top of page

మానవత్వం



'Manavathvam' New Telugu Story


Written By: Ch. C. S. Sarma





(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


ప్రతి యుగంలోనూ దేవదానవులు వున్నారు. ఈ కలియుగంలోనూ మానవాకృతిలో... దేవతలు దానవులు వున్నారు. ఈ రెండు వర్గాలకు సదా విరోధం... గెలుపు దేవతలదే... అదే మానవత్వం...


భువనగిరి రామారాయుడు ఆ ప్రాంతంలో ఆ గ్రామానికి చుట్టూ వున్న పది పన్నెండు గ్రామాల్లో మంచి పేరున్న మనిషి. వారి తాతతండ్రులూ అదే పేరుతో బ్రతికినవారు.. సత్యం, ధర్మం, నీతి, న్యాయం, నిజాయితీలకు ప్రతిరూపం రామారాయుడు. వీరి తండ్రి గారు గోవింద రాయుడు, వారి తండ్రిగారి చివరి రోజుల్లో వారి యిష్టానుసారంగా నూరు ఎకరాల పంట భూమిని ఆ గ్రామ పేద ప్రజలకు పంచారు. ఆ వూరిలో వీరి సొమ్ము తినని వారులేరు. తాతతండ్రులు కీర్తిశేషులు.

రాయుడి అర్థాంగి జానకమ్మ. రాయుడిగారికి అన్ని విధాల తగిన యిల్లాలు. వీరికి ఒక కూతురు. పేరు పల్లవి. అమెను డాక్టర్ చేయాలని, ఆ ప్రాంతంలో ఒక హాస్పిటల్ నిర్మించి తన కూతురి చేత ఆ ప్రాంత ప్రజలకు సేవ చేయించాలనే తన చిరకాల వాంఛ కారణంగా... యం.బి.బి.ఎస్ పాసైన తర్వాత... అమెరికాలో వున్న తన పినతండ్రి కొడుకు... తమ్ముడూ అయిన డాక్టర్.. డీన్ అయిన మోహనరాయుడు వద్దకు పల్లవిని పంపాడు. యిరువురు అనాథ బాల బాలికలను దత్తు తీసుకొని వారిని తమ కన్న బిడ్డల్లా చూచుకొంటూం చదివిస్తున్నారు ఆ దంపతులు.

వీరి పాలేరు కనకయ్య... గుమాస్తా ఆదిశేషయ్య. పువ్వుకు వున్న వాసస, కట్టిన నారకు సంక్రమించినట్లుగానే... వారిరువురికీ యజమాని గుణగణాలు అలవడ్డాయి. వారి ఆదేశాలను తు.చ తప్పకుండా నిర్వర్తిస్తూ, రాయుడికి తగిన బంట్లని... వారూ మంచి పేరు తెచ్చుకొన్నవారే.

పాలేరు కనకయ్య భార్య సుమతి. వీరికి ఒక మొగబిడ్డ. పేరు రఘు. హై స్కూలు

చదువు పూర్తి కాగానే రఘు యిష్ట ప్రకారం... అతన్ని బి.యి. సివిల్ యింజనీరింగ్‌లో చేర్పించాడు. రాయుడు.

గుమాస్తా ఆదిశేషయ్యకు ఒక కూతురు. పేరు సంధ్య. యీమె తల్లి పదేళ్ళ క్రిందిట. మరణించింది. నాయనమ్మ శాంతమ్మ, ఆమెను పెంచి పెద్ద చేసింది. సంధ్య బి.యిడి చదువుతూ వుంది. కనకయ్య... ఆదిశేషయ్యలు మంచి స్నేహితులు. వీరి సఖ్యతను చూచిన రాయుడు ఆదిశేషయ్య కుమార్తెను, కనకయ్య కుమారుడికిచ్చి వివాహం చేసి వారి స్నేహాన్ని బంధుత్వంగా మార్చాలని నిర్ణయించుకున్నారు. ఆ విషయాన్ని వేరు వేరుగా ఆ యిరువురితో ప్రస్తావించారు. రాయుడి గారి అభిప్రాయానికి వారు సంతోషించారు. సమ్మతించారు. అప్పటికి రఘు యింజనీరింగ్ చదువు పూర్తయింది. *** "నాన్నా!.. అమ్మా!... నేను ఫస్ట్ క్లాస్ లో పాసయ్యాను. నాకు గోల్డ్ మెడల్ వచ్చింది" యింట్లోకి ప్రవేశిస్తూ... ఎంతో ఆనందంగా పలికాడు రఘు.

కనక రాజు యింట్లో లేడు. కొడుకు గొంతు విని సుమతి వేగంగా అతన్ని సమీపించింది..

మెడల్‌ను, సర్టిఫికెట్‌ను రఘు తల్లికి చూపించాడు. వాటిని చూచి ఆ తల్లి మురిసిపోయింది. కొడుకును ఆనందంతో కౌగిలించుకొంది. ఆమె నయనాలు ఆనంద బాష్పాలతో నిండిపొయాయి.

"నాయనా!... యిదంతా మన అయ్యగారి చలవ. వెళ్ళి వీటిని వారికి చూపించు. వారు ఎంతగానో సంతోషిస్తారు. నిన్ను మనసారా దీవిస్తారు. మీ నాన్న అక్కడే వుంటారు. వెళ్ళిరా" పరవశంతో చెప్పింది సుమతి.

రఘు ఆనందంగా తల ఆడించి ఇంట్లో నుండి బయటకి నడిచాడు. సుమతి వీధివరకూ వచ్చి ఆగిపోయింది. *** రఘు... రాయుడి గారి భవంతి వైపుకు వీధికి ఎడమ వైపున వేగంగా నడుస్తున్నాడు.


వేగంగా ఎదురుగా వస్తున్న స్విఫ్ట్ కారు అతని ప్రక్కన ఆగింది. అందాల భామ టీషర్ట్ జీన్స్ ప్యాంట్ ధరించి తల విరియ వేసికొని కారు నుంచి దిగింది. రఘును సమీపించి అతని ముఖంలోకి తీక్షణంగా చూస్తూ...

"నీకు యిది న్యాయమా! నాతో ఒక్క మాటన్నా చెప్పకుండా మీ వూరికి వచ్చేశావ్?..." ఆమె వదనంలో ఎంతో ఆవేశం.

రఘు... తను వూహంచని సన్నివేశాన్ని... వ్యక్తిని చూడడంతో నిర్ఘాంత పోయాడు. ఆమె ముఖంలోకి ఆశ్చర్యంతో చూస్తూ నిలబడిపోయాడు.

"ముందు కారెక్కు!..." వెనక డోర్ తెరిచి, రఘును లోనికి త్రోసింది... ఆ యువతి డాలియా.

అయోమయ స్థితిలో వున్న రఘు కార్లో కూర్చున్నాడు. ఆమె అతని ప్రక్కన కూర్చొని తలుపు మూసింది. డ్రైవర్ కారుని రివర్సు చేసి వేగంగా నడపసాగాడు.

ఆకాశంలో పక్షులు ఆనందగా విహరిస్తున్నాయి. వాటి కంటే పై ఎత్తున రాబందు ఎర కోసం సంచరిస్తూ వుంది. పక్షులను చూచింది. వేగంగా క్రిందికి వచ్చింది. దాని కాళ్ళ సందున ఒక పక్షి చిక్కుకుంది. *** "అయ్యా... రాత్రి పదిగంటలయింది. మన రఘు ఎక్కడికి వెళ్ళినట్లయ్యా!..." ఆందోళనతో అడిగింది సుమతి అతని ముందు నిలబడి.

పందిరి కింద నులక మంచంలో కూర్చుని రఘును గురించే ఆలోచిస్తున్న కనకయ్య సుమతి ముఖంలోకి చూచాడు.

"ప్రక్క పూర్లో వున్న స్నేహితుణ్ణి కలవడానికి వెళ్ళి వుంటాడేమో... కాసేపట్లో వస్తాడు లేవే. అందోళన పడకు..." అనునయంగా చెప్పాడు కనకయ్య.

సుమతిని పూరడించే దానికి అలా చెప్పాడు కానీ అతని మనస్సులో ఏదో అనుమానం... భయం... పైకి వ్యక్తం కానీయ్యకుండా మభ్యపరిచాడు.

"నీవు వెళ్ళి పడుకో... వాడు రావడంతోటే లేపుతా" ప్రయత్నపూర్వకంగా నవ్వుతూ చెప్పాడు కనకయ్య.


విచార వదనంతో కన్నీటితో సుమతి యింట్లోకి పోయింది. ఆమె మనస్సు కీడును శంకిస్తూ వుంది.

మంచంపై వాలింది. కళ్ళు మూసుకొంది. కన్నీళ్ళు చెక్కిళ్ళపై జారాయి. 'ఎక్కడికి పోయాడు? అయ్యగారింటికి పోలేదట. ప్రక్క వూరు మూడు కిలోమీటర్లే. స్నేహితులతో యింత వరకు ఏంచేస్తున్నట్లు!...' ఎన్నో ప్రశ్నలు... వేటికి సమాధానం లేదు. ఎడతెగని ఆలోచనలతో... శరీరంలో శక్తి సన్నగిల్లింది. మంచంపై అటూయిటూ దొర్లి.. అరగంట తర్వాత మరలా వాకిట్లోకి వచ్చింది సుమతి. కనకయ్య... విచార వదనంతో వీధివైపు చూస్తూ వున్నాడు. సుమతి అతని ప్రక్కన మంచంపై కూర్చుంది.. యిరువురి మధ్యా మాటలు కరువయ్యాయి. కారణం... ఆ యిరువురిదీ ఒకే సమస్య... హృదయాంతరాళాలాలలో ఏదో అనుమానం... భయం. వారి కళ్ళు కన్నీటి కడవలయ్యాయి. *** "రేపు వుదయం పదిన్నర గంటలను చర్చిలో మీ యిద్దరికీ మ్యారేజ్ అన్నీ ఏర్పాట్లు జరిగాయి..." రఘు ముఖంలోకి సూటిగా చూస్తూ హెచ్చు స్థాయిలో పలికాడు విన్సెంట్, డాలియా తండ్రి. తల దించుకొని దోషిలా వున్న రఘు మెల్లగా తల పైకెత్తి దీనంగా అతని ముఖం లోకి చూచాడు.

"పారిపోవాలని ప్రయత్నం చేస్తే... నిన్ను..." సింహ గర్జనలా వుంది అతని స్వరం. "డాడీ!..." తండ్రి పూర్తి చేయక ముందే బిగ్గరగా" అరిచింది డాలియా. కూతురి ముఖంలోకి తీక్షణంగా చూచాడు విన్సెంట్.

"నాకు మర్యాద బాగా తెలుసు. మా వారికి అదే మీ అమ్మానాన్నలకు లెటర్ వ్రాసి మ్యారేజ్ ‌కి వచ్చి మీ యిద్దరినీ ఆశీర్వదించమని... మనిషిని పంపుతున్నా. ఆ వూరికి ఈ వూరికి మధ్య దూరం పాతిక కిలోమీటర్లేగా. మీ వాళ్ళు రావాలని నా కోరిక. మ్యారేజ్ అయిన తర్వాత... నీ భార్య డాలియాతో నీవు మీ వూరికి వెళ్ళవచ్చు." ఈసారి కొంత సౌమ్యంగా చెప్పాడు విన్సెంట్.

'సరే' అన్నట్లు మౌనంగా తల ఆడించాడు రఘు. ***

సమయం వుదయం ఐదుగంటల ప్రాంతం. వాకిట్లోకి వచ్చి ఆగిన కారును చూచి... సుమతి... రోధిస్తూ కారును సమీపించారు.


ఒక యువకుడు కారు దిగి కనకయ్యను సమీపించాడు. "కనకయ్యగారు మీరేనా?..." అడిగాడు. "ఆవును బాబూ.." గద్గద స్వరంతో చెప్పాడు కనకయ్య. జేబులో నుంచి ఒక కాగితాన్ని తీసి ఆ యువకుడు కనకయ్య చేతిలో పెట్టాడు. వెంటనే వెనుదిరిగి కారులో కూర్చొని మెరుపులా వెళ్ళిపోయాడు.

"సుమతీ!... ఆవేదన, ఆశ్చర్యంతో అన్నాడు కనకయ్య. ప్రక్కనే వున సుమతి అతని చేతిలోని కాగితాన్ని తీసికొని లోనికి పరుగెత్తింది. లైట్ వెలుతురులో విప్పిచూచింది. పవిట చెంగుతో కన్నీటిని తుడుచుకొని ఆ వుత్తరాన్ని చదవ సాగింది.

కనకయ్య తడబడుతున్న పాదాలతో.. మెల్లగా సుమతిని సమీపించాడు. దీనంగా కన్నీటితో ఆమె ముఖంలోకి చూచాడు. సుమతి వుత్తరాన్ని పూర్తిగా చదివింది. "అయ్యా.. ఈరోజు ఏడున్నర గంటలకు మనోడికి చర్చిలో... పె...ళ్ళం...ట..." కళ్ళు తిరిగి నేల కూలింది. కనకయ్య తను విన్నది నమ్మలేక పోయాడు. నేలకూలిన భార్య తలను తన చేతల్లోకి తీసుకొని... 'సుమతీ... సుమతీ' అంటూ భోరున ఏడ్చాడు.

కొద్ది నిముషాల తరవాత... యిరువురూ దుఃఖ సాగరపు ఒడ్డును చేరారు. తన్నుతాను తమాయించుకొని... భార్యను ఓదార్చి, విన్సెంట్ వ్రాసిన వుత్తరాన్ని తీసుకొని కనకయ్య... "అయ్యగారి దగ్గరకు వెళ్ళాస్తాన్నే!..." చెప్పి రాయుడి యింటికి చేరాడు. ఆ వుత్తరాన్ని ఏడుస్తూ అతనికి అందించాడు.

రాయుడు ఆ వుత్తరాన్ని చదివాడు. అతని తలపై సమ్మెటతో కొట్టినట్లనిపించింది. అంతవరకూ రఘును ఎంతగా అభిమానించాడో ఆస్థానంలో ద్వేషం చోటు చేసుకుంది. దీర్ఘంగా నిట్టూర్చాడు.

"కనకయ్యా!... కాలమహిమ. రఘు ఇంతటి పాడు పని చేస్తాడని నేను ఎన్నడూ వూహించలేదు. వీడి మూలంగా ఆ పిల్లకు మూడు మాసాల గర్భం. ఆ తండ్రి నిర్ణయంలో తప్పు లేదు. యీ పెళ్ళి చేయకపోతే ఆ పిల్ల గతేమిటి?... నీ కొడుక్కి విశ్వాసం లేదు.. మంచి... మానవత్వం లేదు కనకయ్య" రాయుడి కళ్ళు చెమ్మగిల్లాయి. చేతిలోని పేపరు జారిపోయింది.

ఆ వార్త విన్న మరుక్షణం లోనే... హృదయం పగిలిపోయిన కనకయ్య యజమాని కళ్ళలోకి చూశాడు. రాయుడి కళ్ళల్లో... కనకయ్య కన్నీటిని చూడడం ఇదే మొదటిసారి. అతని మనోవేదన అతనికే తెలుసు. రాయుడు పాదాల ముందు కూర్చున్నాడు.

"అయ్యా!... నేను మీ దగ్గిర యిన్నేళ్ళుగా ఎంతో విశ్వాసంతో బతికాను. యిక మీదట నేను బతికితే నాలోని మానవత్వం చచ్చిపోయి రాక్షసుడిగా మార్తాను. అది నాకు యిష్టంలేదు. ఎప్పుడైనా, ఏదైనా నావల్ల తప్పు జరిగుంటే నన్ను క్షమించండి సామీ!.. నన్ను క్ష...మిం...చం....డి" రాయుడి పాదాలపై ఒరిగి పోయాడు కనకయ్య. అతని శ్వాస ఆగిపోయింది.

కొద్ది క్షణాల తర్వాత కనకయ్యను తాకి రాయుడు విషయాన్ని గ్రహించాడు. "కనకయ్యా!..." ఏడుస్తూ బిగ్గరగా అరిచాడు. ఆ అరుపుతో భవనం దద్దరిల్లింది.

యీ వార్త విన్న సుమతి గుండె ఆగి చనిపోయింది. యిరువురూ... ఏకకాలంలో బూడిదగా మారిపోయారు. భార్యతో హనీమూన్ ‌కు వెళ్ళిన రఘు శవసంస్కారానికి కూడా రాలేక పోయాడు. తనకు అందిన టెలిగ్రాంను చదివి భర్తకు చెప్పకుండా చించేసింది డాలియా. *** రాయుడి కుమార్తె పల్లవి యం.యస్ పూర్తి చేసి అమెరికా నుంచి వచ్చింది. ఆమె వచ్చే వాటికి హాస్పిటల్ సిద్దంగా వుంచాడు రాయుడు. తవ తండ్రి యిష్టానుసారంగా స్టాక్టీసు ప్రారంభించింది పల్లవి. స్నేహితుని కొడుకు ప్రతాప్ తో ఆమె వివాహాన్ని ఘనంగా జరిపించాడు రాయుడు.

సంవత్సరం తర్వాత, డాలియా రఘుకు విడాకులిచ్చింది. మరో వ్యక్తిని వివాహం చేసుకొంది.. రఘుకు మతి చలించింది. మంచికి మానవత్వానికి మారుపేరైన రాయుడు అతన్ని బాగు పరచాలని పిచ్చాసుపత్రిలో చేర్పించాడు.

* * *

-సమాప్తం-

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం



మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.



మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


రచనా వ్యాసంగం: తొలి రచన ‘లోభికి మూట నష్టి’ విద్యార్థి దశలోనే రాశాను, అప్పట్లో మా పాఠశాల బ్రాడ్కాస్టింగ్ స్టేషన్ నుండి ఈ శ్రవ్య నాటిక అన్ని తరగతులకు ప్రసారం చేశారు.

అందులోని మూడు పాత్రలను నేనే గొంతు మార్చి పోషించాను.

మా నాయనమ్మ చెప్పిన భారత భాగవత రామాయణ కథలు నన్ను రచనలకు పురికొల్పాయి.

ఇప్పటి వరకు 20 నవలలు, 100 కథలు, 30 కవితలు రాశాను.



Commentaires


bottom of page