'Manchi Manasunna Maharaju' - New Telugu Story Written By Ch. C. S. Sarma
Published In manatelugukathalu.com On 26/06/2024
'మంచి మనసున్న మహారాజు' తెలుగు కథ
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
అది మసీదు....
ముజావిర్ మొహమ్మద్....
సాయంత్రం నమాజ్ చేయసాగాడు.... (విశ్వశాంతి కోసం) పసిబిడ్డ ఏడుపు.... వినిపించింది.
మనస్సు లయ తప్పింది. తన కార్యక్రమాన్ని అనిశ్చల చిత్తంతో పూర్తిచేశాడు. కళ్ళు తెరిచాడు. నలువైపులా చూచాడు.
మసీదు అరుగు దిగాడు.
పసిబిడ్డ ఏడుపు!.....
బిడ్డ ఏడుపు వస్తున్న దిశకు నడిచాడు.
గుబురుగా పెరిగిన మల్లెపొద....
దానిక్రింద (ప్రక్కన) పసిబిడ్డ. బంగారు కాంతి.
’యా అల్లా ఇదేమిటి?... ఈ బిడ్డ ఎవరు?... ఇక్కడికి ఎలా వచ్చింది? నేను ఇప్పుడు ఏం చేయాలి?’ విచారంగా ఆలోచించాడు.
పసిబిడ్డ ఏడుస్తూ ఉంది.
మెల్లగా వంగి బిడ్డను చేతికి తీసుకొన్నాడు. మగబిడ్డ.
’ఏ తల్లి కన్నదో!... ఈ బిడ్డ ముస్లిమా....హిందువా... క్రిస్టియనా?... ఎవరైతేనేం?... పసిబిడ్డ దైవసమానం!’ అనుకొన్నాడు.
మహమ్మద్ వివాహం పాతిక సంవత్సరాల క్రింద జరిగింది. తండ్రి అతని చిన్న వయస్సులోనే గతించాడు. తండ్రి ఎలా వుంటాడో అతనికి తెలియదు. తల్లి మల్లిక అతన్ని సాకి పెద్ద చేసింది. మహమ్మద్ తండ్రి ఖాసిం. వారు ముజాలిర్ ఉద్యోగాన్నే నిర్వహించేవారు.
తల్లి రెండు మూడు కలవారి ఇండ్లల్లో పనిచేసి, తన బిడ్డ అవసరాలను తీర్చుకొనేది. అప్పటికి ఆమె వయస్సు అరవై సంవత్సరాలు. చేతిలోకి బిడ్డను తీసుకొని వేగంగా తన ఇంటివైపుకు నడిచాడు. తల్లి మల్లిక అతని చేతిలోని బిడ్డను చూచి ఆశ్చర్యపోయింది.
"బాబా!... ఎవరురా ఈ బిడ్డ" ఆశ్చర్యంతో అడిగింది.
"అమ్మా!.... వీరు ఎవరో నాకు తెలియదు. మసీదులో మల్లెపొదల ప్రక్కనే వున్నాడు. తీసుకొచ్చాను."
"అలాగా!..." ఆశ్చర్యంతో అంది మల్లిక. బిడ్డను తన చేతుల్లోకి తీసుకొంది పరిశీలనగా చూచింది.
"మనం వున్న పరిస్థితుల్లో ఆ అల్లా మనకు మరో జీవి సంరక్షణను అప్పగించాడమ్మ. మనం ఈ బిడ్డను సాకాలి. పెంచాలి. పెద్ద చేయాలి" తన నిర్ణయాన్ని తెలియజేశాడు మహమ్మద్.
"ఈ వయస్సులో నాకు ఈ బంధాన్ని ఎందుకు తగిలించాడో ఆ అల్లా!" విచారంగా అంది మల్లిక.
"బంధం అనుకొంటే, ద్వేషం కలుగుతుంది. మన అనుకొంటే అభిమానం పెరుగుతుంది కదా అమ్మా!"
"అవును బాబా ఆ మాట నిజమే!..."
"కనుక అమ్మా మనం ఈ బాబును ’మన’ అని భావించాలి ఏమంటావ్?"
"నాకు వుండేది నీవు ఒక్కడివి. నీ మాటను నేను ఎలా కాదనగలను బాబా!"
"అమ్మా! నీవు ఈ బాబును చూచి ఏమంటావో అని భయపడ్డాను. నీ అంగీకారం నాకు చాలా సంతోషం అమ్మా!" ఆనందంగా పలికాడు మహమ్మద్.
"వీడికి ఏం పేరు పెడదాం బాబా!"
"హిమ..." వెంటనే అన్నాడు మహమ్మద్.
"వెంటనే చెప్పావు. ముందుగానే ఆలోచించావా!"
"లేదమ్మా!... ఈ బిడ్డ హిందువా, ముస్లిమా మనకు తెలియదు. ఆ రెండు మతాల తొలి అక్షరాలే ఈ పేరు హిమ" నవ్వుతూ చెప్పాడు మహమ్మద్.
"చాలా బాగుంది బాబా!"
మల్లిక ముద్దుగా మహమ్మద్‍ను బాబా అని పిలుస్తుంది.
"పోయి పాలు తీసుకొని, పాలు తాగించే సీసాను కొనుక్కొని వస్తానమ్మా. ఈ లోపల నీవు హిమకు స్నానం చేయించు."
"అలాగే బాబా!"
మహమ్మద్ వేగంగా ఇంటనుండి బయటికి నడిచాడు.
*
అప్పటికి హిమ వయస్సు మూడున్నర సంవత్సరాలు. మహమ్మద్‍ను కులంవారు కొందరు ఆక్షేపించారు.
ఎవరో అనాధ శిశువును పెంచడం తప్పన్నారు.
"హిమ నాకు అల్లా ప్రసాదించిన బిడ్డ. ఆ బిడ్డను సంరక్షించడం నా ధర్మం. మీరు ఏమన్నా, ఏమనుకొన్నా నా సంకల్పం మారదు" తన నిశ్చితాభిప్రాయాన్ని వారికి తెలియజేశాడు మహమ్మద్.
ఫలితంగా ఆ పెద్దలు మహమ్మద్‍ను ముజావిర్ పదవినుండి తొలగించారు. అయినా మహమ్మద్ భయపడలేదు.
కూలిపనికి వెళ్ళేవాడు. ఆ కూలి డబ్బులతో తల్లిని, హిమలను పోషించేవాడు. రాత్రి సమయంలో పెట్రోల్ బంకుల్లో పనిచేసేవాడు. పగలంతా కూలిపని.
హిమను స్కూల్లో చేర్పించాడు. తెలుగు, ఉర్దూ రెండు భాషలను నేర్పించాడు మహమ్మద్.
హిమ చాలా తెలివైన బాలుడు. ఒకసారి విన్నాడంటే ఏ విషయమైనా అతని మస్తిష్కంలో నిలిచిపోయేది. టీచర్లు అతన్ని ఏకసంధాగ్రాహి అని పిలిచేవారు.
కాలచక్రం వేగంగా ఐదుసార్లు తిరిగింది. అప్పటికి హిమ వయస్సు తొమ్మిది సంవత్సరాలు. రంగు రంగుల ఈ ప్రపంచాన్ని గురించి రకరకాల మనుషులను గురించి అర్థంకాసాగింది. మహమ్మద్ హిమకు "బేటా! ఎప్పుడూ ఆబద్ధం చెప్పకూడదు. దొంగతనం చేయకూడదు. కష్టాల్లో వున్న సాటివారికి మనం చేయగలిగినంత సహాయం చేయాలి. సాటివారినందరినీ అభిమానించాలి. నిత్యం కొంతసేపు దైవ ప్రార్థన తప్పకుండా చేయాలి. ఆ దైవాన్ని హిందువులు ’ఈశ్వర్’ ముస్లింలు, ’అల్లా,’ క్రిస్టియన్లు ’ఏసు’ అని పిలుస్తారు. పేర్లు వేరు కావచ్చు. దేవుడు ఒక్కడే. వారే నన్ను నిన్ను అందరినీ మనం చూచే ప్రతి జీవినీ చెట్లను, మొక్కలను, పక్షులను, జంతువులను సృష్టించింది.
ఈ నామాటలను నీవు ఎప్పుడూ జ్ఞాపకం వుంచుకోవాలి హిమా!...." అని చెప్పేవారు.
ఆ కారణంగా హిమలో దయాదాక్షిణ్యం, ప్రేమ, అభిమానాలు పెరిగాయి. సాటివారందరితో ఎంతో ప్రీతిగా వుండేవారు. సౌమ్యంగా మాట్లాడేవారు. అందరిచేతా మంచి బాలుడు అనిపించుకొన్నాడు.
*
అది వర్షాకాలం. భాద్రపదమాసం. పదిరోజులుగా మల్లికకు తీవ్ర జ్వరం, దగ్గు. మహమ్మద్ ఏదో నాటుమందు ఆయుద్వేద వైద్యుని దగ్గర నుండి తెచ్చి తల్లిచేత మ్రింగించాడు. కానీ మల్లిక ఆరోగ్యం చక్కబడలేదు. ఒకరోజు అర్థరాత్రి సమయంలో ఆమె గుండె ఆగిపోయింది. మహమ్మద్, హిమలు ఎంతగానో ఏడ్చారు.
మరుదినం సాయంత్రం మల్లిక మట్టిలో కలిసిపోయింది.
మల్లిక మరణం మహమ్మద్, హిమలను ఎంతగానో కృంగదీసింది. అప్పటికి హిమ వయస్సు పది సంవత్సరాలు. అయిదవ తరగతి చదువుతున్నాడు. వారం రోజులుగా తీవ్ర వర్షాలు.
పెట్రోలు బంకులో పని ముగించుకొని, వర్షం కొంచెం తగ్గగానే రాత్రి పదకొండున్నర సమయంలో మహమ్మద్ ఇంటికి బయలుదేరాడు.
పెద్దగా ఉరుములు, మెరుపులు. పెద్ద ధ్వనితో పిడుగు పడింది. ఆ పిడుగు మహమ్మద్ తలపై పడి, అతన్ని చంపేసింది. వర్షపు కారణంగా జన సంచారం లేదు. నేల కూలిపోయిన మహమ్మద్‍ను ఆ రాత్రి సమయంలో ఎవరూ గమనించలేదు.
ఇంట్లో వున్న హిమకు తన బాబా ఇంకా ఇంటికి రాలేదనే ఆందోళన. ఉరుములు, మెరుపులు పిడుగు శబ్దాల వలన భయం. ఏడుస్తూ వుండిపోయాడు. ఆ ఏడుపు ఆవేదనతో ఆ రాత్రంగా జాగారణ చేశాడు హిమ.
తూర్పున వెలుగు రేఖలు, తెల్లవారింది. హిమ ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు. అప్పటి ఆదారుణ వాతావరణంలో మార్పు కలిగింది. వాన ఆగింది. తన బాబా కోసం హిమ పెట్రోలు బంకు వైపుకు పరుగెత్తాడు.
వారి ఇంటికి పెట్రోలు బంకుకు నాలుగు కిలోమీటర్లు. రెండు కిలోమీటర్లు వచ్చిన హిమ రోడ్డు ప్రక్కన కొంతమంది జనం గుమికూడి వుండటాన్ని చూచాడు. ఆతృతగా ఆ జనాన్ని సమీపించాడు.
తడిసిన బట్టలతో మట్టిలో స్పృహ లేకుండా పడివున్న తన బాబా మహమ్మద్‍ను చూచాడు. అతని పరిస్థితి అయోమయం.
"బాబా!" బిగ్గరగా అరిచి, బాబా శవంపై వాలిపోయాడు.
ఆ విషయాన్ని విన్న పెట్రోలు బంకు పనిమనుషులు కొందరు పరుగున అక్కడికి వచ్చారు.
చనిపోయిన మహమ్మద్‍ను, అతనిపై పడి ఏడుస్తున్న హిమను చూచారు. హిమను ప్రక్కకు తీసి, మహమ్మద్‍ను ఆటోలో ఆతని ఇంటికి చేర్చారు.
భోరున ఏడుస్తున్న హిమను వారు....
"ప్రక్కనే మీ వారెవరైనా వున్నారా బాబు!" అడిగారు.
"ఎవరూ లేరు" ఏడుస్తూనే చెప్పాడు హిమ.
సాటి మనిషి ఆ రీతిగా ఆకాల మరణం పాలైనందున విచారించారు. అందరూ హిమను సముదాయించారు.
అందరూ కలిసి చందా వేసుకొని సాయత్రం నాలుగు గంటల ప్రాంతంలో మహమ్మద్ శవాన్ని ఖబరస్తాన్ (స్మశానం)కు తరలించారు. హిమ సమాధిపై బడి ఏడవసాగాడు. ఇరువురు సహృదయులు అతన్ని లేవదీసి ఆ స్థలం నుంచి బయటకు నడిపించారు. వారి చేతిలో వున్న కొంత డబ్బును అతని జేబులో వుంచి వెళ్ళిపోయారు.
హిమ ఏడుస్తూ ఇంట్లో ప్రవేశించాడు. తన బాబా పడుకునే మంచాన్ని పట్టుకొని భోరున ఏడవసాగాడు.
సమయం రాత్రి ఏడుగంటల ప్రాంతం....
హిమకు కడుపులో ఆకలి....
మెల్లగా లేచి తలుపు బిగించి దూరంగా వున్న టీ బంక్ దగ్గరకు వెళ్ళాడు. ఒక బన్ తీసుకొని, సగం తిని ఎదురుగా చూస్తున్న కుక్కకు మిగతా సగం ముందుంచి, టీ త్రాగి ఆవేదనతో ఇంటివైపుకు నడిచాడు.
ఆ కుక్క అతని వెనకాలే నడిచింది.
తలుపు తోసి లోన ప్రవేశించాడు హిమ. ఆ కాలభైరవుడు కూడా ఇంట్లోకి ప్రవేశించాడు. అది మగ కుక్క.
దాన్ని చూచిన హిమ....
"నేను భయపడతానని, నాకు తోడుగా వుండేటందుకు నిన్ను నా బాబా పంపించాడా!... దాదా!..." పిలిచాడు హిమ.
కుక్క అతన్ని సమీపించింది. ఆశ్రునయనాలతో హిమ ఆ శునకాన్ని దగ్గరకు తీసుకొన్నాడు. తన గత కథంతా దానికి చెప్పాడు. విచారంగా బాబాను తలచుకొంటూ కన్నీటితో శయనించాడు. కుక్క కళ్ళల్లో కన్నీరు.
*
ఉదయం ఆరుగంటలకు హిమ మాస్టారు శంకరయ్య సార్ అతని ఇంటికి వచ్చాడు.
"హిమా!..." కొన్ని క్షణాల తర్వాత.... "హిమా!..." పిలిచాడు శంకరయ్య.
ఏడ్చి ఏడ్చి ఎప్పుడో నిద్రపోయిన హిమ ఉలిక్కిపడి లేచాడు. కుక్క ’భౌ.... భౌ
మని శంకరయ్యను చూచి అరిచింది.
"సార్! నమస్కారం" చేతులు జోడించాడు హిమ కన్నీళ్లతో.
"నేను మూడు రోజులుగా వూర్లో లేను. నిన్న రాత్రి వచ్చాను. మీ నాన్నగారు చనిపోయారని విన్నాను. నిన్ను చూడాలని వచ్చాను హిమా!" విచారంగా చెప్పాడు శంకరయ్య మాస్టారు.
"మీరు నా దగ్గరికి రావడం నాకు చాలా సంతోషం సార్!..."
"నీవు నాతోరా హిమా!..."
"ఎందుకు సార్!" దీనంగా అడిగాడు హిమ.
"చెప్తాను రారా!"
ఇంటికి తాళం బిగించి హిమ మాస్టారుని అనుసరించాడు. కుక్క వారి వెంట నడవసాగింది.
టీ బంక్ వచ్చింది.
కుక్క హిమను చూస్తూ ’భౌ....భౌ’ అంది.
"ఓహో ఆకలా.... అవును నీవూ రాత్రి నాలాగే పస్తున్నావు కదా!...."ఒక బన్ తీసి ముక్కలు చేసి దానిముందు వుంచాడు హిమ.
"ఇది మీ కుక్కనా హిమా!" అడిగాడు మాస్టారు.
తర్వాత... "ఆ దేవుడు నాకు పంపిన తోడు సార్!" విరక్తిగా నవ్వాడు హిమ.
క్షణం తర్వాత....
"రెండు టీ అన్నా!" చెప్పాడు హిమ.
టీ షాపు మనిషి ఇరువురికీ టీ అందించాడు.
"ఇప్పుడు మనం ఎక్కడికి వెళుతున్నాము సార్!" వినయంగా అడిగాడు హిమ.
"మా ఇంటికి!..."
"ఎందుకు సార్?"
"ఇంటికి వెళ్లాక చెబుతాను."
టీ త్రాగడం ముగిసింది. గ్లాసులను టీ బాబు అందుకొన్నాడు. హిమ డబ్బు తీయబోయాడు.
మాస్టారు వారించి వారు డబ్బులు ఇచ్చారు.
ఇరువురూ ముందుకు నడిచారు.
వారి వెనకాలే శుకనం....
ఇరువురూ మాస్టారు గారి ఇంటికి చేరారు.
మాస్టారు వరండాలో కూర్చున్నారు.
"హిమా కూర్చో!"
హిమ నేలమీద కూర్చున్నాడు.
"హిమ!"
"సార్!"
"నీకు సాయం చేసే బంధువులు ఎవరైనా వున్నారా?"
"లేరు సార్!"
"మరి ఏం చేయాలనుకొంటున్నావ్?"
"నేనేమీ ఆలోచించలేదు సార్!"
"మా ఇంట్లో వుంటావా!... నాకు నలుగురు ఆడపిల్లలు. నిన్ను నేను నా కొడుకుగా చూచుకొంటాను. చదివిస్తాను. మీ బాబా నేను మంచి స్నేహితులం. నీ గురించి వారు నాకు అంతా చెప్పారు."
"వద్దు సార్!.... నాకు చదువుకోవాలని లేదు. ఏదైనా పని చూచుకొంటాను."
"నీవు చాలా తెలివికలవాడివి. గొప్పగా చదువులో పైకి రాగలవు హిమా!"
"ఎవరండీ!...." అంటూ మాస్టారు గారి అర్థాంగి వసంతమ్మ సింహద్వారాన్ని సమీపించింది.
"వసంతా! మన మహమ్మద్ గారి అబ్బాయి. పేరు హిమ. మహమ్మద్ చనిపోయాడూగా. వీడు మనతోనే వుంటూ చదువుకొంటాడు."
"ఏమిటీ!...." దీర్ఘం తీసింది వసంతమ్మ ఆశ్చర్యంతో.
"చూడంది మాస్టారూ! నాకు నలుగురు ఆడపిల్లలు. వారికి చాకిరీ చేయలేక సతమతమైపోతున్నా. ఇంకొకరిని నా నెత్తిపైన పెట్టకండి. మీకు వాడి మీద అంతగా అభిమానం వుంటే పదో పాతికో పరకో చేతిలో పెట్టి సాగనంపండి..." మూతితిప్పుతూ అంది వసంత.
హిమ లేచి నిలబడ్డాడు.
"అమ్మగారూ! నమస్కారం. మాస్టారుగారూ నమస్కారం. నేను వెళుతున్నాను" వేగంగా వరండాలోనుంచి బయటికి నడిచాడు. అతని వెనకాలే కుక్క.
విచారంగా ఇంట్లో ప్రవేశించాడు హిమ. తలుపును మూశాడు. మంచంపై వాలిపోయాడు.
"మాస్టారు గారు మంచివారు. నన్ను ఆదుకోవాలనుకొన్నారు. వారి ఇంట్లో వుంచుకొని చదివిస్తానన్నారు. కానీ వారి భార్య నలుగురు ఆడపిల్లల తల్లికి అది ఇష్టం లేదు. ఆవేశంగా మాస్టారిగారితో మాట్లాడింది. ఆమె అన్నమాటలు నిజమేకదా! నాతో కలిపి ఐదుగురు పిల్లలకు అన్నీ సమకూర్చాలంటే చాలా కష్టం కదా!... పాపం నా వలన మాస్టారుగారు మాటలు పడ్డారు. నేను వారితో కలిసి వారి ఇంటికి వెళ్ళకుండా వుండాల్సింది. తప్పు చేశాను.’ విచారంగా అనుకొన్నాడు హిమ.
కుక్క అరిచింది...
’అంటే ఎవరో వచ్చారన్నమాట’ లేచి తలుపు తెరిచాడు.
ఎదురుగా నలభై సంవత్సరాల ముస్లిం స్థూలకాయుడు ఖాసిం.
"రేయ్! నీ పేరేమిటి?"
"హిమ"
"నీవు ఈ ఇల్లు ఖాళీ చేయాలి. ఇది మాది. ఏదో మీ బాబా ముజావీర్‍గా వున్నందున బాడుగ లేకుండా ఇచ్చాను. ఇప్పుడూ అతడు లేడు, వారి అమ్మా లేదు. నీవెవరివో నాకు తెలీదు. రెండు రోజులు టైం ఇస్తున్నా....! తట్టా బుట్టా సర్దుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపో. అర్థం అయ్యిందా!" గద్దించిట్లు చెప్పాడు ఆ వ్యక్తి ఖాసిం....
హిమ భయపడిపోయాడు. మౌనంగా తలాడించాడు.
"నీకు టైము రెండు రోజులు మాత్రమే!.... ఖాళీ చెయ్యి. నేను ఎల్లుండి వస్తాను" వేగంగా చెప్పి ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు.
హిమ పరిస్థితి అయోమయం అయిపోయింది. కళ్ళల్లో నీళ్ళు. మనసున దిగులు. మౌనంగా విచారంతో కూర్చున్నాడు.
కుక్క అతన్ని పరీక్షగా చూడసాగింది.
హిమ లేచి ఇంటికి తాళం వేసి బయలుదేరాడు. తను టీ తాగే షాపును సమీపించాడు.
"ఏరా టీ కావాలా!" ఆ షాపు యజమాని సాంబయ్య.
"అన్నా!.... నీ షాపులో నాకు పని ఇస్తావా? గ్లాసులు, గిన్నెలు కడుగుతా. నీకు సాయంగా వుంటా. నాకు మూడుపూటలా పట్టెడు అన్నం పెట్టన్నా!.... ఈడనే పడుకుంటా!" దీనంగా అడిగాడు హిమ.
"నీ ఇల్లేమైంది?"
"అది మా సొంతం కాదన్నా. ఇంటి సొంతాయన వచ్చి రెండు రోజుల్లో ఇల్లు ఖాళీ చెయ్యమని చెప్పాడన్నా!"
"అట్టాగా!...."
"అవునన్నా!... నమ్మకంగా వుంటా. మీరు చెప్పిన ఏ పనైనా చేస్తానన్నా!"
సాంబయ్య కొన్ని క్షణాలు ఆలోచించాడు.
"అన్నా!... ఏమంటావు?" దీనంగా అడిగాడు హిమ.
"సరే రా!.... వచ్చేయి... నా కాడ వుందువుగాని!..." చిరునవ్వుతో చెప్పాడు సాంబయ్య.
హిమ వేగంగా ఇంటివైపుకు నడిచి ఆ వచ్చిన వ్యక్తి ఖాసింగారి ఇంటికి వెళ్ళి వారిని కలిశాడు.
"అయ్యా!.... నేను ఈ రోజే ఇల్లు ఖాళీ చేస్తానయ్యా!"
"ఈ రోజేనా!"
"అవునయ్యా!.... నాది కాని దాంట్లో వుండటం తప్పు కదయ్యా!" దీనంగా చెప్పాడు హిమ.
"సరే ఖాళీ చెయ్యి!" అన్నాడు ఖాసిం.
హిమ ఇంటికి వచ్చాడు. గుడ్డల్ని సర్దుకున్నాడు. తన బాబా మంచాన్ని తీసుకొని వెళ్ళి టీ షాపు పక్కనుంచి, తిరిగి వచ్చి రెండు గుడ్డల సంచులను తీసుకొని ఖాసిం ఇంటికి వెళ్ళాడు.
"ఏరా!"
"ఈ రెండు సంచులేనయ్యా నా సామాన్లు. గుడ్డలు, పుస్తకాలు. చూచుకోండి" వినయంగా చెప్పాడు.
"సరే వెళ్ళు"
తాళాన్ని ఖాసిం చేతికి ఇచ్చి, రెండు సంచులతో సాంబయ్య టీ షాపుకు చేరాడు హిమ.
*
ఉదయాన్నే నిద్రలేచి షాపు ముందు చిమ్మి నీళ్ళు చల్లి ప్లాస్టిక్ బెంచీలను సరిగా అమర్చాడు.
సాంబయ్య వచ్చి చూచి ఆశ్చర్యపోయాడు. అతను వచ్చింది ఐదున్నరకు.
’అంటే వీడు నాకన్నా ముందుగా లేచి షాపు ముందు శుభ్రం చేసి అన్నింటిని సక్రమంగా అమర్చాడు. కష్టజీవే!’ అనుకొన్నాడు సాంబయ్య.
ఒక సామెత వుంది ’గొడ్డు వచ్చిన వేళ బిడ్డ వచ్చిన వేళ’ అని. అంటే మన ఒక పశువును కొన్నా... మన ఇంట బిడ్డ పుట్టినా...ఆ వేళా విశేషాన్ని బట్టి ఆ ఇంటి పరిస్థితులు మంచి స్థితిలో మారుతాయి.
హిమ ఆ షాపులో ప్రవేశించిన వేళా విశేషం అలాంటిదే....
సాంబయ్య వ్యాపారం ఊపందుకొంది. రెండువారాలు గడిచాయి. హిమ రోజంతా పనిచేసి షాపు మూసిన తర్వాత మంచం వాల్చుకొని షాపు ముందే పడుకునేవాడు. వేకువనే ఐదుగంటలకు లేచి పరిసరాలను చిమ్మి, నీళ్ళు చల్లి, చెక్క బెంచీలన్, ప్లాస్టిక్ కుర్చీలను క్రమంగా అమర్చేవాడు. హిమ పనితీరు సాంబయ్యకు బాగా నచ్చింది.
ఒకరోజు రాత్రి తొమ్మిదిగంటల ప్రాంతంలో సాంబయ్య ఇంటికి బయలుదేరేటప్పుడు....
"అయ్యా!.... చిన్నమాట!..."
"ఏంది హిమా!"
"టీ.... కాఫీ, చుట్టా, బీడీ, సిగరెట్లతో పాటు టిఫిన్ ఇడ్లీ, వడా, దోసె చేశామంటే మనకు వ్యాపారం పెరుగును కదయ్యా. ఆలోచించండి!" అనునయంగా చెప్పాడు హిమ.
"అలాగా!"
"అవునయ్యా!"
"సరే రేపు చెబుతాను!"
"మంచిదయ్యా!"
చిరునవ్వుతో సాంబయ్య తన మోపెడ్‍ను స్టార్ట్ చేసి ఇంటివైపుకు బయలుదేరాడు.
ఆ రాత్రి భార్య శకుంతలకు హిమ చెప్పిన విషయాన్ని గురించి చెప్పాడు.
"హిమ ఐడియా బాగుందండి. హోటల్ ప్రారంభించండి" అంది శకుంతల.
మరుదినం సాంబయ్య టీ బంక్‍కు వచ్చి హిమతో....
"మనం హొటల్ ప్రారంభించబోతున్నాము హిమ" చెప్పాడు.
తనకు తెలిసిన తాపీమేస్త్రి గోవిందయ్యను పిలిచి తన అభిప్రాయాన్ని తెలిపాడు. బంకు దక్షిణపు వైపున వున్న తన ఖాళీ స్థలంలో రేకుల షెడ్‍ను వేయాలన్నాడు. వారంరోజుల్లో గోడలు రేకుల కప్పు పూర్తయింది.
పనిపూర్తి అయిన రోజున పదిహేను సంవత్సరాల అమ్మాయితో ఒక ఆడమనిషి ఆ బంకు దగ్గరకు వచ్చింది.
అప్పుడు సాంబయ్య లేడు. ఆమె రెండు టీలు అడిగింది. కలిపి హిమ ఆమెకు రెండు టీలు అందించాడు.
"బాబూ!... ఈ షాపు నీదా!"
"కాదు మా యజమాని సాంబయ్యగారిది"
"ఆ సాంబయ్యగారు నాకు ఏదైనా పని ఇప్పించగలరా బాబూ!..." దీనంగా అడిగింది ఆమె.
"మీకు టిఫిన్ అంటే ఇడ్లీ, వడ, దోశ, పూరి చేయడం తెలుసా!" అడిగాడు హిమ.
"బాబూ! నాకు అన్ని వంటకాలు, పిండివంటలు చేయడం బాగా తెలుసు బాబూ!"
"అయితే వుండండి. మా సార్ వస్తారు. మాకు మీలాంటి వంటమనిషి కావాలి. హోటల్ ప్రారంభించాలి."
"ఎప్పుడొస్తారు బాబు!"
’ఓ అరగంట లోపల వస్తాడమ్మా! కూర్చోండి. మీపేరు?"
"సుగుణ"
"అమ్మాయి పేరు?"
"అరుణ"
"సుగుణ.... అరుణ మంచిపేర్లు" నవ్వుతూ చెప్పాడు హిమ.
"నీ పేరేంది బాబు?" అడిగింది సుగుణ.
"హిమ అమ్మా!"
అరుణ చిరునవ్వుతో వారి మాటలను వింటూ వుంది.
"అమ్మా!...."
"ఏం బాబూ!”
"నేను నిన్ను అక్కా అని పిలవొచ్చా"
"అట్టాగే పిలువు బాబూ!" నవ్వుతూ చెప్పింది సుగుణ.
సాంబయ్య వచ్చాడు.
హిమ, సుగుణ, అరుణలను అతనికి పరిచయం చేశాడు.
"ఏమ్మా!.... నీవు టిఫిన్‍లన్నీ బాగా చేస్తావా?" అడిగాడు సాంబయ్య.
"చేస్తానయ్యా!" చెప్పింది సుగుణ.
"సరే. చాలా మంచిది. రేపటి నుంచి మనం హోటల్ ప్రారంభిద్దాం" చిరునవ్వుతో చెప్పాడు సాంబయ్య.
సాంబయ్య మనస్సులో హిమ మీద ఎంతో ప్రేమాభిమానాలు కలిగాయి. తనకు ఎలాంటి శ్రమ లేకుండా వంటలక్కను కూడా హిమ ఏర్పరచినందుకు.
వేసిన రేకుల షెడ్‍లో వెనుక భాగంలో ఆ తల్లీ కూతుళ్ళను వుండమన్నాడు సాంబయ్య.
సుగుణ రెండు చేతులు జోడించి సాంబయ్యకు నమస్కరించింది. మేస్త్రీని పిలిచి ఒక మరుగుదొడ్డిని ఆ ఆడవారిరువురూ స్నానం చేసేదానికి ఏర్పరిచారు.
ఆ సాయంత్రం పురోహితుడు శివశంకర శాస్త్రి గారిని కలిసి రేపు పూజాకార్యక్రమాన్ని జరిపించి హోటల్‍ను ఓపెన్ చేయవలసిందిగా కోరాడు. చాలాకాలంగా సాంబయ్యను ఎరిగిన శివశంకరశాస్త్రిగారు ఆనందంగా అంగీకరించాడు.
టేబుల్, కుర్చీలు, వంటపాత్రలు, ఒక టెంపోలో వచ్చి దిగాయి.
హిమ వాటన్నింటినీ రేకుల షెడ్‍లో క్రమంగా అమర్చాడు.
సత్యయ్యా, సుగుణ తను ఎన్ని మాటలు మాట్లాడినా నోరు తెరవని అరుణ విషయంలో హిమకు అనుమానం కలిగింది.
"అక్కా!..."
"ఏం బాబూ!"
"ఒకమాట అడుగుతా తప్పుగా అనుకోవు కదా!"
"అడుగయ్యా! ఏమీ అనుకోను" అంది సుగుణ.
"అరుణకు...." హిమ పూర్తిచేయకముందే....
"మాట్లాడలేదయ్యా.... మూగది" విచారంగా చెప్పింది సుగుణ.
ఆ మాటను వినగానే హిమ, సాంబయ్యలు ఆశ్చర్యపోయారు.
వారిరువురి మీద వీరికి ఎంతో జాలివేసింది.
అరుణను జాగ్రత్తగా చూచుకోవాలనుకొన్నాడు హిమ.
మరుదినం ఐదుగంటలకు లేచి స్నానం చేసి సుగుణ వంటకాలు చేయడం ప్రారంభించింది. సాంబయ్య చెప్పినట్లుగా ఇడ్లీ, వడలను తయారుచేసింది.
పురోహితుడు శివశంకర శాస్త్రిగారు వచ్చారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఫొటోకు పూజ చేశారు.
సాంబయ్య అతని భార్య శకుంతల, హిమ, సుగుణ, అరుణలు వారికి నమస్కరించారు.
పురోహితులు వారికి హృదయపూర్వకంగా ఆశీర్వదించారు. దక్షిణ తాంబూలాన్ని సాంబయ్య దంపతులు శాస్త్రిగారికి సమర్పించారు. వారు ఆనందంగా వెళ్ళిపోయారు.
హిమ, శకుంతల టిఫిన్ సెంటర్ బోర్డుకు తగిలించి నమస్కరించాడు.
సాంబయ్య శకుంతలలు ఆ బోర్డును భక్తితో నమస్కరించారు.
*
వారంరోజులకే చాలామందికి తెలిసిపోయింది. శకుంతల టిఫిన్ సెంటర్‍లో టిఫిన్ అద్భుతమని....
తిన్నవారు సాంబయ్యను అభినందించారు. రోజురోజుకు రద్దీ పెరగసాగింది. గొప్పగా సేల్స్ జరిగాయి.
సాంబయ్య భార్య శకుంతల కూడా వంట విషయంలో సుగుణకు సాయం చేసేది.
పుల్లమ్మ అనే మరో మనిషిని కూడా పనిలోకి పెట్టుకొన్నాడు సాంబయ్య.
సంవత్సరం.... రోజులు ఎంతో ప్రశాంతంగా సాగిపోయాయి. ఇడ్లీ, వడ, దోశ, మసాలా దోశ ఉదయం టిఫిన్. సాయంత్రం బజ్జీ, మసాలా వడ, చిల్లీ బజ్జీ తయారుచేసేవారు. పార్శిల్ కట్టేవారు. రోజులు గడిచేకొద్దీ దాదాపు రెండువందల మందికి పైగా ఆ శకుంతల టిఫిన్ సెంటర్లో ఆరగించేవారు.
కొందరు కాలేజీ పిల్లలు, ఉద్యోగస్తులు, రిక్షావారు, దారి ప్రయాణీకులు, గ్రామస్థులు, ఆ టిఫిన్ సెంటర్‍లో తినేవారు.
*
ఆ వూరి సర్పంచ్ కొడుకు బి.ఎ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. పేరు నరహరి. అతని కళ్ళు అరుణ మీద పడ్డాయి.
అరుణ కావలసినవారికి గ్లాసులతో మంచినీళ్ళు పోయడం, కాపీ గ్లాసులు అందించడం లాంటి పనులు చేసేది.
పుల్లమ్మ తిన్న ప్లేట్లను తీయడం, కడగడం, టేబుల్స్ క్లీనింగ్ పనులు చేసేది. నరహరి పుల్లమ్మను తన మాటలతో, టిప్స్ తో గుప్పెట్లోకి తీసుకొన్నాడు. హోటల్‍ను వచ్చినప్పుడల్లా అతని కళ్ళు అరుణను వెదికేవి.
ఒకనాడు నరహరి మల్లమ్మతో....
"పుల్లమ్మా! నీవు అరుణను రేపు మా యింటికి తీసుకుని రావాలి. మా అమ్మానాన్నలు వూర్లో లేరు. ఇదిగో దీన్ని తీసుకో" ఆమె చేతిలో వెయ్యి రూపాయలు వుంచాడు నరహరి.
నరహరి ఇంటి పరిసరాల్లోనే పుల్లమ్మ ఇల్లు. ప్రస్తుతం ఆమె వయస్సు అరవై. ఇటుకరాయిలా గట్టి శరీరం. భర్త గతించి ముఫ్పై సంవత్సరాలు. వయస్సులో కొంతమందికి చాపలు పరిచిన రకం పుల్లమ్మ....
పుల్లమ్మ ఇంటి ప్రక్కనే రామాలయం....
ఆ ఉదయం పనంతా ముగించుకొని, అరుణతో రామాలయాన్ని చూపిస్తానని చెప్పి తనతో రమ్మంది.
అరుణ తల్లి పర్మిషన్‍తో పుల్లమ్మతో రామాలయానికి బయలుదేరింది.
ఆరోజు ఆదివారం. టిఫిన్ సెంటర్ ఒంటిగంటవరకే నడుస్తుంది. మధ్యాహ్నం సెలవు.
అరుణ పుల్లమ్మతో బయలుదేరడం హిమ చూశాడు. పిల్లమ్మ సుగుణతో మాట్లాడిన మాటలనూ విన్నాడు.
ఆలయంలో దైవదర్శనం అయిన తరువాత అరుణ తమ నిలయానికి ఒంటరిగా రావడం అతనికి ఇష్టం లేదు. ఆ కారణంగా హిమ పుల్లమ్మ, అరుణల వెనుక వారికి కనబడకుండా నడిచాడు. పుల్లమ్మ, అరుణలు నరహరి ఇంటిని సమీపించారు. ఆ ఇరువురూ నరహరి ఇంట్లో ప్రవేశించారు. పది నిముషాల్లో పుల్లమ్మ ఒక్కతే బయటికి వచ్చింది.
తెరిచివున్న నరహరి ఇంటి సింహద్వారం మూయబడింది.
చాటుగా వుండి అంతా గమనించిన హిమను అనుమానం కలిగింది. పుల్లమ్మ తన ఇంటివైపుకు నడిచింది.
హిమ నరహరి ఇంటి ముందుకు వెళ్ళాడు. మూసివున్న సింహద్వారాన్ని తట్టాడు.
లోన....
నరహరి అరుణను తన దగ్గరగా లాక్కోవాలని ప్రయత్నించాడు. మాటలు రాని అరుణ ’ఆ...వు...ఆ...వు’ అని తన వ్యతిరేకతను తెలియజేసింది. అతని నిర్ణయాన్ని తెలుసుకొన్న అరుణ ఏడుస్తూ నరహరికి నమస్కరించింది.
కామ వాంఛతో రగులుతున్న నరహరి, ఆమె రోదనను లెక్కచేయలేదు. బలవంతం చేయసాగాడు.
తలుపు దగ్గర చేరిన హిమ లోన జరగరానిది ఏదో జరుగుతున్నదని గ్రహించాడు. తలుపుపై గట్టిగా కొట్టసాగాడు. ఆ శబ్దాన్ని కూడా నరహరి లెక్కచేయలేదు. అరుణను గట్టిగా పట్టుకొని తన కబంద హస్తాల్లో బంధించాడు.
మాటలు రాని మూగ అరుణ ’ఆ...వూ..... ఆ...వూ’ అంటూ అతనితో పెనుగులాడుతూ వుంది.
ఆ ఇంటికి ద్వారం ప్రక్కన స్లయిడింగ్ విండో (కిటికీ) వుంది. హిమ దాన్ని చూచాడు. విండోను సైడ్ చేశాడు. ఇనప కమ్ములు లేవు. ఆ మార్గం గుండా ఇంట్లోకి ప్రవేశించాడు.
నరహరి చేతుల్లో నలిగిపోతూ ఏడుస్తూన్న అరుణను చూచాడు. అతనిలో ఆవేశం పెరిగింది.
నరహరిని సమీపించాడు. అతని చెంపపై గట్టిగా కొట్టాడు. నరహరి హిమను కాలితో తన్నాడు. హిమ నేలపై పడ్డాడు. నలువైపులా చూచాడు హిమ.
టీపాయ్‍పై వున్న తొమ్మిది అంగుళాల పొడవు వున్న ఫ్లవర్ వాజ్‍ను చేతికి తీసుకొన్నాడు. ఆవేశంగా నరహరిని సమీపించి బలంగా ఫ్లవర్ వాజ్‍తో అతని తలపై కొట్టాడు. నరహరి తలకు గాయం. రక్తస్రావం.
అప్పుడు బాధతో నరహరి ’అమ్మా!...’ అంటూ అరుణను వదిలాడు. నేలకు ఒరిగిపోయాడు.
హిమ సింహద్వారాన్ని తెరిచాడు. అరుణ చేతిని తన చేతిలోనికి తీసుకొన్నాడు. ఆమెకు లాక్కొని బయటికి వచ్చాడు.
"అరుణా! ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకు. పద ఇంటికి."
అరుణ బెదిరిపోయింది. ఆ నరహరి తలనుండి కారుతున్న రక్తాన్నిచూచి ఏడవసాగింది.
"ఏడవకు త్వరగా రా!" ఆమె చేతిని తన చేతిలోనే వుంచుకొని వేగంగా నడిచి శకుంతల టిఫిన్ సెంటర్‍కు వచ్చాడు. అరుణను వదలి....
"అక్కా!.... అరుణను జాగ్రత్తగా చూచుకో. నాకు ముఖ్యమైన పని వుంది. వెళుతున్నాను" వేగంగా పరుగెత్తి నరహరి ఇంటికి చేరాడు. అతన్ని ఆటోలో కూర్చోబెట్టి తాను ప్రక్కనే కూర్చొని హాస్పిటల్‍కు చేరాడు.
"మా ఇద్దరి మధ్యా పంతంతో పోరాటం జరిగింది. నరహరి తలకు గాయం ఏర్పడింది. అతన్ని కాపాడండి సార్!" నర్స్ డాక్టర్‍లను వేడుకొన్నాడు హిమ.
వారు నరహరిని స్ట్రెచ్చర్‍పై చేర్చి ట్రీట్ మెంటుకు హాస్పిటల్‍లోనికి తీసుకొని వెళ్ళారు.
విచారంగా హిమ డాక్టర్ ఏం చెబుతాడో అని నరహరి వున్న గదిముందు నిలబడ్డాడు.
ఇరవై నిముషాల తర్వాత డాక్టర్ బయటికి వచ్చారు.
"సార్! అతనికి ఎలా వుంది?" దీనంగా అడిగాడు హిమ.
"తలగాయం వలన చాలా రక్తం పోయింది. అతనికి వెంటనే రక్తం ఎక్కించాలి. ఆ గ్రూపు రక్తం మా వద్ద లేదు" చెప్పాడు డాక్టర్.
"సార్!. ఆ గ్రూపు వివరాలు పేర్లు నాకు తెలియవు. నా రక్తం సరిపోతుందేమో చూడండి సార్!" దీనంగా చెప్పాడు హిమ.
అతనికి రక్తం డాక్టర్ పరీక్ష చేశాడు. గ్రూపు మ్యాచ్ అయ్యింది.
హిమ శరీరాన్నించి రెండు బాటిల్స్ రక్తాన్ని తీసి నరహరికి ఎక్కించారు.
"ఇక అతనికేం ఫర్వాలేదు" హిమ మాటకు డాక్టర్ ఇచ్చిన జవాబది.
నరహరి తండ్రి బద్రీ నారాయణ పేరుగల లాయర్. డాక్టర్ నరహరి తండ్రి మిత్రుడు. ఆ కారణంగా డాక్టర్ నరహరిని జాగ్రత్తగా చూచాడు. బద్రీ నారాయణకు ఫోన్ చేసి విషయాన్ని చెప్పాడు. తాను భార్య విజయవాడలో వున్నామని, వెంటనే బయలుదేరుతున్నామని కొడుకును జాగ్రత్తగా చూచుకోవలసినదిగా బద్రీ నారాయణ డాక్టరును కోరాడు.
"డోంట్ వర్రీ!" అన్నాడు డాక్టర్.
విషయం సాంబయ్యకు తెలిసింది. జరిగిన విషయాన్ని సాంబయ్యతో హిమ "సార్!... జరిగిన దానిలో తప్పు నరహరిది. అతని ఆ తప్పుకు సాక్ష్యం నేనే, కానీ నా సాక్ష్యాన్ని ఎవరూ నమ్మబోతు. అతని తలకు గాయాన్ని నేను చేశాను కాబట్టి నేరం నాదే అంటారు. వాళ్ల నాన్నగారు వచ్చాక నాపై కేసు పెడతారు. మన ఆవరణానికి పోలీసులు వస్తారు. నన్ను అరెస్ట్ చేస్తారు. అది మీకు అవమానకరం అవుతుంది. అలా జరగడం నాకు ఇష్టం లేదు. ముఖ్యంగా అరుణ ఆమె అవమానం పాలు కాకూడదు. పాపం మూగపిల్ల సార్ ఆ తల్లీ కూతుళ్ళను జాగ్రత్తగా చూచుకోండి. నేను పోలీస్ స్టేషన్ కెళ్ళి నా తప్పును ఒప్పుకుంటాను. వారు ఏ శిక్ష వేసినా భరిస్తాను. ఒక అమాయకురాలిని కాపాడాననే ఆనందం నాకు చాలు సార్!..." హిమ వేగంగా పోలీస్ స్టేషన్ వైపుకు నడిచాడు.
హిమ మామూలు మనిషి కాదు. ’మంచి మనస్సున్న మహారాజు’ వాడిని కాపాడటం నా ధర్మం ఎంత ఖర్చు అయినా సరే!.... అనుకొన్నాడు సాంబయ్య. ఆ క్షణంలో అతని కళ్ళల్లో కన్నీరు....
సాంబయ్య వేగంగా పోలీస్ స్టేషన్ వైపుకు నడిచాడు.
*
సమాప్తి
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.
Comentarios