మంచి రోజులు వచ్చాయి
- Yasoda Gottiparthi
- 3 hours ago
- 6 min read
#YasodaGottiparthi, #యశోదగొట్టిపర్తి, #ManchiRojuluVachhayi, #మంచిరోజులువచ్చాయి, #StoryOnSocialProblems, #సామాజికసమస్యలు

Manchi Rojulu Vachhayi - New Telugu Story Written By - Yasoda Gottiparthi
Published In manatelugukathalu.com On 21/04/2025
మంచి రోజులు వచ్చాయి - తెలుగు కథ
రచన: యశోద గొట్టిపర్తి
“ఏమండీ! మనం ఈ బస్సు దిగాక, ఊరు కొద్ది దూరంలోనే ఉంది అనుకున్నాం కదండీ".. అని అంటుండగానే బస్సు దుమ్ములేపుకుంటూ ముందు కదిలింది.
బస్సు దిగిన జనం ఐదు, ఆరుగురు మాత్రమే ఉన్నారు. ఊరు తెలుసు కాబోలు గబగబా చేతిలో సంచులు పట్టుకుని ముందుకు నడుస్తున్నారు. రోడ్డు ప్రక్కన ఎవ్వరూ లేరు.
సన్నగా బండి బాటకన్పిస్తుంది.
“మనము ఈ ఊరే వెళ్లాలి కదా!" వారి వెంట వెళ్దాం పదండి" అన్న సుగుణ మాటలు విన్న సుందరయ్య,
“వాళ్ళు వెళ్ళనీ. మనిద్దరం నాలుగైదు కిలోమీటర్ల దూరం నడవలేము. ఏదైనా వాహనం వస్తుందేమో వేచి చూద్దాము.
పచ్చి పల్లెటూరు. పల్లె పొలాలు, చెట్లు, జంతువులు తప్ప ఏమీ కనిపించడం లేదు. అసలే ఎండగా ఉంది. ఇక్కడ ఏ వాహనము దొరకదు.”
మాటల్లోనే ఎద్దుల బండి ఎదురుగా వచ్చి నిలబడింది.
“అయ్యా! తిరువూరు పోవాలి కదా! నేను బండి కడతా! ఎక్కo డయ్యా? ఇప్పుడు కాకపోతే మల్ల మీకు బాడుగ దొరకదు.”
“ఏమండీ! ఎక్కుదామా?” అంటున్న తొందర చూచి,
“మీరు ఈ ఊళ్లో ఎవరింటికి పోవాలయ్యా? చెప్పండి. నేను దిగబెడతా ఏం ఆలోచించకండి” అన్నాడు అతను.
“ప్రభాకరం గారి ఇల్లు నీకు తెలుసా ?మేము ఇదే మొదలు రావడం. వాళ్లకు తెలిసిన వాళ్ళు ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళ అడ్రస్ కాగితం మీద వ్రాసి ఇచ్చారు.”
“అట్లానే అయ్యా! ప్రభాకరం అయ్యగారిల్లు తెలియని వారెవరు ఉండరు అయ్యా! నాకు బాగా తెలుసు.” అంటూ. “ఎండ ఎక్కువైతుంది. తొందరగా చేరుకోవాలి..” అంటూ ఎద్దులను పొడుస్తూ ‘హై హై’ అనడం..
“ఎన్నడో చిన్నప్పుడు విన్నాము ఈ మాట.. ఇన్నాళ్లకు ఎడ్ల బండి ఎక్కాము” అంటూ సుగుణ రెండు వైపులా చూస్తూ కూర్చుంది.
పచ్చని, ఎర్రని పూల చెట్లు మురిపిస్తున్నాయి కానీ వాటి పేరు మరిచింది. పసుపు వరిచేలు సంతోషంతో తలలూపుతున్నట్టు, ఎగిరే పక్షులు మీ కంటే మేము ముందుగా ఇల్లు చేరుకుంటాము అన్నట్లు రెక్కలతో రయ్యిమని పోతున్నాయి.
“చాలా దూరం.. ఏడు కిలోమీటర్లు. ఎప్పుడు తిన్నారో ఆకలైతే ఏమన్నా తినండి..” అని అనగానే గుర్తొచ్చి సంచిలోని లడ్డూల డబ్బా తీసి భర్తకు, బండి అతనికి ఇస్తూ..
“నీ పేరేమిటి?” అనగానే “సోములు అండి. నేను ఇక్కడ మా దొర గారికి జీతం చేసుకుంటాను. మీలాంటి వాళ్ళను ఇంటికాడ దించుతాను. మా ఊరోళ్లందరూ నడిచిపోతారు” అన్నాడు.
*********
చిన్న పెంకుటిల్లు.. ముందర చిన్న వేప చెట్టు, పూల మొక్కలు.. లోపలికి వెళ్ళగానే పెద్ద బల్ల కూర్చోవడానికి.
అడుగుపెట్టగానే..
వెలసిన రంగులతో లంగా జాకెట్ వేసుకొని పది పన్నెండేళ్ళ అమ్మాయి కింద నుండి మీది వరకు ఒళ్లంతా దుమ్ములాగా తెల్లగా, కళ్ళ రెప్పలు కూడా తెల్లగా మూస్తూ తెరుస్తుంటే మెరుస్తున్నాయి.
ఏమీ తెలియకుండానే అడుగు పెట్టాము. అసలు ఇదేనా అనుకుని అడ్రస్ మళ్ళీ చూసుకొని,
‘ఓ పనమ్మాయి’ అని పిలవగానే అమాయకంగా చూస్తూ నోరు మెదపలేదు.
“ఇంటి వాళ్ళు ఎవరూ లేరా?” అని అడిగారు సుందరయ్య.
“కాసేపటి తర్వాత వస్తారు” అంటూ.. “మంచినీళ్లు తెస్తాను” అనగానే ‘వద్దమ్మా’ అన్నారు.
కాసేపట్లోనే ప్రభాకరం దంపతులు వచ్చారు.
“ప్రయాణం బాగా జరిగిందా అండి..” అనగానే
“బాగా జరిగిందండి. మీరు ఇంట్లో లేకపోయేసరికి ఆందోళన పడ్డాము.”
“మేము మా వ్యాపారం తప్ప ఎక్కడికి వెళ్ళము. మీరు వస్తున్నట్టు కూడా తెలిసింది. అందుకే వెంటనే వచ్చాము. ఒక్క నిమిషం చేతులు కడుక్కొని వస్తాము.. అంటూ దుమ్ము ఉన్న చేతులను చూపించి మేము పిండి మిల్లు నుండి సరాసరి వచ్చాము.” అన్నాడు ప్రభాకరం.
ఆ అమ్మాయి ప్రభాకరం దంపతుల మధ్య వచ్చి కూర్చోగానే ప్రశ్నార్ధకంగా చూసిన సుందరయ్య తో, “మా అమ్మాయే నండి. మీరు వస్తున్నారని కాస్త ముందుగా ఇంటికి పంపిం చాము. మా పిండి మిల్లులో సహాయంగా ఉంటుంది.” అన్నాడు.
సుందరయ్య భార్య ముఖం లోకి చూసి పొరపాటు పడ్డాము అనుకుని, ‘బడికి వెళ్లవలసిన అమ్మాయికి ఆడుకునే వయసులో అప్పుడే బాధ్యతలు’ అనుకుంటు లోలోపల మారుమూల గ్రామం పంటలు, పరిశ్రమలు, కార్మిక, కర్షకులు తప్ప బడి చదువులు బహుదూరము. గ్రహాంతర సీమలను జయించిన ఎంత అభివృద్ధి సాధించినా, ఆకలి అజ్ఞానం, అవినీతి, నిరుద్యోగం అనారోగ్యం మనల్ని ఓడిస్తూనే ఉన్నాయి.
ఒకవైపు ఆకాశంలో విమానాలు ప్రయాణం చేస్తున్న భూమిపైన రెండు చక్రాల బండికి కూడా ప్రాముఖ్యత. అవసరము అలానే ఉంది.
ఆలోచనలోనే ఒక పిల్లవాడు బేలగా బెంగగా చూస్తూ తలుపు చాటున నిలబడి అర్ధిస్తున్నట్లు,
“ఇప్పుడు ఇక్కడ నువ్వు ఎంతసేపు నిలబడిన ప్రయోజనం లేదు వెళ్ళు” అంటున్న ప్రభాకర్ తో “మీరు పట్టి పెట్టిన పిండి సంచులు తీసుకెళ్లాలి.” అన్నాడు.
“డబ్బులు తెచ్చావా?”
“తేలేదు.. ముందు పిండి ఇవ్వండి. రేపు మరికొన్ని ధాన్యాలు తెచ్చి అవి ఇవి అన్ని ఒకే సారి రేపు ఇస్తాను డబ్బులు..” అంటూ మొండిగా నిలబడ్డాడు.
అవసరం ఉన్నప్పుడు బేలగా, పిండి పట్టగానే డబ్బులు అడిగితే మొండిగా, ఆ ధైర్యం.. కళ్ళలో అద్భుత శక్తితో అక్కడ ఉన్న అందరికీ ఆశ్చర్యం వేసింది.
కారణం చిన్న గ్రామం అయినా వందల ఎకరాలున్న భూస్వాములు ఉన్నారు.
ఆ గర్వం ఆ పిల్లవాడు కళ్ళలో కనిపిస్తుంది. పెద్ద పెద్ద హోటళ్లకు సరఫరా చేయడంలో వాళ్ళ అధికారం.
చూస్తున్న సుందరయ్యకు కూడా ఇలా ధిక్కరించడం అతను ఇంతవరకు ఎన్నడూ చూడలేదు. ఎదురుగా నిలబడి ఆ పిల్లవాడు అలా ఎలా చేయగలిగాడు?
పెద్దవాడైనా ప్రభాకరం కోపమంత దిగమింగి, గొర్రె పిల్లలా ఎలా ఉండిపోయాడు? ఎన్నో సందేహాలు వస్తుంటే అడుగుదామని లోపలున్నా, పైకి మాట రాలేదు.
“రాకరాక వచ్చారు. మీకు చిరాకు తెప్పిస్తున్నానా.. రండి, విశ్రాంతి తీసుకుందురు గాని.. ముందుగా” అంటూ.. “మీరు స్నానం చేస్తే బడలిక తగ్గుతుంది. తర్వాత భోంచేయవచ్చును..” అని ఉన్న ఒక చిన్న గదిలోకి తీసుకెళ్లాడు.
అక్కడ మంచం పైన కూర్చొని ఉన్న ఒక ముసలమ్మ ను చూపిస్తూ “రండి, మా అమ్మ గారు” అని పరిచయం చేశాడు.
మనకు దూరం బంధువులు అవుతారని చెప్పాడు.
వీళ్ళు పేదరికంలో కొట్టుమిట్టాడు తున్నారు.
అయితే మంచి తనమే ఆయనని ఈ దశకు తీసుకొచ్చింది. అనుకుంటుండగా తల్లి ఒక పుస్తకం చేతిలో పెట్టింది. అది పేజీలు తిప్పుతూ అక్కడక్కడ చదువుతుంటే అతని జీవిత మంతా కళ్ళ ముందు కదల సాగింది. చిన్నప్పుడే తండ్రి చనిపోవడం తల్లి పెంపకంలో పెరిగి ఇద్దరు తమ్ముళ్లను పెంచి పెద్ద చేయడం, చెల్లెలు పెళ్లి చేయడం అంటూ చెయ్యని పని అంటూ లేదు.
దొరికిన పనల్లా దైవంగా భావిస్తూ.. పూట గడిస్తే చాలు అన్నట్టు తల్లి నాలుగు ఇళ్లలో వంటలు చేస్తూ తను గుమాస్తాల దగ్గర లెక్కలు వ్రాస్తూ నమ్మకస్తుడిగా ఉండేవాడు. నిజాయితీగా ఉన్నప్పటికీ నిందలు భరించాడు.
బ్రతుకు వెళ్లి తీయడమే భారంగా, తలదాచుకునేందుకు కష్టంగా ఉంటే..
ఒకరోజున.. “నాయనా! సుందరయ్యా! నీవు తెచ్చిన లక్ష రూపాయలు ఎక్కడ దాచి పెట్టాలయ్యా? బ్యాంకులో పెట్టి రాకపోయినావా.. అంటూ “పోపో.. ఆ పని చెయ్యి ముందుగాల. "
“అమ్మా! వీటిని తెల్లారంగానే తీస్తాను.. ఆది వారం కదా బ్యాంకు ఉండదు".
“అయ్యగారు వాళ్ళు ఊరుకు పోయిండ్రు. బ్యాగుల డబ్బులు ఈ మూలకున్న గూడులో పైన చిన్న సోరిక బండ ఉన్నది.. దాంట్లో పెట్టుదాము.. బ్యాంకు కన్నా భద్రం. నువ్వు ఎవ్వరికీ చెప్పకు..” అంటూ దాచిపెట్టి ప్రశాంతంగా నిద్రపోయారు.
మర్నాడు చూసేవరకల్లా అక్కడ డబ్బులు లేకపోవడం ఆశ్చర్యం వేసింది. ఇంటికి కొత్త వాళ్ళు ఎవరూ రాలేదు. తమ్ముల స్నేహితులు పెరట్లో ఉన్నారు.
లెక్కల్లో లక్ష తక్కువ రావడంతో ప్రభాకరం ఇంటికి పోలీసులు రావడం.. దొంగ అని ముద్రించడం జైల్లో పెట్టి తమ పని తాము చేస్తామని బెదిరించి వెళ్ళారు.
‘దొంగను నేనే..’- ఒప్పుకున్నాడు ప్రభాకర్.
“చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తావా? చూసి ఊరుకుంటామా? మేము” అంటూ ఆ గ్రామం మున్సబ్ కొడుకు “ఇదంతా చూస్తుంటే ఎక్కడో పొరపాటు జరిగింది.
మా ప్రభాకరం అలాంటి వాడు కాడు..” అనీ ఆరా తీశాడు.
ఆ సమయంలో ఇద్దరు తమ్ముళ్లు తమ స్నేహితులతో ఆడుకుంటున్నారని తెలిసి వారందరిని పిలిచి “చూడండి! ప్రభాకరం అలాంటి మనిషి కాదు. మీలో ఎవరో ఒకరు చేసి ఉంటారు. నిజం చెప్పండి. లేకపోతే మీ అందరికీ శిక్ష పడుతుంది. " అన్నాడు.
అయినా నోరు మెదపలేదు. తమ్ముడు మాత్రం అమాయకంగా చూస్తూ భయపడుతుంటే,
ప్రక్కన స్నేహితులను నిలదీసి “మీ ఇంటిలో సోదా చేయాలి..” అంటూ తీసుకెళ్లారు.
పవన్ ఇంట్లో ఒక బ్యాగ్ లో దొరికాయి.
డబ్బుల కట్ట లో కొన్ని ఖర్చు అయినట్లు చెప్పాడు.
“పవన్! ఎందుకు చేశావు ఈ పని?” అని నిలదీయగా
“వాళ్ళు డబ్బులు దాచిపెడ్తూ మాట్లాడుకున్న మాటలు చాటు నుండి విన్నాను. అందరూ నిద్రిస్తున్నప్పుడు వచ్చి తీసుక పోయాను.” అన్నాడు.
“మిగతా డబ్బులు ఏం చేశావు?”
“పదివేలు రూపాయలు పాత బాకి తీర్చాను.”
“నువ్వు పోలీస్ స్టేషన్కు పదా” అని తీసుక పోతుంటే..
ప్రభాకరం అడ్డుపడి “తప్పు నాదే.. డబ్బును బ్యాంకులో పెట్టాల్సింది. వాళ్ల భవిష్యత్తు అంధకారం అవుతుంది. దొంగలుగా ముద్రించ కండి..” అంటూ “పెద్దవాడిని నేను. వాళ్ళను రక్షించే బదులుగా శిక్షించడం చాలా పెద్ద తప్పు.
వాళ్లలో నా తమ్ముళ్లు కూడా ఉన్నారు. వాళ్లకు డబ్బుల ఆశ చూపించే తప్పు చేసింది నేనే.” అన్నాడు.
పవన్ వెంటనే ప్రభాకరం కాళ్ళ మీద పడి “తప్పయింది సార్! నన్ను క్షమించండి” అని వేడుకున్నాడు.
పోలీసులు వెళ్లిపోవడంతో అందరూ సంతోషించారు.
బీదరికం బ్రతకడం నేర్పించాలి కాని బ్రతుకును కూల్చడం చేయ కూడదు. పవన్ తల్లి తండ్రి “మీరు చేసిన మేలుకు మేము రుణపడి ఉంటాము. మా కొడుకు మళ్ళీ ఏ తప్పును చేయకుండా సరిదిద్దుతాం ప్రభాకర్ గారు” అంటూ “మిగతా డబ్బులు రెండు మూడు రోజుల్లో మీకు అందజేస్తాము.
ఇంట్లో పిల్లల ప్రవర్తన గమనించక పోవడం మాదే తప్పు” అంటూ క్షమాపణలు చెప్పివెళ్లిపోయారు.
ఇలా ఆయన చేసిన మంచి పనులన్నీ ప్రచురించబడ్డాయి.
“రండి సుందరయ్య గారు” అనగానే పుస్తకం మూసివేసి, బయటకు రాగానే “మీరు రావడం మా భాగ్యం. మీకు ఏ సహాయమైనా చేయగలను, చెప్పండి.” అన్నాడు.
“ఇక్కడ ఒక ఔషధం సేవించడం కొరకు వచ్చాము.”
“అయ్యో! జబ్బు ఏమిటీ అండి"
“జబ్బు కాదండి, ఇక్కడ ఔషధం సేవిస్తే పుత్రసంతానం ప్రాప్తిస్తుందని చెప్పారు. మాకు ఇద్దరు అమ్మాయిలతో ఈసారి కొడుకు పుట్టాలని కోరిక. మా బంధువు ల్లో కొందరికి అనుకున్నట్టు కొడుకే పుట్టాడు. మాకు నమ్మకం ఏర్పడ్డది. ఇక్కడ మిమ్మల్ని చూశాక ఈ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉందని తెలుస్తుంది.”
“ఆ ఔషధం ఇచ్చేది మా తమ్ముడే. దగ్గర్లోనే ఉంటాడు.
నేను మీతో వస్తాను. ఉదయం వేళ పరగడుపున అక్కయ్య గారు ఆ ఔషధం తీసుకోవాలండి. ఒక గంట వరకు ఏమీ ఆహారం తీసుకో కూడదు. మంచి ఫలితాన్ని ఇస్తుంది.”
“మీరు ఫలహారాల ఆహార ప్రధాత అయితే మీ తమ్ముడు గారు పుత్ర సంతాన ప్రదాత. రామ లక్ష్మణులుగా సేవ చేస్తున్నారన్న మాట” అని సంతోషించారు.
“దూర ప్రాంతాల నుండి మీ మందు మీద నమ్మకంతో వేలమంది వచ్చి మారుమూల గ్రామానికి వస్తున్న ఫలితం పొందుతున్నారని ఈరోజు గవర్నమెంట్ తరఫున మీతో ఇంటర్వ్యూ కోసం వస్తున్నారంట. ఇప్పుడే నాకు ఫోన్ లో మెసేజ్ వచ్చింది.. మీకు అవార్డు కూడా ఇస్తారు.”
“అవునా. ఎంత శుభవార్త తెచ్చారు” అంటూ ఔషధాన్ని తయారు చేసి అందించాడు సుధాకర్.
“వస్తున్నారుగా మీరిద్దరూ ఆ అవార్డులు అందుకోవడానికి” అనగానే..
“సుందరయ్య గారు.. మాకు అవార్డులు ముఖ్యం కాదు. ఈ గ్రామంలో పెత్తందారుల జమీందారుల అధికారాన్ని అణగదొక్కి మా గ్రామ సంపదలు మేమందరం సమానంగా పంచుకోవాలి..”
“అవునా !"= మీ మంచి మనసులకు ఆ మాటలు సూట్ అవ్వడం లేదు"
“మా మంచి ఆలోచనలు సాధిస్తాయి. ఈ ఊరి అభివృద్ధి జరగడానికి ఈ ఊరి భూస్వాములే అడ్డంకులు.. వారివల్ల ప్రజలంతా ఎదుగు బొదుగు లేకుండా వారి అధీనంలో ఉన్నారు”.
**********
మరునాడుగ్రామంలో మూల మూల పోస్టర్లు వెలిశాయి. ఈ ఊరును దత్తత తీసుకొని అభివృద్ధి చేయడానికి వస్తున్న దేవేందర్ బాబు అంటూ కటౌట్స్ చూసి సామాన్య ప్రజలు ఒక్కొక్కరు చూసి మురిసిపోతున్నారు.
వారి సంతోషాన్ని చూసి గడీల, దొరలు, భూకామందులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
“నేను పెట్టింది మాత్రమే తింటూ నా మంచం కింద పండుకునే సోములూ.. ఆడ ఎవరో బొమ్మ చూసి సంతోషపడు తున్నావట. పదేళ్లకే నీ బిడ్డకు పెళ్లి చేయాలని పైసలు కావాలని నా కాళ్లు పట్టుకున్నావు కదరా మర్చిపోయా వారా? అట్లా నవ్వినందుకు నీకు శిక్ష ఏమిటో తెలుసా? నీ బిడ్డను నా కొడుకు గదిలోనికి పంపించరా” అంటూ జుట్టు పట్టుకున్నాడు.
“తప్పయింది దొరా! ఇంకోసారి అట్లా చెయ్యను..” అంటూ కాళ్ళు పట్టుకున్నాడు.
“ఇప్పుడు ఏం జరిగిందో ఊరంతటికీ చెప్పు. రేపు ఆ దేవేందర్ బాబును ఊళ్ళ అడుగుపెట్టకుండా చేయాల మీరంతా..”
“అట్లనే దొర” అంటూ గడగడ వణుక్కుంటూ బయటికి పోయి, సోములు జరిగిందంతా ప్రభాకరానికి చెప్పి బాధపడ్డాడు.
గడీల దొరకు బొమ్మను చూస్తేనే వద్దంటున్నాడు. మనిషే ఎదురైతే ఏం చేస్తాడో చూద్దాం. ప్రభుత్వనాయకులను తమ డబ్బు బలంతో కొని పడేసుకుని ఊరును, ప్రజలను చెప్పు చేతుల్లో పెట్టుకున్నాడు.
********
ఊర్లోని జమీందారు గడీల దొరల ఇంట్లో అర్ధరాత్రి ప్రవేశించిన గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో ‘భూములు దున్నవద్దు. వ్యవసాయం, పరిశ్రమలు బందు పెట్టాల’ అని, ‘ఈ విషయం ప్రభుత్వానికి చెప్తే ప్రాణాలు దక్క’ అని హెచ్చరిక చేశారట.
భూముల్లో జెండాలు పెడతారు అని భయపడుతున్నారు. ఈ విషయం తెలిసిన ప్రభాకర్, సుధాకర్ సంతోషించారు.
వెంటనే చిన్న సన్నకారు రైతులంతా తమ భూములను దున్నుకోవచ్చు అని ప్రకటన చేయించాడు.
కొద్ది రోజులలోనే ప్రజలందరూ తమ స్వేచ్ఛతో గ్రామాన్ని తీర్చిదిద్దుకున్నారు. ఎవరికి భయపడకుండా ఊరికి పాఠశాల, వైద్యశాల, మార్కెట్ యార్డ్, కావలసిన ఆఫీసుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. దొరలకు పని బందు పెట్టారు.
దొరలను, పెత్తందార్లను భయపెట్టింది మారు వేషం లో వచ్చిన ప్రభాకరం, సుధాకర్ లు అని తెలుసుకున్నారు ప్రజలు.
గ్రామ అభివృద్ధికి పెద్ద పీట వేశారని ప్రభుత్వం ఇద్దరినీ అవార్డుల తో సత్కరించింది.
శుభం.
యశోద గొట్టిపర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: యశోద గొట్టిపర్తి
హాబిస్: కథలు చదవడం ,రాయడం
Comments