top of page
Writer's pictureLV Jaya

మంచితనం



'Manchithanam' - New Telugu Story Written By L. V. Jaya

Published in manatelugukathalu.com on 14/03/2024 

'మంచితనం' తెలుగు కథ

రచన: L. V. జయ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జాగృతి చెన్నై లో ఒక IT కంపెనీ ఉద్యోగం చేస్తూ కృష్ణన్ గారి ఇంట్లో పేయింగ్ గెస్ట్ గా ఉండేది. 

కృష్ణన్ గారు, సుమతిగారు మంచి దంపతులు. చాలా మంచి వాళ్ళు, చదువుకున్న వాళ్ళు. కృష్ణన్ గారు రిటైర్ అయ్యారు. ఆయన భార్య సుమతి గారు బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నారు.


ఆ రోజు శనివారం. జాగృతి ఇంట్లోనే ఉంది. సుమతి గారు బ్యాంకు కి వెళ్లారు. కృష్ణన్ గారు బయట కూర్చొని పేపర్ చదువుతూ కాలక్షేపం చేస్తున్నారు. 


ఎండలో, ప్రతి ఇంటికి వెళ్తూ, ఎదో పేపర్ చూపిస్తూ కనపడ్డాడు ఒక అబ్బాయి కృష్ణన్ గారికి. కృష్ణన్ గారి ఇంటికి కూడా వచ్చాడు ఆ అబ్బాయి. అబ్బాయికి  14 -15 వయసు ఉంటుంది. మాసిన బట్టల్లో వున్నాడు. అక్కడక్కడా చిరిగి ఉంది. చాలా నీరసంగా, వొళ్ళంతా చమటలతో వున్నాడు. 


అబ్బాయి చేతిలో పేపర్ తీసుకుని చదివారు కృష్ణన్ గారు. "నేను 9th క్లాస్ వరకు చదివాను. 10th క్లాస్  చదవడానికి, ఎగ్జామ్స్ రాయడానికి డబ్బులు లేవు. నేను బాగా చదువుకుని, ఉద్యోగం చేసి నా కుటుంబాన్ని పోషించాలి. దయచేసి మీకు తోచినంత సాయం చెయ్యండి" అని ఇంగ్లీష్ లో రాసి ఉంది. అది చదివి, లోపలకి రమ్మని ఎన్ని సార్లు పిలిచినా ఆ అబ్బాయి రాలేదు. 


జాగృతిని పిలిచి, "ఈ అబ్బాయికి తెలుగు మాత్రమే వచ్చనుకుంటా. లోపలకి రమ్మను.ఏమి తిన్నట్టు కూడా లేడు. చాలా సేపటి నుండి ఎండలో తిరిగినట్టు వున్నాడు పాపం". జాగృతి ఆ అబ్బాయిని అడిగింది. ఏమి తినలేదని చెప్పాడు అబ్బాయి.


లోపలకి రమ్మని జాగృతి చాలా సార్లు చెప్పాక, భయంగా వచ్చాడు. కృష్ణన్ గారు, ఆ అబ్బాయిని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి, ప్లేట్ లో అన్నం, కూర ,పప్పు పెట్టి తినమన్నారు. 


"వద్దు అక్కా. వద్దని చెప్పు అంకుల్ కి " అన్నాడు అబ్బాయి జాగృతిని చూస్తూ.


"పర్వాలేదు. తిను. చాలా నీరసంగా వున్నావు." అంది జాగృతి. కృష్ణన్ గారు చాలా సార్లు తినమని  చెప్పాక చెయ్యి కడుక్కుని వచ్చి, ప్లేట్ తీసుకుని కింద కూర్చున్నాడు అబ్బాయి. కృష్ణన్ గారు లేపి, కుర్చీలో కూర్చోబెట్టి, పక్కనే తను కూడా ఆ అబ్బాయి పక్కనే కూర్చొని తిన్నారు. జాగృతి కూడా వాళ్ళ పక్కనే కూర్చుని తింది. చాలా మొహమాటంగా తిన్నాడు అబ్బాయి.తింటున్నంత సేపు కళ్ళలోంచి నీళ్లు వచ్చాయి ఆ అబ్బాయికి. 


తినడం అయ్యాక,జాగృతి తో అన్నారు కృష్ణన్ గారు "ఆ అబ్బాయిని అడుగు. ఎక్కడ నుండి వచ్చాడు? చెన్నై ఎందుకు వచ్చాడు? ఎలా వచ్చాడు?". 


"నీ పేరేంటి? ఎక్కడ నుండి వచ్చావ్? చెన్నై ఎందుకు వచ్చావ్?" అడిగింది జాగృతి.


"నా పేరు గిరి అక్కా. మాది తడ. ఆంధ్రానే. తమిళనాడు బోర్డర్ దగ్గర ఊరు. నాన్న ఉద్యోగం చేసేవాడు. తాగుడు అలవాటు అయ్యి, చాలా మంది దగ్గర అప్పులు చేసాడు. ఇప్పుడు లేడు.ఇంట్లో వున్నవి అన్నీ అమ్మిన అమ్మ ఆ అప్పులన్నీ తీర్చలేకపోయింది. ఎవరూ తెలియని చోటికి వెళ్ళిపోదామని, రైల్వే స్టేషన్ కి వచ్చి, ట్రైన్ ఎక్కి, ఇక్కడికి వచ్చాము." అని ఏడుస్తూ చెప్పాడు గిరి.


"అయ్యో. ఏడవకు. మీకు చుట్టాలు ఎవరూ లేరా?" అడిగింది జాగృతి.


"ఉన్నారు అక్కా. చుట్టాల దగ్గర కూడా అప్పు చేసాడు నాన్న." అన్నాడు అబ్బాయి.


"మరి ఇక్కడ ఏం చేస్తున్నారు? అమ్మకి పని దొరికిందా?" అడిగింది జాగృతి.


"ఇళ్ళు కట్టే చోట కూలీగా దొరికింది అక్కా." చెప్పాడు అబ్బాయి.


"మరి ఏంటి ప్రాబ్లెమ్. నువ్వు ఎందుకు ఇలా పేపర్ పట్టుకుని తిరుగుతున్నావు అయితే?" అడిగింది జాగృతి.    


"అమ్మ కి వచ్చేది అద్దెకి, తినడానికి సరిపోతోంది. అక్కడ వాళ్ళు నన్ను కూడా కూలి పని చెయ్యమన్నారు. అమ్మకి అది ఇష్టం లేదు. నన్ను చదివించాలి ఉంది. నాకు కూడా  చదువుకోవాలని ఉంది." చెప్పాడు గిరి. జాగృతి కి చాలా బాధ అనిపించింది గిరి గురించి విని. కాని 'చాలా మంది ఇలా ఏదేదో చెప్తారు. గిరి చెప్పింది నమ్మచ్చా? లేక అందరి లాంటి వాడేనా' అనుకుంది మనసులో. 


అబ్బాయి చెప్పిందంతా కృష్ణన్ గారికి చెప్పింది జాగృతి. "ఎంత కావాలో అడుగు " అన్నారు కృష్ణన్ గారు. అడిగింది జాగృతి. 10000 అని చెప్పాడు గిరి. వెంటనే, కృష్ణన్ గారు "ఇలా పేపర్ పట్టుకుని తిరుగుతూ ఉంటే 10000 ఎప్పటికి వస్తాయి? ఎప్పుడు చదువుతాడు? " అని కృష్ణన్ గారు తన రూమ్ లోంచి 8000 తెచ్చి ఇచ్చారు అబ్బాయికి. 


'ఎవరో తెలియని మనిషికి ఒకేసారి ఇంత డబ్బు ఇస్తున్నారు ఏంటి అంకుల్? ' అనుకుంది జాగృతి.


"నీ దగ్గర 2000 ఉంటే తీసుకు రా. నీకు తరువాత ఇస్తాను" అన్నారు జాగృతితో కృష్ణన్ గారు. తెచ్చి ఇచ్చింది జాగృతి.


"ఇంకెప్పుడైనా డబ్బులు కావలిస్తే నన్ను అడగమని చెప్పు. ఇలా చదువుకోవాల్సిన పిల్లలు రోడ్డు మీద తిరగకూడదు." అన్నారు కృష్ణన్ గారు. గిరి తో చెప్పింది జాగృతి.


గిరి కళ్ళలో నీళ్లు ఆగలేదు. " చాలా థాంక్స్ అంకుల్ . థాంక్స్ అక్కా. అంకుల్ లాంటి మంచి వాళ్ళని నేను ఎప్పుడూ చూడలేదు." అని అంకుల్ కాళ్ళకి దణ్ణం పెట్టి వెళ్ళాడు గిరి.  


సాయంత్రం ఆఫీస్ నుండి వచ్చిన సుమతిగారు,ఇల్లంతా దేని కోసమో చాలా కంగారుగా  వెతుక్కోవడం చూసి, "ఎమయ్యింది ఆంటీ. ఏం వెతుకుతున్నారు?" అడిగింది జాగృతి సుమతి గారిని.


"8000 ఉండాలి బీరువాలో. అవి కనపడటం లేదు. కొన్ని బిల్లులు కడదామని వుంచాను." అని భయపడుతూ అన్నారు సుమతిగారు.


"అంకుల్ ఉదయం ఒక అబ్బాయికి చదుకోవటానికి ఇచ్చారు ఆంటీ " అంటూ ఉదయం జరిగినదంతా చెప్పింది జాగృతి. "ఎనిమిది వేలు ఇచ్చారా?" అని ఆశ్చర్యపోయారు సుమతిగారు. కృష్ణన్ గారు ఏమి తెలియనట్టు దూరంగా కూర్చుని అన్నీ వింటూ నవ్వుకున్నారు. సుమతి గారు సర్దుకుని "పోనిలే. మంచి పని చేసారు. అంకుల్ ది చాలా మంచి మనసు. దొంగలు వచ్చి ఇంట్లో వున్నది మొత్తం తీసుకుపోయినా ఎదో అవసరం అయ్యి తీసుకుని వుంటారు అనుకోని ఇలాగే నవ్వుతూ వుంటారు." 


సుమతిగారిది సాయం చేసే గుణమే కాని ఎక్కువ మొత్తంలో ఇచ్చేసరికి కోపం, భాధ వచ్చినా కృష్ణన్ గారి ఎదురుగా ఏమి అనలేక, ఆయనకి వినపడకుండా " కాని ఎంత మందికి ఇలా? ఇప్పటికే చాలా మందికి ఇచ్చారు. వచ్చినవాళ్ళు అందరూ నిజం చెప్తారో లేక ఊరికే డబ్బులు తీసుకుని వెళ్ళిపోతారో నాకు ఎప్పటికి అర్ధం కాదు. అందుకే ఇంట్లో డబ్బులు పెట్టినా అంకుల్ కి చెప్పను. అయినా కనపడిపోతాయి. ఎవరో ఒకరికి ఇలా సాయం పేరుతో ఇచ్చేస్తారు. ఇంట్లో వాళ్ళ గురించి కూడా కొంచెం ఆలోచించాలి కదా."అని తన భాధ చెప్పుకున్నారు సుమతిగారు. 


సంవత్సరం తరువాత గిరి ఇంటికి వచ్చి కృష్ణన్ గారి కాళ్ళకి దణ్ణం పెట్టి, చేతిలో వున్న పేపర్ చూపించాడు. అది చూసి మురిసిపోతూ, కృష్ణన్ గారు ఆనందంతో గిరి ని హత్తుకున్నారు. గిరి కళ్ళలో నీళ్లు తిరిగాయి. అది 10th క్లాస్ పాస్ అయిన సర్టిఫికెట్. "ఆంటీ కి చూపించు" అన్నారు కృష్ణన్ గారు గిరి తో. సుమతిగారు కూడా చాలా ఆనందించారు. "ఇంకా బాగా చదువు" అని దీవించి, భోజనం పెట్టి పంపారు. 


"అందరూ చెడ్డ వాళ్ళు కాదు. నిజం చెప్పి, సాయంకోరే వారు కూడా వుంటారు. మన దగ్గర వున్న డబ్బు కొంత పోయినా పర్వాలేదు. ఒక్కళ్ళకైనా మనం నిజంగా సాయపడగలిగితే అది చాలు." అన్నారు కృష్ణన్ గారు.


'మనుషుల్లో మంచితనం ఇంకా ఉంది అని ఇలాంటి వాళ్ళని చూస్తే అనిపిస్తుంది' అనుకుంది జాగృతి.

***సమాప్తం***


L. V. జయ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం : LV జయ

నా పేరు LV జయ. 
https://www.manatelugukathalu.com/profile/jaya

నాకు చిన్నప్పటి నుండి తెలుగు కథలు, పద్యాలూ, సాహిత్యం, సంగీతం అంటే చాలా ఇష్టం. 
ఏ విషయాన్ని అయినా సరదాగా తీసుకునే అలవాటు. అదే నా కథల రూపంలో చూపించాలని చిన్న ప్రయత్నం చేస్తున్నాను. మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను.

ధన్యవాదాలు


104 views0 comments

Commentaires


bottom of page