#మంచుతాకినప్రేమ, #ManchuThakinaPrema, #ChaithraShreeSaiJyothi Chinthakrindi, #చైత్రశ్రీసాయిజ్యోతిచింతక్రింది, #TeluguSerials, #TeluguNovel, #TeluguLoveStories, #తెలుగుప్రేమకథలు
![](https://static.wixstatic.com/media/acb93b_effb2fb8b44e4441996b186671909694~mv2.jpg/v1/fill/w_500,h_500,al_c,q_80,enc_auto/acb93b_effb2fb8b44e4441996b186671909694~mv2.jpg)
Manchu Thakina Prema - Episode 10 - New Telugu Web Series - Written By - Chaithra Shree Sai Jyothi Chinthakrindi Published In manatelugukathalu.com On 04/02/2025
మంచు తాకిన ప్రేమ - ఎపిసోడ్ 10 - తెలుగు ధారావాహిక
రచన: చైత్ర శ్రీ సాయి జ్యోతి చింత క్రింది
కథా పఠనం: పెనుమాక వసంత
జరిగిన కథ:
శ్రీనగర్ కు కొంత దూరాన ఉన్న బని హాల్ ప్రాంతంలో సినిమా షూటింగ్ జరుగుతూ ఉంటుంది. అంతలో కొండ చరియలు విరిగి పడబోతున్నట్లు హెచ్చరిక వినపడుతుంది.
గతంలో ఇదే ప్రదేశంలో కాలేజ్ విద్యార్ధుల టూర్ లో రవి, హిమతో ఒక షార్ట్ ఫిలిం తీస్తూ ఉంటాడు. అందులో హిమకు ప్రపోజ్ చేస్తాడు. టూర్ లో ఉండగానే నిజ జీవితంలో కూడా హిమకు ప్రపోజ్ చేస్తాడు రవి. తమ ప్రేమ నిజమైతే మరో పది రోజుల్లో తిరిగి కలుస్తామని చెబుతాడు. హిమ, రవి క్లోజ్ గా ఉన్న ఫోటోలు చూసిన హిమ తలిదండ్రులు ఆమెను అనుమానిస్తారు. అరకు టూర్ వెళ్లిన హిమను రవి కలుస్తాడు.
ఇక మంచు తాకిన ప్రేమ - ఎపిసోడ్ 10 చదవండి.
రవికాంత్ చెబుతూ ఉండగా హిమ తన తలని అతని భుజంపై వాల్చి కళ్ళు మూసుకుని వింటుంది. చెప్పడం ముగిసే సరికి మనసులోని బాధ కన్నీళ్ళ రూపంలో కరిగి చెక్కిలి పైనుండి అతని హృదయాన్ని తడుతుంది.
వెచ్చని కన్నీటి స్పర్శకు అతడు చలించి, హిమకు మరింత చేరువయ్యి ఆమె మోముని చేతుల్లోకి తీసుకొని చేతి వేళ్ళతో కన్నీటిని తుడుస్తూ, “పిచ్చి తింగరి.. ఇప్పుడు ఏం జరిగిందని ఏడుస్తున్నావు. నాపై నమ్మకం ఉంచి ధైర్యంగా ఉండు. నేను చూసుకుంటాను.. సరేనా?”
అతనికి కొంచెం దూరంగా జరిగి ఉబికి వస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ సరే అని చెబుతుంది..
“చూడు హిమ.. నీ నవ్వే నా ధైర్యం. నీ కన్నీరే నా భయం. నవ్వుతూ ధైర్యంగా నా పక్కన నిలబడు చాలు, అన్నీ నేను చూసుకుంటాను.. మన ప్రేమ చేసిన మ్యాజిక్ చూశావు కదా! మన ప్రేమపై నాకు నమ్మకం ఉంది. కచ్చితంగా మన ప్రేమ గెలుస్తుంది..
అయినా ఇవాళ నా లైఫ్ లో ఎంతో విలువైన రోజు. ఈ రోజుని ఈ విధంగా వేస్ట్ చేసుకోలేను. ఆరోజు నువ్వు చెప్పాలనుకున్న మాట ఈరోజు నేను వినాలనుకుంటున్నాను” అని హిమ కళ్ళల్లోకి చూస్తూ అడుగుతాడు..
“హలో.. నువ్వు వినాలని అనుకున్నా, ఇక్కడ చెప్పడానికి ఎవ్వరూ రెడీగా లేరు. ఆరోజు నేను చెప్పాలి అనుకుంటే చెప్పనీయకుండా ఆపేసావు. ఇప్పుడెందుకు చెప్తా నేను?” అంటూ అక్కడి నుంచి లేచి కొంచెం దూరంగా నడుస్తుంది.
“ప్లీజ్ హిమ చెప్పు.. వినాలని ఉంది.”
“నేను చెప్పను గా” అంటూ హిమ ఎర్రని గులాబీ తోటలో పరుగులు తీస్తూ వెళుతుంది..
ఆమెను అనుసరిస్తూ రవికాంత్ తన వెనుక పరుగులు తీస్తూ వెళతాడు. అలా కొంత దూరం హిమ రవికాంత్ కి దొరకకుండా పరిగెడుతుంది. చివరికి రవికాంత్ హిమ చేతిని పట్టుకుని తన పరుగుకి ఎదురు వచ్చి నిలుస్తాడు.
“చెప్పు మై డియర్ క్యూట్ తింగరి! ప్లీజ్..” అంటూ రొప్పుతూ ఆయాస పడుతూ అడుగుతాడు.
“నేను చెప్పను” అంటూ అదే విధంగా సమాధానం ఇస్తుంది హిమ.
‘ప్లీజ్’ అంటూ ఆమెకు చేరువుగా జరుగుతాడు. హిమ కూడా వెనక్కి వెనక్కి జరుగుతుంది.
“రవి.. చెయ్యి వదులు” అంటూ కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ చెబుతుంది.
అతను ‘వదలను..’ అంటూ ఇంకొంచెం ముందుకు వస్తాడు.
“ఇదిగో.. ఇలా చేస్తే నేను ఇక్కడ ఉండను. వెళ్ళిపోతాను..”
“తప్పదు. అప్పుడప్పుడు నా కోతి వేషాలను భరించాలి. నా అల్లరిని తట్టుకోవాలి. చూడు.. లొకేషన్ ఎంత బాగుందో. దూరంగా జలపాతం, దగ్గరగా సోయకళ్ళ ఇంద్రజాలం. దూరంగా సొగసైన పచ్చని ప్రకృతి వనం, దగ్గరగా గుప్పుమంటూ విరజిమ్మే గులాబీల సుగంధం.
మనసు లోతుల్లో దాగిన పచ్చని ఆలోచనలకు ఊపిరి పోయడానికన్నట్టు అప్పుడప్పుడు వచ్చి పలకరించే చల్లని గాలి. మరి ఇంత మంచి సమయంలో మన ప్రేమకి మన ఇద్దరి తరపున ఒక మంచి బహుమతి ఇస్తే బాగుంటుంది” అంటూ ఆమె వైపు నవ్వుతూ చూస్తూ చెబుతాడు..
“ఆ బహుమతి ఏదో నువ్వే ఇచ్చుకో. నీ ఆలోచన ఏంటో నాకు అర్థమైంది. నేను వెళ్ళిపోతాను..”
“ఏయ్ సారీ! ఇంకా అలా మాట్లాడనులే కానీ నిజంగా నీకు ఒక సప్రైజ్ కళ్ళు మూసుకో!”
“సర్ప్రైజ్.. ఏంటది?”
“ముందు నువ్వు కళ్ళు మూసుకో”
“ఇదిగో ముందే చెప్తున్నా.. కళ్ళు మూసుకున్న తర్వాత ఏమైనా పిచ్చి వేషాలు వేసానుకో.. నేను అస్సలు క్షమించను”
“అయ్యో హిమ.. నీకు నచ్చని పనులు నేను ఎందుకు చేస్తాను చెప్పు. అలాంటిదేమీ లేదు. నువ్వు ఏమి డౌట్ పడకు. హ్యాపీగా కళ్ళు మూసుకో..”
హిమ కళ్ళు మూసుకోగానే ఒక గిఫ్ట్ ప్యాక్ తన చేతిలో పెడతాడు.
“ఏంటిది?”
“ఒక్క నిమిషం. ఓపెన్ చేస్తాను. అప్పుడు కళ్ళు తెరిచి చూడు”
దాన్ని ఓపెన్ చేసి, “హా తింగరి.. ఇప్పుడు కళ్ళు తెరిచి చూడు”.
అది లవ్ సింబల్ షేప్ లో రెడ్ కలర్ లో అందమైన డిజైనింగ్ తో హిమబిందు రవికాంత్ పేర్లతో ఉన్న పౌచ్ అది.
“ఇందులో ఏముంది నువ్వే ఓపెన్ చేసి చూడు హిమ”
ఆ పౌచ్ ని చేతిలోకి తీసుకొని ఓపెన్ చేసి చూస్తుంది. దాంట్లో మరో రెండు లవ్ సింబల్ లో ఉన్న చిన్న చిన్న పౌచ్ లు ఉన్నాయి. అవి ఓపెన్ చేసి చూసి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. అవి ఒకే మోడల్ లో ఉన్న రెండు ఐ ఫోన్స్..
అందులో ఒకటి తీసి “హిమ, నీకోసమే ఇవి తీసుకున్నాను. ఇద్దరికీ ఒకేలాంటి మొబైల్స్ కొన్నాను. ఇక మన ఇద్దరి మధ్య కొంచెం దూరం కూడా ఉండకూడదు. వన్ మినిట్ కో మెసేజ్. వన్ అవర్ కో కాల్. ప్రతి సెకండ్ అప్డేట్స్ అందిస్తూ ఉండు. ఓకేనా”.
“నీ సర్ప్రైజింగ్ చాలా నచ్చింది. కానీ రవి.. ఇప్పుడు ఎందుకు అనవసరమైన ఖర్చు?”
“హిమ.. ఈరోజు కోసం నేను ఎంతలా ఎదురు చూశానో నీకు తెలియదు. అందుకే ఎప్పుడో కొనేసి బ్యాగ్ లో పట్టుకొని తిరుగుతున్నాను. ఈరోజు వస్తుందని నాకు నమ్మకం ఉంది..
ఇక డబ్బులు గురించి అంటావా.. వాటి గురించి నేను అంతగా ఆలోచించలేదు. కొన్ని మెమొరబుల్ మూమెంట్స్ ని డబ్బుతో లెక్క కట్టలేము. నాకు ఈ మూమెంట్ క్షణాలు ఎంతో ఆనందాన్ని ఇచ్చాయి. దాని ముందు నేను ఖర్చుపెట్టిన డబ్బు నాకు ఏ మాత్రం లెక్కలోనికి రాదు. కాబట్టి నువ్వు కూడా దాని గురించి ఆలోచించకు..”
“సరే రవికాంత్. నువ్వు ఇచ్చిన మొదటి గిఫ్ట్ ని ఎంతో పదిలంగా దాచుకుంటాను” అంటూ ఆ మొబైల్ ని తన హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకుంటుంది..
“అవును అడగడం మర్చిపోయా.. ఇంతకీ ఆ షార్ట్ ఫిలిం రిలీజ్ చేయలేదు కదా, అప్పుడే రిలీజ్ చేయవద్దు. మా ఇంట్లో చాలా కోపంగా ఉన్నారు. టైం చూసుకొని రిలీజ్ చెయ్..”
“ఓకే మేడం. మీరు ఆర్డర్ వేయడం నేను అమలపరచకపోవడమా”
“చాల్లే.. కొంచెం ఓవర్ గా లేదూ..”
“వన్ పర్సెంట్ కూడా లేదు హిమ..”
“హిమ.. అమ్మ కాల్ చేస్తుంది. నేనొక్కసారి వెళ్లి వచ్చేస్తాను. అసలు ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నానంటే దానికి కారణం అమ్మే. నన్ను బలవంతంగా ఇక్కడికి తీసుకు వచ్చిందని తిట్టుకున్నాను. నీకోసమే తీసుకువచ్చిందని ఇప్పుడు అర్థమైంది..
నీ గురించి ఇంట్లో తెలుసు. వాళ్లకి ఏ ప్రాబ్లం లేదు. అయితే నిన్ను ఇప్పుడు తీసుకువెళ్లి పరిచయం చేయలేను. దానికి కొంత సమయం పడుతుంది. అందుకే నిన్ను ఒంటరిగా వదిలి వెళ్లాల్సి వస్తుంది. ఫైవ్ మినిట్స్ లో వచ్చేస్తాను” అంటూ వెళ్తాడు రవికాంత్..
***
“హలో నేహా చెప్పు”
“ఏంటక్కా ఇలా చేశావు.. ఎక్కడికి వెళ్ళిపోయావు చెప్పకుండా, పెదనాన్న కాల్ చేశారు. ఏదో పని ఉండి వైజాగ్ వచ్చారంట. ఇక్కడికి వచ్చి నిన్ను తీసుకెళ్తాను అని అంటున్నారు. చాలా సీరియస్ గా ఉన్నారు. నాకు భయం వేస్తుంది. తొందరగా ఎక్కడున్నా ఎంట్రన్స్ గేట్ దగ్గరకు వచ్చేసే అక్క. పెదనాన్న నీకు చాలా సార్లు కాల్ చేశారంట. నువ్వు లిఫ్ట్ చేయలేదు. అయినా ఏమైంది అక్క.. అసలు పెదనాన్న వాయిస్ వింటే చాలా భయం వేసింది తెలుసా.. ముందు నువ్వు ఎక్కడున్నా అర్జెంటుగా వచ్చేసేయ్..”
“సరే నేహా” అంటూ ఎంతో దిగాలుగా ఫోన్ కట్ చేస్తూ ‘చ.. ఈమధ్య అన్ని ఇలాగే జరుగుతుంది. మనస్ఫూర్తిగా సంతోషంగా ఉన్నాను అని అనుకునే లోపే ప్రమాదం ముంచుకు వచ్చేస్తుంది. అప్పటివరకు పువ్వువలె ఆనందంగా విచ్చుకున్న మొహం వాడిపోయిన పువ్వు వలె వాలిపోతుంది. అయినా నాన్న నాకు ఫోన్ చేశారా..’ అంటూ మొబైల్ తీసి చూసుకుంటుంది.
‘అరే.. ఫోన్ సైలెంట్ లో ఉంది. 10 మిస్డ్ కాల్స్.. ఇంకేముంది.. ఇవ్వాళ నా పని అయిపోయినట్టే..’
‘రవికాంత్ కి కాల్ చేసి చెప్పి వెళ్దాము. మళ్లీ తను కంగారు పడతాడు. ఈ సిగ్నల్స్ కూడా ఇప్పుడే పోవాలా.. సరే వెళ్ళిన తర్వాత పరిస్థితిని బట్టి తనకి కాల్ చేస్తాను’ అనుకుంటూ వెళ్తుంది హిమబిందు..
“అమ్మా నేహా! మీ అక్కని వచ్చి కారెక్కమని చెప్పు.. నువ్వు కూడా ట్రిప్ అయిపోగానే ఫ్రెండ్స్ తో జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు, అయినా మీ ఆడపిల్లల్ని నమ్మి ఇంట్లో వాళ్లు బయటకి పంపిస్తారు మీ ఆనందం కోసం. కానీ మీరు తల్లిదండ్రులకు తలవంపులు తెచ్చే పనులు చేస్తారు, ఇదిగో ఇలా నా కూతురు లాగా.. నిలబడి చూసింది చాలని, చెప్పమ్మా మీ అక్కకి. త్వరగా వచ్చి ఎక్కమను”
ఆ మాటలకు హిమాకి ఎంతో ఏడుపొచ్చింది. నేనేం తలవంపులు తెచ్చే పనులు చేశాను.. అసలు నాన్న ఏం మాట్లాడుతున్నాడు.. అంటూ మౌనంగా కార్ డోర్ తీసుకొని లోపలికి వెళ్లి కూర్చుంటుంది..
అరగంట నుండి ఆ ప్రయాణం నిశ్శబ్దంగా పయనిస్తుంది. నాన్న కోపం అతని డ్రైవింగ్ లో హిమాకు స్పష్టంగా తెలుస్తుంది. ‘నాన్న.. మరి నా బాధ నా కన్నీళ్లలో నీకు తెలియడం లేదా’ అని మనసులోనే నాన్నని ప్రశ్నిస్తుంది హిమ..
“హలో.. ఆ బాబు చెప్పు. వచ్చే వారంలో మంచి ముహూర్తం ఉందంట. నిశ్చితార్థం అప్పుడు పెట్టుకుందాము. మిగిలిన విషయాలు నేను ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడుతా..”
ఆ మాటలను బట్టి నాన్న మాట్లాడింది ఆ ప్రభాకర్ తో నేనని హిమకు అర్థం అయింది. ఇక ఆలస్యం చేయకూడదు. నాన్నకి రవికాంత్ గురించి చెప్పాల్సిందే.. అని దృఢంగా నిశ్చయించుకొని ధైర్యాన్ని అంతా కూడగట్టుకుని ‘నాన్నా’ అంటూ భయం, బాధ కూడిన స్వరంతో పిలుస్తుంది. నాన్నకి వినిపించినా వినిపించినట్టు ఉండడంతో మరోసారి ‘నాన్నా’ అంటూ పిలుస్తుంది.
‘ఏంటి’ అంటూ కఠినమైన స్వరంతో అడుగుతాడు
“:నాన్నా. నీతో కొంచెం మాట్లాడాలి..”
“రవికాంత్ గురించేగా.. మాట్లాడదాం. కొంచెం ఓపిక పట్టు. ఇంటికి వెళ్లిన తర్వాత డీటెయిల్ గా మాట్లాడుకుందాం..”
***
“అమ్మా! నాకు చాలా సంతోషంగా ఉంది” అంటూ రవికాంత్ తన చేతులతో అమ్మని చుట్టి వేసి తన ఆనందాన్ని తెలియజేస్తాడు..
“ఏంటి నాన్నా.. ఎందుకు అంత సంతోషం”
“హిమ కలిసిందమ్మా. తనని నేను కలిశాను”
“అవునా..”
“నువ్వు ఇక్కడికి తీసుకురాబట్టే నేను తనని కలవగలిగాను. అందుకే మా అమ్మకి ఎన్నిసార్లు థాంక్స్ చెప్పినా తక్కువే.”
“అమ్మకు ఎవరైనా థాంక్స్ చెప్తారా.. ఏది.. నా కోడలిని నాకు చూపించవా”
“చూపిస్తానమ్మా. ఖచ్చితంగా చూపిస్తాను. కానీ ఇప్పుడు కాదు. దానికి కొంచెం టైం ఉంది.. సరేగాని ఎందుకు ఫోన్ చేసావ్”
“ఏమీ లేదురా. ఎక్కడున్నావు అని చేశాను. అంతే”
“ఓ.. అంతేనా. సరే నాకు కొంచెం పని ఉంది. ఇప్పుడే వస్తాను”
“సరే త్వరగా వచ్చేయ్..”
‘హిమ.. హిమ’ అనుకుంటూ ఇందాక హిమని వెయిట్ చేయమని చెప్పిన ప్లేస్ కి వస్తాడు. ఎంత వెతికినా హిమ కనిపించకపోవడంతో, ఏమైందో అర్థం కాక అటు ఇటు తిరుగుతూ వెతుకుతూ ఉంటాడు. ఏదో గుర్తొచ్చినట్టు మొబైల్ తీసి చూసుకొని మెసేజ్ కనిపించడంతో ఓపెన్ చేసి చూస్తాడు.
‘రవి.. నాన్న వచ్చారు. నేను వెళ్తున్నా. వీలు చూసుకుని ఫోన్ చేస్తా. అంతవరకు నాకు కాల్ చేయకు’ అని మెసేజ్ ఉండడంతో చుట్టూ ఉన్న ప్రకృతి అంతా శూన్యంగా కనిపిస్తుంది. పట్ట పగలే కనుల ముందు చీకటి ఆవహిస్తుంది..
మొబైల్ జేబులో పెట్టుకుని ఆ ప్లేస్ లో అలాగే నిలబడిపోతాడు.
“ప్రమాదం.. ప్రమాదం. నీ చుట్టూ ఆ అమ్మాయి రూపంలో అపాయం తిరుగుతుంది. నీకు రక్ష కావాలి” అనుకుంటూ అంతకుముందు కనిపించిన సాధువు మళ్లీ రవికాంత్ కు కనిపిస్తాడు.
అతన్ని చూసి అసలే చిరాకులో ఉన్న రవి, “ఏయ్! ఏంటయ్యా నీ గోల? అప్పటినుండి చూస్తున్నాను.. నా చుట్టూ ప్రమాదం అని చెప్పి తిరుగుతావ్. ఏంటి.. నీకు కావలసిన డబ్బులే కదా.. ఇదిగో ఈ 100 తీసుకో” అని జేబులో నుంచి 100 తీసి అతని చేతుల్లో పెడతాడు..
=======================================================================
ఇంకా వుంది
మంచు తాకిన ప్రేమ - ఎపిసోడ్ 11 త్వరలో
========================================================================
చైత్ర శ్రీ సాయి జ్యోతి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
![](https://static.wixstatic.com/media/acb93b_86c2d95c592f4ef0a71d07b945dc2a46~mv2.jpg/v1/fill/w_581,h_692,al_c,q_85,enc_auto/acb93b_86c2d95c592f4ef0a71d07b945dc2a46~mv2.jpg)
రచయిత్రి పరిచయం: https://www.manatelugukathalu.com/profile/saijyothi
చైత్ర శ్రీ. సాయి జ్యోతి చింత క్రింది.
వృత్తి జూనియర్ అసిస్టెంట్ జిల్లా పరిషత్ నూతక్కి ఉన్నత పాఠశాల, గుంటూరు జిల్లా.
ప్రవృత్తి నవలలు, కథలు, కవితలు. వ్రాయడం.
సాంఘిక మాధ్యమాల ద్వారా రచనలను పోస్ట్ చేస్తూ ఉండడం...
Comments