top of page
Writer's pictureSurekha Puli

మనవ(వా)డు



'Manava(vaa)du' - New Telugu Story Written By Surekha Puli

Published In manatelugukathalu.com On 28/02/2024

'మనవ(వా)డు' తెలుగు కథ

రచన: సురేఖ పులి

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



‘సఖీ’ అని ముద్దుగా శకుంతల ముద్దుల మనవడు పిలుస్తాడు.  ఆ పిలుపు ఇద్దరికీ సఖ్యతగా వుంది. 


రూపేష్, రక్షిత ప్రేమించి, పెద్దలను ఎదిరించి గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి చేసుకున్నారు.  సంవత్సరంలోపే బాబు పుట్టాడు. అంతే,  పసివాడ్ని చూడగానే స్వర్గాన్ని భూమ్మీద చూశారు. పెళ్లికి అభ్యంతరాలు చెప్పిన పెద్దలందరి సంతోషాలకు హద్దుల్లేవు. బుజ్జి బాబును ఏ దేవుడితో పోల్చాలి? ఏ వీరుడితో సమానం? హు.. ఎవ్వరూ సరిపోరు!  


రుద్ర పేరుతో నామకరణ జరిగింది. మెటర్నిటీ సెలవు అయిపోయిందని,  యదావిధిగా ఆఫీసు పనిలో నిమగ్నమైన జంటకు తంటాలు మొదలైనాయి.


తన్నుకోవడం ఒక్కటే  తక్కువైంది. శకుంతల కొడుక్కి-కోడల్కి ఎంతో నచ్చ చెప్పింది. మొండి పట్టుదల! ఈగో!!  ఏ గోనో.. విదేశాల ఆకర్షణో.. విడాకులతో చెరో చోటుకు ‘గో’ అయ్యారు.  


రుద్రుడ్ని హృదయానికి హత్తుకుంది శకుంతల.  


***


కెమిస్ట్రీ గోల్డ్ మెడల్ సంపాదించి, ప్రైవేట్ కాలేజీ లెక్చరర్ గా వున్న శకుంతలకు అన్ని హంగులతో పెళ్లి చేశారు పెద్దలు.  రూపేష్ కడుపులో ప్రాణం పోసుకుంటున్న సమయంలో తండ్రి ఆయువు పూర్తి అయింది.    


పరమశివుడే కాదు, ఎందరో శకుంతల వంటి అభాగినుల కంఠంలో విషాన్ని ఇముడ్చుకొని జీవితాలు సాగిస్తున్నారు.  


ఒంటరి అయినా రుద్రుడి పెంకం ఒక మహత్తర మలుపు, అదొక అదృష్టంగా ఆమోదించుకున్న స్త్రీకి మానసిక, శారీరిక, ఆర్థిక ఇబ్బందులు గోరంతలు. 


ఉద్యోగంలో స్థిరపడిన ఆనందంలో “సఖీ, ఇప్పుడంతా కాష్ లెస్ షాపింగ్, అందుకే నీకో గిఫ్ట్” అని ఖరీదైన ఆండ్రాయిడ్  ఫోన్ ఇచ్చాడు.”  వద్దు-కద్దు అనక, వాడుక అలవాటు చేసుకున్నది.    


“ఇప్పుడు సర్దు బాటుగా వుంది కదా, పనిమనిషిని పెట్టుకుందామా సఖీ?” 


“ఓటరైడి, ఆధార్ కార్డు లెక్కల్లోనే సీనియర్ సిటిజన్ను, నేనింకా పడుచు సఖీనే రా!” అని కొట్టి పారేసింది.  


“నీ శక్తికి కారణం ఏంటి, చవన్ ప్రాస్, బూస్ట్  ఆర్ ఎనీ అదర్ సీక్రెట్?” రుద్ర నవ్వుతూ అన్నాడు. 


“నిన్ను క్రమశిక్షణతో పెంచే క్రమంలో నన్ను నేను మరచి పోవడం.” వాస్తవాన్ని చెప్పింది. 


“అడగకూడని మాట అడుగుతున్నా.. జవాబు దాటేయోద్దూ..”


“నువ్వు అడగబోయే విషయం నాకు తెల్సు.. అయినా అడుగు..” మనవడి తలకు గోరు వెచ్చని నూనెతో మసాజ్ చేస్తూ అంది.


“ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కున్నా,  అన్ని విషయాల్లో నీకు నా పెంపకంలో విసుగు లేదు. మరి నీ కొడుకు, కోడలు నా పట్ల ఎందుకింత బాధ్యతారహితంగా వున్నారు.”


“రుద్రా.. ఇప్పటికే ఈ ప్రశ్న వంద సార్లు అడిగావు, ఇదే చివరి సారి చెపుతున్నా  నా కొడుకు, కోడలు అంటున్నావే కానీ, నా తల్లిదండ్రులు అనలేక పోతున్నావు, ఎందుకంటే వాళ్ళు భార్యాభర్తల గానే కాదు  అసమర్థ తల్లిదండ్రులు కూడా! బాధ్యతలను ఎదుర్కోలేని పిరికివాళ్ళు. ఇప్పుడు మనం బాగానే వున్నాం కదా, వాళ్ళ టాపిక్ ఎందుకు?”


మారు మాట్లాడలేదు, నాయనమ్మకు చిరాకు తెప్పించే మాటలు ఇక మానేశాడు. 


***


ఆన్లైన్ లో పెళ్లి సంబంధాలు చూసే నెపంతో శకుంతల “నీ ల్యాప్ టాప్ లో నేను కూడా కొంచెం ఏదైనా రాసుకునేట్టు, ఈజీ గా జమా, ఖర్చులు వేసుకునేట్లు  నేర్పించరా.”  


“సఖీ.. నీ ఫోన్ లో అన్నీ సదుపాయాలు వున్నై, ఓపిగ్గా చూడు.”


“రోజంతా ఖాళీగా వుండే నీ ల్యాప్ టాప్ ను నేను వాడొద్దా? నాకు నువ్వే నేర్పించాలి.. అంతే.” పట్టుదలకు మారుపేరు నాయనమ్మ అనుకొని ‘వర్డ్, ఎక్సెల్’ నేర్పించాడు. 


శకుంతలకు సోషల్ మీడియా ఎంతో లాభదాయకంగా వుంది. జీమెల్, ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్ లో చురుకుగా వుంటూ ఆన్లైన్ మ్యారేజ్ బ్యూరో తో సంప్రదించి  రుద్ర ప్రొఫైల్ పెట్టింది.  వారంలో ఎక్సెల్ షీట్లో తనకు అన్ని విధాల నచ్చిన అమ్మాయిల డాటా తయారు చేసింది. 

“నువ్వు ఏదో గొప్ప పని చేస్తావని అనుకున్నా సఖీ, మొత్తానికి అమ్మాయిల డేటానా!? అంటూ కొంత సంతోషం, మరికొంత ఆశ్చర్యం వ్యక్తపరిచాడు మనవడు. 

“ఇది గొప్పను మించిన పని, లేకుంటే నీకు పెళ్లీడు వచ్చిన సంగతి నీకు తెలియక పోయినా నాకు తెల్సు, ఎందుకంటే నాకు ముచ్చటైన మనవరాలు కావాలి.”

“అయితే ఒప్పుకుంటున్నవా, నువ్వు సీనియర్ సిటిజన్ అని.” బుజాలు కుదుపుతూ అడిగాడు. 

“ఆఫ్ కోర్స్! నువ్వు కూడా నా మనోబలాన్ని కాదనలేవు.”

దగ్గరుండి అమ్మాయిల డేటాను రుద్ర చేత షార్ట్ లిస్ట్  చేయించింది. అంత పెద్ద జాబితాలో ‘ఓకే’ అనుకున్న ఐదుగురికి ఇంట్రెస్ట్ పంపించింది. తిరుగుటపాలో జవాబులతో పాటు వీడియో కాల్ చేశారు.  అందరూ బాగానే ఉన్నట్టు తోచింది. కొడుకు విడాకుల సంగతి  విషయం చెప్పక, ఫారిన్ లో సెటిల్ అయ్యారని అబద్ధం చెప్పింది.  

“చాలా సంతోషం, మరి పెళ్లి కుదిరితే మా అమ్మాయి మీ మనవడు కూడా ఫారిన్ లో సెటిల్ అయ్యేట్టు ప్లాన్ ఉంటే; అర్జెంట్ గా పెళ్లి జరిపిద్దాం, కట్నం కూడా మీ రేంజ్ లో ఇచ్చేందుకు మేము రెఢీ!” అన్న ముగ్గుర్ని డిలీట్ చేయగా ఇద్దరు మిగిలారు. 

మన దేశంలో ఏం తక్కువైంది? మనుషులకు ఫారిన్ పిచ్చి పోదా?? 

ఉన్నది సరిపోదు! లేనిది కావాలి!! 

***

“నేను మా మనవడు వచ్చి అమ్మాయిని చూస్తాము, మీ అనుకూలమైన డేట్, టైమ్ చెప్పండి?” అని ఫోన్ చేసినా, జవాబు రాలేదు. “ఎదురు చూస్తున్నాం.” అని వాట్సప్ రిమైండర్ పెట్టింది.  మిగిలిని ఇద్దరిలో రుద్రకు అంత్యంత నచ్చిన అమ్మాయి ‘చెంగల్వ’  తల్లి జవాబు మెయిల్ చేసింది. 

శకుంతల గార్కి నమస్కారం, మీరు అబ్బాయిని అన్నీ అయి; అంటే ఏకచత్రాధిపత్యం వహిస్తూ పెంచారు, బాగానే వుంది. కానీ శుభమా అని మీరు మా అమ్మాయిని చూడడానికి వస్తే ముత్తైదువలతో రాగలరు. మీరు పెద్దవారు అర్థం చేసుకొని ఉంటారు. ఇది మన పద్దతుల భాగమని తెలియ చేస్తున్నాం. అంతే, పొరపాటుగా అనుకోకండి. 

చదివిన శకుంతల నిట్టూర్చింది. కానీ రుద్ర రౌద్ర రూపం దాల్చి, “ముత్తైదువ కావాలా? మా సఖి అందమైన మనసు మూర్ఖులకు తెలియదు.” అంటూ తాండవం చేశాడు.   

మిగిలిన అమ్మాయి ‘సన్నిహిత’ పెద్దలకు రాబోయే ఆదివారం మేము వస్తున్నాం అంటూ రుద్ర దుర్ముహూర్తం, యమగండం మొదలగు వాటిని ఖాతరుచేయక  చెప్పేశాడు. 

మనుషులు ఎంత పురోగమనం వైపు నడిచినా, నమ్మకాలకు దూరంగా; మూఢనమ్మకాలకు దగ్గరగానే ఉంటారు, కానీ మారాలి అని ప్రయత్నించరు.   

శకుంతల కొడుకును గూగుల్, ఫేస్ బుక్ లో వెతికి చాటింగ్ చేసి ఫోన్, ఈమెయిల్ ఐడి వివరాలు తెలుసుకొని తానిచ్చిన టెస్టింగ్ మెయిల్ సమాధానం భద్రపరచుకుంది. చిక్కుముడి చివర్లు పట్టుకుంది.

***

సిటీ ఎంత మార్పు చెందినా, ఇరుకు సందులు విశాలం కాలేక ఇబ్బందులు పడుతూనే ఉన్నారు ప్రజలు. అక్కడ నివాసమున్న వారు అలవాటు పడ్డారేమో కానీ కొత్తగా ప్రవేశించిన వారికి తిప్పలు తప్పవు. అవస్థ పడుతూ, ఇరుకైన మెట్లు ఎక్కి సన్నిహిత ఇల్లు చేరుకున్నారు.  వీధులే కావు, ఇల్లు కూడా చాలా ఇరుగ్గా వుంది. 

‘పుత్తడి బొమ్మ పూర్ణమ్మ’ అని వెనకటికి వర్ణించిన అమ్మాయి ఇప్పుడు వచ్చి కూర్చుంది. సన్నిహితను చూసి పరస్పరం ‘బావుందని’ కళ్ళ భావనలతో ప్రకటించుకున్నారు.  అదే పనిగా గమనిస్తున్న సన్నిహిత తమ్ముడు వీరి కళ్ళ భాషను పసిగట్టి, ఫలహారాలు, జూస్ తెచ్చాడు. 

అమ్మాయి ముఖంలో అనిర్వచనీయమైన నాజూకుతనం, చూస్తున్న కొద్దీ ఇంకా చూడాలనిపించే కళ గల అందం!  

“ఏమైనా మాట్లాడమ్మా.” అంది శకుంతల. సన్నిహిత రెండోసారి రుద్ర వంక చూసింది.  రుద్ర చూపు మరల్చు కున్నాడు.  

“నాకు వంట రాదు.” సన్నిహిత ఏం చెప్పాలో తెలియక ఏదో చెప్పింది, కాదు, అబద్ధం చెప్పింది. 

తెల్లటి శరీరఛాయతో, ఖరీదైన బట్టల్లో ఆరోగ్యంగా కన్పిస్తున్న రుద్రను సంబోధిస్తూ “బాబు, నువ్వు కూడా ఏదైనా మాట్లాడు.” అమ్మాయి తల్లి భగవతి అంది.

“నాకు మీ అమ్మాయి నచ్చింది, నేను నచ్చానో లేదో తెలుస్కోవచ్చా?”

జవాబు రాలేదు. “నోరు తీపి చేసుకోండి.” అంటూ భగవతి స్వీట్ అందించింది. 

సన్నిహిత  గబుక్కున “ప్లీజ్.. తినకండి, అమ్మ అలాగే అంటుంది. అతికితే గతక దంటారు, అందుకని మీరు ఏమీ తినొద్దు.”  చెప్పకనే తన సమ్మతిని తెలియజేసింది.

“మూఢాచారాలకు నేను దూరం.” అని రుద్ర స్వీట్, ఖారా తిన్నాడు.  శకుంతల జూస్ తీసుకుంది.

వెనువెంటనే సన్నిహిత తండ్రి సాంబశివ కూడా ఆనందంగా స్వీట్  తీసుకున్నారు.  వచ్చిన పెళ్లి సంబంధాలన్నీ ‘ఇంటికెళ్లాక ఫోన్ చేస్తామని,  జాతకాలు కుదరలేదని, కట్నం సరిపోదని’ ఏదో వంకతో జారుకున్నాయి. 

“మీ ఇంటికి మేము ఎప్పుడు రావాలో చెబితే..” భగవతి ఆతృత వెళ్లబుచ్చింది.  

“మీరు ఎప్పుడైనా రావచ్చు.”  అని గూగుల్ లొకేషన్ షేర్ చేసింది శకుంతల. 

***

రూపేష్.. నువ్వూ, రక్షిత రావాలి, మీ చేతుల మీదుగా రుద్ర పెళ్లి జరగాలి. ప్లీజ్.. అని మెయిల్ పెట్టింది.

ఎన్నో విషయాల కోసం ఓర్పుగా ఎదురు చూసిన శకుంతలకు ఈ సారి తోచడం లేదు. ప్రతీ ఐదు నిమిషాలకు జవాబు వస్తూదేమో అని మెయిల్ చూసి నిరాశ పడ్డది. 

ఆశ-నిరాశ పోటీ పడుతున్నా సహనం కోల్పోలేదు. వారం తర్వాత జవాబు వచ్చింది. 

అమ్మా, థాంక్స్! చాలా సంతోషంగా వుంది. ఇప్పుడు కూడా నీ మాట వినక పోతే.. వి అర్ నో వేర్! పెళ్లికి మాత్రమే కాదు. పర్మనెంట్ గా వస్తాము. మేమిద్దరం విడాకులు విత్ డ్రా చేసుకోవాలనుకున్నాం. ప్రత్యక్షంగా అన్ని వివరంగా చెప్తాను.  అక్కడ విల్లా కొన్నాను, వచ్చే ఏడాది లోపు మనం గృహప్రవేశం చేసుకోవచ్చు.  పెళ్లి ఖర్చులకు వెనకాడకుండా ప్లాన్ చేయండి. రుద్రను దగ్గరగా తీసుకోవాలని మా ఇద్దరికీ కోరికగా వుంది. 

‘ఐమ్ ప్రౌడ్ ఆఫ్ యు.. లవ్ యు మా’.. 

పరిపూర్ణమైన ఆనందం అంటే ఇదేనేమో!  

రుద్ర మెయిల్ చూశాడు. సఖి సంతోషం ముఖ్యం అనుకున్నాడు.

మన జీవితమే ఒక్కోసారి మోయలేనంత భారం అనిపిస్తుంది. కొత్తగా ఒక మనిషిని జీవిత భాగస్వామిగా తీసుకు రావడం అంటే మాటలు కాదు. ఈ సంసారం ఎలా ఈదటం అని వాపోయి దూరం పోయే కంటే చిన్న సరిపోయే హెచ్చరికలు లేక కొద్దిగా సర్దుబాటు చేసుకోవాలి.  

***

రుద్ర తాళి ముడి వేస్తుంటే, ఈ వివాహబంధం ప్రాణం వున్నంత వరకు ఆలుమగలు ఆరోగ్య ఆనందాలతో కలిసి వుండాలిని ముక్కోటి దేవతలను మొక్కుకుంది ప్రియమైన సఖి!

పెళ్లి సామాన్యంగా జరిగినా, రిసెప్షన్ మాత్రం గొప్పగా సాగింది.  

“మీ సైడ్ చుట్టాలు, బంధువులు చాలా తక్కువ అన్నారు, ఇదేంటి  ఇంతలా జనం వస్తున్నారు?” రిసెప్షన్ స్టేజి పైన కొలువు దీరిన పెళ్లి కూతురు పెళ్లి కొడుకుతో గుసగుసలాడింది.

“వీళ్లంతా అమ్మానాన్నల సంతోషానికి నిదర్శనం.” అర్థం కాలేదు నవ వధువుకు. 

అలసట మూలంగా నడుం నొప్పి, కీళ్ల నొప్పితో మొదటి వరుస సోఫాలో కూర్చుని వేదిక పైన జంటను తిలకిస్తున్నది  శకుంతల. 

రిసెప్షన్ స్టేజి ఎక్కి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్న  సహృదయులందరికీ  కొడుకు ఘనతను  గొప్పగా చెబుతూ పరిచయం చేస్తూ ఆశీర్వాదాలను  ఆస్వాదిస్తున్నారు రుద్ర తల్లిదండ్రులు. 

“ఇన్నాళ్ళూ రుద్ర మన వాడని తెలియదు, తెలిస్తే మీతో వియ్యం అందుకునే వాళ్ళం.”

“మనవాడు కాదండీ, అదిగో ఆవిడ-నా సఖి గారి ‘మనవడు’ అని మనసులో సవరణ చేసుకున్నాడు రుద్ర.

*******

సురేఖ పులి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సురేఖ పులి  గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:

Profile Link:

Youtube Play List Link:

 పేరు :సురేఖ

ఇంటి పేరు: పులి

వయసు: 68 సంవత్సరాలు

భర్త పేరు: స్వర్గీయ పి. అరుణ్ కుమార్

ఎంఏ (సోషియాలజీ&ఇంగ్లీష్) చేశాను. ఇద్దరు అమ్మాయిల వివాహమైంది.

పుట్టి, పెరిగింది హైదరాబాద్ లో.

ప్రస్తుత నివాసం బెంగళూర్ లో.

మా నాన్న స్వర్గీయ అర్జున్ రావు గారు నా మార్గదర్శకులు.

స్కూల్, కాలేజీ మ్యాగజైన్ కు రాయడంతో నా రచనా వ్యాసంగం ప్రారంభమైంది.

HMT Hyd లో నా ఉద్యోగం, 2008 లో స్వచ్ఛంద పదవీ విరమణ తర్వాత

ఒక డైలీ న్యూస్ పేపర్ కోసం పనిచేసాను.

చందమామ, యువ, స్వాతి, ఈనాడు, నెచ్చెలి, మన తెలుగుకథలుడాట్కాంల లో నా కథలు, కథానికలు ప్రచురితమయ్యాయి.

ప్రస్తుతం విశ్రాంత సీనియర్ సిటిజన్ను. కధలు రాయటము, చదవడం నా హాబి. చిత్ర లేఖనం, పెన్సిల్ డ్రాయింగ్ ఇష్టపడతాను.

మీ ప్రోత్సాహమే నా బలం 🤝

మరిన్ని రచనలతో పాఠకులకు దగ్గర కావాలన్నదే నా ఆశయం.

సురేఖ పులి



74 views4 comments

4 Kommentare


rakhee venugopal

1 day ago

Very beautiful short and sweet simple Rudra 's story 👌

Gefällt mir

Divik G

2 hours ago

Congratulations.


Gefällt mir

Surekha Puli

10 hours ago

ధన్యవాదాలు 🙏

Gefällt mir

Anil Gurram

1 hour ago

👌🥳👌👍

Gefällt mir
bottom of page