top of page

మానవత్వం వర్ధిల్లాలి!!..



'Manavathvam Vardhillali' - New Telugu Story Written By Ch. C. S. Sarma 

Published In manatelugukathalu.com On 21/09/2024

'మానవత్వం వర్ధిల్లాలి' తెలుగు కథ

రచన: సిహెచ్. సీఎస్. శర్మ


ఆమె పేరు అరుణ.. 

ఆ ఇంటి పనిమనిషి.. 


దీపక్ సివిల్ ఇంజనీర్. వారి తల్లి శాంతమ్మ, తండ్రి గంగాధరం. వారు గతించి పది సంవత్సరాలైంది. తండ్రి మరణం నాటికి దీపక్ వయస్సు పదహారు సంవత్సరాలు. ప్లస్ వన్ చదువుతున్నాడు. గంగాధరం గారు హైస్కూలు టీచర్. చాలా పద్ధతైన మంచి మనిషి. కలరా జబ్బు వారిని కాటేసింది. 


గంగాధరం గారు గతించిన తరువాత శాంతమ్మగారే దీపక్‍కు అన్ని విషయాల్లో తల్లీతండ్రిగా వ్యవహరించి, దీపక్‍ను గొప్పగా, మంచి క్రమశిక్షణతో పెంచింది. 


తల్లితండ్రుల తత్త్వాలను దీపక్ చిన్నతనం నుండీ గౌరవించి, అభిమానించి ఉత్తమ యువకుడిగా ఎదిగాడు. 


గంగాధరం గారు బ్రతికి వున్న రోజుల్లో.. 

’నాన్నా దీపక్! ఏ ఇంట స్త్రీ మూర్తిని గౌరవించి, అభిమానిస్తారో ఆ ఇల్లు సర్వసౌభాగ్యాలతో వర్ధిల్లుతుంది. కనుక ప్రతి స్త్రీని గౌరవించడం, అభిమానించడం, వారు ఏదైనా ఆపదలో వుంటే స్వపర బేధం లేకుండా సాయం చేయడం మంచితనం మానవత్వం అవుతుంది నాన్నా గుర్తుంచుకో’ అని చెప్పేవారు. 


పనిమనిషి అరుణ.. తండ్రి లింగయ్య త్రాగుబోతు, రిక్షా నడిపేవాడు.. ఉదయం ఎనిమిది గంటల నుండీ సాయంత్రం ఆరుగంటల వరకు. రోజూ రెండు మందు బుడ్లు తెచ్చుకొని ఆనందంగా తాగి అరుణ తల్లి చెంచమ్మ ప్రీతిగా వడ్డించిన దాన్ని ఆరగించి ముసుకుతన్నేవాడు. 


చెంచమ్మ ఎన్నోసార్లు ’ఈ తాగుడు మానయ్యా!.. అది నీ ఒంటికీ, మన ఇంటికి మంచిది కాదయ్యా!’ బ్రతిమాలుతూ చెప్పేది. 


చెంచమ్మ మంచిమాటలు చెవిటివాడి చెవిలో శంఖం వూదినట్లుగానే అయిపోయాయి. 

చెంచమ్మ చెప్పి చెప్పి విసిగిపోయి కొంతకాలంగా చెప్పడం, అతన్ని విమర్శించడం మానేసింది. 

రెండేళ్ళనాడు దసరా పండుగల సమయంలో స్నేహితులతో చేరి పోటీపడి తప్పతాగి రిక్షాలో వస్తున్న లింగయ్య వేగంగా వస్తున్న లారీకి గుద్దుకొని స్పాట్‍లోనే చుక్కలూరికి చేరాడు. అప్పటికి అరుణ వయస్సు పదహారు. పదవతరగతి చదువుతుంది. 


లింగయ్య మరణంతో చెంచమ్మ విచార సాగరంలో మునిగి పోయింది. అన్నపానీయాలు సరిగా తీసుకొనేది కాదు. ఎప్పుడూ ఆమె కళ్ళల్లో ఆగని కన్నీరు. 

తల్లి వేదనకు అరుణ ఎంతగానో బాధపడేది. వంటావార్పులు తానే చేసేది. బలవంతంగా తల్లికి తినిపించేది. 


మనస్సున తీరని వేదన నిండి వుంటే ఏం తిన్నా, ఏం తాగినా శరీరం ఆరోగ్యంగా వుండదు. 

ఇల్లు గడవడానికి అరుణ చదువుమాని రెండిళ్ళల్లో పనికి చేరింది. వారిచ్చే నెలజీతంతో తల్లికి మందులు, ఇంటి ఖర్చులను బాధ్యతాయుతంగా నడపడానికి అలవాటు పడింది. 

పనులన్నీ అయ్యాక తల్లి ప్రక్కన కూర్చుని ఆమెకు ఓదార్పుమాటలను చెప్పేది. 


చెంచమ్మకు ఒక అన్నయ్య. పేరు రంగయ్య, తాపీమేస్త్రి. వారి భార్య వనజ కూలిపని చేసేది. అతని కొడుకు మురారి. అతను అరుణ ఇంటికి చుట్టపు చూపుగా వచ్చాడు. తొలిచూపులోనే అరుణ అతనికి ఎంతగానో నచ్చింది. అతను టైలర్. ఆ వూరిలోనే ఒక పెద్ద టైలర్ షాపులో పనికి చేరాడు. ఆ ఇంట్లోనే వుండేవాడు. 


రోజు రోజుకి మురారికి అరుణ మీద ఆశ పెరిగింది. వరసకు బావ అయిన కారణంగా అరుణ అతన్ని అభిమానించింది. గౌరవించింది. 


వానా కాలం. ఆ రోజు జోరువాన. ఆగని వర్షం. షాపు నుండి తడిసి ఆరుగంటల కల్లా ఇంటికి వచ్చాడు మురారి. బట్టలు మార్చుకొని వానలో తడుస్తూ ఇంటి ముందు వూడుస్తున్న అరుణను చూచాడు. తడిసిన బట్టలతో అరుణ శరీరం అతనికి వింతగా గోచరించింది. 


"వానలో తడుస్తూ ఆ పని చేయడం ఇప్పుడు అవసరమా అరుణా! లోపలికి రా!" ప్రీతిగా పిలిచాడు. 

అరుణ ఇంట్లోకి వెళ్ళింది. బట్టలు మార్చుకొంటున్న సమయంలో వెనుక నుండి అరుణను తన చేతుల్లోకి తీసుకొన్నాడు. చలిగాలి. యుక్తవయస్సు. మగస్పర్శ. అరుణను అతను గట్టిగా కౌగలించుకొన్నాడు. 


అరుణ అతని చేతుల్లో వాలిపోయింది. అతని చర్యలకు ఎదురు చెప్పలేకపోయింది. ఆవేశంతో వున్న మురారి అరుణను పూర్తిగా అల్లుకునిపోయాడు. అరుణ పరవశంతో అతనికి సహకరించింది. జరుగకూడనిది జరిగిపోయింది. 


శరీర తాపాలు చల్లారాయి. ఊహాజగత్తు చెదిరిపోయింది. అరుణ వర్తమానంలోకి వచ్చింది. 

తప్పు జరిగిపోయిందని ఏడ్చింది. మురారి ఆమెను వూరడించాడు. "నీవు నా మరదలివి. నేను నీ బావను. మనం పెండ్లి చేసుకొందాం. నా మాటను నమ్ము. ఏడవకు" ప్రీతిగా ఆమె కన్నీటిని తుడిచాడు మురారి. 


అరుణ అతని మాటలను నమ్మింది. 

ఆ తర్వాత.. 

మరో రెండువారాలు వారు ప్రతిరాత్రి ఏకాంతంగా గడిపారు. అరుణకు ఎన్నో కబుర్లు చెప్పాడు మురారి. ఆశలు కల్పించాడు. 

అతను చెప్పిన మాటలనన్నింటిని అమాయకురాలైన అరుణ నమ్మింది. మురారే తన సర్వస్వంగా భావించింది. 

*

పనికి వెళ్ళిన మురారి ఆ రోజు రాత్రి తొమ్మిదిగంటలైనా ఇంటికి తిరిగి రాలేదు. 

వంట పనిని ముగించి ఆరున్నరనుండి అరుణ మురారి రాకకోసం వాకిట్లో కూర్చొని ఎదురుచూడసాగింది. ప్రతి నిముషమూ ఎంతో భారంగా గడుస్తున్నట్లు అనిపించింది అరుణకు. 

గంట పదయింది. మురారి ఇంటికి రాలేదు. 


అరుణ మనస్సున ఆవేదన, కళ్ళల్లో కన్నీరు!.. 

’బావకేమైంది! ఇంకా ఇంటికి ఎందుకు రాలేదు?’ మదిలో భయం, ఆందోళన, బాధ. 

యాంత్రికంగా తల్లికి తినిపించింది. ఎప్పుడూ ఎంతో సరదాగా మాట్లాడే అరుణ మౌనం, ఆ తల్లి శాంతమ్మకు సందేహం కలిగించింది. 


"ఏంటే వసపిట్టా!.. ఎప్పుడూ ఏదో గలగలా మాట్లాడేదానికి ఈ రోజు నీకేమైంది? నీవు పనిచేసే ఇళ్ళల్లోని యజమానులు నిన్ను ఏమైనా అన్నారా!.. మాటా పలుకూ లేదు. ఏంటే కారణం?" అడిగింది శాంతమ్మ అనుమానంతో. 


"బావ ఇంకా ఇంటికి రాలేదమ్మా!" దీనంగా చెప్పింది అరుణ. 


"భోగి పండుగ దగ్గర్లో వుందిగా!.. షాపుల్లో కుట్టవలసిన గుడ్డల పని ఎక్కువగా వుండి వుంటుంది. ఆ కారణంగా రాలేకపోయాడేమో!.. నీవు అన్నం తిని పడుకో. వచ్చాక తలుపు తడతాడుగా. వెళ్ళి తలుపు తెరుద్దువుగాని" అనుమానంగా చెప్పింది శాంతమ్మ. 


అరుణ అమాయకంగా తలాడించింది. ఆమెకు అన్నం తినాలనిపించలేదు. మనస్సులో ఏదో అనుమానం. దిండును సరిచేసికొని చాపపై వాలిపోయింది. కళ్ళకు కునుకు రాలేదు. మురారి రాకకోసం ఎదురుచూస్తూ, అతన్ని గురించే ఆలోచిస్తూ పడుకొంది. కరుణతో నిద్రాదేవి ఆమెను తన ఒడిలోకి చేర్చుకొంది. 

*

’కొక్కురూక్కో!’ వాకిట కోడికూసింది. 


అరుణ ఉలిక్కిపడి లేచింది. తెల్లారిపోయింది. అరుణని అరుణ కిరణాలు భూమిపై ప్రసరించాయి. 

వేగంగా వెళ్ళి తలుపు తెరిచింది అరుణ. మనస్సున మురారి కారణంగా మదన?.. 

తల్లికి కావలసినవి సమకూర్చి దీపక్ ఇంటికి పనికి వెళ్ళింది. యాంత్రికంగా ఒక పని తరువాత ఒక పని చేయసాగింది. 


"ఏమైందే అరుణా! చాలా మౌనంగా వున్నావు? మీ అమ్మకు, నీకు ఏమైనా తగాదానా!" అడిగింది శాంతమ్మ. 


"ఏం లేదమ్మగారు!" మెల్లగా చెప్పింది అరుణ. 


ఆ రోజు ఆదివారం.. దీపక్ ఇంట్లోనే వున్నాడు. 

తల్లి అడిన ప్రశ్నకు అరుణ ఇచ్చిన జవాబును దీపక్ విన్నాడు. 

అరుణ అంటే అతనికి ఎంతో అభిమానం. ఆమె ఎంతో సౌమ్యతగా మాట్లాడే మాటలు, ఆమె వినయం విధేయతలు అంటే అతనికి ఎంతో ఇష్టం. 


"ఏం అరుణా!.. నీవు నిజం చెప్పలేదు" నవ్వుతూ అన్నాడు దీపక్. 


అరుణ, దీపక్ ముఖంలోకి చూచింది. 

ఆమె కళ్ళల్లో ఏదో బాధను గమనించాడు దీపక్. 


"నీవు నిజం చెప్పలేదు అరుణా!.. నీవు దేనికో బాధపడుతున్నావు. నిజం చెప్పు. నీ సమస్య ఏదైనా సరే నేను సాయం చేస్తాను" అనునయంగా చెప్పాడు దీపక్. 


అతని సౌమ్యమైన సంభాషణకు ఆమె కళ్ళల్లో నీరు నిండాయి. 

"అరుణా! ఎందుకు ఏడుస్తున్నావు?"


"సార్!.. మా బావ రాత్రి ఇంటికి రాలేదండీ!" దీనంగా చెప్పింది అరుణ. 


"రాలేదా!"


"అవును సార్!.. "


దీపక్ వెంటనే బయటకి వెళ్ళి కార్లో కూర్చొని మురారి పనిచేసే టైలర్ షాపుకు వెళ్ళాడు. 

షాపు యజమాని ముస్తఫాను కలిశాడు. 

"ముస్తఫా!.. "


"సార్!.. "


"మురారీ.. " అతను పూర్తిచేయకముందే.. 

"పనిమానేసి నిన్న వూరికి వెళ్ళిపోయాడు సార్. "


"వూరికి వెళ్ళిపోయాడా!.. "


"అవును సార్!.. "


"ఎప్పుడు వస్తానని చెప్పాడు?"


"ఇక రానని చెప్పి వెళ్ళాడు సార్!"


"కారణం?.. "


"నాకు తెలియదు సార్, వాడు చెప్పలేదు!.. "


దీపక్‍లో ఆలోచన.. 

కారణం ఏమై వుంటుంది? ఈ నిజాన్ని అరుణకు చెప్పాలా వద్దా!.. అరుణ అని తలవగానే ఆమె రూపురేఖలు దీపక్ కళ్ళముందు నిలిచాయి. 


చామనఛాయ, విశాలమైన పెద్ద కళ్ళు. వయస్సుకు తగిన రీతిలో మగవారిని ఆకర్షించే అంగ సౌష్టవం, చక్కటి పొడుగాటి జుట్టు, నిటారైన నాసిక, నల్లని కనుబొమ్మలు. ఒక్కమాటలో చెప్పాలంటే అరుణ మంచి అందగత్తె. మురారి కూడా కొంచెం నలుపైనా కలరింగ్ జుట్టు. దాదాపు ఆరు అడుగుల ఎత్తు. ముఖంలో మంచి కళ. వయస్సులో వున్న ఆడపిల్లలను ఆకర్షించే రూపము. ఒకనాడు అరుణతో కలిసి వారి ఇంటికి వచ్చాడు. అతన్ని అప్పుడు చూచాడు దీపక్. 


’వాడు.. అరుణకు దగ్గరైనాడా!.. వరుసైన అరుణను ప్రేమించి ఆమెకు ఏవైనా ఆశలు కల్పించాడా!.. లేక ఆమెను వాడుకొని మోసం చేసి పారిపోయాడా!.. అరుణకు ఆమె తల్లికి చెప్పకుండా పారిపోవడానికి కారణం ఏమై ఉంటుంది?.. అరుణ అంతగా బాధపడేదానికి కారణం?.. విషయాన్ని అరుణకు చెప్పాలి. అప్పటికి ఆమె ముఖ భంగిమల వలన కొంతవరకు నిజాన్ని గ్రహించవచ్చును కాదా!.. ’ ఆలోచనలతో దీపక్ ఇంటికి చేరాడు. 


అరుణను పిలిచి టైలర్ తనకు చెప్పిన విషయాన్ని ఆమెకు తన తల్లి సమక్షంలో చెప్పాడు. 

అరుణ ఏడుస్తూనే నేల కొరిగింది. 

దీపక్ ప్రక్క ఇంట్లో అనుపమ అనే డాక్టర్ ఉంది. దీపక్ వేగంగా అనుపమ ఇంటికి వెళ్లాడు. ఆమెకు విషయాన్ని చెప్పి తన ఇంటికి తీసుకొచ్చాడు. 

స్పృహ లేకుండా వున్న అరుణను డాక్టర్ అనుపమ పరీక్షించింది ఇంజక్షన్ చేసింది. 


"దీపక్!.. "


"చెప్పండి మేడం!.. ""ఈ అమ్మాయి రాత్రి ఏమీ తినలేనట్లుంది. అందుకే స్పృహ కోల్పోయింది. ఆమె.. "


"చెప్పండి డాక్టర్!.. " ఆతృతగా అడిగాడు దీపక్. 


"గర్భవతి.. " మెల్లగా చెప్పింది అనుపమ. 


"గర్భవతా! ఆమెకు ఇంకా పెండ్లి కాలేదు డాక్టర్!.. " ఆవేశంగా చెప్పాడు దీపక్. 


"గర్భవతి కావడానికి వివాహాన్నే చేసుకోవాలని లేదుగా మిస్టర్ దీపక్!" చిరునవ్వుతో చెప్పింది అనుపమ. 


అప్పటికి విషయం అరుణ చెప్పకుండానే అర్థం అయ్యింది దీపక్ అతని తల్లి శాంతమ్మకు. 

మురారిగాడు.. తాను వూహించినట్లుగా అరుణను మోసంచేసి, తన ఆరాటాన్ని తీర్చుకొని, చెప్పకుండా వెళ్ళిపోయాడు అనుకొన్నాడు. 


"కొద్దిసేపట్లో స్పృహ వస్తుంది. భయపడకండి" అనుపమ వెళ్ళిపోయింది. 


కాలుగంట తరువాత అరుణ కళ్ళు తెరిచింది. విచారంగా నలువైపులా చూచింది. 

"అరుణా! ఎలా వుంది?" అడిగింది శాంతమ్మ. 


"నీరసంగా వుంది అమ్మగారూ!" మెల్లగా చెప్పింది అరుణ. 


"లేచి కూర్చో. ముందు టిఫిన్ తిను. "


ఇడ్లీలు, చట్నీ ఉన్న ప్లేటును అరుణను అందించింది శాంతమ్మ. 

"రాత్రి అన్నం తినలేదా!"


లేదన్నట్లు నీరసంగా తలాడించింది అరుణ. 

అరుణను కార్లో కూర్చోబెట్టి ఆమె ఇంటిదగ్గర దింపాడు దీపక్. వాళ్ళ అమ్మను అడిగి మురారి వూరు వివరాలను తెలుసుకొన్నాడు. 


"అరుణా!.. జాగ్రత్త విశ్రాంతి తీసుకో" ఐదువందల నోటును చెంచమ్మ చేతికిచ్చి.. "అవసరాలకు వాడుకోండి" చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు దీపక్. 


దీపక్ మురారి వున్న వూరికి కార్లో బయలుదేరాడు. వాళ్ళ తండ్రిని కలిశాడు. మురారిని గురించి విచారించాడు. 


"వాడు ఇంటికి రాలేదు బాబూ!" అది మురారి తండ్రి రంగయ్య జవాబు. 


దీపక్ అతని ఫోన్ నెంబర్ నోట్ చేసుకొన్నాడు. తన నెంబర్ అతనికి ఇచ్చాడు. 

"నేను రెండు రోజుల తర్వాత ఫోన్ చేస్తాను. మురారి వస్తే నాకు చెప్పండి" దీపక్ తన వూరికి బయలుదేరాడు. 


రెండు వూర్ల మధ్య దూరం ముఫ్ఫై కిలోమీటర్లు. రంగయ్యగారి గ్రామాన్నుంచి పన్నెండు కిలోమీటర్లు కార్లో వచ్చాడు దీపక్. 

రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగింది. జనం, పోలీసులు గుమికూడి వున్నారు. 

కారును రోడ్డు ప్రక్కన ఆపి దిగి జరిగిన యాక్సిడెంట్ ప్రాంతానికి వచ్చాడు. 


’రౌడీ వెధవులు, తప్పతాగి ఎదురుగా వచ్చే లారీని ఢీకొన్నారు. ఇద్దరూ చచ్చారు’ ఒక పెద్ద మనిషి విమర్శ. 


జనాన్ని తప్పుకొని మెల్లగా క్షతగాత్రులను చూచాడు దీపక్. ఆ రెండు శవాల్లో ఒకటి మురారీది. తన కళ్ళద్దాలను సరిచేసుకొని మరోసారి పరీక్షగా చూచాడు. చచ్చినవారిలో ఒకడు మురారీ అనే విషయం తేటతెల్లమైంది. 


’మురారిగాడు అరుణకు చేసిన ద్రోహానికి ఆ సర్వేశ్వరులు వాడికి కఠిన దండనను విధించారు కాబోలు!’ అనుకొన్నాడు దీపక్. 


దీపక్.. మురారి తండ్రికి ఫోన్ చేసి విషయాన్ని చెప్పి అతను కార్లో తన వూరికి బయలుదేరాడు. 

ఇంటికి చేరగానే మొత్తం కథను తల్లికి వివరించాడు దీపక్. 

"అయ్యో! పాపం!.. మురారి చచ్చిపోయాడా!" విచారపడింది శాంతమ్మ. 


"అమ్మా!.. ఆ విషయాన్ని మనం అరుణకు చెప్పవద్దు. ఒకటి రెండు రోజుల్లో విషయం ఆ తల్లీకూతుళ్ళకు తెలుస్తుంది. నీవు ఏమీ అనుకోనంటే అరుణ విషయంలో నా మనస్సులోని మాటను చెబుతాను. అది ఆమె శ్రేయస్సు కోసం!.. "


"ఏమిటో చెప్పు నాన్నా!.. "


"అమ్మా!.. మురారి చనిపోయాడు కదా!.. వాడు చేసిన రాక్షస చర్యకు అరుణ నెల తప్పింది కాదా!.. ఆ గర్భాన్ని అలాగే వుంచుకొంటే కొద్ది నెలల్లోనే అరుణ లోకుల వల్ల అవమానం పాలవుతుంది. ఆ విషయం విన్న అరుణ తల్లి అనారోగ్యంతో వున్నందున ఆమె ప్రాణానికే ముప్పు కలుగవచ్చు. కనుక, అమ్మా! ఈ విషయాన్ని డాక్టర్ అనుపమకు చెప్పి అరుణకు వెంటనే రేపే అబార్షన్ చేయిస్తే మంచిది కదమ్మా!" అనునయంగా చెప్పాడు దీపక్. 


అరుణ ఆ ఇంట్లో మూడు సంవత్సరాలుగా పనిచేస్తూ వుంది. అరుణ మాటల్లోని సౌమ్యత, పనితీరు, ఆ తల్లీకొడుకులకు ఎంతగానో నచ్చాయి. ఒక్కోసారి శాంతమ్మ అనుకొనేది. ’ఇలాంటి అమ్మాయి నాకు కోడలైతే ఎంత బాగుంటుంది?’ ఒకటి రెండు సార్లు అరుణపట్ల తనకున్న ఆ భావాన్ని దీపక్‍తో కూడా చెప్పింది శాంతమ్మ. 


"అమ్మా! నీది బంగారు మనస్సు. నీ కోర్కెను ఆ సర్వేశ్వరులు తప్పక తీరుస్తారులే!" చిరునవ్వుతో చెప్పేవాడు దీపక్. 


అరుణ విషయంలో దీపక్ చెప్పిన మాటలను గురించి కొన్ని నిముషాలు ఆలోచించింది శాంతమ్మ. 

’అవును. అరుణ భావి జీవితం బాగుండాలంటే దీపక్ చెప్పినట్లుగా అబార్షన్ చేయించడం ఎంతో మంచిది’ అనుకొంది శాంతమ్మ. 


"దీపక్!"


"రేఫు ఉదయాన్నే అరుణ పనికి వస్తుందిగా!.. ఒకవేళ రాకపోతే నీవు వారి ఇంటికి వెళ్ళి పిలుచుకొనిరావాలి. సరేనా!"


"అలాగే అమ్మా!.. "


"నేను వెళ్ళి డాక్టర్ అనుపమతో మాట్లాడి వస్తాను. ఆ పని రేపే జరిగిపోవాలి" అంది శాంతమ్మ. 


శాంతమ్మ అనుపమను కలిసింది. మురారి విషయాన్ని చెప్పింది. అరుణకు చేయవలసిన అబార్షన్ గురించి చర్చించింది. 


ఆ కథనంతా విన్న డాక్టర్ అనుపమ, అరుణకు అబార్షన్ చేసేటందుకు సమ్మతించింది. మరుదినం అరుణ ఎనిమిది గంటలకు రావడానికి బదులుగా తొమ్మిది గంటలకు వచ్చింది. 


"అరుణా!.. నీవు చాలా నీరసంగా వున్నావు. నేను డాక్టర్ అనుపమతో మాట్లాడాను. పద.. ఆమె దగ్గరకు వెళదాం. నిన్ను చెక్ చేసి మందులు రాసిస్తుంది. వాటిని వాడితే నీ ఆరోగ్యం కుదుటపడుతుంది. " అరుణ చేతిని తన చేతిలోనికి తీసుకొని శాంతమ్మ అనుపమ క్లినిక్‍కు వెళ్ళింది. 


ముందుగా విషయాన్ని శాంతమ్మ మూలంగా వినియున్నందున డాక్టర్ అనుపమ చిరునవ్వుతో వారికి స్వాగతం పలికింది. అరుణతో ప్రీతిగా మాట్లాడింది. తన స్టైల్లో అరుణకు విషయాన్ని వివరించింది. ధైర్యం చెప్పింది. చేయవలసిన కార్యక్రమాన్ని సక్రమంగా కొనసాగించింది. అరుణ ఆరంభంలో బాధపడ్డా.. చివరికి పీడ విరగడయ్యింది అనుకొంది. 

*

దీపక్, అతని స్నేహితుడు రఘు ఒకే కాలేజీలో చదువుకొన్నవారు. మంచిమిత్రులు. ఒకే ఆఫీసులో ఇరువురూ పనిచేస్తున్నారు. రఘుకు వివాహం అయ్యింది. ఒక కొడుకు. రెండు సంవత్సరాల వయస్సు. 


దీపక్ అరుణ కథను రఘుకు చెప్పాడు. రఘు దీపక్‍ని హృదయపూర్వకంగా అభినందించాడు. 

మురారీ గ్రామాన్నుంచి నాలుగు రోజుల తర్వాత ఒక వ్యక్తి వచ్చి అరుణ తల్లి చెంచమ్మకు మురారీ గతించిన విషయాన్ని తెలియజేసి వెళ్ళిపోయాడు. మురారీ కర్మకాండకు చెంచమ్మ, అరుణలు వెళ్ళలేదు. 


దీపక్, రఘులు ఆఫీసు క్యాంటిన్‍లో కాఫీ తాగుతున్నారు. 

"ఆ హీరో!.. ఏమిటి విశేషాలు?.. " అడిగాడు రఘు. 


"ఏముందిరా! షరా మామూలే. ఏదో ప్రశాంతంగా జీవనరధం సాగిపోతూ వుంది" అన్నాడు దీపక్. 


"అరుణ మీ యింటికి పనికి వస్తూ వుందా!"


"ఆ పని జరిగిన తరువాత నాలుగైదు రోజులు రాలేదు. ఇప్పుడు వస్తూ వుంది. అమ్మకు అరుణంటే ప్రాణంరా!"


"అలాగా!"


"అవును.. "


"మరి నీకు?.. "


దీపక్ వెంటనే జవాబు చెప్పలేకపోయాడు. ప్రశ్నార్థకంగా రఘు ముఖంలోకి చూచాడు. 


"ఏంట్రా అలా చూస్తున్నావ్? నా ప్రశ్నకు జవాబు చెప్పు" అడిగాడు రఘు. 


"పేదపిల్ల. మంచిపిల్ల. కొంతకాలం తరువాత మంచికుర్రాడిని చూచి అరుణ వివాహాన్ని జరిపించాలనుకొంటున్నాను" సౌమ్యంగా చెప్పాడు దీపక్. 


"ఒరే దీపక్ నీవు చెప్పింది నిజం కాదురా!" చిరునవ్వుతో అన్నాడు రఘు. 


దీపక్ అతని కళ్ళల్లోకి ఆశ్చర్యంగా చూచాడు. 

"దీపక్!.. "


"చెప్పు.. "


"నేను ఒక చిన్న కథను చెబుతాను వింటావా?"


"ఆఁ.. "


"నామిత్రుడు ఒకడు విశాఖపట్నంలో ఇంజనీరింగ్ చదివే రోజుల్లో గోపాలయ్య అనేవారి ఇంటి మేడమీది గదిలో వుండేవాడు. గోపాలయ్యగారికి ఒక కూతురు. సౌందర్య. ఆమె ఇంటర్ వరకు చదువుకొంది. గోపాలయ్యగారి తల్లి అనసూయమ్మ. వయస్సు ఎనభై.. తాను త్వరలో చనిపోతానని, సౌందర్య వివాహాన్ని కళ్ళారా చూడాలని, తన తమ్ముడు భీమారావు కొడుకు కుమార్‍తో సౌందర్య వివాహాన్ని వెంటనే జరిపించవలసినదిగా కొడుకు గోపాలయ్యను కోరింది. 


గోపాలయ్య తల్లి కోర్కెను తీర్చాలని నిర్ణయించుకొన్నాడు. భీమారావును కలిసి తన తల్లి కోర్కెను గురించి తెలియజేశాడు. అయిన సంబంధం. ఒక్కగానొక్కపిల్ల, తల్లిలేనిది అయిన సౌందర్యను తన కోడలిగా చేసుకొనేదానికి ఒప్పుకొన్నాడు భీమారావు. 


గోపాలయ్య సౌందర్య, కుమార్‍ల వివాహాన్ని ఘనంగా జరిపించాడు. 

అది కరోనా కాలం.. 


పెండ్లి జరిగిన నెలరోజుల లోపలే కుమార్‍ను కరోనా కాటు వేసింది. అతని కథ ముగిసిపోయింది. 

అత్తారింటి ప్రవేశం లేకుండానే సౌందర్య తండ్రి ఇంట ఉండిపోయింది. 


మిద్దెమీద మన మిత్రుడు రోజూ సౌందర్యను చూస్తూ వుండేవాడు. అతని చూపులను నచ్చని సౌందర్య.. తండ్రితో మేడమీద అతన్ని ఖాళీ చేయమని చెప్పండి నాన్నా! అతని తత్త్వం సరిగ్గా లేదు అని చెప్పింది. 


గోపాలయ్య ఆ విషయాన్ని చెప్పడానికి మేడపైకి వెళ్ళాడు. మన హీరో చిరునవ్వుతో.. వారికి స్వాగతం పలికాడు. 


"సార్!.. నేను మీ వద్దకు రాబోతున్నాను. మీరే పైకి వచ్చారు. నేను మీతో ఓ విషయం చెప్పాలి సార్!" అన్నాడు. 


గోపాలయ్య "ఏమిటది?" అడిగారు. 


"మీకు సమ్మతం అయితే మీ అమ్మాయిని నేను వివాహం చేసికొంటాను. నా జీవితాంతం నా ప్రాణ సమానంగా చూచుకొంటాను" అన్నాడు మనవాడు. 


గోపాలయ్య చిత్తరువులా నిలబడిపోయారు. 


"సార్!. నేను మా తల్లిదండ్రులకు ఒక్కడిని. మాది తెనాలి. ఏదో కొంత భూమి, తోటలు, దొడ్లు వున్నాయి. మా నాయన పేరు రఘునాధరావు. మా అమ్మ పేరు కళ్యాణి" ఎంతో వినయంగా చెప్పాడు మనోడు. 


రాఘవయ్యగారు మౌనంగా క్రిందికి దిగిపోయారు. 

వారంరోజులు గడిచాయి. మనోడి ఫైనల్ ఇంజనీరింగ్ పరీక్షలు ముగిసాయి. పెట్టాబేడా సర్దుకొని క్రిందికి దిగాడు మనోడు. వాకిట్లో వున్న సౌందర్య ఇంట్లోకి పారిపోయింది. 

రాఘవయ్యగారు కళ్ళముందు ప్రత్యక్షమయ్యారు. 


"సార్! నా చదువు ముగిసింది. నేను మా వూరు వెళ్ళిపోతున్నాను. నేను మీకు ఏ విధమైన కష్టాన్ని కలిగించి వున్నా నన్ను మన్నించండి" చేతులు జోడించాడు. 


తాళాలను వారికి అందించి తన లగేజీని తీసుకొని తెనాలికి బయలుదేరాడు మన హీరో. వూరికి చేరాడు. తన నిర్ణయాన్ని, సౌందర్యను గురించి తల్లిదండ్రులకు చెప్పాడు. 


అప్పుడు ఆ తండ్రి.. ’ఒరేయ్! ఆదర్శాలను వల్లేవేయడం కాదురా.. ఆచరణలో పెట్టాలి. నీ నిర్ణయం మాకు సమ్మతంరా!’ అన్నాడు. 


మూడువారాలు గడచిపోయాయి. 


ఒకరోజు ఉదయం గోపాలయ్యగారు మనోడి ఇంటికి వచ్చారు. ’రఘునాధరావు గారూ! మా సౌందర్యను మీ అబ్బాయికి ఇచ్చి వివాహం జరిపించాలనుకొన్నాను. తమరు సమ్మతిస్తే’ దీనంగా రఘునాధ రావు చేతులు పట్టుకొన్నాడు. గోపాలయ్య, రఘూనాధరావు, కళ్యాణ్‍లు వారిని సాదరంగా గౌరవించారు. పరస్పరం ఆనందంగా జరుపవలసిన వివాహాన్ని గురించి మాట్లాడుకొన్నారు. 


నెలరోజుల తర్వాత మనోడికి సౌందర్యకు వివాహం గొప్పగా జరిగింది. వారి వివాహం జరిగి మూడు సంవత్సరాలు. ఇప్పుడు వారికి ఒక కొడుకు రెండు సంవత్సరాలు" రఘు చెప్పడం ఆపేశాడు. నవ్వుతూ దీపక్ ముఖంలోకి చూచాడు. 


"అవునూ!.. మనోడు.. మనోడు అన్నావే కాని అతని పేరును చెప్పలేదు కదరా!"


"పేరు చెప్పలేదా!"


"అవును.. "


"ఆ మనోడే ఈ నీ మిత్రుడు రఘు!" గలగలా నవ్వాడు రఘు. 


దీపక్ ఆశ్చర్యంతో రఘు కళ్ళల్లోకి చూచాడు. 


"మిత్రమా! ఇప్పుడు నీకు అర్థం అయ్యిందా అరుణ విషయంలో నీ కర్తవ్యం ఏమిటో!.. ఆలోచించు.. పద.. " అన్నాడు రఘు. 


ఇరువురూ క్యాంటిన్ నుండి ఆఫీసు వైపుకు నడిచారు. 

*

ఆ రాత్రి దీపక్ రఘు కథను తన తల్లికి చెప్పాడు. అంతా విన్న శాంతమ్మ.. 

"నాన్నా! నిజం చెప్పు. అరుణ విషయంలో నీ అభిప్రాయం ఏమిటి?"


"అమ్మా!.. అదే ప్రశ్న నేను నిన్నడిగితే.. నీ జవాబు!"


"రేయ్!.. అరుణ నా ఇంటి కోడలు కావాలిరా! నీవు అరుణను పెండ్లి చేసుకోవాలిరా!" చిరునవ్వుతో చెప్పింది శాంతమ్మ. 


"సరే అమ్మా!.. నీ యిష్టమే నా యిష్టం!.. " నవ్వుతూ చెప్పాడు దీపక్. 


రెండు వారాలు గడిచిపోయాయి. 

దీపక్.. తన వివాహ ఆహ్వాన పత్రికతో రఘును సమీపించాడు. 


"గురువర్యా! నమస్కారములు! నా వివాహ ఆహ్వాన పత్రిక. ప్రప్రధముగా తమరు స్వీకరించి, నన్ను ఆశీర్వదించాలి" నవ్వుతూ పత్రికను రఘు చేతికి అందించాడు దీపక్. 


రఘు కుర్చీనుండి లేచి దీపక్ చేతిని తన చేతిలోనికి తీసుకొని "సోదరా!.. గ్రేట్.. గ్రేట్.. కంగ్రాచ్యులేషన్స్. ప్రతి మనిషిలో ’మానవత్వం వర్థిల్లాలి’" నవ్వుతూ ఆనందంగా చెప్పాడు రఘు. 

దీపక్ నయనాల్లో వెయ్యి దీపాల కాంతులు. 

*

సమాప్తి


సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.



29 views0 comments

Comments


bottom of page