పోయి నువ్వెందుకు ఒంటరిగా ఇక్కడ కష్టపడటం—“


 “నేనా.. వెళ్లనన్నాను! ఒకే ఒరలో రెండు కత్తులు ఒదుగుతాయా? అతగాడికి మెరుపుతో తేజరిల్లే తెల్ల స్త్రీ కావాలి. అంచేత అక్కడ నించే నాకు విడాకులిచ్చి అక్కడి తెల్లమ్మాయిని మరుమనువాడాడు. నేనంటే ఇష్టం లేని వాడితో అనునిత్యం దేబరిస్తూ ఆత్మ న్యూనతను పెంచుకుంటూ వెంట పడమంటారా! నా చూపులో ఇది కూడా అంత పెద్ద ఇస్యూ కాదు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న కన్నకూతూర్ని చూసేందుకు కూడా అతగాడికి తీరిక చిక్కలేదు. అటువంటి వాడితో మనసున్న ఏస్త్రీఐనా మనసా వాచా కర్మణ: కాపురం చేయగలదా! ”

ఆమాటకతడు కన్నార్ప కుండా చూస్తుండిపోయాడు. సన్యాసులకు ముని పుంగలకు తప్ప మామూలు మనిషన్న ప్రతి వాడికి స్వార్ధం ఉంటుంది. కాని ఇంతలాగా! ఈసారి కంటతడి సూర్యప్రభ పెట్టలేదు ఆరడుగుల ఆజాను బావుడైన కృష్ణ మూర్తి పెట్టాడు. ఆమె లేచి వచ్చి అతడి కళ్లు తన చీరచెంగుతో తుడిచింది. 


తుడుస్తూ ఆమె కొనసా గించింది. ”అందుకే అక్కడ నేను అనునిత్యమూ పెల్లుబుకే ఆక్రోశాన్ని ఆవేశాన్ని కోపాగ్నినీ తట్టుకోలేక దాదాపు పిచ్చిదానిలా మారక ముందే నేను గతకాల వలయం నుండి తప్పుకుని ఇక్కడకు వచ్చేసాను. నేను సున్నితత్వం గల ఆడదానిని. అనునిత్యమూ అగ్నికీలల వంటి తలంపుల్ని సూదుల్లాంటి ఆలోచనల్ని ఎన్నాళ్ళుఅనుభవిస్తూ ఉండగలను? అసలు ఈ నీరవ నిశ్శబ్దంలో నేను నా దు:ఖపు తెరల్ని ఎవరి ముందు విప్పుకోను? ఇంకానయం— నాకప్పుడు సుళువుగా ఆత్మహత్య చేసుకునే పథకం నాకు తెలియలేదు. లేకపోతే— ఈపాటికి ధరమ్ కరమ్ రోడ్డులో చేసి చూపించిన ఆ సోఫ్ట్ వేర్ ఇంజనీరులా నైట్రోజన్ గ్యాసుని కవరులో నింపుకుని దానిని నా ముఖం నిండా కప్పుకుని ఊపిరాడకు తన్నుకుంటూ ప్రాణం వదిలేసే దానిని.


అటూ ఇటుగా అవన్నీ మరచిపోవడానికే నేను క్లీనిక్ ని వ్యాపింప చేసి మరికొందరి జూనియర్ డాక్టర్లకు అవకాశం ఇచ్చిబ్రతుకు బండి ని ఈడ్చుకోస్తున్నాను. ఇక మేటర్ కి వస్తున్నాను. చెప్పేదా? లేక మీకు నీరసం తగ్గుముఖం పెట్టిన తరవాత చెప్పేదా? ”


అప్పుడతడు ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ ముందుకు సాగమన్నాడు. “మొదట్లో మీతో చాలా ముభావంగా ఉండేదానిని. నేను కావాలనే మీకు కోపం వచ్చేటట్టు అలక్ష్యంగా ప్రవర్తించే దానిని. సహాయం తీసుకుని థేంక్స్ కూడా చెప్ప కుండా విసురుగా పెడసరంగా చూస్తూ వెళ్లిపోయేదానిని. అదంతా గుర్తుంది కదూ! ” 


ఆమాట విన్నంతనే అతడు దిగ్గున కదలి ఆమెకు సమీపంగా వచ్చి కూర్చున్నాడు. “గుర్తుంది. ఐతే దీనికి బదులియ్యి- అదంతా కావాలనే చేసావన్నమాట. బట్ వై ? ” 


“చెప్తాను. కాని మొదట నన్ను క్షమించానని చెప్పండి”


దానికతడు పక్కున నవ్వేసాడు “విషయం తెలియకుండానే క్షమాపణ  కోరే ప్రస్తావన ఇప్పుడెందుకూ! ఐనా పరవాలేదు. ముందుస్తు బైల్ లా క్షమించేస్తున్నాను. చెప్పు” 


“యాక్చువలీ నేను మిమ్మల్ని హేట్ చేస్తుండేదానని- ఇతడెందుకు దాపురించాడురా బాబూ- అనుకుంటూ- దానికసలు కారణం ఉంది. ఆ కెనడా టిప్పుసుల్తానులా మీరు కూడా మంచి పొడవు. అంతేకాదు. అతడి రూపు రేఖల్లోని ఛాయలు మీలో కూడా కొన్ని ఉన్నాయి. అందుకే నాకు తెలియకుండా నేను మిమ్మల్ని హేట్ చేయనారంభించాను. కోపం లేదు కదా! ” 


అతడు మరొకసారి నవ్వేసాడు;లేదన్నట్టు తల అడ్డంగా ఆడిస్తూ— ఈ సారి ఆమె అతడి చేతుల్ని నిమురుతూ అంది- “మరైతే మనం ఇకనుండి స్నేహంగా ఉందాం. చిరకాలం స్నేహంగా ఉంటూ ఒకరికి మరొకరు తోడుగా మిగిలిన శేష జీవితాన్ని కలసి గడుపుదాం. ఐ ప్రామిస్- నేను మీకు మంచి సహచరిగా ఉంటాను. నేను పైకి యేబైలో ఉన్నట్టు కనిపిస్తాను గాని- నాకు వయసు యేభై ఐదు. మైనస్ ఇన్ టూ మైనస్ ఈక్వల్ టు ప్లస్. కాదా మరి! ” 


కృష్ణమూర్తి బదులివ్వలేదు. లేచి నిల్చుని కప్పుకున్న దుప్పటిని తీసిపారేసాడు. ఆమెను అమాంతం రెండు చేతులతో నూ ఎత్తుకుని గిర్రు గిర్రున తిప్పసాగాడు; ఇప్పుడతను అల్పసంతోషి కాడన్న వైనం మళ్ళీ మళ్లీ గుర్తుకుతెచ్చు కుంటూ,శోభనం రాత్రి శారదను అలాగే మోహావేశంలో తిప్పిన సంబరాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ-- 


ఇకపైన ఒంటరితనం వాళ్ళ దరిదాపులకు కూడా రాకుండా అదాటున దాటి వెళ్లిపోతుందేమో! 

***

పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పాండ్రంకి సుబ్రమణి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.








65 views0 comments

Comments


bottom of page