top of page

మంచు తాకిన ప్రేమ - ఎపిసోడ్ 13

#మంచుతాకినప్రేమ, #ManchuThakinaPrema, #ChaithraShreeSaiJyothi Chinthakrindi, #చైత్రశ్రీసాయిజ్యోతిచింతక్రింది, #TeluguSerials, #TeluguNovel, #TeluguLoveStories, #తెలుగుప్రేమకథలు


Manchu Thakina Prema - Episode 13 - New Telugu Web Series - Written By - Chaithra Shree Sai Jyothi Chinthakrindi Published In manatelugukathalu.com On 23/02/2025

మంచు తాకిన ప్రేమ - ఎపిసోడ్ 13 - తెలుగు ధారావాహిక

రచన: చైత్ర శ్రీ సాయి జ్యోతి చింత క్రింది  

కథా పఠనం: పెనుమాక వసంత


జరిగిన కథ:


శ్రీనగర్ కు కొంత దూరాన ఉన్న బని హాల్ ప్రాంతంలో సినిమా షూటింగ్ జరుగుతూ ఉంటుంది. అంతలో కొండ చరియలు విరిగి పడబోతున్నట్లు హెచ్చరిక వినపడుతుంది.


గతంలో ఇదే ప్రదేశంలో కాలేజ్ విద్యార్ధుల టూర్ లో రవి, హిమతో ఒక షార్ట్ ఫిలిం తీస్తూ ఉంటాడు. అందులో హిమకు ప్రపోజ్ చేస్తాడు. టూర్ లో ఉండగానే నిజ జీవితంలో కూడా హిమకు ప్రపోజ్ చేస్తాడు రవి. తమ ప్రేమ నిజమైతే మరో పది రోజుల్లో తిరిగి కలుస్తామని చెబుతాడు. హిమ, రవి క్లోజ్ గా ఉన్న ఫోటోలు చూసిన హిమ తలిదండ్రులు ఆమెను అనుమానిస్తారు. అరకు టూర్ వెళ్లిన హిమను రవి కలుస్తాడు.

అక్కడకు వచ్చిన హిమ తండ్రి హిమను ఇంటికి తీసుకొని వెళతాడు. హిమకు కాల్ చేస్తాడు రవి. హిమని ఇంటి దగ్గర కలిసివచ్చిన రవిని రౌడీలతో కొట్టిస్తాడు ప్రభాకర్. 



ఇక మంచు తాకిన ప్రేమ - ఎపిసోడ్ 13 చదవండి.


"లక్ష్మీ! సరుకులు పట్టి రాయడం అయిపోయింది. ఒకసారి వచ్చి చూడు. మళ్ళీ తీసుకు వచ్చిన తర్వాత అది తేలేదు ఇది తేలేదు అంటే కష్టం.”

 

వంట గదిలో నుండి బయటకు వస్తూ “రెండుసార్లు చెక్ చేసి మరీ రాసానండి. అవే.. ఇంకేం అవసరం లేదు. అయ్యో.. అన్నట్టు మర్చిపోయాను. మన అబ్బాయికి తగ్గిన తర్వాత అమ్మవారి గుడిలో పూజ చేయిస్తానని మొక్కుకున్నాను. పూజకు సంబంధించిన వస్తువులు కూడా తీసుకురండి.”

 

“చివరిదాకా ఏదో ఒకటి చెప్తూనే ఉంటావుగా. నువ్వు రాసిచ్చిన లిస్టు చూసి నేను మళ్లీ ఇంకొకసారి రాస్తాను. అయినా గాని ఏదో ఒకటి మర్చిపోతావు.”

 

“గుమ్మం బయట నిలబడి ఈ సంభాషణ అంతా వింటున్న హిమబిందుని చూసి, “లక్ష్మి.. అటు చూడు ఎవరో వచ్చారు.”

 

“హిమబిందు, రామ్మా. అలా గుమ్మం బయట నిలబడ్డావ్ ఏంటి” అంటూ లక్ష్మి ఆనందంగా హిమకు స్వాగతం చెబుతూ చెయ్యి పట్టుకొని తీసుకొని వస్తుంది.. 


కుర్చీ చూపిస్తూ “కూర్చో అమ్మ హిమబిందు, రవికాంత్ వాళ్ళ నాన్న” అంటూ సోఫాలో కూర్చున్న నాన్నని చూపిస్తుంది.. 


“నమస్తే అంకుల్! బాగున్నారా?”

 

“బాగున్నానమ్మా. ఇంట్లో అమ్మానాన్న అందరూ బాగున్నారా అమ్మా.”

 

“బాగున్నారు అంకుల్”. 


“ఆంటీ! రవికాంత్ ఎక్కడ?”


“డాబా పైన ఉన్నాడమ్మా. అదే.. మొన్న ఈ మధ్య వాడికి యాక్సిడెంట్ అయింది కదా, అంతా పర్లేదు గాని కాలు నొప్పి తగ్గట్లేదు. కొంచెం వాకింగ్ చేయమని డాక్టర్ చెప్పాడు. అందుకని రోజు సాయంత్రం పూట డాబా పైన ఒక గంట నడుస్తున్నాడు.”

 

“సారీ ఆంటీ! ఇదంతా నా వల్లే.”

 

“చా.. నువ్వెందుకు సారీ చెప్తావురా. అది జస్ట్ యాక్సిడెంట్ అంతే. అయినా వాడు నీకు చెప్పొద్దు అని అనుకున్నాడు. అయినా వాడి కష్టం నీకు తెలియకుండా ఉంటుందా. 


సరే అవన్నీ వదిలేయ్.. ఏం తీసుకుంటావు.. కాఫీ పెట్టనా టీ పెట్టనా లేదంటే ఏదైనా టిఫిన్ తయారు చేయనా?”


“ఇప్పుడేమి వద్దు ఆంటీ. నేను రవికాంత్ ని కలిసి వస్తాను.”

 

“సరే అమ్మా. స్టెప్స్ లెఫ్ట్ సైడ్ ఉన్నాయి”

“ఓకే ఆంటీ..”

 

మెట్లు ఎక్కుతున్న హిమకి తను తీసుకున్న నిర్ణయం గుర్తుకు వచ్చి హృదయం బరువుతో పాదం భారంగా పడుతుంది. 


డాబా పైన అతి కష్టం గా నడుస్తున్న రవికాంత్ ని చూసి హిమ కళ్ళు చమర్చాయి. 


హిమ రావడం గమనించని రవికాంత్ కష్టాన్ని భరిస్తూ బలవంతంగా అడుగుని కదపడానికి ప్రయత్నిస్తూ విఫలమవుతున్నాడు. 


“రవి,..” అని హిమ గొంతు వినిపించగానే తల ఎత్తి హిమవైపు చూసి “హిమ.. నువ్వేంటి ఇక్కడ” అంటూ కష్టంగా నడుచుకుంటూ హిమ దగ్గరకి రాబోతుండగా, 

“వద్దు. నువ్వు అక్కడే ఉండు” అంటూ రవి దగ్గరకు వెళ్లి మౌనంగా అతన్ని అలాగే చూస్తూ నిలబడిపోతుంది. 


హిమబిందు రవికాంత్ కి ఎంతో కొత్తగా కనిపిస్తుంది. ‘ఏంటి ఈ అమ్మాయి ఎప్పటిలాగా గొడవ పడలేదు. కొట్టి, ఏడ్చి నాకెందుకు చెప్పలేదు అని అడుగుతుంది అనుకున్నా. ఇలా మౌనంగా ఉందేంటి’ అని ఆలోచిస్తూ ఉన్న రవికాంత్ తో, 


“నాకు ఎందుకు చెప్పలేదు”. 


“హిమ.. అది చెబుదామనే అనుకున్నాను కానీ..”

 

“వద్దు. నువ్వేమీ చెప్పొద్దు. ఈరోజు నువ్వు చెప్పేది వినడానికి నేను రాలేదు. నేను చెప్పాల్సింది చెప్పడానికి వచ్చాను.. 



రవి.. నేను చెప్పేది జాగ్రత్తగా విను.

నన్ను, నా ప్రేమని మర్చిపో. 

నీ కెరియర్ పైన కాన్సన్ట్రేషన్ చేయి. 

నువ్వు కన్న కలనీ నిజం చేసుకొని నీ గెలుపుతో నిన్ను తక్కువగా చూసిన వాళ్లందరికీ సమాధానం ఇవ్వు.. 


నన్ను ప్రేమించిన పాపానికి నువ్వు ఇలా ఇబ్బంది పడడం నేను చూడలేను రవి. ప్లీజ్.. నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో.”

 

ఆ మాటలు విన్న రవికాంత్ కి ఒక్క నిమిషం భూమి గిర్రున తిరిగినట్టు, ఊపిరి గాలి అందక కొట్టుమిట్టులాడినట్టు, చలనం లేని శరీరాన్ని బరువుగా మోస్తున్నట్టు అనిపించింది. 


హిమ నుండి వచ్చే ఇంకొక మాట కూడా వినలేనట్టుగా హిమని రెండు చేతులతో గట్టిగా పట్టుకుని “నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతుందా హిమ.. నా శరీరానికి తగిలిన గాయాల కన్నా నువ్వు ఇలాంటి మాటలు చెప్పి నా మనసుకు చేసిన గాయం వల్ల వచ్చిన బాధ ఎక్కువగా ఉంది.. 


ఇంత సులువుగా ప్రేమని వదులుకోమంటావా? మీ నాన్నగారితో మాట్లాడదాము. ఓపికతో ఎదురు చూద్దాం. బతిమిలాడి ఒప్పించుకుందాం. ఆ ప్రభాకర్ని ఎదుర్కొందాం. ప్లీజ్ హిమ.. నువ్వు ఇలా మాట్లాడొద్దు..”

 

“ఏం చేసినా ఉపయోగం లేదు రవి. ఇంకా నీకు నేనేమీ చెప్పలేను” అంటూ చకచకా మెట్లు దిగి వెళ్ళిపోతుంది. 


“హిమ.. నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదు” అంటూ ఉన్నచోటనే శిలలా నిలబడిపోతాడు రవికాంత్. 


కన్నీటిని దిగమింగుతూ ‘ఇదంతా ఊహించిందే. రవికాంత్ మాటలకు చలిం చకూడదు’ అనుకొని నడుస్తూ ఉన్నా హిమని, 


“ఏంటమ్మా లోపలికి రాకుండా వెళ్ళిపోతున్నావు.. రా ఒక్కసారి”


“సరే ఆంటీ” అని లోపలికి వెళ్తుంది. 


“హిమ.. ఇదిగో తీసుకో మొన్న మా అమ్మాయికి డ్రెస్ కొన్నాను. నీకు కూడా ఏదైనా తీసుకోవాలి అని అనుకున్నాను. అప్పుడు రవికాంత్ చెప్పాడు ‘అమ్మా, తనకి సారీస్ చాలా బాగుంటాయి. బ్లూ కలర్ అంటే ఇష్టం. ఆ కలర్లో ఒక మంచి చీర తీసుకో. తనకి ఇద్దాము’ అని అన్నాడు. ఇప్పుడు ఆ చీర నీకు ఇచ్చే సమయం వచ్చింది. తీసుకో అమ్మా.”

 

అంత ప్రేమతో ఇస్తున్న చీరని కాదనలేక తీసుకొని “థ్యాంక్స్ ఆంటీ”.

 

“థాంక్స్ ఎందుకురా. సరేగాని హిమ నువ్వు పూలు పెట్టుకుంటావా”


“ఎందుకిలా అడుగుతున్నారు ఆంటీ”


“మీ జనరేషన్ అమ్మాయిలు ఎక్కువమంది పువ్వులు పెట్టుకోరు కదా.. ఎవరి దాకా ఎందుకు.. మా అమ్మాయి కూడా పెట్టుకోదు. అందుకే అడుగుతున్నా”.

 

“అయ్యో అలా ఏం లేదండి. పెట్టుకుంటాను”.

 

“అవునా. అయితే ఇదిగో తీసుకో. మన చెట్టు పూలే. ఇప్పుడే కోసి మాల కట్టి ఉంచాను.’


“థాంక్స్ ఆంటీ. సరే ఆంటీ.. ఇక వెళ్ళొస్తాను.”

 

అదేంటి.. మళ్లీ రాను కదా.. ఇలా ఎందుకు చెప్పాను.. నిర్ణయం తీసుకున్నంత ఈజీ కాదేమో దాన్ని అమలు పరచడం.. అంటూ మనసులోనే అనుకుంటుంది హిమబిందు. 


“ఏంటి లక్ష్మి.. అమ్మాయికి బొట్టు పెట్టడం మర్చిపోయావు”


“అయ్యో! అవునండి.. ఉండమ్మా.. ఒక్క నిమిషం” అంటూ దేవుడు గదిలో నుండి కుంకుమ భరిణ తీసుకువచ్చి హిమబిందు నుదుటిన కుంకుమ బొట్టు పెడుతూ “అమ్మా హిమబిందు, ఇంటికి ఏ ఆడపిల్ల వచ్చిన ఇలా బొట్టు పెట్టి పంపించడం మా ఇంటి ఆనవాయితీ. అందుకే పెడుతున్నాను. సరేనామ్మా, 


అందులోనూ నువ్వు ఈ ఇంటికి రాబోతున్న మా మరో అమ్మాయివి. నిన్ను ఇంకా స్పెషల్ గా చూసుకోవాలి కదా” అంటూ నవ్వుతూ బుగ్గ గిల్లి “ఆ రోజు కోసం మా అబ్బాయి తో పాటు మేము కూడా ఎదురు చూస్తున్నామమ్మ..” అంది. 


“వీళ్ళ ప్రేమ చూస్తుంటే నాకు చాలా గిల్టీగా అనిపిస్తుంది. నావల్ల వాళ్ళ అబ్బాయికి అన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా వీళ్లు ఇంత అభిమానాన్ని చూపిస్తున్నారు. కొంత సేపు ఇక్కడే ఉంటే తన నిర్ణయం మార్చుకుంటానేమో.. అని భయం వేసి అడుగు బలవంతంగా ముందుకు వేసి “వెళ్తానండి ఒకసారి రవికాంత్ ని కలిసి వెళ్ళిపోతాను.”

 

“వెళ్తాను కాదమ్మా వెళ్ళొస్తాను”


“సరే ఆంటీ..” 


నిశ్చలంగా నిలబడి ఉన్న రవి దగ్గరకు వెళ్లి గట్టిగా హత్తుకుని ఏడుస్తూ “రవి.. నన్ను క్షమించు. నాకు వేరే దారి లేదు. నీ ప్రేమని పొందే అదృష్టం, మీ ఇంట్లో వాళ్ళు చూపించే అభిమానం పొందే అదృష్టం నాకు లేదు” అంటూ ఇంట్లో జరిగిందంతా చెబుతుంది. 


“ఆంటీ వాళ్లు ఎంత ప్రేమ చూపిస్తున్నారో.”


“నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాను.. వాళ్లు కూడా నిన్ను అంతే అభిమానిస్తున్నారు హిమ. అయినా ఇలాంటి పిచ్చి నిర్ణయం ఎందుకు హిమ.. నీ నిర్ణయం మార్చుకో”


“రవి.. మన సంకల్పం ఎంత బలమైందో ఒక్కోసారి పరిస్థితులు అంతకన్నా బలమైనవి. అయినా నేనేమీ నీకు శాశ్వతంగా దూరం కావట్లేదు. నీ జ్ఞాపకాలతో, నువ్వు చేసే ప్రతి పనిలో, నువ్వు సాధించే విషయంలో నేనే ఉంటాను. 

నువ్వు చేసే ప్రతి పనిలో నేనే కనిపిస్తాను. ఆ పనిని ప్రేమిస్తే నన్ను ప్రేమించినట్లే భావిస్తాను. ఎప్పుడు నవ్వుతూ ఉంటే నేను ఎక్కడున్నా ఆనందంగా ఉంటాను. నీ విజయాన్ని చూసి గర్వపడే మొదటి వ్యక్తిని నేనే అవుతాను..

 

నేను ఎప్పటికీ నీ తింగరినే. ఈ హృదయంలో ఈ జన్మకి నీకు తప్ప మరే ఎవరికి స్థానం ఇవ్వను. నిరంతరం నీతోనే ఉంటా కానీ నీకు దగ్గరగా ఉండను.. 


రవి, ఐ లవ్ యు ఫరెవర్. నా ప్రేమ ఎప్పటికీ, నీకే. ఈ హిమబిందు ఎప్పటికీ. రవికాంత్ ప్రేమే. కాబట్టి నువ్వు నీ గోల్ మీద ఫోకస్ పెట్టు. మంచి డైరెక్టర్ అవ్వాలన్న నీ కలని నిజం చేసుకో.. 


ఇంతకుమించి నన్నేమీ అడగద్దు. నేనేమీ చెప్పలేను” అంటూ తనకి దూరంగా జరిగి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతుంది.. 


‘హిమ, 

నీ ఆలోచనలతో నా హృదయాన్ని బంధించావు, 

నీ ప్రేమతో నా ప్రాణాన్ని బంధించావు, 

నీ రూపంతో నా కనులను బంధించావు, 

నీ తలపులతో నా తనువుని బంధించావు, 

నీ పిలుపుతో నా పెదవి చాటు మాటని బంధించావు, 

నీ చూపుతో చీకటి నిండిన నా జీవితాన్ని వెలుగులతో బంధించావు, 

ఇన్ని చేసిన నువ్వే నాకు అందనంత దూరంగా వెళ్లి నిన్ను నేను ఎప్పటికీ చేరుకోలేని విరహపు ఎడారిలో నన్ను బంధించావు ఎందుకు?

ఇన్ని చేసిన నువ్వే ఈ అంతులేని దూరాన్ని తగ్గించి జన్మజన్మలకు విడిపోని నీ ప్రేమ పంజరంలో నన్ను బంధించు, బంధించు బంధించు. 

హిమ.. హిమ.. ఎందుకు తింగరి.. ఎందుకురా ఇలా చేశావు..’


అంటూ అస్తమిస్తున్న సూర్యుడి సాక్షిగా గూటికి చేరుకున్న పక్షుల సాక్షిగా, అలుముకుంటున్న చీకటి సాక్షిగా, తన బాధని ప్రకృతితో పంచుకుంటూ జీవితంలో ఎప్పుడు చవిచూడని ఓటమిని ఎదుర్కొంటున్నట్టుగా కుమిలిపోతున్నాడు రవికాంత్.. 


బబ్లు నుండి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసి “హలో బబ్లు చెప్పరా” అంటూ ఎంతో దిగాలుగా మాట్లాడుతాడు. అయితే బబ్లు తన దగ్గర ఉన్న గుడ్ న్యూస్ రవికి చెప్పాలన్న ఆత్రుతతో తన గాత్రంలో వచ్చిన మార్పుని గమనించక,

 

“రవి.. నీకు ఒక గుడ్ న్యూస్. అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ ఛాన్స్ పోయినందుకు ఎంతో బాధపడ్డాము. కానీ అది పోవడం మన మంచికే. నీకు డైరెక్ట్ గా డైరెక్టర్ ఛాన్స్ వచ్చింది. ఒక ఫేమస్ ప్రొడ్యూసర్ కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం న్యూ టాలెంట్ ఉన్న వాళ్ళని వెతుకుతున్నారంట. ఈ మూవీలో అందరూ కొత్తవాళ్లే. డైరెక్టర్గా నీకు అవకాశం వచ్చింది. అన్ని తెలుసుకున్నాను. ఏ ప్రాబ్లం లేదు. ఎవ్వరు అడ్డు వచ్చినా దీన్ని ఆపలేరు” అంటూ ఎంతో ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతూ చెప్తూ ఉంటాడు.. 


“రేయ్ బబ్లు.. ఇక్కడ జీవితమే పోయిందిరా. ఇంకా అవకాశాలు ఏముందిలే. నేను మాట్లాడే పరిస్థితిలో లేను. ఫోన్ పెట్టేయ్..”

 

ఏమైంది వీడికి అలా మాట్లాడుతున్నాడు.. 


‘రవి! నువ్వు నీ పనిని ప్రేమిస్తే నన్ను ప్రేమించినట్టే భావిస్తాను. నువ్వు చేసే ప్రతి పనిలో నేనే ఉంటాను. నీ విజయానికి మొదట సంతోషపడేది నేనే’ అన్న హిమా మాటలు గుర్తొచ్చి ‘సరే హిమ ప్రేమిస్తాను. పనినే ప్రేమిస్తాను. నిన్ను ప్రేమించిన దాని కన్నా వందరెట్లు ఎక్కువగా ప్రేమిస్తాను. నా విజయాన్ని నీకు బహుమతిగా అందిస్తాను’ అని దృఢంగా నిర్ణయించుకొని బబ్లు కి కాల్ చేసి, 

“రేయ్ బబ్లు.. ఆ డీటెయిల్స్ పంపించు. అవునా.. సరే రా. ఇప్పుడే పంపిస్తాను..” 


అప్పటినుంచి రవికాంత్ కి పని తప్ప వేరే ఆలోచన లేదు. వేరే ధ్యాస లేదు. రోజు మొత్తం కష్టపడి పనిచేస్తాడు. కాస్త సమయం దొరికినప్పుడు హిమబిందు జ్ఞాపకాలతో గడిపేస్తాడు.. 


=======================================================================

                                                ఇంకా వుంది

========================================================================

 

చైత్ర శ్రీ సాయి జ్యోతి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: https://www.manatelugukathalu.com/profile/saijyothi

చైత్ర శ్రీ. సాయి జ్యోతి చింత క్రింది. 


వృత్తి జూనియర్ అసిస్టెంట్ జిల్లా పరిషత్ నూతక్కి ఉన్నత పాఠశాల, గుంటూరు జిల్లా. 

ప్రవృత్తి నవలలు, కథలు, కవితలు. వ్రాయడం. 

సాంఘిక మాధ్యమాల ద్వారా రచనలను పోస్ట్ చేస్తూ ఉండడం... 








 
 
 

Comments


bottom of page