#SudhavishwamAkondi, #ManavathvamaEdiNeeChirunama, #మానవత్వమాఏదీనీచిరునామా, #సుధావిశ్వంఆకొండి, #TeluguStories, #తెలుగుకథలు

Manavathvama Edi Nee Chirunama - New Telugu Story Written By - Sudhavishwam Akondi
Published In manatelugukathalu.com On 20/02/2025
మానవత్వమా! ఏదీ నీ చిరునామా? - తెలుగు కథ
రచన: సుధావిశ్వం ఆకొండి
కథా పఠనం: పద్మావతి కొమరగిరి
మనుషుల కరుడుగట్టిన స్వార్థ పూరిత పనులను చూసి మండిపడిన జగత్తుకు సాక్షిగా ఉన్న సూర్య భగవానుడు తన తీక్షణంగా కిరణాలను ప్రసరింపజేస్తున్నాడు. అది చూసి వాత్సల్య రూపిణి అయిన అమ్మ తన శక్తిని కొందరు సైంటిస్ట్ ల్లో ప్రచోదనం చేసి, తద్వారా ఫ్యాన్లు, ఏసీలు ఇవన్నీ అందించింది. అయినా ప్రాణులు తాళలేకపోతుంటే, ఇంద్రుని పిలిచి..
"ఇంద్రా! వర్షాలు కురిపింపజేయి నాయనా!" అంటే
"అమ్మా! నువ్వు ఆ బ్రహ్మ కీట జననివి, దయస్వరూపిణివి కనుక ఇలా చెబుతున్నావు కానీ, మానవులు ఎలా తయారయ్యారో చూడమ్మా! మానవత్వం నశించి, జంతువుల వలే ప్రవర్తిస్తుంటే ప్రకృతి క్షోభిస్తుంది"
"కలి ప్రభావం నాయనా! ఇది ఇంకా మొదటిపాదం లోనే ఉంది కదా! కొందరన్నా మహాత్ములు వున్నారు. చేసే కర్మలు చేస్తున్నారు. మమ్మల్నే నమ్ముకుని ఉన్నవాళ్ళూ వున్నారు. ఇంకా పశు పక్ష్యాదుల మాటేమిటి? అవేమీ చేయలేవు కదా! ఆ కొందరి మహాత్ములను, వారి ప్రార్థనను దృష్టిలో పెట్టుకుని, మీరంతా శాంతించాలి. ఇప్పటివరకూ వేడికి తాళలేక పోతున్నారు. అందుకని ఇప్పుడు కురిపించు"
అమ్మ ఆజ్ఞను శిరసావహిస్తూ మేఘాలను పిలిచి కురియమన్నాడు.
వర్షం పడగానే, 'అకస్మాత్తుగా పడింది పాడువాన! పనులు అయిపోయి నేను ఇంటికి పోయాక పడొచ్చు కదా! అని విసుక్కునే వారు కొందరు. ఇంకా కొందరు మరీ విశాల దృక్పథంతో "అందరి పనులు అయిపోయి, ఇంటికొచ్చి, తిని పడుకున్నాక వర్షం పడితే బాగుండేది అని అనుకునేవారు మరికొందరు.
వర్షం పడగానే ఆనందంగా రోడ్డు పైనే నాట్యం చేసేవాళ్ళు కొందరు. ఇలా ఎవరి భావాలు వారివి..
మనుషుల మాటలకు, చేతలకు స్పందించి ప్రకృతి కోపిస్తే ఎలా ఉంటుంది పరిస్థితి?..
కానీ ఎవరి యొక్క హావభావాలతో స్పందించకుండా వరుణ దేవుడు తన కర్తవ్యాన్ని పాటిస్తూ వర్షం సన్నగా కురిపిస్తున్నాడు.
'కానీ మనుషులు రోజురోజుకీ మరీ ఇలా తయారు అవుతున్నారు. ఒక తీవ్రమైన సమస్య వచ్చి, అది సమాజానికి అంతటికీ కామన్ సమస్య అయితే, మనుషులు అందరూ ఒక్కటిగా అవుతారు అని చెప్పగా విన్నాను. ఓ నవలా రచయిత అయితే అద్భుతమైన నవల రచించారు. స్వాతి అనుబంధం అనుకుంటా. అందులో వాతావరణంలో మార్పులు వచ్చి, ప్రపంచం మొత్తం ప్రమాదంలోనికి వెళుతుంది. అప్పుడు అన్ని దేశాల అధినేతలు కలిసి ఒక యోగిని కలుస్తారు. ఆయన సూచించిన ప్రకారం నడిచి, మళ్ళీ మనుష్య ధర్మాన్ని ఉద్ధరిస్తారు.
ఒక కామన్ సమస్య ఎదురైతే అందరిలో ఐక్యత ఏర్పడుతుంది అంటూ అంతర్లీనంగా తెలుపుతారు అందులో. మరి ఇప్పుడు కరోనా అందరి సమస్య అయినా స్వార్ధం వదిలివేయకుండా ఎవరు, ఎప్పుడు చనిపోతారో తెలియని స్థితిలో కూడా క్రూరమైన ఆలోచనలు ఎలా వస్తున్నాయి వీళ్లకు.
కరోనా రాగానే మొన్నటికి మొన్న ఢిల్లీలో ఒక కొడుకు తన కన్నతల్లిని కరోనా వచ్చింది అని చెప్పి, తీసుకొచ్చి బస్ స్టాప్ వద్ద వదిలి వెళ్ళిపోయాడు. ఎంత ఘోరం!
కొత్తగా పెళ్ళైన జంట హనీమూన్ కి వెళ్లి బెంగళూరుకు వచ్చారు. అక్కడ ఉన్న ఉధృతిని బట్టి అందరు ప్రయాణికులకు కరోనా టెస్ట్ చేస్తున్నారు. అలాగే ఈ జంటకు చేశారు. భర్తకు కరోనా పాజిటివ్ అనగానే అతన్ని వదిలివేసి ఆ భార్యామణి అక్కడ్నుంచి పారిపోయి పుట్టిల్లు ఢిల్లీకి వచ్చేసింది. తీరా పారిపోయిన ఆవిడ అడ్రెస్ పట్టుకుని వచ్చి చెక్ చేస్తే అవిడకూ కరోనా అని తేలింది. అలా తన తల్లిదండ్రులకు కూడా అంటించింది. ఈ న్యూస్ చదవగానే ఏ విధమైన ఎమోషన్ లేకుండా ఎలా ఉంటారు అని ఒకటే ఆలోచనలు నాలో.
ఆంధ్రాలో ఓ చోట భర్తకు కరోనా వచ్చిందని దానికి సంబంధించిన హాస్పిటల్ కు తీసుకెళ్తే, లక్షలు వసూలు చేసి, ఏవో పనికిమాలిన ఇంజక్షన్ చేసి, ఇంకా సీరియస్ గా అయితే, భార్య అనుమానంతో అడిగితే నీకు దిక్కున్న చోట చెప్పుకో అని డాక్టర్ దబాయిస్తే, ఆవిడ కామ్ గా భర్తను వేరే హాస్పిటల్ కు తరలించి, సోషల్ మీడియాలో వీడియో పెట్టింది ఏడుస్తూ.
వైద్యులు అంటే దైవంగా భావిస్తారు కదా! ప్రాణాలతో చెలగాటం ఆడతారా? వీళ్ళు ఎప్పటికీ జీవించి ఉంటారా? వీళ్ళూ చావాల్సిందేగా! ఇలా పీడించి సంపాదించిన డబ్బు చావునుంచి కాపాడుతుందా? ఇదేనా మానవత్వం? ఛీ.. మనుషులా? రాక్షసులా? మానవత్వమా ఎక్కడున్నావు? ఏదీ నీ చిరునామా? ఈ మధ్య టీవీలో విన్న న్యూస్ అంతా నా మెదడులో తిరిగిపోతోంది. మనసు ఆవేదనతో నిండిపోయింది.
ఎక్కడో జరిగినదానికి మనమేం చేయలేము అని తెలిసినా ఏదో బాధ. మనుషులు ఇంతగా మానవత్వం మరిచిపోతున్నారు అనే ఆలోచన వస్తుంటుంది.
ఇలా ఆలోచనల్లో మునిగి వుండగా..
"సులోచనా! డాబాపైన ఆరేసిన బట్టలు తీసుకువచ్చావా? వర్షం పడుతున్నట్టుంది" అని గట్టిగా అన్న అత్తగారి మాట వినబడింది.
ఓ కునుకు తీస్తానని పడుకుంది చూసి, తను తమ బెడ్ రూమ్ బాల్కనీలో నిలబడింది. వాతావరణం చల్లగా మారగానే ఆ చిరుజల్లును చూస్తూ నిలబడి ఆలోచనల్లోకి పోయింది. బట్టల విషయం మర్చిపోయింది.
అమ్మో! అని తలపై కొట్టుకుని పైకి పరుగెత్తింది. అప్పటికే చాలావరకు తడిసిపోయిన బట్టలు తీసుకుని కిందకు వచ్చింది.
###
నాకు ఏ దుర్ఘటన విన్నా మనసు ఏదోలా, బాధగా అయిపోతుంటుంది. మనుషులు ఎందుకిలా ప్రవర్తిస్తుంటారు? తమ స్వార్ధం కోసం ఏమైనా చేయడానికి వెనుకాడకుండా ఎలా ఉంటారు. బయట అందరూ నీతులు చెబుతుంటారు, తామెంతో మంచివాళ్ళము అన్నట్టుగా ప్రదర్శిస్తుంటారు కానీ స్వార్థపూరిత పనులే చేస్తుంటారు. ఇలాంటి ఆలోచనలు వస్తుంటాయి.
మన చేతుల్లో ఉన్నదానికి మనం చేయగలిగితే చేయాలి. అంతేకానీ అన్ని విషయాలు అలా ఆలోచిస్తే నీ ఆరోగ్యం పాడవుతుంది అనేది మా ఇంట్లోవాళ్ళ ఏకైక అభిప్రాయం. మా అత్తగారు మాత్రం నా జట్టుగా ఉన్నట్టే ఉండి, అచ్ఛం అమ్మలా చెబుతుంటుంది.
మా పెళ్లై ఐదేళ్లు అవుతోంది. ఒక బాబు. మా నాన్న, మామయ్య కాలేజీలో అధ్యాపకులుగా జాబ్ వచ్చిన కొత్తలో ఒకేచోట పని చేశారట. అత్తయ్య టీచర్ గా చేశారు. అమ్మకు ఇష్టం లేక చేయలేదట. అప్పట్లో రెండు కుటుంబాలు ఎంతో ఆప్యాయంగా కలిసి పోయాయట. మేము కొంచెం పెద్దయ్యాక వేరే వేరే చోట్లకు ట్రాన్సఫర్ అవ్వడం వల్ల వివరాలు తెలియకుండా పోయాయి. నా కోసం పెళ్లి సంబంధాలు చూస్తుంటే అనుకోకుండా అనేకంటే నా అదృష్టం వల్ల నాన్నకు మామయ్య కలిసారు. మాట్లాడుకుని నాకూ, మా వారికి ముడి పెట్టిన రెండు సంవత్సరాలలోనే అమ్మా, నాన్న ఒకరివెంట ఒకరు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.
నేను మొదట్లో బిడియపడ్డా, ఆ తర్వాత మా అత్తింటి ఆత్మీయతకు అమ్మానాన్నలు పోయారనే బాధే లేకుండా పోయింది. మా అత్తమామలకు మావారు, ఆ తర్వాత ఒకమ్మాయి. తనకూ పెళ్లి అయిపోయింది. తను నాకు ఆడపడుచు అనేకంటే మంచి స్నేహితురాలు. అందుకే హాయిగా వున్నాను. కానీ ప్రతి చిన్న విషయానికి బాధపడుతుంటాను, ఎమోషన్ గా ఫీల్ అవుతుంటాను. అలా ఫీల్ కాని వాళ్ళు 'ఎమోషన్ లెస్ ఫెలోస్' అని నా ఫీలింగ్.
ఏదైనా సంఘటన జరిగినప్పుడు సోషల్ మీడియాలో పెట్టి, ఓ సారి మాట్లాడుకుని వదిలేస్తారు అందరూ. నాకేమో మళ్ళీ రిపీట్ గా గుర్తు వస్తుంటుంది.
************
మామయ్య బాబును తీసుకుని తన స్నేహితుని కలిసివస్తానని వెళ్లారు. ఆయన ఆఫీస్ కి వెళ్లారు. నేనూ, అత్తయ్యే. అప్పుడప్పుడు కలిసి ఏదో సినిమా చూస్తాం లేదంటే బుక్స్ చదువుకుంటూ చర్చించుకుంటుంటాం. నాకు తెలియని చాలా విషయాలు అత్తగారి ద్వారా తెలుసుకుంటుంటాను. ఆవిడ టీచర్ గా రిటైర్డ్ అయ్యారు. చాలా చక్కగా విసుక్కోకుండా చెబుతారు.
వర్షం పడిందని నాకిష్టమైన మిరపకాయ బజ్జిలు చేశారు. ఇద్దరం తిని, చెరో కప్పు కాఫీ తాగి మాట్లాడుకుంటూ రిలాక్స్ గా కూర్చున్నాం.
"ఏంటి నీ సుదీర్ఘమైన ఆలోచనలు"
"అత్తయ్యా! మనుషుల్లో మానవత్వం లేకుండా పోతోంది. అంతా స్వార్ధమే. చస్తున్నా డబ్బే ప్రధానం అన్నట్టుగా చేస్తున్నారు" అంటూ న్యూస్ వివరించి నా ఆవేదన అంతా వెళ్లగక్కాను.
"నీ బాధ కరెక్ట్ నే కాదనను. కానీ అనవసరంగా ఆలోచిస్తే నీ ఆరోగ్యం పాడవుతుంది. మన చేతుల్లో ఉన్నంతవరకు మనం ఎవరికైనా సాయం చేయగలం. కానీ ఎక్కడో జరిగినది విని అదేపనిగా ఆలోచిస్తే ఎలా? మనుషుల్లో మంచి, చెడు రెండూ ఉంటాయి.
పూర్వం యుగాల్లో మనుషులు, రాక్షసులు అని విడిగా గుర్తించేలా ఉండేవారు. కానీ ఇప్పుడు ప్రతి మనిషిలో రెండు లక్షణాలు ఉంటాయి ఎక్కువ తక్కువల తేడాలు తప్ప. మంచి ఆలోచన వచ్చినప్పుడు మంచిపనులు, చెడు ఆలోచనలు వచ్చినప్పుడు చెడు చేస్తాడు. అంతే.
ఎదుటివారిలో మంచి ఉంటే సరే లేదంటే దూరంగా ఉండాలి.
వైద్యులు కూడా మనుషులే కదా! అందులోనూ మంచివాళ్ళూ, చెడ్డవాళ్ళూ ఇద్దరూ వుంటారు.
నువ్వు ఇలాంటి సంఘటనలు చూసి నీ మనసు ఆవేదన చెందినప్పుడు దానికి అక్షరరూపం ఇవ్వు. తద్వారా ప్రభావితులు అయి మారి మంచిగా ఒక్కళ్ళు తయారయినా మంచిదే కదా! ఎంతో ఆత్మ సంతృప్తి లభిస్తుంది. నీ బాధా పోతుంది. సరేనా" అని చెప్పారు
నాకూ నిజమేననిపించి రాయడం మొదలుపెట్టాను. అనతికాలంలోనే చాలామంది నా రచనల ద్వారా ప్రభావితం అయ్యారు. కొందరిలో మార్పు వచ్చిందన్నారు. కొన్ని సంఘటనలు మళ్ళీ జరక్కుండా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. అలా అందరూ చెబుతుంటే ఎంతో ఆనందం కలిగింది. ఒకరికొకరు సాయం చేసుకుంటున్నారు. అండగా వుంటున్నారు.
అప్పుడు అనుకున్నాను. ఎంతోమందిలో మానవత్వం ఉంది. మానవత్వమా! నీ చిరునామా ఇది. ఇంతమంది మంచి మనుషుల్లో కొలువై వున్నావు! అని సంతోషించాను.
మీలో ఎవరైనా ఇలాంటి సులోచనలు వున్నారా?
###
సుధావిశ్వం ఆకొండి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
కలం పేరు సుధావిశ్వం. పూర్తి పేరు అనురాగసుధ. వృత్తి లాయర్. ప్రవృత్తి రచనలు చేయడం. ట్రావెలింగ్ కూడా!
కొన్ని నవలలు, కథలు వ్రాయడం జరిగింది. ప్రస్తుత నివాసం ఢిల్లీ.
Comments